చిన్ననాటి ముచ్చట్లు/తొలి కాపురం
7
తొలి కాపురం
వివాహమైన మూడు సంవత్సరములకు నా భార్య యింటికి వచ్చెను. ఆమె వచ్చిన వెంటనే మద్రాసులో క్రొత్త కాపురమును పెట్టవలసి వచ్చినది. నా బాల్య స్నేహితుడగు అన్నం చెన్నకేశవుల శెట్టిగారికి ఆచారప్పన్ వీధిలో యొక యిల్లుండెను. ఆయింటిలో వారు మమ్ములను కాపురముంచిరి. అన్నివిధముల వారు మమ్ములను కనిపెట్టుచుంటిరి. వారి యింటిలో కొంతకాలముండి మరియొక యింటికి మారితిమి.
నా గృహిణి కొన్ని గ్రహములతో కూడ నా గృహము చేరినది. ప్రతిదినము యేదో గ్రహము ఆమెకు సోకటము, తల ఆడించడము, కేకలు వేయడము దగ్గరకు పోయిన తన్నడము, పీకడము, కొరకడము! ఈలాగున యింటిలో గ్రహములు తాండవమాడుచుండెను. మాకు తోడు యెవరు లేరు. పొరుగున అరవ కాపురము; దయ్యాలతో కూడ ఆ యింటిలో మేముండుట అరవలకు యిష్టము లేదు. క్రమముగ నా భార్య మెడనిండుగ లెఖ్కలేనన్ని రక్షరేకులకు తావు కలిగెను. పలువిధములయిన రుగ్మతలతో బాధపడుచు మంచమెక్కుచుండెను.
నాతో కూడ అరవ బడిపంతులు కాపురముండెను. ఆ పంతులు పేరు వెంకటేశయ్యరు. భార్య పేరు మంగళాంబ. వీరికి యిరువురు బిడ్డలుండిరి. ఈ బడిపంతులుకును, నాకును మాసమునకు రూ. 20 లు మాత్రమే వరుంబడి యుండెను. మేముండిన యింటిలో యొక భాగమునకు రూ. 1-6-0 నెలకు బాడుగను నేనిచ్చుచుంటిని. మరియొక భాగమునకు అయ్యరు నెలకు రూ. 2 లు యిచ్చుచుండిరి. వారిది తంజావూరు ప్రాంతము. మాది వంగోలు ప్రాంతము. నాకు కొద్దిగ అరవము తెలిసినను వంగోలాడబిడ్డకు అరవభాష అయోమయముగా నుండెను. అయితే అరవ గృహలక్ష్మి, ఆంధ్ర గృహలక్ష్మి వద్ద కొలది కాలములోనే తెలుగుభాషను చక్కగ నేర్చుకొని మాతో ధారాళముగ సంభాషించుటకు తయారైనది. తెలుగు గృహలక్ష్మి ఆరవభాషను వెక్కిరించుటకు తయారైనది. నేను మా ఆవిడను 'అరవమును నేర్చుకొనరాదా'యని హెచ్చరించినపుడు 'ఆ అరవమొత్తుకోళ్లు, ఆ చింతగుగ్గిళ్లు నాకక్కరలే'దని చీదరించుకొనుచుండెడిది.
అరవలు ఆంధ్రదేశమునకు డిప్టీ కలెక్టర్లుగను, అయ్యవార్లుగను, లాయర్లుగను, ఇంజనీర్లుగను వచ్చి కొలదికాలములోనే తెలుగుభాషను చక్కగా నేర్చుకొని వ్యవహారములను తెలుగువారికంటె నేర్పుగ నెరవేర్చుకొనుచుండుట తెలుగువారికి తెలిసిన విషయమే. అరవలాయర్ల ఆడవారు పురుషులకంటే ముందుగనే తెలుగు నేర్చుకొని కక్షీదార్లవద్దనుంచి ఫీజును నిర్ణయించుకొనుచుండిన విషయమును, ఫీజునుమించి సప్లయిలను రాబట్టుచుండిన సంగతిన్నీ కూడ నాకు దెలియును. అరవవారి బిడ్డలు తెలుగుబళ్లలో చదువుకొని ఆంధ్రభాషా ప్రవీణులయినవారిని కొందరిని నాకు దెలియును. అట్టివారిలో నేడు తెలుగుపత్రికలలో తరుచు వ్యాసములు వ్రాయుచుండు శ్రీరామచంద్ర అగస్త్య యం.ఏ. గారున్నూ, వారి సోదరియు తెలుగువారికి బాగుగా పరిచితులు.
మన ఆంధ్ర సోదరులు చిరకాలముగ మద్రాసును స్థిరవాసముగ నేర్పరచుకొని, స్థిరాస్తులను సంపాదించుకొని యుండినను అరవ భాషను ధారాళముగ మాట్లాడుటకు అసమర్థులైయున్నారు. ఇందుకు ముఖ్య కారణము అకారణమగు అసూయ. తెలుగు లాయర్ల వద్దకు అరవకక్షీదార్లు రాకపోయినను అరవవారివద్దకు తెలుగువారు పోవుచునేయున్నారు. తెలుగువారే కొందరు ఆంధ్ర రాష్ట్రోద్యమమును వ్యతిరేకించుచుండగా ఆంధ్రదేశములో (నెల్లూరులో) నివసించుచుండిన అరవవారగు సంతాన రామయ్యంగారు, అణ్ణాస్వామి అయ్యరు, టి.వి. వేంకట్రామయ్యరు మున్నగువారు అనుకూలత చూపి ఆంధ్రుల అభిమానమును బడయుచుండిరి.
