చంద్రలేఖావిలాపము/పుటలు9-16

            గొట్టి కొంపలఁ బసుల్గట్టినావు
ధర్మాత్ముడును దాతతమ్ముఁడు నగు రాయ
            విభు నిరుద్యోగిఁ గావించినావు.


గీ.

బోయగొల్లాములోఁ గాసు బోకయుండ
వేంకటమనీషి చేత నిరంకుశగతిఁ
గ్రతువు సేయించితివి నీకు గృతి యొనర్ప
నర్హ మగునట్లు జేతు నీలాద్రిరాజ.


వ.

అనినం బ్రహృష్టదుష్టహృదయుండై శిరఃకంపంబు సేయ నేనును బరమానందకందళితమానసారవిందుండ నై వచ్చి యతనికి షష్య్టంతంబు లీ ప్రకారంబునం జెప్పంబూనితి.


క.

నీచాధారునకు మహా
యాచక శుక శాల్మలీ ద్రుమాకారునకున్‌
బ్రాచుర్యవికారునకున్‌
రాచినృపకులాబ్ధిగరళ రససారునకున్‌.


క.

క్రూరునకు సాధుబాధా
చారునకు న్యోనిపానసరశీలునకున్‌
జారునకు విప్రతతిధన
చోరునకున్‌ బుద్ధిహీన శుభరహితునకున్‌.


క.

పరనారీభగచుంబన
పరతంత్రున కఖిలదుష్టపాపాత్మునకున్‌
నిరుపమదుర్గుణశీలికి
ధరలో నీలాద్రిరాజ దౌర్భాగ్యునకున్‌.


క.

అతిమూఢశీలునకు సం
తతమృగయాఖేలునకును దాసీవనితా
వితతరతిలోలునకు ఘన
పతితకుజనపాలునకును బతయాళునకున్‌.


క.

దుర్భరతనునకు రండా
గర్భాపాతనవిధానకౌశలకలనా
విర్భూతాపయశునకున్‌
నిర్భరకలుషాత్మునకును నిర్లజ్జునకున్‌.


క.

ఆవిష్కృతచంద్రీభగ
దేవీపూజావిధాన ధీసారునకున్‌
గేవల రణభీరునకున్‌
భూవలయోద్ధరణ ఘోర భూధారునకున్‌.


క.

వారవధూసారమధూ
ద్గారివదనచుంబనక్రకచభవ దురువ
క్త్రారూఢ రదనునకుఁ గాం
తారాంతరసదనునకు వితతనిధనునకున్‌.


క.

చింతలపాట్యాన్వయతత
కాంతారకుఠారునకును ఘనతరచింతా
క్రాంతునకు నీలధరణీ
కాంతునకు న్వీతసుగుణ గణశాంతునకున్‌.


వ.

అనభ్యుదయపరంపరాభివృద్ధిగా నా యొనర్పం బూనిన చంద్రరేఖా
విలాపం బను సత్ప్రబంధరాజంబునకుఁ గథాక్రమం బెట్టిదనిన.


వ.

మున్ను శ్రీ శివబ్రాహ్మణవర్ణాగ్రగణ్యుం డగు వీరభద్రభట్టారకేంద్రునకు శ్రీ
మద్వైఘానసవంశోత్తంసం బగు నంబి నరసింహాచార్యవర్యుం డిట్లని చెప్పందొడంగె.


సీ.

బహుళనానావిధపశుకళేబరచర్మ
            కంకాళవాలఖురాంకితంబు
మస్తిష్కవల్లూరమాంసఖాదనమోద
            కంకవాయసగృధ్రసంకులంబు
సాంద్రక్షతజబిందుసందోహపరిమళ
            న్మక్షికాక్రిమికీటకాక్షయంబు
పలలాశనానందభరితపరస్పర
            కలహహృత్కౌలేయగవయశివము.


గీ.

మధురతరమదిరాపానమదభరాతి
ఖేలబాలిశచండాలజాలతాడ్య
మానతూర్యనినాదసమన్వితముదు
రాపవనపల్లి బోయగొల్లావుపల్లి.


