చిన్ననాటి ముచ్చట్లు/అనుబంధము
అనుబంధము
నా జీవిత వృత్తాంతము
"దేహీతి వచనం కష్టం, నాస్త్రీతి వచనం తధా
దేహీ నాస్తీతి మద్వాక్యం మాభూత్ జన్మని జన్మని."
సోదర సోదరీమణులారా !
ఈ రోజున నా 73వ జన్మదినము. నేను ఈ చెన్నపట్నానికి వచ్చి సుమారు 60 సం||లైనది.
నేను వంగవోలు తాలూకాలో, ఆ పట్నానికి సమీపంగా ఉండే ఇనమనమెళ్ళూరు గ్రామంలో ఒక పేద కుటుంబమునందు, పూరి ఇంట్లో జన్మించినాను. మా యింటిపేరు కోటవారు. మేము వెలనాటి వైదిక బ్రాహ్మణులము. నేను జన్మించిన 5 మాసములకే హఠాత్తుగా మా నాయన గారు కలరా జాడ్యమువల్ల స్వర్గస్థుడైనాడు. జంధ్యాలు వడుక్కుంటూ వచ్చిన టెంకాయ చిప్పలో రూ. 0-10-0లు రొఖం మాత్రం నిలువచేసి వెళ్లిపోయినారు. అదీ నా పిత్రార్జితము. ఆ పిదప మాతల్లి ఎన్నెన్ని కష్టములోపడి 10, 11 సం||లు నన్ను కష్టము తెలయనివ్వకుండా పెంచి పెద్దవానిని చేసినది. నాకు ఊహ తెలిసినది. ఆమె కష్టము చూడలేకపోయినాను. ఒకనాడు మాగ్రామం వదలివెట్టి, కాలి నడకన, దారి మకాములు చేసుకుంటూ చెన్నపట్నం చేరుకున్నాను. ఆ రోజులలో రైళ్ళులేవు. ఎవరైనా బండ్లమీద, బక్కింగ్ హామ్ కాలువపై పడవలలో, లేనిచో కాలినడకతో చెన్నపట్నం రావలసినదే. నాకు కాలినడకే అనుకూలమైనది.
చెన్నపట్నం రాగానే కొత్వాల్ చావడివద్ద రావిచెట్టు అగ్రహారం ప్రవేశించినాను. ఆ అగ్రహారంలో ఉండేవారు పలువురు ఉత్తరాదినుంచి వచ్చిచేరిన పేదబ్రాహ్మణులు. వారందరు పౌరోహిత్యము చేసియో, లేక బిచ్చమెత్తుకొనియో జీవించేవారు. నేనున్నూ ఆ జట్టుతో చేరి వారి వలెనే జీవిత మారంభించినాను. ఆ కాలంలో చెన్నపురియందు బ్రాహ్మణులకు అన్నంపెట్టే ధర్మసత్రములు చాలా ఉండేవి. అయితే వాటిలో ఒకపూటే అన్నం పెడతారు. ఆ ఒకపూట తిని, ఉండడానికి ఇల్లులేని కారణమున, రావిచెట్టు క్రిందనే పడుకునేవాడిని. పసివాడను కావడంచేత రాత్రి ఆకలి వేసేది. ఒక్కొక్కరోజు ఆ ఆకలి తట్టుకోలేకపోయేవాడిని. అప్పుడు ప్రక్కనున్న కొత్వాల్ చావడికి వెళ్లితే, అక్కడ మొక్కజొన్న పేలాలు పడి రెండు దమ్మిడీలకు ఇచ్చేవారు. ఒక్క దమ్మిడీపెట్టి - అరపడి పేలాలు కొనుక్కొని తిని మంచినీళ్లు త్రాగి, రావిచెట్టు క్రిందికి తిరిగీ చేరి నిద్రపోయేవాడిని. ఈవిధంగా చెన్నపట్నంలో రావిచెట్టుక్రింద కాపురం కొన్నాళ్లు సాగించినాను. ఆ బ్రతుకు అసహ్యంగా తోచి చదువుకొందాము - అనే ధ్యాస కలిగింది.
