చంద్రగుప్త చక్రవర్తి/ఎనిమిదవ ప్రకరణము
ఎనిమిదవ ప్రకరణము
రాజ్యాంగ వ్యవస్థ
చంద్రగుప్తుని కాలమున రాజునకు సలహా నిచ్చుటకు మంత్రి పరిషత్తొకటి కలదు. అందు 12 గురో లేక 18 గురో లేక ఆయా సందర్భములకు వలసినంత మందియో మంత్రులుండెడువారు. అన్నివిషయములలో రాజు వారిని యాలోచన యడుగుచుండెడు వాఁడు. మిక్కిలి రహస్యముగ నుండఁదగిన విషయములలో నొకరిద్దఱు మంత్రులు మాత్రమె యాలోచనఁ దీర్చుచుండిరి. ఎప్పుడైన నొకప్పుడు రాజు స్వతంత్రించి పని చేయుటయుఁ గలదు. కాని సర్వసాధారణముగ మంత్రులలో బహుజన సంఖ్య ఎట్లు చెప్పిన నట్లు నడుచుకొను చుండెడువాఁడు. సామ్రాజ్యము నందలి దూరపు ప్రాంతములపయి చంద్రగుప్త చక్రవర్తి ప్రతినిధుల నేమించి వారివలన రాజ్యకార్యముల నడపించుచుండెను. ఈ ప్రతినిధులు సామాన్యముగ రాజవంశము వారలయినట్టు కానవచ్చుచున్నది. రాజధానికి వేయి మయిళ్ల దూరము నందుండు 'గిర్నారు' అనఁబడు పశ్చిమ ప్రాంతమున పుష్య గుప్తుఁడను ప్రతినిధి పరిపాలించు చుండినట్లును అతఁ డచ్చటి రైతుల సౌకర్యార్థమయి యొకనదికి యానకట్ట కట్టించి దాని నీటిని యొక తటాకమునకు మరల్చి తప్పని నీటివసతి నేర్పఱిచెననియు తెలియవచ్చుచున్నది.
రాజ్య విభాగము
ఆ దినములలో సాధారణముగ నైదువందల కాఁపు కుటుంబములు గలది యొకపల్లె. ఇట్టిపల్లెలు ఒకదాని కొకటి రమారమి క్రోశెడు దూరమున నుండుచుండెడివి. అందువలన నాపత్సమయమున నొకయూరివారు మఱియొక యూరివారికి సాహాయ్యము చేయఁగలుగు చుండిరి. పొలిమేర విషయమున వివాదము రాకుండుటకయి నదులు పర్వతములు మొదలగు స్వాభావిక చిహ్నములు పొలిమేర గుర్తులుగ నేర్పఱుపఁ బడి యుండెను. పల్లెచుట్టును కలపతో ప్రాకారము పెట్టుచుండిరి. ఇట్టి పల్లెలు అయిదు మొదలు పదింటివఱకు నొక్కయధికారి క్రిందనుండును. ఆ యధికారికి గోపఁడని పేరు. ఈ గోపఁడే ఆ గ్రామములకు సంబంధించిన లెక్కలు వ్రాయుచుండును.గ్రామములు, చేలు, తోటలు, మార్గములు, బీళ్లు, దేవాలయములు, తోఁపులు, తీర్థములు మొదలగువాని సరిహద్దు గుర్తులను ఇతఁడు సంరక్షించువాఁడు.1[1] గ్రామస్థులు చేసికొను దానములు విక్రయములు తనఖాలు ఈతని ద్వారా జరుపు చుండెను. గ్రామములోని ప్రతి గృహము నందలి జనుల యొక్కయు దాసుల యొక్కయు సేవకుల యొక్కయు పశు పక్ష్యాదుల యొక్కయు లెక్క ఈతఁడు వ్రాయుచుండెను. అదే లెక్కలలో ఒక్కొక యింటివారు ప్రభుత్వము వారికి చెల్లించు చుండిన శిస్తుశుల్కముల మొత్తమును తేల్చుచుండును. గ్రామస్థుల వృత్తులను బేర్కొని వారువారు గడించు మొత్తములను రమారమిగ నిర్ణయించి లెక్క వ్రాయుటయు నతని పనులలో నొక్కటి.1 [2] ఈ కర్తవ్యములను బట్టి ఇతఁడు అప్పటి కరణమని వేరుగ వ్రాయఁబనిలేదు.
ఎనిమిదివందల గ్రామములపై యధికారికి స్థానికుఁడని పేరు. ఈ 800 గ్రామముల సంరక్షణార్ధము స్థానీయమనఁబడు దుర్గమొండుండెడిది. ప్రస్తుతపు జమిందారీలలోని ఠాణేదారు శబ్దమునకు ఈస్థానికుఁడు అనుపదము తండ్రియేమో. గోపుఁడు గ్రామముపైఁ బలెస్థానికుఁడు మండలముపై అధికారి. ఈయధికారులందఱ పై వాఁడు 'సమాహర్త' నాఁబరుగుచుండెను. రాష్ట్రమును మండలములుగ విభజించుటయు, గ్రామముల తరగతులను నియమించుటయు, గ్రామాధికారులయొక్కయు స్థానికుల యొక్కయు పనులను బరిశీలించుటయు నీతనికిఁ గర్తవ్యములు. ఈ సమాహర్తగాక రాజ్యాంగశాఖ లొక్కొంక్కింటికిని నొక యధ్యక్షుఁ డుండును. అధ్యక్షు లందఱును మంత్రులలోని వారె. వీరు రాజుతోడంగూడ పైన నుడివినట్లు రాజ్యభారమును వహింతురు. గ్రామము లుత్తమ మధ్యమాధమ భేదములచే మూఁడు విధములు. ఈ విభాగము గాక యీ క్రింది విధముగ వేరు తరగతు లేర్పడుచుండెను.
(1) ఇనాము గ్రామములు
(2) సైనిక గ్రామములు
(3) ధన ధాన్యవస్తువులఁ జెల్లించు గ్రామములు
(4) పశువులను సేవకులను అమర్చు గ్రామములు
(5) పాలను పెరుగును కూరగాయలను ఇచ్చు గ్రామములు. .
రాజ్యాదాయ మార్గములు
ఇప్పటింబలె చంద్రగుప్తుని కాలంబునను రాజునకు మనదేశమున వరుంబడికి ముఖ్యాధారము నేల పన్నే యయి యుండెను. " సేద్యము క్రిందనుండు భూమిలో విశేషభాగమునకు నీటివసతి కలదు. సంవత్సరమునకు రెండు కారులు పంటలు పండును ... నదులమీద కొందఱు అధికారు లుందురు. వారు ఈజిప్టుదేశము నందువలె భూములుకొలిచి రైతుల కన్యాయము జరుగకుండుటకయి పెద్ద కాలువలనుండి పిల్లకాలువలకు నీళ్లు విడుచు ద్వారములను తగువిధమున మూయించుచు దెరిపించుచు నుందురు.” 1[3] సాధ్యమయినవఱకు ఇట్టి నీటి వసతుల నమర్చి చంద్రగుప్తుడు భూములయందు కర్షకులు చేయవలసిన కష్టమును అనుసరించి కరము గ్రహించుచుండెను, “ హస్త ప్రవర్తిమ' ఆ భూములయందు అనఁగా చేతి కష్టముచేత నీటి పాఱుదలయగు భూములయందు “ఉదక భాగము" 1[4] పంటలో నైదవవంతుగ నిర్ణయింపఁబడి యుండెను. "స్కంధ ప్రవర్తిమ" 2[5] భూములలో ననఁగా ఎడ్ల సాహాయ్యమున నీరు పాఱుదల చేసి కొను భూములలో నాల్గవ వంతుగను; 'స్రోతయంత్ర ప్రవర్తిమ' భూములలో ననఁగా వాయుయంత్రముల 3[6] మూలమునను ఇతర యంత్రముల మూలమునను సాగగు వానిలో మూఁడవ వంతుగను నదులు, సరస్సులు, చెఱువులు, బావులు మున్నగువాని క్రింది పంటలలో, మూఁడవ లేక నాల్గవ వంతుగను పన్ను నిర్ణయింపఁబడి యుండెను.
