చంపూరామాయణము/అష్టమాశ్వాసము

శ్రీ

చంపూరామాయణము

అష్టమాశ్వాసము

యుద్ధకాండము

క.

శ్రీమత్ప్రతాపతపనో, ద్దామ మహోదూరితారిధరణీపరిణీ
భీమాంధకారజాలా, రామాపాంచాల కసవరాజనృపాలా.

1


మ.

ఇల యద్వీక్ష యదాటుగానయిన నెంతే వాణి ప్రత్యక్ష మౌ
బలుసారస్యముసొం పెసంగు సభలం బ్రాగల్భ్యము న్బాటిలుం
గళ లెల్ల న్బ్రభవిల్లు మర్త్యులకు దిగ్వ్యాప్తంబు లౌ సద్యశం
బులు చింతించు మదాత్మ యాగురుపదాంభోజద్యయిన్ భోజునిన్.

2


ఉ.

భూరివచోధురీణుఁ డగుభోజనృపాలుఁ డపూర్తికంబుగాఁ
దా రచియించి నిల్పిన యుదారకృతిం బ్రతనూక్తి నిత్తఱిం
బూరిత మాచరించుటకుఁ బూనితి సిబ్బితిలేక యిమ్మహిన్
దారము పేరురమ్మునను దాల్పరె హారముతోడి కూటమిన్.

3


మ.

మతిధుర్యుం డగులక్ష్మణుం డొగి శిరోమాణిక్యముం జూచి సం
తతమోహాకులుఁ డైనరాఘవుని ముద్రాముద్రితప్రాణప
ద్ధతి యౌ సీతను బల్మఱుం దలఁచి తత్పౌలస్త్యవిధ్వంస ము
ద్ధతిఁ గావింపఁ దొడంగె నుజ్జ్వలకథం దా నేకకాండంబునన్.

4


ఉ.

హృష్టత సీత యున్న దని యింపుగ మారుతి విన్నవింప సం
తుష్టనిజాంతరంగుఁ డగుతోయజబంధుకులాధినాయకుం
డష్టదిశాభయంకరదశాస్యరుషాపరుషాయమాణ యౌ
దృష్టి శరాసనోపరిఁ బ్రతిష్ఠితఁ జేసె రణైకనిష్ఠుఁ డై.

5


సీ.

అంత సుగ్రీవుఁ డుద్ధతదశగ్రీవదుశ్చరితరోషితరామచంద్రవదన
దర్శనద్విగుణితోదగ్రజాగ్రద్రణోత్సాహుఁ డై సాహాయ్యసమయ మాగ
తం బయ్యె నని ప్రమోదంబున సింధువు నంధువుచందాన నాత్మ నెంచి
యనివార్యధైర్యగాఢాంతరంగన్నిరాఘాటాధిరూఢత్రికూటశైల

గీ.

శృంగ యగులంకఁ జేరంగ శీఘ్రముగను, సాహసోన్నతి మీఱ సన్నాహపఱిచె
వినతనీలనలాంగదద్వివిదకుముద, జాంబవద్రంభశరభాదిసైన్యములను.

6


క.

తత్క్షణమున రఘువంశ్యా, ధ్యక్షఘనాపాంగధార నభిపూరిత మై
దక్షిణవాహిన్యధిపస, మక్షంబున కేగెఁ దన్మహావాహినియున్.

7


వ.

మఱియును బరిచలితసకలర్క్షసముదయోద్భాసియుఁ గుముదామోదకారియు శరభాధికప్రసాదశీలశాలియు, నీలేందీవరానందసంధాతయు దశాననదిశాక్రమణవ్యగ్రతేజోవిరాజియు సమారూఢతారానందనలాక్ష్మణోదయానుగతిప్రభావానుబంధియు సరయహనుమదుదయసానుమత్సమారోహియు, నిశాచరతిమిరహరణనిస్తంద్రుండును నగురామచంద్రుండు గనుపట్ట సమంతతఃకందళితబహుళహరిజాలకోలాహలభరితహరిదంతరంబును నిరంతరాస్కందితనికటకాంతారావళియు నగువలీముఖబలమహాంబుధి ససంభ్రమంబుగా విజృంభించె నయ్యవసరమున.

8


కపిసేనలు మలయపర్వతమున విడియుట

చ.

తలఁకెడుదున్నలు న్నిలిచి ధైర్యముతో నెదిరించు సింగముల్
దొలఁగెడునేనుఁగు ల్చెదరుదుప్పులు బెళ్కె డుజళ్కుఁజూపులం
బలుదెసలం గనుంగొనుచుఁ బర్వెడులేళ్లును గల్గి యావన
స్థలి కపివీరఘోషములఁ జాలభయంకర మయ్యె నయ్యెడన్.

9


చ.

బలములతో రఘూద్వహుఁడు వార్ధి నొకానొకపిల్లకాల్వఁగాఁ
దలఁచి వనుల్బయల్పఱిచి దారున సహ్యనగాధిరోహముం
జలిపి యసహ్యపాతఘనసౌరభనిర్భరశైత్యమాంద్యదో
హలమృదువాతపోతనిలయం బగునమ్మలయంబు గన్లొనెన్.

10


వ.

కనుంగొని సుమిత్రాపుత్రునితోడ ని ట్లనియె.

11


ఉ.

సారెకు నామనంబు కలఁచం దొడఁగెం దటనిర్ఝరోర్మివి
స్ఫారపయోజడీకృతవిశాలపటీరకుటీరవారసం
సారసమేతము ల్మలయశైలనితంబమహీవిహారసం
భారవనప్రియప్రియతమారుతమారుతపోతజాతముల్.

12


చ.

అని యతిదీనభాషణము లాడుచు రామమహీమహేంద్రుఁ డిం
పొనర నిరుద్ధవేల మయి యున్నతిఁ గన్నమహేంద్రశైలమున్
మనతరసాలము న్దరిసి కాంచె జలభ్రమముద్రితస్వవం
శ్యనృపవిశాలకీర్తినిధిచందమునం దనరారువార్నిధిన్.

13

వ.

కాంచి యుదంచితాశ్చర్యధుర్యాంతరంగుం డై యారాజపుంగవుం డిట్లనియె.

14


ఉ.

ఎవ్వనిలోఁతు చూడ నురగేంద్రుఁడు చాలఁడు నెల్లమేరలం
దెవ్వని కెల్లదిక్కులును నెవ్వనిసైకతరాశి దీవు లిం
కెవ్వఁడు వాగగోచరుఁడు నిట్టిపయోధి నఖాళి నెవ్వరే
త్రవ్విరి నించి రట్టికులరాజులచర్యలకు న్నమస్క్రియల్.

15


క.

అంతట సుగ్రీవుఁడు మహి, కాంతునియనుమతి మహేంద్రఘనవనవేలో
పాంతమునఁ జలువతెమ్మెర, చెంతలఁ బొలయంగ సకలసేనల డించెన్.

16


చ.

సరసపటీరకుంజవనసంజవనాభిపతన్మృగీమద
స్ఫురితసుగంధగంధవహశోభితసింధుతటాంతికంబునన్
సరవి రసాలతాళఫలచర్వణగర్వితచిత్తు లై చరిం
చిరి హరివీరు లెల్ల నిజచేష్టలు రామున కింపు నింపఁగన్.

17


వ.

అంత నిరంతరసమాక్రాంతహరిదంతరం బై నడయాడురెండవసముద్రం బనంగ సముద్రతీరంబున రోదసీవిలంఘనవిశృంఖలలాఘవం బగురాఘవానీకం బనీకోన్ముఖం బగుట, చారముఖంబున నవధరించి ధార్యమాణహృదయాతంకుం డై పంకలీనచరణం బగునైరావణంబుకరణి రావణుండు కరణీయంబు నెయ్యది యెఱుంగక జనకరాజతనూజ నుజ్జగింపం జాలక మనోజపరతంత్రితుండై మంత్రులం గూడి కొలువుకూటంబునకు వచ్చి యచ్చట.

18


క.

శస్తవచస్తుతు లైనప్ర, హస్తాదులఁ జూచి యస్మదభిలాష మిదే
దుస్తరవైరివధోచిత, నిస్తులభవదభిమతంబు నెదఁ దెల్పుండీ.

19


సీ.

అనవుడు వార లి ట్లని రాశయ మెఱింగి స్వామి తావకనిదేశం బొనర్చు
నేము ప్రాణములతో నిపు డుండ నీవార్త లాడ నేమిటికి వజ్రాతికఠిన
భుజపంజరానీతభూజాత వీడకుము నా విని లంకాధినాయకుండు
రంభాబలాత్కారసంభోగజం బైన యంభోజభవశాప మంతరాయ


గీ.

మగుట వచియించె నిటులన్నయన్నఁ జూచి, విన్నప మొనర్చె విజ్ఞానవినయభూష
ణుండు నురుసత్యసంభాషణుం డరోష, భీషణుండును నైన విభీషణుండు.

20


రావణునకు విభీషణుఁడు హితము చెప్పుట

గీ.

అకట దైవాజ్ఞఁ బరకళత్రానురాగ, లాలసుఁడ వైతివి దవాగ్నికీలఁ జూచి
యామిషగ్రాహమోహసంప్రాప్తరసన, చాపలం బైనముగ్ధకేసరియుఁ బోలె.

21

క.

అనఘం బగునిజవంశం, బున సీతాహృతికళంకము న్విని హాహా
ధ్వనిమీలితాక్షుఁ డగువిధి, యెనిమిది చెవు లెట్లుమూయు నిఁకఁ గేల్గోయిన్.

22


ఉ.

అక్కట వారిరాశి పరిఖావృత యై విలసిల్లులంక దా
నెక్కడ దుర్వచం బగుమెయిం గపి చేసినయయ్యుపద్రవం
బెక్కడ సీత జానకి మహీసుత నాఁజనుపేళ్ల దైత్యులం
గ్రక్కున నుక్కడంపఁగ నొకానొకమాయ జనించె నేమొకో.

23


మ.

నరుని న్వానరునిం దృణంబుగను డెందానం దలంతేని సు
స్థిరదోశ్శౌర్యునిఁ గార్తవీర్యుని బలశ్రీశాలి యౌవాలినిన్
వరుసం జూడవె యింతలో మఱచితే నందీశుశాపంబును
న్నరవర్జ్యం బగుపద్మభూవరము నన్నా! దైవమి ట్లుండెనా!

