చిన్ననాటి ముచ్చట్లు/కేసరీకుటీరం ప్రథమావస్థ

5

కేసరీకుటీరం ప్రథమావస్థ

కేసరి కుటీరమునకు మొదట చాలినంత మూలధనము లేక వృద్దికి రాజాలకయుండెను. స్నేహితులవద్ద కొంతడబ్బును తెచ్చిపెడితినిగాని హేరాళముగ వ్యాపారమును చేయుటకు ఆ డబ్బు చాలదాయెను. ఇట్లుండగ మాతోకూడ వైద్యశాలలో పనిచేయుచుండిన కె.బి. రంగనాధయ్యరు వారి అన్నగారి పేరుతో ధన్వంతరి వైద్యశాల నొకదానిని స్థాపించిరి. అయితే వారి వద్దను డబ్బులేక కష్టపడుచుండిరి. అప్పుడు మద్రాసులో ఆయుర్వేదాశ్రమము, కేసరీ కుటీరము, ధన్వంతరి వైద్యశాలయను పేర్లతో మూడు వైద్యశాలలుండెనుగాని యొకరి వద్దను డబ్బులేదు. అప్పుడు రంగనాధయ్యరు నావద్దకువచ్చి, మన యిరువురము కలిసి మందుల వ్యాపారమును చేయుదము; కావలసిన మూలధనమును నా పరిచితులగు రామచంద్రయ్యరు (సుప్రసిద్ధ హైకోర్టు వకీలు) గారిని అడిగి యిప్పించెదనని చెప్పి నన్ను వప్పించెను. అప్పడు కేసరి కుటీరముతో ధన్వంతరి వైద్యశాలను యేకముచేసి కేసరి కుటీరం అను పేరుతోనే మందుల వ్యాపారమును చేయ ప్రారంభించితిమి. కొంతకాలము జరిగెను. చెప్పిన ప్రకారము రంగనాధయ్యరుగారు రామచంద్రయ్యరుగారి వద్దనుంచి డబ్బును తేలేకపోయిరి. వ్యాపారము నిద్రపోవుచుండెను. ఇరువురము భుక్తికి కూడ కష్టపడవలసి వచ్చెను.

అప్పడు వారిని నేను విడిచిపెట్టి వేరుగ నా కేసరి కుటీరం పేరుతోనే వ్యాపారము ప్రారంభించితిని. క్రమముగ నా వ్యాపారము బాగుపడెను. నేను వృద్ధికి వచ్చుటచూచి రంగనాథయ్యరుకు కన్నెఱ్ఱ నాయెను. వారు వకీలుగ నుండుటవలన సులభముగ నామీద క్రిమినల్, సివిల్ కేసులను తెచ్చి నన్ను చాలా కష్టనష్టములకు పాలుచేసిరి. తెచ్చిన కేసులు వారికి లాభించలేదు. కడపట Trade Mark Suit వారికి నాకు హైకోర్టులో జరిగెను. ఈ కేసులో జడ్డిగారి సలహా మీద వారు నేను సమాధాన పడితిమి; వారికి నేను కొంత డబ్బు యిచ్చి, నా మందులకు, వ్యాపారమునకు వారికి యేలాటి సంబంధము లేకుండా హైకోర్టు డిక్రీని పొందితిని. ఈ కష్టములన్నిటికి కారణం యిరువురికి విభాగ పత్రము లేకుండటయే.

నా వ్యాపారము దినదినాభివృద్దినందుచు పచ్చయప్ప కళాశాలకు ప్రక్కనయుండిన బందరువీధిలో నున్నప్పడు, సికింద్రాబాదులో కేసరి కుటీరం బ్రాంచిని స్థాపించితిని. ఈ బ్రాంచికి నెల్లూరు కాపురస్తుడగు వరదయ్య నాయుడు గారిని యేజెంటుగ నేర్పాటు చేసితిని.

