గ్రామ కైఫియ్యత్తులు: గుంటూరు తాలూకా (మొదటి భాగము)/కైఫియతులందలి భాష

కైఫీయతు లందలి భాష

కైఫీయతు అను హిందీపదమునకు వాఙ్మూలము లేక కవిలె గ్రంథము అని అర్థము. తెలుగున నిట్టి కైఫీయతులు పెక్కు కానవచ్చుచున్నవి. వాని నన్నిటిని మెకంజీ మున్నగువారు సేకరించి యున్నారు. సాధారణముగా నొక్కొక్కగ్రామమున కొక్కొక్కకైఫీయతు వ్రాయబడియున్నది. అందా గ్రామమునకు సంబంధించిన వివరములెన్నో యొసంగబడును. ఆ గ్రామమున కాపేరు వచ్చుటకు కారణమేమి, ఆ గ్రామము ఏయే కాలములం దెవరెవరి పాలనమున నుండెను, అం దేయే దేవాలయము లున్నవి, అందలి భూమి వివరములు మున్నగునవందు ముఖ్యమైనవి. ఈ కైఫీయతులు గ్రామమునందలి కరణములచే గాని గుమస్తాలచే గాని వ్రాయబడుచుండెను. ఇందలి భాష ఆయాకాలములయందు వ్యవహారము నందున్నట్టిదే. కొన్ని కైఫీయతులలో శాసనములందు వలె వంశక్రమములను వర్ణించు సంస్కృతశ్లోకములును తెలుగుపద్యములును కానవచ్చును. కొన్నిటిలో నాయాపద్యాదుల తాత్పర్యము లొసంగబడినవి. కైఫియతులను బట్టి ఆయాకాలము లందలి చరిత్రాంశములేకాక భాషాపరిస్థితులను కూడ తెలిసికొనుట కవకాశమున్నది. అందుకు వానిని వ్రాసినవారు తమనాడు వ్యవహారముననున్న భాష నందు వాడుటయే కారణము.

ధ్వనులు

ఈ కైఫీయతులతో ఎచ్చటను శకటరేఫము వాడబడి యుండలేదు. అర్ధబిందువు లసలే లేవు. బిందువు తరువాత వచ్చు హల్లులన్నియు ద్విత్వయుక్తములుగా వ్రాయబడియున్నవి. ఉదాహరణము: జమాయించ్చుకొని; వ్రాయించ్చుకొని; ఉండబడ్డషువంటి; పంట్టు; కాలమంద్దు; కళావంత్తినులకు మొదలైనవి. ద్విత్వములైన న, మ కారములకు ముందు బిందు వుండవలసిన యవసరము లేకపోయినను బిందువులు వ్రాయబడినవి. ఉదా : సొంమ్ము; వుంన్నది; కంన్నియను, గోత్రులుంన్ను. ఇట్లే కొన్నిచోట్ల బ్రాహ్మలనుచోట అవసరము లేక పోయినను బ్రా తరువాత పూర్ణానుస్వారము వ్రాయబడినది. బ్రాంహ్మలు సంయుక్తాక్షరమున రేఫము పూర్వాంగమైనప్పుడు పెక్కుచోట్ల వలపలిగిలక వాడబడినది. కొన్నిచోట్ల సంయుక్తాక్షరమున రెండవ భాగమైన హల్లునకు ద్విత్వము వ్రాయబడింది. ఉదా:- జర్గ్గడంలేదు; వార్ల్లకు; అంగార్క్క; అర్చ్చన; పునః, ప్రాయశః అనుచోట్ల విసర్గమునకు బదులు హకారము వ్రాయబడినది. ప్రాయశహ; పునహ. వ్యాకరణము ననుసరించి వువూవొవోలతో నారంభించు పదములు తెలుగులో లేవు. కాని ఈ కైఫీయతుల యందు పెక్కుచోట్ల ఉండు ధాతువు రూపములన్నియు వకారాదులుగానే వ్రాయబడినవి. ఒకటి శబ్దము వకటి అని వకారాదిగా వ్రాయబడినది. వొకానొక అను ప్రయోగము కూడ నున్నది. ఎల్లప్ప అను పదము యకారాదిగా కన్పించుచున్నది; యల్లప్ప. ఓరుగల్లు వోరుగల్లని వ్రాయబడినది.

