శ్రీరస్తు

మంత్రి యప్పవిరచిత

చారుచర్య

క.

ప్రత్యూష బహుళతిమిరా
దిత్యుఁడు శ్రీకీర్తి భారతీసంతత సం
[1]పత్యున్నతిప్రదుఁ డగు హరి
నిత్యుఁడు [2]నాగాఖ్యయప్పనికిఁ బ్రియ మొదవన్.

1


ఉ.

రాజహితంబుపొంటె సుకరం బగువైద్యసునీతి ధర్మని
ర్వ్యాజపథానుసార మగునట్లుగ నిర్జరభాషఁ దొల్లి యా
భోజునిచేతఁ జెప్పఁబడి పొల్పగు నీకృతి నూత్నసత్కళా
భోజుఁడు మంత్రి యప్పన ప్రబుద్ధుఁడు చేసెఁ దెనుంగుబాసగన్.

2


క.

రేపకడ మేలుకొని యఘ
నాపకమతి దంతధావనవిధిజ్ఞుం డై
తాపుణ్యకాష్ఠమున మౌ
నోపేతుం డగుచు వలయు నొనరింపంగన్.

3


ఆ.

ఖదిరమును పటమును గానుఁగ జిల్లేడు
వేము మద్దిజువ్వి వీనియందు

నొగరు చేఁదు కార మొనరిన చెక్కలఁ
దడిపి తోమవలయు దంతములకు.

4


సీ.

ఆయురారోగ్యంబు లగుమద్దిమామిడి
                కణమున శ్రీలక్ష్మి గలుగు మిగుల
పీడ లెల్లను వాయు బీజపూరంబున
                రణజయం బొదవుఁ గరంజకమున
విత్తలాభము సంభవించును మారేడు
                నొదవు ఘనప్రజ్ఞ యుత్తరేన
నరుచిహరము జాడ్యహరముఁ జేయును జండ్ర
                సిద్ధించు నతుల వాక్సిద్ధి జువ్వి


తే.

జాజి దాడింబమున దిరిసమున గొడిసె
మొదల నంకోలమునఁ గల్గు మోక్షలక్ష్మి
సింధువారంబునను రావు చెడ్డకలలు
దంతధావన కర్హంబు లింతపట్టు

5


క.

ప్రియరుచ్యము కఫపైత్య
క్షయకారి మనఃప్రసన్నకారణము శ్రుతి
ద్వయనాడి శుద్ధికరమును
నయనహితము దంతధావనము మనుజులకున్.

6


చ.

తెలియుచు నిద్ర శౌచవిధిఁ దీర్చి యనుష్ఠితదంతకాష్ఠుఁ డై
జలశుచిగాత్రుఁ డై నియమసద్విధిఁ గైకొని తాహు
తాగ్ని యై, పొలుపగుభక్తి నిష్ఠ సురపూజకుఁడై గృహ
కృత్యకారి గావలయుఁ బ్రభాతకాలమున వారిజగర్భకులప్రసూతకిన్.

7

ఉ.

అంగసుఖంబు, దుర్గుణము లారయఁ బొందని మందు, మేనికిన్,
రంగు, సుపోషణంబు సుకరంబునఁ బ్రాయము మళ్లి వచ్చు న
భ్యంగన మాచరించుటకు నర్హవిధం బగునుష్ణవారిఁ జే,
యం గడునొప్పు నాల్గుగడియల్ జలకంబు యథావిధిజ్ఞుఁ డై.

8


సీ.

పుణ్యనిర్మలతోయముల నొండె నుష్ణోద
                కముల నొండెను బ్రయత్నమునఁ జేయు
స్నానంబు వలయుఁ; బ్రాతస్నానమునఁ జేసి
                తొమ్మిదిచిల్లులఁ దొరఁగుచున్న
యేహ్యంబు పట్టగు నిమ్మేను శుచి యగు
                నంతియకాదు నాప్యాయనంబు
శౌచంబు బలము దుస్స్వప్ననాశంబును
                తేజంబు రూపుకాంతియు సుకృతము


తే.

నాయు రభివృద్ధియును గల్గునంతమీఁద
సంధ్య నారాధనము చేసి సవితఁ గొల్చి
యగ్నిదేవు నుపాసించు టర్హవిధము
నిజకులాచార మార్గైకనిరతులకును.

9


క.

