చిన్ననాటి ముచ్చట్లు/బెంగుళూరు

16

బెంగుళూరు

బసవని గుడివీధిలో ఒక పెద్దతోటగల బంగళాను తీసి దానిని అనేకవిధములుగ పెంచితిని, ఆ తోటను క్రమముగ పుష్పవనముగ మార్చి ప్రతి సంవత్సరము ఆ యూరిలో సర్కారు తరఫున జరుగు తోటల పోటీ పరీక్షలలో పాల్గొనుచు, నా తోటకు మంచి బహుమానములను ప్రతియేటా పొందుచుంటిని. ఇక్కడ మందుల ఫ్యాక్టరీని పెట్టి మైసూరు రాజ్యమునకంత మందులు పంపుచుంటిని. యుద్ధ సమయములో బెంగుళూరు యింటికి మంచి ధర వచ్చినందున విక్రయించితిని. పిమ్మట బెంగుళూరుకు పోయినప్పుడెల్లను శాస్త్రిగారింట బస చేయుచున్నాను. శాస్త్రిగారు యిటీవల మంచి యిల్లును విశ్వేశ్వరపురమున కట్టించిరి. వీరు యిప్పుడు మంచి ధనికులయినను 'కేసరి కుటీరము'ను మరిచిపోకుండ ఏజంటుగానే యిప్పటికిని పనిచేయుచున్నారు. ఆంధ్రులు బెంగుళూరు పోయినప్పుడు శాస్త్రిగారి హోటలులోనే బసచేసెదరు. వీరు ఆంధ్రులు, ములికినాటివారు. తెలుగు వారికి కావలసిన పచ్చళ్లు ఆవకాయ మొదలగునవి వీరి హోటలులో వడ్డించెదరు.

పూదోట వినోదమునకేగాక ఆరోగ్యభాగ్యమునకును మానసిక వ్యాధులకును మంచి మందు. ప్రాతఃకాలమునలేచి సుగంధ పుష్పముల చెట్లనడుమను, లతాగృహములలోను సంచరించునప్పుడు వీచు ఆ మంద మారుతము వలన గలుగు ఆ బ్రహ్మానందమును వర్ణించుటకు యెవరి తరము? సుగంధ పుష్పరాజమును ఆఘ్రాణించుటవలన కలుగు 'మనోహర' మను మందు మనోవ్యాకులములను మాయము చేయును. పూదోటలో పూదేనియకు విచ్చలవిడిగ విహరించు భృంగముల మధుర గీతములు వీనులకు విందొనర్చుచుండును. తేనెటీగలు పూదేనియనుత్రాగి తేనెగూటిని కట్టుకొను చిత్రమును చూచి సంతోషింపవచ్చును. రంగు పక్షులు, రామచిలుకలు ఫలవృక్షములకు తోటలో పాకులాడుట చూడ వచ్చును. వంటరిగ నుండునపుడు పూలచెట్టువద్ద కూర్చుని దానికి శుశ్రూష చేయుచు స్నేహమును సంపాదించుకొని కాలమును శాంతముగ గడపవచ్చును. అనేకులు ఆత్మశాంతికై ఆరామక్షేత్రముల నాశించెదరు. ఆరామమునకు మించిన ఆత్మబంధువులు వేరుగ నుండరని చెప్పవచ్చును.

కావుననే మహర్షులుకూడా ఇహలోక సౌఖ్యముల విడచి అడవులలో తపస్సు చేసుకొనుచున్నను, పుప్పవనమును కేవలము దయాహృదయులై పెంచుదురు. కణ్వమహర్థికి వనలతావృక్షములపైగల ప్రేమాతిశయము లను కాళిదాసు మనోహరముగ రూపించినాడు.

ఎంత సోదరీస్నేహం లేకపోతే - అత్తవారింటికిపోతూ శకుంతల -- వనజ్యోత్స్న అనే లతను తన్ను కౌగలించుకొని అనుజ్ఞ యిమ్మని కోరుతుంది? ఆమె ప్రయాణ సమయాన కణ్వుడు వనదేవతలను ఆమెకు అత్తింటికి వెళ్ళను ఆజ్ఞ యిమ్మని కోరుతాడు.

