చిత్తరంజనదాసుగారి జీవితచరిత్రము
చిత్తరంజనదాసుగారి
జీవితచరిత్రము.
శ్రీ పునుగు శ్రీకంఠము, బి. ఏ.,
గారిచే విరచితము.
చెన్నపురి:
వావిళ్ల రామస్వామిశాస్త్రులు అండ్ సన్స్ వారిచే
బ్రకటితము.
1923
దేశబంధు
చిత్తరంజన దాసుగారి
జీవితచరిత్రము.
శ్రీయుత చిత్తరంజన దాసుయొక్క పూర్వులుండిన విక్రమపురము తూర్పు బంగాళాదేశమునకు ఆభరణాయ మానంబై పద్మ, మేఘనా నదులచే నావృతమై యొప్పారుచున్నయది. ఇయ్యది ఒకానొకప్పుడు సింహళము, సుమిత్ర దీవులతోను అరేబియా దేశముతోను విస్తారముగ వ్యాపారము సలుపుచుండు వర్తకులకు నెలవై యుండెను. చీనా దేశమునందుండి భారతదేశమున బౌద్ధమతౌన్నత్యమును కన్నులారగని యానందించుటకువచ్చిన హయూన్ త్సాంగునకు ఉపాధ్యాయుఁడైన బ్రాహణరాజు శిలానద్రుఁడు జన్మించిన దిచ్చోట. సుప్రసిద్ధనాస్తికమతో పాధ్యాయుఁడగుదీపాంకుర శ్రీజ్ఞానుఁడు పుట్టినదిక్కడనే. నాలందలో ప్రశస్తిగాంచియుండిన బుద్ధదేవాలయపు విఖ్యాతిఁ జెందిన పూజారి వీరభద్రుఁ డనువాఁడు సైతమందే పుట్టెను. ఈవిక్రమపురమునకు 'టెలిర్ బాగ్' అను చిన్న గ్రామము మజరాగా నున్నది. ఈపల్లెయే స్వార్ధత్యాగపరాయణుఁడును, దేశబంధువును, విశేషశేముషీ యుతుఁడును, కలకత్తా న్యాయ వాదులలో నగ్రగణ్యుఁడును నైన చిత్తరంజనదాసుగారి పూర్వులుండిన స్థానము. చిత్తరంజనుని ప్రపితామహుఁడు బాబురత్న కృష్ణదాసు అతిధార్మికుఁడు. ఈరత్నకృష్ణ దాసు కుమారులలో జ్యేష్ఠుఁడు జగద్బంధుదాసుఁడు రాజషాహిలో గవర్నమెంటు ప్లీడరై యుండి మిక్కిలి ఖ్యాతిగడించెను. తాను గడించిన ద్రవ్యమునంతయు బీదలపాలు జేయుచు అడిగినవారికి లేదనక ఉపకరించుచు దానకర్ణుఁడను కీర్తిపొందెను ఈజగద్బంధుదాసుఁడు. అంతేగాక, కవులకు విద్వాంసులకు సైత మీతఁడు కల్పవృక్షమై యుండెను. ఈతని సద్గుణములె మన చిత్తరంజనుని యందు నెలకొనినవి. చిత్తరంజనునితండ్రి తండ్రి బాబు భువనమోహనదాసు. ఈతఁడును కలకత్తా హైకోర్టునందు అటర్నీ వృత్తిని స్వీకరించి న్యాయవాదియై ఖ్యాతిగాంచెను.
భువన మోహనుఁడు వృత్తియందు న్యాయవాది యైనను దేశక్షేమమునకై హృదయపూర్వకముగ పాటుపడవలయునను సంపూర్ణో ద్దేశము కలవాఁడు. బ్రహ్మసమాజోద్యమాభివృద్ధికి తన యావత్తుశ క్తిని వినియోగించుచుండెను.
న్యాయవాద వృత్తియందు విస్తారధనము నీతఁడు గడించి బీదలగు తనచుట్టాలకై యాధనమును వెచ్చించుచుండినందున చేత నొక్కకాసైనను నిలువనుంచికొన్నవాఁడు కాఁడు. ఇట్లు ఆర్జించిన ద్రవ్యమునంతయు వెచ్చించి అప్పులపాలై వృద్ధాప్యము నందు ఇన్ సాల్వెంటని హైకోర్టుగుండా పత్రమును బొంది అప్పులవారిబాధను తొలగించికొనవలసిన వాఁడయ్యెను.
బాల్యదశ.
ఇట్టి సుప్రసిద్ధన్యాయవాదులయొక్కయు, దాన ఔదార్యగుణయుతులయొక్కయు వంశమున కలకత్తానగరమున భువనమోహనునకు 1870-వ సం॥ ననంబరు 5-వ తేదినాఁడు మన కథానాయకుఁడు చిత్తరంజనుఁడు జన్మించెను. శైశవము గడింపగానే చిత్తరంజనుఁడు భవానిపురము నందుండు లండన్ మిషనెరీ సొసయిటీ స్కూలునందుచేరి 1886-వ సంవత్సరము ప్రవేశపరీక్షయం దుత్తీర్ణుఁడయ్యెను. పిదప కలకత్తా ప్రెసిడెన్ సీ కాలేజి ప్రవేశించి 1890-వ సంవత్సరము బి. ఏ. పట్టము నొందెను. వెంటనే ఇండియన్ సివిల్ సర్వీసు ఉద్యోగ పరీక్ష నిచ్చుటకు ఇంగ్లాండుకు తర్లెను. సివిల్ సర్వీసు పరీక్షా పత్రములనువ్రాసి ఫలితమునకై వేచియుండఁగా భారతపితామహుఁడు సుప్రసిద్ధ దాదాభాయి నౌరోజీ పార్లమెంటు సభ్యుఁడగుటకు యత్నములు సేయు చుండెను. ఆయుద్యమమున చిత్తరంజనుఁడు పాల్గొని అనేక రాజకీయోపన్యాసముల గావించి యశస్సు పొందెను. ఇట్లుండ ఒకానొక పార్ల మెంటు మెంబరు జోన్ ట్సు మే క్లీ ననువాఁడు భారతమహమ్మదీయులను బానిసలనియు, హిందువులు నిబంధనలపద్ధతి ననుసరించు బానిసలనియు దూషించగా చిత్తరంజనుఁడు ఆదూషణకు సహించక ఒకగొప్ప సభాసమావేశము గావించి ఆసభలో మెక్లీను అవసరపడి చెప్పిన మాటయందు తెలివి తక్కువను గన్పించినదే కాని మరియే అన్యమును కానరాదని ఒక తీర్మానమును చేసెను. ఇంగ్లాండునందు పత్రికలు ఈతీర్మానమునకై గొప్ప ఆందోళనము జేసెను. ఈయాందోళనాఫలితముగ వేరొకసభ లిబరల్ కక్షవారు గావించి దానికి గ్లాడ్ట్సను మహామంత్రిగారిని అధ్యక్షులుగా జేసి ఆసభలో చిత్తరంజనుని హిందూదేశపు స్థితిగతులను గుఱించి యుపన్యాసమును గావింపమనిరి. ఆ సమయమున తనవాగ్ధోరణిని, యుక్తియుక్తమును, చాతుర్యమును, దేశభక్తియుతమును నై నదానిని ఆసభవారికి మిక్కిలి ధైర్యముతో దెలుపుచు “పార్ల మెంటుసభలో సభ్యులు పలుమారు భారతదేశమును ఆంగ్లేయులు తాము ఆయుధబలిమిచే జయించిరనుటయు, దానిని కృపాణప్రయోగ . ముననే కాపాడవలయు ననుటము పొరబాటు. వారు భారతదేశమును నీతిబలముచే సాధించిరి. బాహుబలమున సాధించినామనుట బొల్లు. ఈమాటలను వినుట భారతీయునకు మిక్కిలి వ్యథగా నుండును. ఇట్లు వచించుట ఆంగ్లేయునకు కడునీచ మైయుండును.” ఈమాట లాసభ్యులమనసున కెక్కి మెక్లీనును తనపొరపాటుకై పార్లమెంటు సభ్యత్వమునకు నిర్బంధముగా రాజీనామా నొసంగునట్లు చేసినవి.
ఈయాందోళనము నంతయు ఇంగ్లాండునందలి నిరంకుశాధికార దొరతనపువర్గము కనిపెట్టుచుండి సివిల్ సర్వీసు పోటీ పరీక్షలలో జయముగాంచుటకు వలయునన్ని గుణములకంటె ఎంతో హెచ్చుగా వచ్చియుండియు, చిత్తరంజనునిపేరు విజయమునొందిన వారిపేర్ల పట్టీలోనుండి తొలగించిరి. ఈయపజయము చిత్తరంజనుని కుటుంబమున విపరీత అశాంతిని గలుగఁ జేసినది. కుటుంబస్థితి మిక్కిలి దుర్దశలో నుండెను. పరీక్షలో జయము నొందియుండినచో ఇండియాదొరతనమున నేదో గొప్పయుద్యోగము లభించి కుటుంబమునకు జీవనాధార మేర్పడియుండునని కుటుంబమువారు తలంచిరి. అయితే విధిని ఎవరు తప్పింపఁగలరు? వెంటనే చిత్త రంజనుఁడు ధైర్యముచేసి బారిస్టరుపరీక్షకు చదువుటకై యత్నించెను. ఈదినములలో చిత్తరంజనునకు చేత కాసు లేక కొన్నాళ్లు ఉత్తనీళ్లుద్రాగి కాలక్షేపము చేయవలసినవాఁ డయ్యెను.
న్యాయవాదవృత్తి.
ఆంగ్లేయభాషలో సాహిత్యమును విశేషముగ గడించినవాఁడు కావున ఉపాధ్యాయవృత్తిని స్వీకరించవలయునని మాత్రము అభిలాష చిత్తరంజనునికి మెండు. అయితే, ఈవృత్తివలన విశేషధన మార్జించుటకు వలను లేదనియు, ధనమార్జించి ఎట్లైనను తండ్రి ఋణవిమోచనము గావింపవలయు నను ఉద్దేశము ఎక్కువగా నుండుటచే విధిలేక న్యాయవాదవృత్తిని 1893-వ సంవత్సరమున కలకత్తా హైకోర్టులో స్వీకరించెను. తండ్రి అప్పులనంతయు తానొప్పుకొని వానినంతయు చెప్పిన గడువు ప్రకారము ఇయ్య లేకపోవుటచే తానును ఇన్‌సాల్వెన్‌సీ పత్రమునకై పిటీషన్ కోర్టులో పెట్టవలసిన వాఁడయ్యెను. ఎట్టివానికిని ఏవృత్తియందును మొట్టమొదట విశేషధనము గడించగల అదృష్టము పట్టనేరదు. చిత్తరంజనుఁడు తన అపారమగు ధీశక్తిని చూపుటకు కాలము ఇంకను తటస్థించ లేదు. విస్తారమైన తెలివి ఎన్నటికిని దాగియుండనేరదు. దానివేండ్రమును అదిసమయము వచ్చినప్పుడు చూపియేతీరును.
1907, 1908 వ సంవత్సరములలో బంగాళమున నూతన ప్రబోధ మొకటి పొడమెను. బంగాళీలు దీర్ఘనిద్రనుండి లేచిరి. ఎటుజూచినను వారికి ఐరోపియను వస్తువంటె అసహ్యమైనది. కర్ణన్ ప్రభువు ఆకాలపు ఇండియా వైసిరాయిగారు. వారి ప్రభుత్వ విధానమంతయు బంగాళీలకు నచ్చ లేదు. స్వరాజ్యోద్యమము, జాతీయ విద్యాప్రారంభము, విదేశవస్తు బహిష్కారము ఈమూటికిని బీజము లాకాలములోనే బంగాళాయందు అంకురించినవి. మనదేశములో ఏదిపుట్టినను మొట్టమొదట బంగాళములో పుట్టవలయును. ఆర్యావర్తముసుమా! అది.ఋషులు వేదాలు పాడినది అక్కడ. జ్ఞానులు ఉపనిషత్తులు చెప్పినది అక్కడ. శాస్త్రులు శాస్త్రాలు రచించినది అక్కడ. కవులు కావ్యాలు వ్రాసినది అక్కడ. సరస్వతీమందిరాలు ఉన్నవి అక్కడ. విద్యాపీఠాలు వెలసినవి అక్కడ
పై యుద్యమములు మూఁడును ప్రారంభింపఁగా నే నిరంకుశాధికారవర్గము నిర్బంధ విధానములకు ప్రారంభించి నిరపరాధులగు ఉద్యమనాయకులపై ఏవో నెపములనిడి వారిపై అభియోగములను తెచ్చినది. మహామేధావి, జ్ఞానియైన అరవిందఘోషు జాతీయోద్యమనాయకుఁడు. మఱికొందఱు యువకులతో కూడ నిర్బంధ విధానమునకు లోబడవలసిన వారైరి. నిందితుల కేసును దొరతనపువారు పూర్ణముగ బలపరచిరి. నిందితపక్షమున వాదించుటకు మన చిత్తరంజనుఁడు పూనికొని తన దేశస్థులును, మహావిద్వాంసులు నైన అరవిందఘోషు వంటివారి చిక్కును వదలించుటకై కంకణము కట్టికొని ఈవ్యాజ్యమున తనకు ద్రవ్యలాభమే లేకపోయినను, డిఫెన్సు వాదమునకు కావలసిన సాక్ష్యమును సిద్ధము చేయుటకే ఆఱు నెలలు పట్టినది. వ్యాజ్యమా ఏడాది సాగినది. ఈలోపుగా ఇంటి సామాన్యఖర్చులకు కూడ చేత పైకము లేక పోయినది. పట్టుపట్టి నేర్పుతో వాదించి అరవిందఘోషుని నిర్దోషి యనిపించెను. ఇందువలననే ఈతఁడు కలకత్తా న్యాయవాదులలో నగ్రగణ్యుఁ డాయెను. న్యాయమూర్తులు తోటి న్యాయవాదులు ఎల్లవారును చిత్తరంజనుని బుద్ధి కౌశలము నెఱింగిరి. పిదప డక్కా రాజద్రోహనేరమున నిందితులతట్టు వాదించి వారిని నిర్దోషు లనిపించి విడుదల గావిం చెను. అప్పటినుండి ఆయన ఇంటినుండి పెద్దమ్మ తొలఁగి చిన్నమ్మ కాపురము కుదుర్చుకొన సాగెను.