అర్థశాస్త్రమున నొక్కెడ " సాగుచేయక వదిలిపెట్టఁ బడిన భూములను (రాజు) పంటలో సగము భాగమునకు పైరు పెట్టువారికి ఇయ్యవచ్చును. స్వంత సేద్యముగల రైతులకు నాల్గవ వంతునకో, యైదవ వంతునకో, యిచ్చి వేయవచ్చును. లేక వారు అనవసరమగు నష్టము పొందక యియ్యగలిగినంత యిచ్చినను ఇయ్యవచ్చును." అని వ్రాయఁబడి యుండుటంజేసి చంద్రగుప్తుని కాలమున రైతున కీయశక్యముగాని పన్ను రాజడుగ కుండెననుట స్పష్టమగుచున్నది. స్వంతముగ చెఱువులు ద్రవ్వించుకొనినచో నట్టి ప్రజ యా చెఱువుల క్రింది సాగుపై యైదు సంవత్సరముల కాలమును, శిథిలమైన చెఱువులను చక్కఁజేసికొనువారు నాలుగు సంవత్సరముల కాలమును, చెఱువుల విస్తీర్ణ మెక్కుడు చేసికొని యెక్కుడు భూభాగమును సాగుదల క్రిందికి తేఁ దలఁచుకొనిన వారు ఆ భాగము పయి మూఁడు సంవత్సరముల వఱకును, కుష్కీ పంటల పండించు నుద్దేశముతో క్షేత్రముల సిద్దపఱుచు కొనువారు రెండు సంవత్సరముల పర్యంతమును బన్ను చెల్లించ వలదనియుఁ జేయఁబడిన నియమములు పన్ను గ్రహించుటలో రాజునకుఁ గల దూరదృష్టిని వేనోళ్లఁ జాటుచున్నవి.
ఇంతవఱకు వ్రాయఁబడిన తరములు "ఉదక భాగము" లని పేర్కొనఁ బడినవి. అనఁగా నివి పల్లపు భూములమీదిఁ తరములని యర్థము. మెట్టభూములపై విధింపఁబడుచుండిన తరములను గుఱించి కనుగొనుటకు ఆధారమెద్దియుఁ గానరాదు.
రాజునకు స్వంతమాన్యము లనేకము లుండెడివి. వాని నాతఁడు "సీతాధ్యక్షుఁ " డను నధికారి మూలమున సాగు చేయించు చుండువాఁడు. ఈ యధికారి ‘కృషితంత్రగుల్మ వృక్షాయుర్వే దజ్ఞుఁడుగ' నుండును. అతఁడు రాజుగారి క్షేత్రములకు వలయు బీజాదికములను సంపాదించి తత్తచ్చాస్త్రములఁ బ్రవీణులగు క్రింది యధికారుల సాయముం గొని దాసులను కూలివారలను ఖయిదీలను వినియోగించుకొని రాజుగారి సేద్యమును సాగించును. అందులకు నవసరమగు నుపకరణముల సిద్ధము చేయించుటయు నతనిపనియె. అతఁడు సూర్యచందాదులయు నక్షత్రములయు గతులను గమనించి కాలవైపరీత్యముల దెలియఁజేయు చుండినట్లును వాయువులను మేఘములను బరిశీలించి వర్షముల న్యూనాధిక్యము నెఱిఁగించుచుండినట్లును వర్షమాపక యంత్రముల సాహాయ్యంబున 'ద్రోణ' మను పరిమాణము నుపయోగించి వర్షపాతమును లెక్కించుచుండి నట్లును గానవచ్చుచున్నది. ఎఱువుల నుపయోగించు పద్దతులు గూడ నాతఁడే నియమించుచుండినట్లు తెలియుచున్నది. ఈ విధమున కాలవైపరీత్యములను గనిపట్టి వర్షముల న్యూనాధిక్యము నెఱింగించి వర్షపాతమును లెక్కించి యెఱువుల సారాసారంబుల నిర్ణయించి సీతాధ్యక్షుడు తన శాఖలోని యితరాధికారుల తోడంగూడ రైతులకు సాయపడుచుండెడి1[7] వాఁడు.
చంద్రగుప్తుని కాలమున గో౽ధ్యక్షుఁడను అధికారి యొక్కరుఁ డుండును. అతఁడు రాజు గారి గోవులు మున్నగు పశువుల కన్నిటికిని పాలకుఁడు. ఆ పశువులకు వలయునుపచారములు చేయించి వానివలన వచ్చు నాదాయము సతఁడు రాజు గారి బొక్కసమునకుఁ జేర్చుచుండును. వేనవేలు పశువులు రాజుగారి కుండుటంబట్టి యీ యాదాయము కొలఁదిపాటి యనుటకు వీలులేదు.
రాజునకు వరుంబడి నీనుటలో సాగుబడి భూములకు రెండవది దేశములోని వ్యాపార సముదాయము,
చంద్రగుప్తుని కాలమున నెల్ల వ్యాపారమును కోట గుమ్మమునఁ గట్టఁబడిన సుంకపు కొట్టుకడనె జరుగవలసి యుండెను. ఇతర స్థలముల వ్యాపారము జరుపుట నిషేధింపఁబడి యుండెను. వ్యాపారమునకయి రైతులును వ్యాపారస్థులును దెచ్చిన వస్తుసముదాయము సుంకము కొట్టుకడ నమ్మఁబడిన తరువాత అమ్మకపు మొ త్తమును బట్టి సుంకము వనూలు చేయఁబడుచుండెను. రైతులుగాని వస్తునిర్మాతలుగాని వస్తు సముదాయములు ఒక స్థలమునుండి మఱియొక స్థలమునకు మార్చుకొనుచో సుంకపు కొట్టుదారిని రావలసివచ్చినను వారు సుంకమీయ నవసరము లేకుండెను. వివాహార్థమును, రాజున కర్పించుటకును, రాజుగారి అండారములఁ జేర్చుటకును, మతోపయోగమునకును, ప్రసవించు స్త్రీలకొఱకును, ప్రయోజనములకొఱకును. గొనిపోఁబడు సామగ్రి సుంకము లేక తీసి కొనిపోఁబడు చుండెను. సుంకపుతరము వస్తువువెలయందు ఇరువదియైదవ వంతు మొదలు ఐదవ వంతు వఱకును గలదు. సుంకపు నిబంధనలను మీరువారకి నేరము ననుసరించి 3000 పణములవఱకును ( అనఁగా, ప్రస్తుతపు 2000 రూపాయలు ) అపరాధము విధింపఁబడు చుండెను. ఈవిధముగను రాజుగారి బొక్కసమునకు విశేషద్రవ్యము చేరుచుండెను.
విదేశములనుండి దిగుమతియగు సామాగ్రిపై వ్యాపార సుంకముగాక రాజుగారికి మఱియొక విధమగు సుంకము చెల్లు చుండెడిది. మొత్తముమీఁద దిగుమతియగు వస్తువులకుఁ బ్రబలతమమగు పన్ను విధింపఁబడుచుండెను. (1) 'శుల్క' మనఁబడు వ్యాపారసుంకమును (2) 'వర్తని' యనబడు మార్గసుంకమును 1[8] (3) 'గుల్మదేయ' మనఁబడు సైనిక సుంకమును (4) 'భాగ' మనఁబడు దిగుమతి సుంకమును సర్వసాధారణముగ దిగుమతి వస్తువులకుఁ దప్పినవి కావు.
ఇప్పగిది సార్వభౌమునకు నెగుమతి దిగుమతులవలన సుంకముల రూపమున నాదాయ ముండెడిది.
ఆకాలమున కొలతపాత్రలును తులాయంత్రములును ప్రభుత్వమువారే సిద్దపఱచి యమ్ముచుందురు. వ్యాపారులు వానిని కొనుటయేగాక ప్రతిదినమును వాని పరిమాణము సరి యయినదని నిర్ణయముద్ర వైచుటకు ప్రభుత్వమువారికి కొద్ది పాటి రుసుము చెల్లించుచుందురు. వ్యాపారస్థులు ప్రజల నేమాత్రము ఏమఱుచుటకుఁ బ్రయత్నించినను నపరాధులుగ నెన్నబడి జరిమానాలతో శిక్షింపఁ బడుచుండిరి. ఇప్పటివలెనే చంద్రగుప్తుని కాలమునందుఁ గూడ 'ఉప్పు' చేయుట అమ్ముట ప్రభుత్వమువారి హక్కేయయి యుండెను. వారుస్వదేశమున స్వంతముగ ఉప్పును పండించుటయుఁగలదు. ఒకొక్కతఱి నా స్వాతంత్ర్యము కౌలుదారులకు గుత్తకిచ్చుటయును గలదు. స్వదేశమునం దుత్పత్తియగు చుండిన యుప్పుగాక విదేశములనుండియు దిగుమతియగు చుండెడిది. అందలి వ్యాసారమును బ్రభుత్వము వారిదే యయి యుండెను.
