చంద్రగుప్త చక్రవర్తి/రెండవ ప్రకరణము
రెండవ ప్రకరణము
చంద్రగుప్తుని జననము
క్రీ. పూ. 528 లో బింబిసారుని ప్రతాపము వలన నంగదేశాక్రమణముతోఁ బ్రారంభమయి క్రీ. పూ. 371 లో మహాపద్ముని దిగ్విజయము వలన దన ఛత్రముక్రిందికి దేశమంతయు రాఁగనిన మగధసామ్రాజ్యము క్రీ.పూ 321 లో జంద్రగుప్తుని భుజాదండము నాశ్రయించెను.
ఈ చంద్రగుప్తుని యుత్పత్తియు వృద్ధియు మిగుల నాశ్చర్య కరములు. కాని వానిని గుఱించి ఇదమిత్థమ్మని సంశయ రహితంబుగ జెప్పుట కఠినకార్యము. పురాణములలో నొక రీతిగను, నాటక కధలలో వేఱొక రీతిగను, జైనబౌద్ద చరిత్రములలోను గ్రీకుల చరిత్రములలోను మఱొక రీతిగ నుండుటం బట్టి చరిత్ర కర్తలు దమ తమ చిత్తములకు సరి పోయిన ట్లూహ పోహలను విస్తరించి యున్నారు. కావున మన దేశమునందు సాధారణముగ నంగీకరింపఁబడి యుండు పద్ధతిని మొదట వ్రాసెదము. తరువాత నితరుల వ్రాతల ననువాదించెదము. 'నందాంతం క్షత్రియకులమ్' అని పౌరాణిక శాసనమును లోకోక్తియు గలదు. ఇందునకు దృష్టాంతము, కల్యాదిని నందమాంకితులు కొందఱు రాజులుండిరి. అందు మిక్కిలి ఖ్యాతిగాంచిన వాడు సర్వార్థసిద్ధి. ఇతనికి మహాపద్మనందుడు, ధననందుడు, మహాబలి యని నామాంతరములు. ఈతడు నవకోటిశతేశ్వరుండు. చిరకాలము భూమినేలెను. వక్రనాసికుఁడు మున్నగు బ్రాహ్మణు లతనికి కులమంత్రులు. వీరిలో రాక్షసుఁడనువాడు పరమవిఖ్యాతుడు. దండనీతి ప్రవీణుడు. నంధి, విగ్రహ, యాన, ఆసన, ద్వైధ, ఆశ్రయములు, అనియెడు షాడ్గుణ్య ప్రవిభాగముల నెఱింగినవాడు; శుచి, శూరుడు. ఇతడు నందమాన్యుడై రాజ్యభారమును ధరించెను.
మహాపద్మనందుడు పెక్కు దేశముల రాజులను గెలిచి మిక్కిలి శూరుడని పేరొందెను. ఇరువది నలుగురు ఐక్ష్వాకులను, ఇరువది యయిదుగురు పాంచాలురను, ఇరువదినలుగురు హైహయులను, ముప్పది యిద్దఱు కాళింగులను, ఇరువది. యయిదుగురు శకులను, ఇరువది యాఱుగురు కురువులను, ఇరువది యెనమండ్రు మైథిలులను, ముప్పది యిద్దఱు శూరసేనులను, ఇతఁడోడించెనని వ్రాయబడి యున్నది.
మహాపద్ముడు మిక్కిలి ధనవంతుడు. ఇతనియొద్ద మహాపద్మ ధనమున్నందుననే యితని కీ పేరువచ్చెనట. నూఱుకోట్లయిన నొకపద్మమగును. అట్టి పద్మములు వేయియయిన నొక మహాపద్మమగును. ఈతడు తన ప్రతాపముచే వృద్ధిపొందించిన మగధ రాష్ట్రమునుండి పన్నులు, కప్పములు, కానుకలు దయా దాక్షిణ్యములు లేక లాగి ధనమును గుప్పలు పోసికొనినందున ధననందుఁ డాయెను. తాను సంపాదించిన ధనమును ఈతడు గంగానదిలోఁ బంచకోశములుగా బాతియుంచెనట. పైభాగము నందు నడ్డకట్టగట్టించి గంగా ప్రవాహమును ద్రిప్పి బయల్పడిన స్థలమునందు నయిదు గోతులు త్రవ్వించి వాని ప్రక్కలను రాళ్ల కట్టడముతో ననువుపఱచి లోభాగమున ధనమునించి కరగిపోసిన సీసముతో వానిని మూయించి, యడ్డకట్టను ద్రెంచి ప్రవాహము. నెప్పటి మార్గమునకు మరల్చి యా ధనము మీదుగ బోవునట్లు చేసెనట. ఈరహస్యము వెల్లడి కాకుండుటకై యాపనులయందు నియుక్తులైన పరిజనుల నెల్ల సంహరించి నట్లుగ ఒక గాధకలదు.