గీ.

బోయలును గొల్లలును నందుఁ బొందుఁగూడి
యుండుటను బోయగొల్లయై యూరు వెలసె
మఱియుఁ దద్గ్రామమున నొక మాలపెద్ద
చెఱువుఁ ద్రవ్వించె జనుల కచ్చెరువు గాఁగ.


వ.

అంతఁ గొంతకాలంబునకు.


క.

అప్పారావున కొక కృతిఁ
చెప్ప నతం డడఁగ నందుఁ జేరెను వినయం
బొప్పన్‌ వేంకటశాస్త్రులు
గుప్పున నతఁ డాడిమళ్ళకులుఁ డెన్నంగన్‌.


గీ.

వానిఁ బ్రార్థింప నొక పెనుపాకఁ జూప
వాసముగ నందు వసియించి వలనుమీరఁ
గొడుకులును దాను వాఁడిచ్చు కోలుఁ దినుచు
నిడుములకు నోర్చి కాలంబు గడుపుచుండి.


క.

నీలాద్రివిభున కా కృతి
వాలాయము నిచ్చి సిరులు వడయఁగ వలెనం
చాలోల చిత్తమునఁ దా
నాలోచన సేయుచుండె నాత్మజ తోడన్‌.


వ.

అంత.


క.

కటకపు వేంకటసానికి
విటుఁ డగుటను నూజివీడు విడిచి యచటికిన్‌
దటుకునఁ గూఁతుం దోడ్కొని
మటుమాయలు పన్నుకొనుచు మచ్చికఁ జేరెన్‌.


క.

చేరిన దాని నతఁడు గని
కూరిమితోఁ గౌఁగిలించికొని మక్కువ నా
హారాదికంబు లిడుచును
మారక్రీడలఁ జెలంగి మన్నన నునిచెన్‌.


వ.

అది యెట్టిదనిన.


సీ.

పుట్టకాల్‌ సొట్టకేల్‌ వట్టివ్రేలుంజెవుల్‌
            పట్టులే కట్టిట్టు బిట్టు కదలు
మిట్టపండ్లును బెనులొట్టకన్గవయును
            బిట్టులై చుట్టలై నిట్టనిగిడి
దట్టమై బలుకొంగపిట్ట చట్టువలను
            గొట్టంగ సమకట్టినట్టి తెలుపు
రెట్టింప నౌదలఁ బుట్టి చెంపలమీఁద
            నట్టాడు నీఁకలకట్టచుట్ట.


గీ.

తొట్టిపెదవులుఁ దుంపర లుట్టిపడెడు
చట్టికెన యగు నోరును గట్టిలేక
గొట్టుమిట్టాడు బలుజను లుట్టిపడెడు
యోని గలయది వేంకటసాని మఱియు.


సీ.

కల్లు పెల్లుగఁ ద్రావి కాఱుకూఁతలు గూయు
            మాలని నైనను మరులుగొల్పు
కాసువీసంబులు వాసిగా లంకించి
            జుడిఁగి నెల్లాళ్లలో జోగిఁ జేసి
యిల వెళ్ళఁగాఁగొట్టు నెక్కువ తక్కువ
            మాటలాడును వట్టిబూటకములు
వేంకటశాస్త్రుల వేశ్య నెవ్వరితోడ
            నవ్వదంచును జనుల్‌ నమ్మ తిరుగు.


గీ.

కూఁతునకు నెవ్వనిం దెచ్చి కొమరు కన్నె
సాయ మిప్పించి యేరీతిఁ బ్రబలు నట్లు
చేసెదవొ యంచుఁ జెవిలోనఁ జెప్పుచుండు
శాస్త్రిగారికి వేంకటసాని యెపుడు.


క.

ఈసరణిఁ దెలుప నాతం
డా సానిం జూచి పలికె నలివేణి! మదిన్‌
వేసరక తాళి యుండుము
నీ సుతకున్‌ గూర్మిఁ గూర్తు నీలాద్రినృపున్‌.