24


వ.

ఇత్తెఱంగునం దరంగితజ్ఞాతినీతివచనరచనైకనిష్ఠుం డగుకనిష్ఠుని నవమానించి యీజ్ఞాతి యరాతిపక్షపాతి శిక్షణీయుం డని కోపంబున దురాలాపంబు లాడుఘాతుకు నగ్రజాతునిం బరిత్యజించి యరుంతుదాచరణరోషభీషణుం డగువిభీషణుండు నిరవద్యనీతివిద్యాచతురచతురమాత్య సహితంబుగా నంబుధిఁ గడచి రా నప్పుడు తన్ను దవ్వుల విలోకించి కించిద్వితర్కంబున నుద్గ్రీవు లగుసుగ్రీవాదులం గుఱించి యంతరిక్షగతుం డై యి ట్లనియె.

25


విభీషణుఁడు రాముని శరణుసొచ్చుట

గీ.

వెక్కసములాడు నగ్రజు విడిచి బంధు, జనులఁ గాదని నేవిభీషణుఁడ నిదిగొ
రాము రిపుభేదనోద్దాముఁ బ్రణతదైన్య, హరణు శర ణని వచ్చితి ననఘులార.

26


సీ.

అనుచు నత్యంతదైన్యంబు మీఱఁగ సమీరితనిజోదంతుఁ డౌ నతని మఱి స
మీరకుమారాభిహితసాధుశీలతోన్నతుని లంకాపురీనాయకాను
జాతునిఁ గర్ణగోచరపథాన్వీతునిఁ గావించి యేతదాగమనమునకు
“కిం కారణం” బని శంకాకులుం డౌచుఁ గీశ పుంగవుఁ డెఱింగంప నప్పు


గీ.

డినకులేంద్రుఁడు దయమానహృదయుఁడును ను
దంచితస్మయమానముఖాంబుజుండు
నగుచు మకరందబిందునిష్యందమాధు
రీనిగాఢోక్తి ని ట్లని యానతి చ్చె.

27


గీ.

అభయ మని వచ్చు నితఁడు వైయర్థ్య మిపుడు
కనిన రఘువులు లఘువులు గారె వైరి

కనుజుఁ డైనను తనుజుఁ డైనను సఖుండ!
ధరణి శరణార్థి కరుణాపదంబు గాఁడె?

28


క.

అనుటయు హృదయజ్ఞుం డగు, హనుమంతుని చేత వేగ నానీతుఁడు స
ద్వినయాన్వితుండు నై రా,మునకుం ప్రణమిల్లె నసురముఖ్యుఁడు భక్తిన్.

29


ఉ.

అత్తఱి రాముఁ డిట్లను నిశాటకులేంద్ర దశాస్యరాజ్యసం
పత్తికి నెల్ల ని న్నిపుడు పట్టముగట్టితి వైరిఁ గొట్టితిం
జిత్తమునందు సందియము సేయకు మిందునకు న్నిదర్శనం
బుత్తముఁ డైనభానుతనయుండును వాలియుఁ గారె యారయన్.

30


గీ.

దైవవశమున నరుఁడు పదాననుండి, కనుఁ బదాంతరము విభీషణునియెడ నిది
ప్రబలె రేఖాతపత్ర మౌ రాముపదము, పట్టి యేకాతపత్ర మౌ పదముఁ గనుట.

31


వ.

అంత నాదశగ్రీవానుజుం డగ్రభాగంబునంద భరతాగ్రజాాపాంగసుధాతరంగాభిషిక్తుం డయ్యును బునరుక్తరాజ్యాభిషేకుం డై సుగ్రీవునికైవడి విశ్వాసభాజనంబును నగుచు రావణబలంబు నఖిలంబును నెఱింగించి లంకపై విడియుటకు సేనాసముత్తరణహేతు వగుసేతువు నిర్మింప నతీగంభీరం బగుపారావారంబు నారాధింపు మని సవినయంబుగ విన్నవించిన.

32


క.

అంబుధిని మదిఁ దలంచుచు, నంబుధితమహత్త్వదర్భశయనస్థలియం
దంబుధిహృదయేశయుఁ డపు, డంబుధిపై ననిలసఖుక్రియన్ శయనించెన్.

33


క.

ఈదారి నతఁడు నియతి మ, హాదర్భాస్తరణమధ్యమధ్యాసీనుం
డై దివసత్రయ ముండిన, యాదఃపతి యప్రసన్నుఁడై వర్తిల్లెన్.

34


శా.

భూపాలాగ్రణి రాఘవుండు కుటిలభ్రూభాగుఁ డంభోధిపైఁ
గోపోద్రేకవిపాకపాటలితచక్షుఃకోణ ముజ్జృంభిత
వ్యాపారంబుగఁ జాపముం గొనుటకై వాంఛించె వేగంబుతో
నాపాతాళపితామహప్రథమసర్గాటోపము న్మాన్పఁగన్.

35


శ్రీరాముఁడు సముద్రునిపైఁ గోపించుట

వ.

అంత.

36


మ.

బలువిల్లమ్ములుఁ దెమ్ము తమ్ముఁడ మదప్రారంభగంభీరునిన్
జలధిం గాల్నడ సేసెదం గపుల కస్మద్దోఃప్రతాపంబు ది
క్కులఁ బేరెక్కఁగ నంచుఁ బల్కుచు నతిక్రోధానురోధోద్ధతిం
బొలిచెం గార్ముకపాణి యత్తఱిఁ [1]దిరుప్పుల్లాణి నుల్లాసియై.

37

క.

విలు కేలఁ బూని యత్యు, జ్జ్వలవిశిఖము ననలశిఖము సంధించె మహా
బలశాలి రామభద్రుం, డిల యద్రువన్ గిరులు గదల నినుఁడు వడంకన్.

38


క.

మున్నీటిమీఁద రాజుల, మన్నీఁ డిటు లస్త్ర మేయ మది నూహింపన్
మిన్నేటిబోటి క్రన్ననఁ, గన్నీటినెపాన నతనికడఁక మరల్చెన్.

39


ఉ.

భానునిభుండు రాఘవుఁడు బాణముఁ బూని యమోఘలాఘవుం
డై నిగిడింప నిశ్వసదుదంచితనక్ర మవక్రకుంభికుం
భీనససంప్రవిష్టగిరిమేదురకందర మయ్యె నమ్మహాం
భోనిధియంతరంబు పరిభూతరసాతలభాగ్విసారమై.

40


క.

జలరాశి తత్క్షణంబునఁ, బ్రళయానలబాడబాగ్ని భార్గవపరశూ
జ్జ్వలగరళతాప మోర్చి యు, జ్వలననిభాస్త్రంబువేఁడి సైఁపం డయ్యెన్.

41


క.

శరణం బని యాశరధియుఁ, దరుణతరశరవ్యథానిదానం బగుదా
శరథిం జేరెను లోకులు, పరుషకులిశపాతి ఘనునిఁ బ్రార్థింపరొకో.

42


వ.

ఇట్లు చేరి యారత్నాకరుండు నభోరత్నవంశ్యరత్నంబునకుఁ జిరత్నరత్నంబు లుపదగాఁ గొంచు వినీతవేషంబుతోఁ బరితోషంబుగ వినుతిఁ గావించి సేవించి దేవా తావకధనుస్సంహితామోఘవైధాత్రాస్త్రంబు వనచరధామం బగుమదంతర్వర్తిమరుసీమంబునం బ్రయోగింపుము, నియోగింపుము సేతునిర్మాణంబునకు విశ్వకర్మాత్మజు నేఁ బనివినియెద నని యంతర్హితుం డయ్యె నంత.

43


చ.

రవికులుపంపున న్వనచరచ్చట దెచ్చిన యాజగత్త్రయ
ప్రవితతమూలమధ్యశిఖరక్షితిభృత్తతి లోఁబడంగ న
ర్ణవము వహించెఁ గర్దమఘనత్వము తోడనె తన్మహాఝరీ
భువనభరంబుచే నహహ పూరితమయ్యె నశేషదిక్కులున్.

44


చ.

ద్రుతగతి వారిధిం బడియె దూరనిపాతవిశీర్ణవాశ్చర
ప్రతతివితీర్ణజీవనదబంధురగంధఘనౌషధు ల్విదా
రితధరణీవినిర్యదహిరేచితఫూత్కృతిజాతఖేదభా
గతులగుహాగృహాసికమహాహరు లౌగిరు లద్భుతంబుగన్.

45


చ.

ఉరుపడి గట్లు కైకొనుట యుంచు టమర్చుట యించుకేని యె
వ్వరికి నెఱుంగకుండఁ గరపాటవ మొప్ప నలుండు సేతు వ
చ్చెరువుగ సంఘటించె నది సీతకు భూమి యభీతిహస్తమున్
దురుసుగఁ జూచెనో యనఁగఁ దోఁచె వనేచరవీరకోటికిన్.

46

వ.

అంత నంతర్ముఖులుంబలె వలీముఖులు ప్రమోదంబునుం బలె సేతుపథంబును సంసారంబునుంబలె దుస్తరంబగు నకూపారంబునుం గడచి సద్యఃప్రకాశమానవిస్ఫూర్తి యగుసువేలగిరీశమూర్తిం గనుంగొనుచు డెందంబున నమందానందంబు నొంది రప్పుడు.

47


చ.

తపనకులాధినాయకుఁడు తావుగఁ గైకొనె నావృతస్ఫుర
ద్సిపులతటోజ్జ్వలద్బలనివేశనిరంతరసాలజాలముం
గపికులఘోషశీర్యదురుకందరమందిరగర్భసంత్రస
త్కుపితమృగేంద్రభీతమదధూర్వహవేలము నాసువేలమున్.

48


వ.

