చిన్ననాటి ముచ్చట్లు/అవాంతర దశ

12

అవాంతర దశ

మేము బందరువీధిలో నుండగా 22-9-1914 తేదిన మొదటి ప్రపంచ యుద్దములో జర్మన్ క్రూయిజర్ 'యమ్డన్' మద్రాసుపై ఫిరంగిగుండ్లు వదలినది. రాత్రి 9 గం||లకు భోజనానంతరము యింటి వరాండాలో యుంటిని. అకస్మాత్తుగ సముద్రములోనుండి గొప్ప వెలుతురును శబ్దమును చూచితిని. ఈ శబ్దము ఏమైనది ఎవరికి తెలియక గుంపులు గుంపులుగా సముద్రతీరము వద్దకు పరువెత్తిరి. నేనును కొంతదూరము వరకు పోయి బర్మాషెల్ ట్యాంకులు భయంకరముగ తగలబడుట చూచి వెనుకకు తిరిగితిని, 'యమ్డన్' మద్రాసుపై అకస్మాత్తుగ ఫిరంగుల గాల్చి పరుగెత్తి పోయెను. 'యమ్డన్' పోయిన పిమ్మట మనవారు కోటలోనుండి సముద్రముమీద ఫిరింగీలను పేల్చిరి. ఆనాడు రాత్రి మద్రాసునుండి జనము దిక్కు తెలియక నలుదిక్కులకు పరుగెత్తిరి. ఇల్లు విడచి పోలేనివారు అక్కడనే వుండిపోయిరి. తెల్లవారగనే పురజనులు సముద్రము వద్దకు వెళ్లి ప్రేలిన ఫిరంగీగుండ్ల వుక్కుముక్కలను యేరుకొనిపోయి 'యమ్డన్' జ్ఞాపకార్ధము యింటిలో భద్రపరచుకొనిరి. నేనును ఒక ముక్కను తెచ్చితిని.

ఆనాటి ఫిరంగీగుండు ఒకటి హైకోర్టు ప్రహరీగోడకు - తూర్పుదిశనున్న దానికి తగిలినది. దానివల్ల ఆ గోడ కొంత బొక్క పడినది. ఆ విశేషమును తెలుపుచు నా గోడను రిపేరు చేసినప్పుడా చోటు నీ క్రింది విధముగా నొకరాతిపై చెక్కించి గోడలో నమర్చియున్నారు. '1914 నెప్టెంబరు 22వ తేది రాత్రి జర్మన్ క్రూయిజర్ 'యమ్డన్' మద్రాసును ముట్టడించినప్పుడు ఒక గుండు ఈ ప్రహరీగోడకు తగులగా ఈ భాగమున కొంత గోడ ఎగిరిపోయినది'. జబ్బుగ యుండిన నా భార్య ఫిరంగి శబ్దములకు అదురుకొనగా స్మృతితప్పి క్రమముగ తెలివివచ్చెను. అప్పుడది జరిగెను. రెండవ ప్రపంచ యుద్దములో 1941 డిశంబరు జనవరి నెలలో జపాను ఓడలు మద్రాసుకు వచ్చుచున్నవని పుకారు కలిగినప్పుడు మద్రాసు జనమంతయు నలుదిక్కులకు పారిపోయినప్పుడు నా భార్యయు ఒంగోలుకు పోయి మా బంధువు చివుకుల శ్రీరామశర్మగారి యింట మరణించెను.

