గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 1/శ్రీశ్రీ రాజా వెలుగోటి రాజగోపాలకృష్ణ యాచేంద్ర బహదూర్

రాజా వెలుగోటి రాజగోపాలకృష్ణయాచేంద్ర బహదర్

 


క. తినకీర్తియెంతకాలము
వినఁబడునిజ్జగమునందు వెలయఁగ నందా
కను బుణ్యలోక సౌఖ్యం
బున నెంతియు నుల్లసిల్లుఁ బురుషుండనఘా!

వేంకటగిరి సంస్థానాధీశ్వరులు వెలుగోటివారని రావువారని ప్రసిద్ధినొందిన పద్మనాయకులను కులమువారు. వీరి మూల పురుషుఁడు భేతాళ నాయడని ప్రఖ్యాతిగాంచిన చెవ్వి రెడ్డియను రాజు. ఈ రాజు ఘనత గాంచిన కాకతిగణపతిదేవుని రాజ్యకాలమున శౌర్యధైర్యవితరణాది గుణంబుల నాసార్వభౌముని మెప్పించి యనేక బిరుదావళులను, విస్తార రాజ్యములను బహుమానముగ బడసెను. ఈ భేతాళ నాయఁడిట్టి గొప్ప పదవిజెందుటకు ఒక కథ జెప్పుచున్నారు. ఈ భేతాళనాయడు ఆదియందు పిల్లలమఱ్ఱియను గ్రామమునకు అధికారిగా ఉండెనట. అంతట ఒకనాడు ఆకస్మికముగ కోప్పెగ ధనము పొలములో పూడ్చియుండుటను కనుగొని దానిని పొందుటకు గాను బలికై యోచించుచుండగా- అతని సేద్యకాఁడగు రేచుఁడను మాలవాడు తాను అందులకు బలి అయ్యెదననియు, తనవంశము నిలుపుటకై రావు వారియింట వివాహము జరుగునప్పుడెల్ల ముందుగా తన వంశమువారిలో నొక్కరికీ వివాహము జరిగించుచుండవలయునను కొన్ని పద్ధతులు నేర్పాటు చేసికొని బలియయ్యెనట. ఈ నాటి ని ఈ యాచారము జరుగుచునే యున్నది.

ఈ వంశమువారు ఆయారాజుల కాలములో అందునా దేశములందు రాజ్యములు సంపాదించిరి.బొబ్బిలి, పిఠాపురము, జటప్రోలు మొదలగు సంస్థానములిప్పటికిని సుప్రసిద్ధినొందియున్నవి.


శ్రీశ్రీ ఉందే రాజాహరాజే మహారాజా వెలుగోటి రాజగోపాలకృష్ణ యాచేంద్ర బహదూర్
జి.సి.ఐ.ఇ. పంచహజార్ మనసబుదారు.
జననము ౧౮౫౭ (1857). మరణము ౧౯౧౬ (1916)

శ్రీ శ్రీమహారాజా వెలుగోటి రాజగోపాలకృష్ణ యాచేంద్ర బహదర్ గారు మూలపురుషుడుగు చెవ్వి రెడ్డికి యిరువది యెనిమిదవతరమువారు. వీరి తండ్రిగారగు కుమార యాచమ నాయుడుగారు తమ జీవిత కాలములోనే అనగా ౧౮౭౮ సంవత్సరమున జ్యేష్ఠ పుత్రులగు వీరికి రాజ్యభారమును ఒప్పగించి ౧౨౭౯ (1978) సంవత్సరమున జాతివిభవముగ పట్టాభిషేకము గావించిరి. ఈ మహారాజా

సంస్కృతాంధ్ర హూణ భాషలను బాల్యమున విద్యాగుణ సంపన్నులగు గురువర్యులయొద్ద విద్య నభ్యసించిరి.