వర్ణక్రమవిధానము

కైఫీయతులలో పెక్కువర్ణక్రమదోషములు గోచరించుచున్నవి. ఆ కాలము నందలి ప్రజల ఉచ్ఛారణము ననుసరించి ఆశబ్దము లట్టిరూపముతో వ్రాయబడి యుండును. ఉదా: శింహ్వాసనఁ ఇచ్చట దంత్యమైన సకారమునకు తాలవ్యమైన శవర్ణము వ్రాయుటయే కాక హకారమునకు క్రింద వకారముకూడ చేర్చబడినది. పెక్కుచోట్ల వర్గద్వితీయ చతుర్థాక్షరములకు బదులు ప్రథమతృతీయాక్షరములును, ప్రథమ తృతీయాక్షరములకు బదులు ద్వితీయ చతుర్థాక్షరములును వ్రాయబడినవి. ఉదాహరణ: స్వాస్త్యము, ఘట్టు (గట్టు). స వర్ణమునకు శవర్ణమును, ల వర్ణమునకు ళవర్ణమును వ్రాయబడినవి. ఉదా. స్తళము, చేశి, దేవుడు శబ్దము నందలి వకారమునకు బదులు మకారము వ్రాయబడినది. ఉదా: దేముడు. కొన్ని చోట్ల అవసరము లేకుండనే ద్విత్వములు వ్రాయబడినవి. ఉదా: నియ్యోగి; కాకతియ్య మొదలైనవి. సంబంధము అను శబ్దము సమ్మంధము అను రూపముతో వ్రాయబడినది. కొన్నిచోట్ల ఎకారము అకారరూపము నొందినది. ఉదా: చర్వుగట్టు (చె) చాతనున్న (చేతనున్ను) అయి, అవులకు తెలుగు శబ్దములలో ఐ ఔలు రూపాంతరములుగా కానవచ్చుచుండును. కైఫీయతులలో సంస్కృతశబ్దములలో కూడ నిట్టి మార్పు చేయబడినది. శివైక్యమను పదము శివయిక్యముగా వ్రాయబడినది. కదలలేక అను శబ్దము కదలల్యాక అనియు, నైవేద్యము, నెవేద్యమనియు, త్రవ్వి యనునది తొవ్వి అనియు వ్రాయబడినవి. ఇంకను వర్ణక్రమదోషము లందు విరివిగా కన్పించును.

అచ్చుల లోపము

ఆచ్ఛికములయందు పదమధ్యముల నలడరల ఉత్వమునకు లోపము బహుళముగా నగుననియు, లాతియచ్చునకు సహిత మొకానొకచో నుడి నడుమ లోపము కానబడుననియు, వ్యాకరణము చెప్పుచున్నది. కిన్క; అడ్గు; కూర్కు; ముల్కి; కల్కి; మున్నగున విందు కుదాహరణములు. ఇట్టి లోపములు ముఖ్యముగ ఉపోత్తమమైన యచ్చునకు లోపములు కైఫీయతులయందలి భాషలో వివిధములుగా కన్పట్టుచున్నవి. చెరువు అనుదానికి చెర్వు, జరుగు అనుటకు జర్గు అనురూపములున్నవి. పడమర అనునప్పుడు డకారము నందలి అకారము లోపించుటచే పడ్మర అను రూపమేర్పడినది. ఉపోత్తమ మనగా మూడుగాని అంతకు మించిగాని వర్ణములుగల శబ్ధములందు తుదివర్ణమునకు సమీపమునందున్న అక్షరము. "త్య్రాదీనాయంత్యముత్తమం.” దానికి సమీపమున నున్నది ఉపోత్తమము. కైఫీయతులందలి భాషలో కొన్నిచోట్ల తుది అచ్చులోపించుటయు, కొన్నిచోట్ల ఉపోత్తమమైన అచ్చు లోపించుటయు కానవచ్చును. చేయు, అగు అను ధాతువులకు చేసిన, అయిన, అనునవి భూతకాలక్రియాజన్యవిశేషణములు. వీనిలో ఉపోత్తమమైన అచ్చునకు లోపము కలిగినచో చేశ్న, అయ్న అనురూపము లేర్పడవలయును కాని కైఫీయతులలో చివరి యచ్చులోపించి ఉపోత్తమమైన అచ్చట్లే నిల్చిపోవుచున్నది. అయి, చెశ్ని, గన్కు, అంద్ను, అనురూపము లిందుకు ఉదాహరణములు. లు, ల, నలు పరమగునపుడు మువర్ణమునకు లోపమును తత్పూర్వాచ్చునకు దీర్ఘమును అగుట వ్యాకరణసమ్మతము. దీనిని బట్టి దేశమునకు అనుటకు దేశా నకు, గ్రామమునకు అనుటకు గ్రామానకు, శాశ్వతమునకు అనుటకు శాశ్వతానకు అనురూపము లేర్పడును. కైఫీయతులలో నకారమునందలి అకారము లోపించుటచే నేర్పడిన దేశాన్కు, గ్రామాన్కు, శాశ్వతాన్కు అనురూపములు కనపడుచున్నవి. గ్రామానికి, దేశానికి వంటినికి సహితరూపములు కూడనున్నవి. పయికి, వారికి అనుశబ్దములలో కూడ ఉపోత్తమేత్వమునకు లోపము కలిగిన పయ్కి, వార్కి అనురూపములు కన్పట్టుచున్నవి. ఇప్పటికి, అప్పటిలో అనుశబ్దము లందు 'టి' యందలి ఇ కారము లోపించుటచే నేర్పడిన యిప్పట్కి, అప్పట్లో అనురూపములు వాడబడినవి. వారలకు అనుచోట పడమరలోవలె రెండవ అక్షరము నందలి అకారము లోపించుటచే వార్లకు అనురూప మేర్పడినది. యీయ్నకు అనురూపము కూడ నిట్టిదే. భజంత్రీలకు బ్రాంహ్మలకు, నియోగులకు అను శబ్దములందు లకారమునందలి అకారమునకు లోపము కానవచ్చుచున్నది. ఈ విధముగ భజంత్రీల్కు, బ్రాంహ్మల్కు, నియోగుల్కు అనురూపము లేర్పడినవి. జరుగగలందులకు అనుదానికి జర్గిగలంద్లుకు అను రూపము వాడబడినది. ఇచ్చట అకారము లోపించిన లకారము దకారముతో సంక్లిష్టమైనది. జరుగు అను ధాతువునందలి మధ్యమ ఉకారము లోపింపగా జర్గ కావలయును కాని జర్గగల అనుటకు జర్గిగల అను రూపము వాడబడినది. ఇట్టి లోపములు సంస్కృతశబ్దములందు కూడ గోచరించుచున్నవి. కేశవ అనుటకు కేశ్వ, అనేక అనుటకు అన్కె, కర్ణాటక అనుటకు కర్ణాట్క, అంగారక అనుటకు అంగార్క, పురాతన అనుటకు పురాత్న, యోచన అనుటకు యోచ్న అను రూపములు ఉపోత్తమమైన అచ్చు లోపింపగా నేర్పడినట్టివి. చేయుటకు అను పదమునకు చేయడాన్కు, చేయాడాన్కి అను రూపములు వాడబడినవి.