సురాలోలు లిక్కాలమునందుఁబలె నక్కాలమునను ప్రభుత్వము వారికి ద్రవ్యము నీయుచుండిరి. కాని అప్పుడు త్రాగుడునకయి సర్వస్వము పోఁగొట్టుకొనుట తటస్థింపకుండుట కొక కొన్ని నిబంధన లేర్పడియుండెను. నిర్ణయింపఁబడిన పరిమితి కెక్కుడుగ నెవ్వరికిని హాలారసంబు విక్రేత లమ్ముట లేదు. వెలకును హద్దు లునుపఁబడి యుండెను. త్రాగి మైమఱచి పడిపోయిన వారి శరీరముపై నుండు సొత్తును గాపాడుటకు నుచితమగు విధులు నియమితమయి యుండెను. నీదేశవు సారాయిలపై సాధారణ సుంకములుగాక 100 కి 5 వంతున పన్నులు విధింపఁబడు చుండెను. సురామందిరములను గుఱించిన శాసనములలో, ఆ మందిరములు సౌకర్యములై న పెక్కుగదులుండు నట్లును, ఒక్కొక్కగదియందు వలసినన్ని మంచములును కుర్చీ లుండునట్లును, ఆయా ఋతువులకు ఆవశ్యకములైన యనుకూలము లన్నియు పొసఁగి యుండునట్లును, నిరంతరము పుష్ప హారములతోను అగరు చందనాది పరిమళ ద్రవ్యములతోను నిండుకొని యుండునట్లును, అలంకరించియుండ వలెనని విధింపఁబడి యున్నది. దీనినిఁబట్టి కొందఱు చరిత్రకారులు ఆ కాలమున త్రాగుబోతుతన మెక్కుడుగ నుండెనని యూహించు చున్నారు. కాని మొదట వ్రాసిస నిబంధనలను జాగరూకతతో స్మరించిన యెడల నీ యలంకారాదులు త్రాగనేగు స్వల్పసంఖ్య జనంబుల యారోగ్యముకొఱకును పరిసర ప్రదేశస్తులకు జుగుప్సాభార మాపాదింప కుండుటకును విధింపఁబడెనని తోఁచక మానదు. కొలతపాత్రలను తూనిక యంత్రములును ప్రభుత్వమువారి వలననే చేసి యమ్మఁబడు చుండెనని ఇది వఱకు వ్రాసియున్నారము. దానినిఁబట్టి 'యిండియన్ అంటి క్వేరీ' సంపాదకులు ఆకాలమున నాణెములు బహుస్వల్పముగ నుపయోగింపఁ బడుచుండెననియు వ్యాపారమంతయును వస్తుగ్రహణ ప్రతిగ్రహణము వలననే జరుగుచుండెననియు వ్రాసియున్నారు. కావున నాకాలమునందు నాణెముల వలన రాజునకు నెక్కుడుగ లాభము గలుగు చుండెనని చెప్పుటకు వీలు లేదు. అయినను నక్కాలపు నాణెములను వానియందలి లోహ విశేషంబును ప్రస్తుతపు నాణెములతోటి సామ్యమును మా చదువరులు గ్రహించుటకయి యీ క్రింది వివరణ పట్టిక నిచ్చుచున్నాము.
నాణెముల పేళ్లు. | అందలి విశేష లోహములు | వెల (గురిగింజలలో) |
1 పణము | 1/16 రాగి, 1/16 సీసము | =80 గింజలు = 80/122 తులములు = ఇంచుమించుగ నిప్పటిరూపాయిలో 2/3 వంతు |
2 అర్థపణము | " | = 40 గింజలు, |
3 పాదము | " | = 20 గింజలు, |
4 అష్టభాగము | " | = 10 గింజలు |
1 మాషము | 1/4 వంతు ఇతరలోహం | = 5 గింజలు |
2 అర్ధమాషము | " | 2 1/2 గింజలు, |
కాకణి | " | 1 1/4 గింజలు |
అర్ధకాకణి | " | 5/8 గింజలు |
పై వివరణపట్టికయందుఁ గనినవిగాక అర్ధశాస్త్రమునందు చాణక్యుఁడు బంగారు నాణెములను బేర్కొని యున్నాఁడు. 5 గింజలయెత్తుగలది మాషమనియు, 16 మాషముల యెత్తుది సువర్ణములేక కర్షకమనియు, నాలుగు కర్షముల యెత్తుదీ యొక పలమనియు వాడియున్నాఁడు. ఈ పరిమాణ పరంపర తూనిక మాత్రమునకయి యుండనోపునా ? తూనిక మాత్రమునకు సువర్ణపు దిమ్మెలు గావలెనా? చంద్రగుప్తుని కాలమున నియ్యవి వాడుకలో నుండిన బంగారునాణెములని చెప్పుటయే యుక్తీ యుక్తముగ నున్నది. అప్పటికాలమున హిందూదేశము బంగారమునకుఁ బేరువడసి యుండెను. మెగాస్తనీసు భరతవర్షమున సువర్ణమును త్రవ్వుటను గుఱించి చిత్రమయిన ఈ క్రింది కథను వ్రాసియున్నాఁడు.
తూర్పు సరిహద్దునందలి 70-80 మైళ్ల చుట్టుకొలతగల ఉచ్చ భూప్రదేశమున భారతేయులలో నొక తెగ యగు 'దరదులు' అనువారు వసించుచున్నారు. అచ్చట భూగర్భమున బంగారు గనులు గలవు. అందువలననే సువర్ణమును త్రవ్వు చీమలును నచ్చటగలవు. అవి యడివినక్కలకు పరిమాణమునఁ దీసిపోవు. వాని త్వరిత గమనము విభ్రమమును బుట్టించును. అవి వేఁటాడి జీవనము సలుపును. వానికి సువర్ణమును ద్రవ్వుటకు శశిర ఋతువు అనుకూలము. అవి బంగారు గనులనుండి ఆ లోహమునుద్రవ్వి దానితోడంగూడిన మట్టిని అడవి ఎలుక (Moles) వలె గనిద్వారమునఁ గుప్పలువైచును. అట్లు పడిన సువర్ణ రజమును కరగించుటయే కర్తవ్యము. చుట్టుప్రక్కలం గల జనులు మోత పశువులను గొనితెచ్చి దొంగతనముగా నా మట్టిని మోసికొని పోవుచుందురు. వారు ఎఱుకవడునట్లు వచ్చినచో నచ్చటి యచ్భుతమగుఁ జీమలు వారి నెదిర్చి పారిపోనీక వెన్నఁటి వారిని వారి పశువులను జంపివేయును. కావున వా రచ్చటచ్చట వివిధములగు మాంసఖండములనువైచి యా చీమలు వానిని భక్షించుటయం దేమఱియుండ బంగారు పొడిని యపహరింతురు. ఆరజమును గరగించు పద్ధతులు తెలియవుగాన వా రితరుల కమ్ముచుందురు. 1 [9] పై సంగతు లత్యద్భుతముగఁ గన్పించినను నందు సత్యము లేకపోలేదు. త్రవ్వుచుండినది చీమలుగావు. కాని తిబెట్టుదేశపు ఖననక్రియాదక్షు లక్కార్యములను దీర్చుచుండిరి. వారి యుపకరణాదులనుబట్టియు వారి పద్ధతులను బట్టియు నభ్యాసములను బట్టియుఁ బై కథ పుట్టియుండునని నిర్ణయింపఁబడి యున్నది.
ఏది యెట్లయినను బూర్వము హిందూదేశమున చీమలు బంగారపు పుట్టలఁ బెట్టుచున్న వన్నను బయటి దేశముల వారలు నమ్ముచుండెడివారు. అట్టి కాలమున బంగారపు నాణెము లుండెనని చెప్పుటకు వేరు యుక్తులు గావలెనా ? ఒక వేళ బంగారపు తూనికదిమ్మెలను నుపయోగించుచుండి రేమో.1[10]
నాణెముల కథ యింతటితోఁ జాలింతము. ఇదివఱకుఁ బేర్కొనిన మార్గములేగాక రాజునకు నాదాయము నిచ్చు మార్గము లింకను ననేకములుండెడివి. వాని విస్తారవివరణమిట .యనవసరము,
సామంత ప్రభువులు గొని తెచ్చియిచ్చు కప్పములును, గ్రామరక్షక సంఘములు వసూలుచేయు నపరాధములును, ఖయిదీలను విడిపింప నియ్యంబడు చుండిన ధనమును, అభిజ్ఞాన పత్రముల విలువయు, అవసరమగు నెడల దేవాలయాదులలోని ద్రవ్యమును, ఓడలమీఁద పన్నులును, బాటతీరువలును, గనుల తీరువలును, అడవి ద్రవ్యముల మీఁద సుంకములును, జరిమానాలును, రాజుగారి బొక్కసమునకుఁ జేరుచుండెడివి.