వీరికి గురుభక్తి విశ్వాసములు అద్వితీయము. బాల్యమునందు విద్యాబుద్ధులు గఱపిన గురువులను, ఎల్లప్పుడు ఆదరమున గౌరవించుచు, వారి వృద్ధదశయందుతగినసహాయ మొనర్చి పోషించుచుండిరి. దేవబ్రాహ్మణ విశ్వాసముగలిగియుండిరి. తమరాజ్యమున వర్ణాశ్రమధర్మముల గాపాడుచు, బ్రోత్సాహపఱచుచుండెను. వెంకటగిరిపట్నమున నెలకొనియుండు కాశీవిశ్వనాధస్వామి వారికి ధూపదీపనై వేద్యములు, ఉత్సవాదులు సలక్షణముగ జరుగునట్లు దగిన వరుమానముగల కలవలపూడిని శ్రీ స్వామివారికి ఏర్పాటు చేసిం. మఱియు, రాజ్యము నందుగల దేవాలయములయందు ఉత్సవాదులు చక్కగ జరుగునట్లు కట్టుదిట్టముల నేర్పాటు చేసిరి. వీరి తల్లిగారి పేర “లక్ష్మీనరసాంబా పుర”మని పేరిడి రు 3,000 వెలగల అగ్రహారంబును యోగ్యులగు బ్రాహ్మణులకు దానంబొసంగి దాని వరుంబడిని వారికి ముట్టునట్లు చేసిరి, బాల్యమునం దుండియు భారత రామాయణాది గ్రంథంబుల జదువుచు నందుబోధింపబడిన రాజనీతులను పాలనావిధులను, ఆశ్రితభృత్యుజన పోషణా క్రమంబులను, దండనా విధులను, చక్కగ అనుభవమునకు దెచ్చుకొని యుండుట వలన- యీ ప్రభువునకు మిక్కిలి భాల్యముననే రాజ్యభారము వహింపవలసివచ్చినను రాచ కార్యములను మిక్కిలి నిపుణలతోను జనరంజకముగను, సంస్థానము వృద్ధియగునట్లును జరుపసాగిరి.

ఈ మహాప్రభువు వంశానుగతంబుగ వచ్చు భృత్య సమూహంబును మిక్కిలి ఆదరమున గాపాడుచుండెను.

ఈ మహాప్రభువు తనుకు యుక్తమనిదోచిన కార్యములకుమిక్కిలి వితరణతతో బహుమానములిచ్చుచుండెను. ఈ ప్రభువు తన భృత్యులయొక్క కార్యనిపుణత్వమును, నమ్మకమును యోగ్యతను బట్టి క్రమక్రమముగా వారిని అభివృద్ధిలోనికి దెచ్చుచుండువారు గాని విద్యావంతుడనిమాత్రము గౌరవించువారు గారు. ప్రతిసంవత్సరమును ఉద్యోగస్థులయొక్క పనిని, వారుపడిన కష్టమును యోచించి వందలకొలది బహుమానములిచ్చు వాడుక పెట్టుకొనియుండిరి. మఱియు భృత్యులయిండ్లయందలి శుభా శుభ కార్యములకు వారివారి యోగ్యతలననుసరించి సహాయముజేసి పోషించుచుండిరి. గుప్త దానమే శ్రేష్టతమమైనదని వీరి యభిప్రాయము. అందుచేత వీరుచేసిన దానములయొక్క వివరము ఇతరులకు తెలియదు.

వీరికి ఆంధ్రభాష యందభిమానము మెండు. కవిత్వము జెప్పగల పండితవర్యులకు విశేష సహాయము జేయుచుండీరి. వీరిధన సహాయమువలన అ నేకమంది పండితులు గ్రంధములను ప్రచురింపగలిగిరి. అట్టి పండితులలో గొందరికి వర్షాశనంబుల నేర్పాటు చేసిరి. వీరి కాలమున ఆంధ్రకవులు రచింపఁగా నచ్చు వేయింపఁబడిన గ్రంథములు ౧(1) రాధాకృష్ణ సంవాదము, ౨ (2) శిశుపాలవధ, 3 (3) దశకుమార చరిత్రము, ౪(4) శృంగార పద్యరత్నావళి, ౫ (5) అమరుక కావ్యము, ౬ (6) శ్రీకృష్ణాభ్యుదయము, ౭ (7) గీతగోవిందము, ౮(8) బ్రహ్మకైవర్తములోని బ్రహ్మగణేశ ప్రకృతిఖండములు ౯(9) హాలాస్య మహత్మ్యము, ౧౦ (10) కాళిదాసప్రకరణము, ౧౧ (11) వినోదకధాకల్పవల్లి, ౧౨ (12) గోపికథా కాముది, ౧౩(13) సుమనోవినోద భాణము, ౧౪ (14) కథాసరిత్సాగరము, ౧౫(15) యాచశూరేంద్రవిజయము, ౧౬(16) ఉత్తరరామచరిత్ర నాటకము, ౧౭(17) సంస్కృత కవిజీవితములు, ౧౮ (18) రుక్మిణీ పరిణయము, ౧౯(19) రావణుని చరిత్రము మొదలుగాగలవి అనేకములు గలవు.

వీరికి అంధ్రమున జక్కని సాహిత్యము గలదు. అందువలన పండితులగువారు వచ్చినవారి గ్రంధములను స్వయముగా పరిశీలించి వారితో జర్చించి వారివారి శక్తిసామర్ధ్య ములు తెలిసి కొని గౌరవించుచుండిరి.