కేసరి హైస్కూలునందు రాధాకృష్ణశాస్త్రి (B.A.L.T., B.O.L.) అరవ అయ్యరు తెలుగు పండితులుగనుండి ఇటీవలనే రిటైరు అయినారు. వీరు తెలుగు గ్రంథములను కూడ వ్రాసిరి. ఇటువంటి అరవ తెలుగు పండితులు మద్రాసులో మరికొందరున్నారు.
నారాయణ మొదలి వీధిలో మొదట మేము కాపురముండిన ఇంటి వంట ఇండ్లు చాలా చిన్నవైనను, అరవతల్లి మంగళాంబ తన వంటగదిని అమిత పరిశుభ్రముగ నుంచుకొను నేర్పరిగ నుండెను. ఆమె ఆ చిన్న వంటగదిని చక్కగ చిమ్మి తడిగుడ్డతో తుడిచి ఆ రాతినేలను అద్దమువలె పెట్టుకొనుచుండినది. పానపాత్రలను బూడిదతో తోమి తళతళమని మెరయునట్లుగ చేసి వాటిని వంటయింటి అలమరలో చక్కగబోర్లించి పెట్టుచుండెను. అంట్లతప్పెలనుకూడ ఆమెయే తోముకొని బోర్ణించుచుండెడిది. ఇట్లు చేయుట వలన ఆ వంటయిల్లు అలంకారముగ నుండెడిది.
ఆదివారమునాడు అయ్యరు అంగడినుండి బియ్యము, పప్పు వగైరా సామానులు తెచ్చిన వెంటనే, ఇల్లాలు వెలుతురులో కూర్చుండి ఓపికతో రాళ్ళు రప్పలను యేరి తీసివేసి, మూతలుండు డబ్బాలలో పోసి జాజికాయ చెక్కలపెట్టెలో పెట్టి భద్రపరచుచుండెడిది. వారి భోజన సామగ్రినంతయు ఈ పెట్టెలోనే యిమిడ్చి పెట్టుకొనుచుండినది. చింతపండును తెప్పించి దానిలోనుండు విత్తులను, ఈనెలను, రాళ్లను తీసివేసి అందులో కొద్దిగ వుప్పును వేసి, మొత్తగ దంచి 30 వుండలను చేసి, యెండబెట్టి, జాడీలో పెట్టుకొనుచుండినది. ప్రతిదినము ఒక వుండను రాతిమరిగలో నానవేసి ఆ పులుసును అన్నిటికిని వాడుకొనుచుండినది. అంగడి వుప్పును ఆ దినమునకు కావలసినంత తీసుకొని రాతి చిప్పలో వేసి నీళ్లలో కరగనిచ్చి భోజనపదార్ధములలో ఆ వుప్పునీటిని వేయుచుండినది. ఇందువలన ఆ వుప్పులోయున్న రాళ్లు, మన్ను మనకడుపులోకి పోకయుండును. నేతిని వీరు వాడరు గనుక నూనెను మాత్రము తెప్పించి జాడీలోపోసి వాడుకొనుచుండిరి. నూనెలో బెల్లమును వేసినందున నూనె తేటబడును. మజ్జిగకు బదులు సాతీర్ధమును (పుల్లనీళ్లు) వాడుకొనుచుండిరి. మోదుగ ఆకులను తెచ్చుకొని తీరిక కాలములో భార్యా భర్తల్లు కూర్చుని ఎకచకములాడుకొనుచు జానెడు విస్తళ్ళను కుట్టుకొని వాడుకొనుచుండిరి.
వారి వంటకు చిన్న మట్టిపొయ్యిని సొగసుగ ఆమెయే వేసుకొనును. పొయ్యి మంట వృథాగాపోకుండ, పొయ్యివద్ద కూర్చుండి నేర్పుగ మంటవేయుచు కొద్దిపుల్లలతోనే వంటంతయు చేయుచుండినది. అన్నమును వండు కంచుతప్పెల అడుగున మట్టిపూసి పొయ్యిమీద పెట్టను. ఇందువలన తప్పెలను అరగ తోము పనియుండదు. భోజనానంతరమున అంట్ల తప్పెలను ముంగిటిలో వేయును. పాడు కాకివచ్చి తప్పెలను అటు యిటు దొర్లించి గణగణ శబ్దమును చేయునే గాని ఆ కాకిముక్కుకు ఒక మెతుకుముక్కయైనను దొరకదు. స్నానమునకు బావినీళ్లు, పానమునకు వేడినీళ్లను వాడుకొనుచుండిరి. ఒక పూట మాత్రమే వీరు వంట చేసుకొనుచుండిరి. సాయంత్రము వంట ప్రయత్నము లేదు గనుక అయ్యరు బడినుండి వచ్చిన వెంటనే యిరువురు స్నానమునుచేసి అలంకరించుకొని ఇంటి సమీపముననుండు చెన్నకేశవ పెరుమాళ్ల సన్నిధికి సరిగా ప్రసాద సమయమునకు బిడ్డలతో కూడ పోవుచుండిరి. ఈ విష్ణుసన్నిధిలో దినము పుళిహోరను, దధ్యోజనమును భక్తులకు పంచిపెట్టుచుండిరి. ఆప్రక్కననే శివాలయము కూడ యుండినను అక్కడికి భక్తులెవరు పోరు. ఏలననగా శివాలయములో ప్రసాదముగ విభూతి నిచ్చెదరు గనుక.