తనతండ్రిగారి ఋణములను తాను దీర్చెదనని ప్రథమమున పూనికొని తీర్చలేక ఇన్ సాల్వెంటు పత్రమును దాఖలుచేసె ననియు, అట్లు చేయుటచే అప్పులవారిని మోసపుచ్చి కృతార్థుఁడు కావలయుననుట కాదని ఇదివరలో వ్రాసియుంటిమి. ఇప్పుడు ధనము చేకూరసాగగా తన పూర్వపు అప్పులవాండ్ర నందఱనుగూర్చి వారివారి కాతేదివర కచ్చవలసిన వడ్డితోటి అసలు పైకమంతయు నిచ్చి పిత్రూణమునుదీర్చి కృతార్థుఁ డయ్యెను. ఇట్టిచర్య కద్భుతపడి ఫ్లెచ్చరు అనున్యాయమూర్తి విడుదల కాఁబడిన ఇన్ సాల్వెంటు తనపాతబాకీల నొప్పికొని వాటిని వడ్డీసహా తీర్చుట చోద్యమనియు, ఇట్లు తీర్చిన చిత్తరంజనునివంటివానిని తాను చూచుట కిదియే ప్రథమమనియు బహిరంగమైన న్యాయస్థానమున నుడివెను. ఈయద్భుతమైన చిత్తరంజనునిచర్య వానిని మహానీతిపరుఁడుగను లోకోత్తరుఁడుగ నెన్నికొనునట్లొనర్చినది.
కలకత్తా హైకోర్టు కేసు లన్నింటిలో నొకతట్టు వాదము చిత్తరంజనునిదిగా లేని కేసేదియు లేదు. ఇట్టి విస్తారకార్య మగ్నుడై యుండుకాలమున నెల 1-కి సుమారు 50. వేల రూప్యములను గడించుచుండెను. బంగాళారాష్ట్రమునందే గాక ఇతరరాష్ట్రముల యందు ననేక వ్యాజ్యములలో వాదించి శిక్షనొంద సిద్ధముగ నున్న వారిని విడుదలగావించెను. ఏవ్యాజ్యమున నేతట్టుబూనికొన్నను ఆతట్టు తనయావచ్ఛక్తిని వినియోగించి తనపక్షముయొక్క విజయమునకై పోరాడును. వ్యాజ్యమును వాదించునపుడు పరమేశ్వరునిగురించి ధ్యానించు యోగివలె గాన్పించునుగాని న్యాయవాదిగ గాన్పించఁడు. ఆతని కియ్యఁబడిన ఫీజును ఆతఁడు మరల కక్షిదార్ల కియ్య నవసరము లేదు. కాని, ధర్మాధర్మముల నాలోచించి తానెంతవఱకు ధనమును కై కొనవలయునో అంత మాత్రమే పుచ్చుకొని మిగిలినదానిని కక్షిదార్లకు మరల నిచ్చి వేయుచుండవాఁడు. ఈకార్యమువల్ల కక్షిదార్లచే పొగడ్తకు మిక్కిలి పాత్రుఁడయ్యెను. బీదవారి కేసులను ధనము కై కొనకయే వాదించువాఁడు. ఇట్టి కార్యములచే కీర్తి మెండయ్యెను. చిత్తరంజనుఁడు ఇన్ని వ్యాజ్యములను వాదించుచుండియు సమయము తటస్థించినపుడెల్లను స్వరాజ్యమును గురించి ప్రసంగించువాఁడు. నాగపురమున కొక వ్యాజ్యసందర్భమున నేగియుండి ఆవ్యాజ్యమున తనకు ధనమేమియు విస్తారము రాకున్నను అచ్చటనుండిన హోంరూల్ సంఘమునకు విస్తారు ధనము నొసంగి తన అసాధారణ ఔదార్యమును నాగపురవాస్తవ్యులకు దెలిపెను. ఇట్లే రంగూను కేగి హిందూ దేశరక్షక చట్టముక్రింద నిందితుఁడైన తనమిత్రుఁడు మెహెతాగారితట్టు వాదించి వారిని విడుదల చేయించుకొని వచ్చెను. వేయేల? ఉదాహరించినచో నిట్టి వనేకములను చిత్తరంజనుఁడు పూనికొని వాదించెను. ఈతఁడు అతివాదియైనను, సత్యసంధుఁడని సర్కా రెఱింగి మ్యునిషన్ సుబోర్డువ్యాజ్యమున నీతనిని సర్కారువారు తమతరఫు న్యాయవాదిగ నేర్పఱచికొనిరి. ఎదుటిపక్షపువర్తకులు లక్షలకొలది ధనము తనకొసగుటకు యత్నములఁ గావించినను ఆసందర్భమున చిఱునవ్వునవ్వి దొరతనమువారితట్టు తాను వకాలతుతీసికొని ఆవర్తకు లిచ్చుధనమును గైకొని వారిని నిర్దోషులనిచెప్పి వ్యాజ్యమును కప్పిపుచ్చుటకంటె అధర్మప్రవర్తన వేఱొండుండ నేరదనెను. చిత్తరంజనుఁడు అవమానము నెంతమాత్రము సహించనేరఁడు. మోమోటములేక న్యాయస్థానమున నిట్టి దేదైననుజరిగినచో వెంటనే న్యాయమూర్తితో మందలించును. అప్పటికిని న్యాయము కలుగనిచో కోర్టునుండి తాను వెడలివచ్చువాఁడు. డక్కా రాజద్రోహ కేసులో నిట్టి సందర్భమున కోర్టును వెడలివచ్చెను మన చిత్తరంజనుడు. మఱియు ననేక కేసులను ధనము పుచ్చుకొనకయే వాదించుచుండినను నెలకు విస్తారధనమును సుమారు 50 వేల రూప్యములను గడించు చుండువాఁడు. ఎంతో స్వార్థత్యాగ మొనర్చి రాజకీయ కేసులలో నిందితుల పక్షమున ధనమును గైకొనకయే వాదించును. పంజాబువిచారణ సంఘమునందు నాల్గునెలలు కృషిసల్పి తనస్వార్థ త్యాగ పరాయణత్వమును గాన్పించెను. దేశసేవచేయవలసి వచ్చినప్పుడు తన అత్యధికమైన ఆదాయమును తటాలున వదలుకొని ప్రజలవేనోళ్ల పొగడ్తలకు పాత్రుఁడయ్యెను.
బంగాళాసారస్వతము - చిత్తరంజనుని సేవ.
చిత్తరంజనుఁడు రాజకీయ విషయములలో బ్రవేశించుటకు బహుకాలమునకు మునుపే బంగాళావాఙ్మయమును వృద్ధిపొందించుటలో నాతనిమేధాకౌశలమును వెల్లడించెను. 1895-వ సంవత్సరముననే బంగాళా భాషలో 'మలంకా' అనుగీతముల నాతఁడు రచించెను. ఈగీతములు వంగీయులకు స్వాభావికముగనే స్వాతంత్ర్యాభిలాషను జనింపఁ జేసినవి. 'మలంకా'లో కొన్ని గీతములు నాస్తికవాదమును బలపరచుచుండినదని చిత్తరంజనుని మీద బ్రహ్మసమాజమువా రప్రియమును జూపిరి. మలంకా గీతములను రచించిన వెనుకనే 1897 లో చిత్తరంజనునకు వివాహ మయ్యెను. మలంకా గీతముల భావములకు బ్రహ్మసమాజాధ్యక్షుఁడై యుండిన పండిత శివనాథశాస్త్రి, అనేకులగు బ్రహ్మసామాజీకులు కినిసి వీరి వివాహమునకు గూడ జనరైరి. 'మలంకా' రచనకు పిదప 'మాల', 'అంతర్యామి', 'కిశోరకిశోరి', 'సాగర సంగీతము'లను నాల్గు గీతములను చిత్తరంజనుఁడు రచించెను. ఈతని కవనధోరణి ఈనాల్గు గీతములలో వంగదేశమున విస్తరించెను. కొన్ని గీతములు వంగీయుల కుగ్గుపాలతోఁ బోసిన వైష్ణవ సిద్ధాంతముల బయలుపరుచును. కొన్ని గీతములు మిక్కిలి శృంగారమును చిప్పిలఁ జేయును. కొన్ని శోకరసమును దెల్పుచు నత్యద్భుతముతో పరమేశ్వరుఁడెందున్నాఁడో యని వెదకు పరమ భాగవతోత్తముని హృదయమును వెల్లడి పరచును.
కాని, ఈగీతము లన్నింటిలో సుప్రసిద్ధి గాంచినవి సాగరగీతములే. సంద్రమును వీక్షించగానేయాతని హృదయసీమఁ బొడమిన మనోహరము లగుతలంపు లత్యద్భుతముగా నీకావ్యగీతములలో వర్ణింపఁ బడియున్నవి. ఆరంభము మొదలు తుదవరకు ఈగీత ఈ పేజి వ్రాయబడి యున్నది. ఈ పేజి వ్రాయబడియున్నది. ఈ పేజి వ్రాయబడియున్నది. ఈ పేజి వ్రాయబడియున్నది. ములు శోకరసముచే బోషింపఁబడి హృద్యములుగా నున్నవి. వైష్ణవ మతమును ప్రబలపరచుటకు చిత్తరంజనుఁడు బంగాళావాఙ్మయమున నూతనమార్గమును ద్రొక్కెను. 'నారాయణ' యను మాసపత్రికను నెలకొల్పి దానికి కొంతకాలము సంపాదకుఁడై యుండెను. విద్వాంసు లనేకులు ఈపత్రికకు వ్యాసములను వ్రాసిపంపుచుండిరి. వాజ్మయమున కాతని సేవనుమెచ్చి 1915 వ సంవత్సరమున వంగదేశ సారస్వతసభవారు బంకీపురమునందు జరిగిన సాంవత్సరీక విద్వత్సభకు చిత్తరంజనుని అధ్యక్షునిగాఁ జేసిరి. ఆతని యధ్యక్షకోపన్యాసము గాక ప్రత్యేకముగా వంగీయగీతములను గుఱించి రమ్యమైన వ్యాసరచన గావించి సభలో చదివెను. మరుసటి సంవత్సరము డక్కాలో జరిగిన విద్వత్సభకు ఆహ్వాన సంఘాధ్యక్షుఁడై యుండెను. 'నారాయణ' మాసపత్రికలో వంగదేశ పద్యకావ్యములను గూర్చి అనేక వ్యాసములను వ్రాసెను. అవి వైష్ణవ మతగ్రంథములలో నాతనికున్న అపారపాండిత్యమును వెల్లడించెను. వైష్ణవ కవీశ్వరులయొక్కయు భాగవతుల యొక్కయు గొప్ప ఆదర్శములే చిత్తరంజనునకు మార్గదర్శకము లయ్యెను. వాని దేశభ క్తి కివియే మూలాధారములు. ఆతనిని చక్కగ నెఱుంగ గోరువారు ఆతని గ్రంథపఠనమును గావింపవలయును. ఆగ్రంథములను బోధపరచుకొనుటకు వంగదేశ పరిజ్ఞాన ముండితీరవలయును.
కుటుంబము.