నాకు చిన్ననాటినుండియు తోటపని యనిన అమిత ఆశ. మా గ్రామములో యున్నప్పుడుకూడ నా పూరింటి చుట్టును కాకర, పొట్ల, చిక్కుడు చెట్లపాదులను, మల్లెచెట్లను, సన్నజాజితీగెను, తీగె సంపెంగను, జామచెట్టును, జడపత్తి చెట్లనువేసి పెంచుచుంటిని. కొతిమిర పాదును, వంగమొక్కలను మిరపనారునువేసి యేటినుండి కావడితో నీరు తెచ్చి వాటికిపోసి పెంచుచుంటిని. పెరుగు తోట కాడలను పెంచుచుంటిని. ఈ చెట్టుకు పెంటదిబ్బమన్నును వేసి బలపరచుచుంటిని. ఈ విద్య నాకు చిన్నప్పటినుండియు అలవడినదే. ఇది మావూరిలో నేర్చుకున్న విద్య. నేను ప్రయోజకుడనైన పిమ్మట బెంగుళూరునందు ఒక యింటిని కొంటిని. ఇంటిచుట్టు దట్టముగ మామిడిచెట్లు, కొద్దిగ టెంకాయచెట్లు మొదలగునవి మాత్రమే యుండెను. నివసించు యింటిచుట్టు మామిడి చెట్లుండుటచే దోమలబాధను సహింపజాలకుంటిమి. మామిడిపండ్ల కాలములో సన్నదోమలు పగలుకూడ బాధించుచుండెను. ఈ కారణము వలన యింటి సమీపముననుండు కొన్ని మామిడిచెట్లను మాత్రము కొట్టివేయవలసి వచ్చెను. ఫలించు ఫలవృక్షములను నరికివేయుటకు మనసొప్పక పోయినను చేయక తప్పదాయెను. ఇంటివద్దనుండు మామిడిచెట్లను కొట్టివేయగనే నివసించు యింటిలోనికి మంచి వెలుతురు, గాలి, యెండ ప్రవేశింప దొడగెను. అప్పడు బాధించుచుండిన దోమలు మాయమాయెను.

బెంగుళూరు పట్టణము మంచి పూదోటలనువేసి పెంచుటకు అనుకూలమైన వాతావరణము గలదగుటచే అనేకులు యిండ్లచుట్టు పుప్పవనమును ఫలవృక్షములను వేసుకొని ఆనందించుట చూచితిని. ఆ తోటలను చూచినప్పటినుండియు నాకును అటువంటి తోటలను పెంచవలయుననే కోరిక కలిగెను. ఈ కోరిక కలుగగనే బెంగుళూరు లాల్ బాగ్ తోట సంఘములో సభ్యుడనైతిని. తోట సభ్యులందరి యిండ్లకు గార్డన్ సూపరిండెంటు వచ్చి తోటను యే విధముగ వేయవలసినది మార్గములన్నిటిని బోధించుచుండెను. ఆ విషయములన్నిటిని శ్రద్దగ నేర్చుకొని, తోటను వేయుటకు ప్రారంభించితిని.

ఇంటి ముఖద్వారము తూర్పుదిశను చూచుచుండును. చలిదేశమగు బెంగుళూరునందు ప్రాతఃకాలమున సూర్యభగవానుడు మా యింట ప్రవేశించి మమ్మానందింప చేయుచుండెను. ఇంటివాకిటి కెదురుగ విశాలమైన నలుచదరపు ఖాళీ స్థలముండెను. ఆ స్థలపు మూడుదిశల ప్రహరిగోడల ప్రక్కన గోడ కనుపడకుండునట్లు మూడువరుసల పూలచెట్లను వేయించి పెంచితిని. మొదటి వరుస వంటిరెక్క దాసాని పూల చెట్లను, రెండవవరుస ముద్ద పువ్వులదాసాని పూలచెట్లను, మూడువరుస కాశీతుంబ (Balsam) చెట్లను వేసితిని. ఈ మూడువరుసల పూలచెట్లు పూచినప్పుడు పూలమెట్లవలె కాన్పించును. మొదటివరుస చెట్లు పొడవుగ పెరుగును. రెండవ వరుసచెట్లు పొట్టిగ గుబురుగపెరుగును. మూడవవరుస బాల్సం పూలచెట్లు ఒక అడుగు పొడవున మాత్రమే పెరిగి దట్టముగ పూలుపూయును. ఈ దృశ్యము కనులపండువుగ నుండును.