ఈ మంగళాంబకు ఒడిబిడ్డ, ఎడబిడ్డ యిద్దరు బిడ్డలుండిరి. ఒడిబిడ్డకు డబ్బాపాలకు బదులు, రాగులను నానవేసి, బండమీద నూరి, ఆ రాగులను గుడ్డలో వడియగట్టి కాచి అందులో కొద్దిగ బెల్లమును కలిపి, ఆకలెత్తినపుడెల్లను మితముగ యిచ్చుచుండినది. ఈ రాగులపాల వలన ఆ చంటిబిడ్డ రబ్బరుబొమ్మవలె బసబుసలాడుచు పెరుగుచుండెను. ఈ రహస్యము అరవ తల్లులకు తెలియును. ఎడబిడ్డ ఏడ్చినపుడు వరిపేలాలు బెల్లము కలిపి చేసిన బొరుగు వుండలను యిచ్చుచుండినది. ఈ ఆహారము వలన పిల్లవాని ఆరోగ్యము కూడ బాగుంటూ వచ్చినది. ఆదివారము నాడు అయ్యరుకు తెల్లగెనుసు గడ్డలను కుమ్మలో పెట్టి ఫలహారము పెట్టుచుండినది. ఈ తెల్లగెనుసు గడ్డలనే నెహ్రూగారు కఱవుకాలమున అందరికి ఆరోగ్యకరమైన ఆహారమని పలుమారు చెప్పచున్నారు. ఈ రహస్యమును అరవతల్లి ఆకాలముననే గ్రహించినది.
తెల్లవారగనే కాఫీ, ఫలహారములు అలవాటు లేదు. అయ్యరు స్నానముచేసి, జట్టును జారుముడివేసి విభూతిని వళ్లంతయు పూసుకొని వెంటనే వంటయంటిలోకి పోయి, రాతిమరిగలో పులియుచున్న పుల్లనీళ్ల అన్నమును నీళ్లను కడుపార త్రాగి జఱ్ఱున త్రేపుచు బైటకు వచ్చి, ఉడుపులను తగిలించుకొని పాఠశాలకు పోవును. మరల అయ్యరు ఒక గంటకు వచ్చి వేడి అన్నమును తినును.
ఈ అయ్యర్ అయ్యవారకి నెలకు జీతము రూ. 20 లు గనుక జీతమును తీసుకొన్న నాడే దోవలోనున్న పోస్టాఫీసుకుపోయి సేవింగ్సు బ్యాంకిలో రూ.5 లు కట్టి వచ్చును. మిగత రూ. 15 లు యిల్లాలివద్ద తెచ్చియిచ్చును. ఈపైకముతో మంగళాంబ యింటి ఖర్చు నంతయు పొదుపుగ గడిపి సంవత్సరమునకు రూ. 20 లు కూడబెట్టుకొనును. వంటచేసిన పొయిలోని నిప్పును చల్లార్చి, ఆ బొగ్గులను కళాయి పూయువారికి అమ్మును. పాతగుడ్డలనిచ్చి పరకకట్టలను కొనును. పాతచీరలలో చించిన సరిగ పేటునిచ్చి కంచులోటాలను గాజు టంబర్లను కొనును.
ఈవిధముగ అరవతల్లి సంసారమును జాగ్రత్తగా గడుపుకొనుచు భర్తయిచ్చిన పైకములో మిగుల్చుకొనిన రూ. 20 లతో కూడ చిల్లర సంపాద్యమును కలిపి, దీపావళి పండుగనాడు కొర్నాడు పట్టుచీరెను కొని కట్టుకొనును. ఆ కాలమున పాతిక రూపాయలకు మంచి కొర్నాడు చీరె వచ్చుచుండెను. పేరంటములకు, దేవాలయములకు ఈ చీరెనే కట్టుకొని పోవుచుండినది. తన చీరెను తానే వుతుకుకొనుచుండినది. తెల్లవారగనే స్నానముచేసి ఆ చీరెను కట్టుకొని దినమంతయు గుడపుచుండినది. ఆ చీరెను యెప్పడు చూచినను అప్పడే అంగడినుంఛి తెచ్చినట్లు కనుబడుచుండినది. ఈమెవద్ద పాత పండుగ చీరెలుకూడ కొన్నియుండెను. ఈ చీరెలు కూడ క్రొత్తచీరెలవలెనే కనుపడుచుండెను. గనుక ఈమె గుడ్డల దరిద్రములేకుండ కాలమును గడుపుచుండినది.