జనాభా లెక్కలు.
నాగరకునకును గోపునకును నియమింపఁబడిన కర్తవ్యములలో జనాభాలెక్క యెప్పటిదప్పుడు వ్రాయుట యొక్కటి మయి యుండెను. తమ గ్రామము నందలి ప్రతివ్యక్తి యొక్క తెగ, జాతి, పేరు, ఇంటి పేరు, వృత్తి, వరుంబడి, వ్యయము, పశుగణములు వీరు లిఖించి పెట్టుచుండిరి. బయటి వారెవరైనను వచ్చినప్పుడు వారిని గుఱించి తెలిసికొని వ్రాసిపెట్ట వలసిన దనియు నట్టివారుగాని మఱియెవ్వరుగాని తప్పు సంగతులు నుడివిన యెడల శిక్షకుఁ బాత్రు లగుదురనియు నున్నది. ఇంతకంటె విశేషమగు జనాభాలెక్క లేల కావలెను ?
బాటలు వాహనములు
చంద్రగుప్తుని రాజ్యము ఇప్పటి భరతఖండమునకంటె విస్తీర్ణమున ఎక్కుడయినదని ఇదివఱకే వ్రాసియున్నాము. ఇంతటి రాజ్యములో నొక్క భాగమునుండి మఱియొక భాగమునకుఁ బ్రయాణాదులు సలుపుటకు సదుపాయములు పుష్కలముగ నుండెను.
పలువిధములగు బాటలు వర్ణింపఁబడినవి. వానివెడల్పు వానివాని యుపయోగములనుబట్టి 32 అడుగులు మొదలు నాలుగడుగుల వఱకు నుండెడివి. ఉపయోగమును బట్టియు గమ్యస్థాన విశేషమును బట్టియు నీ బాటలకుఁ బేరు లమరి యుండెను. రాజమార్గము లనియు, రథపథము లనియు, పశు పథము లనియు, ఖరోష్ట్రపథము లనియు, చక్రపథము లనియు, మనుష్యపథములనియు, అసంపథములనియు, వరుసగ రాజులు, రథములు, పశువులు, ఖరోష్ట్రములు, శకటములు, సాధారణ ప్రయాణీకులు, బరువు మోసికొని పోవువారును ఉపయోగించు కొనుట వలన వచ్చిన పేళ్లు. రాష్ట్ర పధములనియు, వివీత పథములనియు, ద్రోణుముఖ పథములనియు, స్థానీయ షథములనియు, సయోనీయపథములనియు, వ్యూహపధములనియు, శ్మశానపథములనియు, గ్రామపథములనియు, వనపథములనియు హస్తిక్షేత్రషథములనియు, సేతుపథములనియు, నాయాగమ్య స్థానములనుబట్టి వచ్చిన నామధేయములు.
ఇవిగాక కోటలయందు విశేషమార్గము లుండెడివి. వాని నిటఁ బేర్కొనఁ బని లేదు.
ఈ బాటలెల్లయును బహుజాగరూకతతో గాపాడఁ బడుచుండెను. వీనిపై ప్రయాణీకుల కభ్యంతరము గలుగఁ జేసిన వారు దండింపఁ బడుచుందురు. ఇందు దక్షిణదేశమునకుఁ బోవుచుండిన బాటలవలన వజ్రములు, ముత్యములు, రత్నములు, బంగారు, శంఖములు మున్నగు వస్తువుల వ్యాపారము మిక్కుటముగ జరుగుచుండి నందున నా మార్గములకే చాణక్యుఁడు ప్రాముఖ్యత నిచ్చియున్నాఁడు. అన్ని మార్గముల మూలమునను జక్కని వ్యాపారము జరుగుచుండె ననుటకు సందియము లేదు. ఇంతియగాక ఈ మార్గము లింకొకవిథమునఁ గూడ నుపయోగించు కొనఁబడుచుండెను. అతివిస్తారంబగు నా రాజ్యమున సమయోచితంబుగ దండులను మందుగుండు సామగ్రిని దూతలను పనిచి రాజకీయ కార్యములను జక్కపెట్టుకొనుటకుఁ జక్రవర్తి కీ మార్గము లెంతయుఁ దోడ్పడు చుండెడివి.
ఇట్టి మార్గముల నిరంతరమును బ్రయాణము సలుపు చుండిన వాహనసాధనములను గుఱించి యోచింతము. అందు రథములు మొదటివి. సైన్యమును గుఱించి వ్రాయునప్పుడు రథాథ్యక్షుఁ డొక్కఁడుండెనని వ్రాసితిమిగదా ! దాని వలననే అప్పటి కాలమున రథము లెంత ముఖ్యవాహనము లయినదియు మా చదువరు లూహించు కొనఁగలరు. ఏడుజాతుల రథము లుండెడివి. ఎత్తునందు పదియడుగులు గలవి యున్నత తమములు. అట్లే వెడల్పునందు పండ్రెండడుగుల వఱకుఁ గలవు. దేవరథములనియు, పుష్పరథములనియు, సాంగ్రామికరథములనియు, పారియానిక రథములనియు, 1[11] పరపురాభి యానికము లనియు,2[12] వైనయికములనియు,3[13] రథములలో ఉపయోగము ననుసరించి విభేదము లుండెడివి.
రథములకుఁ దరువాత లఘుయానము, గోలింగము, శకటము నాఁబరగు బండ్లు ముఖ్యసాధనములు ఇవ్వియే సర్వ సాధారణముగ నుపయోగింపఁ బడుచుండెడివి. వీనిని రథములను లాగుటకు ఒంటెలను, ఎడ్లును, గుఱ్ఱములును వాడఁబడు చుండెను. బండ్లు నడపువానికి చక్రచరుఁడని పేరు. శివికములును పీఠికములును ననంబడు పల్లకీలును నక్కాలమున నుండెడివి.
ఇన్ని తెఱంగులగు వాహనముల ప్రయాణంబున కాకరమగు మార్గముల పథికులకు నపాయములు గలుగకుండుటకుఁ దగిన నిబంధన లేర్పఱుపఁబడి యుండెను. వాని వివరణ యనవసరము.
ప్రయాణీకుల సౌకర్యార్థము మార్గముల కిరుప్రక్కలను చెట్లవరుసలు పెంచఁబడుచుండెను. అచ్చటచ్చట నీటి వసతు లేర్పఱుపఁబడి యుండె. పూటకూలి యిండ్లను విశ్రమాలయములును బొడగట్టుచుండెను.
ఇదివఱకు వ్రాయఁబడిన దంతయును భూమార్గములను గుఱించియే. నీటి బాటలును చంద్రగుప్తుని కాలమున సుప్రసిద్ధములయి దూరభాగముల నొండొంటితోఁ జేర్చి భూమార్గముల వలెనే పాటలీపుత్ర సామ్రాజ్యమునకుఁ బటుత్వ మొసంగుటయేగాక లోకమునందలి యితర రాజ్యములతోడను అందలి ప్రజలతోడను భారతీయులకు వ్యాపార సంబంధములు కల్గించి గౌరవైశ్వర్యంబులు సమకూర్చుచుండెను. నీటిబాటలలో ననేక విభేదము లెన్నఁబడినవి. సాధారణ నదీనదములకును గాలువలకును 'కుల్యామార్గము' లనియు సామ్రాజ్యములోని రేవు లొండొంటికిని గల తీరమార్గములకు 'కూల పథము' లనియు విదేశములతో సంబంధము గడుపుచుండిన నిండు సముద్రమార్గములకు 'సంయానపథము' లనియుఁ బేళ్లు గలవు. ఈ నీటి బాటల కర్హమగు నావ లనేక తరములవి ఉండెడివి. సంయాత్యనావలును ప్రవహణములును సము ద్రముమీఁద ప్రయాణీకుల కుపయోగపడునవి. శంఖముక్తాగ్రాహిణనావలు పేరే ప్రకటించునట్లు సాగరమునండు ముత్తెముల నేరి తెచ్చుటకుఁ బయనమగునవి. మహానావలు మహానదులయం దుపయోగపడునవి. క్షుద్రనావలును, తెప్పలును, బుట్టలును ( హరగోలు ), ప్లనములును మున్నగు నీటిని దాఁటించు సాధనములకు లెక్క లేకుండెను.