క్రియాపదములు

వర్తమానకాలమునందు కలుగు చు వర్ణకమునకు బదులు తు వర్ణకము కన్పడు చున్నది. అగపడుతున్నది. చెప్పుతున్నారు, జర్గుతున్నది మున్నగున విందు కుదాహరణములు. కొన్నిచోట్ల కార్యము యొక్క అవిచ్ఛన్నతను తెలుపుటకు జర్గుతు వున్నది. జరుగుతూ ఉన్నది మున్నగు రూపములు కూడ వాడబడినవి. భూతకాలమున ఎ అను ప్రత్యయము చేర్పగా వచ్చిన రూపములను, భూతకాలక్రియాజన్యవిశేషణములకు చేర్చు తచ్ఛబ్దముల వకారమునకు లోపము వచ్చిన రూపములును కానవచ్చుచున్నవి. చేశెను; ఇప్పించ్చినాడు; ఏర్పరచినారు; తవ్వించినాడు మున్నగు రూపము లిందుకు తార్కాణములు. కొన్నిచోట్ల చేసెను, ఇచ్చెను అను క్రియల యందలి చివరి ఉకారమునకు దీర్ఘము వచ్చుటయు కానవచ్చుచున్నది. చేశెనూ; యిచ్చెనూ అగు ధాతువునకు భూతకాలమున ప్రథమపురుషైకవచనరూపము ఆయెను. ఒకచోట చాయడాయను అనురూపము కానవచ్చుచున్నది. ఇందు ఎను అనుగా మారినది. చేయడాయెను అనునది ఇందుకు సరియైన రూపము అయినది అనుటకు అయ్యింది అనురూపము వాడబడినది. ఆత్మనేపదార్ధమును సూచించుటకు ధాతువులకు కాను ధాతువు అనుప్రయుక్త మగును. "ఉత్తరస్యకానోర్ధాతోః కంబుధాః కేచిదూచిరే" అనికొని అనుదానికి బదులు క అనురూపము వచ్చుటకు పూర్వవ్యాకర్తలే అంగీకరించినారు. 'కొని’ బదులు కుని, కు అనునవి వచ్చిన రూపములు కూడ కానవచ్చుచున్నవి. చేస్కుని, పుండ్డుకుంన్న, కలుసుకొని, కూర్చుకుని పంచుకునె యెడల మున్నగున విందు కుదాహరణములు. భవిష్యత్ కాలమును సూచించుటకు సాధారణముగా తద్ధర్మార్ధకక్రియలే వాడబడినవి. చాయగలరు వంటి ప్రయోగములు తక్కువగానున్నవి. కొను ధాతువునకు ప్రథమపురుష బహువచనమున కొనుదురు - కొందురు అను రూపము కలుగును. అది వాడుకలో కొంటారు అను రూపమును పొందును. అట్లే పోవు ధాతువునకు ప్రథమపురుష బహువచనరూపమైన పోదురు అను దానికి పోతారు అనునది వాడుకలోని రూపము. కైఫీయతులలో నీ వాడుకరూపములే కానవచ్చుచున్నవి. పోవును అనుటకు పోతుంది అనురూపము వాడబడినది. గురువిరహితములై అయాంతములైన ఏకస్వర ద్విస్వర ధాతువుల ఇంచుగ్వక్రంబుల కియుడాగమ మగును. అట్టి ఇయుడాగమము వచ్చిన వశియించు మున్నగు రూపములు కైఫీయతులలో నున్నవి. ధాతువులకు చున్న చేర్చిన యెడల వర్తమాన కాలక్రియాజన్యరూపములును, ఎడు, ఎడి, ట, అను ప్రత్యయములను చేర్చగా తద్ధర్మక్రియాజన్యవిశేషణములును ఏర్పడును. చున్నకు బదులు తున్నతో కూడిన రూపములును, స్తున్నతో కూడిన రూపములును, కానవచ్చుచున్నవి. ఎడు, ఎడి, అను ప్రత్యయములకు చాల చోట్ల ఏ ఆదేశముగా వచ్చినది. అనెడు, చేసెడు, అను వానికి బదులు అనె, చేశె, అను రూపములు వాడబడినవి. ఇట్లు ఏ ప్రత్యయముతో ముగియు, తత్ధర్మక్రియాజన్యవిశేషణములకు అప్పుడు, మొదలగునవి పరమగునపుడు “టి” అనునది ఆగమముగా వచ్చుచున్నది. చేటప్పుడు, అనేటప్పుడు