ఈ కడపటి పూలచెట్లు వరుసనుండి 10 అడుగుల మోటారు రోడ్డును వేయించితిని. ఈరోడ్డు ప్రక్కననే పొట్టి బంతిచెట్లను (French Marigold) నాటించితిని. రెండవ వరుస ప్లాక్సన్సు విదేశపూలచెట్ల వరుసను వేయించితిని. ఈ రెండువరుసల పూలమధ్యను విశాలమైన లాన్ (Lawn) యని పిల్వబడు గడ్డినేలను తయారుచేయించితిని. ఇది చూచునప్పుడు ఏలూరు రత్నకంబళివలె కాన్పించును. ఈ రత్నకంబళి నాలుమూలలను సైప్రస్ చెట్లను పెంచితిని. ఈ చెట్లు శాఖలులేక పచ్చగ గుబురుగ 50 అడుగుల వరకు పెరిగినవి. ఈ చెట్లను తలయెత్తి చూచినపుడు తమాషాగ నుండును.

ఈ సైప్రస్ చెట్లప్రక్కననే నాలుగుమూలలను సిమెంటుతో తయారుచేయబడిన అందమైన పెద్దపూతొట్లను కట్టించి అందులో వెర్బీనా (Verbeena)యను తీగపూల చెట్లను నాటితిని. ఈ చెట్టు పూచినప్పుడు తొట్టి కనబడకుండ చిక్కగ పూయును. తీగ నిండుగ పూలుపూచి వ్రేలాడునపుడు చూచిన చాలా అందముగ కనుబడును. ఎఱ్ఱ బిగోనియా (Bigonia) చెట్లతీగెలను సైప్రస్ చెట్ల నాలుగింటికిని తోరణముగ అల్లించితిని. అవి పూచినపుడు నాలుగు ప్రక్కలను రక్తవర్ణపు పూలతోరణముగ కనుబడును. ఈ గడ్డి నేల (Lawn) మధ్య సిమెంటుతో గుండ్రముగ నీళ్లతొట్టిని కట్టించి దానిమధ్య పూల కొళాయిని నిర్మించితిని. ఈ కొళాయి తిరుగునపుడు పూలవర్షము కురిసినట్లు, చక్రాకారముగను, పద్మాకారముగను నీళ్లను చిమ్ముచుండును. నీళ్లతొట్టిలో తామరపూల తీగెలను పెంచి పూలు పూయించితిని. ఈ పూలమధ్య బంగారురంగు, వెండిరంగు, ఎఱ్ఱ రంగుగల చేపలను తెచ్చి విడిచితిని. ఈ రంగుచేపలు నీళ్లలో యీదునపుడు తళతళయని మెరయుచుండును. ఇంటి ముఖ ద్వారపు మెట్లమీద డాలియా (Dhalia)యను పూలచెట్లను పెద్దతొట్లలో వేసి ప్రదర్శనమునకు పెంచితిని. ఈ చెట్లను పెంచుట అంత సులభమైన కార్యము కాదు. మంచియెరువు, శుశ్రూష కావలయును. ఈ చెట్టు సుమారు 4, 5 అడుగుల యెత్తువరకు పెరుగును. పువ్వు వెడల్పు 5, 6 అంగుళముల వరకు యుండును. అనేక రంగులతో పూయును. పూచినపువ్వు బంతిపూవువలె యుండును. ఇది నిర్గంధ కుసుమము. ఇంకను వాకిటి ముందర జినియా, కాస్ మాస్, కలియోప్సిస్, పిటోనియా, స్టాక్సు అను పలువిధములయిన పరదేశపు పూలజాతుల నుంచితిని. బంగళాచుట్టు యుండు కిటికీలవద్ద రాత్రిరాణి (Night-Queen) మల్లె, మొల్ల, జాజి మొదలగు సుగంధపుప్ప జాతులను వేసి పెంచితిని. రాత్రిళ్లు యీ పూలు వికసించి యిల్లంతయు అత్తరుబుడ్డు విరిగిపోయినట్టుగ వాసన విసురును.ఇంటి యిరుప్రక్కలను మాలతి, మాధవి లతాగృహములను నిర్మించితిని.