వీరు సికింద్రాబాదులో పనిచేయుచు, తన కుమారునికి కేసరి యని పేరుపెట్టి అక్కడ విక్రయించుచున్న మందులు తనవేయని బూటకపు మందులను చేసి విక్రియించుచుండిరి. ఈ విషయమును తెలుసుకొని నేను అక్కడికివెళ్లి వారిని అక్కడనుంచి తొలగించితిని, వరదయ్యనాయుడు గారు సికింద్రాబాదునుండి నెల్లూరికి వచ్చి స్వంతషాపు పెట్టి కేసరి లోధ్ర, అమృత, అర్క యను పేర్లతో మందులమ్ముచుండిరి. అప్పడు నేను వారిమీద నెల్లూరిలో కేసు చేయవలసివచ్చెను. వరదయ్యగారు కోర్టులో, నన్ను క్షమాపణ కోరుకున్నందున కేసును రద్దుపరచుకొంటిని.

ఈ నా వ్యాపారమునకు స్త్రీధనమే మూలధనమని చెప్పుకొనుటకు చాలా గర్వపడుచున్నాను. సుమారు అర్ధశతాబ్దమునకు మునుపు మనదేశములో అనుకూల దాంపత్య కుటుంబములు చాలా తక్కువగా నుండెను. భర్త భార్యను కొట్టుటయో, తిట్టుటయో, ఇంటినుండి తరిమివేయుటయో, సామాన్యముగ జరుగుచుండినవి. మగని బాధలను భార్య భరించజాలక, నూతిలో పడుటయు, విషము త్రాగుటయు, కిరసన్ నూనెతో కాలిపోవుటయు మొదలగు అమానుష కృత్యములు పలుమార్లు జరుగుచుండుట వినుచుంటిని. ఈ కారణములవల్ల ఆకాలపు గృహలక్ష్మికి మనశ్శాంతిలేక కాలమును కడుకష్టముతో గడుపుచుండెను. ఈ సందర్భమును నేనప్పుడు అవకాశముగ తీసుకొని స్త్రీలను బాగుపరచి తద్వారా నేనును బాగుపడవలయుననే సదుద్దేశముతో ఒక చిన్న పన్నాగమును పన్నితిని.

నేనొక అడ్వర్టైజమెంటును (ప్రకటనను) తయారుచేసుకొని ఆ కాలమున సుప్రసిద్ధ తెలుగు పత్రికయగు 'ఆంధ్ర ప్రకాశిక' కార్యాలయమునకు వెళ్లితిని. ఈ కార్యాలయము అప్పడు మౌంటురోడ్డులో యొక మిద్దెమీద యుండెను. ఈ పత్రికాధిపతియగు ఎ.సి.పార్థసారధినాయుడు గారిని చూచితిని. నేను వారిని దర్శించుటకు వెళ్ళినప్పుడు వారు పాత వార్తాపత్రికలను చించి వాటి కాళీస్థలమున పెన్సలుతో వ్యాసములు వ్రాయుచుండిరి. నేను వారిని చూచి నమస్కరించితిని. చిఱునవ్వుతో నన్ను చూచి కూర్చుండుమనిరి. వచ్చిన కారణమును వివరించిరి. నా జేబులోనున్న అడ్వర్టయిజుమెంటును వారి చేతికిచ్చి పత్రికలో ప్రచురించమని అడిగితిని. నేనిచ్చిన కాగితమును రెండు మూడుసార్లు ఇటూ అటూ, పారచూచి నన్నుచూచి ఫక్కున నవ్వి ఇది వేయుటకు తడవకు రూ. 10 లు ఛార్జి అగునని చెప్పిరి. అంత యిప్పుడు ఇచ్చుకోలేనని చెప్పి నావద్దయున్న అయిదు రూపాయిల నోటును తీసి వారి చేతిలో పెట్టితిని. అప్పడు వారు నన్ను చూచి నీవు చాలా గడుసువాడవుగ నున్నావని చెప్పి మరియొకసారి నవ్వి నన్ను పంపివేసిరి. ఆ కాలమున మద్రాసులో నాయుడుగారు ఆంధ్రులలో ప్రముఖులుగ నుండిరి. ఆంధ్రమున గంభీరమగు ఉపన్యాసముల నిచ్చుచుండిరి. చెన్నపురిలో ఆ కాలమున నాయుడుగారు మాట్లాడని సభ ఉండెడిది కాదు. వీరు మొదట ఆంధ్రమున ఉపన్యాసమును ప్రారంభించి, అరవములో ముగింతురు. సభలో మహమ్మదీయులు, మళయాళీలుండిన వారి భాషలలో మాట్లాడి అందరిని నవ్వించుచుండిరి. వీరు బక్కపల్చగ నుందురు. అంటి అంటని తిరుమణి శ్రీచూర్ణమును ముఖమున దిద్దువారు; నవ్వు ముఖము, తెల్లని తలపాగా, లాంగుకోటును ధరించువారు. సరసులు. తెలుగు పండితులు; చక్కని వాగ్ధోరణి గలవారు. ఆ రోజులలో వీరు గొప్ప కాంగ్రెసువాదులు. ఆ నాడు జరిగిన ఈ సన్నివేశమంతయు ఈ నాడు నా కంటికి కనపడుచున్నట్లేయున్నది.