నావలలోని యుధికారులును, సేనకులును, వారివారి కర్తవ్యములును విస్తారముగ వర్ణితములయి యున్నవి. కావున నావికాయాన మప్పుడు పూర్ణస్థితియం దుండెనని చెప్ప నొప్పును.
వ్యాపారము - చేతిపనులు.
ఇట్టిబాట లుండుటవలనఁ జంద్రగుప్తుని కాలమున వ్యాపారము అతివిస్తారముగ జరుగుచుండెను. మధుర1[14], అప రాంత2[15]. కళింగ, కాశి, వంగ, వత్స3[16], మహిష4[17] దేశములు సుందరతమమగు ప్రత్తివస్త్రములం బంపుచుండెను. ముత్యములు పారశీకము నుండియు బర్బరమునుండియు ; వాసన ద్రవ్యములు కామరూపము1[18] నుండియు, సింహళము నుండియు; తోళ్లు హిమాలయ పర్వతములమీఁది మ్లేచ్ఛ గ్రామముల నుండియు; ‘కాలేయక' మను గంధపుచెక్క స్వర్ణభూమి యనఁబడు బర్మా నుండియు; పట్టుగుడ్డలు చీనా నుండియు; అగరు సముద్రమున కావలినుండియు వచ్చుచుండెను. క్రీ. పూ. ఆరవ శతాబ్దమున భరతవర్షపుఁ బశ్చిమతీరమందలి వణిక్కులు బాబిలోను రాజ్యముతో వ్యాపారాదులు సలుపుచుండి రనుటకు నిదర్శనములు గలవని బ్యూలరు పండితుఁడు వ్రాయుచున్నాఁడు. ఇదియును చంద్రగుప్త చక్రవర్తి కాలమునకు సంబంధించిన దగుటవలన పై జాబితాలతోడం జేర్చిన సప్పటి వ్యాపారపరిమితి యపారమని వెల్లడి సేయుచున్నది.
సర్వసాధారణముగ వ్యాపారము వెంటన చేతిపను లభివృద్ధి యందు చుండును. అవ్వానియవస్థను గుఱించి విశేషము వ్రాయుటకు విపులాధారములు లేవు. సూత్రాధ్యక్షుఁడను అధికారి పొడగట్టుట వలనను అతఁడు నేత పనిని చూచుకొనుటకు మాత్రమే నియోగింపఁబడి యుండుటవలనను అప్పని అక్కాలమున విస్తారము జరుగుచుండెనని చెప్పవచ్చును. కుమ్మరము వడ్రంగము మున్నగు సాధారణపుఁ బనులనిట వక్కాణించుటే యనవసరము. అర్థశాస్త్రమునందలి యొకానొక ఘట్టములోని వ్రాతనుబట్టిచూడ నాకాలమున గాజుపని జరుగుచుండినట్లును అది నాణ్యపు బనులలో నొక్కటిగ నెన్నఁబడుచుండి నట్లును గానవచ్చుచున్నది.2[19]
న్యాయవిచారణ
"హిందువులు సొమ్మును, వడ్డీకిచ్చుట లేదు. అప్పు పుచ్చుకొనుటయు నెఱుంగరు. ఒరులకు గ్రీడొనరించుటకాని, ఒరులవలన గీడొందుటకాని ప్రాచీనాచారమునకు విరుద్దము. కావున సమ్మతి పత్రములుగాని తాకట్టులుగాని దొరకవు. ఒక వేళ ఋణమిచ్చియున్నను ధనము నిక్షేపించియున్నను, దానిని ఋణగ్రస్తుని వలనగాని, ధనగోప్తవలనగాని తిరిగి రాఁబట్టుటకు శాసన సాహాయ్యము లేదు. కావున ఋణదాతగాని, ధననిక్షేపిగాని విశ్వసించినవాఁడు మోసకాఁడయినయెడ, నందునకు దన్నుదా దూఱులాడుకొనుటకంటె నితరోపాయముగానఁడు” అని మెగాస్తనీసు వాసియున్నాఁడు. ఈ వాక్యములు స్థూల దృష్టితో వాయఁబడిన వనియు వానివలన నప్పటి యమాయకస్థితి నిరూపింపఁబడు చున్నదనియు మాత్రము చెప్పవలసి యున్నది. పైనివర్ణితమయిన వ్యాపారాదుల పరిమాణమునుబట్టి చూచినను చాణక్యున్ని అర్థశాస్త్రమునుబట్టి చూచినను అక్కాలమున న్యాయస్థాన పరంపరయుఁ దదుచితచట్ట సముదాయంబును నుండెనని వ్య క్తమగుచున్నది.
ప్రతి గ్రామికుఁడును, అనఁగా గ్రామాధికారియు, గ్రామ వృద్దులతోడంగూడ ననఁగా గ్రామ పంచాయతితోడం గూడ పథమన్యాయస్థానంబై యలరారుచుండు. కొన్ని వ్యాయోగముల నీ న్యాయస్థానము వారికి సంపూర్ణాధికార ముండెడిది. దొంగలను దుర్మార్గులను గ్రామికుఁడు దన గ్రామమునుండి వెడలఁగొట్టుటకును స్వతంత్రుఁడయి యుండెను. ఇతనిది మొదటి న్యాయస్థానము. రాజుగారిది ఉత్తమన్యాయస్థానము. ఈ రెంటికిని మధ్య స్థానము వహించి దేశమునందలి న్యాయ విచారణమంతయు నడుపు న్యాయస్థానములు పెక్కులుండెడివి. ధర్మస్థీయములనియు కంటకశోధసములనియు నవి రెండు తెజంగులుగా విభజింపఁబడియుండె. ఈవిభాగమునకుఁ గారణము వ్యాయోగ విశేషంబె.
ధర్మస్థీయములు ఆఱుగురు న్యాయాధిపతుల సంఘములు. అందుమువ్వురు శాస్త్రాధ్యయన పారీణులై ధర్మస్థులు నాఁబరగుచుంద్రు. తక్కుంగల మువ్వురును రాజుగారి యమాత్యులలోనివారు. వీరు లోకానుభవము గలవారగుటం జేసి శాస్త్రవేత్తలకు సహకారులయి న్యాయము దీర్చుచుందురు. ధర్మస్థీన్యాయ సంఘముల మ్రోల విచారింపఁబడు చుండిన విషయములు సర్వసాధారణములు. ప్రజలలో నొండొరులకుఁ గల సామాన్య సంబంధ విషయక వివాదములను స్వల్ప ప్రజా సంఘంబు లొండొంటికింగల సామాన్య సంబంధ విషయక వివాదములను ఈ ధర్మస్థీయములు దీర్చుచుండెడివి 1[20] వీనికి కొద్దిపాటి జరిమానాలు విధించుటకంటే నెక్కుడధికారము లేదు.
కంటకశోధన న్యాయసంఘముల మువ్వురు అమాత్యులు మువ్వురు ప్రదేష్టారులును అధికారులు. అమాత్యులు లోకానుభవాదులు గల మంత్రి వర్గంలోని వారని యిదివఱకే వ్రాయఁ బడియె. స్థానికులయి విషయములను జక్కఁగ విమర్శించి కనుగొనుటకు యోగ్యత గల యధికారులు మువ్వురకును ప్రదేష్టారులని పేరు. వీరు ఏయభియోగము వచ్చినను దానికి వలయు నుపక్రమ ప్రయత్నములను బరీక్షలను జేసి అమాత్యులకు సాయపడుచుండేవారు. రాజునకును రాజ్యమునకును సంబంధించిన నేరములును ప్రజోపద్రవ కరములగు నేరములును హత్యేత్యాది ఘన దోషములును బహుజన సంబంధకములును నీకంటక శోధనములకు విషయములు.[21] ఉరిశిక్ష నిచ్చుటకుఁ గూడ వీని కధికారము గలదు.