మున్నగురూపము లిందుకు తార్కాణములు. అనేటి, అతను అనుచో, అనెడికి బదులు అనేటి అనురూపము వాడబడినది. ఇన అను ప్రత్యయముతో ముగియు భూతకాలక్రియాజన్యవిశేషణములకు, అట్టి, అటువంటి అనువానిని చేర్చుట, వాడుకభాషలోనే కాక, గ్రాంధికమునందు కూడ కనబడును. అటువంటిలోని, “టు” అనుదానికి “షు” అనునది ఆదేశముగా వచ్చిన రూపములు కొన్ని కానవచ్చుచున్నవి. ఉన్నషువంటి, ఉండబడ్డషువంటి అను రూపము లిందుకు నిదర్శనములు. ఇట్టి, షు తో కూడిన రూపములు ఇప్పుడు కూడ వృద్ధులైన వైదికుల వాడుకలో వినబడుకు. అను+ అటువంటి = అనునటువంటి; అను అనుదానికి అనే అనురూపము వచ్చిన పిమ్మట అటువంటి లోని అకారమును, టు అనుదానికి ఆదేశముగా వచ్చిన షు లోని ఉకారమును లోపింపగా నేర్పడిన అనే ష్వుంటి వంటి రూపములు కొన్ని కలవు. ధాతువులకు, ఇంచు, అనునది చేర్చగా, ప్రేరణార్థకరూపము లేర్పడును. ఉదా : తవ్వించినాడు, వేయించినారు, జరిగించినారు, వ్రాయించినది. ఈ ఇంచుక్కు పరమగునపుడు, ధాతువుల చివరనుండు, చ, కారమునకు “ప”కారము వచ్చును. నడిపించు, ఇప్పించినారు మున్నగు రూపములు కైఫీయతులతో నచ్చటచ్చట నున్నవి. కర్మణ్యర్థమున ధాతువులకు, పడు ధాతువు అనుప్రయుక్త మగును. కైఫీయతులలో కర్మణి ప్రయోగములు తక్కువగా కనబడుచున్నవి. నిర్మింపబడిన, ఇవ్వబడిన మున్నగు రూపములు స్వల్పముగా నున్నవి; ఒకచోట లిఖింపచేశి ఉన్నది. ఇచ్చట దానికి లిఖింపబడి అని యర్థము. ఇచ్చునకు ముత్తు పరమగునపుడు ఈ, ఈయ అనురూపములు వచ్చును. వాడుకలో చకార ద్విత్వయము, వకార ద్విత్వయముగా మారుటచే ఇవ్వను, ఇవ్వలేదు, ఇవ్వబడిన అనురూపములు వినబడుచున్నవి. కైఫీయతులలో, కొను, పడు, ధాతువులు కొన్నిచోట్ల స్వార్థమునందే వాడబడియున్నవి. ఉండుకున్న (ఉండిన) ఉండబడ్డషువంటి (ఉన్నట్టి) అనురూపము లిందు కుదాహరణములు: చేయుము + అని = చేయుమని అగును; చేయందలి ఏకారమనకు హ్రస్వత చేకూరినప్పుడు యకారమునకు ద్విత్వము వచ్చుట సహజమే. కాని యు అందలి ఉత్వము నత్వముగా మార్చుట యుక్తము కాదు. కాని వాడుకలో నిట్టిప్రయోగము లనేకములు. అనుప్రయుక్తమైన పడు ధాతువునందలి 'ప' లోపింపగా, “అడు” అనునది మాత్రము మిగిలిన రూపములు కొన్ని కలవు. పాడుపడి, అనుటకు “పాడడి” అను రూపము వాడబడినది. ధాతువులకు 'ట' చేర్చినచో భావార్థక మేర్పడును. ఈ “ట” ప్రత్యయమునకు బదులు "అడము” అనునది కొన్ని చోట్ల చేరుచుండును. “ప్రతిక్రియ మడాంతత్వం శ్రూయతే నతు దృశ్యతే” అని అథర్వణుడు చెప్పి యుండెను. దీనినిబట్టి అడాంతరూపములు అతనినాటికి వాడుకలో నుండెనని తెలియుచున్నది. కైఫీయతులలో చేయడాన్కు, నడవడము, పూజించడాన్కు, మున్నగు రూపములు కానవచ్చుచున్నవి. “జమాయించుకొని” “మణాయించు", మొదలగు నన్యదేశములతో ఏర్పడిన ధాతువులు కూడ నిందు కానవచ్చుచున్నవి.