ఆసమయంబున దశముఖుండు శుకముఖంబున నతీతనదీసార్వభౌముని నధిగతసువేలారాముని రాముని నెఱింగి వెండియుం దదీయబలంబు విశదంబుగాఁ దెలియుటకునై పరిప్రేషితులును, విదితవేషవిభీషణప్రేరణకుపితకపిలోకనియంత్రణనితాంతఖిన్నులును విపన్నాధారదాశరథివిమోచితప్రాణులు నగుశుకసారణులవచనంబులవలన మహోత్సేధం బగుసౌధంబు నధిరోహించి వేర్వేఱఁ దదావేద్యమానులును బ్రవర్ధమానసమరసన్నాహమతులు నగువానరసేనాధిపతుల నతిధీరతావశంబున సావధీరణంబుగ నవేక్షించి ప్రతిపక్షబలప్రశంసు లైనయయ్యిరువుర నుపేక్షించి శార్దూలప్రముఖప్రౌఢగూఢచారులచే నవగతాశేషవృత్తాంతుండును దాంతుండును నై పెద్దయుం బ్రొద్దు చింతించుచు నంతికాసీనుండును నతివినీతిప్రహ్వుండును నగు విద్యుజిహ్వునితో మంతనంబు నేమేమొ నొడివి ప్రాసాదంబువలన నవతీర్ణుండయ్యెఁ దత్క్షణంబున.

49


విద్యుజ్జిహ్వుని మాయకు సీత విలపించుట

గీ.

అతఁడు సధనుశ్శరము రఘుపతిశిరము, మాయ నిర్మించి సమరసమాహృతమని
జనకసుతమ్రోల వైవ వాసంతిలతకు, నశనికైవడి దుఃఖదం బయ్యె నదియు.

50


క.

రక్షోవరోధవసతియు, రాక్షసరక్షోపరోధరావణదుర్వా
గ్రూక్షత యదర్థ మోర్చితి, తత్క్షయముం గనియు సీత తగునా బ్రతుకన్.

51


వ.

ఇత్తెఱంగున నత్యాహితమత్యాకులతాసమేత యగుసీతనుం గనుంగొని చేరి యోజనకరాజకుమారీ, యీదశ యాదశముఖునిమాయ యందున కేమాయె, నీ మనంబున ధైర్యవైధుర్యంబు నొందకు మఖిలజగతీధుర్యభుజబలాభిరాముం డైనరామునెడ నిట్టియకార్యం బవిచార్యం బని సుధాధారలు

గులుకం బలికిన విని యాసారావలంబిని యైనకాదంబిని ఘర్మోద్వేగిని యైనకేకినింబలె సరమ కర మాశ్వాసించె నంత.

52


చ.

మతిగలమాల్యవంతుఁ డనుమంత్రి త్యజింపుము సీత నన్నచో
నతికుపితాత్ముఁ డౌనలదశాస్యుఁడు వాని లఘూకరించి తా
నతనుభుజప్రతాపయుతుఁ డౌటను దోన బహూకరించె స
మ్మతి నలయప్సరోయువతీమండలము న్నవమాల్యవంతమున్.

53


వ.

అంత ననంతకల్యాణగుణాభిరాముం డగురాముండు కామరూపవిభీషణామాత్యవిదితరక్షోనగరరక్షోదంతుండును, హృదంతరోపజాతసమరసంరంభుండును నై, యంభోధిమేఖలాలంకారలంకాద్వారస్థుం డగుప్రహస్తునకుఁ బర్యస్తాహితప్రాణానిలతాభీలుని నీలుని, దక్షిణద్వారరక్షణదక్షు లగుమహెూదరమహాపార్శ్వులకు విశ్వత్రయవిజయధౌరేయుఁ దారేయునిఁ, బ్రత్యగ్ద్వారపాలనఖేలనామోదుం డగుమేఘనాదున కవక్రపరాక్రమశ్రీమంతు హనుమంతుని, నంతర్వ్యూహవిహితరక్షుం డగువిరూపాక్షునకు రక్షఃప్లవగఋక్షధ్యక్షులఁ బ్రతినిధులం గావించి యధిజ్యకోదండమండితభుజాదండుం డై తమ్ముండునుం దానును సమరాభిముఖదశముఖగుప్తోత్తరగోపురద్వారంబును నంతరంగంబగు బలయూథంబుతో నుపరోధించిన.

54


క.

లంక న్దనుజులు ప్లవగా, తంకంబునకుం దలంకి తలువులు వేయన్
శంకింపర యమపురిఁ ద,త్కింకరు లప్పుడు బెడానఁ దెఱచిరి తలుపుల్.

55


వ.

తతక్షణంబ లక్ష్మణాగ్రజుఁడు సుగ్రీవసహితుం డై సువేలాద్రికూటంబు నధిరోహించి త్రికూటావనీభరచూడామణియును, సింహలద్వీపకమలకర్ణికయను, విశ్వకర్మనిర్మాణకౌశలంబును, నిశాచరకేసరినివేశదరియును, ననారతబందీకృతామరపురంధ్రీబాష్పనదీమాతృకోపవనసీమయును, నిరంతరసేవాసమాగతదిక్పాలకులమాతంగమదాంబుపంకిలబాహ్యాంగనోత్సంగియు నగు లంకం గనుంగొనుచు నందొక్కచోట సముత్తుంగసౌధంబున నధివసించి యున్నవాని సదేహబంధం బగునంధకారంబుచందంబునం దగువాని సేవాసమాగతసతారకవిభావరీవరోపమానానుచరోదస్తవిమలముక్తాతపత్రచ్ఛాయ నుండువాని వైమానికవధూవిధూయమానధవళచామరద్వంద్వశోభితుం డై యభితశ్చలితమందాకినీపరీవాహం బగునంజనశైలంబుకరణి రాణించువాని నిఖలజగద్విజయవర్ణావళీమతినిర్ణాయకానేకవివిధసమీకాభిఘాతమగ్నభుగ్నై

రావతవిషాణకులిశాగ్రత్కీర్ణవిశాలవశుస్స్థలఫలకుం డగువాని నానీలతమాలసచ్ఛాయుండును నాచ్ఛాదితాభినవలోహితపటుండును నై యాపాటలసంధ్యారాగబంధురం బగుకంధరంబునుంబలె నున్నదశకంధరుం గనుంగొనియె నప్పుడు.

56


ఉ.

మీటె న్బానుజుఁ డుగ్రుఁడై యెగసి పేర్మి న్దైత్యయూథాధిరా
ట్కోటీరంబుఁ దటానఁ దోడనె కుదుర్కోఁ జేసె వైభీషణం
బాటోపంబునఁ బోరి మాయి యగులంకాధీశుతో మళ్లెఁ ద
త్కౌటిల్యంబు నెఱింగి రాముసుగుణగ్రామాభిరాముం గనన్.

57


అంగదుని రాయబారము

సీ.

అంత రామునిచే సమాదిష్టుఁడై మంత్రిసమ్మతి సాధిష్ఠశౌర్యశాలి
వాలిసూనుండు సలీలంబుగాఁ గోట దాఁటి లంకారాజధానిఁ జొచ్చి
శంకావిహీనుఁడై హంకారి యగునసురేశ్వరు నీక్షించి యిట్టు లనియెఁ
బౌలస్త్య విను మేను భవదీయనిశ్వాసగంధివాలధి యైనకపికులేంద్రు


గీ.

నందనుండను ఖరదూషణత్రిశీర్షు, లాదియగు యామినీచరాధ్యక్షులకును
నంతకుం డగుమారీచహంత కనుఁగు, బంట నంగదుఁడను దైత్యకంటకుఁడను.

58


క.

తలఁచెద వసురా రఘుపతి, కీలను దృతీయాక్షి యగుమహీజను గదియన్.
జలజ మని శివునొసలిచూ, పెలమిం బ్రాపించు గాంగభృంగముభంగిన్.

59


ఉ.

ఒక్కమొగంబు హైహయనృపోగ్రపరాభవ మొంది వాడె వే
ఱొక్కటి దైత్యరాడవినయోన్నతి నోక్కటి మద్గురూధ్ధతిన్
నిక్కము నీకతాన నజునెమ్మొగము ల్గడుస్రుక్కె రావణా
చిక్కినమోము నీవటులు సేయకు రామున కిమ్ము జానకిన్.

60


ఉ.

కొట్టి కుబేరఫుష్పకము గొంటిఁ బెగల్చితి వెండికొండ ని
ట్టట్టనరానిదిక్పతుల నందఱనుం బఱిగొంటి నంచు హా
యెట్టు వచించె దోరి తగవే విజనం బగు కాననంబులో
నెట్టన మౌనివేషమున నీవు హరింపవె యమ్మహీసుతన్.

61


చ.

ఘనతరభక్తితోడ శితికంఠున కింపు ఘటింప వేఁడి యా
నననవకంబు ము న్బలియొనర్పవె యం దవశిష్ట మౌశిరం
బనుపమబాణపంక్తి కుపహారముగా నొనరింపనెంచె న
ద్దినకరవంశ్యమౌళి రణదేవతకున్ న్రజనీచరాధమా.

62

వ.

అని తనయరుంతుదభాషణంబుల సరోషోన్మేషుం డైనదోషాచరేంద్రుం డిక్కటుప్రలాపోత్కటు మర్కటుం బట్టుండు కొట్టుం డని పంప నాలంబితభుజప్రకోష్ఠు లగునసురశ్రేష్ఠుల నలువుర న్విహంగపుంగవుండు భుజంగంబులభంగి నెత్తికొని గుప్పున నుప్పరం బెగసి తెప్పున నేలకుం బడవైచి పాదాఘాతంబునం బ్రాసాదశృంగం బరాతిశృంగంబుతెఱంగున విఱుగఁదన్ని తన కెదురులేమి తెల్లం బగుటయు నుల్లంబునం బల్లవించునుల్లాసంబున రామసేనానివేశప్రవేశం బయ్యె నంత.

63


చ.

కమలహితాన్వయుండు దశకంఠుని భావ మెఱింగి కిన్కతో
బొమ ముడివెట్టఁ దోన హరిపుంగవు లెల్లను లంక నుగ్రవి
క్రమమునఁ జుట్టుముట్టిరి యుగప్రలయావసరంబుల స్ససం
భ్రమముగ వార్ధిఁ జుట్టుకొను బాడబకీలలమాడ్కిఁ గ్రక్కునన్.

64


ఉ.

భూవియదంతరంబు పరిపూర్తిగ నిండెఁ గపీంద్రఘోరసం
ద్రావితతత్క్షణక్షుభితరావణకింకరపాణికోణనా
నావిధతాడనంబుల ఘనాఘనగర్జీతబంధుభావసం
భావితజైత్రదుందుభిసమగ్రమహోగ్రధణంధణార్భటుల్.

65


వ.