పై రెండు తెఱంగుల న్యాయసంఘములును సంగ్రహణములందును అనఁగా మన తాలూకా పట్టణమువంటి పట్టణములందును నాలుగువందల గ్రామములకు ముఖ్యపట్టణములగు ద్రోణముఖములందును 800 కు ముఖ్యములగు స్థానీయము లందును ప్రతి జనపథసంధి యందును అనఁగా రెండుమూఁడు మండలముల పొలిమేరలు కలియు పట్టులందును నిర్ణీతకాలమున చేరి న్యాయము తీర్చుచుండెను. ఈ న్యాయసంఘములకు ననుసరణీయమైన సాధనములు నాల్గు విధములు. మొదటిది ధర్మము. ఇది శాస్త్రచోదితము. వ్యాఖ్యానభేద మున్నపుడే దప్ప ఇది యనుల్లంఘనీయము. రెండవది వ్యవహారము. వ్యాజ్యెదారులు తత్పూర్వము చేసికొనిన యొడంబడికలు మున్నగు నుపకరణములును సాక్షుల సాక్ష్యమును నిం దిమిడియున్నవి. మూఁడవది; చరిత్ర. అనగా ఆచారాదుల ననుసరించి యేర్పడిన తీర్మాన సముదాయము. నాల్గవది రాజ శాసనము. అనఁగా రాజులు పరంపరగ నేర్పఱచుచు వచ్చిన చట్టములు. ఇందు కడపటి మూఁడు సాధనములును వరుస క్రమమున బలవత్తమ బలవత్తర బలవంతములు. అయిన నిందెద్ది యయిన ధర్మ విరుద్ధముగాఁ గాని న్యాయ విరుద్ధముగాఁ గాని ఉండినచో ననుసరణీయము.
సర్వ జనులకును సామాన్యముగఁ దెలిసిన ఈ నాలుగు సాధనములుగాక న్యాయసంమములకు మఱియొక సాధన ముండెడిది. అది వేగులవారి సమూహము. వారు దేశమునందలి ప్రతివిషయమును గనిపెట్టి రాజునకుఁ దెలియఁజేయు చుండుటేకాక యవసరమగు సంగతులను న్యాయ సంఘముల వారికిని తెలిపి న్యాయవిచారణకుఁ దోడ్పడ నేమింపఁబడిరి. కాని వారి వార్తలను మాత్రము న్యాయాధికారులు బహు జూగ్రత్తతోఁ బరీక్షింపుచుండిరి. ఇతరాధారము సంపూర్ణముగ నుండినపుడే తప్ప ఈ సాధన ముపయోగింపుకొనఁ బడు చుండలేదు, చంద్రగుప్తుని కాలపుఁ జట్టములు పరిపూర్ణత్వమున నప్పటి చట్టములకుఁ దీసిపోవుటలేదు. భార్య మూర్ఖురాలయి నప్పుడు భర్త ఆమె నెంతవఱకుఁ బారుష్యముతోఁ జూడ వచ్చునో చెప్పి ఆమెను వెదురుబద్దతో నైనను త్రాటితో నైనను దన యఱచేత నైనను పురుషుఁడు మూఁడు దెబ్బల కంటె నెక్కుడు కొట్టినచో నేరస్థుఁడగునని వ్రాయఁబడి యున్నది. దీనినిబట్టి మా సిద్ధాంతము నిశ్చయమనుట తెల్లము కావున విశేషమిట వ్రాయుట యనవసరము.
ఈతిబాధలు, వాని నివారణము
అతివృష్టి రనావృష్టిః శలభామూషకాః శుకాః
ప్రత్యా సన్నాశ్చ రాజానః షడేతా ఈతయః స్మృతాః||
అని ఈతిబాధలు వర్ణింపఁబడినవి. వీనినుండి ప్రజలను సంరక్షించి పరిపాలించినవాఁడె ధర్మము నెరవేర్చిన రాజని మన శాస్త్రకారుల మతము. మిడుతలు, ఎలుకలు, చిలుకలు మున్నగునవి వేఁటలవలనను మందులవలనను ప్రాంతిక రాజులు యుద్దమువలనను నివారింపఁబడుదురు. చంద్రగుప్తుఁడీ రెండు సాధనములును సంపూర్ణముగఁ గలవాఁడని అతని చరిత్ర మొదటినుండి చదివినవారందఱకు విదితంబె. అక్కాలమున గృహములు సర్వసాధారణముగఁ గలపచేఁ గట్టఁబడుచుండి నందున నతివృష్టి, బాధయందొక యంశమునకుఁ బ్రతీకారము గానవచ్చు చున్నది. కాని యతివృష్టివలనను ననావృష్టివలనను గలుగు గొప్పబాధలు క్షామములును . తత్ఫలంబుగ, జాడ్యము లును, ఇవిగాక పై శ్లోకమున నుడువంబడని మఱియొక దేశోపద్రవ కారణంబును గలదు, అది యగ్ని, ఈ మూఁడు బాధలను నివారించుటకుఁ దరతరములుగ నన్ని ప్రభుత్వముల వారును బాటుపడుచు వచ్చుచునే యున్నారు. చంద్రగుప్తుని కాలమున నతఁడెట్లు ప్రవర్తించినదియు నిట వివరించుట కర్తవ్యము.
మెగాస్తనీసు వ్రాతల ననుసరించి యక్కాలమున సర్వసాధారణముగ చంద్రగుప్తుని సామ్రాజ్యము సుభిక్షముగ నుండెననియే చెప్పవలసి యున్నది. కాని అర్థశాస్త్రమున దుర్భిక్షముల సంగతి తడవి తత్ప్రతీకార పద్దతులు వాకొనఁబడి యుండుటచే క్షామమేదో యొకప్పుడు తటస్థించినను దటస్థించి యుండవచ్చును.
కోష్టాగారాధ్యక్షుఁ1[22]డను అధికారి యొక్కరుఁడుండును. అతఁడు రాజునకయి వసూలగు సర్వసస్యాదులును పోగుచేసి కాపాడెడువాఁడు. అట్లు పోగైన భోజన సామగ్రియందు రాజెప్పుడును సగపాలుకంటె నెక్కు డుపయోగింపరాదు. తక్కుంగల యర్థభాగంబును ప్రజల యవసరముల కొఱకు తీసి యుంచుచుండిరి. ధాన్యాదులు చెడిపోకుండుటకయి ప్రతి సంవత్సరమును అదివఱకుఁ జేరినరాసుల నితరులకిచ్చి క్రొత్త పంటల ఫలంబునుండి బదులుకొనుచుందురు. ఇట్లు సేకరింపఁ బడిన సామగ్రి గలవాఁడగుట క్షామకాలమున రాజు ప్రజలకు భోజనమునకును విత్తనములకును ధాన్యము పంచిపెట్టుచుండు వాఁడు. ధనవంతులగు పౌరులనుండియు ఇతర రాజులనుండియు ధనము సంపాదించి క్షామనివారణార్థ ముపయోగించు చుండువాఁడు.
మన ప్రభుత్వము వారింబలె దుర్భిక్ష సమయములఁ జంద్రగుప్తుఁడు గొప్ప బాటలు వేయించుట చెఱువులు కాలువలు త్రవ్వించుట మొదలగు పనులు చేయించు చుండినట్లును తెలియపచ్చుచున్న ది.
క్షామములు ప్రతిదిన ప్రవర్తమానములుగాక ఎప్పుడో యొకప్పుడు తటస్థించుచుండినందునను తన యాదాయమున నర్థదభాగము దన్నివారణార్థము వినియోగించుటకు సార్వభౌముఁడు సన్నద్ధుఁడయి యుండుటనుబట్టియు నక్కాలమునఁ బ్రజులు క్షామమనిన వెఱపు లేనివారయియే యుండియుందురనిన ననృతము గానేరదు.