సంధులు

కైఫీయతులలో విసంధి పాటించినచో ట్లక్కడక్కడ కన్పించుచున్నవి. కొండమీద ఆలయం కట్టి, కరణాలు అప్పయ్య, బుచ్చివెంకయ్య, వ్రాయించినది, అనున విందులకు దృష్టాంతములు. సంధి లేనిచోట, యడాగమము వచ్చినచోట్ల కూడ నచ్చటచ్చట కానవచ్చును. ఉదా :- మిరాశీ యిచ్చినారు, చేసి యీ దేవరకు నీయందు, వొకానొకయుపద్రవము మున్నగునవి. ఉత్తున కచ్చు పరమగునపుడు, హరియించినవాడయి, అనుదానియందు వలె సంధి జరిగినచోట్లు కొన్ని ఉన్నను యడాగమము వచ్చినచోట్లే ఎక్కువగా కానవచ్చును. వారు యిచ్చిన, రాజులు యీ దేశానికి, మల్లినాయకులు యీ దేశం, క్షేత్రం యిచ్చినట్లుగా, మహారాజులు యీ దేశం, సంవత్సరమందు యీ గ్రామం. మున్నగున విందులకు దృష్టాంతములు. ద్రుతప్రకృతములమీద కూడ యడగామములు వచ్చిన ప్రయోగములు అసంఖ్యాకములుగా నున్నవి. నిన్నన్ యించ్చే యెడల యీగ్రామానికి, నియ్యోగికి యేకభోగంగా యిచ్చినట్లుగా యీ దేవాలయం వద్ద, వెలమవారికి యీ పరగణా మొఖసాగా యిచ్చి, అనునవి దృష్టాంతములు. "యీ గ్రామం పడమటివైపు కొండమీద మల్లిఖార్జునస్వామివారి దేవాలయముకు దక్షిణం దోవ వున్నది.” "యిది పూర్వం త్రేతాయుగమందు రామస్వామివారు, " “మున్నగుచోట్ల” “య” కారముతోనే వాక్యము లారంభించు చున్నవి. కస్తూరి+అయ్య = కస్తూరయ్య, ఎరకల + అయ్య = ఎరకలయ్య అనుచోట, అయ్య పరమగుటచే సంధియైనది. పడు ధాతువునకు భూతకాలక్రియాజన్యవిశేషము, పడిన, అట్లే ఉండు ధాతువునకు ఉండిన, పడ్వాదుల నవర్ణకంబున కత్వంబును, కడహల్లునకు ద్విత్వంబును విభాష నగునను వ్యాకరణసూత్రముచే, పడిన అనునది పడ్డ అగును. పడ్డతో కూడిన రూపములు కైఫీయతులలో చాల కలవు ఉదా :- ఏపన్డ్డవి. చేదాద్యర్థనాంతమైన ఉండునకు న్నాదేశము విభాష నగును. దీనినిబట్టి ఉండిన అనునది, ఉన్న యగును. కైఫీయతులలో అచ్చయిన ఉకారమునకు బదులు “వు” అను రూపమే కనబడుచున్నది. చేదాద్యర్థనాంతమైన అని ఉండుటచే భూతకాలక్రియాజన్యవిశేషణమైన ఉండినకు, ఉన్న అనురూపము రాదు. అయినను లోకమునందును, కావ్యములందును, క్రియాజన్యవిశేషణముగా కూడ ఉన్న అనునది విరివిగా కనబడుచున్నది. కైఫీయతులలో వున్నది అను రూపము పలుసార్లు కానవచ్చును. ఉన్న + అది = ఉన్నది