మానవుని గుణములయొక్క అభివృద్ధి సామాన్యముగ నాతనికుటుంబముయొక్క పరిస్థితుల నాశ్రయించియుండును. చిత్తరంజనుఁడు సుగుణనిలయయైన తనతల్లిచేఁ బెంపఁబడి తనదేశమును నిజ జననియొక్క ప్రత్యగాత్మగా నెంచెను. తనతల్లిని తలఁచుకొనినప్పుడెల్లను చిత్తరంజనుని కన్నులనుండి జలజలనీరుబుకుచుండును. తన తల్లియొక్క దేశభక్తియే చిత్తరంజనున కాదర్శప్రాయమయ్యెను. ఆమె కడు ధీరవనిత; చాలనిదినములలో విధి బలీయమనుచు ఆమె తనయింటిపనులన్నియుదానే చేసికొనుచు భర్తకును బిడ్డలకును అన్న పానముల నమర్చుచు, లేమిడియందు కొన్ని సమయములలో నుపవాసములొనర్చి కాలయాపనజేసెను. ఆమె యోపికకును, ఉదారస్వభావమునకు, ఇంగితజ్ఞానమునకును పరోపకార పారీణత్వమునకును అనేక ఉదాహరణములున్నవి.
తలిదండ్రుల వియోగము.
మన చిత్తరంజనునకు ఆతని తల్లిగుణములు విశే షముగ పట్టుబడినవి. ఇట్టి తనతల్లియం దాతని యనురాగము మిక్కిలిగాఢము. కాని, ఆమె గతించు కాలమున నామె చెంతనుండుభాగ్యమును మాత్రము చిత్తరంజనునకుదైవము విధింపలేదు. ఆమె చిత్తరంజనుని సాగరగీతములను తనరొమ్ముమీద నిడికొని తనభర్తతో పునర్భవయైనప్పుడు తానొక ఇల్లాలైనచో చిత్తరంజనునివంటి సుపుత్రుఁడు తనగర్భమునం దుదయించవలయుననియే తన అంత్యకోకగా నుడివి ప్రాణములు వీడెను.
తల్లిగతించిన యాఱునెలల కే చిత్తరంజనుని తండ్రియు పరలోకగతుఁడయ్యెను. తలిదండ్రులకు అపరక్రియలను శ్రద్ధతో జేసి యాదినములలో బీదసాదలకు మృష్టాన్నమిడెను. అప్పటియన్న దానమును వంగ దేశప్రాంతపు బీదసాదలు ఇప్పటికిని మరువక పొగడుచుండువారు. అప్పటినుండి గృహకృత్యములను కుటుంబమునకు పెద్దవాఁడగుటచే వహింప వలసినబాధ్యతను చిత్తరంజనుఁడు ఈసందర్భమున నెన్ని యో కష్టములు సంప్రాప్తించినను వానినన్నింటిని సంతోషముతో నెదిరించుచు ధైర్యముతో కుటుంబయాత్రను గడపసాగెను.
సోదరీసోదరులు
వసంతరంజనుఁడను నాతని తమ్మఁడు కలకత్తా హైకోర్టునందు ప్రాముఖ్యతను పొందవలసిన బారిష్టరైనను అకాలమృత్యు ప్రాప్తినందెను. చిత్తరంజనున కిప్పుడు జీవించియుండుసోదరులలో పాట్నా హైకోర్టు నందలి న్యాయమూర్తులలో నొక్కరుగనుండు శ్రీయుత ప్రఫుల్లరంజనదాసుగా రొక్కరే. చిత్తరంజనుని సోదరి అమలాదేవి. కేవలము అపరశారదామూర్తినాఁబరగు. గానమునందు వంగదేశమున ఆమె అద్వితీయురాలు. కలకత్తాలో అనిబిసంటుగారి అధ్యక్షతక్రింద కాంగ్రెసుసభజరిగినప్పుడు 'వందేమాతరం' గీతమును కాంగ్రెసు సభాప్రారంభమప్పుడు ఆమెపాడి సభవారినందఱను చిత్రపుప్రతిమలవలె 15 నిమిషములు తన కంఠధ్వనియందు నిమగ్నులనుగఁ జేసి ఆనందాబ్ది నోలలాడించెను. అమలాదేవి మిక్కిలి పరోపకారపారీణత. తన సోదరుని ద్రవ్యసాయముచే గ్రుడ్డివారికిని, కుంటివారికిని, దిక్కు లేని వారికిని కలకత్తాలో నొక శంణాలయమును నెలకొల్పి ఇటీవలనే ఆమె కీర్తిశేషురాలయ్యెను చిత్తరంజనుని మఱియొకసోదరి తనభర్త మరణించుటచే బిడ్డలతో గూడ చిత్తరంజునుని పోష్యమున నుండవలసిన దయ్యెను. ఇంకొక సోదరి చిన్నతనమునందే మృతిఁ జెందెను. నాలవతోఁబుట్టువుసైతము తనభర్తను కోల్పోయి దేశసేవాపర తంత్రయై, బాలికలకు జాతీయవిద్యను గఱపుటకై నొకపాఠశాలను నిర్మించి దేశసేవచేయుచున్నది.
వివాహము.
1897 వ సంవత్సరమున బిజినీ సంస్థానమునకు దివానుగానుండిన, బాబు వరద హాల్దరనువారి కొమార్తె సుందరాంగి, విదుషీమణియగు వాసంతి దేవిని తనకు సహధర్మచారిణి గావరించి చిత్తరంజనుఁడు వివాహమాడెను. ఈమెగారికి విశ్వవిద్యాలయపు బిరుదు లేకున్నను ఇంటనే విద్యగఱపఁబడుటచే నతి విద్యావ్యాసంగమున కలవాటుపడి గొప్ప విద్వాంసురా లయ్యెను 1919 సం ॥ అమృతసరము నందు జరిగిన మహిళా కాంగ్రెసు సభకు ఈమెను అధ్యక్షురాలినిగా కోరిరి. అయితే అదివఱ కామె గోషాపద్ధతియందే యుండియుండినందున బహిరంగ సభోపన్యాసమును గావించుటకు కొంత స్త్రీసహజ లజ్జునుగాన్పించియుండినను పంజాబు దురంతముల విషయమున పరితాపముగలదై ఎట్టకేల కాపదవి నలంకరించుట కొప్పికొని తన యధ్యక్షకోపన్యాసమున భారతస్త్రీ లందఱును ప్రాచ్యాంగనలగు సీత, సావిత్రులను అనుకరించుటకే యత్నింపవలయు ననియు, కాలానుగుణ్యముగ సందర్భములను కొన్నింటినిమార్చవచ్చునేగాని భారతదేశముయొక్క సార్వ కాల కాదర్శములగు పాతివ్రత్యము, విధేయత మొదలగు స్త్రీ సహజగుణములను నశింపఁ జేయబూను కొనుట కేవల మాత్మహత్యజేసికొనుటకు సమానమనియు, సర్వకాలము నాసభలో గూడియుండిన వారెల్లగును భారతనారీమణు లే యనియు, ప్రాచీన పవిత్రవంతులైన భారత స్త్రీల సుగుణము లే తమవియనియు, వారివలెనే దామును పవిత్రవంతముగ తమకాలమును గడపి ప్రపంచమున ప్రశస్తి గాంచి చనవలయుననియు నుడివెను.
దానధర్మములు.
చిత్తరంజనుఁడు తనన్యాయవాదవృత్తియం దపరిమితధనార్జనను గావించెను కాని, ఆధనమంతయు తండ్రికై తానొనర్చిన ఋణములను దీర్చుటకై కొంతయు, విశేషముగ కష్టపడు బీదసాదలైన నిరుపేద లకొఱకు ధర్మార్థముగ కొంతయును వినియోగ పెట్టఁబడెను. తానార్జించిన ధనమును బీదలకు సద్వినినియోగపరచుటలో నాతనికుండు సంతోషమునకు మేర లేదు. తనకుండు సర్వస్వమును త్యాగముచేసిన గాని భగవంతునిసత్కృపాపాత్రత కెవ్వ డర్హుఁడగును? అసహాయోద్యమమున నాతఁడు ప్రవేశించి న్యాయవాదవృత్తిని వదలినప్పుడు కుటుంబభరణమునకు మూఁడు లక్షల రూప్యములను మరల ఋణ ముచేయవలసినంతటి దుస్థ్సితిపాలయ్యెను. ఇందుల కేమాత్రమును వగఁజెందినవాఁడు కాఁడు. చిత్తరంజనుఁడు కోరియున్నచో బంగాళముననుండు అనేక ధనవంతులగు జమీన్ దార్లవలె తానొక గొప్ప భూస్వామియై యుండియుండును. అయిన నిట్టిపదవులన్నియు 'మీసాలపై తేనియ' లని తలంచి చిత్తరంజనుఁడు బీదలపాలిటి కల్పతరువై తాను కష్టించి యార్జించిన యావత్తుధనమును ఆర్తత్రాణత్వమున వెచ్చించి తానిప్పు డొరులకు సకలసంపదల నొసఁగుటకు శక్తియుతుఁడగు నాదిభిక్షువైన శివునివలెనే భిక్షాటన యొనర్పవలసినవాఁ డయ్యెను. త్యాగిగానిదేమోక్షగామి కాఁడుగదా? ఈతని త్యాగమును గుఱించి వ్రాయబూనినచో గ్రంథము విస్తరించును. ఈతని గుప్తదానవిషయమున నొక్క కథ గలదు. ఒకానొకప్పుడు విద్యార్థియొక్కడు కలకత్తానగరమున తన ప్రవేశపరీక్ష రుసుముసైతము చేత లేక నల్లాడుచు ఇల్లిల్లు తిరిగి వేడుచుండగా నొకహితకారి ఆవిద్యార్థిని చిత్తరంజనుని సందర్శించమనెను. వెంటనే యావిద్యార్థి చిత్తరంజనుని గృహమునకుబోయివాకిలి ద్వారపాలకుఁడొకనిని చిత్తరంజనులెప్పుడు మేల్కాంతురు అని యడుగగా దౌవారికు డావిద్యార్థిని కసరిపంపెను. ఈసవిస్తారమును తనకు హితమొసంగినవానికి దెలుపగా నాహితకారి మరలనావిద్యార్థిని చాయగా చిత్తరంజనునిఇంటి కే పొమ్మని ద్వారపాలకులను సడ్డుచేయక ధైర్యముగా లోపలికి పొమ్మనెను. అట్లే వాడొనర్చి చిత్తరంజనుఁడు రాగానే తన గోడునంతయు దీనముగా చెప్పుకొనెను. ఆవిద్యార్థియొక్క సత్యమైన లేమిడిని గుర్తించి వానికి పరీక్షారుసుమునే ఇచ్చినది గాక పరీక్షకాలమగుపర్యంతము కలకత్తాలో నుండునప్పుడు భోజనవసతులకుసై తము అమర్చెను. ఇంతటి గొప్పవాఁడు ఎవరో అల్పుఁడగు విద్యార్థిని ఆదరించకపోయినను ప్రతిష్ఠకు లోటురాదు. అయినచిత్త రంజనుడు బాహ్యప్రతిష్ఠ పనికిమాలినదనియు, దీనులనాదరించినచో పరమేశ్వరుని ఆదరించునట్లే దృఢమైన నమ్మకము గలవాఁడు గనుక ఇట్టి గుప్తదానములను చిత్తరంజనుఁడు చేసినవి వేనవేలని చెప్పవలసియున్నది
చిత్తరంజనుఁడు బంగాళీవిద్యాపోషకుఁడు. అందలి వాజ్మయమునందు ఖిలమైన గ్రంథముల నచ్చొత్తించుటకు వలయుధనసాహాయ్యము నొనర్చెను. వంగభాషాసేవకు మితిలేని ద్రవ్యమొసంగెను. అనేక పాఠశాలలకు ధనమునిచ్చి పోషించెను. చెలాచియావైద్యశాస్త్రపాఠశాలాభవన నిర్మాణమున కితని ద్రవ్యము అపారముగ నొసగఁబడెను. బంగాళా సారస్వతాభివృద్ధికిగాను కూడెడు అనేకసభలకు ద్రవ్యమొసంగెను. వంగీయ సాహిత్యపరిషత్సభకు 350 అపూర్వ వంగీయగ్రంథముల నొసంగి కీర్తి గాంచెను. చిత్తరంజనుని ధనసాహాయ్యము పొందని సారస్వతసభ బంగాళాలోనే లేదనవలయును ఇట్టి వదాన్యుఁడును, లోకోత్తరుఁడును త్యాగియునైనవాఁడు వేఱొక డుండట అరుదు.
సాంఘిక దురాచారము.