జాడ్యముల నివారణార్ధము చంద్రగుప్తుఁడు పూర్ణమగు నేర్పాటులఁ జేసియుండె ననుటకు సందేహము లేదు. ఏనుఁగులకును గుఱ్ఱములకును జికిత్సకుల నేర్పఱచినవాఁడు ఇక్కాలమునను అరుదుగ గన్పట్టు ధాత్రికలను సైన్యముల కమర్చినవాఁడు నైన సార్వభౌమునకు ప్రజల యారోగ్యమునెడ దృష్టి నిలువకున్నె? మెగాస్తనీసు పాటలీపుత్ర పరిపాలనమునకు నేర్పడిన యాఱుపంచాయతులలో నన్యదేశీయులఁ గాపాడు పంచాయతిని గుఱించి వ్రాయుచు "జబ్బుగా నున్నవారికి వలయు నుపచారముల జూగరూకులయి యొనర్చుట” యని వ్రాసి యున్నాఁడు. దీనివలన నా పంచాయతికి లోఁబడి వైద్యులు తత్తదుచితోపకరణములం గొని సిద్ధముగ నుండు చుండిరని యర్థము. వారణాసియు తక్షశిలానగరంబును విద్యా పీఠములయి విలసిల్లి వైద్యశాస్త్ర ప్రవీణులను దేశమునకు సమర్పించు చుండెనని ఇదివఱకే వ్రాసియున్నాము. అలకసుందరుఁడు (అలెగ్జాండరు) ఈ దేశము పై దండెత్తి వచ్చునెడ గ్రీకు దేశీయులగుఁ దన భిషజ్మణుల వెంటఁ గొనివచ్చెను. పాంచాలదేశమునం దతఁడుండ నాతని సైనికులకు పాముకాటులు తప్పినవిగావు. ఆ యపాయకరమగు నుపద్రవమునుండి గ్రీకువైద్యులు దమ వారిని రక్షించుకొను మార్గము గాన లేకుండిరి. అప్పుడు అలకసుందరుఁడు హైందవ వైద్యుల సాయము వేఁడ వారు తక్షణమ వ్యాళవిషానలంబునుండి గ్రీకులను దప్పించిరి. దానిచే నాతఁడు నివ్వెరగంది హైందవ వైద్యుల శక్తి సామర్థ్యంబుల మెచ్చి తన సైనికుల కపాయకరమగు ఋజలు సంభవించినపు డెల్లను మన వైద్యులకడకే ఏగవలసినదని యాజ్ఞాపించెను. 1[23] గ్రీకు చరిత్రకారుఁడు వ్రాసిన యీ వ్రాఁతను బట్టిచూడ గ్రీకు వైద్యులకంటే హైందవ వైద్యులే అక్కాలమున నెక్కుడు విజ్ఞానము గలవారయి యుండిరనుట విస్పష్టము.
చంద్రగుప్తునికాలమున భిషజులనియు, చికిత్సకులనియు జాంగలీవిదులనియు, సూతికాచికిత్సకులనియు వైద్యులు వారి వారి యభిమాస వైద్యశాఖను బట్టి పిలువంబడుచుండిరి. . భిషజులు సర్వవైద్యవిశారదులు. చికిత్సకులు సాధారణ వైద్వులు. జాంగలీవిదులు విషవైద్యులు. సూతికాచికిత్సకు లనువారు మంత్రసానులు. దాత్రికలును సైన్యమువెంట నడచు రణవైద్యులును ఈ తరగతిలోఁ జేరినవారె.
మూఁడు మూలికల పేరునెఱింగిన వారెల్లరును వైద్యులుగ నుండుటకు వీలుండినదిగాదు. ప్రభుత్వమువారి యనుమతిలేని దెవ్వరును వైద్యవృత్తి నవలంబింపరాదు.![24] ఆ వృత్తియందుండి అజాగరూకులయి మెలంగనురాదు. వైద్యునిలోపంబున రోగికి నపాయము గలిగినచో వైద్యుఁడు దండార్హుండయి యుండెను. అనుమానాస్పదంబగు మరణము తటస్థించినచో నీ యిరువదవ శతాబ్దంబునంబలె నప్పుడును శవమును పగులదీసి ఆశుమృతపరీక్ష, (Post Mortem Examination) చేయు చుండెడివారు.
ఇట్టినియమములతో వైద్యులసిబ్బంది యుండినపు డెట్టి విశేషరుగ్మత వాటిల్లినను దగుసాయము గలుగుచుండెనని ప్రత్యేకించి వ్రాయుటయే పని లేదు. క్షామాదుల ఫలంబుగ జనించిన 'మారక' వ్యాధులను రూపుమాప నెల్లవైద్యులును దమ తమ మందు తిత్తులతో సిద్దముగ నుండువారు వారి తోడంగూడ దైవప్రార్థనాదికములు సల్పి యాపదం బాపఁగల సాధుజనంబులును బరిశ్రమ చేయుచుందురు.
అగ్ని బాధలేకుండఁ జేయుటకుఁ దగిన నిర్బంధములును బరికరములును నేర్పఱుపఁబడియుండెను. వేసవి కాలమున గ్రామికజనంబులు అగ్నినార్పు పది యుపకరణంబుల (5. ఘటములు; 1. కుంభము; 1, ద్రోణము అనగా తొట్టి; 1. నిచ్చెన; 1, గండ్రగొడ్డలి - ఇది దంతెలు దూలములు పడఁగొట్టుటకు; 1. తూరుపుబుట్ట-పొగను బారదోలుట కిది; 1. అంకుశము; 1. పటకారలజత; 1. తోలుసంచి) జూఫుటొండె పచనాదికార్యముల నింటివెలుపలఁ జేసికొనుటొండె చేయవలసియుండెను,
ఎచ్చటనైన నగ్నిబాధ గలిగినయెడల నా ప్రాంతము నందలి గృహస్థు లెల్లరును దమతమ యుపకరణములతో వెలువడి యా యగ్నిని చల్లారుపవలసి యుండెను. అట్లు చేయని వారికి శిక్షలు విధింపఁబడుచుండె.
పంచాయతులు
పురపరిపాలనాక్రమము లెటువంటివో పాటలిపుత్ర వర్ణనాధ్యాయమునందు విస్తరింపఁబడి యున్నవి. సైన్యవ్యవస్థ ప్రకరణమునఁ దత్పరిపాలనాక్రమము వివరింపఁబడి యున్నది. మొత్తముమీద తేటపడునంశ మెద్దియన్న సమస్తాంశములకును పంచాయతి పరామర్శయను పద్ధతి ముఖ్యాధారముగ గ్రహింపబడి యుండుటే. పుర పరిపాలనమునకు ఆఱు పంచాయతులు, సైన్యనిర్వహణమునకు ఆఱు పంచాయతులు, శిల్పులు, వర్తకులు, కర్మకరులు మొదలుగాఁగల వృత్తి కులముల విమర్శనమునకు ఆయా కులమున కాయాకులస్థుల పంచాయతులు, గ్రామ పాలనమునకు గ్రామ పంచాయతి యనుచు నిట్లు పంచాయతి పుంజముగా నున్నట్లు తేటపడును. కొన్ని పంచాయతులు రాజ నిర్ణితములును రాజ పురుష నిర్ణితములును, తదితరములెల్ల జనసముదాయ నిర్మితములు. అత్యంత బలిష్ఠ రాజకార్యముల వినా తక్కిన వన్నియు జననియుక్త పంచాయతులు. వీనియందును రాజపురుషులై న గ్రామప్రముఖులైన నధ్యక్షులుగ నుండిరి. కాఁబట్టి రాజభక్తికి విరోధము లేకుండను జనస్వతంత్రముకు లోపము లేకుండను కార్యములన్నియు నిర్వహింపంబడె. మఱియు పంచాయతివారు తమ తీర్మానించు విషయములందు ప్రత్యక్ష జ్ఞానానుభవములుగల వారుగాను, వాదిప్రతివాది సాక్షుల పూర్వోత్తరముల తెలిసినవారుగాను, ఆయాజన సముదాయమునకు సత్యసాత్త్వికాదులయందు యశోమాన గణ్యతాబద్ధులుగాను ఉండుటంబట్టి వారి నిర్ణయములు న్యాయ్యములు గాను అంగీ కార్యములుగాను నుండె. వారు జనసముదాయ క్షేమాభివృద్ధుల సహజ ప్రీతియుతులగుటం బట్టియు, తత్సముదాయ అవయవీభూతులు కావునను వివాద నిర్ణయంబులకు అనగత్య వ్యయంబుల కాస్పద ముండలేదు. కావున న్యాయనిర్ణయములు సులభసాధ్యములై యుండుచు జనులకు సుఖకరములై యుండె. ఇక్కాలమునందు బలెవ్యాజ్యములకుఁ గల కాలవిలంబములు కాని, పలు తెఱంగుల ద్రవ్యనష్టములుకాని, న్యాయవాదుల తెలక్రిందుల పొరలింపులు కాని, న్యాయనిర్ణయ విపరీతములు కాని, వివాదుల యితర కార్యభంగములు కాని ఎంతమాత్ర ముండలేదని నమ్మవచ్చును. జనస్వతంత్రతా బుద్ధియు పదే పదే వర్ధిల్లుచు ప్రజాగౌరవమును భద్రముగ సంరక్షింపబడె. రాజక్షేమమును అభివృద్ధిఁ బొందె.
రాజు
ఇప్పగిది సర్వవిధములఁ బ్రజల సంరక్షయే ప్రథమ కర్తవ్యముగఁ జేయుచుండిన చంద్రగుప్తుని దినచర్యను గొంచెముగ నిట వర్ణింపవలసి యున్నది.