నేను ఆనాడు పత్రికలో ప్రచురించుటకు వారివద్ద యిచ్చిన అడ్వర్టయిజుమెంటు యేమనగా :

మందగమన - సుందరాంగి అను ఇరువురు చెలికత్తెల సంభాషణ (స్థలము : నీలాటి రేవుగట్టున బోర్లించిన బిందెలమీద ఇరువురు కూర్చుండిచేసిన సంభాషణ)

మందగమన : ఏమే, సుందరీ! ఈమధ్య నీవు నాకు అగుపడుటయే లేదేమే?

సుందరాంగి ; ఏమి చెప్పుదునే అక్కయ్యా నా అవస్త? నా మగడు నన్ను చూచినప్పుడెల్లను కారాలు మిరియాలు నూరుతుంటారు. చీటికి మాటికి వీపు బద్దలయ్యేటట్టుగా బాదుతారు. నాతో మాట్లాడరు. ఇంట పరుండరు. ఈ నా అవస్థలో నిన్ను నేను యెట్లు చూడగల్గుదును? మందగమన : ఓసీ పిచ్చిచెల్లీ! ఈ మాత్రమునకేనా నీవు వ్యసనపడడము? నీకంటె పదిరెట్లు హెచ్చుగ కష్టముల ననుభవించిన దానను. ఇవిగో చూడు నా చేతి మీద వాతలు; వీపుమీది కొరడా దెబ్బల మచ్చలు. అయితే ఇప్పడు నేను, నాభర్త యొకరినొకరు క్షణమాత్రమైనను విడువజాలనంత అనురాగమున సుఖముగ నున్నాము. ఇందుకు కారణము మా ప్రక్క యింటి సరస్వతియే. ఆమె యెప్పుడును 'ఆంధ్ర ప్రకాశిక' పత్రికను చదువుచుండును. ఆమె నాకు చెప్పిన రహస్యము వల్లనే ఇప్పటి మా యిరువురి స్నేహము; దానిఫలమే ఈ చిట్టికూతురు వాసంతిక.

సుందరాంగి  : అక్కయ్యా! నీకు నమస్కరించెదను. ఆ రహస్యమును నాకును చెప్పి పుణ్యమును కట్టుకొనవే.