చిత్తరంజనునకు పాశ్చాత్యవిద్యాప్రభావము నాస్తికమతాభిమానము జనింపఁజేసినది అయినను క్రమేణ ఈశ్వరునికృపచే వైష్ణవగ్రంథపరిశోధనలచే గాఢమగు వైష్ణవభక్తి జనించి కేవలము విష్ణుభక్తుఁడయ్యెను. ఈతని కిరువురు కొమార్తెలును, ఒక కొమారుఁడు గల్గిరి. వైష్ణవుఁడైనను సాంఘికాచారములయందు బ్రహ్మసమాజమువారి త్రోవలను ద్రొక్కుటయందే స్థిరచిత్తుఁడై అంతర్జాతీయవివాహాభిమానియై తన పెద్దకొమార్తె నొక కాయస్థ బ్రహ్మచారికిచ్చి వివాహము జేసెను. ఈవివాహమును జరుపుటకు బ్రాహ్మణ పురోహితుఁడు కూడదని బహుకాలము వాదించి వాదించి భార్య అడ్డు పెట్టగా తుదకు బ్రాహ్మణపురోహితునిగుండానే వివాహమును జరి పించెను. ఈయంతర్జాతీయవివాహమున కనేక విద్వాంసులు, మహామహోపాధ్యాయ పండిత: హరప్రసాదశాస్త్రి మున్నగు గొప్పవారు మెచ్చిరి. హిందూసంఘములో అనేక అశాస్త్రీయమైన దురాచారములు వాడుకలో నున్న వానిని రూపుమాపుటయే ప్రస్తుతదేశభక్తుల ప్రథమ కర్తవ్యాంశమని మన చిత్తరంజనుఁడు గాఢముగ నమ్మియుండెను. అట్లే తనకుటుంబములోనుండి దురాచారమును తొలగించుటకు కంకణము గట్టుకొని మొట్ట మొదట తనకొమార్తెనే అంతర్జాతీయవరునకు అదివఱకు బంధువే కానివాఁడును సజాతి మతస్థుఁడు నగువాని నొక్కని వెదకి యోగ్యుఁడగు అట్టివానికిచ్చి కృతకృత్యుఁడయ్యెను. తనజాతివారు కొంద ఱీసాహసకార్యమునకు తూలనాడిరి. చిత్తరంజనుఁడు చలించ లేదు. తన కొమారునిచే సైతము వైద్యకుటుంబ మొకదానియం దుండి కన్యకను దెచ్చి వివాహమాడించెను.
దేశ భక్తి.
“దేశసేవ జన్మసాఫల్యమునకు మూలము. నాకు దేశనామము తలంపునకు రాగానే భగవన్నామము సైతము స్మరణకువచ్చును,” అని చిత్తరంజనుఁ డొకప్పుడు తన యుపన్యాసమునందు నుడివియుండెను. దేశసేవ, దేశక్షేమము ఇవిరెండును వారికి హృదయాహ్లాదకరములు. వీనికై తన సర్వస్వమును దారపోసెను. సమయము తటస్థించినప్పుడెల్లను వానికై తనకాలమునంతయు వ్యయపరచుచుండెను. మన చిత్తరంజనుఁడు పల్లెటూళ్లలోనిప్రజల అనారోగ్య స్థితి, విద్యావిహీనత చిత్తరంజనుని చాలా చింతించున ట్లొనర్చినవి. మన హిందూజాతి ఉద్ధరింపఁబడవలయునన్నచో పల్లెటూళ్లలోనివారి దుస్థ్సితిని మానునట్లు యత్నించవలయును. విక్రమపురపు ప్రజాభివృద్ధికొఱ కొక సంఘమునేర్పఱచి ఆసంఘాభివృద్ధికై విశేషద్రవ్యసహాయముచేసెను. ఇట్లుండ 1919-వ సంవత్సరమున తూర్పుబంగాళా రాజ్యమును కాటక మావరించెను. జను లన్నములేక మడియసాగిరి. ఆ సమయమున చిత్తరంజనునిచే స్థాపింపఁబడిన పై సంఘము చిత్తరంజనుని సాయముచే కాటకనివారణ బహుకార్యములను చేసినది. ఇందుచే బీద లనేకు లోదార్పఁబడిరి. అంతేగాక పై సంవత్సరారంభమున తూర్పుబంగాళాలో గొప్ప తుపాను వీచెను. పద్మానది విస్తారమగు వెల్లువతో ప్రవహింపసాగినది, వర్షారంభమున కాటకమును వర్షాంతమున ప్రవాహమున్ను దేశము నింతింతనరాని ఈతిబాధలపాలొనర్చి పండిన పైరునకు, పశువులకు ప్రజ లకు చేసిననష్టమును వర్ణించి తీరదు. ఈప్రవాహముచే కొంపలు గోల్పోయినవారును, పైర్లు కొట్టుకొనిపోవుటచే బీదలైనవారును, వస్త్రహీనులును ఆకలిచే పస్తుపరుండిన వార్లును, వీరినందఱనుచిత్తరంజనుఁడు స్వయముగా వెళ్లి చూచి వెంటనే ఒకకష్టనివారక సంఘము నేర్పఱచి దానికై ధార్మికులను సందర్శించి గొప్పనిధిని సేకరించెను. ఆనిధికి తాను పదివేలరూప్యములను ధర్మార్థముగ నొసంగెను. గ్రామములలో కష్టపడు బీదలను గమనించి వారికి సాయపడుటకు గ్రామసంఘముల నేర్పఱచెను. ప్రతిబీద వానికి కొంత ధనమిచ్చి ఏదైన పరిశ్రమజేసి బ్రతుకునట్లు వీళ్లు కలిగించెను. ఇట్లు అనేక బీదలకుఁ దోడ్పడుచు దేశబంధువను బిరుదమునకు సార్థకుఁడయ్యెను. ఈమహానుభావునకు దేశభక్తియనగా సంఘభక్తియనియే భావము. ఈసంఘభక్తిచే కష్టపడుచుండు మానవకోటిపై అపారప్రేమ బొడగట్టెను. ఇట్టిప్రేమ తనలో జనించుటచే భగవంతుఁడు ప్రేమస్వరూపుఁడనియు, భగవంతుని స్వరూపములైన మానవులెల్లరును పూజార్హులనియు కావుననే మానవసోదరులను కాపాడిన భగవంతుని ఆరాధించిన ట్లగునని ఈతని పూర్ణమగు నమ్మకము.
బంగాళారాష్ట్రపు అధ్యక్షకోపన్యాసము.
1917 వ సంవత్సరమునబంగాళారాష్ట్రపు కాంగ్రెసుశాఖయొక్క వార్షిక సమావేశమునకు చిత్తరంజనుని అధ్యక్షునిగా నెన్నికొన్నప్పుడు తన అధ్యక్షకోపన్యాసమునందు భారతదేశమున సంఘసేవయు, దేశసేవయు రెండును ఒక్కటియే యని స్థిరముగా నిరూపించెను.
దేశస్థితినిగాని దేశపు దీనజనులనుగాని ప్రస్తుతము వంగీయులు గమనించరు. అందుకు కారణము వారు నేర్చుకొను విద్యయు, దాని పద్ధతియునే యని యాయుపన్యాసమునందు స్పష్టీకరించెను. నూతనవిద్య, నూతనవిద్యాపద్ధతులు, నూతన నాగరీకమున కలవాట్లు, ఇవంతయు జాతీయపద్ధతులను మార్చినదే గాక జాతీయవిధానమునంతయును నశింపఁ జేసినదనియు, బంకించంద్రుఁడు నుడివిన సంగతులను పలుమారు తనదేశస్థులు గమనించుచుండ వలయుననియు, విద్యావిధానమునంతయు ప్రస్తుతము మార్పొనర్చిన గాని మనజాతి కే నిలువనీడయుండక తప్పకజాతిసైతము క్షీణించుననియు నుడివెను. ప్రస్తుత నూతన విద్యాపద్ధతియంతయు విద్యాధికుల మనుకొను మనకును మనవారగు పామరజనులకును మధ్య పెద్ద అఖాతము నేర్పఱచెను. ఈయఖాతము నకు మనము సేతువు నిర్మింపవలయును. అట్లు సేతువు నిర్మించినగాని మనజాతీయపరిస్థితులు పునరుద్ధరింపఁబడవు; అని నుడువుచు ఆంగ్లేయులు భారతదేశమున కేర్పాటుగావించిన నూతనవిద్యాపద్ధతులలోని లోపముల నన్నింటిని వెలిబుచ్చెను. కావున బాలురకు విద్యావిధానమునంతయు దేశభాషలోనే గావింపవలయుననియు పరభాషయగు ఇంగ్లీషునందే నేర్పరాదని సిద్ధాంతముచేసెను. ఇంగ్లీషుభాషచే నేర్పడుదొసగు లింతింతనరాదనియు, పల్లెటూరిజనులకును మనకును ఈభాష సామీప్యమును చెందించదనియు, నట్లు చేయుటచే జాతీయభావములకు మనము వెలియై పోవుచున్నామనియు నుడివెను. మన జాతీయత యనగా నేదియో యది ఇప్పటికిని మన జీవనార్థము కష్టపడు వ్యవసాయదారుని గృహమునందు తాండవమాడుచున్నది. ఆవృత్తివానిని మనము నిరసించెదము. వానిని మన ఆంగ్లేయవిద్యగాని ఆంగ్లుల నాగరికముగాని ఆంగ్లన్యాయస్థానములు గాని చెరుపనేరదు. మనజమిందార్లుగాని ధనవంతులుగాని ప్రస్తుతపు మన ప్రభుత్వమువారుగాని క్షీణింపజేయలేని వ్యవసాయవృత్తిదారుని కంటె ఆగ్లేంయవిద్యనుచదివినామని విఱ్ఱవీగుఅల్పసంఖ్యాకులలో జేరిన మనమా అధికులము? ఇట్టి బూటకపు అహం కారమునుండియు, జాత్యాధిక్యమను డాంబికచర్య నుండియు మనము తొలఁగుటకు యత్నింపవలయును. పరమేశ్వరుని దివ్యమంగళ విగ్రహము మన బీదజనులలో తాండవమాడు చున్నదని గ్రహింపుఁడు. వారిని అనాగరకులని భావింపకుఁడు. వారు ఆపదలో నుండువానికి సాయమొనర్చెదరు. క్షుత్పిపాసాపీడితునకు అన్నోదకముల నొసగెదరు. వారు ఆపదలను గుర్తింతురు. ఆతిథ్య మొసంగుదురు. స్వార్థ త్యాగమును వలసినప్పుడు చేయుదురు. వరా యనాగరకులు? వారినేలమనము నిరసించవలయును? దీనస్థితియందుండువారని వారిని మీరెన్నుదురు. కోటానకోట్లుగ ఇట్టి స్వరూపములు భారతదేశములో నున్నవి. వారు హిందువులైనను సరేమహమ్మదీయులైనను సరే చండాలురైనను సరే క్రైస్తవులైనను సరే పార్సీజాతులైనను సరే అందఱను నారాయణస్వరూపములనియు వంగీయులంద ఱెన్నవలయును. వారితో మీసోదరులతో కలసిమెలసి యుండున ట్లుండుడు. అప్పటికిగాని మీదేశోద్ధారకపు కృషి ఫలించినదని తలపకుఁడు.
