గ్రీష్మ పుష్పవిలాసం

గ్రీష్మ పుష్పవిలాసం

రచన: కాలనాధభట్ట వీరభద్ర శాస్త్రి


ఇంకా రోహిణి రానేలేదు

కర్తరిలోనే మార్తాండుడు

చండ ప్రచండంగా

ధరాతలాన్ని ఎండకడుతున్నాడు

మరి వరుణదేముడు కరుణించాడో

సాగరజలం వేడెక్కి ఆవిరయిందో

గుంపులుగుంపులుగా కదలివస్తున్న

మొయిలుభామల్ని అలవోకగా

మలయమారుతం స్ఫౄజించిందో

శివతాండవానికి గంగ వలికిందో

జల జల చినుకులు రాలాయి

కుండపోతగా వానలు కురిసాయి

బీడువారిన నేలను తడిపాయి

ప్రాణికోటికి తాపం తగ్గించాయి

పుడమి తల్లి వడిలో

ఇంకిన జలరాశికి

ఒక్కసారి నిద్రలేచి ఆవులించి

గ్రీష్మం వికసించిందా అన్నట్టు

భూసుందరి జంటగ వెలికొచ్చింది

అహా! ఏమా వయ్యారం? ఏమా పుష్పవిలాసం!!