ఆచారానన్తరమునఁ
బ్రాచి ముడువవలయుఁ గేశపాశంబులఁ గా
లోచితజలముల గరగర
రాచిన కస్తూరి పూయ రమణీయ మగున్.

10


క.

పరిమళము గల్గుపూవులు
ధరియింపఁగ దాన చుండు తలఁబట్టదు చె

చ్చెరఁ జెమటకంపు తొలఁగును
నరులకు మతి దెలియు ననువు నయనముల కగున్.

11


ఉ.

గేదఁగిపువ్వు దాలిచి సుఖింతురు మేలు జవాది పూసి హృ
న్మోదము గాఁగఁ గన్నెరులు మొల్లలతో వకుళప్రసూనముల్
జాదులు పాటలంబులును సంపెగలున్ శతపత్త్రకంబులున్
శ్రీ దనరారు భోగులు ధరింతురు కస్తురిఁ గూర్చి వేడుకన్.

12


క.

గోరంటపువ్వు మరువము
చేరిక విరవాజివిరులు చెంగలువలు క
ర్పూరమునఁ గూర్చి ముడుతురు
నారీజనపంచబాణ నాగమయప్పా.

13


ఉ.

మొల్లలు జాజిక్రొవ్విరులు మొత్తములున్ గరవీరరాజి దా
వెల్ల దొలంకుపువ్వు కురువేరు త్రిదోషహరంబు లారయన్
చల్లఁదనంబు దీన సహజం బగుగొజ్జఁగనీరు గొంతపైఁ
జల్ల ధరింతు రర్థిమెయి జాణలు వేసవిరాత్రు లెప్పుడున్.

14


క.

గురువిందలు గన్నేరులు
పరువపువనమాలికలును పాటలములు ని
ర్భరశీతోష్ణంబులు గా
వరయఁగ నవి మేలు ముడువ నంబుదవేళన్.

15


క.

పొన్నలు చేమంతులు సుర
పొన్నలు సంపెఁగలు మొగలిపువ్వులు పొగడల్
పన్నుగ హిమమున ముడుతురు
ఇన్నియు నుష్ణంబు లగుట యెఱిఁగిన భోగుల్.

16


సీ.

ఘటికాద్వయము దాఁకఁ గంపుజాదులనుండు
                విరవాజిమొల్లలు వీన రెట్టి

పొన్నలయం దుండుఁ బొలుపార నొకజాము
                మల్లెల నాయినుమాఱు దడవు
కరవీరములయందు గురువిందపువ్వులఁ
                బొగడల నంతియ ప్రొద్దు నిలుచు
నొకపగల్ రేయును నుండ సంపెంగల
                వెలయఁ జేమంతి తద్ద్విగుణముండు


తే.

దాని యోవర్తు చెంగల్వతావి యునికి
యయిదురాత్రులు గేదంగియందు వలపు
పుడమిఁ గలుగొట్టు సురపొన్నపువ్వులందు
మాన డెప్పుడు గంధంబు మంత్రి యప్ప.

17


క.

విరవాదులు మొల్లలు క్రొ
వ్విరిజాజులు ముడువ మేలు వెండ్రుకలు గడున్
గరగర నయియుండుతఱిన్
శిరమున నెపుడైన ముడువఁ జెంగలువ దగున్.

18


క.

ధర నుష్ణవస్తువులలో
నిరతంబును నుష్ణకరము నేత్రములకు దు
స్తరబాధక మగు మఱి హిత
కరములు గా వనిరి మల్లికాకుసుమంబుల్.

19


ఆ.

మైదపువ్వుకంటె మల్లెలకంటెను
బుడమిలోనఁ గీడు పువ్వు లేదు
మొగలిపువ్వుకంటె మొగిఁ జెంగలువకంటె
మేలుపువ్వు పుడమిమీఁద లేదు.

20


క.

తలమాసినపుడు మల్లెలు
వలయున్ ముడువంగఁ దొంటివారలు కేశం

బుల నూనియ విడువనితఱిఁ
గలుగు హితం బండ్రు కేతకంబుల ముడువన్.

21


మ.

అగరుం గుంకుమపువ్వు గూర్చి శిశిర వ్యాసంగికాలంబునన్
మిగులం గొజ్జఁగనీరు కప్పురమున న్మేదించి ఘర్మంబునన్
మృగనాభిన్ ఘుసృణంబునం గలిపి యమ్మేఘావళీవేళలం
దగునుద్వర్తనపూర్వకంబున నలందన్ జందనం బిమ్ములన్.