ఇట్లు సమంతతఃకందళజగద్దళనసంధాధురంధరం బగుదుందుభి గంభీరఘోషంబున రోషంబునం బ్రేరితు లై గిరికందరంబులనుండి ప్రబుద్ధంబు లై వెడలుసింగంబుల తెఱంగున మందిరంబులనుండి నిర్గమించినయపత్యంబులుం బలె గత్యంతరాయసంధాయకంబు లగుదుర్నిమిత్తంబులం గనుంగొనక విమానాధిగతవిబుధసీమంతినీవిహరణేచ్ఛులుంబలెఁ బ్రస్థానసమయపరిమ్లానముఖు లైన చంద్రముఖుల నెంచక నిరంతరజ్వలితకోపానల నయనకోణారుణాలాతశతనిపాతవిత్రాసచలిత నిజవారణనివారణాదేశపరవశులును, దిశాముఖముఖరశివారవామ్రేడితక్ష్వేళితవ్యాకులీకృతకులమహీధ్రులును, గృధ్రపక్షవిక్షేపకృతపతాకానికాయపౌనరుక్త్యసముత్తుంగశతాంగసంఘాతపరిగతులును, నితాంతనిర్జితకృతాంత దంష్ట్రాపట్టఖరనఖర పట్టసప్రాసపరశుగదాయుసలపరీఘదృఢకృపాణధారులును, దారుణాజగరసంతానసంవీతంబు లగువింధ్యకూటంబులో యనంగ వ్యూఢాతికరాళకాలాయనకంకటులును, జాలాంబుదంబులకు వికల్పంబులును, గాళరాత్రికి నభివ్యక్తులును, గలికాలంబునకు వివర్తనంబును నగుచుఁ గాలునకు సైతంబును భయంకరాకారంబులును నై సంగరాంగణంబునకుం జను

దెంచి వీరాలాపంబు లాడుచుఁ జాపంబులుపూని ధారాసంపాతంబులతో ధరాధరంబులం గప్పునంభోధరంబు లనంగ దూరాపాతు లగుశిలీముఖంబుల రక్షోభటు లఖలవలీముఖబలంబును విక్షోభంబు నొందించి రాసమయంబున.

66


చ.

కరజధుతాయుధంబు తరుఖండితతోమరము న్శిలాహత
స్ఫురదురుముద్గరంబు ఘనభూధరభిన్నమదావళంబు నై
కరము దివి న్స్వపక్షజయకాండను బూని సురాసురుల్ గనన్
హరులకు దైత్యవీరులకు నయ్యె భయంకరసంగరం బొగిన్.

67


వ.

క్రమంబునం గుపితకపివీరదూరీకృతనైరృతబలం బగుదశగ్రీవభుజబలంబునుం బలె భానుమంతుం డస్తమయంబునొంద మథితాయుధికగళనాళప్రణాళీపరివాహి యగులోహితనదీపూరంబు తీరున దూరాంతరితహరిదాభోగం బగు సంధ్యారాగంబు గనుపట్ట విక్రాంతహరినఖాక్రాంతదంతావళవిపులకుంభస్థలముక్తముక్తాకలాపంబువడువున నుడుగణంబు వియత్ప్రదేశంబునం బ్రకాశింప రణరభసచలితరథతురగపాదాతగజపాదాహతవిశ్వవిశ్వంభరాంతరాళసంభవం బగురజోవ్రజంబువిధంబునఁ దమస్స్తోమంబు దిక్చక్రంబు నాక్రమింప నిలింపవిమతానీకంబులుంబలెఁ జక్రవాకంబులు సశోకంబు లగుచునుండ దశరథకుమారచమూత్కరంబు తెఱంగునఁ గుముదాకరంబు ప్రమదాకరం బై రహింప నప్పుడు.

68


ఇంద్రజిద్యుద్ధము

మ.

సరవిం గాలభుజంగభీకరశరాసారంబు వర్షించుచుం
బురుహూతాహితయోధయూథములకు న్మోదంబుఁ బుట్టించుచున్
సరసాహ్లాదుఁడు మేఘనాదుఁడు మహాసంగ్రామరంగంబునన్
హరుల న్నొంచెను మేఘనాదమొగిఁ జక్రాంగవ్రజంబు న్బలెన్.

69


చ.

ప్రతతభుజప్రతాపరిఫుభంగదుఁ డంగదుఁ డొక్కవృక్ష మా
యతముగఁ బూని దారుణరణాంగణభూమి హయాళి నొంచి యు
ద్ధతగతిఁ గూల్చె రావణిరథంబు సదైత్యమనోరథంబుగా
శితశతకోటిధారఁ గొని జిష్ణుఁడు పర్వతకూటము న్వలెన్.

70


ఉ.

డాయక యంబరంబుననె డాఁగి దశాస్యతనూభవుండు బ
ల్మాయ ఘటించి రాముని సలక్ష్మణు లక్ష్యముగా నొనర్చి య

త్యాయత జిహగాకృతి నుదారము లైనయజిహ్మగంబులం
బాయనిరోషవేగమునఁ బైనిగిడించెఁ గపుల్ భయంపడన్.

71


గీ.

సరసలక్ష్మణయోగనిస్తంద్రుఁ డైన, రామచంద్రుని బంధించె రాహుభీక
రంబు లగుతచ్ఛరంబు లౌరా సమస్త, బంధనిర్మోచనుండును బద్ధుఁ డయ్యె.

72


చ.

చెలఁగుచు నింద్రజిత్తు పురిఁ జేరెను రావణునాజ్ఞఁ బూని మై
థిలియు విమాన మెక్కి నరదేవులఁ జూచి తపించె నంతలో
దలఁగెను నాగపాశములు తార్క్ష్యగరుత్పవనాంకురంబుచేఁ
బొలిచి రాకుమారు లహిముక్తరవీందులమాడ్కిఁ జూడ్కికిన్.

73


ఉ.

రాక్షసవానరేంద్రనికరంబును ఘోరరణం బొనర్ప ధూ
మ్రాక్షుని నయ్యకంపనుని మారుతసూతి వధించె వజ్రదం
ష్ట్రక్షణదాచరుం గెడపె సాహసి యంగదుఁ డంత నీలుఁడు
న్దత్క్షణమే ప్రహస్తనిధనం బొనరించె వినె న్దశాస్యుఁడున్.

74


వ.

ఇట్లనీకినీనాథవధంబు విని వినిద్రకోపోద్రేకజృంభమాణాయోధనోత్కంఠుం డగుదశకంఠుండు సకలజగదండభరితజయానకభయానకనినదబధిరితాశేషశేషాహిలోచనుండును రోచిష్ణుజిష్ణుకోదండధరుండును నై జలధరంబు సముత్తుంగం బగుసుమేరుశృంగంబునుంబలె శతాంగంబు నలంకరించుచు సర్వతశ్చలితచతురంగసంఘుం డగుట ననుగమ్యమానలంకానగరుండునుంబలెఁ గ్రమంబునఁ బురతోరణం బతిక్రమించి పురతోరణవ్యాపారం బగువానరపరివారంబుం గనుంగొనియె.

75


గీ.

ఇట్లు చనుదెంచునిఖిలదిగీశజేత, నసురనేతను జూచి యయ్యర్కకులుఁడు
నిజశిరము నూఁచెఁ దత్సవ్యభుజశిరంబు, నపుడ యదరెను జెదరెను గపిబలంబు.

76


వ.

ఇత్తెఱంగున నప్రతిహతవిహారుండును మదగర్జితర్జితదిగంతదంతావళుండును నై మహార్ణవంబునం దిరుగు నాదివరాహంబుచందంబున వరాహవోన్ముఖుం డగుదశముఖుండు కందళితాస్కందనామర్షుండును నుపరిపరికలితగిరివర్షండును నగుహరిపతి నిష్ఠురముష్టిఘాతప్రదాతయగు వాతాత్మజుని నమోఘలాఘవాక్రాంతధ్వజకిరీటాంచలుండగు నీలుని నిఖిలజగద్విజయోజ్జ్వలం బైనమహాబలంబున వాతూలంబు తూలరాశింబలెఁ దూలించుచు నవిరతశరాసారవర్షంబుతో నభ్యమిత్రీణుం డగుసౌమిత్రియురస్స్థలంబున మహాశక్తి నాటించి మూర్ఛితుం జేసె నంత.

77

క.

అనుజుని నశ్రుజలంబుల, దనుజుని శరములను ముంచె దాశరథి మిళ
ద్ఘనకరుణవీరరసుఁడై , పొనరిచె శుక్ప్రమదశబలముగఁ దనబలమున్.

78


గీ.

అనుఁగుఁదమ్ముండు గతమోహుఁ డగుచు ననికి, నెంతలో నున్ముఖుం డగునంతలోన
దితిజపతి గెల్చి రఘుపతి యతనిచటుల, [2]ప్రాణము ల్గొని డిగవైచె బాణములను.

79


గీ.

అపుడు రఘువీరశరనిహతాంగుఁ డగుచుఁ, బ్రథమయుద్ధంబునంద పరాభవంబు
నొంది గతవైభవత లంకఁ జెందె నలద, శాననుఁడు దినదీపదశాననుండు.

80


వ.

అంత.

81


కుంభకర్ణయుద్ధము

క.

అసురపతి కుంభకర్ణుని, నసమయమున నిద్రలేపె నగ్రజునాజ్ఞన్
దెసచెడి యతఁడున్ వెడలె, న్వెస నని కపునఃప్రబోధనిద్రార్థం బై.

82


వ.

ఇట్లంజనాచలనికాశుండును బ్రకాశమానకరతలభ్రమితత్రిశూలుండును నై జగత్క్షయోద్యుక్తుం డగుశూలధరుండునుం బలె నరుగుదెంచు నక్తంచరస్వామ్యనుజుం జూచి శామ్యత్సహభుజతేజోవిశేషంబును నశేషదిగ్ధావమానంబును బవమానచలితజలదపారిప్లవంబును నగుప్లవంగమబలంబుం గనుంగొని యంగదుం డభంగురధీరవచోభంగి ని ట్లనియె.

83


క.

కపులార కైకసేయులు, విపరీతమతి న్ఘటించు వెఱబొమ్మసుఁడీ
యిపు డింకఁ బ్రాకృతం బగు, నుపకృతభయవైకృతంబు నుడుఁగుఁడు మీరల్.

