చలిజ్వరము/ఆరవ ప్రకరణము

                         చలిజ్వర లక్షణములు

చలిజ్వర లక్షణములనేకములన్ని జాతుల జ్వరములకు సామాన్యములు:-

చలిజ్వరపు పురుగులలో నాలుగు ముఖ్య భేదములుగలవని 5-వ ప్రకరణములో చెప్పియున్నాము. వాని వలన గలుగు జ్వరలక్షణములనేకములు. అన్ని చలిజ్వరములకు సామాన్యముగనే యున్నవి. కొన్ని లక్షణములు మాత్రము విషజాతి జ్వరములకు ప్రత్యేకముగ నున్నవి. కావున సామాన్య జ్వరములకు గల లక్షణములను ముందుగా వివరించి విషజ్వరములకు ప్రత్యేకముగనుండు లక్షణములను కొన్నింటిని తరువాత పేర్కౌచున్నాము.

చలిజ్వరలక్షణములనుజ్ శోధింపగా నా లక్షణములలో (1) జ్వరమునకు చూచనలు. (2) నిజమైన జ్వరము. (3) విరామకాలము అను మూడువిభాగములు కనబడుచున్నవి.

జ్వరమునకు సూచనలు:-

జ్వరము రాకపూర్వము కొన్నిదినములు ఏదో బద్ధకముగా నున్న దనిగాని, పనితోచుటలెదనిగాని, విచారకరముగా నున్నదని గాని రోగిచెప్పును కాళ్లుచేతులు నడుమ లాగినొని పోవుట, గ్రుడ్లు పీకుట, ఎడమ డొక్కలో నొప్పిగా నుండుట, అన్నహితవు తగ్గిపోవుట, విరేసనము, మొదలగునవి ఉండవచ్చును. కొంచెం చలి చలిగా గాని,కొంచము జ్వరమువచ్చినట్లుగాని, యొకదినములో ఏదో ఒక సమయమందు తొచవచ్చును. ఒక్కొక్కపుడు ఈ చిహ్నములు దినము విడిచి దినమున ఉండవచ్చును. మలేరియా పురుగుయొక్క అంటుసోకిన రెండువారము లలోగా ఈ జ్వరమెప్పుడు వచ్చినను రావచ్చును. ఈ జ్వరముయొక్క రాక, రక్తములో ప్రవేశించిన మలేరియా పురుగుల సంఖ్యను బట్టియు వాని శక్తిని బట్టియు, రోరియొక్క బలమును బట్టియు, మారుచుండును. ఈ సూచనలేవియు లేక యే నిజమైన జ్వరము అకస్మాత్తుగా రావచ్చును.

2.నిజమైన చలిజ్వరలక్షణములలో మూడు దశలు గలవు
నిజమైన జ్వరలక్షణములు శీతలదశ

1. శీతలదశ: ఇందు అదివరకున సూచనలు హెచ్చగును. రోగి పనిచేయలేక పోవును. తరుచు ఆవలించుచుండును. ఒడలు విరచుకొనును. తల నొప్పి హెచ్చగును. వెన్ను వెంబడిని, కాళ్లచేతుల వెంబడిని చలియు కుదుపును పుట్టును. ముఖము వాడిపోయి నల్లబడును. పిమ్మట అధికమైన వణకు ప్రారంభించును. పండ్లుకరచుకొనిపోవును. శ్వాస చలితోడ కూడినదై ఎగుడు దిగుడు గా వచ్చును. మాట సగమువచును. నాడి నీరసించి వేగ మధిక మగును. ఇంటిలోనున్న దుప్పట్లు అన్నియు కప్పుకొనును. పాపము చలిమాత్రము తీరదు. ఒక్కకప్పుడు వాంతులును విరేచనములును ఉండవచ్చును. కాళ్లుచేతులు అమితముగ లాగికొని పోవును. చెవులలో ధ్వని బైలుదేరవచ్చును. దినమువిడిచి దినమువచ్చు సామాన్యజ్వరములో చలి కుదుపు తక్కువ జ్వరములకంటె హెచ్చుగానుండును. అరగంటవరకుగాని అంతకంటె హీచ్చుగగాని చలియుండవచ్చును. పిల్లలకు, కడుపు కనపడక పొవచ్చును. దీనికి బదులుగా బాలపాపచిహ్నము లనబడు ఈడ్పుగాని వాంతులుగాని రావచ్చును. చలి రామముందే జ్వరము కొంచెము ప్రారంభించి కుదుపుతో పాటు 104 మొదలు 106 డిగ్రీల వరకు హెచ్చును. పిమ్మట ఈ చలి భగభగ మను మంటలుగా మారును.