ఇంటి వెనుక భాగమున ఆస్ట్రేలియా జాతి ఆపిల్ పండ్లచెట్లను, అంజూర (Figs) పండ్లచెట్టును, అలహాబాదు జామపండ్ల చెట్లను, మేలయిన బొప్పాయి మొదలగు ఫల వృక్షములను వేసితిని. అవి కాచి ఫలములు పక్వమునకు రాగానే రాత్రిళ్ళు తోటలో చిలుకలు, పక్షులు ప్రవేశించి భక్షించుచుండును. మదురుగోడలను దూకి దొంగలుకూడ రాత్రిళ్ళు అపహరించుకొని పోవుచుందురు. కాయకూరలను వెనుకభాగమున వేయుచుంటిని. ఇక్కడ పెంచిన వంకాయలు టెంకాయలంతేసి యుండును. ఈ నల్లవంకాయలు బజ్జికి బాగుండును. పాలబెండకాయలు సుమారు యొక అడుగువరకు పెరుగును. కొతిమేరాకు, తోటకూర వగైరాలు అతి కోమలముగ యెత్తుగ పెరుగును. ఈ వూరి కూరగాయలు కంటికి బాగుండునే గాని రుచి తక్కువ. కాయకూరల రుచికి వంగవోలు ప్రాంతములలో మెట్టన పండునవియే శ్రేష్ఠము. బెంగుళూరులో విక్రయించు వంకాయలు చేదుగ నుండును. పెద్ద కాకరకాయలు తియ్యగనుండును. ఇందుకు కారణము కృత్రిమ యెరువులతో కాయకూరలను పెంచుటయే.

ఇంటి వెనుకభాగముననే ఔషధములను తయారుచేయు కర్మాగారమును (Factory), అతిథుల గృహమును ఆఫీసును వేరువేరుగ కట్టించితిని. ఈ మందిరములకు యెదుట పందిళ్లు వేయించి నల్ల, తెల్ల ద్రాక్షతీగెలను అల్లించితిని. ఈ ద్రాక్షపండ్లు బాగుగ కాయుచున్నందున మేము తనివితీర తిని యితరులకుకూడ పంచిపెట్టుచుంటిమి.

ఈ తోటలో యొకభాగమున అశ్వత్థవృక్షము, వేపచెట్టు కలసియుండెను. ఆ చెట్లు క్రింద నాగప్రతిష్ట కలదు. ఆ చెట్లచుట్టు నల్ల రాళ్లతో అరుగును కట్టించితిని. ఆదివారమునాడు ఆ దేవుని పూజించు చుంటిమి. అప్పుడప్పుడు అక్కడ కూర్చుని విశ్రాంతి తీసుకొనుచుంటిమి. మరియొక భాగమున చంపక పుష్పముల వృక్షముండెను. ఈ మాను సంపెగ చెట్టు క్రింద సిమెంటుతో రెండు అరుగులను కట్టించితిని. ఉదయమున కొంతకాలము తోటలో తిరిగి, ఆ యరుగులమీద కూర్చుండి అలసట తీర్చుకొను అలవాటు. ఈ సంపెంగ చెట్టుక్రిందనే వచ్చినవారితో ముచ్చటలాడుచుండువాడను. ఈ చెట్టుచూచినప్పుడు ఈ చెట్టు నీడను విడిచిపోవుటకు మనసొప్పకుండెడిది. ఈ నీడను నేనెట్లుమరువగలను? తోటలో మంచి మామిడిచెట్లుండెను. పీతర్ (రసపురి) గోవా (బాదామి) మల్ గోవా, ఆవకాయ పెట్టుకొనుటకు పుల్లటికాయలు మొదలగు మామిడిజాతులుండెను.