ఆమె క్రతువులు గడిచిన పిదప కొన్నాళ్లు నేను మద్రాసులో ఉంటూ ఉండగా బర్మాలో జపానువారు విజృంభించుకొలది సింగపూరు పడిపోయిన పిదప జపాను సేనలు ఏనాడో మద్రాసులో దిగునన్న భీతాహము ప్రజలలో హెచ్చసాగెను. రోజు రోజును వందలు వేలు జనము మద్రాసు విడిచి ఇతర ప్రదేశములకు వెళ్లిపోజొచ్చిరి. ఏప్రిల్ 1, 2 తేదులనుండి కలకత్తాలో బాంబులు పడినవని పట్నములో పుకార్లు రేగినవి. 3వ తేది మాయింట మహాదేవయ్య పెండ్లి, 4, 5-పై వార్తలింకను ప్రబలమైనవి. 6వ తేది మధ్యాహ్నమున మద్రాసులో తీరమునకు సమీపముగా శత్రునౌకలు తిరుగుచున్నవనియు, ఎప్పడైన దాడి జరగవచ్చుననియు, ఈ సారి ఊదబోవు హెచ్చరిక బాకా అభ్యాసమునకు గాక, వాస్తవమే అని తలచుడనియు - ప్రభుత్వమువారు శబ్దవిస్తరణ యంత్రసాయము నగరమంతయు చాటిరి. 22-9-1914 నాటి అనుభవము తిరిగి స్మృతికి వచ్చెను. నేనును, బంధువులను స్తలాంతరమునకు పంపుటకై రైలుకు వెళ్లియుండి, మిత్రుల బంధువుల బలవంతమున పట్నము వదలి వెళ్లితిని. ఉన్నవారు చిల్లర దొరకక, తినుటకు వస్తువులు దొరకక, హోటళ్లలో కాఫీయు దొరకక చాల బాధపడిరట. 14, 15, 16 తేదులలో పట్నం ముప్పాతికకుపైన ఖాళీ అయినదట. పిదప క్రమముగా తిరిగి పూటుకొన్నది. అప్పుడారునెలల పర్యంతము 'కేసరీ కుటీరం' ఆఫీసును తిరుచూరుకు మార్చితిమి. నేను ముగ్గురు పిల్లకాయలను దగ్గరదీసి పెంచి పెద్దచేసితిని. వారిలో మొదటివాడు శిష్ట్లా శేషగిరి. వీడు నాకు దగ్గిర బంధువు. వీడిని యింటర్ ప్యాసు చేయించితిని. పిదప గవర్నమెంటు ఇండియన్ మెడికలు స్కూలులో చేరి LL.M. డిప్లొమాను పొందెను. నా యనుభవమును వానికి బోధించితిని. క్రమముగ అన్ని కార్యములలో సమర్థత కల్గిన పిమ్మట కేసరి కుటీరమునకు వైద్యుడుగను, ఆఫీసునకు మేనేజరుగను నియమించితిని. ఒంగోలు కాపురస్తుడగు శ్రీ చివుకుల శ్రీరామశర్మగారి పుత్రికనిచ్చి వివాహమును చేయించితిని. వీరిని నావద్దనే యుంచుకొంటిని. వీనియందు నాకు కలిగిన నమ్మకము, అనురాగమువలన కేసరి కుటీరమును లిమిటెడ్ కంపెనీగా మార్చునపుడు, వీడికి కొన్ని పేర్లనిచ్చి కంపెనీకి డైరక్టరుగ నియమించితిని. వీనికి బిడ్డలు కలిగి సంసారము పెద్దది కాగానే ఎగ్మూరులో నాకు వున్న యిండ్లలో ఒక యింటిని వీడిపేరట చేసి, వీడి కుటుంబమును నా యింట నుండి అక్కడికి మార్చితిని.

ములుకుట్ల మహాదేవయ్య. వీడు నా బావమరిది కుమారుడేగాక నా మేనమామ మనుమడు, ఆపేరటివాడు. వీనినికూడ చిన్ననాటినుండి చదువు చెప్పించి పెంచి పెద్ద చేసితిని. వీనికి రావు బహుదూరు కవికొండల బ్రహ్మయ్య పంతులుగారి కుమార్తె నిప్పించి పెండ్లి చేసితిని. భార్యాభర్తలకు కేసరి కుటీరమున నౌకరినిచ్చి నాయింటనే కాపురముంచితిని.