గ్రీకువారి వ్రాతల ననుసరించి చూడగా క్రీ. పూ. 326వ సంవత్సర ప్రాంతమున ననఁగా అలెగ్జాండరు (సికందర్) ఈ దేశము మీదికి దండెత్తి వచ్చినప్పుడు, మగధరాజ్యము మహోన్నత్యము జెందియుండెను. ఆ దేశపు రాజునొద్ద 20,000 గుజ్జములును, 200,000 పదాతి సైన్యము, 2000 రథములును, 4000 ఏనుగులును వుండెను.
నవనందులు-మౌర్యుఁడు
మహాపద్మునకు ఇళయను పట్టపురాణియు, మురయను ఉంపుడుకతైయు గలరు. ఇళకు నెనమండ్రు కుమాళ్ళు గలిగిరి. తండ్రియయిన నందుడును, వీరును గలిపి నవనందులని పిలువ బడిరి. మురకు బుట్టినవాడు మౌర్యుడని పిలువబడెను. ఈ మౌర్యుడే చంద్రగుప్తు డనికొందఱును నీ మౌర్యుని పుత్రుడే చంద్రగుప్తు డని మఱి కొందఱు వ్రాసియున్నారు. మొదటి పురాణగాధ ననుసరింతము.
మహాపద్మనందుడు దుష్టస్వభావము గలవాడై ప్రజా పీడన మొనరించినందున నతడు ప్రజలకు నప్రియుడయ్యెను. ఇతడు కలికాంశుడనియు, శూద్ర ప్రాయుడనియు, అధార్మికుడనియు పురాణములు చెప్పుచున్నవి. విష్ణు, పురాణ వ్యాఖ్యానమునందీతడు ఏకచ్ఛత్రుడు, ఏకరాట్టు, లుబ్ధుడు, సర్వక్షత్రకర్త, పరశురామసద్రుశుడు అని వర్ణింపబడియున్నది.
గ్రీకువారి వ్రాతను జూచినను రాజగు నందునిపై ప్రజల కప్రీతియనియు అతడు లుబ్ధుడును విషయ లంపటుడును అనియు దెలియుచున్నది.
మఱియొక కధ చొప్పున నందునకు శకటాలుడను ప్రియమంత్రి గలడు. ఒకప్పుడు రాజునకు మంత్రిపై గోపము వచ్చి యాతడు మంత్రిని భూగృహములో ద్రోయించెను. అతనికి దేహయాత్ర మాత్రమున కవసరమగునంత ఆహారము పెట్టించు చుండెను. ఇట్లతడు ప్రాణావశేషుడై చెఱలో నుండగా పగతురు మగధము మీదికి దాడి వెడలివచ్చిరి. నందుడు శత్రులను భారదోలునట్టి యుపాయము గానక శకటాలుని చెఱనుండివిడిపించి యాతని మంత్రశక్తి మహిమచే శత్రువులను దిరస్కరింప గలిగెను. కాని తరువాత నాతఁడు మంత్రిత్వము చేయనొల్లక యన్న సత్రాధికారిగ నుండుచు నందుల కప్రఖ్యాతి వచ్చునటుల గుట్రలు పన్నుచు దుదిని వాణక్యుని కోపమును రేగించి నంద నిర్మూలము గావించెనట.