ఈ అరవతల్లికి భోజనానంతరము నిదురబోవు దురలవాటు లేదు. కుట్టుపనినిగాని, చదువుకొనుటగాని, అప్పడాలు వత్తుటగాని ఆమె చేయుచుండును.
చంటిబిడ్డ యేడ్చినపుడు గుడ్డ ఉయ్యాలలో పరుండబెట్టి జోలపాటలను పాడుచుండును. అప్పడప్పడు త్యాగయ్యగారి కృతులను కంఠమెత్తి శ్రవణానందముగ పాడుచుండినది. భక్తిరసముగల పురందరదాసు కీర్తనలనుకూడ పాడుచుండెను. భర్త యింట నుండిననాడు, ఈ తల్లిపాటలు నేను వినగోరినప్పడు అడ్డుచెప్పక పాడుచుండెను. కావేరి తీరమున పుట్టిన పుణ్యాత్ములందరు చక్కగ పాడనేర్చినవారె.
మంగళాంబ ఒడ్డుపొడుగు కలిగిన మంచి విగ్రహము. తెల్లవారగనే స్నానముచేసి కురులను కురచగ దూముడి వేసుకొని పట్టుకోకను కట్టుకొని కుంకుమను పెట్టుకొనినప్పడు మంగళాంబ కామేశ్వరివలె కళకళలాడు చుండెడిది. ఈమెకు పరిశుభ్రతయే మంచి మడి, ఆచారము.
మంగళాంబ ప్రతిదినము తెల్లవారగనే చన్నీళ్ల స్నానమును చేయుటవల్లను అభ్యంజనమునాడు తలకు చీకిరేణి పాడిని వాడుటవల్లను ఆమె కురులు నున్నగను, నల్లగను పట్టు కుచ్చువలె నుండెడివి. చన్నీళ్ళ స్నానము వలన మన మెదడు చల్లబడి కురులు పొడవుగ పెరుగును. కావేరీ తీరవాసులకును, మలబారువారికిని తెల్లవారగనే శీతలోదకమున స్నానము చేయు అలవాటు గలదు. మలబారువారు తలకు బెండాకును రుద్దుకొనెదరు. చీకిరేణి పొడిలోను, బెండాకులోను జిరుగుపదార్థ ముండుట వలన వెంట్రుకలు బిరుసుగ నుండవు.
వంగోలు ప్రాంతమున తలంటు స్నానమునాడు సాధారణముగ కుంకుడుకాయల నురుగుతో తల రుద్దుకొనెదరు. కుంకుడుకాయల నురుగు అత్యుష్ణముగనుక తల వెంట్రుకలు వరిగడ్డి వలె గరగరలాడు చుండును. తలవెంట్రుకలు చిట్లిపోయి కురచబడును. త్వరలోనే వెంట్రుకలు తెల్లబడి పండ్లూడిపోవును. మా ఆవిడ మంగళాంబను చూచి అయినను నేర్చుకొనక పుట్టింట అలవాటును మార్చుకొనజాలక కుంకుడు కాయలనే వాడుకొనుచుండినది.
తలకు చల్లనీళ్లను, వంటికి వేడినీళ్లను వాడుకొనుట మంచిది. కొందరు తలలోని పేలు ఈపి నశించిపోవుటకు మసిలెడు నీళ్లను పోసెదరు. ఇందువలన కొందరు సొమ్మసిల్లి మూర్చపోవుటకూడ తటస్థించును. నదీ ప్రాంతములలో నివసించువారు నల్లరేగడ మన్నుతో కొందరు తలను రుద్దుకొను అలవాటు గలదు. ఇది చాలా మంచి అలవాటు. ఇప్పుడిప్పుడే పాశ్చాత్యపు స్త్రీలు ఈ రహస్యమును గ్రహించి వాడుచున్నారు.
వీరు మార్కెట్టుకుపోయి కూరగాయలనుకొని తెచ్చుకొను అలవాటు లేదు. దినము పొరిచె కొళంబు, తియ్య చారు, కాల్చిన అప్పడము, యెండు దబ్బకాయ వూరగాయ వీనితో రెండుపూటలు భోజనమును ముగింతురు. ఈ సాత్వికాహారముతో వీరి ఆరోగ్యమును కాపాడుకొను చుండిరి. ఎప్పడైనను మందు కావలసి వచ్చినపుడు నేను కొలువుండిన శ్రీ కన్యకాపరమేశ్వరి ధర్మవైద్యశాలకు వచ్చి మందులను పుచ్చుకొనుచుండిరి. అయ్యరు చీటికి మాటికి 'మంగళం, మంగళం' అని పిలుచుచు చీట్లపేకను ఆడుకొనుచు కాలమును కులాసగ గడుపుకొనుచుండిరి.