చివుకుల చెంచుపున్నయ్య. వీడు నా మరదలికొడుకు. వీడిని కూడ చిన్నప్పటినుంచి నావద్దనే పెంచితిని, వీడు ప్రస్తుతము 'గృహలక్ష్మి' పత్రికకు సంయుక్త సంపాదకుడుగాను, వీని భార్య సహాయకారిగను పనిచేయుచున్నారు. నెల్లూరిలో నాకు ముఖ్యస్నేహితులు మైదవోలు చంగయ్య పంతులుగారును, (Public Prosecutor), A. సంతానరామయ్య గారును (V.R.H. School, Headmaster) చుండూరి వెంకట క్రిష్ణయ్య గారును (Vakil), విస్సా రాజగోపాలరావుగారును (Vakil) యుండిరి. మొదటి ముగ్గురును గతించిరి. వీర్ల స్నేహమువల్ల నేను పలుమారు నెల్లూరికి పోవుచుంటిని. తిక్కన జయంతి ఉత్సవాదులలో పాల్గొనుచుంటిని. దసరా ఉత్సవముల లోను పాల్గొనుచుంటిని. గృహలక్ష్మీ స్వర్ణకంకణ బహుమానములను శ్రీమతి కనుపర్తి వరలక్ష్మమ్మగారికిని, శ్రీమతి చిలకపాటి శీతాంబగారికిని, శ్రీమతి కవితిలక కాంచనపల్లి కనకమ్మ గారికిని, శ్రీమతి కమలాదేవిగారికిని నెల్లూరి పురమందిరముననే ప్రోగ్రసీవు యూనియన్ తరఫున యిచ్చితిని. మొల్లజయంతులను జరిపించి స్త్రీ రచయితలకు బహుమానముల నచ్చటనే యిచ్చితిని.

మద్రాసులో నెల్లూరి విద్యార్థుల సంఘము వుండేది. ఈ సంఘమునకు చేరిన విద్యార్థులును, నెల్లూరునుండి మద్రాసుకు వచ్చి ఉద్యోగములలో యున్న వారును కలసి ప్రతి సంవత్సరము వనభోజనమునకు సమీపమునయుండు తిరువత్తూరు, విల్లివాకము, అమింజికరె, అడయారు మొదలగు స్థలములకు పోయి అక్కడ ఒక దినమంతయు గడిపి మరునాడు యిండ్లకు వచ్చుచుందుము. ఈ విద్యార్థులందరు గలసి సుమారు 150 మంది యందురు. ఈ వనభోజనమునకు విద్యార్థులందరు చందాలు వేసుకొని కూడిన డబ్బును నావద్ద తెచ్చియిచ్చేవారు. మిగత కావలసిన డబ్బును నేను వేసి ఆ ఖర్చులన్నియు చేయుచుంటిని. పోయిన స్థలములో పిల్లకాయలు భలిగుడు యాటలు, చీట్లాటలు ఆడి భోజనానంతరము సమీపమున నుండు కొన్ని చూడదగిన స్థలములకు పోయి వచ్చుచుండిరి. చెయి తిరిగిన ఆంధ్రులను వంటకు తీసుకొనిపోయి మంచి తెలుగు వంటలను చేయించి పిల్లకాయలకు తృప్తిగ పెట్టుచుంటిని. విద్యార్థులను జూచిన నాకు ప్రేమ అధికము. పేద విద్యార్థులకు చాలమందికి చదువు చెప్పించితిని. విద్యార్థినులను, B.A.M.A. వరకు చదివించితిని. వారందరు కూడ మంచి ఉద్యోగములలో యున్నారు. నేను వారిని చూచినప్పుడు ఆనందించుచుందును. పరులకు చేసిన మేలును చెప్పుకొనకూడదను న్యాయము నాకు దెలిసినను, ఈ సందర్భములో చెప్పవలసి వచ్చినది.