చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 1/జూలై 1947/రుద్రమ్మ
మనం మూడుసార్లు మహా సామ్రాజ్యం స్థాపించాము. మొదటిది ఆంధ్ర సామ్రాజ్యం, రెండోది కాకతీయ సామ్రాజ్యం, మూడోది విజయనగర సామ్రాజ్యం. ఈ మూడుసామ్రాజ్యాలు దక్షిణదేశానికి చేసినసేవ అంతాయింతాకాదు. వీటిని నెలకొల్పకుండా ఉన్నట్లయితే దక్షిణదేశచరిత్ర మరొక విధంగా ఉండేది.
ఈ సామ్రాజ్యాలను సమర్థతతో పరిపాలించినవారిలో స్త్రీలుకూడా ఉన్నారు. వారిలో రుద్రమ్మ ముఖ్యురాలు.
కాకతి గణపతిదేవ మహారాజుకు ఆడపిల్ల అయినా మగపిల్లవాడైనా రుద్రమ్మ ఒక్కతే. తండ్రి తరువాత రాజ్యం చేయవలసింది ఆమే. అందువల్ల గణపతిదేవుడు రాజుకు కావలసిన విద్యలన్నీ రుద్రమ్మకు చెప్పించసాగాడు. రుద్రమ్మ కత్తిసాము నేర్చింది. గుఱ్ఱపుస్వారి నేర్చింది. సేనలను నడప నేర్చింది. కోటలుపట్ట నేర్చింది. ఇంకా మంచిరాజుకు ఎన్ని విద్యలు కావాలో అన్నివిద్యలు నేర్చుకొంటూవుంది.
ఇదిమాత్రం తల్లి నారమ్మకు నచ్చలేదు. అప్పు డప్పుడు నారమ్మ భర్త గణపతిదేవునితో అంటూ వుండేది:- "ఆడపిల్లకు కత్తిసాములేమిటి, ఏ సంగీతమో, ఏ చిత్రకళో నేర్పించక. ఆడపిల్ల అన్న తరువాత ఆడపిల్లేకాని మగపిల్లవాడు అవుతుందా? ఇవ్వాళ కాకపోతే రేపైనా ఒకయ్యచేతిలో పెట్టవలసిందేగా!" గణపతీదేవుడు అతీపతీ చెప్పేవాడుకాదు. నవ్వి వూరుకునేవాడు.
రుద్రమ్మ సాముగరిడీలు నేర్చుకోవటం ఆమె చెలికత్తెలకు కూడా విడ్డూరంగా వుండేది. లోలోన కొంత అసూయ పడేవారుకూడా. ఎలాగైనా ఆమె మనస్సు చిన్నపుచ్చి మాన్పించాలనుకొన్నారు. ఏమిచేస్తే బాగుంటుందా అని గుసగుసలు పోయారు. అదికాదన్నారు. ఇదికాదన్నారు; చివరికి ఎలాగైతేనేం ఒక నిర్ణయానికి వాచ్చరు.
ఆనాడు రుద్రమ్మ ఉద్యానవనంలో ఒంటరిగా కూర్చునివుంది. అప్పుడే ఒక్కొక్క చెలికత్తెవచ్చి, "జయము జయము యువరాజా!" అంటూ ప్రక్కన నిలబడింది. రుద్రమ్మ తొణకలేదు, బెణకలేదు, ఠీవిగా తలఆడిస్తూ అలాగే కూర్చున్నది. చెలికత్తెలు వెలవెలపోయి బొమ్మలులాగా నిలబడ్డారు. ఉలికేవాళ్లను ఉలికించవచ్చుకాని ఉలకనివాళ్లను ఏమి చేస్తారు?
రుద్రమ్మ వాళ్లను తానే పలకరించింది. - "యువరాజుతో మీరు చెప్పుకోగల మనవి ఏమిటి," అని అడిగింది. చెలికత్తెలు నీళ్లు నమిలారు. "మీకువచ్చిన పరవా ఏమీలేదు. మీరు ఏమికోరినా యిచ్చివేస్తాను," అంది రుద్రమ్మ. చెలికత్తెలు ఒకరిముఖం ఒకరు చూచుకొన్నారు. అది అడిగితే బాగుండును, ఇది అడిగితే బాగుండునని ఒకరికొకరు సైగ చేసుకొన్నారు. చివరికి పెద్ద చెలికత్తె చేతులు జోడించి, "మీరు ఆయుధాలు ఇక ఎన్నడూ ముట్టకపోతే చాలు. అంతకన్నా మాకు కావలసిందేముండి?" అన్నది.