పల్లెటూరియందే మన జాతీయ నాగరకము కేంద్రీభూతమైయున్నదని తలంపుఁడు. దానిని అనాదరణచేసినచో మనయావద్వ్యవహారములును తప్పక క్షీణించినవని తలచుకొనుఁడు. పల్లెటూళ్లు ప్రజాక్షిణతను చెందినందులకు కారణములు రెండు. ప్రథమమున పల్లెటూళ్లలో ఆరోగ్యముచెడి జ్వరబాధ ఎక్కువయ్యెను. రెండవది నగరవాసవాంఛతో భోగాఫేక్ష, వ్యాపారవాంఛతో ద్రవ్యమును సేకరించుటకు జను లత్యాతురపడెదరు. కావున ప్రస్తుతపు మహాపట్టణములు ఘోర అజగరములవలె చిన్న చిన్న ప్రాకుడుజంతువులగు పల్లెటూళ్లను నశింపఁ జేయుచున్నవి. కావున మన కర్తవ్యధర్మములలో పల్లెటూళ్లయొక్క ఆరోగ్యమును, అభివృద్ధిని, క్షేమమును కాపాడుటకు యత్నించుటయే ప్రథమ గణ్యము. పల్లెటూరివానికి వలయు నీటిపారుదల, ఆరోగ్యపద్ధతి, విద్య వీని నన్నింటిని యేర్పాటు చేయుటకు మనము యత్నింపవలయును. వ్యవసాయ దారుఁడు పూర్వము ఆఱు నెలలు పొలములో పనిచేసి పని లేనికాలమున రాట్నమువద్ద కూర్చుండి వలయు నూలు వడికి నేతగానికి తానుధరించువస్త్రములకు గావలయు నూలు నందిచ్చుచుండును. కట్టుబట్ట తినుటకుతిండి సునాయాసముగా కర్షకుఁడు సంపాదించుకొనును.అట్టివ్యవసాయదారుఁడు ఈదినములలోమృగ్యమయ్యెను. వానితో గుప్తజీవనము సైతముపల్లెటూరును వదలిపోయినది. ధాన్యపుపాతరలు గాని, కూట్లుగాని, పల్లెటూళ్లలో పూర్వము ఏండ్లకొలది బంగారువాసననీనుఛుండునది కన్నులకు కలిక మయ్యెను. పంటలు తరిగెను; పాడియస లే లేదు. పచ్చని బయళ్లతో విరాజిల్లుచుండిన భూభాగములు ఎడారివలెగాన్పించుచున్నవి. గ్రామదేవత లారాధింపఁ బడవు. ఇలు వేల్పులను తలచువారే లేరు. దుక్కి టెద్దుల నమ్మి శిస్తుకట్టవలసిన కాలము తటస్థించినది. బీదరైతునకు ఊరి కాధారమైన చెఱువునందు నీళ్లులేవు. గుంటలు, బావులు నిర్జలములై నవి. వాడెట్లు జీవింపగలఁడు! వానికి ఆధారములను జేయుటకు ఊరియందు మనుష్యులు లేరు. ఉన్న వాఁ డశక్తుఁడు. ఇంక పల్లెటూళ్లు నశింపక వృద్ధియగు టెట్లు? ఊరుక్షీణించగనే జూతీయవిధులకు ఆకరములన్నియు నశించుచున్నవి. వ్యవసాయము క్షీణించెను; పరిశ్రమలన్నియు నశించినవి. రాట్నము, నేతమగ్గము, కమ్మరి యావము మొదలగు చేతిపనులకు సాధనములన్నియు నశించినవి. పల్లెటూరివాఁడు తనకు కట్టుబట్టకు మాంచెస్టరు యంత్రముల నాశ్రయించుచున్నాడు ,లాంకాషైరు వర్తకులదయకు పాత్రీభూతుఁడయ్యెను. వంట పాత్రములకు చీనావారి దయకును, ఆస్ట్రియావారి దయకును పాల్పడెను. ప్రమిదలా దీపముంచుకొనుటకు మాయములైనవి, గ్లాసులుబయలు దేరినవి, పల్లె విషయమును, వ్యవసాయదార్లకు రాత్రిబళ్లను, గ్రామ పరిశ్రమలను, వ్యవసాయవిద్యను, కుటుంబ ఆర్థికాభివృద్ధియంతయు ఈపంచాయతీదార్ల చే నుండగలదనియు, కొన్ని పెద్దగ్రామములలో ప్ర త్యేక పంచాయతీల నేర్పఱుపవచ్చుననియు, చిన్న చిన్న గ్రామములను కొన్నింటిని జేర్చి యీగ్రామముల యొక్క పంచాయతీల నేర్పఱుపవచ్చుననియు, ప్రతిగ్రామమునందును కాటకసమయమున గ్రామములోని బీదవాండ్ర సంరక్షణార్థము ధాన్యపు సేకరము గావింపఁబడవలయుననియు, ఈధర్మకూట్లకు యేటా ఫలితకాలమున గ్రామస్థులందఱు యధోచితముగ శక్తి ననుసరించి ధాన్యమును ధర్మముగా నొసగుచుండవలయు ననియు, ఈధాన్యపు కూట్లు గ్రామపంచాయతీదార్ల పాలనచే రక్షింపఁబడవలయుననియు, కాటకముసంభవించినపుడు పంచాయతీదార్లు ధర్మధాన్యకూట్లనుండి ఆగ్రామపు బీదజనులను అల్లాడ నీయక పోషింపవచ్చుననియు నిట్టి పద్ధతులతో గూడిన పంచాయతీపరిపాలన యేర్పాట్లనుకొన్నింటిని మిక్కిలి నేర్పుతో నాసభలో తనయుపన్యాసము నందు సూచించెను. గ్రామములోని స్వల్పతగవులను ఈపంచాయతీసభ వారు తీర్చిన మేరకు జనులు నడుచు కొనుచుండవలయుననియు, పెద్దతగవులను జిల్లా సభలలో ఫిర్యాదుచేయవలయుననియు, ఆజిల్లా సభ్యుల తీర్మానము ననుసరించియే ఉభయకక్ష దార్లును నడుచుకొనవలయును. పెద్దగ్రామములలో పంచాయతీలను గ్రామములోనుండు పెద్దలును నిష్పక్షపాతబుద్ధిగలవారు పదుగు రున్నప్పుడు వారిలోనుండి 5 గురిని అధికసంఖ్యాక సమ్మతులను బడసినవారినేరి ఏర్పఱచు కొనవలయును. చిన్నచిన్నపల్లెలు జనసంఖ్యప్రకారము పదిపల్లెలో అయిదుపల్లెలో ఒక నియమితజనసంఖ్య గలవిగా జేసికొని ఆపల్లెలలోని పెద్దలను నిష్పాక్షికబుద్ధిగల వారిని 5 గురిని పై పెద్దగ్రామములలోవలెనే యేర్పఱచుకొన వలయును. ఇట్లే ఈగ్రామపంచాయతుల నుండి జిల్లాసభ్యులను జేర్చవలయును. ఈజిల్లాసభ్యులు సుమారు 200 మొదలు 500 వఱకు ఉండవలయును. ఈజిల్లాసభ్యులు 1. గ్రామపంచాతీలుసరిగా పనిచేయుచున్నారా యని వారికి పై యధికారులుగ ప్రవర్తించవలయును. 2. పంచాయతీల కార్యవిధానములను ఈజిల్లాసభ్యులు సూచించు చుందురు. ఈజిల్లాసభ్యులు జిల్లాముఖ్యపట్టణము యొక్క ఆరోగ్యపరిస్థితికి, ఆపట్టణపు బాలురవిద్య కొనసాగుటకును పూచీదార్లుగనుందురు. 3. ఆజిల్లాసభ వ్యవసాయాభివృద్ధికరములగు సూచనలను చేయును; గ్రామపరిశ్రమాభివృద్ధికి పూచీగానుండును. 4. గ్రామముయొక్క ఆరోగ్యపరిస్థితులకు గ్రామపంచాయతీదార్లపై అధికారమును వినియోగించును. జిల్లాసభలో ఆరోగ్యశాఖకుజబాబుదారిగ ప్రవర్తించును. 5. జిల్లాలో నుత్పత్తికాఁగలవస్తువుల కాధారభూతములగు పరిశ్రామికాభివృద్ధికి ఈ జిల్లాసభలు తోడ్పడగలవు. 6. ఈజిల్లాసభలు చౌకీదార్లను, గ్రామోద్యోగుల నేర్పరచు అధికారము గలిగియుండును. 7. జిల్లాపోలీస పై సర్వాధికారము ఈజిల్లాసభ కుండును. 8. ప్రతిజిల్లాసభయును తమ సభ్యులలోనుండి అధ్యక్షుని ఒక్కరుని ఎన్నుకొనుట కధికారముగలిగియుండును. అనేక విషయములను చర్చించుటకు ప్రత్యేకసభలను గూర్చుట కధికారముగలిగియుండును. 9 ప్రతిజిల్లాకును ప్రత్యేక (బ్యాంకి) ధనాగారముండగలదు. ఈ బ్యాంకీలకు ప్రత్యేకశాఖా బ్యాంకీలు గ్రామములలో నుండును. 10. ఈ బ్యాంకీలకు వలయుధనమును ఆజిల్లాలో పన్నులను వేసి వసూలు పఱచుటకు ఆజిల్లాసభ కధికారముండును 11. ప్రస్తుతపు లోకల్ బోర్డులు జిల్లాబోర్డులు రూపుమాసిపోవలయును. 12. గ్రామసభలను, జిల్లాసభలను నడపుటకు ప్రత్యేక చట్టములను నిర్మింపవలయును. హిందూ సంఘమునకు వలసిన ముఖ్యమైన యేర్పాట్లయొక్క సూక్ష్మప్రణాళిక ఇట్టి నిబంధనలపై ఆధారపడవలయును. దీనికే స్వరాజ్యము, లేక గ్రామస్వపరిపాలనమని పేరు. ఇట్టిపద్ధతి మన దేశములో ప్రాచీనకాలమునందుండి సాగుచుండెను. ఇవి మనజాతీయతాభి వృద్ధితో పెరిగెను. వీనికని మనజాతీయతకును ప్రత్యేకమైన ఒద్దికగలదు. చిత్తరంజనుఁడు ప్రాచీన పద్ధతుల కే మనలను మరల్చెను. కాని, ఇందు నూతనము లేమియు లేవు. ఇట్లు సాంఘికాభివృద్ధికి, దేశాభ్యుదయమున కీ దేశభక్తుఁడు ఈపరోపకారి పాటు పడెను.
రాజకీయములు.
చిత్తరంజనుని దేశభక్తి కొంతవఱకు దెలిపితిమి. అతఁడు ప్రస్తుత రాజకీయవాతావరణమున ప్రవేశించుట మొదటి సందర్భము. ఆనిబిసెంటును మదరాసురాజధాని దొరతనమువారు నిర్బంధావాసమున నుంచుటతో ప్రారంభమైనది. 1917సం॥ జూలై 17 వ తేదీనాడు కలకత్తాపురజనులు ఆనిబిసంటును నిర్బంధించినందులకుగాను ఒక అసమ్మత సభాసమావేశమునుగావించిరి. ఆసభలో చిత్తరంజనుఁడు రాజకీయోపన్యాసమును గావించి తనకుండు ప్రస్తుతదొరతనపు విధానములోని అసమ్మతిని బయలుప ఱచెను. ఇట్లే ఆదినములలో పలువురు నిర్బంధింపఁ బడిరి. వారివిడుదలకుగాను చేసినసభలలో చిత్తరంజనుఁడు సభ్యులను తనయుపన్యాసమునందు మగ్నులనుగావించెను. చిత్తరంజనుఁడు ఏసభయందు ఉపన్యాసము చేయునాయని ప్రజలు ఆతురపడుచుండిరి. ఊఱక ఉపన్యాసమేగాక చెఱసాలల కంపఁబడిన వారి కుటుంబములు అన్నము లేక మలమల మాడు చుండ వారి కుటుంబములను తాను పోషించు నిమిత్తము కంకణము కట్టుకొని ఈవిషయములో నెలకు 4 లేక 5 వేల రూపాయలను వెచ్చింపసాగెను. ఇంతటికరుణాసముద్రుఁడు ప్రపంచముననే యుండుట అరుదని తన ప్రవర్తనవలన లోకులకు విశదీకరించెను. దేశాభిమానమును చూపువారు కొందఱు సభా వేదికలపై నిలిచి తమవాగ్ధోరణినిగన్పింతురు. కొందఱు కన్నీరు మున్నీరుగ కార్తురు. ద్రవ్యమును వెచ్చింపవలసి వచ్చినప్పుడు మాత్రము వెనుదీయుదురు. మనచిత్తరంజనుని దేశాభిమానము అట్టిదికానేరదు. రాజకీయనేరములకై చెఱసాలయం దుంపఁ బడినవంగీయు లనేకులు 1919 సం॥ డిసంబరు నెలలో విడుదలచేయఁబడిరి. వీరందఱును చిత్తరంజనుని ఇంట్లో ఒక సందర్భమున సమావేశమై తమకుటుంబముపట్ల చిత్తరంజనుఁడు చూపిన అపారమగుసాయ మునకై చలించి చిత్తరంజనునకు జూపిన తమవిధేయత వేనోళ్లపొగడఁదగినది. 1917 వ సంవత్సరమున కలకత్తాలోజరిగిన దేశీయమహాసభకు చిత్తరంజనుడు చేసినయుపకృతి అపారమైనది. బంగాళమునందు 1916 వ సంవత్సరమున స్వరాజ్యకలహములో చిత్తరంజనదాసు, శ్రీ చక్రవర్తి, విపినచంద్రపాలు — వీరు అగ్రగణ్యులు. 1917-వ సం. అనిబిసెంటమ్మను నిర్బంధమునుండి విడుదల చేయుటకుగాను కలకత్తాలో రాజకీయవిషయైకమగు సందర్భములలో తాను వ్యవహరించుటకు ప్రారంభించినది మొదలు చిత్తరంజనుఁడు ఈనాఁడువఱకు వెనుకడుగిడక తదేకదీక్షతో ఇండియా ప్రభుత్వముయొక్క నిరంకుశాధికారవర్గముతో నిర్భయముగా ఱొమ్మునుజూపి పోరుచునే యున్నాఁడు. 1909-వ సంవత్సరమునుండి నిరంకుశాధికారవర్గముయొక్క అధికారుల బారిబడి యనేకులు నేరస్థులై విచారణలకు వచ్చినప్పుడు వారికి సాయపడి వారితరఫున తాను వాదించి వారిని విడుదలజేయించి మహోపకార మొనరింపసాగెను. కలకత్తాలో ట్రంకు కూనీ కేసని యొకదానిలో పోలీసులచేత నిరువురు నిరపరాధులు దోషులై రి. నిష్కారణముగ నిందితులైన వీరివిషయమై చిత్తరంజనుఁడు జాలిగొని వారి తరఫున తాను వాదించి న్యాయాధిపతులకు వారు నిర్దోషులని తలంపుగొనునట్లుచేసి వారిని విడుదల గావించెను. ఇట్టివి లెక్కించినచో వానికి అంతము లేదు. 1918 వ సం॥ ఇండియామంత్రి మాంటాగూ గారు సంస్కరణలవిషయమై దేశములోని సంఘముల యాలోచనలను గైకొనుటకు ఇండియాకు రాగా దేశీయమహాసభతరఫున చిత్తరంజనుడును మఱికొందఱుగూడి యొకగొప్ప మెమోరాండమును సిద్ధపఱచి భారతమంత్రి యెదుట నుంచిరి. అంతేగాక 1918 వ సంవత్సరమున మహామంత్రిగారితో దేశక్షేమముల విషయమై ముచ్చటించవలసిన సంగతులను ఆలోచించుట కొఱకు ఆగష్టునెలలో దేశీయమహాసభకు సంబంధించిన భారతదేశీయప్రముఖులు బొంబయిలో సభఁ జేసిరి. ఆసభకు జనాబ్'; హాసాన్ ఇమాంగారు అధ్యక్షులు. ఆసభకు చిత్తరంజనుఁడు వంగ దేశమునుండి నూర్గురు ప్రతినిధులను తన స్వంతఖర్చు పెట్టి పిలుచుకొనిపోయెను. సభ ముగియగానే లోకమాన్య తిలకుగారు చిత్తరంజనులను, చక్రవర్తి మున్నగు వంగీయప్రతినిధులను మఱి ఇతరరాష్ట్రపు ప్రతినిధులగు కొందఱను పునహాకు విచ్చేయమని కోరగా వల్లెయని పునహాకువెళ్ళిరి. అప్పట్లో చిత్తరంజనునియొక్క సహజౌదార్యము, కార్యదీక్ష, ఆలోచనాశక్తి, దేశసేవాపరాయణత్వ మునకు లోకమాన్యులద్భుతపడిరి. ఇరువురకును మైత్రికుదిరెను. పునహాకు నీమహనీయులు విచ్చేయగా లోకమాన్యులొక సభఁజేసి వీరి నభినందించి దేశాభ్యుదయమునకు గాను ఈమహామహులు బూనియుండు తదేకదీక్షను కొనియాడుట కొక సభగావించెను. ఆసభకు బాబుమోతీలాల్ ఘోసు (అమృతబజార్ పత్రికాధిపతి) గా రగ్రాసనాధిపత్యమును వహించిరి. ఈ సభాసమా వేశా నంతరము చిత్తరంజనునికి లోకమాన్యుల యెడ అపరిమితమగు భక్తిజనించి ఆభక్తి లోకమాన్యుల మరణ పర్యంతమును ఇప్పటికిని తరుగనిదై ప్రకాశించుచున్నది. 1918వ సంవత్సరము దేశీయమహాసభ ఢిల్లీలోగూడెను. ఈసభకు మదనమోహనమాళవ్యాగా రగ్రాసనాధిపతులు. వారితోగూడ చిత్తరంజనులును దేశీయమహాసభకువిచ్చేసిరి -ఈసభ యొక్క విషయనిర్ధారక సంఘసమా వేశమునందు ఆనిబెసాంటమ్మ అయిదవజార్జి చక్రవర్తికొమారుఁడు మనయువరాజు భారతదేశ సందర్శనార్థమై రాఁబోవుచున్నాఁడు; ఆసమయమున దేశీయమహా జనుల తరఫున వారికి సన్మానపత్ర మొకటి అర్పింపవలయునని యొకతీర్మానమును తెచ్చుటకు యత్నింపగా చిత్తరంజనుఁడు దాని కాటంకముగా ఉపన్యసించి ఆతీర్మానము సభలో చర్చ కేరాకుండునట్లు యుక్తి యుక్తముగ మాటలాడెను.
