చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 2/జనవరి 1948/చదువుకున్న కాకిపిల్ల

'అనగా'అనగా ఒకకాకి. దానికోకపిల్ల. ఈ రోజుల్లో అందరిపిల్లలూ చదువు కుంటూవుంటే, నా పిల్లకి మాత్రం ఏమితక్కువని కాకి, పిల్లని బడికిపంపి చదువు చెప్పించింది.

  గొంతు బాగున్నవాళ్లూ, బాగులేనివాళ్లూకూడా సంగీతం నేర్చుకోవడం చూసి, నాకూతిరికి సంగీతం చెప్పిస్తానని కాకి, పిల్లకి సంగీతం చెప్పించింది.
  అందంవున్న వాళ్లూ , లేనివాళ్లూకూడా నాట్యం నేర్చుకుంటూ వుంటే, నా పిల్లమాత్రం తీసిపోయిందా ఏమిటని, కాకి, పిల్లకు నాట్యం నేర్పించింది. ఇలా మూడు విద్యల్లో కాకి తనపిల్లని తయారుచేసింది. ఎలాగైనా, కాకిపిల్ల కాకికి ముద్దు గదా !
  ఇలా వుంటుండగా, కాకిపిల్ల ఒకరోజున ఒకమాంసంముక్క తెచ్చుకొని, చెట్టుకొమ్మమీద కూచుని నములుతోంది. అది ఒకనక్క చూసింది. నక్కకి జిత్తులు పుట్టుకతో వచ్చిన బుద్దులుగదా. కాకిపిల్లను మోసంచేసి, ఎలాగయినా ఆ మాంసంముక్క కాజేదామనుకుంది.
  కాకిపిల్ల కూచున్న చెట్టు దగ్గరికి వెళ్లి కాకిపిల్లనుచూసి " ఏం, మరదలా బాగా చదువుకున్నావా?" అని అడిగింది.
కాకిపిల్ల చదువులు నేర్చిందికదా! అంచేత నక్కజిత్తులు దానికి తెలుసు. పైగా, పూర్వం ఒకనక్క, ఒకకాకిని మోసంచేసి దానినోట్లోవున్న మాంసం ముక్కను కాజేయ్యడం కథకూడా కాకిపిల్ల రెండోక్లాసులో చదువుకుంది.
 అంచేత నక్క మోసం కాకి పిల్లకి తెలుసు. నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెపితే, తన నోరు తెరవాలసి వస్తుంది. అప్పుడు నోట్లో మాంసం ముక్క క్రిందపడిపోతుంది. దానిని కాస్తా నక్కనోట్లో వేసుకు పోతుంది. ఆసంగతంతా కాకిపిల్ల, చదువుకున్నది కనుక, ఆలోచించుకొని, నక్క అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పకుండా, అవునని తలవూపింది.
 నక్క తనఎత్తుసాగలేదని, ఇంకా కొంచెం పెద్దఎత్తు వేదామనుకున్నది.
  " మరదలా, నువ్వు సంగీతం నేర్చుకున్నావట. నాకు సంగీతం అంటే చాలాయిష్టo. ఒక్క పాటపాడు, మరదలా", అందినక్క.
   పొగడ్త అంటే ఎవరైనా చెవికోసుకుంటారు కదా! నక్క పొగడ్తకు కాకిపిల్ల కొంచెం ఉబ్బిపోయి పాట పాడింది.
   అయితే, చదువుకున్న కాకిపిల్ల కదూ! అంచేత, నోట్లోవున్న మాంసం ముక్కను ముందుగానే తన కాలి గోళ్ళతో తీసి పట్టుకుని పాట పాడింది.
నక్కకోరిక, పాపం, ఈసారీ నేరవేరలేదు. కాకిపిల్లను మోసం చెయ్యడం ఎలాగా అని ఆలోచించి, ఇంకాస్త పెద్ద యెత్తు వేదామని, ఇలా అంది. "మరదలా, ఎంత బాగాపాట పాడావే! ఆహాహా, నా చెవులతుప్పువదిలిపోయిoదే.