22


క.

జలకంబు దీర్చినప్పుడె
వలయున్ దడియొత్తఁ గాంతివచ్చును బిటికా
దులు వొందకుండు గండువు
గలుగదు మఱి దాన నునుపు గాత్రమున కగున్.

23


శా.

సీతుంగందువఁ బట్టుచీరలును మాంజిష్ఠంబులున్ దోఁపులున్
వాతశ్లేష్మనివృత్తిహేతువులు, దుర్వారోష్ణకాలంబులన్
జేతోమోదము పైత్యహానియుఁ గడుం జేకూరుఁ జెంగావులన్
శ్వేతచ్ఛాయపటంబు లభ్రపట లీవేళం ద్రిదోషఘ్నముల్.

24


ఆ.

మలిన మైనయదియు మగువ గట్టినయదియు
నితరజనులయదియు నెలుకపోటు
ఖండమైన యదియుఁ గాలిన యదియు వ
ర్జింపవలయుఁ జుమ్ము చీరలందు.

25


ఉ.

మాసినవానఁదీఁటయు నమంగళభావము నొందు నంగనా
వాసము గట్ట భాగ్యము నవారితశౌర్యముఁ దప్పుఁ బుణ్యముల్
చేసినఁ గోలుపోవు నొరుచీర ధరించిన నెల్కపోటు సం
త్రాసముఁ జేయు ఖండపరిధానము జెష్టకుఁ బట్టు మేదినిన్.

26

క.

కాలినచీర ధరించిన
మేలు దొలంగుటయెకాదు మిక్కిలి కీడై
కాలునివశ మగుఁ గావున
వాలాయము దానిఁ బాఱవైవఁగవలయున్.

27


చ.

తెవులులు సెందనోడు నధిదేవత లిత్తురు మెచ్చి సంతతో
త్సవములు రత్నభూషణవితానము దాల్పఁగ నట్లు లేనినాఁ
డవయవశుద్ధి హేతు రుచిరాభరణంబులు దాల్పఁగాఁ దగున్
రవణముపొంటె లక్కయును రాగియు నీ డవిగావు దాల్పఁగన్.

28


క.

దానములు చేసి యట స
న్మానంబున దేవపితృసమభ్యర్చనముల్
పూని యొనరించి పిమ్మటఁ
గాని చనఁగవలదు భుక్తి కార్యంబునకున్.

29


క.

గోవుం గనకము విప్రుఁడు
పావకుఁడు ఘృతంబు జలము భానుండు ధరి
త్రీవిభుఁ డీయెనిమిదియు శు
భావహములు మంగళాష్టకాఖ్యం బరయన్.

30


క.

అవలోకన మభినందన
మవధానముతోడఁ జేసి యర్చించుట భ
క్తివిధిన్ బ్రదక్షిణించుట
యవిరళనియమమున వీనియం దర్హంబుల్.

31


క.

కులకాంతచేతఁ దగుక్రియ
నలంకృతం బైన భోజనాగారములో

నెలమిఁ దనబంతిఁ జుట్టలుఁ
జెలులుం దగభోజనంబు సేయఁగవలయున్.

32


క.

పెక్కండ్రు లేకయున్నను
నొక్కఁ డిరువురైనఁ బంక్తి నొగిఁ గుడువక తా
నొక్కండ భుక్తి గొను టది
యెక్కుడునింద్య మని చెప్పి రిద్ధచరిత్రుల్.

33


క.

ఇష్టఫలసిద్ధి చేకుఱుఁ
దుష్టియునుం గలుగు పేర్మి దొరయును సుజనో
త్కృష్టుఁ డగు భోజనము వి
స్పష్టముగాఁ జేయునేని బహుజనములతోన్.

34


చ.

గొనకొని కొండముచ్చులు చకోరములున్ శుకశారికావళిన్
బెనుతురు భూపతుల్ విషము పెట్టినయన్నముఁ జూచి యోలిఁ జ
య్యన నవి వెండ్రుకల్ విడువ నక్షులు మూయఁగఁ గూయుచుండఁగాఁ
గని కుటిలప్రయోగములు గాంచుటకై నృపమంత్రిశేఖరా!