1918 వ సంవత్సరమున కలకత్తాలో రాజకీయ కలవర మొకటి ప్రారంభముకాగా నందు చిత్తరంజనుడు ప్రవేశించి గొప్పన్యాయాధిపతివలే వర్తించి కలవరమును అంతమొందించి శాంతినినెలకొల్పను. ఇప్పుడే పాంచాల దేశమున సర్ మైకల్ ఓడ్వయరు యొక్క దుష్పరిపాలనక్రింద పాంచాలదేశమున ఘోరమరణములు, ఘోరహత్యలు, కొన్ని ప్రదేశములలో సైనిక పరిపాలనము, ఆపరిపాలనమునం దధికారులు గావించిన ప్రజపీడనము ఇవన్నియు భారతదేశమునందు ప్రజాహృదయమును కల్లోలపరుపసాగెను. అప్పట్లో చిత్తరంజనులు పాంచాలమునకు స్వయముగావెళ్ళి నిజపరిస్థితుల నరసివచ్చుటకు బయలు దేరగా దొరతనమువారు వీరిని పాంచాలమున కడుగు బెట్టగూడదని హెచ్చరిక జేసిరి. ఈ పాంచాలదురంతముల నాధారముగఁ జేసికొని మహాత్మగాంధిగారు సత్యాగ్రహవిధానమును భారతదేశమున ప్రారంభించెను. ఇది దేశమంతయు నల్లుకొని దేశములో నుండు జాతీయనాయకులందఱును ఈవిధానమును అవలంబించుటకు యత్నింపసాగిరి. చిత్తరంజనుఁడు సైతము ఆయుద్యమము పవిత్రవంతమనియు నిరం కుశాధికారవర్గముయొక్క చర్యకు నిరాయుధులగు భారతీయులకు తప్పక శరణ్యమని దీర్ఘాలోచనము చేసి తీర్మానించి, తానును ఉద్యమమునకు లొంగెను; పంజాబు దురంతములను విచారించుటకు దొరతనమువారొక కమిటీని ఏర్పఱచిరి. ఆకమిటీ నివేదికలో యథార్థము వెల్లడికాదని గుఱ్తించి కాంగ్రెసుసభతరఫున మహాత్మాగాంధి, చిత్తరంజనులు, జయకర్, తయాబ్జీ మున్నగు సభ్యులతోఁగూడిన నొకకాంగ్రెసు ఉపసంఘము అమృతసరములోఁ గూడి విచారణకు ప్రారంభించెను. నెలకు ఎన్నియోవేల రూపాయలను ఆర్జించుచుండిన చిత్తరంజను లీప్రజోపయోగ కార్యమగు పై కమిటీ సభ్యత్వమున కియ్య కొని రెండునెలలు తన న్యాయవాదవృత్తిని వదలి అమృతసరములోనుండెను.
1919-వ సంవత్సరమున అమృతసరమున డిసంబరునెలలో దేశీయమహాసభ కూడెను. ఇందు చిత్తరంజనులు సభకు నాయకమణియై ప్రకాశించెను. ఈసభాసమావేశమునందు మహాత్మా గాంధిగారును, చిత్తరంజనులును కొన్నితీర్మానములలో భిన్నాభిప్రాయు లైరి. ఇండియామంత్రి మాంటాగూగారికి దేశీయమహాసభ తరఫున వందనము లర్పింపవలయునను తీర్మానమునందు దేశీయనాయకులలో తీవ్ర మగు భిన్నభావములు జనించినవి. అయినను సభలో కలవరముకలుగక శాంతముగా, జయప్రదముగా ఆ యేటి కాంగ్రెసుసభ ముగిసినది. తాను తన మనస్సున నేది సరియని తీర్మానమునకు వచ్చునో దానిని అనాలోచితముగ తీర్మానించు స్థిరబుద్ధిగలవాఁడు చిత్తరంజనుఁడు. ఎదుటివాఁడు ఎట్టివాఁడైనను తన నిర్ధారించిన యోచనను పూనికతో నెరవేర్చువరకొక కాలిపై నిలుచునంతటి ధీరచిత్తుఁడు చిత్తరంజనుఁడు. కలకత్తాలో జరిగిన ఖిలాఫత్ విషయిక మహాసభలో గాంధిగారియుద్యమమునకు చిత్తరంజనులు వ్యతి రేకముగ పాటుపడిరి. ఈయుద్యమమున హిందువులు ప్రవేశించుట సరికాదని అప్పట్లో చిత్తరంజనుని తలంపు. అయితే ఈతలంపును మార్చి 1920-వ సంవత్సరమున జరిగిన ఖిలాఫత్తు విషయమైన మహమ్మదీయులసభకు చిత్తరంజనులు తోడ్పడి వారియుద్యమమున పట్టుదలతో పనిచేయుటకు ప్రారంభించెను. దేశీయమహాసభలో గాంధిమహాత్ముని తీర్మానము అసహాయోద్యమముపట్ల జయమొందెను. దాని ననుసరించి నెలకు 30, లేక 40 వేల రూపాయలను గడించుచుండిన చిత్తరంజనుడు తనన్యాయవాదవృత్తిని వదలవలసివచ్చెను. ఇంతత్యాగమున కొడిగట్టినవాఁడే గదా ఈమహనీయుఁడు.చిన్ననాట నుండి ద్రవ్యమునకై కష్టించి క్రమేణ తనవృత్తివలన ఆర్జించినధనమును బీదలకనియే వినియోగింప సాగి పిదప దేశసేవయే పరమధర్మమని దేశసేవాపరాయణుఁడై న చిత్తరంజనునివంటిత్యాగి ప్రపంచమున నుండుట అరుదు. ఇదివఱకు సీమగుడ్డలను ధరించుచుండిన చిత్తరంజనుఁడు ఖద్దరుగుడ్డలను ధరింపసాగెను. దేశమునకై భోగములను విడనాడెను. న్యాయవాదవృత్తిని వదలెను. ప్రజాసేవ కర్తవ్యమని పూనెను. ఇంతటిమహానుభావుని ప్రాచీన భారతఋషి, సాంప్రదాయపరుని, మహాత్యాగిని అహమదాబాదు దేశీయమహాసభకు భారత దేశపు సకలరాష్ట్రములవారును ఒక్కుమ్మడిగా అగ్రాసనాధిపతిగ నెన్నుకొనిరి ఈసమయమున భారతదేశములో గాంధిమహాత్ముని యుద్యమము తీవ్రముగ పనిచేయుటకు ప్రారంభించినది. ఈ యుద్యమమును మొదలంట నఱికివేయవలయునని నిరంకుశాధికారవర్గము వారు దీనికి ప్రతిచేయుటకు నిశ్చయించిరి. ఈప్రతినకు ఫలితముగా దేశములోని ఉద్యమనాయకులను వేనకువేలుగా నిర్బంధముచేసి కారాగృహములకు అధికారవర్గము పంపెను. దేశమంతయు ఘోరశాసనపీడితమయ్యెను. సేతు శీతాచలమధ్యోర్వి దేశనాయకుల నేరి యేరి జెయిళ్లకు పంపెను, అప్పుడే లజపతిరాయని లాహోరులో నిర్బంధించిరి. ఈమహామహుని నెఱుంగని భారతీయుఁడు లేఁడు. ఈపరోపకారి కాంగ్రెసునకు ఆత్మవంటివాఁడు. ఐరోపాసంగ్రామకాలమందు భారతప్రభుత్వమువారు వీరిని అమెరికానుండి భారతదేశమునకు రానీయక అడ్డు పెట్టిరి. తత్పూర్వము భారతదేశమున ప్రథమమున నీదేశోపకారిని విచారణలేకయే ప్రవాసమునకు పంపిరి. ఐరోపాయుద్ధానంతర మీతఁడు భారతదేశమున కేతెంచెను. అప్పటినుండి ఈయన కాంగ్రెసుపట్ల పూర్వమువలెనే నిరంతరకృషి యొనర్చుచునే యున్నాఁడు. లజపతిరాయిని కలకత్తా అవసరకాంగ్రెసునకు అధ్యక్షునిగా ప్రజలొనర్చిరి. ఈసభలో నే అసహాయోద్యమము నాచరణలో నుంచఁబడవలయునని మహాత్మాగాంధి తీర్మానమును సభవారి యామోదమునకు దెచ్చెను. లజపతిరాయి అధ్యక్షతక్రింద జరుపఁబడిన ఈఅవసర కాంగ్రెసుసభలో నధికసంఖ్యాకు లీతీర్మానము నంగీకరించిరి. ఇట్టి లజపతిరాయివంటిమహానుభావుని దొరతనము నిర్బంధింపగానే చిత్తరంజనుఁ డతిరోషయుతుఁడయ్యెను. నిరంకుశాధికార వర్గముయొక్క చర్యలను మితిలేక ఖండించెను. కాంగ్రెసులో తీర్మానమైన మేరకు కలకత్తావిద్యార్థులను తమబళ్ళను వీడమని మహోప న్యాసముల నొసంగెను. విద్యార్థులు విధేయులైరి. చిత్తరంజనుఁడు తనమహోపన్యాసములలో నొక్క దానియం దిట్లు చెప్పియున్నాఁడు.
విద్యార్థులు, ఐచ్ఛికభటులు.
