చిన్ననాటి ముచ్చట్లు/నాగరికపు నాటకములు

22

నాగరికపు నాటకములు

1890 ప్రాంతములో ధార్వాడ నాటకకంపెనీ యని ఉత్తరదేశమునుండి వచ్చి పలుతావుల నాటకములువేసి ప్రజాభిమానమును సంపాదించిరి. వీరు పాతపద్ధతుల నన్నింటిని మార్చి రంగస్థలమునకును, వేషభాషలకును మెరుగులను దెచ్చిరి. ఆముదపు దివిటీలకు బదులు రంగు మత్తాపులను వెలిగించుచుండిరి. కొయ్యతోచేసిన కాకిబంగారపు నగలకు బదులు గిల్టుసొమ్ములను ధరించుచుండిరి. మంచి ఉడుపులను ధరించుచుండిరి.

వీరి పిదప బొంబాయి ప్రాంతమునుండి పార్శీనాటక కంపెనీవారు మద్రాసుకు వచ్చి పెద్దకొఠాయిని దిట్టముగ పలకలతోను ఇనుపరేకులతోను కట్టి రెండు మూడు మాసములు దినదినము నాటకములు వేసేవారు. వీరి రంగస్థలపు ఏర్పాట్లు చాల రమణీయముగను ఆకర్షణీయముగను ఉండెడివి. ముఖ్యముగ వర్షము కురియుట, తుఫాను కొట్టుట, సముద్రము, ఇండ్లు కాలుట మొదలగువాటిని చూచినప్పుడు నిజముగ అవి జరుగుచున్నట్లే కాన్పించును. రంగస్థలముమీద వారు ధరించు ఉడుపులు దీపముల వెలుతురులో జనుల నానందాశ్చర్యముల ముంచివైచెడివి. వారు చూపించు దర్బారు సీనులద్భుతముగ నుండెడివి.

బళ్లారి సరస వినోదినీ సభ మూలపురుషుడు శ్రీమాన్ ధర్మవరము రామకృష్ణమాచార్యులు, ఆంధ్రదేశమున స్వతంత్రముగ నాటకముల రచించి, తానును పాత్ర వహించుచు తగువారిని తర్ఫీదు గావించి నాటకములనాడు కంపెనీలను ప్రారంభించిన ప్రముఖులు ప్రథములు వీరే యనవచ్చును. ధార్వాడ, పార్శీనాటక కంపెనీలు వచ్చివెళ్లుటకు కొంచెము వెనుకముందు లుగా, వీధిభాగవతములు ముదుగై వచన నాటకములు వెలసినవి. 1884లో గుంటూరునాటక సంఘమువారీ వచన నాటకములాడుటలో ప్రసిద్దులు. 1888లో వీరినిచూచి మా వంగవోలువారైన ఇమ్మానేని హనుమంతరావు నాయుడుగారు, రాజమహేంద్రవరమున ఏర్పరచిన హిందూనాటక సమాజమువారు 1889లో ఆడిన తోలేటి వెంకటసుబ్బారావుగారి 'హరిశ్చంద్రనాటకము'న్నూ చిలకమర్తి లక్ష్మీనరసింహంగారి 'కీచకవధ’ యున్నూ ఇట్టి వచననాటకములే. ఈ వచన నాటకములలో శ్రీప్రకాశం పంతులుగారు చిన్నతనములో చంద్రమతి, ద్రౌపది పాత్రలు ధరించు చుండిరి. శ్రీ ఆచార్యులవారు ఆంగ్లవిద్యాభ్యాసమొనర్చిన పట్టభద్రులు, న్యాయవాదులనైయుండిరి. ఆంగ్ల నాటకముల సారమును, సంస్కృత నాటకముల పోబడులు నెరింగిన ప్రోడలగుట తమ స్వతంత్ర నాటకములలో నాయా ఛాయల చూపించిరి. ధార్వాడకంపెనీ పార్శీ కంపెనీలవారి దరువులు, మెట్లు మున్నగునవి అప్పటికే ఆంధ్రదేశమందలి ప్రేక్షకుల నాకర్షించుచుండుటచే - వానికి సమమైన పాటలను తమ నాటకముల చేర్చిరి. నాటకమున పాత్రధారణమును వృత్తిగాగాక వినోదముగా వహించు పెద్ద మనుష్యులను చేరదీసి - నాటకసమాజమును నిర్మించిరి. వీరి మేనల్లుడే విఖ్యాతి చెందిన నాట్యకళాప్రపూర్ణ రాఘవాచారిగారు. శ్రీ ఆచార్యులవారు "చిత్రనళీయము" నందు బాహుక పాత్రను నటించుటను నేను చూచియున్నాను. వారు వ్రాసిన నాటకములు పైకి వచ్చిన పిదప అంతకుపూర్వము నాటకములన్నియు మాయమైనవి.