ఉష్ణదశ

2. ఉష్ణదశ ఉష్ణదశలో మంటలు మొదట అప్పుడప్పుడు వచ్చి తుదకు శరీరమంతయు ఒకటే వేడిగా మారును. ముఖముకందును. కండ్లు ఎర్రనగును. నోరు ఎండిపోవును. నాలుక గిదసబారును. శరీరము వేడిగాను పొడిగాను ఉండును. రోగి విసుగుకొనుచు పొర్లుచుండును. దాహము హెచ్చును. కప్పినదుప్పట్లను ప్రక్కదుప్పట్లను తీసివేయుదమనును. బలమయిన జ్వరములొ మతి భ్రమించును,. పిచ్చిమటలాడును. ఒక్కొక్కప్పుడు స్సృహతెలియకపొవును. ఆకుపచ్చని పసరు వాంతి అగును. విరేచనములుకూడ ఉండవచ్చును. నీడిస్ఫుటముగ నుండును. పరుగెత్తుచుండును. కడుపులోని జ్వరగడ్డ పెద్దది అగును. ఎడమడొక్కలో నొక్కిన కొంచెము నొప్పి ఎత్తును. ఇప్పుడు జ్వరము 107 వరకు హెచ్చిన హెచ్చవచ్చును. ఈ ఉష్ణదశ 4 లేక 5 గంటలుండును.

స్వేదదశ

స్వేదదశ పిమ్మట చెమట ప్రారంభించును. సామాన్యముగా తలమీద ప్రారంభించి వేగము ఒడలంతయు ప్రాకి మిక్కిలి అధికమై ప్రక్కబట్టలను తడిపివేయును. పిమ్మట త్వరలో జ్వరము తగ్గి జ్వరలక్షణములన్నియు పోవును. నాడి మృదువై మందమై నోరుచెమ్మగిలి జ్వరమురాక పూర్వము ఉన్నప్పటికంటె సుఖముగా నున్నదని రోగిచెప్పును. సామాన్యముగా వెంటనే రోగి నిద్రపోవును. పిల్లలకు సామాన్యముగా చెమట పట్టకపోవచ్చును.

విరామ కాలము

3. విరామకాలము: జ్వరము దిగిపోయినతోడనే రోగి తన పనులు చేయుటకు దార్ద్యము కలిగియుండును. మొదటిసారి జ్వరము వచ్చినప్పటినుండి లెక్కచూచుకొనగా 24 లేక 48 లేక 72 గంటలకు తిరిగి మొదతిరోజున నుండిన లక్షణములతొ అనగా చలుకుదుపు జ్వరము చెమ్మట వీనితోడ తిరిగి వచ్చును. సామాన్యముగా మందు పుచ్చు కొననియెడల కొంతకాలమునకు నీరసమధికమై రోగి మృతినొందును. లేదా రెండుమూడు సంవత్సరముల వరకు అప్పుడప్పుడు జ్వరమువచ్చుచుండును. రోగిని బలహీనునిగ జేయుచు కొంత కాలమునకు వానిని ఇతర రోగముల పాలుచేయవచ్చును. ఒకసారివచ్చిన చలిజ్వరము నిశ్శేషముగ కుదరని యెడల నొకానొకప్పుడు 5 లెక 6 సంవత్సరముల తరువాత కూడ బయటబడి తిరిగి రోగిని బాధింపవచ్చును. మిక్కిలి బలవంతులగు కొంతమందికి జ్వరము క్రమక్రమముగ దానంత టది తగ్గిపోవచ్చును.

విషజ్వర లక్షణములు.

విషజ్వరములలో కూడ పైనిచెప్పిన లక్షణములే యుండవచ్చునుగాని సాధారణముగా చలియుండు కాలము తగ్గిజ్వరముండు కాలము హెచ్చుగనుండును. సాధారణముగా విషజ్వరములందు ఉష్ణదశ 8,12 గంటలవరకుగాని అంతకంటె హెచ్చుగాగాని వ్యాపించును. ఒకానొకప్పుడు చలియే యుండదు. చెమటమాత్రం పట్టును. పిమ్మట రోగికొంచెము సుఖముగా నిద్రపోవును. రెండుమూదుసార్లు జ్వరము వచ్చిన తర్వాత విరామకాలమనగా జ్వరము లెని కాలము తగ్గును. పిమ్మట రోగికొంచెము సుఖముగా నిద్రపోవును. రెండుమూడుసార్లు జ్వరమువచ్చిన తర్వాత విరామకాలమనగా జ్వరము లేని కాలము తగ్గును. పిమ్మట విరామకాలములో గూడ జ్వరము పూర్తిగా విడువదు. ఒక్కొకప్పుడు మొదటి నుండియుజ్వరము పూర్తిగా విడువక నుండవచ్చును. అశ్రద్ధచేసిన యెడల ఇతర అవయవములలో రోగికి వ్యాధి ప్రారంభించి రోగము బలమగును.

జ్వరముయొక్క వివిధ దశలకును, మలేరియా పురుగుయొక్క వివిధదశలకును గల సంబంధమును తెలిసికొనిన యెడల చికిత్సచేయునపుడుమిక్కిలి ఉపయోగకరముగ నుండును.

చలి ప్రారంభించినప్పుడు మలేరియా పురుగు పిల్లలు ఉత్పత్తియగుచుండును.