క.

నా కృతికన్యకకును గన
దాకృతి యీ కన్యకకును నతనిం బతిగా
నీకొనఁ జేసిన మనకున్‌
జేకుఱు భాగ్యం బటంచుఁ జెప్పి రయమునన్‌.


ఉ.

యాగము పేరుచెప్పికొని యర్థము భూప్రజ వేఁడి తెచ్చినన్‌
భోగము సేయవచ్చు నిజపుత్త్రసహోదరదారబంధుసం
యోగము గాఁగ నంచు మది నూహ యొనర్చి యతం డఖండమా
యాగుణదూషితాత్ముఁడయి యచ్చొటు వెల్వడి యెల్లభూములన్‌.


క.

నీచత్వమునకు రోయక
చూచిన నరులెల్ల వేఁడి సుడివడక కడున్‌
యాచనఁ జేసి పదార్థ మ
గోచరముగ సంగ్రహించుకొని వచ్చి వెసన్‌.


ఆ.

మాలవాని చెఱువు మఱువునఁ బందిళ్ళు
సాలలును ఘటించి సంభ్రమమున
యాజకులును బెద్దలైన విప్రులఁ గూర్చి
దీక్షఁ బూని నిజసతియును దాను.


ఆ.

కడఁక దక్షిణాగ్ని గార్హపత్యాహవ
నీయవహ్నులందు నిలిపి మంచి
మేఁకపోతుగముల మెదలకుండ వధించి
వెరవు మీఱ నందు వేల్చుచుండి.


ఆ.

ముఖముఁ జూడ వచ్చు మనుజుల కిష్టిష్టి
గాఁగ నన్నమిడఁడు, గదుముఁడనుచుఁ
గొడుకుతోడఁ దనదు కూఁతుమగనితోడఁ
జెప్ప వారు లోభచిత్తు లగుచు.


క.

కొందఱ కొకింత కూ డిడి
కొందఱకుం గూర లొసఁగి కొందఱ కిడకే
దండన సేయుచు గెంటుచుఁ
గొందఱుఁ దిట్టుచును వెళ్ళఁగొట్టుచుఁ గడఁకన్‌.


సీ.

పుడమిఱేం డ్లంపిన గుడదధిహైయంగ
            వీనముల్‌ లోనిండ్లలోన దాఁచి
కరణంబు లంపిన కంద పెండలములు
            పదిలంబుగా నేలఁ బాఁతివైచి
బ్రాహ్మణు ల్దెచ్చిన బహువిధఫలములు
            లోలోనఁ దనదు చుట్టాల కిచ్చి
కోమట్లు దెచ్చిన గురుతరవస్తువుల్‌
            మెల్లమెల్లనఁ దారె మ్రింగివైచి.


గీ.

పప్పులో నుప్పు మిక్కిలి పాఱఁజల్లి
నేతిలో నాముదమ్మును నిండ నింపి
పులుసులో గంజి మిక్కిలి కలయబోసి
భక్ష్యములలోన మిరియంపుఁ బదడు కలిపి.


తే.

మంచి బూరెలు పొణకల మాటు వెట్టి
పిండిబూరె లొక్కొక్కముక్క పెద్దవారి
విస్తరులలోనఁ బాఱంగ విసరివైచి
కసరికొట్టిన విప్రు లాఁకటను లేచి.


క.

శపియించుచు నెండలచేఁ
దపియించుచు నేఁటి కేమి తాళుఁ డటంచున్‌
జపలస్వాంతుం డీతఁడు
కపటపుయజ్ఞంబు సేయఁ గడఁగె నటంచున్‌.


క.

చప్పట్లు చఱచుకొంచును
ముప్పున నితఁ డేల క్రతువు మొనసి యొనర్చెన్‌
మొప్పెతనంబున, అర్థము
గుప్పున నిక్కపటవృత్తిఁ గూర్చె నటంచున్‌.


తే.