నందుని యధర్మపుత్రుడగు మౌర్యుడు బలసాహసములచేఁ బేరువడసెను. ఇతనికి చంద్రగుప్తుడు మున్నగు నూఱుగురు సుతులు గలిగిరి. వీరు మహా బలాడ్యులు. మౌర్యుడును మౌర్యుని నూర్గురు పుత్రులును నవనందుల సైన్యమునకు అధిపతులుగ జేయబడిరి. కాని పుత్ర సమేతుడయిన మౌర్యుడు రాజ్యము నపహరించునేమో యని నందులకు నసూయ హెచ్చెను. కావున దమ యుద్యాన వనమున నొక కృత్రిమ శిల్ప గృహమును నిర్మించి మంత్రాలోచన మిష మీద మౌర్యుల నచ్చటికి రావించి వారలనందఱను నేలక్రింది గుహలో బ్రవేశపెట్టిరి. చంద్రగుప్తుడు దప్ప మిగిలిన వారంద ఱచ్చట భూగర్భమందు దుర్మరణము నొందిరి. చంద్రగుప్తుడు మాత్రము తప్పించుకొని లోనుండి బయటికివెడలెను..
చంద్రగుప్తుడు చాణక్యుని నాశ్రయించుట
ఆజాను బాహుండును, రాజలక్షణ సమన్వితుండును, ఔదార్య శౌర్యగాంభీర్య నిధియు, వినయ వారిధియు నైన యాతని నా ఈర్ష్యాళులు నందులు తిరిగి సమయింప గపటోపాయముల బన్నిరి. ఉన్నత పదవియం దునిచిన నంతఃక్షోభమును, వెడలగొట్టిన బాహ్యక్షోభమును బుట్టించునని వెఱచి నీచమును హాస్యాస్పదమును నగు నన్న సత్రాధికారమందుంచిరి. ఇచటను మరి పగతీర్పునకు సమయోపాయములనెదురు చూచుచున్న చంద్రగుప్తు డొకనాడు ఆగ్రహావతారమనదగిన యొక అగ్రజన్ముని జూడగల్గెను. ఈతడు కాలికి దగిలిన యొక గడ్డిపోచను వేరుతోబీకి నిప్పున గాల్చి మిగిలిన బూదిని నీళ్ళలో గరగించి త్రాగెను. అదిగని మౌర్యుడు, ఇటువంటి చండకోపియే నంద నిర్మూలనమునకు దగినవాడని నిర్ణయించెను.
గుప్తుడను పేరుగల యా బాలద్విజుండు ఔశనునిదండనీతియందును, జ్యోతి శాస్త్రమందును పారంగతుడు ; నీతిశాస్త్ర ప్రణేతయగు చణకుని నందనుండు చాణక్యుడని ప్రసిద్ధిగాంచిన శ్రోత్రియుండు, సర్వధర్మవిదుండు, గుణాఢ్యుండు ఈ బ్రాహ్మణుడు వేదములన్నిటిని వల్లెవేసినవాడు, శాస్త్రములన్నిటిని జదివినవాడు, ముఖ్యముగ బృహస్పతి, శుక్రుడు, మున్నగువారి --- తుల యందత్యంత ప్రవీణుడు, నైజమైన బుద్ధి సామర్థ్యమును సమయ స్ఫూర్తియు గలవాడు, మిక్కిలి ముక్కోపమును, పట్టినపట్టు వదలని గట్టి దిట్టతనమును గలవాడు. ఇతడొకనాడు నందులశాలలో నొకదాని యందు బహుజనమధ్యమున నగ్రాససమునందు గూర్చుండి యుండెను. అపుడెయచటికి నందులు వచ్చుటదటస్థించెను.వచ్చి యావికృత రూపుడును బ్రహచారియునగు బ్రాహ్మణుని బూర్వోత్తరముల విచారించి నందుల వెంటవచ్చిన వారి మంత్రులును మూగి యున్న జనులలో గొందఱును బ్రాహ్మణోదాసీనము కూడదని బోధించినను నా మాటలు వా రాలకింపక యతనిని గర్విష్టునిగా భావించి బంటులఁ బనిచి యా యాసనమునుండి లాగివేయించిరి. అంత నా చాణక్యుని జుట్టు వీడిపోయెను. కండ్లెఱ్ఱనాయెను. ఒడలు వడకెను.. పెదవిని కొఱికికొని యెగిరిపడుచు నచ్చటి జనులందఱు వినునట్లు గొప్పపంత మొకటిపట్టెను. చాణక్య శపథమేమనిన, "నన్నిట్లగ్రాసనము నుండి లాగి బహుజన సమూహమున నవమాన పఱచిన యో నందాధములారా! ఇట్లనే మిమ్ములను మీ సీంహాసనము నుండి లాగించి మీశిరముల నెల్లదునిమి, యటుపిదపనే యీజుట్టును ముడిచెద ! నా చాతుర్య సామర్థ్యములఁ జూతురుగాక!" అని ధిక్కరించుచు కాలరుద్రునివలె గర్జించిన యా బాహ్మణుని కోపానలమును జల్లార్చుటకై నందు లేవిధమైన శాంతివచనముల నైన నాడక పోయిరి. అయ్యోపాపము! బ్రాహ్మణ ద్వేషము సామాన్యమా? అద్దాని ఫలమును నందులు త్వరలోనే అనుభవింప వలసి వచ్చెను.