బహువచనరూపములు

కుమారుడను శబ్దమునకు కొమరుడు, కొమారుడు, అనునవి వికృతి రూపములు, కొమారుడు అనుదానికి బహువచనరూపము కొమారులు. “రు” లోని ఉత్వమునకు లోపము రాగా, కొమార్లు, అను రూపమేర్పడును. బహువచనక్లిష్టములై అద్విరుక్తములైన “డ”కార లకారములకే అలఘు “ల”కారము కలుగునని వ్యాకరణము చెప్పుచున్నను, రకారమునకు కూడ వచ్చుననుటకు లోకమున పెక్కుప్రయోగము లున్నవి అందుచే కొమార్లు, కొమాళ్లు అగును. కైఫీయతులలో కొమాళ్లు అను రూపమే కాక, కుమాండ్లు, అను రూపము కూడ నొక్కచో వాడబడినది. ఆ కాలమున నిట్టి ప్రయోగము కూడ నుండెను కాబోలును. కాప్రత్యయముమీది బహువచన “ల”కారమునకు లఘ్వలఘురేఫమునకు ముందు బిందు పూర్వక “డ” కారమును అగును. దీనినిబట్టి పాలెగాడు, కమతగాడు, అను కా ప్రత్యయాంతములకు పాలెగాండ్రు, కమతగాండ్రు, లేక పాలెకాఱు, కమతకాఱు అనురూపము లేర్పడవలెను. కాని కైఫీయతులలో అను రూపములు వాడబడినవి. వాడు అను సర్వనామమునకు బహువచనమున వారు, వారలు, వాండ్రు, అను రూపములు కలవు. కైఫీయతులలో వారలు, (వార్లకు) వాండ్లు అను రూపములు వాడబడినవి. పశులవాండ్లు, గారు అనునది గౌరవార్ధము, వాడు ప్రత్యయము. ఇది చేరునపుడు, నామమును సూ(చిం)చుంచు పదమునకు చివర ని, లేక నిం. అను ప్రత్యయము కనబడుచున్నది. ఉదా:- బాస్కరునిగారు, మాణిక్యారాయనింగారు, కొన్ని కైఫీయతులలో కృష్ణనింగారు: అనుపేరు కూడ కనబడుచున్నది. ఇది బహుశః కృష్ణునింగారు అయి ఉండును. పంతులుగారు అను ప్రయోగము కూడ నున్నది.