35


తే.

మునుపు తియ్యగూరలు రుచిగొనుట లెస్స
నడుమ నొగరులు చేఁదులు నంజు మేలు
పులుసు లాస్వాదనము సేయవలయుఁ బిదప
భోజనము సేయునపుడును భూమిపతులు.

36


క.

అతిమధురమ దీపనకర
మతిలవణము నయనకాంతిహర మాహారం
బతితిక్తామ్లము ముదిమికి
నతశయహేతు వని చెప్పి రాయుర్వేదుల్.

37

తే.

దప్పి కుదకంబు మాఱుకూ డొప్పఁ గొనగ
క్షుధకుఁ గూటి మాఱుగ నీరు గ్రోలఁ జనదు
గుల్మ మగు భగందరమునం గురువు పుట్టుఁ
జెలఁగి యీరెండు నేరక చేసిరేని.

38


తే.

కుడువఁ దొణఁగుచు నీళ్లను గ్రోలెనేని
దీపనము చెడుఁ దద్దయు దేహ మఱుగు
భుక్తిమధ్యోదకము కొంత పుష్టి సేయుఁ
బిదపఁ బానీయ మానుట పెద్ద మేలు.

39


తే.

కడుపు నాలుగుపాళ్లనుగా నెఱింగి
రెండుపా ళ్లన్నమునను బూరింపవలయుఁ
బానమున నింపఁగా నొకపాలు వలయు
వాయుచలనకు నొకపాలు వలయు నెడము.

40


తే.

కుడిచినప్పుడఁ శయనింపఁ గడుపు పెరుగు
కదలక కెచ్చోటఁ గూర్చున్నఁ గలుగుసుఖము
అల్ల నడయాడ నాయువు నగ్గలించు
దూర మరిగిన మృత్యువు దోన యరుగు.

41


క.

కడుపు కడుఁబిక్కటిల్లినఁ
బొడమును మఱి దప్పి హీనభోజనుఁ డైనన్
బడుగగుఁ గావున సమమగు
కుడుపున నేతెవులు లేక కొలఁదియొడ లగున్.

42


క.

కుడుచు నతం డైనను బె
ట్టెడు నాతం డైన నపుడు డెందము రెండై
కడుఁగోపముతో నుండినఁ
గుడిచినయన్నంబు కాలకూటముఁ బోలున్.

43

క.

కుడిచిన పిమ్మటఁ జేతులు
తుడిచి నియతి వార్చి మధనతోయము నియతిన్
బిడిచికొనవలయుఁ గన్నులఁ
బొడమఁగరా దక్షిరోగముల కట్లైనన్.

44


క.

దళముగఁ గ్రోలుచు నుండిన
జల మేమియు నాన కున్న జఠరము శిఖి దు
ర్బల మగు నన్నం బఱుగదు
పలుమఱు నగు నల్పవారి పానము సేయన్.

45


సీ.

కఠినమై దొడ్డచిక్కణమునై వత్సరా
                ర్థంబు వోయిన ప్రాఁతదనము గలిగి
యుజ్జ్వలచ్ఛాయమై నొత్తిన తరువాయి
                శశమాంసఖండంబుచంద మగుచు
నొగరించుకయులేక మిగులంగఁ దీపైన
                క్రముకంబు లెఱ్ఱనై కమ్మ వలచి
దళ మెక్కి పండిన తాంబూలదళములు
                కాలోపలంబులు కాల్చి వడియఁ


గీ.

గట్టినటువంటిచూర్ణంబుగా నొనర్చి
భుక్తి ముందర నాలుగుభోజనోత్త
రమున రెండును నటమీఁద రాత్రి నాఱు
మార్లు తాంబూల మొప్పారు మంత్రి యప్ప.

46


సీ.

పోఁకకు మూఁటి చొప్పునఁ బర్ణములు గూర్చి
                తగుఁ జేయ రేపటి తమ్ములములు
నాలుగు నైదులు నోలిన కొలఁది మ
                ధ్యాహ్ననిశీధినీసమయములను

కాఁచు పథ్యము రేపకడ తమ్ములములతోఁ
                దొలిఁ దొలి నొకరెంటఁ గలయవలయు
నంతంత నెక్కించి యటమీఁదఁ జేయుత
                మ్ములములయందుఁ గప్పురము మేలు


తే.