మందగమన : చెప్పెదను వినుము, సుందరీ. మద్రాసులో ′కేసరి కుటీర′ మను యొక వైద్యశాల కలదు. ఆ వైద్యశాలలో 'తాంబూలరంజిని' అను పడకటింటి తాంబూలములో వేసుకొను పరిమళ మాత్రలను విక్రయించెదరు. ఆ మాత్రల వెల బుడ్డి 1-కి నాలుగు అణాలు మాత్రమే. వాటిని నీవు కూడ తెప్పించుకొని నీ భర్తకిచ్చు తాంబూలమున నుంచి యిచ్చిన వారము దినములకే నీ భర్త నీ స్వాధీనమై, నీకు దాసానుదాసుడగును. గనుక నీవు వెంటనే ఇంటికిపోయి కేసరి కుటీరమునకు కార్డును పంపుము. సుందరాంగి వెంటనే యింటికి వెళ్లి మద్రాసు కేసరి కుటీరమునకు ′తాంబూల రంజినీ' మాత్రలను పంపమని ఆర్డరు పంపెను. మూడవ దినమున మాత్రల పార్సిలు వచ్చెను. వచ్చిన ఆ రాత్రియే మాత్రలను భర్తకిచ్చెను. మరుసటి దినము మొదలు భర్తలో మార్చుగలిగి క్రమముగ అనుకూల దాంపత్య సుఖమనుభవించుచు త్వరలోనే సుందరాంగి సుముఖుని గనెను.

ఇదియే నా ప్రకటన.

ఆ కాలమున వార్తాపత్రికలలో ఔషధముల ప్రకటనలు చాలా తక్కువగా నుండెను. ఈ ప్రకటనను చదివినవారందరు మాత్రలకు ఆర్డర్లు పంపుచుండిరి. ఈ పడకటింటి మందును రుచి చూడవలయుననే కోరికతో పురుషులుకూడ తెప్పించుకొనుచుండిరి. తమాషాకు కూడా కొందరు తెప్పించుకొని వాడుకొనుచుండిరి. కొందరు పురుషులు తమ పెంకె భార్యలకు కూడా యిచ్చుచుండిరి. ఈ విధముగ ఈ మాత్రలకు గిరాకి యేర్పడి క్రమముగ సప్లయి చేయుటకు సాధ్యముకాక యుండెను. దినమునకు సుమారు నూరు రూపాయల మాత్రలను విక్రయించుచుంటిని. ఈ చిన్న సన్నివేశమే నా జీవయాత్రను దారిద్ర్యారణ్యమునుండి ధనార్జనా సమర్దుని చేయు రాజమార్గమునకు చేర్చినది. నాటి నుండియే నా జీవితమార్గము సుఖసౌకర్యములకు మలుపు తిరిగినది. ఈ విధముగ నాకు ప్రోత్సాహము కలిగించిన ఈ స్త్రీధనముతో వైద్యశాలను వృద్ధిపరచి ఇతర మందులను తయారుచేయగలిగితిని.

1900 సంవత్సరమున మద్రాసు జార్జిటవున్ నారాయణ మొదలి వీధిలో యొక చిన్న బాడుగ ఇంటియందు కేసరి కుటీరమును మొట్టమొదట స్థాపించితిని. ఆ యిల్లు చిన్నదగుటవలన ఇంటికి కుటీరమని పేరుపెట్టి ఆ కుటీరమునకు నా పేరు జోడించి వైద్యశాలకు ′కేసరికుటీరం′ అను నామధేయముతో వైద్యసంస్థను స్థాపించితిని. ఇంటిముందు వసారాగోడవైన 'కేసరి కుటీరం - ఆయుర్వేద ఔషధశాల' యని బొగ్గుతో పేరు వ్రాసివుంచితిని. ఆ కాలమున నారాయణ మొదలి వీధిలో చాలామంది వైశ్యులు కాపురముండుచుండిరి.

