చంద్రికా పరిణయము/పుట 118-119
తే. ఇట్లు తనయస్త్రసామర్థ్య మెల్లఁ దూల
నౌడు కఱచుచు హుమ్మని యాగ్రహమున
మీసములు నిక్క నపుడు తమీచరుండు
శక్తి నృపు వైచె నిజమంత్రశక్తి గరిమ. 141
పృథ్వి. కనత్కనకఘంటికాకలఘుణత్కృతిప్రక్రియన్
జనాధిపమహాచమూశ్రవణభేదనం బూన్చుచున్
ఘనప్రతిమ ధూమసంఘములఁ జీఁకటు ల్నించుచున్
ఘనస్యదనిరూఢిచేఁ గదలి శక్తి యేతేరఁగాన్. 142
క. మనుజపతి దానిఁ గనుఁగొని
యనిఁ గుండలితాశుగాసుఁడై శరపంక్తిం
దునియలుగాఁ బడ వైచెన్
మనమున వేల్పులు నిజైకమహిమను బొగడన్. 143
చ. తనవరశక్తి యిట్లు వసుధాపతిమార్గణధారఁ ద్రెళ్ల నా
దనుజవిభుండు శత్రుబలదారణశీలము స్వాగ్రనిర్గళ
త్సునిశితకీలికీల మొకశూలము చయ్యనఁ బూని దీనిచే
మనుము నృపాల యంచుఁ బరమప్రతిఘోద్ధతి వ్రేయ నెత్తఁగన్. 144
చ. జనవిభుఁడంతలోఁ గరము చాతురి హెచ్చఁగ ధన్వ మూని వే
గనియతి నర్ధచంద్రవిశిఖద్వయి పావకమంత్రరేఖతోఁ
దనరఁగఁ గూర్చి వైచి ధరఁ దార్కొనఁ జేసెఁ దదీయదోర్యుగం
బనుపమశూలకాంచనశరాసనముల్ తొలుదొల్త డిందఁగన్. 145
ఉ. అంత ననంతరోషశిఖి యాంతరవీథికఁ జిందు ద్రొక్కఁ గా
లాంతకతుల్యమూర్తి యలయాశరసంతతిచక్రవర్తి దు
ర్దాంతరయంబుతో మణిశతాంగము డిగ్గన డిగ్గి వ్యాత్తవ
క్త్రాంతర మూని మ్రింగెద రసాధిపు నం చరుదెంచె నుద్ధతిన్. 146
వ. ఇట్లప్రతిమానప్రతిపక్షహర్యక్షవర్యంబు వీక్షించి మహాక్షితిధరాసన్నక్షోణివలనం గుప్పించు పంచాన నంబు తెఱంగునఁ దచ్చక్రాంగం బభంగురామర్షసాంగత్యంబున డిగ్గ నుఱికి గోత్రాధిపవిచిత్రపత్త్రిరాజ పరి త్రుటితబాహార్గళయుగళుండై, నిస్తంద్రసురేంద్ర శతకోటిశితకోటి పాటితపక్షద్వయంబగు నంజనాచలంబు చందంబునం జూపట్టుచు నశేషారిబలవిలోచనోత్సవవిమోచనంబు గావించు మేచకప్రభాధట్టంబున నెట్టన మట్టుమీఱు కటికచీఁకటిం బుట్టించుచుఁ బొడకట్టు నుద్దండతనూదండంబు శింశుమారచక్రవీథి రాయం బెరుఁగఁ జేయుచు, నిష్ఠురదీర్ఘనిశ్వాసధూమ నిష్కాలనీరదనికాయంబులకు శంఖారవోత్థహుంకారవారం బుల విశంకటగర్జనావిశేషంబులు నెగడించుచు, గ్రీష్మదినమధ్యందినమార్తాండమండలం బొడియం దమ కించు విధుంతుదగ్రహంబుదారి నున్మీలితవదనకోటరుండై మహిపమార్తాండుంగుఱించి యనంతాధ్వంబు నన్ బరువూన్చుచు, నతిభయంకరాకారంబునన్ బఱతేర, నప్పు డప్పొలసుదిండిమన్నీనిఁ గన్నారంజూచి ధీరోదాత్తుండగు నాసుచంద్రరాజేంద్రుండు నిజకోదండంబున సమంత్రకంబుగ నారాయణాస్త్రంబు గూర్చి ప్రయోగించిన నయ్యస్త్రశిఖావతంసంబును నతివేలశుచిజాలసమన్వితంబుగావునఁ బుష్కరస్థానసంస్థాయి నానానిమేషసంతానభంగంబు చేకూర్చుచు, ననేకదివ్యకాండసర్గచమత్కారి ఘనప్రకారభాసమానంబు గావున భువనజాతవిలాససముత్సారణంబు సంఘటించుచు, నమలకమలాప్త దైవతప్రభావిభూషితంబు గావున నాత్మమిత్రచక్రానందసంధాయకతేజోవైఖరిన్ దేజరిల్లుచు, నమితరయంబున నభ్రమార్గంబు చేపట్టి యెదురుగఁ బఱతెంచు నాదైతేయనాయకుశిరంబుఁ ద్రుంచె నయ్యవసరంబున. 147