జవ్వనంబున వేంకటసాని యధర
మధువు గ్రోలిన రోఁత వో మదిఁ దలంచి
వృద్ధదశ సోమపాన మివ్విధి నొనర్చెఁ
గాని స్వర్గాపవర్గేచ్ఛఁ గాదు సుండు.


తే.

అనుచు జను లెల్ల నిబ్భంగి నాడుచుండి
రంత వేంకటశాస్త్రి యాగాయతనము
ప్రకటముగఁ జూడఁ జింతలపాటి నీల
నరవరగ్రామణి మనంబునం దలంచి.


క.

బోగము మిడిమేళంబులు
భాగవతులు వేఁటకాండ్రు భషకచయంబుల్‌
మూఁగి తనవెంటఁ గొలువఁగ
వేగంబునఁ దరలి యటఁ బ్రవేశంబయ్యెన్‌.


వ.

ఇట్లు ప్రవేశించి యవ్విప్రపుంగవు దర్శించి యుడుగర లొసంగి శాలాసమీపంబునం
బటకుటీరాభ్యంతరంబున నిలిచి తదీయ క్రతుమంత్రతంత్రప్రయోగప్రధాన
విధానంబు లాలోకించి హాళిం గనుచుండె; నయ్యవసరంబున.


సీ.

విష్ణలోపలి పుచ్చవిత్తులగతిఁ గప్పు
            గల గొగ్గిపండ్ల సింగార మడర
విప్పు గల్గిన పేడకుప్పలోఁ బురువుల
            చొప్పునఁ గొప్పున సుమము లమర
కప్పచిప్పలఁ బొల్సుకండ లూడెడి రీతిఁ
            జీఁకుకన్నులఁ బుసు లేపుమీఱ
నూతిచెంగట వ్రేలు నునుతంబ కాయల
            సరణి పొక్కిలి దండ చన్ను లొప్ప.


గీ.

గడ్డిబొద్దు వలెను మేను గానిపింప
బారకఱ్ఱల తెఱఁగున బాహు లలర
జనకయాగంబుఁ జూడవచ్చెను ద్రికోణ
సాంద్రతరరోమరేఖ యా చంద్రరేఖ.


క.

ఇటు వలె నచటికి వచ్చెడు
విటకంటకిఁ జూచి చిత్తవిభ్రమ మొదవన్‌
దటుకున నీలనృపతి హృ
త్పుటమున సోలుచును దానిఁ బొగడఁదొడంగెన్‌.


క.

జడకుచ్చును మెడహెచ్చును
నడగచ్చును బొచ్చు పెఱిఁగి నలుపగు మేనున్‌
నిడుద లగు తొడల బెడఁగున్‌
గడు వలమగు నడుముఁ గలుగు కలి కిది భళిరా.


క.

నిక్కు పొగపిడుత గదరా
ముక్కు; మొగం బెన్నఁ గోఁతిముఖమున కెనయౌ
బొక్కిలి మొలలో తగు భళి
యక్కజపుం నూనెసిద్దె లౌర కుచంబుల్‌.


తే.

మోవి పీయూష మూరును కేవలముగ
గవ్వదళసరి పండ్లహా! కలికిమేని
మృదువు కోరింతకంపలఁ గదుమఁ జాలు
చెక్కు లలరారు లోహపునక్కు లౌర.


ఆ.

చూపు కాకిచూపు నేపారు కన్నులు
పిల్లికనులఁ గదుమ నుల్లసిల్లు
స్వరము గార్దభమును పరిహసింపఁగఁ జాలు
మదనసదన మెల్ల మంగలంబు.


క.

ఈ నీటుసాని నెచ్చటఁ
గానము గద మున్ను; నేడుఁ గట్టిగ దీనిన్‌
బోనీక రతి గలంపక
యే నేక్రియఁ దాళువాఁడ నిఁక నిచ్చోటన్‌.


క.

భషకకపిచటకగార్దభ
వృషభాదికబంధగతుల వేమఱు దీనిన్‌
విషయింపక నేలాగున
విషమశరుశరాళి బాధ వీడునె నాకున్‌.