చాణక్యుని యాగ్రహాదుల చంద్రగుప్తుఁడు చూడఁ గలిగెను, ఆట్లు బ్రతినపట్టి యరుగుదెంచుచున్న యా బాహ్మణుని వెంబడించి నడచివచ్చుచున్న చంద్రగుప్తుడు, వెనుక చూచుడు నతని కనులఁ బడియెను. అంత జంద్రగుప్తుడు సాగిపడి నమస్కరించెను. అతడును నితని లేవనెత్తి కుశలప్రశ్నము వేయ నతనితో చంద్రగుప్తుడు తనకును నందులకును గల విరోధమును విశదీకరించి శరణము వేడెను. వెంటనే చాణక్యుడతని నోదార్చి సర్వ నందరాజ్యమునకును పట్టాభిషేక మతనికి జేయించునట్లు "రెండవ ప్రతిజ్ఞయు జేసెను. మౌర్యచంద్రుని తన యండ జేర్చుకొని యా కుటిలుడు నందకుల నిర్మూలనోపాయమును, పన్నెను. తన మిత్రుఁ డిందుశర్మకు క్షపణక వేషము వేసి, యా యభిచారికావేత్తతో రాక్షసాదుల వంచించుచు, నందరాజ్యార్ధమును బహుమతిగా వాగ్దానము చేసి మహాబలిష్టుడైన పర్వతేంద్రుని సాహాయ్యముగా జేర్చుకొని మ్లేచ్చబలములతో కుసుమపురిని ముట్టడించెను. నందులును సంరబ్ధులై మంత్రి రాక్షస వీర్యదృప్తులై యుద్ధమునకు సమకట్టిరి. పలు తెఱంగుల ప్రయత్నించియు, నా బలమును జయింప నశక్తుడై రాక్షసుడు ఛద్మమున చంద్రగుప్తుని సంహరింప నుద్యమించెను.
కాని సర్వనందులును పర్వతేంద్ర బలానిలముతో చెలరేగింపబడిన చాణక్య క్రోధానలంబున శలభంబుల మాడ్కి సందగ్ధులైరి. పిదప రాక్షసుడు క్లేశపరవశుఁడై, బల పౌరుష నష్టుడై, అరిబలాక్రాంతమైన సేనలసాహాయ్యము గోలుపోయిన వాడై , ప్రాణ త్రాణ పరాయణుడై , నందవృద్ధుడైన సర్వార్ధ సిద్దిని సురంగమార్గమున పురమునుండి బయలుపంపి, నంద పక్షపాతులగు పౌరులతో పురమును మౌర్యువశము పఱిచెను.