84


గీ.

అనిన విని యుద్ధసన్నద్ధు లగుచు హరులు
దిక్కరులమాడ్కి మరలుచు దివిజగజము
పగిది మత్తిల్లు ఘటకర్ణుపైనివైచి
రగములు లయానిలములు వింధ్యాద్రిఁబోలె.

85


చ.

పొలిచె వలీముఖప్రహితపుష్పితవృక్షము లెల్ల స్విన్నతా
కలితసురారివక్షమున గందవొడింబలెఁ జూర్ణతంబు లై
పలుమలు యుద్ధభూమి వలబల్లిదుపేరెదఁ దాఁకి నిష్ఠురా
చలములు కొన్ని వేమరలి సల్సెఁ బ్రహర్తకు ఖేదభేదముల్.

86


క.

నేల వడంకఁగ నొకచే, శూలము శిఖినిభముఁ ద్రిప్పుచు న్మత్తుం డై
తూలించె గంధమాదను, నీలుని ఋషభు న్గవాక్షుని న్శరభునినిన్.

87

సీ.

అంతటఁ గపివీరు లతినైజచాపలాధిగతలాఘవు లౌచు దీనదశను
జెంది రాఘవు శరణొంద నేగుటఁగని యాశ్చర్య భుజవీర్యుఁ డగునినజుఁడు
వారల నెల్ల నాశ్వాసించుచును జేరి వైరిపైఁ దరుగిరు ల్వైచికొనుచు
జిత్రయుద్ధంబు సుస్థిరముగ నొనరించి తన్ముక్తఘనశైలతాడితాంగుఁ


గీ.

డగుచుఁ గులిశాహతం బైనయద్రివోలె, వ్రాలెఁ జేతనహీనుఁడై వ్రాలునతని
నసుర కొనిపోవ వాలికృతావమాన, మడఁగ సురవైరిఁ గని తదీయబల మలరె.

88


వ.

అం దమందకుసుమపరిమళఝరీమిళచ్ఛిశిరరథ్యోపచారసచేతనోద్గ్రీవుం డగుసుగ్రీవుండు సచమత్కారంబుగా నుల్లంఘితప్రాకారుండును దారుణాకారుండును నగునక్తంచరవీరుని నఖముఖాకలితశూర్పణఖాముఖానుకారునిం గావించి యుచితలాఘవంబున రాఘవసదేశప్రదేశంబు చేరిన నంతఁ గుంభకర్ణుండు భానునూనుం గానక ప్రతినివృత్తుండును మత్తుండును విషమతారేక్షణుండును బ్రతిక్షణంబునఁ బ్రతిపక్షబలంబులంబలె స్వపక్షబలంబును భక్షించుచు లక్ష్మణుని లక్షీకరింపక తుంగం బగుశైలశృంగంబునుం బ్రయోగించుచు నతివేగంబున రామునిం జేరిన.

89


శా.

ఆయిక్ష్వాకుకులుండు సత్వరముగా నయ్యద్రిశృంగం బలి
స్ఫాయత్తీవ్రతరార్ధచంద్రనిహతిన్ భంజించి యామేటిమై
చాయం దూపులు వాలిసౌంద ఖరదోశ్శౌర్యఘ్నము ల్జాలమి
[3]న్వాయవ్యైంద్రము లేసె శాత్రవవధూవైధవ్యదంబు ల్వడిన్.

90


సీ.

అంత రాఘవబాణహతరాక్షసాంగంబులం దొక్కభుజము మంథాద్రివోలెఁ
బడియె వానరసైన్యపాథోనిధానంబునందు వేఱొకభుజం బబ్ధిలోనఁ
బతితమై కనుపట్టె వితతమౌ రెండవనలసేతురీతిచిహ్నంబు లందు
మఱి తృతీయంబైనమస్తకంబు చెలంగె నింగి త్రికూటంబు శృంగముగను


గీ.

నప్పు డాభీలశాఖామృగాతివేల, నవ్యకోలాహలాకర్ణనంబువలన
బవరమునఁ గుంభకర్ణునిపాటుఁ దెలిసి, తాంతముఖుఁడై పదంపడి దశముఖుండు.

91


వ.

మహెూదరమహాపార్శ్వుల రావించి సహాయులం గావించి కుమారు లగు నరాంతకదేవాంతకాతికాయత్రిశీర్షులం బంప వారలును దరసాశనపతినిదేశంబు శిరసావహించి పితృపతినివేశనంబునుంబలె సమీకప్రదేశంబుం బ్రవేశించి రాసమయంబున.

92

క.

తరుచరనిశిచరవరులకు, దురము సరోషహతశిరము దుష్కరము మరు
త్తరుణీప్రమోదకరము, న్సురమునికి నదృష్టచరము సొరిదిం గలిగెన్.

93


గీ.

తరుచరాంతకుఁ డగునరాంతకుని దునిమె
నంగదుండు హనూమంతుఁ డంతఁ గడఁగి
యలసురాంతకుఁ గెడపెఁ బురాంతకుండు
భీకరాంతకు నడఁచినవీఁక దోఁప.

94


వ.

వెండియు నసమసమరశీలుం డగునీలునిచే మహోదరుండును, మరున్నందనుచేఁ ద్రిశిరుండును, మహాపార్శ్వావాహినీపతులునుం దెగుటయు విషాదరోషపరవశుం డై నిశాచరాకారం బగునంధకారనికాయంబునుంబలె నతికాయుండు సుమిత్రాపుత్రునిం గినిసి వృత్రాసురుండు సుత్రామునితో బలెఁ జిత్రాహవం బొనరించె.

95


గీ.

అతఁడును భుజాభుజిఁ బెనంగి యితఁ డవధ్యుఁ
డనుచు ననిలోక్తిఁ దెలిసి బ్రహ్మాస్త్ర మేయ
నప్పు డయ్యసురునిశిరం బవనియందుఁ
బడియె రాహువుబలె నతిభయద మగుచు.

96


వ.

అంత.

97


ఇంద్రజిత్తు రెండవయుద్ధము

గీ.

విధురుఁ డగుతండ్రి నూరార్చి పృథురణధుర
రథియు సధనుశ్శరధియునై రావణియును
దాశరథి కున్ముఖుం డయి తరలి వచ్చె
నాశరచమూశరధియుఁ దన్నాశ్రయింప.

98


వ.

వచ్చి సమరంబున నరాతిజయమనోరథంబుకొఱకు రథరక్షార్థంబుగా, రాక్షసుల నలుగడల నుండ నియమించి ప్రదక్షిణశిఖుం డగుశిఖావంతుని హవిరర్పణంబున సంతర్పితుంజేసి మంత్రాధిగమవిచిత్రంబు లగునస్త్రంబులు ధరియించి తిరోహితుండై నిశితముఖంబు లగుశిలీముఖంబుల నిఖలమర్మాహతినిర్మాణాలంకర్మీణుండై క్రవ్యాదుండు వ్యాధుండునుంబలె హరుల విధురులం గావించి.

99


క.

అకుటిలు రాము సలక్ష్మణు, వికలాశయు విధురసత్త్వు విరచించె నితాం
తకఠోరగ్రీష్మము త, మ్మికొలనిబలెఁ జేరె నంత మేటై లంకన్.

100

చ.

క్షతరుచిరామచంద్రముగ శామ్యదినోద్భవదీప్తి గాఁ గృతో
ద్ధతశరవృష్టియై ఘనుఁ డతం డరుగం జలజీవనంబు ను
ద్యతకుముదంబు నస్తనలమాహతనీలమహోత్పలంబు జృం
భితవరలక్ష్మణం బయి తపించెను వాహిని తత్క్షణంబునన్.

101


గీ.

వాయునందనుఁ డతివేగవంతుఁ డగుచు, జాంబవంతునియాజ్ఞ నౌషధనగంబుఁ
దెచ్చిన విశల్యమయ్యె నెంతేబలంబు, స్వర్గులమనంబును విశోకశల్య మయ్యె.

102


వ.

మఱియును సహజతేజస్సముజ్జ్వలం బగుదవానలంబునుంబోని వానరబలంబు చెదరికొనువిధంబున దందహ్యమాన యగుపురినుండి దశాస్యనిదేశంబున హరిగతి న్వెడలునిఖిలలోకప్రకంపనుం డగునకంపనుండును నాహతప్లవంగసంఘుం డగుప్రజంఘుండును నంగదప్రతాపానలంబునకు శలభంబు లగుట విని మహారథు లగువిరూపాక్షయూపాక్షులు మైందద్వివిదవారితు లగుటఁ గనుంగొని కోపాటోపవిజృంభమాణసంరంభు లగుకుంభనికుంభులు సుగ్రీవహనుమంతులతోడ మారీచసుబాహులు రాఘవునిభుజంబులతోవలె సముత్తభితభుజు లగుచు మహాద్భుతయుద్ధం బొనరించిన యనంతరంబ.

103


క.

ఇనజునిచేఁ గుంభుం డని, మొనఁ దెగినఁ దదీయవిరహమును సైఁపక పా
వనిచే నికుంభుఁ డమరీ, స్తనకుంభావాస మొందెఁ దన్నామధృతిన్.

104


గీ.

అంతనసురాధిపనియుక్తు లఖిలసైన్య, యుక్తుఖరసూను మకరాక్షుయుద్ధముఖరు
నిజవిపక్షుసపక్షతానిరత మగుచు, జనకుఁ జేర్చెను నైక్ష్వాకుసాయకంబు.

105


చ.

జనకునియాజ్ఞ మౌళి నిడి సంఖ్యముఁ జేరి మహేంద్రజేత యం
దనలుని వేల్చి యస్త్రచయ మంది దివంబుననుండి మాయచే
ఘనశరము ల్నిగిడ్చి బలగర్వము లెల్ల నడంచి రాము కో
పనత యెఱింగి భీతుఁడయి పట్టనముం జొఱఁబాఱెఁ గ్రక్కునన్.

106


వ.