ఇక మా తెలుగాబిడ సంగతి వ్రాసెదను. ఈబిడ వంగవోలు ప్రాంతమునుండి వచ్చినది గనుక ఆ పల్లెటూరి ఆచారము ననుసరించి తన వంటయింటిని ప్రతిదినము మట్టి పేడతో మెత్తి అలుకుచుండినది. ఇందువలన వంటయింటిలో కాలుపెట్టిన దిగబడుచుండెను. ఈమె వంటయింటి నిండుగ ముగ్గులు వేయుచుండెను. మా యిరువురి వంటకు నాలుగు రాతిపొయిలను కూలిచ్చి వేయించినది. మాసమునకు కావలసిన కట్టెలను పిడకలను ఒకే తడవ తెప్పించి పొయిల ప్రక్కనే పేర్చి పెట్టినది. భోజన సామగ్రిని వుంచుకొనుటకు కొన్ని కుండలను తెప్పించి వంట యింటి దక్షిణపుతట్టు కుదుళ్లమీద వరుసగా పెట్టినది. ఒక మూల గుంజిగుంటను, మరియొక మూల దాలిగుంటను యేర్పాటు చేయించినది.
వంటయింటి నిండుగ పుట్లను వ్రేలాడగట్టించినది. ఆ గది నిండుగా పల్లెటూరు పాత్ర సామానును - అనగ నిలువు చెంబులు, బుడ్డిచెంబులు, దోసకాయ చెంబులు, జోడితప్పెల, దబరాగిన్నె మొదలగువాటిని పరచిపెట్టి వుంచును. రాతిచిప్పలు కూడ వుండును. వంట త్వరలో చేయుటకు నాలుగుపొయిలను ఒకేసారి బుడ్డి కిరసన్నూనెతో ముట్టించును. పొయి నిండుగ కట్టెలు, పిడకలను తురిమి స్నానమునకు పోవును. వచ్చులోపల యిల్లంతయు పొగ కమ్ముకొని యింటిలో వస్తువులు కనపడక తట్టుకొనుచు చుండుటయేగాక ఇల్లాలి కండ్ల నిండుగ నీలాలు కారుచుండును. వైదికులమడి తడిగుడ్డ గనుక తడిగుడ్డతోనె వంట చేయుచుండెను. అయితే వంట ముగియు లోపల మడిబట్టు ఆరుచుండును.
మా యింటిలో వేయించిన కందిపప్పే వాడుక, గనుక ప్రతిదినము ముద్దపప్పు లొడ్డుపులుసు, వేపుడుకూరలు, రెండుపచ్చళ్ళు, పండు మిరపకాయల కారము ఉండితీరవలయును. రాత్రిళ్ళు అన్నములోకి పప్పుపొడి, గోంగూర, చింతకాయ పచ్చళ్ళు, చిక్కటి మజ్జగ ఉండవలయును. ప్రతి శుక్రవారము అమ్మణ్ణికి నేతి గారెలను నైవేద్యము పెట్టుచుండినది. పిండివంటల నోమును పట్టుచుండినది. నోము వుద్యాపనకు గారెలను బూరెలను నేతిలో చేసి బుట్టనిండుగపెట్టి ముత్తైదువకు వాయన మిచ్చుచుండెడిది. శనివారం వెంకటేశ్వరునకు చలిమిడి పిండి, నేతి దీపారాధన చేయుచుండెను. వ్రతమునకు వండిన నేతిగారెను ఒక్కటైనను నా కివ్వమని ఆశపడి అడిగినప్పుడు వ్రతమునకు చేసిన వాటి నిచ్చిన ప్రతభంగము కల్గునని నిర్దాక్షిణ్యముగ నిరాకరించెడిది.
వరలక్ష్మీవ్రతమునాడు అరవతల్లి మంగళాంబను భోజనమునకు పిలుచును. అప్పుడామె నా భర్తను విడిచిపెట్టినేను విందు భోజనము చేయుట వీలుగాదని చెప్పును. అప్పుడు నేను అయ్యర్ను కూడ భోజనమునకు రమ్మనెదను. ఆనాడు అరవ కుటుంబమంతయు మా యింటనే భుజింతురు. భక్ష్యములకుగాను చంటిబిడ్డకు కూడ ఆకువేసి కూర్చుండబెట్టెదరు. ఆ రాత్రి మజ్జిగ త్రాగి పరుండెదరు.
మేము కూరలకు నూనెవాడిన తల తిరుగును గనుక అన్నిటికి నేతినే వాడుచుంటిమి. ఈ కారణములవల్ల నా నెలజీతము నేతికి కూడ చాలకుండెను. ఆ కాలమున మంచి నేతిని వీశ రూ. 1-4-0 కు అమ్ముచుండిరి.
ఒక వైద్యుడు కాకరకాయలో క్వయినా గలదు గనుక దినము తినుచుండిన మలేరియా జ్వరము రాకుండుటయేగాక మంచి ఆరోగ్యముకూడ కలుగునని చెప్పినందున నేను ప్రతిదినము కొత్వాలు చావిడి మార్కెట్టుకుపోయి మంచి పెద్ద కాకరకాయలను తెచ్చుచుంటిని. ముళ్లవంకాయలు చిన్నవి (కర్పూరపు వంకాయలు) రుచికరముగ నుండును గనుక వాటిని తెచ్చుచుంటిని. దేశవాళి గోంగూర కనబడిన విడుచువాడను గాను. ఒంగోలువారికి పచ్చళ్లలోకూడ పచ్చిమిరపకాయలను కొఱుకు కొనుట అలవాటున్నందున వాటిని తెచ్చుచుంటిని. పచ్చిమిరపకాయలో మంచి వైటమిన్ వున్నట్టు నవీన వైద్యవేత్తలు కనుగొనిరి.