పనసపండ్ల చెట్టుండెను. ఆ పనసతొనలను విరిచిన కొబ్బరివలె విరుగును. చక్కెరతో సమానమైన రుచిగలది. ఈ పనసపండుతో పాయసమును, హల్వాను తయారు చేసుకొనుచుంటిమి. కాయ లేత తొనలతో వరుగులు వేయించుకొని నిల్వచేసుకొనుచుంటిమి. నేలకు తగులు టెంకాయ గెలలచెట్టు, దాహము దీర్చు యెళనీరు టెంకాయచెట్లు, కొళంబొ జాతి పెద్ద టెంకాయ చెట్లు మొదలగునవి తోటలోనుండెను. ప్రత్యేకముగ చెప్పదగిన వెలగపండ్ల చెట్లుండెను. తెల్లవారగనె చెట్టు క్రిందకి పోయినప్పుడెల్లను వెలగపండు లభించుచుండెను. కపిత్థం సర్వదా పథ్యమనుట వలన ఆ పండునంతయు నేనె తినుచుంటిని. మామడిచెట్లకు పచ్చిమిరియముల తీగెలను అల్లించితిని. ఆ పచ్చి మిరియములను కోసి నిమ్మపండు, వుప్పుతో కలిపి వూరనిచ్చిన ఆరోచకమునకు మంచి మందు.

రోజాపూల చెట్లను పెంచుటకు బెంగుళూరు మంచి స్థలము. అనేకరకముల రోజా పూల చెట్లను తెచ్చి నాటితిని. ఈవూరి తీగె రోజాచెట్టు ప్రశస్థమైనది. దీనిని పందిలిమీద అల్లుబెట్టిన అందముగ నుండును. ప్రతిదినము గంపెడుపూలను కోయుచుంటిమి. మా బంగళాకు 'లోధ్రలాడ్డి' (Lodhra Lodge)యని పెడితిని. బంగళా వీధిగేటు వద్ద నుండి మోటారుషెడ్డుకు 400 అడుగుల పొడవుగల రోడ్డు గలదు. ఈ రోడ్డంతయు నల్లరాళ్లతో పరుపబడినది. ఈపొడుగునను తీగెల పందిటిని (లతాగృహము) నిర్మించితిని. ఈ రోడ్డంతయు సూర్యరశ్మి లేక చల్లగ నుండును. పొడుగాటి మామిడిచెట్లకు ఊగు వుయ్యాలలను అక్కడక్కడ కట్టించితిని. ఈ పుష్పవనమంతటికిని నీరు పారుదలకు బావిని త్రవ్వించి దానికి యెలక్ట్రిక్ పంపును అమర్చితిని. ఈ నూతి నీరు అమృతమువలె నుండును.

ఇంటిలో కృష్ణమందిరమును కట్టించితిని. ఈ దేవుని పూజించుటకు కృష్ణతులసి రామతులసి మొదలగు కదంబపూజా ద్రవ్యములను వేసి పెంచితిని. ఇంటిముంగిట బృందావనమును కట్టించి, ఇల్లంతయు చిత్రకూటముగ మార్చితిని. తోటంతయు విద్యుచ్ఛక్తి దీపస్తంభములను నాటించి వాటికి రంగుల డోములను అమర్చితిని. రాత్రి వేళలలో యీ దీపములను వెలిగించిన బృందావనముగనే యుండును. ఇంటిలోపల అన్ని వసతులతో కూడ విద్యుచ్చక్తితో వంట చేసుకొనుటకు వేడినీరు కాగుటకు యేర్పాటుల నమర్చితిని.

క్రోటన్సు (Crotons) యను రంగు చెట్టను సుమారు వెయ్యి తొట్లవరకు బారులు దీర్చియుంచితిని. రకరకముల రంగుచిలుకలను పంజరములలోనుంచి చెట్లకు వ్రేలాడగట్టితిని. దీనిని పాటపాడుతోట (Singing Gardens) యని చెప్పుకొనుచుందురు. అనేక వినోదములతో తోటను దిద్ది తీర్చితిని. ఇది నా బెంగుళూరు పుష్పవన శృంగారము.