అంతఁ బ్రత్యక్ప్రతీహారంబుననుండి ప్రాతిహారీకుండైనయతండు నిర్గమించి యాంజనేయసన్నిధానంబున మాయాసీతను నిశాతహేతిచేత విదారితం జేయుటయు సాకులితస్వాంతుం డైనహనుమంతుం డతథ్యంబు నాకస్మికంబు నయిన యది తధ్యంబుగాఁ దలఁచి యుద్ధం బొనర్చి నిరాశుండై దాశరథిసదేశప్రదేశంబునకుం బోవునవ్వేళ నయ్యంద్రజిత్తు పశువిశసనప్రారంభియై నికుంభిలాస్థలింజేరి విచిత్రసత్రప్రవక్తకుం డయ్యె నయ్యవసరంబున హనుమదావేదిత

మేదినీసుతావృత్తాంతుఁడై రామభూమీకాంతుండు వజ్రనిర్ఘోషంబున మానసచరం బగు రాజహంసముంబలె విదీర్ఘమానసుండై నేల వ్రాలి సౌమిత్రిచేత నాశ్వాస్యమానుం డగుచు సకరుణంబుగా బిట్టునిట్టూర్పు నిగిడించుచు విలపింపం దొడంగె.

107


చ.

అరణినిఁ గీలలీల జనకాధ్వరవాటమునందుఁ బొందుగా
ధరణినిఁ బుట్టినట్టి యతిధన్యవు మానవవంశ్యరత్నమై
గురుయశ మొందుపంక్తిరథుకూరిమికోడల వెంచ నిట్టి నీ
కరయ విరామ మయ్యెఁగద హారఘురామున కేమి చెప్పుదున్.

108


క.

పవనజుయత్నము వృథ నలు, నవసేతుక్రియ యథావినాశిని విశిఖం
బు విహతత నందె నీదృ, గ్భవదీయ శుగబ్ధి దాఁటఁగలనా? లలనా!

109


ఉ.

మానుగ నెందునేని బవమానతనూజునిపూన్కి వ్యర్థ మెం
దేని నవీనసేతుకృతికి న్నలుఁడుం జతురత్వ మొదఁ డెం
దేని మదగ్నిబాణమును దీక్ష్ణముగా దిటువంటినీశుగం
భోనిధి నిస్తరింప ననుబోఁటికి శక్యమఁటే వధూమణీ.

110


వ.

ఇత్తెఱంగున విలపించురామునిం గనుంగొని విదితాసురమాయావిశేషుం డగువిభీషణుండు దేవా నీవంటిమహానుభావునకు నస్థానంబున దీనం బగునవస్థాంతరం బేటికి నిరంతరాయమఖనిర్వర్తనార్థంబుగాఁ బురందరారి యొనరించిన కపటకృత్యం బిది, సత్యంబు గా దని తద్వధంబునకు లక్ష్మణుం బురస్కరించికొని నికుంభిలోపరోధంబు గావించిన.

111


చ.

హరిపరివారఘోరనినదారభటిం జలితాంతరంగుఁ డై
గిరిదరినుండి వెల్వడినకేసరియుంబలె రోషభీషణ
స్ఫురణముచేఁ దదధ్వర మపూర్ణముగా నెఱవేర్పఁజేసె దు
ష్కరమగుసంగరంబు బలశాసనశాసనుఁ డద్భుతంబుగన్.

112


క.

ఆవానరసేనకు ఝం, ఝాపాతూలంబు తూలచయమునకుబలెన్
రావణతనయాగ్రణి వి, ద్రావణుఁడై సంచరించె రణరంగమునన్.

113


వ.

ఇట్లనుపదంబును ననీకోన్మథనసంరబ్ధసంవర్తవర్తియగు సమవర్తిచందంబున నమందస్యందనారూఢుం డై వచ్చుసంక్రందనపరిపంథిం గనీ గంధవహనందనస్కంధవర్తి యై సౌమిత్రి ప్రవర్తితనిశితశరధారుం డై శతధారపాణి జంభాసురునింబలె స్తంభితుం జేసిన.

114

మ.

అపు డన్యోన్యమదోత్కటంబును సముద్యద్వీరవాదోద్భటం
బు పరిత్రుట్యదుదారకంకటభరంబు న్భిన్నశస్త్రాస్త్రకం
బు పరిజ్ఞాతజయాశయంబును ద్రిలోకాత్యంతభీమంబుగా
ద్విపరాజంబులభంగి సంగరము నర్థింజేసి రయ్యిర్వురున్.

115


క.

పవిశిఖవిశిఖముల సహ, స్రవిఖండము గాఁగ మౌర్వి సవరించి యనిం
బ్రవిహతసారథిగా నిం, ద్రవిరోధి నొనర్చె దాశరథి యధికధృతిన్.

116


ఉ.

మాయికి నేది యుక్తమొ సమగ్రభుజాబలశాలి కెద్ది యీ
డో యసురేంద్రనందనున కోపిక యెంతయొ యింద్రజేత కా
హా యిపు డేమి యొప్పగునొ యంతయుఁ జేసె నవార్యశౌర్యధౌ
రేయుఁడు రావణాత్మజుఁ డరీణరణోర్వి నిజోచితంబుగన్.

117


వ.

అంత నరిభీషణంబుగా ఘోషించుచున్నవిభీషణుపై నక్తంచరేంద్రనందనవిముక్తం బైనశక్తి నర్ధచంద్రబాణంబుచే నివారించి తదీయదుర్వినయంబు సైరింపక సుమిత్రాపుత్రుం
డమోఘలాఘవనిస్తంద్రంబైన యైంద్రాస్త్రంబుఁ బ్రయోగించిన.

118


క.

వ్రాలెఁ దదస్త్రము మఱియును, వ్రాలె నృశిరస్త్ర మ య్యరాతిశిరంబున్
వ్రాలె భువిఁ బుష్పవృష్టియు, వ్రాలె న్మఱి బాష్పవృష్టి రక్షోంగనకున్.

119


వ.

తత్క్షణంబున సహస్రాక్షజిద్వధంబు నాకర్ణించి శోకోద్రేకంబున రక్షో౽ధ్యక్షునిముఖంబులు నితాంతక్లాంతంబులును నిశ్వాసధూసరంబులును నిర్గళదశ్రునిష్యందంబులును నిర్వేలాక్రందంబులును నిరవధికఫూత్కారంబులును నిగాఢకోపాటోపవిపాటలంబులును నిరూఢకంటిలితభ్రూవల్లికంబులును నిఖిలభీకరవృత్తేక్షణంబులును నిర్దష్టాధరోష్ఠంబులును నిష్ఠురాట్టహాసంబులు నయ్యె, ననంతరంబ పురందరారిప్రముఖవిక్రాంతు లపక్రాంతులును కుంభకర్ణాదిసోదరులు నిహతులును బ్రహస్తపూర్వకసచివులు విధ్వస్తులును విరూపాక్షుప్రభృతి సేనాపతులు వ్యాపాదితులును నిఖిలబలంబు నిశీర్ణంబును లంక పౌరవధూజనకరుణపరిదేవనోత్తరంగ యగుటయు నాతంకాతిశయరోషణుం డై రావణుండు హర్యక్షంబు హరిణింబలె నిక్ష్వాకునాయకుదయితను హింసింప నిశ్చయించి యంతికగతమంత్రిచే నివార్యమాణుండై సారథిసంచోదితరథుండును దాశరథిజయవిహితసంగరుండును నగుచు సంగరాంగణంబున కరుగుదెంచి.

120


రామరావణయుద్ధము

క.

శరచాపపరిఘతోమరధరుఁ, డై నైకముఖభుజతఁ దాననిలో నొ
క్కరుఁడయ్యును లోచనగో, చరుఁ డయ్యెను బంధువర్గసహితునిభంగిన్.

121

క.

దనుజేంద్రుఁడు ఖడ్గము గొని, వనచారులమస్తకములు వడినేయుచు నొ
య్యన నితఁడు నీకు నీకితఁ, డని యచ్చరలకును దెలుపునట్లు మెలంగెన్.

122


వ.

తత్క్షణం బక్షోహిణీక్షోభకందళితామర్షుండును నతిపరుషవిశిఖదలితధ్వజుండును నర్ధచంద్రనికృత్తధనుషుండును, నస్త్రధారావిదారితసారథియు నతివిస్మయనీయకరలాఘవుండు నగు నారాఘవానుజు నమర్షవేగముక్తం బైనశక్తిచే యాతుధానుండు ముహూర్తమాత్రం బుపరాగంబున నిశాకరునింబలె మూర్ఛానిమీలితుం జేసిన.

123


గీ.

రాముఁ డంతట శక్తినిర్దళితహృదయు, ననుజుఁ గనుఁగొని శోకవిద్ధాత్ముఁ డగుచుఁ
గోపమునఁ జాపముం గొని కుండలించె, వెండి విధి దైత్యుతలవ్రాలు కుండలించె.

124


చ.

వలయితచిత్రచాపుఁడును వారితపంక్తిముఖుం డతిక్రుధా
విలమతి రాఘవుండు శరవృష్టి నిగిడ్చిన దైత్యకోటిలో
పల నొకఁడైనఁ దప్పిచని పట్టనముం జొరఁడయ్యె వేలుపుం
జెలువలలో నొకరు వరుఁ జెందక యున్నది లేదు చూడఁగన్.

125


వ.

అప్పు డాంజనేయపురానీతమహీధరమహౌషధిసమేధితజీవితానుజాశ్లేషసుఖలబ్ధమనోరథుండును బ్రవర్ధమానసమరకౌతుకోఫలంభుండును సంరంభోదంచితపులకకంచుకితగాత్రుండును నగుదాశరథి యుద్ధమధ్యంబునందుఁ బురందరానుగ్రహంబుచే మాతలిసమానీతం బైనరథంబును విశంకటం బగుకంకటంబును బరిగ్రహించె.

126


పంచపాది.

సరిజో డబ్బె నటంచుఁ జూపుదురు దోశ్శౌండీర్య మన్యోన్యమున్
సరవిం గాంతురు రోమహర్షమును శస్త్రాశస్త్రి బోరాడ మె
త్తురు మే ల్మే లని సాహసించుతఱి నెంతో ప్రాణపర్యంత ని
ర్భరదుస్సంకట మైన నవ్వుదురు మూర్ఛ న్గొంతవిశ్రాంతు లౌ
దురు ఘోరాజిని రామరావణు లమర్త్యు ల్విస్మయం బందఁగన్.

127


వ.