మా ఆబిడ మద్రాసుకు వచ్చునపుడు నేను పెండ్లినాడు పెట్టిన రోజారంగు బనారసు సరిగ చీరను, బాలామణి చీరను, చిలుకపచ్చ సాదా పట్టుచీరెలను, తల్లిగారు పెట్టిన ముదురు లేత చుట్టుచంగాయి చీరెను, కోటకొమ్మంచు వేసిన తెల్లచీరెను తనతో కూడ తెచ్చుకొనెను. మద్రాసుకు వచ్చిన పిమ్మట మూడుచుక్కల మధుర చీరెను, బందరుచాయ గువ్వకన్ను చీరెను, సాదారంగు చీరెలను నేను కొని యిచ్చితిని. వర్షాకాలమున మడికట్టుకొనుటకు నారమడి చీరెను పెండిండ్లకు మడికట్టుకొని భోజనమునకు పోవుటకు బరంపురం వంగపండుచాయ పట్టుతాపు తాను కొని యిచ్చితిని.
తెలుగుతల్లికి తన చీరలను తాను వుతుక్కొని ఆరవేసుకొను అలవాటు లేదు; గనుక పనిమనిషి వద్ద యిచ్చి వుతకమనుచుండినది. ఆ చీరెలను పనిమనిషి పేడలోను మట్టిలోను పార్లించి రాతిమీద వుతుకునపుడు రాతికి బొక్కెనకు తగులుకొని చీరెలు చినుగుచుండినవి. పట్టుచీరెలను కట్టుకొని విందు భోజనములకు పోయి నేతిచేతులను కట్టుకొన్న చీరకు తుడుచుకొని యింటికి వచ్చి ఆ చీరను మడిచి యొకమోలను పెట్టుచుండినది. చేతులు తుడిచిన నేతివాసనకు రాత్రిళ్లు యెలుకలు వచ్చి ఆ చీరను వెయిగండ్ల చీరనుచేసి పోవుచుండెడివి. ఆ చినిగిన చీరెను సుమంగలి కట్టుకొనిన దరిద్రము వచ్చునను పనివార్లకు పంచిపెట్టుచుండినది. అప్పుడప్పుడు పాత చీరలను యిచ్చి సూదులను, మాయపగడాల దండలను కొనుచుండినది. ఇందువలన తెలుగుతల్లికి యెప్పడు గుడ్డలకు కఱవుగనే యుండెను. చీరె యెండలో ఆరినగాని మడికి పనికిరాదని ఈమె వాదించుచుండెను. కనుక ఈమె పట్టుచీరెలను మిద్దెమీద యెండ వేయుటవలన రంగు పట్టుచీరలన్నియు తెల్లపట్టు తాపుతా లగుచుండినవి. తెలుగుతల్లికి అరవతల్లికివలె క్లుప్తముగ వంటచేసుకొనుటకు తెలియదు. మాకు వండిన వంటకములు మరి ముగ్గురకు కూడ సరిపోవుచుండెను. మిగిలిన అన్నముతో పనిమనిషి సంసారమును, పందికొక్కుల సంసారమును కాపాడుచుండెను. ఈమె వంగవోలు వంట చాలా రుచిగను, పరిశుభ్రముగను చేయుచుండినది.
మా వంగలోలాబిడకు చదువు సున్నా, కుట్టుపని రాదు. అప్పడము లొత్తుట అసలే తెలియదు. కనుక ఈమె భోజనానంతరము కొంగుపరచుకొని సుఖనిద్ర ననుభవించుచుండెను. అయితే ఈమె అప్పుడప్పుడు వంట చేయునపుడు, పచ్చళ్లను నూరునప్పుడు తల్లివద్ద నేర్చుకొనివచ్చిన లక్మణమూర్ఛ, శీతమ్మ కడగండ్లు, కుశలవ కుచ్చలకథ, పాముపాట మొదలగు పాతపాటలను పాడుకొనుచుండును. మడికట్టుకొని లక్షవత్తుల నోమునకు కావలసిన జడపత్తి వత్తులను చేసుకొనుచుండును. జపమునకు కొనుక్కొనిన పగడాల తావళమును త్రిప్పుచుండును. అరవతల్లి మంగళాంబ అప్పుడప్పుడు త్యాగయ్య కీర్తనలను పాడుచుండిన చీదరించుకొనుచుండును. సంసార స్త్రీ సంగీతమును పాడగూడదట. ఇదియే కావేరితీరమున పుట్టిన అరవతల్లికి, గుళ్లకమ్మవడ్డున పుట్టిన తెలుగుతల్లికి భేదము.