బెంగుళూరునందు సర్కారువారు ప్రతి సంవత్సరమును లాల్బాగునందు పుప్ప ప్రదర్శనమును (Flower Show) యేర్పాటు చేయుచుందురు. ఈ సందర్భముననే వూరిలో తోట పోటీకి (Garden Competition) కూడ యేర్పాటు జరుగుచుండును. ఈ తోటపోటీకి బెంగుళూరు సిటిలో యుండువారును, కంట్రోన్మెంటు (దండు)లో యుండు తెల్లదొరలును పాల్గొనుచుందురు. ఈ తోటలు ఒకదానికి మించి యొకటి కనుబడును. అందరు కూడ పోటీలో గెల్పొంది బహుమతులను పొందు ఆపేక్షతో తోటలను కష్టపడి పెంచినవారే. పోటీ తోటలను పరీక్షించి మార్కులను యిచ్చుటకు అనుభవస్తులగు తెల్లదొరలు, హిందువులు కలసివచ్చి తోటలను పరీక్షించిపోవు చుండెడువారు. ఈ పరీక్షలో నా తోటవరుసగ యెనిమిది సంవత్సరములు గెల్పొంది, వెండిగిన్నెలను బహుమతులను పొందినది. ఈ బహుమతులను లాల్ బాగ్ తోటలో మైసూరుదివాన్గారు పంచిపెట్టుచుండిరి. ఈ యనుభవము వలన నన్నుకూడ తోటలను పరీక్షించుటకు జడ్జిగ యెన్నుకొనిరి.

ఈ నా ఆనందదాయినియైన నందనవనమును ధనాశా పిశాచమావేశించి, హెచ్చుధరకు నేతి వ్యాపారస్తులగు నొక శెట్టిగారి కమ్మితిని.

ఆ తోట విక్రయమువల్ల వచ్చిన ధనమును బ్యాంకులో నుంచితిని. కాని నేను ప్రతి నిత్యము ఆ వూవుతోటలో అనుభవించుచుండిన ఆనందమునకు మాత్రము దూరమైతిని. దానిని అమ్మగా వచ్చిన ధనమునైన నా కంట చూచుటలేదు. ప్రతి నిముషము నాకెంతో ఆనందము చేకూర్చుచుండిన పుష్పరాజములగు నా బంధుమిత్రులున్నూ నా కంటికి శాశ్వతముగ కానరాకుండ పోయిరి. ఈ కారణమున నేను నిరంతర చింతచే కొంతకాలము మందబుద్ధినై గడిపితిని. అదృశ్యమైన నా ఆనందమును గూర్చియే నేను మనన చేయుచుండగా - నాకొకమంచి యోచన తట్టినది. ఆనందము అనగా బ్రహ్మగదా. ఆ బ్రహ్మకు సరస్వతి గృహలక్ష్మి. సరస్వతి చదువులకు రాణి. ఆ చదువులరాణి పేరట నా తోటు విక్రయ ధనము ముడుపుకట్టి యుంచితిని. దానితో 'కేసరి విద్యాలయము'ను స్థాపించి తిరిగి యానందమును పొందదలంచితిని.

ఈ విద్యావన స్థాపనచే నా మనస్సునకు శాంతి కలిగినది. ఈ విద్యాలయపు వేపచెట్ల నీడను కూర్చుండి అక్కడక్కడ కళకళలాడు పువ్వులను చూచుచున్నప్పుడు నాకు పూర్వపు బెంగుళూరి పుష్పవనస్థ చంపక వృక్షచ్చాయలు స్మృతికి వచ్చును. గుంపులు గట్టి వందలకొలదిగ బాలబాలికలు విద్యాసక్తులై, నవ్వుచు, ప్రేలుచు వికసించిన పువ్వులవంటి ముఖబింబములతో నాకు కన్పించగనే, వివిధ పుప్ప శోభితమై, శుక శారికా కలకలముతో కూడినదై నన్నానందమున మంచి తేల్చుచుండిన నా బెంగుళూరి పుష్పవనమున నున్నట్లే అనిపించి, మరల ఆనందించు చుందును.

ఆ పూవుతోటను ఏ శ్రద్ధాభక్తులతో పెంచి పెద్దచేసితినో, అట్టి శ్రద్ధాభక్తులతోనే ఈ విద్యావనమును పెంచి పెద్దదిగా నొనర్చుటకు ఈశ్వరుడు నన్ను అనుగ్రహించి అనుకూలించుగాక! ఈ విద్యావనము బెంగుళూరి వనము కన్న శాశ్వతమైనది కదా! ఇందు విద్యాగంధముతో వికసించు కిశోర హృదయములు, వాడనిపూలు; వాసన తరుగని పూలు; లోకకల్యాణప్రదములు.