తొడిమెయును దుదయును బుచ్చి నడిమి యీనె
లేక తడియొత్తి మడఁచిన యాకు లెస్స
ప్రథమరసమును రెండవరసము నుమిసి
యంతమీఁదట రస మాను టమృతసేవ.

47


క.

తాంబూలదళములకు నై
జం బయ్యెను గుణము భేదశక్తియుఁ గఫపై
త్యంబులఁ జెఱుచుటయును గం
దంబు మొగంబునకు నొసఁగఁ దాఁజాలుటయున్.

48


క.

పూగమునకు గుణములు పై
త్యాగమముం జెఱుచుటయును నాఁకలి మృదులీ
లాగతిఁ బుట్టించుటయును
వేగమె దాహంబు నణఁచు విన్నాణంబున్.

49


సీ.

లఘుకారి క్రిమిదోషవిఘటనసంధాయి
                దీపననిర్దోషదీప్తికరము
పాషాణచూర్ణంబు పైత్యవాతఘ్నంబు
                శంఖచూర్ణము కఫపైత్యహరము
చిప్పలసున్నంబు శ్లేష్మంబు హరియించు
                గుల్లసున్నము వాతగుణముఁ జెఱుచుఁ
దెలివిచ్చుఁ జాలముత్తియపుసున్నము చూర్ణ
                పర్ణ మాయువునకు బాధకంబు

తే.

పత్త్రమూలములను రోగపటల ముండు
నగ్ర మది పాపములకెల్ల నాశ్రయంబు
నడిమి యీనియ బుద్ధివినాశకరము
వీని వర్జించి తగఁ జేయు వీడియంబు.

50


చ.

వదనవికాససౌరభవివర్ధనకారి లసన్మదాపహం
బుదరవిశేషసౌఖ్యకర ముగ్థతదోషబలప్రహారి స
మ్మదజనకంబు తమ్ములము మానవతీపరిభోగవేళలన్
మదనపునర్భవీకరణమంత్రము ముఖ్యమె దాని కెద్దియున్.

51


తే.

క్షీరభోజి యై యపుడు పేగిరముతోడ
తమ్ములముఁ గొన్నఁ గుష్ఠ మాతని నశించు
గడియలోఁ గొన్న మేహంబు గదుకు నౌల
గడియలోఁ గొన్న మూత్రరోగంబు నొందు.

52


సీ.

ఒప్పనిగంధంబు నొంద కున్కియగాదు
                మొగమునఁ గలరోగములను జెఱుచుఁ
జెదరనికెంజాయఁ జెందిదంతములు ము
                ప్పోర్చునట్లుగఁ జేయు నుదరశుద్ధి
గలిగించుఁ గర్పూరకలితతాంబూలంబు
                కఫవాతపైత్యంబు క్రాఁచు భేది
రక్తపైత్యహరంబు రతిసౌఖ్యదము నాసి
                కాగదసంక్షయకారణంబు


తే.

కన్నులకు శైత్య మొనరించుఁ గంఠమునకు
మధురరుచిఁ జేయుఁ బొందించు మంగళములు
దగ్గఱుగు జిహ్వ చెడ దెట్టి దప్పియైనఁ
దిమ్మఁబడుఁ గప్పురముతోడి తమ్ములమున.

53

ఆ.

క్షయము రక్తపైత్యగతి వెఱ్ఱి భ్రమ పాండు
రోగ మక్షిగదము రొమ్ము నొప్పి
కడుపునొప్పి గ్రహణి క్షయకాస గలిగిన
వారు తమ్ములమ్ము వలదు చేయ.

54


క.

పగలును సంధ్యలుఁ బర్వము
లగుదినముల నిశలు నుడిగి యర్హపురాత్రుల్
మిగులఁగఁ దమకము సేయక
తగు నయ్యైదినము లెఱిఁగి తరుణులఁ గవయన్.

55


క.

సురతంబు పగలు చేసినఁ
బురుషునియాయువు నశించుఁ బుట్టును బాపో
త్కర మగుసంతతి సంధ్యల
సిరి దొలఁగును బర్వతిథుల సిద్ధము రాత్రిన్.

56


సీ.