మంగళాంబను చూచి అయినను నీవు మంచిమార్గములను నేర్చుకొనరాదాయని నేను అదలించి కోపించినపుడు 'పొయిబొగ్గులను, పాతగుడ్డలను అమ్ముకొని పొట్టపోసుకొను దరిద్రురాలిని చూచి నేను నేర్చుకొనువిద్య లేమున్న'వని జవాబు చెప్పుచు కంటనీరు కార్చుచుండినది. ఎండకాలమున వడపెట్టు తగలకుండగను వడగడ్డలు రాకుండగను అంగారకగ్రహ దోషనివారణకు మాయింటి పురోహితుడు కడప సుబ్బయ్యశాస్త్రికి కందిపప్పును, ఉర్లగడ్డలను దానమిచ్చుచుండినది. ఫలాని ఋతువులో ఫలాని దానము లివ్వవలయునని పురోహితుడు వచ్చి ఈ అమాయకురాలితో చెప్పిపోవుచుండును. ఆ పురోహితుడు నేను సమకాలికులము. ఇప్పుడుకూడ అప్పుడప్పుడు పండుగలకు వచ్చి ఆ చనిపోయిన మహాతల్లిని స్మరించి చేతులెత్తి నమస్కరించి పోవుచుండును.
మేము కాపురముండిన యింటిలో కొళాయి లేనందున ప్రక్కయింటి కోమట్ల కొళాయిలో మంచినీళ్లను తెచ్చుకొనుచుంటిమి. ఆయింటి శెట్టి దరిశారంగనాధమును, నేనును స్కూలులో కూడ చదువుకొనిన పరిచయముండినది. నా భార్య వారింటికి మంచినీళ్లకు పోయినప్పుడు ఆడవారు ఈమెకు పరిచయమైరి. ఒకనాడు ఈమె వారింటికి పోయినప్పుడు మీ పేరేమమ్మా' యని వారడిగిరి. అప్పుడు ఈమె తన పేరు రేపల్లె యని జవాబు చెప్పెను. ఈపేరు మద్రాసువారికి క్రొత్తగనుండుట వలన వారు ఫక్కున నవ్వి 'యిదేంపేరమ్మా' యని పరిహాసమును చేసిరి. అప్పుడు శెట్టెమ్మను మీ పేరేమని మా ఆబిడ అడిగెను. తన పేరు కనకమ్మయని శెట్టెమ్మ చెప్పుకొనెను. ఆనాటినుండి నా భార్యకూడ కనకమ్మ అనియే పేరుపెట్టుకొనినది. మద్రాసులో అందరు ఆమెను కనకమ్మ అనియే పిలుచుచుండిరి. అయితే పుట్టింటికి పోయినప్పుడు మాత్రము నామకరణమునాడు పెట్టిన రేపల్లె పేరుతోనే పిలుచుచుండిరి. నేనును ఈమెను కనకం అని తిన్నగా పిలుచుచుంటిని. కాని, భర్త భార్యను పేరుపెట్టి పిలుచుట దోషమని ఈమెకు యిష్టము లేకుండెను.
సాధారణముగా మద్రాసులో కోమట్లు భార్యను "యెవరాడా? అని పిలుచుచుందురు. ఒసే, ఓసి, ఏమె, ఎక్కడున్నావు, అబిడ, ఆఁ, ఊఁ, అను మొదలగు సంకేత నామములతో మరికొందరు పిలుచుచుందురు. కొందరు బుద్దిమంతులు ఏమమ్మోయియని అమ్మయని పిలుతురు. భార్యలు భర్తలను పిలుచునపుడు శెట్టిగారని, అయ్యరు అని, పంతులని, ఏమండి అని, నాయుడని, మొదలియారని గౌరవనామములతో పిలచెదరు. అయితే కొందరు స్త్రీలు భర్త పేరడిగినప్పుడు మాప్రక్కయింటి కృష్ణవేణమ్మ భర్తపేరే మా ఆయనపేరుకూడ యని చెప్పెదరు. పేర్లు చెప్పకూడదనే ఆచారము యెందుకు వచ్చినదో తెలియదు. పెండ్లినాడు పేర్లు చెప్పుకొను ఆచారముయొక్క అర్థమును మన వారికి తెలియకున్నది. ఆనాటినుండి మనము ఒకరినొకరు పేర్లతో పిలుచుకొనవలయుననే అర్థము. కొందరు భార్యను పేరుతో పిలుచుచున్నారుగాని భర్తను పేరుతో పిలుచుట లేదు. కొందరు చదువుకున్నవారు భర్తపేరు కాగితముమీద వ్రాసి చూపించెదరు. అరవలలో యింత పట్టింపులేదని తెలియుచున్నది.
నా గృహలక్ష్మి శుద్ద అమాయకురాలు. పాతకాలపు పల్లెటూరి భాగ్యశాలి.