బౌద్ధ గ్రంథములందలి కథ
బౌద్దులు చెప్పుటేమనగ, చంద్రగుప్తుడు శాక్యవంశ సంభూతుడు. కాన నితడు శాక్యసింహుడని వాడబడు గౌతమ బుద్ధునివలె క్షత్రియకులస్థుడు. అతని తండ్రి మయూర దేశాధిపుఁడు. ఆ రాజు రాజ్య మేలుచుండ పగతు రితని దేశముపై దాడి వెడలివచ్చి యుద్ధమునం దితని నోడించి సంహరించిరి. అట్టి విపత్తుసమయమున మన చంద్రగుప్తుని గర్భమందు గాంచియున్న మయూరరాణి ఒక పశువుల కొట్టమునకు చేరువ నా బిడ్డను కని విడిచిపోయెను, అంత నొక గొల్లఁడు బిడ్డను పెంచి, పాటలీపురమున నొకనాడు వెడల దటస్థించి యచ్చట తక్షశిలా బ్రాహ్మణుడగు చాణక్యున కమ్మివేసినట. ధననందుడు చాణక్యుని అవమానపఱచి నందున, చంద్రగుప్తుని నిమిత్తీకరించుకొని పగదీర్చుకొనెనట.
మఱియొక వృత్తాంతము చొప్పున మోరియ అనగ మయూరనగరవు రాణి, స్వభర్తసంహారము కాఁగనే గర్భార్భకుని కాపాడుటకై , తన యన్నను దోడ్కొ ని వుష్పపురికి పరుగెత్తి పోయెనట. అచ్చట మాఱువేషము దాల్చి బ్రతుకు చుండ కుమారుని గాంచెను. దేవతలు రక్షింతురుగాతమని యా శిశువును ఒక జాడీలోఁబెట్టి పసుల కొట్టపు గుమ్మమున నుంచిపోయె. అప్పుడు చణ్దుడన్న ఒక యెద్దు జాడి యొద్ద నిలిచి బిడ్డను కాపాడుచున్నందున అచ్చటి పశువులకాపరి వానికి చండగుప్తుడని పేరుపెట్టి కాపాడెను, చండగుప్త నామము చంద్రగుప్తనామముగా మాఱిపోయెనట. మోరీయులు పిప్పలి వనమున నున్నవారని బౌద్ధజైనుల వార్తగా నున్నది. స్వాటు పల్లపు సీమయందు నేటికిని . “ మోరా ' యని యొక కనుమ యున్నదని వాడ్డెలుగారు నుడువుచు ఈనామము చంద్రగుప్తుని ఔత్తర జన్మమును సూచించు చున్నదనుచున్నారు.
బౌద్ధచరిత్రములు గ్రీకు ఇతిహాసములతో మిక్కిలి సమరస పడియున్నవి. ముఖ్యాంశముల కథనమునందు వ్యత్యాసము లగుపడవు. మరికొన్ని బౌద్ధ గ్రంథములలో నిట్లున్నది :-
చాణక్యుడు గొల్లవానికి క్రయంబిచ్చి చంద్రగుప్తుని తీసికొని అతనికి యుక్తమైన క్షాత్రవిద్యాభ్యాసము జేయించెను. చంద్రగుప్తుడు యౌవనము బొందగనే, తనయొద్ద రహస్యముగ వేతనంబిచ్చి యుంచియున్న సేనను అతని వశముజేయ నతడు పాటలీపురముపై దాడి వెడలెను. కాని యీ తిరుగుబాటు వ్యర్థమాయెను. కావున చంద్రగుప్తుడు పంజాబునకు బాఱిపొయెను.
మఱియొక కథ గలదు. చాణక్యుడు తన చేతనున్న దొంగ కాహపణములతో సేనను గూర్చికొని నందునిపై దాడి వెడలగ మొదట నపజయము బొందెను. అంత చంద్రగుప్తుని బిలిచి "యుద్ధమువల్ల లాభము లేదు. గుప్తాచారులమై జనుల యభిప్రాయములను మొదట దెలిసి కొందము" అని చెప్పి వా రిరువురు గ్రామములో గుప్తచారులై దిరుగుచుండిరి. ఒక దినమొక పిల్లవాడు తల్లి తనకొక రొట్టె నియ్యగా దాని నదిమి భాగముమాత్రము తిని చుట్టునున్న భాగము వదలిపెట్టి మఱియొక రొట్టె నడుగగా తల్లి "ఓరి పిచ్చివాడా! చుట్టు నున్న రాజ్యమును ముందు వశపరచుకొనకయే మొట్ట మొదట రాజధాని మీదికి దండెత్తివచ్చి యోడిపోయిన చంద్రగుప్తునివలె రొట్టెను తింటివిగదా" యని వెక్కిరించెను. సమీప ప్రదేశమునందే మాఱువేషములతోనున్న చంద్రగుప్తు డా మాటలు విని మొదట సామంత రాజులను వశపఱుచు కొనుటకై యత్నము చేయసాగెను. ఒక బెస్తవానికి లంచమిచ్చి గంగానది ప్రవాహములో దాచి యుంచబడిన పంచనిధుల సంపాదించెను.