దినము ఎనిమిది భాగములుగను రాత్రి యెనిమిది భాగములుగను విభజింపఁబడి యుండెను. ఈ భాగములకు నాళికలని పేరు. దివసపు మొదటినాళిక రక్షకుల నేమించుట యందును లెక్కలఁ బరిశీలించుటయందును రాజు గడపు చుండును. తరువాత నొక్క నాళికకాలము అనఁగా రమారమి ఇప్పటి 7-30 మొదలు 9 గంటల వఱకును ప్రజల మేలుకీడుల నరయుట యతనిపని. పిదప నాళికకాలము అతని భోజనాదులకును జదువునకును వినియోగింపఁబడుచుండె. నాల్గవ నాళికయం దతఁడు కరాది హిరణ్యంబును గ్రహించుట యందును అధ్యక్షుల నియమించుట యందును వెచ్చించును. ఐదవనాళిక మంత్రివర్గముతో జరుగవలసిన ఉత్తర ప్రత్యుత్తరముల కేర్పడి యుండెను. ఆఱవనాళిక యాటపాటలకును వినోదములకును నియమితము, ఏడవ నాళికయందు నేనుఁగులను, గుఱ్ఱములను, రథములను, కాల్బలములను రాజు పరీక్షించును. ఎనిమిదన నాళిక యుద్ధవిషయంబుల సేనాధ్యక్షునితోఁ బర్యాలోచించుట యందు గతించును. రాత్రియందలి ప్రథమనాళిక వేగులవారి వార్తలకును, రెండవది స్నానాదులకును, మూఁడవది మృదంగాదికముల సుస్వనములచే నిద్రనందుటకును, నాల్గవ ఐదవ నాళికలు నిద్రకును, ఆఱవది మంగళారావములకు మేల్కాంచి ధర్మముల మననము చేయుటకును, ఏడవది రాజ్య కార్యపద్ధతుల నిర్ణయించుకొని చారుల నియోగించుటకును, ఎనిమిదవది ఆచార్యులను, గురువులను, జ్యోతిష్కులను, వైద్యులను జూచుటకును వారి యాశీర్వాదముల నందుటకును వినియోగింపఁ బడుచుండెను.
ఈ విధముగ రాజుయొక్క.. దినచర్య నిర్ణీతమయి యుండెను, విశేషకార్యము లున్నపుడు రాజీ కాలక్రమమును మార్చుకొనుచుండె ననుటకు సందేహము లేదుగాని సర్యసాధారణముగ నియ్యది యతనిచే ననుసరింపఁబడుచుండెను.
"కార్యమున కెప్పుడును సిద్దముగనుండుటయె రాజునకు వ్రతము. ధర్మమును జక్కఁగ నెరవేర్చుటయె యజ్ఞకర్మ. ఎల్లరయెడ సమభావమునఁ బ్రవర్తించుటయె యాతనికినవభృధ స్నానము.”
"ప్రజలసౌఖ్యమే యతని సౌఖ్యము. వారి క్షేమమే యతని క్షేమము. తనకుఁ బ్రీతికరమగునది ప్రీతికరంబని యతఁడు తలఁపరాదు. ప్రజలకుఁ బ్రీతికరంబగునదియె నిశ్చయంబుగ ప్రీతికరంబని యతఁ డెన్నవలయు."
"రాజెల్లపుడును నప్రమత్తుఁడయి ధర్మములఁ దీర్పవలయును; అప్రమత్తతయె ఐశ్వర్యంబునకు మూలంబు. దాని వ్యతి రేకంబ దుఃఖమునకుఁ బునాది.”
అను నీ సూత్రంబులు చంద్రగుప్తుని జీవయాత్రకు మూలాధారములు. కావుననే రాముఁడుంబలె
"తండ్రి క్రియఁ" జంద్రగుప్తుఁడు
“దండ్రుల మఱపించి ప్రజలఁ దారక్షింపన్
“దండ్రుల నందఱు మఱచిరి
“తండ్రిగదా" చంద్రగుప్త “ధరణివుఁడనుచున్"
- ↑ 1. ప్రస్తుత మీ పనులన్నియు కరణములు సు ల్యాండురికార్డు ఇన్‌స్పెక్టరు తహశీలుదారులును చేయుచున్నారు.
- ↑ 1. చాణక్యుని అర్థశాస్త్రము.
- ↑ 1. మెగస్తనీసు
- ↑ 1. నీటి తీరువయని యర్థము.
- ↑ 2. "స్కంధప్రవర్తిమ" మనుదానికి "భుజముచేత మోసికొనుట" యని కొందఱర్థము వ్రాసి యున్నారు. ఆ యర్థ మంగీకరించినచో హస్తప్రవర్తిమమునకును దీనికిని భేదమెట్లో తెలియరాకున్నది. భేదము లేనిచో తీరువ ఎట్లు భేదపడునో నిర్ణయింపరాదు. స్కంధమను శబ్దము జత యెడ్లకుంగూడ ప్రవర్తించును గాన నెడ్ల సాయమున నీరు పాఱించుకొని సాగుబడి చేసికొనఁబడు భూములనుట యుక్తి యుక్తముగా నున్నది.
- ↑ 3. వాత ప్రవృత్తిమనందిని వన్ధాయతన తటాక కేదారా రామషణ్దవాపానాం సస్యపణ భౌగోత్తరిక మన్యేవ్యే వాయథోపకారందద్యు.. ( అర్థశాస్త్రము మూఁడవ భాగము.)
- ↑ 1ప్రస్తుతము అగ్రికల్చరు డిపార్టుమెంటు వారీపనియే చేయుచున్నారు.
- ↑ 1. ఇది మఱియొక రాజ్యమునుండి తన రాజ్యమునకు వచ్చు వస్తువులమీఁద రాజు పదియించు సుంకము.
- ↑ 1. మాక్రిండల్ మెగాస్తనీసు. పే 94 ఈ కథ మెగాస్తనీసునకు ముంధనేకులు చెప్పుకొని యున్నారు.
- ↑ 1. ఇండియన్ ఆంటిక్వేరి. సంపుటము. 4. పే 226.
- ↑ 1. సాధారణ ప్రయాణముల కుపయోగ పడునవి.
- ↑ 2. పరరాజులపై దండు వెడలునప్పు డుపయోగ వడునవి.
- ↑ 3. అభ్యాపమున కుపయోగింపఁ బడునవి
- ↑ 1. దక్షిణమదుర
- ↑ 2. కొంకణము
- ↑ 3. కొశాంబి.
- ↑ 4. మాహిష్మతి. కొందఱమతంబున మైసూరు. అర్ధశాస్త్రము సం. 2. అ 11
- ↑ 1. అసాము.
- ↑ 2. ఇండియన్ ఆంటిక్వేరీ సం 34 పే 116.
- ↑ 1. వ్యవహారస్థావనlu, సమయవిచ్చేదాదులు, స్వామ్యాదికారభృత్యాది కారములు, దానకల్పనలు, ఋణములు, ఔపనిధికములు, విక్రిత క్రీతాసుశయములు, దానములు, సాహసములు, దండపారుష్య వాక్పారుష్యములు, ఆస్వామి విక్రయములు, స్వస్వామినంబంధములు, సీమావివాదములు, మర్యాదాస్థాపనములు, వాస్తుశయులు, వాస్తవిక్రయములు, వివీతక్షేత్ర పథ హింసాదికములు, బాధా బాధికములు. వివాహధర్మములు, వివాహసంయుక్తములు. శ్రీధనకల్పనలు, సంభూయసముద్దానములు, దాయవిభాగదాయక్రమములు మున్నగునవి ధర్మస్థీయములకు విషయములని ఆర్థశాస్త్రమున వర్ణించఁబడినవి.
- ↑ కారకరక్షణము, వైదేహరక్షణము, ఉపనిపాతప్రతీకారము, గూఢా జీవులనుండిరక్ష, ఉపకాత్మాభిగ్రహము, ఆశు మృతక పరీక్ష, వాధ్యధర్మానుయోగము, సర్వాధికరణ రక్షణము, కన్యాప్రకర్మము మున్నగునవి కంటక శోధనములకు విషయంబులని అర్థశాస్త్రము తెలుపుచున్నది.
- ↑ 1 కోష్టమనగా జీర్ణకోశము. దానినుండి దేహపోషణమునకు వలసిన వస్తువు అని విశేషార్థము. అట్టి వస్తువులకొట్టు గావున కోష్టాగారము. అర్థశాస్త్రము సం 2. అ16
- ↑ 1. అరయన్
- ↑ 1 ఈ విషయమున శాసనము చేయుటకు మన ప్రభుత్వమువా రిప్పుడిప్పుడు ప్రయత్నము సేయుచున్నారు.