అనంతరం బవిశ్రాంతవిముక్తదివ్యాస్త్రులును నాఖండలవృత్రసన్నిభులును నగునయ్యిరువురకును విచ్ఛిన్నంబు లగుమార్గణంబులును విలూనంబు లగుధనుర్గుణంబులును వినిహతంబు లగుదురీణంబులును నిర్భిన్నంబు లగుసాంయోగికరథంబులునుం గలుగునట్లుగా నిర్వైకల్యవిజయమనోరథంబు నిరతిశయవిశదయశోధనంబు నగునాయోధనం బయ్యె.

128

క.

పొదినుండి కొనుట పూన్చుట, తుది చేయుట తెలియ చెయ్యె దురుసున నచ్చోఁ
బదపడి యచ్చోటనె యు, న్నది యన రాఘవునిహ స్త మలవడి యుండెన్.

129


చ.

శరముల రాముఁ డర్ధపరిజల్పితచారువినాదపంక్తికం
ధరుముఖ మెద్ది ద్రుంచె నది దారున మొల్చి వచించె శేషమ
త్తఱిఁ జతురత్వరీతి నలధన్వికి మాయికి సామ్య మై కనన్
ధరణిపతన్నిజాస్యములఁ దాఁ గని లజ్జితుఁ డయ్యె దైత్యుఁడున్.

130


చ.

దనుజశరక్షతకురదుదంచితశోణితబుద్బుదాంకచం
కనదమరేంద్రకంకటవిగాఢసహస్రవిలోచనాఖ్యుఁ డై
కనఁబడె రాఘవుండు బలఖండనరోషకషాయితాక్షుఁ డై
తనరు ధరాధరాహితువిధంబున దారుణసంగరంబునన్.

131


వ.

అంత వారుణంబున వైశ్వానరంబును వైన తేయంబున వాతంధయంబును వాయవ్యంబున వారిదంబును వైభాకరంబునం దామిస్రంబును మాహేంద్రంబున దానవంబును వైష్ణవంబున మాహేశ్వరంబునుం గాఁ బరస్పరంబు నిట్లస్త్రంబుఁ బ్రత్యస్త్రంబుచే భేదించునయ్యిరువురకును నాహవాగ్రహంబున నవిదితంబు లై సప్తవాసరంబు లతిక్రమించె.

132


రావణుమరణమునకు విభీషణాదులు దుఃఖించుట

మ.

ధనురామ్నాయగురుండు రాముఁ డురుశస్త్రాశస్త్రికౌతూహల
ప్రణయుం డయ్యు విచారకర్శితసతి న్భావించి తొల్వేల్పుఱే
నినవాంకూరశిరోగణం బపునరున్మేషంబుగాఁ ద్రుంచె మా
ర్కొని బ్రహ్మాస్త్రముచే జగద్భయముతోఁ గూడన్నిమేషంబునన్.

133


చ.

ఘనభుజుఁ డాదశాస్యుఁ డతికంటకుఁ డీల్గిన లబ్ధకాములై
యెనయఁగఁ బుష్పవృష్టిఁ గురియించునమర్త్యజనాళి కెల్ల శ్లా
ఘనపద మయ్యె రాముఁ డలకాముఁడు దానటు మున్న చాలశ్లా
ఘనపదమై చెలంగెఁ బరికల్పితశూర్పణఖావికారుఁడై.

134


వ.

అనంతరంబ సమాలింగితరణవసుంధరుండును శరతల్పశయానుండును నధిగతనిషంగోపధానుండును నగుయాతుధానపతిం జేరి నేల వ్రాలి సోదరస్నేహసులభవైదుర్యుండఁ గదర్యుండ నే నని విహితనిజదూషణుం డగుచు విభీషణుండు పెద్దయుంబ్రొద్దు విలసింపం దొడంగె.

135

గీ.

అన్న సమసుఖదుఃఖులై నట్టిబంధు, జనులఁదోఁబుట్టు వగునిన్ను సాహసమున
విడిచితిఁ గులక్షయనిమిత్తవిహితధర్మ, పరుఁడ నైతి నకీర్తి నేఁ బాయఁగలనె?

136


క.

అనిఁ బ్రోవఁ గుంభకర్ణుం, డనుజుం డొకఁడుండె నీకు నతఁ డిపు డీల్గెన్
నినుఁ జంపుకొంటి నాబ్రతు, కునకై యిది విధి సహించుకొని యుండెడిఁగా.

137


వ.

అనుచు విభీషణుండు విలపించుచుండఁ దద్వృత్తాంతంబు విని శుద్ధాంతంబున నుండి దీనంబుగా మొఱవెట్టుచు సంతరితయూథనాథలగుకరేణులకరణిఁ బ్రేక్షణీయ లగుతరుణీమణులతోడం గూడి వచ్చి సమరమధ్యంబున నశనిహతమందరవసుంధరాధరంబుచందంబునం బడియున్న దశకంధరు నిరీక్షించి నిహతోపఘ్న మగు లేఁదీఁగెకైవడి హా! నాథ! హా! నాథ యనుచు విషాదాకుల యై నిషాదాహతదయితవిధురీకృత యైనకురరితెఱంగున మందోదరి యమందంబుగా నాక్రదింపం దొడంగె.

138


ఉ.

సారెకుసారె దిగ్విజయసంభ్రమవేళలయందు నీవు ము
న్నారసి యేది చూచితివొ యాయమరాట్పురి సర్వలోకసా
ధారణవృత్తి వై మగిడి దైవవశంబునఁ జూడఁబోయితే
ధీరవరేణ్య నాదుదురదృష్టము నింకిట నేమి చెప్పుదున్.

139


క.

జనకుఁడు దనుజకులేశుఁడు, పెనిమిటి త్రైలోక్యవిజయబిరుదాంకుఁడు నా
తనయుఁడు మహేంద్రజైత్రుం, డని గర్వితనైననన్ను హా విధి చెఱిచెన్.

140


ఉ.

ధారణిలో రఘూద్వహుఁడు ధర్మవిదుండును నైనరాముఁ డే
దారినొ యట్ల యగ్రజునితావునఁ దమ్మునిఁ దెచ్చి పూన్చువాఁ
డై రహి వాలిమున్నుకొని యంతటఁ బోకిటువచ్చెనేమొ మ
జ్జారె కకుత్స్థవంశసదృశం బొకొ యీదృశధర్మ మక్కటా.

141


గీ.

లంక నీరయ్యెఁ బ్లవగవాలానలమున, మైథిలితపో౽నలమ్మున మడిసి తీవు
నింత శోకానలం బాత్మ నెజియ సుఖిత, నైన ననుఁ జంపునే యీచితానలంబు.

142


వ.

అని మఱియు దివసావసానసమయంబున సవితృప్రభయుంబలె భగవంతుండైన వైశ్వానరునియందుఁ బ్రవేశించి చంద్రునిఁ జంద్రికయుంబలె మేఘుని మెఱుంగుతెఱంగున ని న్ననుగమించి నిరంతరవిరహదహనదందహ్యమానం బయిన యాశరీరంబు శాంతిం బొందించెద నని కరుణంబుగాఁ బరిదేవనం బొనర్చు మందోదరిని...................మందిరంబున నిజానుమతిని నిశాచరపతికి యథావిధి

గాఁ బితృమేధంబు నిర్వర్తించి సవిధంబున సమేధమానవిషాదుం డై వర్తించువిభీషణు నశేషరాజ్యాధిపతిగా రఘుపతి యఖిలతీర్థాహృతంబు లగుతోయంబులఁ దోయదం బనలాకులం బగువనస్పతింబలె నభిషిక్తుం గావించె.

143


గీ.

అంత రాఘవచరితపట్టాభిషేక, సమధిగతరాజ్యుఁ డగు విభీషణుఁడు పొలిచె
ననుదినవివృద్ధమండలుం డగుచుఁ జండ, రుచిసుధాపూరణమునఁ జంద్రుండువోలె.

144


క.

సీత న్నిభృతవిభీషణ, నీత నృతులం దుదారనిర్మలశీల
ఖ్యాతం గనుఁగొని మనుకుల, నేతకు మది హర్షశోకన్బిడం బయ్యెన్.

145


సీత యగ్నిప్రవేశము

వ.

అనంతరం బరుంధతియుంబలె పవిత్రచారిత్రనిధి యన ధరిత్రీపుత్రి పతివ్రతాశిరోమణి యని తెలియంబడియును మర్త్యధర్ముం డైనపరమపురుషునకును లోకంబునకును బ్రత్యాయనంబునకై పురందరముఖు లగుబర్హిర్ముఖులును భగవంతుం డగునరవిందాసనుండును సాక్షులుగాఁ బునరుదయంబునకై వనరుహబంధునిం బ్రవేశించు నిందుకళయుంబలె సముజ్జ్వలజ్జ్వలనంనంబు బ్రవేశం బొనరించె.

146


గీ.

పూతచారిత్ర యయ్యును భూమిపుత్రి, నిజవిశుద్ధికినై హవ్యభుజునిఁ జొచ్చె
నతఁడు నపవిత్రవస్తుసంగతనిజాఘ, దమనుఁ డయ్యెను దత్ప్రవేశమునఁ జేసి.

147


క.

అనలానుషంగమునఁ బా,వనఁగా జానకి నెఱింగి వైభాతికవే
ళను భానుఁడు ప్రభనుంబలె, నినకులుఁడు పరిగ్రహించె నెల్లరు మెచ్చన్.

148


వ.

మఱియు దాశరథి యధిగతనిజప్రశంసావిధానుం డగువిధాతచేతఁ బ్రదర్శ్యమానుండును నారూఢవిమానుండును మహారథుండు నగుదశరథునకుం బ్రణమిల్లి తదీయశాసనంబు శిరసావహించి దురంబునఁ గాలధర్మంబు నొందినవానరోత్కరంబును బాకశాసనవరంబునం బ్రతికించి వారిచే ననుగమ్యమానుండును బ్రమోదమానమానసుండును సుగ్రీవునితోఁ గృతసంభాషణుండును నగుచు విభీషణుఁ గరుణారసంబుతో విలోకించుచు జానకీలక్ష్మణులతోడం గూడ నయోధ్యాప్రయాణాభిముఖుం డై కామచరంబును గౌబేరంబును నగువిమానం బధిరోహించె.

149


క.

మణిపుష్పకగతుఁ డై త,త్క్షణమున లంకోపకంఠదశకంఠరణాం
గణములు సింధువు సేతువు, నణుమధ్యకుఁ దెలిపికొనుచు నవ్విభుఁ డరిగెన్.