పచ్చయప్ప కాలేజీ భవనానికి (జార్జిటవున్లో) ప్రక్కన బందరు వీధి అనియొక వీధి ఉన్నది. ఆ వీధిలో - రామానుజాచారిగారని యొకరు, వీధి బడి పెట్టుకొని చిన్నపిల్లలకు చదువులు చెప్పేవారు. పిల్లల తలిదండ్రులవద్ద జీతాలు పుచ్చుకొనేవారు. విద్యాతురుడనైన నేను తిన్నగా వారి నాశ్రయించి, జీతము లేకుండా చదువుచెప్పేటట్టు, వారి అనుగ్రహం పొందినాను. వారి అనుగ్రహం పొందిన విద్యార్థిని కావడంచేత వారి ఇంటికి వెళ్లి, వారికి శుశ్రూష చేసేవాడిని. వారు నాయందు దయగలిగి చనువుతో నాచేత కాళ్లు పట్టించుకొనేవారు; ఇతరమైన ఇంటి పనులు చేయించుకొనేవారు. నాయందనుగ్రహించి ఉచితంగా విద్యాదానం చేసే గురువునకు అరమరికలు లేకుండా సపర్యలు చేసేవాడను. వారి వద్దనే రుక్మిణీ కళ్యాణం, గజేంద్ర మోక్షము మొదలైన పద్యకావ్యములు ఆర్థసహితంగా చదువుకొన్నాను. కాని చూచేకొద్దీ ఈ చదువు, బ్రతుకు తెరువుకు పనికిరాదని తోచినది. ప్రైవేటుగా నాలుగు ఇంగ్లీషు ముక్కలు నేర్వసాగినాను. ఇంగ్లీషు విద్యపై మనసు కలిగినది.
1889-లో టంకసాల వీధిలో శ్రీ సచ్చిదానంద యోగి రామనాథ శివశంకర పాండ్యాగారు, హిందూ థియొలాజికల్ హైస్కూలు స్థాపించి, ప్రధానాధ్యాపకులై నడిపింపనారంభించినారు. 1888లో క్రిస్టియన్ కళాశాలలో నొక ఆంగ్లేయాధ్యాపకుడు హిందూ మతమును దూషణ పూర్వకముగా అపహాస్యం చేయుటచే నాటి హిందువులలో అలజడి బయలుదేరింది. కొత్తగా వచ్చివ ఆంగ్ల విద్య నేర్చుటతోపాటు బిడ్డలు మతాంతరులు అవుతారనే భయము కలిగినది. దాని ఫలితంగా నీ హిందూథియలాజికల్ హైస్కూలు ఏర్పడినది. శ్రీపాండ్యాగారు సంస్కృతాంధ్ర ఆంగ్లభాషా కోవిదులు; ప్రెసిడెన్సీ కాలేజీలో బి.ఏ. ప్యాసైనవారు, దైవచింత గలవారు; వారి నాశ్రయించి తిన్నగా ఆ పాఠశాలలో జీతము లేకుండా చదువుకొనే వసతి (Scholarship) సంపాదించినాను. వారొకనాడు క్లాసుకువచ్చి - విద్యార్థుల రిజిస్టరులో పేరులు చదివి హాజరు వేయుచుండిరి. కె. నరసింహం' అనగానే ఇద్దరము ఆ పేరు గలవారము లేచి నిలచినాము. ఇద్దరికి ఒకే పేరు చిక్కుగా ఉన్నది, అని వారు తలచి - నాయందు చనువుచే నావంకచూచి - 'నీ పేరు అర్థము చెడకుండా కొద్దిగా మారుస్తాను' అన్నారు. నేను సమ్మతించినాను. అంతట - 'కోట నరసింహం' అనే పేరులో 'సింహం' అర్థముగల 'కేసరి' పదమును సింహమునకు బదులుచేర్చి - 'కోట నరకేసరి' అని మార్చిరి. నేను అంగీకరించితిని. అది మొదలు నా మిత్రులందరు నన్నా పేరటనే పిలువ నారంభించిరి. పాండ్యాగారి దయవల్ల జీతమైతే అవసరము లేకపోయిందేగాని, పుస్తకాలకు, గుడ్డలకు, భోజనానికి ఇబ్బంది మాత్రం అట్లాగే ఉన్నది. భోజనానికి కొన్ని ఇండ్లలో వారాలు ఏర్పాటు చేసుకొన్నాను. పుస్తకాలకు, గుడ్డలకు - ఆ ప్రాంతంలో వ్యాపారం చేసుకొనే కోమట్లవద్ద నెల 1 కి తలా రూ. 