వ్యావహారికప్రయోగములు

కైఫీయతులందు కనబడు కొన్ని వ్యావహారికపదములు ఇదివఱకే సూచింపబడినవి. అవి కాక యింకను వ్యావహారికప్రయోగము లెన్నియో ఉన్నవి. ఎడల అనునది 'యడల' అని పెక్కుచోట్ల వ్రాయబడినది. దానికి సమయము నందు అను నర్థము కూడనున్నది. ఆ అర్థమే కైఫీయతులలో పెక్కుచోట్ల కానవచ్చును. ఉదంతజడము తృతీయకు నవర్ణక మగునని వ్యాకరణము చెప్పుచున్నది. కైఫీయతులలో దక్షిణాదిన అను రూపము వాడబడినది. దక్షిణాదిని అని యుండుట యుక్తము. చూచు ధాతువునకు చూచి, అనునది క్త్వార్థకరూపము. కాని వాడుకలో చూసి అనునదే ఎక్కువగా వినబడును. అది కైఫీయతులలో కూడ కలదు. తెలుగున ను (ఉను) అనునది సముచ్ఛయము. ఇది వాడుకలో ద్విత్వయుక్తముగా కానవచ్చును. కైఫీయతులలో ద్విత్వయుక్తరూపమే కాక దానికి ముందు పూర్ణబిందువు కూడ కనబడుచున్నది. మరి అను దానికి సముచ్ఛయము చేరినచో "మరియును" అగును. ఉ లోపించినచో మరిన్ మరిని అగును. కైఫీయతులందు మరిన్నీ, అను రూపము కానవచ్చుచున్నది. చాతనుంన్ను, గోత్రులుంన్ను, అనునవి మఱికొన్ని ఉదాహరణములు. నిండ, కూడ, చాల మున్నగు పదములు నిండా, కూడా, చాలా అని దీర్ఘాంతములుగా కనబడుచున్నవి. వాని తరువాత నున్న ద్రుతము లోపించుటచే తత్పరిహారముగా, దీర్ఘము వచ్చినది. పేరు అను పద మిందు ఔపవిభక్తికముగా వాడబడుటచే పేరట, అను రూపము ప్రయోగింపబడినది. కాని టి, తి, వర్ణములు పరమగునవుడు ఉత్వమునకు ఇత్వమగునను సూత్రము ననుసరించి రులోని ఉకారము ఇకారముగా మాఱవలయును. పేరిట అనునది సరియైన రూపము. దేవుడు అనుపదము, దేముడు అని మకారమధ్యమముగా వాడబడినది. దేవుడు అను శబ్దమునకు నిజమునకు బహువచనాంత ముండదు అది నిత్త్యెకవచనాంతము కైఫీయతులలో దేముడ్లకు అను బహువచనరూపాంతము కానవచ్చుచున్నది. తోడ అను విభక్తిప్రత్యయమునకు, సమాసమున అది లోపింపనపుడు ఇత్వము వచ్చును, అనగా తోడి అను రూపమేర్పడును. కాని కైఫీయతులలో తోటి ఆను రూపము కానవచ్చుచున్నది. బ్రాహ్మణుడు అను శబ్దమునకు బ్రాహ్మణులు అనునది బహువచనరూపము. బ్రాహ్మడు, బ్రాహ్మలు అనురూపములు వాడుకలో కానవచ్చును. కైఫీయతులందు కూడ నారూపము పెక్కుసార్లు వాడబడినది. కొన్నిచోట్ల "బ్రా" తరువాత పూర్ణబిందువు కూడ కనబడుచున్నది. పర్యంతము అనుమాట “పరియంతరము” అని వాడబడినది. రుద్ర+అంశ = రుద్రాంశ అగును. కైఫీయతులం దొకచో రుద్రహంశ అని వాడబడినది. కళావంతుడు అను పదమునకు కళావతి అనునది స్త్రీలింగరూపము. కైఫీయతులలో నొక చోట కళావంతినులు అను పదము వాడబడినది. తదాది యనగా అది మొదలు అని అర్థము కై ఫీయతులలో కొన్నిచోట్ల తదాది మొదలు కొని అను ప్రయోగమున్నది. వ్యాకరణము ప్రకారము దుష్టములయ్యు వ్యవహారసిద్ధములై న యిట్టి ప్రయోగములు కైఫీయతులలో పెక్కు కనిపించును. ఒద్ద అనునది పలుచోట్ల వద్ద అనియే వాడబడినది.

విభక్తిప్రత్యయములు

"వలన” అను పంచమీవిభక్తిప్రత్యయము కైఫీయతులలో చాలాచోట్ల వల్ల అను రూపము తోనే కనపడుచున్నది. అల్లసాని పెద్దన మనుచరిత్రమున, ఈ చలిమల వల్ల నుల్లసిలు, చల్లతనంబున గాక యుండినన్" అని వల్ల ప్రత్యయమునే వాడియుండెను. ఉండి అనునది సాధారణముగా, వాడుకలో "నుండి" అను రూపముతో కానవచ్చును. చిన్నయ సూరి ధనము నుంచి, వనము నుంచి అని ఉంచి శబ్దానుప్రయోగముతో కొండఱు వ్యవహరింతురు. కాని అది సాధుకవి ప్రయోగారూఢము కాదని తెలిపియుండెను. కైఫీయతులలో నుంచియే పలుసార్లు వాడబడియున్నది. చేత అనుదానిలో చకారముమీద నున్నది ఏ అనునచ్చు కైఫీయతులలో కొన్ని చోట్ల చాతనుంన్ను అని అది ఆ కారముతో కానవచ్చుచున్నది. ప్రథమావిభక్తప్రత్యయమైన ము వర్ణకము కొన్ని చోట్ల స్వస్వరూపముతోనే వాడబడినను పెక్కుచోట్ల బిందురూపము దాల్చినది. ప్రభుత్వములో, అధికారం వచ్చి, రాజ్యభారం చేస్తూ, చెయ్యడం, పకరాతి శాసనం, సావనం, మున్నగు ప్రయోగము లిందుకు తార్కాణములు. కైఫీయతులలో నచ్చటచ్చట జమీందారులయు, ధనికులయు, నామములు కానవచ్చుచుండును. మన మిప్పు డట్టివారినామముల తరువాత ప్రథమావిభక్తిమీదనే గారు, వారు అను గౌరవవాచకములను వాడుచుందుము. కైఫీయతులలో భాస్కరునిగారు, పద్మనాభునిగార్కి, మాణిక్యారాయునింగారు, అప్పారాయునింగార్కి, మున్నగు ప్రయోగములలో నాగౌరవవాచకములకు ముందు “ని” లేక “నిం” అను వర్ణములు కానవచ్చుచున్నవి. కృష్ణనింగారు అనుచో నిం అనుదానికిముం దత్వమే ఉన్నది.