“లజపతిరాయిని అధికారులు బంధించి కాంగ్రెసును బంధించిరి. లజపతిరాయిగారు. కాంగ్రెసుకు పట్టుకొమ్మ. దీనివలన దేశీయమహాసభ యే దెబ్బ తినినది. అధికారవర్గముయొక్క ఈబాహాటమైన చర్యవలన బలాబలములను చక్కగ జూపుటకు అవకాశమేర్పడినది. కాంగ్రెసువా రేర్పఱచిన (స్వరాజ్యప్రాప్తికి) నియమితకాలము సమీపించినందున ఫలితము ప్రకటింపఁబడుటకు సమయమైనది. బంగాళా దేశములోని నిర్బంధములు ఇతరరాష్ట్రపు నిర్బంధములకు తీసిపోవు హింధూమహమ్మదీయ సఖ్యత ఐకమత్యము ప్రపంచమునకు చాటుచిహ్న మోయన పీర్ బాద్షామియాన్ గారిని, డాక్టర్ సురేష్ గారిని కలిపి సంకెలలు తగిలించి జెయిళ్ళకు గొంపోయిరి. ఇట్లే చిటగాంగున జితేంద్రమోహనసేన్ గుప్తగారు, ఉపాధ్యాయ నృపేంద్రుఁడు వెయ్యి మంది. ఐచ్ఛికభటులతో మహామహోపధ్యాయ జిరేంద్రనాథముఖర్జీ గారు, వీరందఱు జెయిళ్ళకంపఁ బడిరి. కోమిల్లాజిల్లా బ్రహ్మంచేరియాలో అధికార వర్గము కోరువారికన్న ఎక్కువమంది జెయిళ్ళకుపోవుటకు సంసిద్ధులై యున్నారు. కలకత్తాసంగతి యేమి యని నాకు చింతగానున్నది. కలకత్తాలో నిన్ని కళాశాలలున్నవి. ఇన్ని పాఠశాలలుండు ఈపట్టణమున 5 వేలమంది వాలంటీర్లు మాత్రమేనా ? వీరిలో నార్గుఱుమాత్రమే బంధింపఁబడిరి వీరు వడుకు నూలుబట్టల నమ్ముచు రాటములను గృహములకు పంచి పెట్టు నేరము మోపఁబడిరి. ఈకారణమున నే వీరి కీనిర్బంధము. అందువలన దొరతనమువారు అసహాయోద్యమము నణచివైచుటకు కంకణము కట్టికొనిరని తేలినది. ఇంతగొప్ప కలకత్తాపట్టణములో 5 వేలమందేనా ఐచ్ఛికభటులు? దేశీయ మహాసభోద్యమము ఆపుదల కానున్నదట ! ఓకలకత్తావిద్యార్థులారా ! మీరేమిచేసెదరు ? ఇప్పుడేనా చదువుకు సమయము? కళలు, సాహిత్యము, గణితము, శాస్త్రము వీనిని సాధించుట కిదేనాసమయము ? దేశమాతపిలుపునకు మీహృదయములు గఱగవా? ఈగొప్పపట్టణము నాకు నిర్జనమైన ఎడారిగానున్నది. నాచుట్టు సదా యువకులున్నారు గాని వారికి ముఖవికాసములు లేవు. నిరుత్సాహులు, జీవచ్ఛవములుగ గాన్పించుచున్నారు. వారికి ఆత్మబలమునొసంగుటకును వారిని ఉత్సాహయుతులను గావించుటకును నాకు శక్తినిప్రసాదించుటకు దేవుని ప్రార్థించెదను. దేశాంతరములలో స్వేచ్చకు పోరాడినవారు యువకులేగాని వృద్ధులుగారు. నిర్మలహృదయులై , స్వార్థత్యాగపరాయణులైన యువకులే ఈకార్యమునకు పోరాడవలసినవారు. యుద్ధమాసన్నమైనది. నేనా ముసలివాఁడ నగుచున్నాను. మనోదార్ఢ్యము తప్పుచున్నది. నన్ను ఇంకను నిర్బంధించ లేదు. అయితే నాచేతులకు సంకెళ్ళుతగిలించి నన్ను నిర్బంధించినట్లు నాకు గోచరించుచున్నది. ఈవేదన దాస్యసంబంధమైనది. భారతమంతయు చెఱసాలయైయుండ నన్ను నిర్బంధించియుంచిన నేమి, విడుదలగ నుంచిననేమి ? నేను బ్రతికియున్నను చచ్చినను దేశీయమహాసభోద్యమము అవిచ్ఛిన్నముగ జరుగవలయును."
నిర్బంధము.
చిత్తరంజనుని ఈయుపన్యాసముచే కలకత్తాలోని కళాశాలల విద్యార్థులేమి హైస్కూళ్ల విద్యార్థులేమి వేనకు వేలు నేల యీనినదన్నట్లు ఐచ్ఛికభటులుగఁ జేరిరి. కలకత్తా పురమంతయు ఐచ్ఛికభటమయమైనది. ప్రభుత్వపు అధికారులు కలవరపోయిరి. కలకత్తా గవర్నరు రోనాల్డుషే ప్రభువు తహతహపడెను. ఇక నాలస్యము చేయరాదనుకొనెను. వెంటనే గూఢచారులగు పోలీసులకు తన ఉద్దేశమును దెలిపెను. వారు చిత్తరంజనుని వెన్నంట మొదలిడిరి. దాసు ప్రభుత్వముతో మల్లచరచుచున్నాఁడని గవర్నరుకు దెలిపిరి. గవర్నరు కుపితుఁడయ్యెను. దాసును నిర్బంధింప నాజ్ఞ నొసంగెను. పరమభాగవతుని దేశసేవాపరాయణుని, ప్రజోపకారిని, ఆత్మత్యాగిని, సర్వత్యాగిని, 1922 సం. డిసంబరు 10 వ తేదినాఁడు నిర్బంధించిరి పోలీసులు. 6 నెలలు విడిశిక్షను విధించిరి. మాజిస్ట్రీటుతన్ను పట్టుకొనగానే భారతీయులకు దాసు ఈక్రింది సందేశమును పంపెను.
ప్రజలకు సందేశము.
“ఓ భారతపుత్రులారా! ఇది నాకడపటి సందేశము. విజయము దృష్టిగోచరమగుచున్నది. కష్టము నోర్చుటవలన దానినిమీరు పొందగోరుదు రేని అది మీకు సిద్ధించును. వారు మాతృభూమిపక్షమున నిలువరేని నిరంకుశాధికారులపక్షముననే నిలుచువా రగుదురు.
విద్యార్థులారా! భరతఖండమునకు మీరు మూలాధారులై యున్నారు. భారతముయొక్క ఆశయము కీర్తి మీపై నాధారపడియున్నది. రెండున్ను కూడిన నాల్గగునని తెలిసికొనుటయే నిజమగు విద్య కానేరదు. మనకందఱకు మాతయగు భారతమునకుచేయు సేవయే నిజమగువిద్య. ఇప్పట్లో దీనికి అవకాశముమెండు. ఈపొత్తుతల్లి సందేశమునంపి నప్పుడు దీనికి ఎవ్వరు సంసిద్ధు లయ్యెదరు?
ఓమితవాదమిత్రులారా! ప్రపంచచరిత్రమును ప్రారంభమునందుండి సింహావలోకన మొనరింపుఁడు. మీరనుసరించిన మార్గముగుండా ఏజాతి యైనను కొంత స్వాతంత్ర్యమునైన బడసినదా? దేశమున గల్గియుండు వేదన మిమ్మును చలింపచేసినట్లు అగుపడదు. ఈవేదన నిరంకుశాధి కారవర్గముతో కలిగిన సంఘర్షణమే కారణము గలిగియున్నది. ఇట్టి సంమర్షణములవలననే ప్రపంచమున జాతు లుత్పన్నము లైనవని చరిత్ర ఘోషించుచున్నది. శాంతము నణుమాత్రమును చెదరనీయక ధైర్యస్థైర్యసాహసములతో మీరిప్పు డా వేదన ననుభవింపవలెను. మీరు దౌర్జన్యవిరహితపథమున మెలగునంతకాలమును నిరంకుశాధికారుల అక్రమమున నుంచగలుగుదురు. మీకు గాంధిమహాత్ముఁడు ఏర్పఱచిన హింసారాహిత్యమగు శాంతయుత పథమును మీరణుమాత్రము దాటినను మీరు నిరంకుశాధికారుల కోడిపోయెదరు. స్వరాజ్యము భాగభాగములుగను వాయిదాలమీదను రానేరదు. అట్టిది మన కక్కఱ లేదు సంపూర్ణమైన స్వరాజ్యమే మనఆశయము. దానికొఱకై మనము పోరాడుచున్నాము. దానిని పొందుటయా? వదలుటయా? నిర్ధారణ చేయవలయును.”
వీరిని నిర్బంధించగానే కలకత్తా పౌరస్త్రీలు ఖద్దరుబట్టలనమ్ముటకును, విదేశవస్త్రములను కొనకుండ చేయుటకై యత్నములు సాగించిరి. అందుకు చిత్తరంజనుని భార్య వాసంతిదేవియు; ఊర్మిళాదేవి, సునీతి దేవియును మువ్వురును బహిరంగముగాఉద్యమమును కలకత్తాలో ప్రబలపఱచుటకు యత్నములు చేయగానే పోలీసులు వారిని సైతము నిర్భంధమున నుంచిరి. కాని, వెంటనే వదలిరి. అయి తే పట్టుబడగానే వారుకలకత్తా సాధ్వీమణుల కిట్లు సందేశ మంపిరి -
సాధ్వీమణులకు సందేశము.
“మేము పట్టుబడుటకు సిద్ధమయ్యే బయలుదేరితిమి. మాబిడ్డలు దేశయువకులు దేశసేవాపరాయణత్వమున కారాగారమున బంధింపఁబడుచుండవారి తల్లులమగు మాకు మాయిండ్లలో నుండుట పెనుమంటయందు వై చినట్లైనది. మాసోదరీమణులగు . మీరు మిగిలిన పనిని కొనసాగించవలయును. మీ స్థానములు సైతము కారాగారములలో మావంటి మీసోదరీలకును, సోదరులకును ప్రక్కననే అమర్చఁ బడియున్నవని మరవకుఁడు. బానిసదేశములో స్వేచ్ఛానిరోధమును బొందుటకన్న నిజమగు కారాగారబద్ధులగుటయే గౌరవము. ప్రభుత్వ విద్యాలయములలో విద్యార్థులుచేరక వదలి స్వాతంత్ర్యసంరంభమునకు పూను కొనవలయును ఇదియే మావిన్నపము. ఈసంరంభమున జయించిన స్వరాజ్యప్రాప్తి సిద్ధము. లేదా, ఈ దేహములను ఈసమరములో అర్పించుట సిద్ధము. రెండును దివ్యములే మాకు. ఈబానిసతన మిక కూడదు. చావో, బ్రతుకో తేలవలయును. పోలీసులు తమపనులకు రాజీనామాల నియ్యవలయునని మేము కోరెదము. ఈపాడు నిర్భంధములను తమ దేశ సేవాపరాయణుల విషయములో ప్రయోగించి జీవించుటకన్న అన్నములేక మాడిచచ్చుట శ్రేయస్కరము అని వారు గుఱ్తింతురు గాక!"
ఇట్లు దేశబంధువై చిత్తరజనుఁడు వంగ దేశమున సర్వాజ్యాందోళనావిషయమున విద్యార్థులను, స్త్రీలను, పిల్లలను, ప్రజలను ఉన్ముఖులుగ గావించెను. గాంధిమహాత్ముని పద్ధతిని మీరక అసహాయోద్యమ మును ఖద్దరుప్రచారమును వెల్లివిరియునట్లుగఁ జేసెను.వంగ దేశమంతయు నీమహాత్యాగికి అనుచరులైరి. కావున ఈతనిని నిరంకుశాధికారవర్గమువారు శిక్షింప యత్నించి యేదో నేరము మోపి విచారణకు దెచ్చిరి. విచారణను ఆపి రిమాండునందు కొంతకాల ముంచి యేనేరమును మోపి శిక్ష వేయవలయునా యని యాలోచించి పోలీసు లొక సెక్షన్ క్రింద నేరస్థాపనజేసిరి. అందఱను విడిపింపఁగల శక్తిగల దాను తనపై తెచ్చిన నేరమునందు తన్ను సమర్థించుకొనువాదమున కే బూనుకొనలేదు. స్టేటుమెంటు నొకదాని నిచ్చెను. మాజస్ట్రేటు శిక్షించవలయునను పట్టుదలతో నుండినందున శిక్ష వేసెను. ఆసంవత్సరమే అన్ని రాష్ట్రములవారును దాసును కాంగ్రెసు అధ్యక్షునిగా నెన్నుకొనియుండిరి. డిసంబరు 10 వ తేది నిర్బంధింపబడినవాఁ డెట్లును కాంగ్రెసు అధ్యక్షపదవికిగాను విడుదల బొంద లేదు. ఆసంవత్సరములో కాంగ్రెసు మహాసభాధ్యక్షుఁడు లేకయే సభ జరుపఁబడెను. అట్టిసభ యిదివరకు భారతదేశమున జరుపఁబడ లేదు. మహాత్ముఁ డప్పటివరకు నిర్బంధింపఁబడ లేదు. కాఁబట్టి ఆసంవత్సరము అధ్యక్షవిరహితసభను మిక్కిలి నేర్పుతో జరపెను. వెంటనే మహాత్ముఁడుకూడ నిర్బంధింపఁబడెను. దేశ నాయకు లనేకులు కారాగృహబంధితులైరి. 1922వ సం॥ డిసంబరు మాసమున గయలో కాంగ్రెసుమహాసభ జరిగెను. ఈసభ నాటికి కొన్ని నెలలకుమునుపే మోతీలాల్ నెహ్రూగారు, చిత్తరంజనదాసు మొదలగు ఉత్తరదేశనాయకులును ఆంధ్రనాయకులనేకులును విడుదలలను బొందిరి.