మాక్సు ముల్లరుగారి కథ
ఉత్తరవిహార సన్యాసుల కథలయందుండితీసి మాక్సు ముల్లరు గారు తమ సంస్కృత గ్రంథావళీ చరిత్రమునం దుదహరించున దేమనగ : తక్షశిలావాసియగు బ్రాహ్మణుండొకడు కలడు. అతనిపేరు చాణక్యుడు. పాటలీపుత్రమందుండ దటస్థించిన ఈ చాణక్యుడు ఏవిధముననో నందాగ్రహము నార్జించు కొనెను. అపుడు నందుడు భటులఁ బనిచి యతని బట్టుకొమ్మని యానతిచ్చెను. అంత చాణక్యుడు సమయస్ఫూర్తితోఁ దక్షణమె తన గట్టిన బట్టల సడలించి పారవైచి దిసమొలకాడై అజీవక వేషంబు గైకొని తప్పించుకొని పోయి నగరున విజనస్థలముగనున్న సంభారస్థానమునందు దాగియుండి కొంత తడవుమీద పర్వతరాజకుమార పరివారమును సంధించి వింధ్యంబుఁజేరె. వృషభరక్షితుడైన చంద్రగుప్తుడు అచ్చట పశువుల మేపుచుండెను. ఆ పిల్లవాని శుభలక్షణములఁ జూచి, పశువులకాపరికి ఒకవేయి కాహపణములఁ జెల్లించి చాణక్యుడు కుఱ్ఱనిఁ గొని, యతని మెడకు లక్ష విలువగల బంగారు ప్రోగుతోఁ జుట్టబడిన యొక కంబళిత్రాటిని జుట్టి కట్టెనఁట. పర్వత రాజపుత్రునకు నిటువంటి త్రాటిని మెడకు గట్టించెను. ఒకనాడా యిద్దఱు బాలురును విచిత్రములైన కలలు కనిరట. అంత నా బ్రాహ్మణుండు పార్వతుని బిలిచి నిదురించుచున్న చంద్రగుప్తుని మెడత్రాటిని త్రెంపకయు వీడ్వకయు నతనిని మేలుకొలుపకయు దెమ్మని చెప్ప, పార్వతుడు చేతకాక వచ్చెను. మఱునాడు పార్వతుడు నిదురింపగ చంద్రగుప్తుని బిలిచి యమ్మెయినే ఆనతియ్య నితడు చేతికత్తితో పార్వతుని శిరమును ద్రుంచి త్రాటిని తెచ్చి సమర్పించెనట. అదిగని చంద్రగుప్తుని యోగపురుషునిగ నిర్ణయించి నాఁటనుండి యేడు వత్సరములలో సమస్త విద్యా విశారదునిగ జేసెను.
గ్రీకుల వ్రాతలు
చంద్రగుప్తుడు చిన్న వయస్సులోనే మగధరాజు కోపమునకు బాత్రుడై పాటలీపురమునుండి తక్షశిలా ప్రదేశమునకు అనగా పంజాబు దేశమునకు బాఱిపోయి యచ్చట సైన్యమును గూర్చుకొని అదివఱకు రాజ్యము చేయుచుండిన గ్రీకువారిని వెడలగొట్టి, పిదప నందుల సంహరించి మగధ రాజ్యమును స్వాధీన పఱుచుకొనెను.