0-4-0 చందా ఇచ్చే ఏర్పాటు చేసుకొన్నాను. ఒకనాడు కొన్ని పుస్తకాలు కొనవలసి వచ్చినది. ఇంకా నెలసరి చందాలిచ్చే గడువు రాలేదు. జార్జిటౌను ఆదియప్ప నాయక్ వీధిలో పై చందాలిచ్చేవారిలో వకరి వద్దకు వెళ్ళి - 'మీరు మామూలుగా ఇచ్చే రూ. 0-4-0 లు అటుంచి - మరొక్క పావులా అదనంగా ఈరోజున ఇవ్వండి; పుస్తకాలు అగత్యంగా కొనవలెను' అని సాహసించి అడిగినాను. వారు దగ్గరకు రమ్మనిన, అడిగన తడవుగానే ఇవ్వబోతున్నారనే ఆశతో, ధైర్యముతో దగ్గరకు వెళ్లినాను. 'మామూలుగా ఇచ్చే పావులా గాక పైన ఒక పావులా వడ్డీగూడా కావాలా' అంటూ - చెళ్ళున చెంపకాయ గొట్టినాడు. అది దూసిపోయి నెమరు కణతన తగిలినది, స్పృహతప్పి పడిపోయినాను. ఆ శబ్దం విని సెట్టి భార్య లోపలనుంచి వచ్చినది. నా అవస్థచూచి 'ఆ పిల్లవానిని ఎందుకు అల్లా కొట్టా'వని మగని గద్దించి - చాలా నొచ్చుకొన్నది. లోపలకు వెళ్లి ఇన్ని మంచినీళ్లు తెచ్చి త్రాగమని ఇచ్చినది; త్రాగినాను. స్పృహ బాగా వచ్చిన తర్వాత ఆమె రూ. 1-0-0 తెచ్చి పుస్తకాలు కొనుక్కోమని నా చేతిలో పెట్టి పంపినది. రావిచెట్టు క్రిందకు చేరాను. తిరగీ జిజ్ఞాసలో పడ్డాను. రిక్తుడను. అవమాన పరంపరలతో చదువు సాగించడం దుర్లభమని తోచింది. నాకూ ఈ చదువుకూ దూరమని నిర్ణయించుకున్నాను. ఏదైనా నాకు తగిన ఉద్యోగంచేసి సంపాదించి పొట్టబోసుకుందాము అని యోచన కలిగింది.
ఏమి ఉద్యోగం చేతుమా అని ఆలోచింప నారంభించాను. ప్లీడరు గుమాస్తా చేయమని ఒకరు సలహా యిచ్చారు. ఒక వకీలుకు సిఫారసు చేసినారు. వారివద్ద గుమాస్తాగా చేరినాను. ఆ వకీలు నెలపూర్తి అయితేగాని జీతమివ్వబడడు, పని నేర్చుకో అన్నారు. నాకప్పచెప్పబడిన పని - వకీలుగారి గౌను, ఇంతంత 'లా' పుస్తకాలు - ఎద్దుమోత నెత్తిన పెట్టుకొని హైకోర్టు మెట్లు ఎక్కడం, దిగడం, నెల అయిపొయింది. అన్నానికి ఇబ్బందిగా ఉన్నది; జీతం ఇవ్వండి అన్నాను. 'ఇంకా పని నేర్చుకోనిదే; రెండు మూడు నెలలు నేర్చుకున్నాక - జీతం ఆలోచిద్దాము' అన్నారు. ఎన్నాళ్లు గౌను, "లా" పుస్తకాలు నెత్తిన పెట్టుకొని మోస్తూ - హైకోర్టుమెట్లు ఎక్కే, దిగే విద్య నేర్చెదను అని నాకు తోచింది. ఆ దినంతో దానిని వదులుకొన్నాను.