నేనుండిని యిల్లు వీధిమధ్య నుండుటవలన వచ్చువారికి, పోవువారికి తెల్లగోడ మీద వ్రాసిన బొగ్గు అక్షరములు పిలిచినట్లు కనబడుచుండుట వలన అందరు చదువుకొనుచు పోవుచుండిరి. ఈ ప్రకారము ఈ పేరు కొంతకాలమునకు అందరి నోటబడి క్రమముగ చిన్న వైద్యశాలగ మారినది. నేను కొంతకాలము ఆ వీధిలోనేయుండిన కన్యకాపరమేశ్వరి వైద్యశాలలో కొలువు చేసియుండుట వలనను, చాలామంది వైశ్యులు నాకు తెలిసినవారగుట వలనను వారందరు నా వద్దకు మందులకు వచ్చుచుండిరి. సాధారణముగ వైశ్యులలో చిన్నతనముననే వివాహమాడు ఆచారముండుట వలన చాలా మంది విద్యార్దులుగ నుండినప్పుడే వివాహమాడి గృహస్తులుగ నుండుట సంభవించుచుండెను. వీరిలో కొందరు వయసు వచ్చీరాని వారుండిరి. వీరలలో విద్య అలవడుటకు, పుష్టిగా నుండుటకు మందులు కావలసిన పలువురు నన్నాశ్రయించుచుండిరి. నేను తియ్యటి లేహ్యములను, కమ్మటి షరబత్తులను చేసి యిచ్చుచుంటిని. ఇందువలన నా వైద్యవృత్తికి చాలా లాభముగా నుండెను.

ఇల్లు చాలా చిన్నదగుట వలనను, పలువురు వచ్చిన కూర్చుండుటకు తగిన వసతి లేనందునను మరియొక యిల్లును ఆదియప్ప నాయుని వీధిలో పెద్దయిల్లుగా చూచి వైద్యశాలను అక్కడికి మార్చితిని. ఈ యింటకి వచ్చిన పిమ్మట మందులను బయట వూర్లకు కూడ పంపుటకు ప్రయత్నించి కొన్ని కరపత్రములను అచ్చువేయించితిని. ఒక గుమాస్తాను, ఒక బోయవానిని సహాయముగ కుదుర్చుకొంటిని. అచ్చువేసిన కరపత్రములను స్వయముగా సాయం సమయమున మద్రాసులో అక్కడక్కడ యున్న ఆఫీసులవద్ద నిలుచుకొని ఉద్యోగస్తులకు పంచిపెట్టుచుంటిని. వీలు చూచుకొని ఆఫీసులలోకి పోయి కొందరి ఆఫీసర్లకు మందులమ్ముచుంటిని. చిన్న క్యాటలాగులను అచ్చు వేయించి వాటినిగూడ తీసుకొని రైలు ప్రయాణములను చేయుచు పెద్దవూర్లలో దిగి, రెండు మూడు దినములు అక్కడవుండి, షాపులవార్ల వద్దకు వెళ్లి, మందుల ఆర్డర్లు తీసుకొనుచుంటిని. నేను కేసరి కుటీరం యేజంటునని వార్లకు చెప్పచుంటిని. వారలకు నాపేరు కె. నరసింహం అని చెప్పి నా విజిటింగు కార్డును యిచ్చుచుంటిని. ఆ కాలమున ఈలాంటి వైద్యశాలలు తక్కువగుటవలన ఆర్డర్లు మెండుగా చిక్కుచుండినవి.

ఈ ప్రకారము వైద్యశాలను స్థాపించిన ప్రారంభదశలో అన్ని కార్యములను నేను స్వంతముగనే చూచుకొనుచు వైద్యశాలను దినదినాభివృద్ధి చేయుచుండుటవలన వైద్యశాలకు స్థలము అధికముగ కావలసి వచ్చి ఒక చోటునుండి మరియొక చోటికి అప్పుడప్పుడు మారవలసి వచ్చుచుండెను. ఆదియప్పనాయుని వీధినుండి మలయపెరుమాళ్ల వీధికి, పిమ్మట గోవిందప్ప నాయుని వీధికి, అటు పిమ్మట బందరు వీధికి మారితిని. ఈ ప్రకారము బాడుగయిండ్ల బాధను అనుభవించుచు స్వంతగృహమునకు ప్రయత్నించి, ఎగ్మూరులో యొకయింటిని వేలములో కొని ఆ పాతయింటిని పడగొట్టి క్రొత్తగ అన్ని వసతులకు సరిపోవునటుల ఒక గృహము నా కాపురముండుటకు, రెండవదానిలో ఆఫీసు అచ్చుకూటముల నుంచుటకు, రెండు భవనములను కట్టించితిని.