1. రోగియొక్కరక్తమును చలి ప్రారంభింపక పూర్వము కొంచెము సేపటికిముందు సూక్ష్మ మలేరియా పురుగులన్నియు విభాగము జెందనున్నట్లు తెలియగలదు. } మలేరియా పురుగు పిల్లలయొక్క యుత్పత్తి ఎప్పుడు ప్రారంభించునో అప్పుడు చలియు ప్రారంభమగును.

జ్వరతీవ్రముగా నున్నప్పుడివి క్రొత్త యెర్ర కణములలో ప్రవేశించును.

2.జ్వరము తీవ్రముగా వచ్చునప్పటికి మలేరియా పురుగు పిల్లలలో ననేకములు తిరిగి క్రొత్త యెర్రకణము లలో ప్రవేశించి యుండును. కొన్ని మాత్రము అప్పుడు ప్రవేశించు చుండును.

విరామకాలములలోని యెర్రకణములను తినుచుండును.

3.చెమటపోసి జ్వరము తగ్గినప్పుడు జ్వరము పూర్ణముగా విడిచియున్న సమయము నందును, అంతకుపూర్వమే యెర్రకణములలో ప్రవేశించిన మలేరియా పురుగు లాయెర్రకణములను తినుచు పెద్దవగుచుండును.

విషజ్వరములలో కొన్నిదినములవరకు వచ్చిన తరువాత సంయోగసహిత సంతానవృద్ది విదానముచే మాత్రము పెంపొందునట్టియు, అర్ధచంద్రాకారము గలిగినట్టియు, ఆడు మలేరియాపురుగులు కూడ రక్తమునందు కన్పట్టును. ద్విఖండన విధానముచే వృద్దిబొందు మలేరియా పురుగులు రక్తములో నున్నప్పుడే జ్వరము పైకివచ్చును. ఇట్టి అర్ధచంద్రా కారముగల మలేరియా పురుగులు మాత్రము రక్తములోనున్నయెడల జ్వరమురాదు. ఒకానొకప్పుడు ద్విఖండన విధానముచే పెరుగు పురుగులు రక్తములోనున్నను, అవిమిక్కిలి తక్కువ గా నున్నయెడల జ్వరము రాకపోవచ్చును. ఇట్లు కొన్ని దినములుగాని, నెలలుగాని, సంవత్సరములు గాని మలేరియా పురుగులు నెత్తురులో కొద్దిగా నున్నను జ్వరమురాక రోగికి వృద్ధత్వముచేతగాని, అధికాయాసముచేతగాని, శరీరదుర్భలత్వము గలిగి నప్పుడు తిరిగి మలేరియా జ్వరము రావచ్చును. కొందర ఐరోపియనులకు హిందూ దేసమునుండి వారి స్వదేశమునకు పోయిన తరువాత రెండుమూడు సంవత్సరముల వరకు ఏవిధమైన మలేరియా జ్వరమును లేకపొయినను అకస్మాత్తుగ నట్టివారి కొకప్పుడు చలిజ్వరమువచ్చి వారి నెత్తురులో మలేరియా పురుగులు కన్పట్టుచున్నవి. అట్టివారి నెత్తురులో ఈ రెండుమూడు సంవత్సరముల లోపల మలేరియా పురుగులు ప్రవేశింఛుటకు అవకాశము లేదు. కావున వారి రక్తమునందలి మలేరియాపురుగులు హిందూదేశములో వారునివసించి యున్నప్పుడు ప్రవేశించి యుండవలెను. దీనినిబట్టి కొన్ని మలేరియా పురుగులు నెత్తురులో నున్నను జ్వరము రాకపొవచ్చునని రుజువు పడుచున్నది. కొంతమందికి లక్ష యెర్రకణముల కొక్కొటికంటె హెచ్చుగ మలేరియాపురుగు లున్నప్పుడు జ్వరము వచ్చునని కొందరువైద్యులు ఊహించియున్నారు. కాని కొందఱకు వంశపారంపర్యముగా నలవాటు అగుటచేత మలేరియాపురుగులు రక్తములో ప్రవేశించినను వారికి జ్వరమురాదు. ఇందు చేతనె కోయవాండ్రు మొదలగు అడవిజాతులవారు చలిజ్వరము యొక్క వ్యాపకముగల ప్రదేశముల్లో నున్నను వారల నీజ్వరము సామాన్యముగ బాధింపదు. అదేప్రదేశమునకు క్రొత్తవార లెవరైన వచ్చినయెడల వారలకు తప్పక ఆజ్వర మంటుకొనును. ఇందుచేతనే చలిజ్వరముయొక్క వ్యాపకముచే ప్రసిద్ధిజెందిన కొన్నిచోట్ల కడుపులలో పెద్దపెద్ద జ్వరపు బిళ్ళలు పెరిగిన వారలున్నను వారిలో కొందరకు జ్వరమురాదు. ఇది అలవాటుచేనని యెరుంగునది.