అప్పడే క్రొత్తగా 'ట్రాంబండి' వేసినారు. ట్రాంబండ్లలో కండక్టరుగా చేరుదామని బుద్దిపుట్టినది. దరఖాస్తు వేశాను. 'ఖాళీలేదు" అని జవాబిచ్చారు. అది అట్లా తొలగిపోయింది.
ఎవ్వరి సలహాలేకుండా నాలో నేను ఆలోచించుకో నారంభించాను. ఏదైనా ఉద్యోగం చేసే బ్రతకవలెను అనే నిశ్చయం ఇంకా దృఢపడ్డది. ఆ ఉద్యోగం, ఒకరి సలహా, సిఫారసు లేకుండా దొరకవలెను. అప్పటికీ ఇప్పటికీ - చెన్నపట్నంలో, రెండు ఉద్యోగాలు హెచ్చు విద్య అవసరం లేకుండా, ఏ సిఫారసు లేకుండా దొరికేవి ఉన్నవి. అందొకటి బ్రోకర్ పని, దీనికి తలగుడ్డ, కోటు, వల్లెవాటు, చేతికర్రో, గొడుగో, చెప్పులు. ఇట్టాకొంత వేషం, భేషజం ఉండవలె.
రెండవది : నాటు వైద్యం. ఆయుర్వేద వైద్య విద్య నేర్పే పాఠశాలలు ఆ రోజుల్లో మద్రాసులో లేవు. ఆ వైద్యవిద్య తెలిసినవారి వద్ద గురుకుల వాసం చేసి నేర్వవలసినదే. ఒక నంబి ఆచార్లవద్ద, ఒక శాస్త్రులగారివద్ద ఆ విద్య నేర్చినాను. ఆ నంబి ఆచార్లగారికి శాస్త్రము విశేషమేమీ తెలియదు. తాతముత్తాతల నాటినుండి అనుశృతంగా వచ్చే వైద్యవృత్తి మాత్రం అవలంబించినారు. వారుచేసిన కుప్పెకట్టు కొన్ని వీరివద్ద ఉన్నవి. వాటిసహాయంతో అనుభవంకొద్దీ ఆయన 'సంచికట్టు' వైద్యం సాగించేవారు. ఆయన నాకు నేర్పగలిగిందేముందు? ఏదో ఇంతమందు కల్వంలో వేసి, ఇన్ని నిమ్మపండ్ల రసం పిండి మర్దన చేయమనేవారు. ఎంతకాలం అట్లా మర్ధనచేస్తే నాకు విద్య అంటుతుంది? ఆయనను వదిలిపెట్టినాను.
