చందమామ పిల్లల మాసపత్రిక/సంపుటము 1/జూలై 1947/తెలుగు పిల్లల్లారా !
తెలుగు పిల్లల్లారా!
మీకు ఊహ వచ్చినప్పటినుంచీ నన్ను మీ చిట్టి చిట్టి చేతులతో ' చందమామ రావే, జాబిల్లి రావే ', అని పిలుస్తూ ఉండేవాళ్లు. మీరే కాదు; మీలాగా మీ అమ్మ, మీ నాన్న, మీ అవ్వ, మీ తాత, మీ ముత్తవ, మీ ముత్తాత, ఆయన తండ్రి, ఆయన తాత, అందరూ నన్ను ' మామా ' అని పిలిచేవాళ్లు. నేను నవ్వేవాణ్ణి. నా నవ్వుచూస్తే మీకు ఎక్కడలేని సంతోషం. నన్ను తెచ్చిపెట్టమని అమ్మతో పోరు పెట్టేవాళ్లు! చూశారూ? మీరేకాదు, శ్రీరాముడు కూడా వెనక ఇలాగే పోరుపెట్టాడు. అప్పుడు వాళ్ల అమ్మ కౌసల్య ఏమి చేసిందనుకున్నారు? అద్దం తెచ్చి యిచ్చింది ! పాప, అద్దంలో నా బొమ్మ
చూసి నేను వచ్చానని ఏడుపు మా వాడు !
చూశారూ శ్రీ రాముడు ఎంత అమాయకుడో !
అయితే నేను మీ ముత్తాతల, తాతల, తండ్రుల
కాలంలో రాలేక పోయాను. కాని ఇప్పుడు
వస్తున్నాను. మీకూ, మీ చెల్లెళ్ళకూ, అక్కలకూ,
అన్నలకూ, తమ్ముళ్ళకూ కనిపిస్తాను. క్రింద
భూలోకంలో, పైన ఆకాశంలో నేను చూసిన
వింతలు, విడ్డూరాలు అన్నీ చెప్పుతాను. నాకు
తెలిసిన కథలు, శాస్త్రాలు, పాటలు, పదాలు,
గమ్మత్తులు, అన్నీ మీకు వినిపిస్తాను. ఇదుగో
ఇప్పుడు కొన్ని చెప్పుతున్నాను. ఇప్పటి కివి
చాలుకదూ ? చాలలకపోతే నాకు చెప్పండి. వచ్చే
నెల వాటి అన్నిటితో మీ దగ్గరికి వస్తాను.
మీ
చందమామ.