శ్రీయుత దేశబంధు చిత్తరంజనదాసు చెఱసాల నుండి విడువఁబడినపుడు కాంగ్రెసు పరిస్థితులు మహాత్ముఁడు . కాంగ్రెసునకు నాయకుడుగ నుండినట్టి స్థితితో లేవు. ఈపరిస్థితులు కాంగ్రెసులో మారిన వే కాక దేశములోకూడ మారినవి. దేశములో నసహాయోద్యమము నందలి యనురాగము ప్రజలలో క్షీణించెను. ప్రజలు పన్నులుచెల్లింపక దౌర్జన్యరాహిత్యముగ సర్కారుతోఁ బోరాడఁగలరా యను విషయమును దెలిసికొనుటకు దేశమం దంతటను కాంగ్రెసునాయకులు పర్యటనము సలిపిరి. ఈసంఘములో నార్గుఱు నాయకులును ప్రజలలో నుద్రేకము క్షీణించినదని యభిప్రాయపడిరి గాని యీయుద్రేకము నెట్లుద్ధరించుట? యనుమార్గములో మాత్రము భిన్నభావములను తెలిపిరి. హకీం అజ్మాల్ ఖాను, పండిత మోతీలాల్ నెహ్రూ, వి. జే. పటేల్ గారలు “శాసనసభలు చాల యకృత్యములఁ జేయుచున్న వనియు, నాశాసనసభలలో కాంగ్రెసుపక్షపువారు ప్రవేశించి వానిని తుదముట్టించినయెడల, దొరతనమువారి ప్రజాపరిపాలనమను నామముననుండు నిరంకుశాధికార మడుగారి పోవుననియు విదేశీయులకు సైతము ఇండియా దొరతనమువారు చేయు కార్యములయందు ఇండియా ప్రజలకు సుముఖత్వము లేదనియుఁ జక్కగ నెఱుంగుదురు. ఈవిధమున భారతప్రజల కొకవిధమైన ప్రోత్సాహము కలిగినచో మరల నసహాయోద్యమ మభివృద్ధిఁ జెందఁగలుగును” అని యభిప్రాయఁబడిరి. శ్రీమాన్ సి. రాజగోపాలాచార్యులు, ఎస్. కస్తూరి రంగయ్యంగారు, డాక్టర్ : ఎం. ఏ. అన్సారీగారలు గాంధిమహాత్ముని యభిప్రాయముల నే మనము కొనసాగించుకొనవలయుననియు, బర్డోలి నిర్మాణకార్యక్రమము నవలంబింపవలయు ననియు తీర్మానమునకు వచ్చిరి. దేశబంధు చిత్తరంజనదాసు పరిస్థితు లన్నియుఁ జక్కఁగ బరిశీలించి కాలమునకుఁ దగినమార్పులు లేకున్నచో నేదేశమును జేమపడదనియు నేయుద్యమమును జయమంద లేదనియుఁ దెలిసికొనెను. మహాత్ముఁడు చెఱసాలనుండి విడుదలఁ జేయఁబడిన నాతఁడును తనవిధానము మార్చునని దృఢముగ నమ్మెను. కాని, యీతఁడు జరుగఁబోవు గయాకాంగ్రెసు తీర్మానమునకు వేచియుండెను.
గయాకాంగ్రెసు.
జనులెల్లరు దేశబంధువుచేసిన త్యాగమునకును దేశసేవకును మెచ్చి యీతని నేకగ్రీవముగ దేశీయ మహాజనసభ కధ్యక్షుఁడుగ నెన్నుకొనిరి. చిత్తరంజనుఁడు కాంగ్రెసులోఁ దనయభిప్రాయములన్నియు వెల్లడిపరచెను. అచ్చటి మహాసదులెల్ల రు నాలోచించిరి; కాని దేశబంధుని యభిప్రాయమును రాజగోపాలాచార్యులు ప్రతిఘటించి యది మహాత్ముని యభిప్రాయమునకు ప్రత్యక్షవిరోధమని చెప్పినందువలనను కాంగ్రెసు అధికసంఖ్యాకులు రాజగోపాలాచారిగారి పద్ధతి ననలంబించినందునను దాసుగారి శాసనసభా ప్రవేశ భావము నెగ్గకపోయెను. చిత్తరంజనుఁడు అపజయములకు వెఱచువాఁడు కాడు. అపజయ మాతఁ డెప్పుడు చెందునో అప్పుడే యాతని యద్భుతశక్తి ప్రజ్వరిల్లును. కొంచెమైనను వెనుదీయక మనమున కొంతయైనను కుందక దేశబంధువు తనకార్యమును బూనెను. కాంగ్రెసు విధానమున కేలాటి సంబంధమును లేక తనకక్షవారి నందఱ నొక్కటిగఁ జేర్చి స్వరాజ్యకక్ష యని తత్క్షణమే యేర్పాటుఁ జేసెను. ఈకక్షలో భారత దేశములోని మహనీయు లనేకులు చేరిరి. బొంబాయినగరములో వీ. జే. పటేలుగారును, పూనాలో కేల్కారు, అలహాబాదులో పండితమోతీలాలు నెహ్రూగారును, తమిళనాడున శ్రీమాన్ ఏ. రంగస్వామయ్యంగారు, ఎన్. సత్యమూర్తిగారు, ఆంధ్ర దేశనాయకులలో ప్రసిద్ధిఁగాంచిన బారిస్టర్ :ఉన్నవ లక్ష్మీనారాయణగారు, వి. యల్. శాస్త్రిగారు, బారిస్టర్ : కందుల వీరరాఘవస్వామిగారు మనస్ఫూర్తిగ నీయుద్యమమును కొనసాగించవలయు నని దృఢముగఁ దీర్మానించుకొనిరి.
మొదటిరెండు నెలలు వీరు చాలప్రోత్సాహముతోఁ బనిచేయుటనుఁ జూచి కాంగ్రెసులో భిన్న భావము లుండఁగూడదనియు నటులుండిన దేశమునకు క్షేమములేదనియు నొకవిధమైనసంధి నొనఁ గూర్చవలయునని కొందఱు నాయకు లభిప్రాయ పడి మొట్టమొదట ఫిబ్రవరినెలలో కాంగ్రెసు కార్య నిర్వాహక సభయందు రాజీతీర్మానమును దెచ్చిరి. దేశబంధు తనసహజభావముతో సంధికొప్పుకొనెను. కాని, రాజగోపాలాచార్యులవారి మొండి పట్టుదల వలన నీతీర్మానము కాంగ్రెసు అంగీకరింపలేదు. దేశబంధువు రాజీ కుదురవలెనని యపేక్షించిన వారిలో నొక్కఁడుకాఁడు. కావున రాజీకై యతఁడు వేచి యుండ లేదు. తనకార్యమును వంచనలేక నేటివేర్చుచు హిందూదేశమున పర్యటనముసలుపసాగెను. బొంబాయినగరము, పూనానగరములోనగు మహా పట్టణములయం దుపన్యాసములు గావించి జనులెల్లఱును వశీకృతులఁ గావించుకొనుచుండెను.
మేనెలలో మరల కాంగ్రెసు కార్యనిర్వాహక సభకూడి స్వరాజ్యకక్షవారు శాసనసభలకు నిలిచినయెడల కాంగ్రెసుపక్షమువా రెవ్వరును కాంగ్రెసుతరఫున వారికి ఓట్లనియ్యఁగూడదని చెప్పరాదని తీర్మానించుకొనిరి. ఈకార్యమువలన కాంగ్రెసువారికిని స్వరాజ్యకక్షవారికిని మైత్రిగలిగినది. దేశబంధువుని కార్యము కొనసాగుటకు శుభసూచనలు బొడసూపినవి.
దేశబంధువు ఈనెలలోనే మద్రాసురాజధానికి విచ్చేసి యందుఁ దనయభిప్రాయములను దెలుపఁ బూనుకొనెను. ఈసందర్భమున కాంగ్రెసువారు భేదభావముల వదలి యీతనిని తమరాజధానికి విచ్చేసినందులకు సన్మానపత్రికల నొసగిరి. అతఁడు తమిళ దేశమున ప్రధానపట్టణముల యందెల్ల నుపన్యాసములఁ జేసెను. ఎచ్చటఁ జూచినను జనులు కిటకిటలాడుచు గూడి యాతని యుపన్యాసములను వినుటకు కుతూహలురైరి. చెన్న పురి రాజధానిలో హిందూదేశములో నెచ్చటనులేని బ్రాహ్మణాబ్రాహ్మణేతర ద్వేషము నీతఁడు తీవ్రముగ ఖండించి బ్రాహ్మణేతర మిత్రులు బ్రాహ్మణులమీఁది ద్వేషమునుబట్టి నిరంకుశాధికారవర్గముతోఁ జేరి యసహాయోద్యమము నణచుటకుఁ జేసిన ప్రయత్నములు కేవలము గర్హ్యములని నుడివెను. తంజాపురము, తిరుచనాపల్లి, తిరునల్వేలి, మధుర, రామనాధపురము లోనగు ద్రవిడదేశములోని పట్టణరాజము లంతట మహనీయుని వాగమృతధార వెల్లి వెరిసినవి.
చెన్న పురిలోని పౌరులెల్లరు నీతనిఁ గొనియాడిరి. అంతటితోఁ దనివినొందక చిత్తరంజనుఁ డాంధ్ర దేశములో పర్యటనముసలిపి యచ్చటఁగూడ తన వార్తను దెలుపవలయునని ఫూనెను. అట్టు లే జూన్ నెల యాఖరున తిరుపతి, నెల్లూరు, గుంటూరులో నగుపురములందంతట నత్యద్భుతముగ నుపన్యసించి దేశమునకు స్వరాజ్యావశ్యకత యొక్కయు శాసన సభల వ్యర్థతయొక్కయు భావములను జనులమనంబులలో నెల్ల చక్కగ నంకురింపఁ జేసెను. కాకినాడ, రాజమహేంద్రవరము లోనగునాంధ్ర నగరములకుఁ బోవుటకు శరీరారోగ్యము తప్పినందువలన, వీలులేకపోయెను. అంతట దేశబంధువుని 'స్వరాజ్య'వార్త మహా --- యసహాయోద్యము వలెనే దేశమందంతటను వ్యాపించెను ప్రజలెల్లరును శాసనసభలకు స్వరాజ్యకక్షవారినే పంపవలయునని తీర్మానించుకొనిరి. ఈతీర్మానమునే ప్రజాభిప్రాయములను దెలుపుచు డిల్లీలోఁ జేయఁబడిన అవసరకాంగ్రెసులోఁ గూడ మౌలానామహమ్మదాలీ నాయకత్వమును: మౌలానా అబ్దూల్ కలాంఆజూడ్ గారి యాధిపత్యమునను శాసనసభలకుఁ బోవువారిని కాంగ్రెస్ అడ్డుఁపరుప గూడదనియు, కాంగ్రెసులో నైకమత్యమే ప్రధాన మనియు దృఢపరచినది. కాంగ్రెసుతీర్మానమునే ప్రజలొప్పుకొనిరి. ఇది స్వరాజ్యకక్షవారికిఁ గలిగిన జయమే సూచించుచున్నది. అఖిలభారత శాసన సభాసభ్యులలో నొకస్వరాజ్యకక్షవారుమాత్రమే 55 సభ్యులున్నారనుట మనమెల్లరును గర్వపడవలసిన విషయమే.
ఇతరరాష్ట్రములందేగాక వంగరాష్ట్రమునకూడ స్వరాజ్యకక్షవా రనేకులు శాసనసభ్యులైనమీదట గవర్నరు లిటన్ ప్రభువు శ్రీ దాసుగారి నాహ్వానించి మంత్రివర్గమును నిర్మించమని కోరెను. ఆమీద తన కక్షవారిని సమా వేశపఱచి వారుకోరిన షరత్తుల కొప్పుకొన్నచో మంత్రి పదవుల స్వీకరింతురని చెప్పి
This work was published before January 1, 1929, and is in the public domain worldwide because the author died at least 100 years ago.