150

గీ.

పుష్పకం బది యెంతెంతపొడవు పోవు, నంతకును నింగి విరివయ్యె నతివ చూడు
పుడమి నొకపల్వలముబలె జడధి దోఁప, నగచరులు మారుతికిఁ దెల్పి నగెద రిందు.

151


క.

ఎయ్యది దవుదవ్వులఁ గని, నెయ్యముతో నీకుఁ దెల్ప నేఁ గోరితినో
యొయ్యారి విచిత్రముగా, నియ్యెడ నది వెనుకఁబడి యదృశ్యతఁ జెందెన్.

152


వ.

తరుణి ధరణిసుతా కనుఁగొను ముత్తుంగమహీరుహానీకం బగుఋశ్యమూకం బిది యిందుముఖీ బిందుసరోవరం బిది గంధసింధురగమనా కబంధనిర్గంధన వసుంధర యల్లది కరభోరూఖరాదికలహస్థలం బిది మధురవర్ణాలాపా మనపర్ణశాల యిది కురంగలోచనా కుహనామృగమృగయావనం బిది కుటిలాయతకబరీ గోదావరీమహానది యిది కుంభికుంభస్తనీ కుంభసంభవాశ్రమం బిది విలాసవతీ విరాధవిధ్వంసనభూమి యిది యంగనాలలామా యత్రీమునీశ్వరాశ్రమం బిది విదేహరాజపుత్రీ విచిత్రకూటం బైనచిత్రకూటం బిది యని వీనులకు సుధలైన వింతవింతకథ లెఱింగించుచు భాగీరథీతీరంబునందుఁ బావనం బైనభరద్వాజతపోవనంబు చేరి మహీగర్భశుక్తిమౌక్తికమణి యగుమహిళామణిం జూచి మఱియు నిట్లనియె.

153


గీ.

సకియ నిద్రాణబర్హిణశ్వాసపార, ణాసుఖిత మయ్యె నిదిగొ ఫణాధరంబు
కంబుకంఠి కంఠీరవకరజముల మృ, గంబు కండూవినోదనోత్కంఠి కంటె.

154


వ.

అంత.

155


భరతాదులు రాము నెదుర్కొనుట

సీ.

మహితభరద్వాజవిహితాతిథేయుఁ డై దవ్వుగాఁ జని యయోధ్యాసమీప
మొంది మ్రోల సమీరనందనావేదితోదంతుఁ డై గురుని ముందఱ నిడికొని
యానందబాష్పధారాపూర్యమాణలోచను లైనసన్మంత్రిజనులతోడ
వచ్చు పావనతపోవ్రతరతు సౌజానభక్తిసంభరితుని భరతుఁ గాంచి


గీ.

సమధికోత్సాహవాత్సల్యసౌహృదములు, డెందమునఁ గందలింప నమందగతిని
యక్షరాజవిమానంబు నవతరింప, మానవాధీశుఁ డుత్కంఠమానుఁ డగుచు.

156


వ.

విదేహరాజపుత్రిం గనుంగొని వెండియు ని ట్లనియె.

157


క.

చదలుననుండి విమానం, బిది నాహృదయము నెఱింగి యెంత డిగియెనో
ముదితా యంతంతకు భువి, గదిసెడు నీమీఁదఁ బ్రేమగలుగుట ననఁగన్.

158

గీ.

అతివతో నిట్లు ముచ్చట లాడికొనుచు, దండనిలిచినయినజు కైదండఁ బూని
ప్రణతుఁ డైవిభీషణుఁడు మార్గంబుచూప,మండపమునకు డిగియె నమ్మనుజవిభుఁడు.

159


చ.

ముదము దలిర్పఁ బాదుకలు ముందఱ నుంచి కడు న్వినీతుఁడై
పదములమీద వ్రాలు నతిభక్తిరతున్ భరతు న్దయాళుఁడై
యదనున లేవనెత్తి యురమానిచి తా విడఁజాలఁడయ్యెఁ బో
పదపడి రాముఁ డాతనితపఃకృశదేహము సంస్పృశించుచున్.

160


గీ.

ఆర్యసమ్మతసుఖదుఃఖుఁ డైనలక్ష్మ
ణునిని గౌఁగిటఁ జేర్చి కన్గొనుచు నలరె
భరతుఁ డతఁడును నలరె నాభరతు సుదృఢ
సహజభక్తివ్రతుని రాజ్యసౌఖ్యవిముఖు.

161


వ.

అంత భరతుండును బురతోభివాదితపూర్వజోపలాలననిఘ్నుం డగుశత్రుఘ్నుండునుం దానును జనకనందనకుఁ బ్రణామం బొనర్చి యవరోధవధూసమేతు లగుసుగ్రీవదశగ్రీవానుజాదిరాజ్యాధిపతుల యధోచితోపచారవిధుల సంతోషితస్వాంతులం జేసి యామంత్రితమంత్రిలోకుండును నాలోకనానుగృహీతపౌరవర్గుండును నగునగ్రజన్ముని నిజావసథంబుఁ జేర్చె నందు.

162


సీ.

రమణీయసుగుణాభిరాముఁ డౌరాముండు జానకీసౌమిత్రిసహితుఁ డగుచు
ననుపమవాత్సల్య యైన కౌసల్యకు నపయశశ్శల్యశోకాతిరేక
యైనకైకేయికి నతిపవిత్రచరిత్ర యైనసుమిత్రకు నతులభక్తి
గరిమసాష్టాంగంబుగ నమస్కృతులు చేసి తగనిజాలోకనితాంతహర్ష


గీ.

కందళితలైన వారిచేఁ గలశజలధి
లహరికలచేతఁ బ్రతిమాకలానిధి బలె
మఱియు మఱియును బరిరభ్యమాణుఁ డగుచు
డెందమునయందు నిర్భరానంద మొందె.

163


శ్రీరామపట్టాభిషేకము

ఉ.

బంధుర తేజుఁ డజ్జలజబంధుతనూజుఁడు పంప దైత్యని
ర్గంధనుఁ డౌజగత్పతిని రామునిఁ దారభిషిక్తుఁ జేయఁగా
మంథరయానము న్విడిచి మంథర నాత్మ దలంచుచు న్వెస
న్సింధులనుండి తీర్థములు నేనగఁ దెచ్చరి వానరోత్తముల్.

164

గీ.

అంత రాముఁ డలంకృతుఁ డై యమాత్య
కౢప్తపట్టాభిషేక మంగీకరించి
పురమునకుఁ బోవ రథ మొందెఁ బొందె నలమ
హారథుఁడు భరతుఁడును మనోరథమును.

165


వ.

అప్పుడు నిజసేవావిచక్షణు లగుశత్రుఘ్నలక్ష్మణునులచేత విధూయమాసధవళవాలవ్యజనుండును బరిజనాచారనిరతభరతోదస్తవిమలముక్తాతపత్రుండును విచిత్రవిహితమనుజవేషదారులును నారూఢశతాంగమాతంగులును నలంకృతాంగులును నగునాశరప్లవంగపుంగవులచే ననుగమ్యమానుండును బ్రవర్తమానశేషాక్షతలాజోపచారుండు నగురఘువీరుండు పౌరపురంధ్రీకదంబసంరంభచలితమంజుమంజీరమణి కాంచీవలయవాచాలితవాద్యమానమాంగళికభేరీమృదంగ శంఖాదివివిధరవశ్రవణసమయోచ్చలితసామోదపౌరసంబాధంబును సౌధాంతరగవాక్షచలితశ్రీతరుణీకటాక్ష చ్ఛటానీలోత్పలదామ తోరణాభిరామరథ్యాంతరంబు నగునయోధ్యాపురంబుం బ్రవేశించి.

166


సీ.

శ్రీతరుణీమణిస్థిరవిహారనికేత మై తనరారుసాకేత మొంది
భ క్తివినీతిసంపన్ను లై కొల్చుతమ్ముల నాదరించుచు మోద మెసఁగ
భానుతనూభవప్రముఖుల నెల్లను నిజనిజపదముల నెలవుపఱిచి
జనకరాజన్యనందనతోడఁ గూడి స్వచ్ఛందుఁ డై సామ్రాజ్యసౌఖ్యములను


గీ.

ననుభవించుచు ఘనసారహారజాల, పాదసితకీర్తివైభవామోదిని యగు
నిఖలమేదినిఁ బాలించె నీతిప్రబల, ధన్యగుణహారి రామాభిధానశౌరి.

167


ఉ.

దుష్కవితానిరాకరణధూర్వహ చార్వహరాసనోల్లస
త్పుష్కరపత్రనేత్ర మతిబోధన మానసుయోధనా మిళ
న్నిష్కపటప్రచార మనునీతిసరణ్యనుసార సారవ
ద్బష్కయణీపయోమధురుభాషణ బంధుసమాజపోషణా!

168


క.

బాలామానసమోహన, లీలామకరాంక కేరళీ కుకరీ బం
గాలీ ధృతముకురీతాం, బూలకరంకాసిఖేటముఖనృపచిహ్నా!

169


పంచచామరము.

వరాటలాటభోటభోజవత్సమత్స్యగౌడగూ
ర్జరోత్కళాదిరాట్పరంపరాశిరఃకిరీటసం

ఖ్యరింఖదబ్జరాగరత్నకాంతిరంజతాంఘ్రియు
గ్మరోచమాన! యాచమానమానవామరద్రుమా!

170


గద్యము.

ఇది శ్రీమదుమామహేశ్వరవరప్రసాదసమాసాదిత సరసకవితావిలాస వాసిష్టవంశకీర్తిప్రతిష్ఠాసంపాదత ఋగ్వేదికవి తిరువేంగళార్యకలశరత్నాకరసుధాకర జగద్విఖ్యాతకవిరాజకంఠీరవబిరుదాంక వేంకటాచలపతిప్రణీతం బైన చంపూరామాయణం బనుమహాప్రబంధంబునందుఁ బ్రబంధపరిపూర్తిశోభితవిలాసం బైనయష్టమాశ్వాసము.

171


సర్వము సంపూర్ణము.

  1. సేతువు
  2. ప్రాణము ల్గొనక —యని యుండఁదగును.
  3. న్వాయవ్వైంద్రహుతాశ శాత్రవ-మాతృక.