.......................వర్జనీయలు
                తగఁ దన్ను నేలి నాతని పురంధ్రి
బంధువు నిల్లాలు, బ్రాహ్మణోత్తముభార్య
                చెలికాని పడఁతి వీరల దలంప
మాతృసమానలు మనువు దప్పిన యింతి
                కన్నియ ముదిసినకాంత రూప
శీలగుణమ్ముల చేత జిక్కి నిందిత యైన
                మగువయుఁ దనజాతిమాత్రకంటె


తే.

నతిశయం బగువర్ణంబు నతివ బొగ్గు
చాయమేనిది కడుఁ బల్లచాయపడఁతి
పెద్దవళులది కడురోగి తద్ద బడుగు
గేడి గు జ్జనఁబడు వీరిఁ గూడఁ జనదు.

57

చ.

నలికపుఁగౌను చారుజఘనంబును వట్రువ వల్దచన్నులున్
బలుచని దీర్ఘనీలకచభారముఁ జెన్నుమొగంబు వాలుఁగ
న్నులు మెఱుఁగారి సన్న మయి నున్నగు చామనచాయగాత్రమున్
బలితపుసిగ్గు గల్గు నెలప్రాయపుసుందరిఁ బొంద మేలగున్.

58


తే.

మెలఁగునప్పుడ క్రొక్కారుమెఱుఁగువోలెఁ
భ్రాంతమున నిల్చినప్పుడు ప్రతిమఁ బోలి
యురమునను జేర్చినప్పుడు విరులదండఁ
బోలు తిన్ననికామినిఁ బొందమేలు.

59


చ.

ఒదవఁగఁ గూర్చిరేనియును నొప్పదు మన్మథకేళి పిమ్మటన్
సుదతులగాత్రముల్ గదిసి సుప్తి యొనర్చిన రాజకోటికిన్
నిదురలఁ జెందియున్న రమణీతిలకంబుల యూర్పుగాడ్పులన్
జెదిరి తొలంగు నండ్రు కడుఁ జేసిన నాథుల మేలిపుణ్యముల్.

60


మ.

ఇరుప్రొద్దు న్నరుఁ డల్పభోజి యయి తా నేప్రొద్దు శుద్ధాత్ముఁడై
చరణత్రాణములందు నేమరక యోజం బర్వ వర్జ్యంబుగా
వరనారీరత మౌషధంబు క్రియ నిర్వాంఛామతిం బొంది యొ
క్కరుఁడున్ నిద్ర భజించు వీతభయుఁ డాఖ్యం గాంచు శ్రీయుక్తుడై.

61


ఆ.

ఆవులింత నోర నాఁచి ముక్కునఁ బుచ్చి
వెలయఁ దుమ్మునట్లు వీడుకొలిపి
చరమధాతురక్ష సమ్మతి నొనరించు
సజ్జనుండు వర్షశతము బ్రతుకు.

62

క.

పురుషున కెంతయు సత్యమె
పరమం బగుధర్మమైనఁ బ్రాజ్ఞుండై తా
నొరుఁ బొలిగొనియెడు కిల్బిష
కరులయెడన్ బొంకవచ్చు గణకలలామా.

63


ఉ.

తాలిమి గల్గి తాఁ బరులదైన్యము వాపుచు శాంతి గల్గి సం
క్షాలితచిత్తుఁ డయ్యుఁ దగ సాహసకార్యము సేయ మైకొనం
జాలి పరోపకారియయి సంపద కుబ్బనియాతఁ డెప్పుడున్
శ్రీలలనాకటాక్షసరసీరుహధాముఁడు మంత్రిశేఖరా!

64


క.

కారణము దైవ మనుచును
బ్రారంభం బుడుగఁజనదు ప్రభువుల కెందున్
ఊరక తిలలను దైలం
బేరీతిని బడయవచ్చు నిద్దచరిత్రా.

65


క.

వ్యవసాయరహితు సాహస
వివర్జితుని నుచితయత్నవిముఖుని నలసున్
దివిరి సిరి గనయ నొల్లదు
యువతీరత్నంబు వృద్ధు నొల్లనిభంగిన్.

66


చ.

సముచితయత్నశక్తియుతసాహసుఁడై తగునుత్తముండు మ
ధ్యము బలహీనసాధనము లారయఁ జెప్పఁగ నేల రెండుసా
దములనె కల్గి యాహనుమ దాఁటె సముద్రము కాటిఱేనియ
శ్వమునకు నూఱుగా ళ్లొదవి సన్నపుఁగాల్వయు దాఁటఁగల్గునే.