మహదేవ శాస్త్రిగారు వైద్యశాస్త్రం తెలిసినవారు. వారివద్ద కొంతవరకు శాస్త్రరీత్యా విద్య నేర్చినాను. వైద్యగ్రంథములు చదివి వైద్య రహస్యములు బోధపరుచుకున్నాను. కొన్ని మందులను తయారుచేసి, కోమట్ల ఇండ్లలో వైద్యం చేసేవాడను. శ్రీ పాలూరి రాజం శెట్టిగారు నీలిమందు వర్తకం చేసేవారు. వర్తకులలో ప్రముఖులు, కన్యకా పరమేశ్వరీ దేవాలయపు ఆస్తికి ట్రస్టీలలో ముఖ్యులు, సరిగా ఆ కాలమందే వారు కన్యకా పరమేశ్వరీ ధర్మ ఆయుర్వేద వైద్యశాల అని యొకటి స్థాపించినారు. దానిలో శ్రీ పండిత డి. గోపాలాచార్యులు గారిని వైద్యులుగా నియమించినారు. శ్రీ రాజంశెట్టిగారికి నేను తరచుగా పుల్లటి మందులు పెడుతూ ఉండేవాడిని. వారు దానికని నాయందెంతో దయగా ఉండేవారు. ఆ పరిచయంచేత వారు మిగత ట్రస్టీలకు సిఫారసుచేసి, నన్ను కూడా ఆ కన్యకా పరమేశ్వరీ ట్రస్టు ధర్మాయుర్వేద వైద్యశాలలో ఆచార్లగారికి సహాయ వైద్యులుగా నియమింపచేశారు. నేనూ ఆచార్లు గారూ కలిసి ఆ వైద్యశాలలో, 4 సం||లు పనిచేశాము. పిదప వారికీ నాకూ సరిపడలేదు. నేను ఆ ఉద్యోగానికి రాజీనామా నిచ్చినాను. స్వయంగా, స్వతంత్రముగా 'వైద్యాలయం' ఏర్పాటు చేసుకొని, పొట్టపోసుకోదలచినాను. ఆ ధర్మవైద్యశాల యుండిన నారాయణ మొదలి వీధిలోనే, ఒక ఇల్లు నెల 1కి రూ. 1-6-0 కి బాడుగకు తీసుకొని, వైద్య మారంభించాను. మందులు చేసుకోడానికి కాపురముండడానికీ అదే యిల్లు. ఈ నూతన యత్నారంభం చేసిన రోజుననే - ఆయింటి వీధిగోడమీద, బొగ్గుతో, పెద్ద అక్షరాలలో, 'కేసరి కుటీరం - ఆయుర్వేద ఔషధశాల' అని వ్రాశాను. అదే నా అదృష్ట రేఖ ధరించిన మొదటి సైన్ బోర్డు (Sign Board) అప్పటినుంచీ ఇప్పటివరకు, ఈ వృత్తిలో కూడా నాకు చాలా కష్టములు కలిగినప్పటికి వాటినన్నిటినీ జయించుకొని, కొన్ని సంవత్సరములుగా ఏ ఇబ్బందియు లేక స్థిరపడినాను. ఇదీ నా నిజవృత్తాంతము.
'ఇన్ని కష్టములు పడిన్నీ చేసిన ఘనకార్యములేమిటి' అని మీరు నన్ను అడుగవచ్చును. చెప్పెదను.
చిన్నతనంలో ఇల్లు వాకిలి లేనివానినిగా చేసి నన్ను, రావిచెట్టు క్రింద కాపురము చేయించినందుకు - దేవుని మీద కోపం వచ్చి - నివసించడానికి మంచిభవనాన్ని నిర్మించుకున్నాను.
చిన్ననాడు విద్యకై పడిన కష్టములు మరువజాలక ఈ విద్యాలయం స్థాపించినాను.
చదువుకొనునప్పుడు నన్నాదరించి నాకు అన్నముపెట్టిన అమ్మల అమృతహస్తములను ఏటేటా 'గృహలక్ష్మి స్వర్ణకంకణము" అనే పేరుతో బంగారు తోడాలను తొడుగుతున్నాను.
ఇప్పడు మరొక కార్యం చేయదలచుకొన్నాను. నన్ను ఈ స్థితికి తెచ్చినది స్త్రీల ఆరోగ్యమునకై తయారుచేయబడుచుండిన 'లోధ్ర' అనే ఔషధరాజము. ఈ ఔషధమువల్ల నాకింత సంపాద్యము చేకూరినది. ఈ దినం స్త్రీల విద్యాభివృద్ధికై - లక్ష రూపాయలను స్కూలు కమిటీ పరముగా ఇచ్చుచున్నాను. ఈ ధనం వెచ్చించి "కేసరీ కన్యావిద్యాలయం" అనే పేరుతో ఆడబిడ్డలకు ప్రత్యేకంగా ఒక విద్యాలయం నెలకొల్పండి - అని ఈ కమిటీ వారిని కోరుచున్నాను.
'క్షణం చిత్తం క్షణం విత్తం క్షణం జీవిత మాపయోః
యమస్య కరుణా వాప్తి ధర్మస్య త్వరితా గతి'