రుద్రమ్మ మనస్సు కటకటపడ్డది. ఇంతకాలం నేర్చుకొన్న సాముగరిడీలు ఏమికాను? ఆయుధం ముట్టకపోతే తన తండ్రి మనస్సు ఎలా వుంటుంది? మాట తప్పితే చెలికత్తెలకు తనమీద గౌరవం ఏమి ఉంటుంది? ఆమె ఆలోచించి, ఆలోచించి చివరికి అన్నది, "సరే అలాగే, కాని నన్ను ముందు సాముగరిడీలలో ఓడించాలి, అపని ఎవరుచేసినా మళ్లీ ఆయుధం పట్టను."
చెలికత్తెలకు ఎక్కడలేని సంతోషం వచ్చింది. సరేనంటే సరేనన్నారు. ఈ సంగతి రాణి నారమ్మకు చెప్పారు. ఆమెకూడా మురిసిపోయింది. కూతురు చేత సాము గరిడీలు మాన్పించవచ్చు ననుకొంది. వెంటనే మంత్రిని పిలిపించి సంగతిచెప్పించి, కాత్తిసాములో ఆరితేరిన రాజకుమారుణ్ణి పిలిపించమన్నది. మంత్రి నవ్వాడు. రాణి ఆశ్చర్యపడి, "నిన్నకాక మొన్న నేర్చుకొన్న ఆడపిల్లను ఓడించలేరా? నేను నమ్మను. ఆమాత్రపువీరులు ఉండకపోరు. మహారాజుగారివల్ల మాటవస్తుందని భయపడకండి. వారికి నేను చెబుతాను," అన్నది.
మంత్రి వినయంగా చెప్పాడు:- "కాకతీయవంశచరిత్ర మీకు సరిగా తెలియదు. తాతముత్తాతలనాటి నుంచి నేను ఎరుగుదును. కత్తిసాములో ఈవంశం అందెవేసినచేయి. ఈవంశంలో పుట్టింది రుద్రమ్మ. ఐనా నేను మెప్పుకు అంటున్నానని మీకు సందేహం కలుగుతుంది. మన సేనానికొడుకు సంగతి మీరు వినేవుంటారు. కత్తిసాములో అతన్ని మించినవాళ్లు ఈ రాజ్యంలో లేరు. రేపే పిలిపించి పోటీ జరుపుదాము. మీకే నిజం తెలుస్తుంది." అన్నాడు.
మరునాడు రుద్రమ్మకూ, సేనాని కొడుకుకూ మంత్రి రాణిసమక్షాన కత్తి సాములో పోటీ పెట్టించాడు. రుద్రమ్మ అనాయాసంగా సేనానికొడుకును ఓడించి వేసింది. నారమ్మ తనకళ్లను తాను నమ్మలేకపోయింది. ఆపోటీ చూచినప్పటినుంచి కూతురుచేత సాముగరిడీలు మానిపించాలన్న పట్టుదల మరీ ఎక్కువైపోయింది. భర్త గణపతిదేవునితో పోరుకాడి ఎలాగైతేనేం ఆయనను ఒప్పించింది. వెంటనే రాజ్యమంతటా "రుద్రమ్మను ఓడించినవారికి ప్రధాన సేనానిపదవి యిస్తాము," అని చాటింపు చేశారు.
మేము ఓడించగలమంటే మేము ఓడించగలమని కొమ్ములు తిరిగిన యోధులు, రాజకుమారులు వచ్చారు. కాని రుద్రమ్మను ఓడించినవారు లేకపోయారు. ఇక రుద్రమ్మకు ఆయుధం విడిచి పెట్టవలసినపని లేకపోయింది.
ఈ రుద్రమదేవే గణపతిదేవుని తరువాత చాలకాలం అంగరంగ వైభోగంగా కాకతీయరాజ్యం ఏలింది. ఈమె మనుమడే ప్రతాపరుద్రదేవుడు. ఈమె పరిపాలనలో జరిగిన విశేషాలు చాలా ఉన్నాయి. మళ్ళీ ఇంకోమాటు మీకు చెప్పుతాను.