చంద్రికా పరిణయము/పుట LX-LX।
యము, ‘అవ్యయానాం భ మాత్రే టి లోపః’ అనుటవలన టి లోపమువచ్చి యీరూపము సిద్ధించినది.
6. ఖడాఖడి=కఠినముగా (అన్యదేశ్యము)
ఇట్లు జాత్యములును, శాస్త్రీయములును అగు శబ్దప్రయోగములను విరివిగాఁ జేసెను. ఈకవి కవితావైదుష్యము శైలిలోను, పదపదైకదేశశ్లేషలలోను, ఉపమోత్ప్రేక్షాద్యలంకారఘటనములోను, చిత్రవిచిత్రభావ సన్నివేశములలోను, పదబంధముల కూర్పులోను, నూతనపదసృష్టిలోను, అచుంబితకల్పనములలోను బహుముఖముగా నున్నదని చెప్పుట కెంతయో సంత సించుచున్నాను. దీనిని చదివి యానందించుటకుఁ దగిన భాషాజ్ఞానము, విశ్రాంతి, బుద్ధివిశేషము గల చదువరు లదృష్టవంతు లని మనవి చేయుచున్నాను.
కథాసంవిధానము
మన ప్రాచీన పౌరాణికకథలలో పెక్కింటికి ప్రవచనస్థానమైన నైమిశమను పుణ్యారణ్యమునందే సూతపౌరాణికుని సన్నిధిని శౌనకుఁడు మొదలగు మునిశ్రేష్ఠులు వెళ్లి, మహానుభావా! మర్త్యలోకమును పాలించు రాజులలో, పుణ్యశ్లోకావతంసుఁడై, ప్రజలకు ఈతిబాధలు వాటిల్లనీక, చక్కగాఁ బరిపాలనము చేయునట్టి యొకరాజచరితమును దయామతితో మాకుఁ దెల్పవే యని ప్రార్థింపఁగా, పౌరాణికాగ్రేసరుఁడగు సూతుఁడు, చంద్రికాపరిణయప్రాధాన్యము గల సుచంద్రమహారాజు చరిత్రను ఈవిధ ముగాఁ జెప్పును. ఓమునులారా! భూమండలమునందు, సకలసంపదలకు నాలవాలమై, సమున్నతప్రాకారాదివైభవములతోను, సకలవిద్యాపారంగతులైన భూసురులతోను, ఊర్జితతేజోయుతులైన క్షత్రియులతోను, అనంతగుణప్రవృద్ధి గల సిరులచే నలరారు వైశ్యశిఖామణులతోను, తాము పండించిన ధాన్యపుఁదిప్పలు సమున్నతములై చూచువారి కానందమును జేకూర్చు నట్టి పంటలతో విరాజిల్లు హాలికోత్తములతోను, రమణీయముగాఁ జూపట్టు మహాపట్టణమైన విశాలానగరము గలదు. ఆనగర మందు శౌర్యధైర్యస్థైర్యగుణోపేతుఁడై సౌందర్యవిజితమదనుఁడైన సుచంద్రుఁడను రాజు గలడు.
ఆరాజు, మయసభవంటి విచిత్రాలంకారపరిశోభితమైన సభామంటపమునం దొకదినమున సకలసామంతదండనాథాది జనములతోఁ గొలువుదీరి యుండెను. అప్పు డచ్చటికి భసితాక్షమాలాజటాధారి యైన సుగుణఖని శాండిల్యమౌని ఇరుప్రక్కల నున్న జనములు నమస్కరించుచుండఁగా వచ్చెను. అట్లు వచ్చిన శాండిల్యముని కెదురేగి యర్ఘ్యపాద్యాది సత్కారములు చేసి, యున్నతాసనమునఁ గూర్చుండఁజేసి సుచంద్రుఁడు కుశలప్రశ్నములు చేసెను. శాండిల్యముని రాజా! మీ పరాక్రమ పరిపాలనాది సద్గుణముల ప్రభావముచేత మాయాశ్రమమునందు జపములు, వేదపాఠములు, తపస్సులు, యజ్ఞములు మొదలగు ధర్మానుష్ఠానము లింతకాలమువరకు నిర్విఘ్నముగా సాగుచు వచ్చినవి. కాని యిప్పుడు మాకు మనఃక్లేశమును గల్గించు యజ్ఞవిఘ్నములు దాపురించినవి. అవి యేవి యనఁగా మాయావి, మహాపరాక్రమశాలియై యున్న ‘తమిస్రాసురుఁ’డను రాక్షసుఁడు ఇంద్రాద్యష్టదిక్పాలకులను, సురగణములను లెక్కసేయక, తన చండదోర్దండమండలాగ్రముచేత ధీరుల నడంచుచు, మునులను బాధించుచు, మా సవనక్రియలకు విఘాతముఁ గలిగించుచు, చెలరేగి యున్నాఁడు. అతనిని సంహరించి మా యజ్ఞములను గాపాడఁగల నిఖిలాస్త్రవిధానశాలివైన నీవే తగుదువని నిన్నుఁ బ్రార్థింప వచ్చితిని. కనుక మా మునిసత్తముల వాంఛితమును దీర్చుమని కోరెను. సుచంద్రుఁడు, ‘మహామునీ! ఆ రాక్షసుఁడనఁగా నెంత? సకలసైన్యములతో వెంటనే మీవెంట వచ్చి, మీకృపాప్రభావమున నా తమిస్రాసురుని వధించెదను. హరిహరులు వానికి తోడుగా వచ్చినను లెక్కచేయక వాని ప్రాణములు దీసెదను. భూదేవికి రాక్షసభారము లేకుండునట్లును, దేవసంఘము స్వర్గమున నిర్విచారముగా నుండునట్లును, దేవతాసాన్నిధ్యముచేత భూతలమున నెల్లకాలము యజ్ఞములు సాగునట్లును, మునివర్గగృహములందు నిరంతరయాగములు జరుగు నట్లును, నా నూతనబాణపరంపరలచేత ఆ రాక్షసనాయకుని సంహరించెదను. ఈకార్యమునకు మీరు విచ్చేయవలయునా? ఒక శిష్యునిద్వారా నాకు వార్త నంపియుండరాదా?’ అని పలికెను. దానికి