బళ్లారిలోనే వకీలుగానుండిన శ్రీ కోలాచలం శ్రీనివాసరావు పంతులుగారు కూడ ఆ కాలముననే కొన్ని నాటకములు వ్రాసిరి. వీరు వ్రాసిన నాటకములలో మేటి 'విజయనగర సామ్రాజ్య పతనము'. ఈ నాటకమందు పఠాన్ రుస్తుం పాత్రధారిగా శ్రీరాఘవాచారిగారి ఖ్యాతి వేరుగా చెప్పనక్కరలేదు. బళ్లారి సరసవినోదనీ సభవారి నాటకములు ప్రజారంజకములగుట జూచి చెన్నపురియందలి విద్యావంతులకును ఉత్సాహము కలిగినది. ఆ ఉత్సాహ ఫలితమే సుగుణవిలాససభ. ఇది 1891లో ఏర్పరుపబడినది. ప్రథమమున దీనిలో చేరినది 7 గురు సభ్యులు. ఇది కొంతకాలమునకు విక్టోరియా పబ్లిక్ హాలులో ఉంచబడి అందే అభివృద్ధి గాంచినది. పిదప మౌంటురోడ్డులో దీనికి స్వంత భవనమేర్పడినది. ఈ సభలో అరవలు ఆంధ్రులుకూడ కలిసి సభ్యులుగ నుండిరి. నా చిన్నతనమున ఈ సభలో సభ్యుడుగా నుండుట గౌరవ చిహ్నముగా నుండెడిది. నేనుకూడ ఈ సభలో సభ్యుడనైతిని. ఈ సభవారు ప్రథమములో ఆంగ్లాంధ్ర ద్రావిడ సంస్కృత కన్నడభాషలలో నాటకములాడుచుండిరి.

ఈ నాటకసభకు సూత్రధారులు శ్రీ దివాన్ బహుదూర్ సంబంధ మొదలియారుగారు. వీరు కొన్నాళ్లు ప్రెసిడెన్సీ మాజిస్ట్రేటు ఉద్యోగమును నిర్వహించిరి. అరవ నాటకములను వ్రాసి సభ్యులచే నాడించుచుండిరి. స్వంతముగ వేషములను వేసి సభ్యులను సంతోషపెట్టుచుండిరి.

ఈ సభవారి తెలుగు నాటకములలో బళ్లారి రాఘవాచారిగారును, నెల్లూరివారైన కందాడై శ్రీనివాసన్ (దొరస్వామి) గారును వేషములు వేయుచుండిరి.

నేను మొదట చూచిన వీరి తెలుగు నాటకము 'వరూధిని'. ఈ సభాసభ్యులలో కృష్ణస్వామి అయ్యర్ గారను అరవవారొకరుండిరి. వరూధిని పాత్రను ఆ అయ్యర్ గారు ధరించేవారు. కంఠస్వరము కిన్నెర స్వరమును బోలియుండును.

"ఇంతలు కన్నులుండ తెరువెవ్వరి వేడెదు భూసురేంద్ర"

అను పద్యమును చదువుచు, అభినయమునకై కండ్లు, నోరు తెరిచేవారు; రెండు చేతులను బారజాపేవారు.

చంగాబజారు నాటకములు బాలామణి, కోకిలాంబ అనే వేశ్యలు ముఖ్యపాత్రలు ధరించి నడిపించేవారు. వీరిద్దరు అక్కచెల్లెండ్రు. వీరు భోగమువారైనను ఆ కాలమున తమతోకూడ యొకపురుషుడు వేషము వేయుట కిష్టపడెడు వారు కారు. అందువలన వారిలో పెద్దదియగు కోకిలాంబ పురుషవేషమును, చిన్నదియగు బాలామణి స్త్రీ వేషమును ధరించేవారు. బాలామణి మంచి రూపసి. సంగీత విద్వాంసురాలు. డంబాచారితో సరససల్లాపములాడుట నటించునప్పడు సందర్భానుసారముగ మంచి తెలుగుజావళీలను పాడుచుండెడిది. 'తారాశశాంకము'న కూడ చాకచక్యముతో నటించుచుండెను.

వీరి పిమ్మట గోవిందసామిరావు అను బ్రాహ్మణుడు పోలీసునౌకరిని చేసి వదలుకొని నాటకరంగమున ప్రవేశించెను. ఈయన భారీమనిషి, బుర్ర మీసములు, దృఢకాయమునుగల అందగాడు. వీరి నాటకములలో మంచి పేరు గాంచినది 'రామదాసు' నాటకము. ఈ నాటకములో ముఖ్యపాత్రయగు నవాబు వేషమును గోవిందసామిరావుగారే ధరించేవారు.