67


మ.

గిరు లెవ్వారలు ప్రోచి పెంచి రిటు నింగిన్ ముట్టఁగా నేరు లె
వ్వరు వాటంబులు గాఁగఁ ద్రవ్విరి మృగవ్రాతంబు సేవింపఁ గే

సరికిం బట్టము గట్టి రెవ్వరు మహైశ్వర్యంబు లుత్సాహులై
తిరు..................మంత్రి యప్ప నుతకీర్తీ నాగమాంబాసుతా!

68


ఆ.

వర్ధమాను లైనవారికి నాపద
హీనజనులకంటె నెక్కు డండ్రు
కచవితానమునకుఁ గాక ఖండన మెండు
ఱెప్పవెండ్రుకలకుఁ జెప్పఁబడెనె.

69


క.

వలనై కార్యము సామో
క్తులఁ దీఱఁగ దండమునకుఁ దొడరఁగ నేలా
పులఖండమునన పైత్యము
పొలియంగా నేల చేఁతిపొట్లరసంబుల్.

70


ఉ.

దీనత దోఁపకుండఁ గడుఁ దీ పెసఁగం బ్రియ మాడ నేర్పగున్
దానము గల్గియున్ బొగడఁ దద్ద సహింపమి చాల మేలు వా
ణీనిధి వక్తనాఁ బరగి నిష్ఠురభాషుఁడు గామి లెస్స పెం
పూన సమర్థుఁ డయ్యు నిలుపోవుట యొప్పును నప్పధీమణీ!

71


తే.

ఆత్మకునివలెఁ బాతకుం డయినవాని
నన్యుఁ గొనియైన వెసఁ దెగటార్పవలయు
ఇంటఁ బుట్టియుఁ గీడైన యెలుకఁ జంపఁ
బిల్లికిని దుగ్ధములు పోసి పెంచుకరణి.

72


క.

కారణమున మిత్రు లగుట
కారణమున శత్రు లగుట గల ది ట్లగుటన్
ధారుణి నెవ్వరు నెవ్వరి
వారునుగా రెల్లవారు వసుపరతంత్రుల్.

73

సీ.

పగలు నిద్రింపక పరకాంతఁ గోరక
                పరదూషణము లేక పరుల కెపుడుఁ
గీడు చింతింపక కినుకయుఁ గపటంబు
                గలుగక చవి యెంత గలిగెనేని
పథ్యంబు శుచియును భక్ష్యంబుగాని ప
                దార్థంబుమీఁదఁ దత్పరత లేక
బుడుబుడులాడుచుఁ బడఁతుల మొగముల
                వెడమాయమాటలు వినఁగఁబోక


తే.

పలుకుతఱి జడివెట్టక పరుసగాక
బొంకులాడక తన్నుఁ దా బొగడుకొనక
కెలనివారికి మేలైన నెలమిఁ బొందు
మనుజునకు నభ్యుదయ మొందు మంత్రి యప్ప.

74


సీ.

విద్వన్నుతుండు భారద్వాజగోత్రుఁ డా
                పస్తంబసూత్రుఁడు పరమపుణ్య
విమలోజ్జ్వలాంగి గోవిందార్యునకుఁ గుల
                ద్వయశిరోభూషణధర్మచరిత
నాగమాంబకుఁ గూర్మినందనుఁ డప్పయ
                మణి మౌళిసింగనామాత్యు మేన
యల్లుఁడు ధార్మికుఁ డనఘుండు శ్రీవల్ల
                భాచార్యుతమ్ముండు హరిపదాంబు

తే.

జాతషట్పదుఁ డుభయభాషాకవిత్వ
మాపవైదగ్ధ్యు డప్పనమంత్రివరుఁడు
సంస్కృతంబున నొప్పారు చారుచర్య
తెనుగు చేసె దా నెంతయు తేటపడగ.

75


క.

గోవిందార్యుని యప్పన
గావించినచారుచర్య కర్ణాభరణ
శ్రీవిబుధు లందుఁ బడయుచు
భూవలయములోఁ బ్రసిద్ధిఁ బొందెడుగాతన్.

76

ఓమ్ శమ్

————

  1. ప త్యున్నతుండు శ్రీహరి
  2. గాంబ