'

సర్వనామములు

నీవు, నేను, వాడు, వారు, నేను, మేము, అది, అవి, అను సర్వనామములు కైఫీయతులలో గ్రంథములం దున్నట్లే కనబడుచున్నవి. వానిని అను ద్వితీయావిభక్తి రూపమునకు వాణ్ని అను రూపము వాడబడినది. జడవాచకములకు వాటికి, వాటిని, అను రూపములు వాడబడినవి. వారికి, అనుచో ఉపోత్తమేత్వము లోపించినవార్కి అను రూపమును, ఆయన అనుదానికి అయ్న అను రూపమును అచ్చటచ్చట వాడబడినవి. అతడు అనుటకు అతను అను రూపము కనబడుచున్నది. ఉదా:- అనేటి, అతను

సమాసములు

కైఫీయతులలో సంస్కృతాంధ్రపదములును, సంస్కృత అన్యదేశీయుములును, కలసిన సమాసములు తఱుచుగా వాడబడినవి. ఆంజనేయగుడి, గ్రామకరిణీకము, క్షత్రియకన్నియ, బహుగొప్ప, కాపురస్తులు, గ్రామమిరాశి, గ్రామచెఱువు, గ్రామగుడి, గ్రామకట్టుబడి, గర్భగుడి, ప్రతిరోజు, అనేకమంది మున్నగు సమాసము లిందుకు నిదర్శనములు. ఒకచోట విఘ్నేశ్వరుడి గుడి అని ప్రయోగమున్నది. ఇచ్చట నిగాగమమునకు బదులు, “డి” వర్ణము ఆగమముగా వచ్చినది. ఒక్కచో మంత్రాక్షింతలు అను ప్రయోగము కలదు. అక్షతలు అను పదమే వాడుకలో, అక్షింతలు అని వినబడుచుండును.

సంఖ్యావాచకములు

పద్దెనిమిది, పద్నాలుగు, ఇరువై, అను ప్రయోగములు అచ్చటచ్చట నున్నవి. ఒకచోట ఎనభయ్యి నాలుగు, అని యకారద్విత్వముతో కూడిన ప్రయోగము కలదు. నూటయాభై అనుదానిలో ఏబది యాభైగా మారినది. నూరు అనురూపము. రెండు మూడు చోట్ల కలదు.

అన్యదేశ్యములు

కైఫీయతులలో అచ్చటచ్చట, ఆంగ్లపదములును, హిందీ, ఉర్దూ, పారశీక, పదములును కానవచ్చుచున్నవి. అమాని, మామ్లియతు, సదరహి, దరోబస్తు, బేదఖలు, కమామీసు, లగాయతు, (లగాయతీ), మొఖసా, కసుబా, శిఫార్సు, దాఖలు, కుంఫిణి, కల్ కటరు, రిమార్కు, మైనరీ, మున్నగు పదము లిందుకు దృష్టాంతములు.

వాక్యనిర్మాణము

కైఫీయతులలోని వాక్యముల నిర్మాణములలో విశేషము లంతగా లేవు. గారుతో కూడిన శబ్దములు కర్తలుగా నున్నపుడు సాధారణముగా క్రియను, బహువచనమునందు వాడుట పరిపాటి, కైఫీయతులలో నట్టిచోట్ల కృష్ణనింగారు చేశెను, పంతులుగారు చేశెను, అని క్రియ ఏకవచనమునందే వాడబడినది. తమ్ములయ్ని జగ్గయ్య అప్పారాయునింగారు ప్రభుత్వం చేశెను, అనుచోట కూడ ఏకవచనమే వాడబడినది. క్త్వార్థకక్రియయు ప్రధానక్రియయు, ఏకకర్తృకములు కాని కొన్ని ప్రయోగములున్నవి. అట్టిచోట్ల క్త్వార్థకము హేత్వర్ధమున వాడబడినదని భావింపవలయును.

వర్ణక్రమదోషములు, అన్యదేశ్యపదములు, ఇష్టము వచ్చిన ట్లచ్చులను లోపింపజేయుట అను వాని మూలమున కైఫీయతులలోని భాష కొంత వింతగా కనిపించును. అచ్చటచ్చట అన్వయదోషములు కూడ కనబడుచుండును. కాని శ్రద్ధగా పఠించినచో నివి యాకాలమునందు ప్రజల వాడుకలో నుండిన భాషాస్వరూపమును, తేటతెల్లము కావించుననుటలో సందేహములేదు. దీనికి తోడు, వానివలన, ఆయా గ్రామములకు సంబంధించిన స్థలపురాణములను, దేవతలను, పరిపాలకులను కూర్చి, తెలిసికొనుటకు కూడ అవకాశముండును. వీనియందు వివరింపబడిన చరిత్రాంశములను ప్రమాణాంతరములచే నిర్థారణము చేసికొనుట మంచిది.

——దివాకర్ల వేంకటావధాని