పెండ్లినాడు నేను యీమెకు ఒక బంగారు చామంతి రేకుల జడబిళ్లను పెడితిని. మేము నారాయణమొదలి వీధిలో కాపురమున్నపుడు ఆ జడబిళ్ల వెండిచుట్టు విరిగిపోయినది. అందువలన ఆ జడబిళ్ల పెట్టుకొనుటకు వీలుకాకుండెను. అప్పడామె ఆబిళ్ళను తానే బాగుచేసుకొని మరల ధరించుకొనవలయుననే ఉద్దేశముతో విరిగిన రెండు సగములను చింతపండుతో అతికించి యింటి వీధి అరుగు మీద యెండలో సూర్యపుటముపెట్టి వీధితలుపును మూసుకొని లోపలికిపోయెను. అరుగుమీద పెట్టిన బంగారపుబిళ్ల యెండకు తళతళమని మెరయుటను దోవనపోవు యొక పెద్దమనిషి చూచి తిన్నగ దానిని తస్కరించుకొని పరారి చిత్తగించెను. ఈమె అక్కడ దానిని పెట్టిన సంగతియే మరచిపోయినది. కొంతకాలమునకు ఆ సంగతి ఆమెకు జ్ఞాపకమునకు వచ్చి పెట్టిన స్థలమునకు పోయి వెతికినది. అక్కడ లేకుండెను. అప్పడు నాతో చెప్పినది.
సాధారణముగ కంసలిబత్తులు విరిగిన నగలను టంకముపొడితో (వెలిగారము) అతుకువెట్టి కుంపటి పుఠమును వేయుదురు. ఈ తల్లి చింతపండుతో అతికించి సూర్యపుఠము పెట్టినది. ఈమెకు తోచిన కిటుకు యింకను కంసాలివారు గ్రహించలేకున్నారు.
నా తండ్రి తిథి వచ్చినది. ఆనాడు అంగడినుంచి సత్తుతప్పెల నిండుగనెయ్యి తెచ్చితిని. నిమంత్రణ బ్రాహ్మణులు ఆకుల ముందర భోజనమునకు కూర్చున్నారు. నెయ్యిని వడ్డించవలయును. సత్తు నేతి తప్పెలను నా భార్య పొయిమీద పెట్టినది. అది సత్తుతప్పెల అయినందున అడుగుకరిగి నెయ్యి అంతయు పొయిలో పడి భగ్గునమండెను. ఆ మంట పెద్దదగుట వలన నా భార్య భయపడి దిక్కుతోచక ప్రక్కకూటములో నిలుచున్న మంగళాంబను గట్టిగా కౌగలించుకొని కండ్లు మూసికొనినది. మంగళాంబ దిగ్భ్రమ చెంది వంటయింటిలోకి వచ్చి చూచినది. సత్తు తప్పెల కరగి నెయ్యి పొయిలో పోయినదని ఆమె గ్రహించినది. విస్తళ్ళ ముందర కూర్చున్న బ్రాహ్మణులు చారలు జాపుకొని కూర్చున్నారు. అరవవారింట అప్పుదెచ్చి వడ్డించుటకు వారింట నెయ్యి లేదు. వచ్చిన నిమంత్రణ బ్రాహ్మణులు అరవవారైనందున నూనెతోనే భోజనమును ముగించుకొనిపోయిరి.
ఆనాడు మంగళాంబ కూడ మా యింటనే భోజనము గనుక ఇరువురు యిల్లాండ్రు భోజనమునుచేసి తీరికగ కూర్చుండి తాంబూలమును వేసుకొనుచుండునపుడు మంగళాంబ గారు మా ఆబిడను 'ఎందుకమ్మా నీవు నన్ను కౌగలించుకున్నది?' అని నవ్వుచు అడిగినది. 'ఆ పెద్దమంట చూడగా నాకు భయము కలిగి అట్లు చేసితినమ్మా' యని ఈమె దీనముగ జవాబు చెప్పెను. 'అయితే సత్తు తప్పెలను పొయిమీద పెట్టిన అది కరిగిపోవు సంగతి నీకు తెలియదా' యని అరవతల్లి అడిగినపుడు 'నేను దినము ఆ తప్పెలతోనే చారు పెడుతున్నందున పొయిమీద పెట్టితి'నని తెలుగుతల్లి జవాబు చెప్పినది.
ఈ తెలుగుతల్లి చాలా భయస్తురాలు. రాత్రిళ్ళు యింటిలో పిల్లులు చప్పుడు చేసినప్పుడు దొంగలు వచ్చిరని జెప్పును. మా యింటి ప్రక్కయింటి దొడ్డిలోవున్న పెద్దరావిచెట్టు రాత్రిపూట గాలికి కదలిన దాని మీద మునీశ్వరుడు (మొగదెయ్యం) కూర్చుండి కదలించుచున్నాడని భయపడుచుండెను. తెల్లవారగనే ఆ మునీశ్వరునకు పాలుపొంగలివెట్టి మొక్కుచుండును. ఇందువలన మా యింటికి మాంత్రికులు, తాంత్రికులు వచ్చి తాయెత్తులను, రక్షరేకులను కట్టిపోవుచుందురు. ఈమె మెడ నిండుగ యివి వ్రేలాడుచుండును.
ఈ విధముగా తెనుగుతల్లి సంసారమును సాగించుచుండెను. అయితే ఈ పట్టణములో నాకు వచ్చు స్వల్పవరుంబడిలో ఈ దుబారా సంసారమును నేనెట్లు గడపగలిగితి నాయని పాఠకులు సందేహపడవచ్చును. ఆ కాలమున మద్రాసులో ఇస్తిరి చొక్కాయి, తలగుడ్డ ధరించుకొనిన వానికి అంగళ్లలో అప్పు పుట్టుచుండినది.