చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 2/జనవరి 1948/సంక్రాంతి
రచన :: ఏటుకూరి.
(1) గెలముంద నెలముంద కులుకుతూ వచ్చావు
పలుక రింతా మంటె సంక్రాంతీ: నిలిచి మాటాడవే, సంక్రాంతి.
(2) పూరింటి పై నవ్వు
బీర పూవులమీద
చలి ముసుగు కప్పావు సంక్రాంతీ!
చకిలిగిం తెట్టావు, సంక్రాంతి.
(3) పాల చిక్కుడు చిగురు
కేలల్ల లాడింప
నీలాలు చిలికావు సంక్రాంతీ!
నిగ్గు లొలికించావు, సంక్రాంతి.
(4) వరిచేను తలనరసి
వంగి జోహో రంటె
కొడవళ్ళు పట్టించి సంక్రాంతీ!
కూల ద్రోయించావు, సంక్రాంతి.
(5) కోడి పుంజుల జోళ్ళు
కోలాట మేస్తుంటె
కత్తులే నూరావు సంక్రాంతీ!
కుత్తుకలె దరిగావు, సంక్రాంతి.
(6) మ్రుగ్గులో గొబ్బెమ్మ
ముద్దుగా గూర్చుంటె
మూనాళ్ళ ముచ్చటని సంక్రాంతీ!
మోమింత చేశావు, సంక్రాంతి.
(7) గంగెద్దు సింగన్న
సంగీతమున కుబ్బి
తబ్బిబ్బు లయ్యావు సంక్రాంతీ!
తందనా లాడావు, సంక్రాంతి.
____________________________________________________________________
- సంక్రాంతినెల వచ్చేలోగా కొన్నిచోట్ల చిక్కుడు గెలవేస్తుంది. కొన్నిచోట్ల నెలబెట్టిన తరువాత గెల వేస్తుంది. దీన్ని పురస్కరించుకొని వచ్చిన యీ నానుడిని క్రొత్తింటి కోడలిమీద ప్రయోగిస్తారు. కడుపుముందా కాపురముముందా అని దీని యంతరార్థమట. ఇది ఆడుబిడ్డల పరిహాసోక్తులలో చేరుతుందనుకొంటాను.
(8) కోణంగి హరిదాసు
గొంతులో కొలువుండి
ఊళ్లూళ్ళు మేల్కొలిపి సంక్రాంతీ!
ఉఱ్ఱూత లూచావు, సంక్రాంతి.
(9) డబు డక్కివాడు నీ
డంకా బజాయింప
గంగెద్దు పై నెక్కి సంక్రాంతీ!
కదలివచ్చా వమ్మ, సంక్రాంతి.
(10) ముసలెద్దు రంకేసి
మూపురము గదలించె
నీచలువ నీవిలువ సంక్రాంతీ!
వాచా మగోచరము, సంక్రాంతి.
(11) నీరుల్లి మడిలోన
వేరూని చిరికూర
సనలు దొడిగిందమ్మ సంక్రాంతీ!
నిను నుతించిం దమ్మ, సంక్రాంతి.
(12) సెనగ పూవుల రైక
చినదాని యొడిసేల
గాలి తరగల లోన సంక్రాంతీ!
గోలి దిరిగాడింది, సంక్రాంతి.
(13) మిరెపపారా ణెట్టి
మెరయు పంట వలంతి
పరిగె పాటలు పాడె సంక్రాంతీ!
బంతిపూ వస పాడె, సంక్రాంతి.
(14) అరిసెల పూపాలు
చిరుతిండి బండార
మల్లు గుఱ్ఱలకునై సంక్రాంతీ!
అటక చేర్పించావె, సంక్రాంతి.
(15) ఆబాల గోపాల
మానంద వార్థిలో
మునిగి తేలినదమ్మ సంక్రాంతీ!
తనువె మరచిందమ్మ, సంక్రాంతి.
(16) కవులకును శిల్పులకు
కావలసి నంతపని
కల్పింతు వేటేట సంక్రాంతీ!
కనుపింతు వొకమాటె, సంక్రాంతి.
(17) స్వాతంత్ర్య భారత
చ్ఛాయలం దీనాడు
నీరూప మరసితిమి సంక్రాంతీ!
నిర్వృతిం బొందితిమి, సంక్రాంతి.