గాథల సమన్వయము
ఇట్లు చంద్రగుప్తుని జనననును గుఱించి, సర్వార్ధసిద్ధి మనుమడని యొకకథ, ధననందునికి మురయందు బుట్టినవాడని మఱియొక కథ. మయూరదేశపు రాణికి బుట్టి చాణక్యున కమ్మబడిన వాడని వేఱొక కథ, ఆరాణి కని పసుల కొట్టమందుంచి పోఁగ గొల్లవాడు కాపాడి చాణక్యున కమ్మిన శిశువని యింకొక కథ, మోరియను రాణి మారువేషమున బుష్పపురమున బిడ్డను గని జాడిలోనిడ చన్డుడన్న యెద్దు సంరక్షించినందున బసులకాపరిచే చండగుప్త నామమందిన బాలుడని యైదవకధ, పర్వత రాజపుత్రునితో పాటలి వదలి పోయి వింధ్య ప్రాంతమున నొక గొల్లపాళెమునందు దేజస్వియగు బాలచంద్ర గుప్తుడు తోటి గోపాలబాలురతో రాజుమంత్రుల యాట లాడుచుండ నతడు కులీన సంభవుడని చాణక్యు డూహించి యా బాలుని విలువకు దీసికొనిన దాఱవకథ. కావున నతడు ఈ కులమున బుట్టినవాడని నిర్ణయించుట ఇంచుమించుగ నశక్యము. ముద్రారాక్షసమున నతడు వృషలుడుగ నెన్నబడి యున్నాడు. చాణక్యు డతనిని చాటున వృషలుఁడను చున్నాడు. ఎదుటను వృషల యనుచున్నాడు. జాతి వివేకమునందు వృషలుఁడనగ అంబష్ఠునకు శూద్రియందు బుట్టినవాడని వివరణ. మహానందియను శైశునాగుల గడపటి రాజునకు శూద్రియందు మహాపద్ము డుదయించె ననునది పురాణ సిద్ధము. ప్లూటార్కు ద్వారా మహానంది అంబష్ఠుడని తెలియుచున్నది. కావున మహాపద్మనందుడే వృషలుఁడాయెను. అతని కొమారుడును వృషలుడనిన, చంద్రగుప్తుడే కాక నందులును వృషలు లయిరి. తక్కిన కథలెల్ల చంద్రగుప్తుని క్షత్రియుఁడను చున్నవి. ముద్రారాక్షసమున విష్ణుగుప్త విరాధ గుప్తులు బ్రాహ్మణులు, బలగుప్తుఁడు క్షత్రియుఁడు. కావున చంద్రగుప్తుఁ డెవఁడు? తరువాతి కాలములో గుప్తనామము వైశ్యుల బిరుదాయెను.
అన్ని కథలను ఆలోచించి చూడ చంద్రగుప్తుడు మురయను స్త్రీకి గుమారుఁడనియు చిన్ననాఁడె సపత్నులగు శత్రువులచేఁ బీడింపఁబడి స్వగ్రామము విడిచి దూరదేశమునకుఁ బాఱిపోయెననియు నచ్చట చాణక్యుఁడను బ్రాహ్మణుని ఆశ్రయించి యతని కుటిలనీతి సాహాయ్యముచే నందుల సంహరించి రాజ్యమును సంపాదించె ననియుఁ గానవచ్చుచున్నవి. చంద్రగుప్తుఁడు మొదట నందుల సంహరించి మగధ మాక్రమించుకొనెనో లేక గ్రీకుల వెడలఁగొట్టి పంజాబును వశపఱచుకొనెనో నిశ్చయముగఁ జెప్పుటకు చరిత్ర సాధనము లేవియును లేవు. అతని జీవితములో నాతఁడు చేసిన ముఖ్య దిగ్విజయములు రెండు : ఒకటి మగధము నాక్రమించుకొనుట, రెండవది గ్రీకుల నోడించుట. మొదటిది మన పురాణాధులలోను ముఖ్యముగా ముద్రారాక్షసమను నాటకములోను వర్ణింపఁబడి యున్నది. రెండవ సంగతి యగు గ్రీకుల పరాభవమును గుఱించిన చరిత్రము వారి గ్రంథముల వలననే తెలిసికొనవలసి యున్నది. ఈ చరిత్రాంశములు వేరువేరుగ రెండు ప్రకరణములలో రచియింపఁబడును.