“ఆంధ్రసాహిత్యపరిషత్తు”ను మదరాసున స్థాపించి రాజాగారి సహాయముగోరిరి. వీరీయుద్యమమును పట్టు దలను యోచించి రు ౧౦,౦౦౦ ల గౌవర్న మెంటుపత్ర ములను బహుమానముగ నిచ్చిరి.

మద్రాసునందు శ్రీవిక్టోరియా మహారాజ్ఞి పేర ఘోపావైద్యశాలను గట్టుటకై ఒక లక్ష రూపాయలను ప్రభుత్వమువారికో సంగిరి. నెల్లూరునందు క్రైస్తవులు హైస్కూలును స్థాపించి హిందూ బాలురకు గూడ ఉన్నతవిద్యను గఱపుటకు ప్రారంభించిరి. కొంత కాల మైనపిమ్మట ఈపాఠశాలాధి కారులు హిందూ బాలురను కొందరిని వారిమతములోనికిగలుపుకొనిరి. అప్పుడు కొందరుహిందూ హైస్కూలును స్థాపించిరి. కాని ఉత్సాహము మెండుగా నున్నను ధనసహాయము లేనందున ఈపాఠశాల నానాటికి క్షీణదశనొందసాగెను. అట్టి సమయమున విద్యాభిమానులును, స్వమతాభిమానులునగు శ్రీరాజా గారు ఈ ధర్మము యొక్క ఆవస్యకతను చక్కగా దెలిసికొని దాని పోషణను తామే భరించుట కొప్పుకొనిరి. ఇప్పు ఉపాఠశాల వెంకటగిరిరాజాగారి హైన్కూలని సుప్రసిద్ధి జెందియున్నది. ఈ పాఠశాల యొక్క భవనముల కొఱకును, పోషణకోఱకును ఇదివర క నేక వేలరూపాయ లుఖర్చు పెట్టబడెను.

ఇదియును గాక అప్పుడప్పుడు మదరాసు మొదలగు గొప్పపట్టణములయందును, కుగ్రామములయందును స్వదేశాభిమానము గలవారు యత్నించిన సత్కార్యముల కెల్లను వెయ్యి మొదలు పదివేలవఱకును చెక్కు సారులు విరాళములనొసంగి కీర్తి గాంచి యున్నారు.

ఈమహారాజుగారికి బాల్యమునుండియు సామునందును గుఱ్ఱపుస్వారియందును మృగయావినోదమునందును అభిమానము విశేషముగా కలదు. వెంకటగిరి పట్టణమున గల అనేక గరిడీశాలలకు విశేష ధనమును ప్రతిసంవత్సరమును ఒసంగి జీర్ణించుచున్న ప్రాచీన విద్యలకు ప్రోత్సాహము గలిగించుచుండిరి. మఱియు తామును, రాజ బంధువులును, నగరికి సంబంధించిన 'జట్లు' నౌకరును దేహపటుత్వము జెడకుండ సాముచేయుటకు గాను రాజ · భవనమున౦దే గరిడీర్థలము నేర్పాటుచేసి యున్నారు. వీరు గతించునప్పటకి గి సంవత్సరముల వయస్సు చెల్లి యుండినను ప్రతిదినమును తప్పక గరడీలో సాముజేయుచు తక్కినవారిని బ్రోత్సాహపఱచుచుండువారు. ఈ కాలమునందలి కాలిబంతిఆట, టెనిస్సు, క్రికెట్టు మొదలగు ఆటలయందు అభిమానముండినను గరిడీసాములు వలన దేహమునకు స్థిరమైన పటుత్వము గలుగునని వారి నమ్మకమై యుం డెను.

ఈప్రభువు గారు గుఱ్ఱపుపందెములు పోలో మొదలగు ఆటలయందుకూడ మిక్కిలి అభిమానముగలిగియుండిరి. అందువలన మదరాసులో స్థాపింపబడియుండు 'జంఖా నా' కొఱకు అనేక వేలరూప్యములను ఖర్చు పెట్టి మే లైన సౌధమును జంఖానా మైదానమునందు గట్టించి యిచ్చిరి. హిందూ విశ్వవిద్యాలయమునకు గాను వీరు ఇరు వదియైదు వేల రూప్యములు విరాళమొసలిగిరి. మదరాసు నందు “ల్యాండు హోల్డర్సు అసోసియేషన్" అను పేరుతో నొకసభ నేర్పాటుచేసిరి. అందులకు శ్రీమహారాజా గారు అగ్రాసనాధిపతిగ నుండి దానిని మిక్కిలి జయప్రదముగను జమీందారులకు మిక్కిలి ఉపయోగకరముగను జరుపు చుండిరి, జమీందారులకు సంబంధించిన బిల్లులను ప్రభు త్వమువారు శాసన నిర్మాణసభలోనికి దెచ్చినప్పుడెల్ల వాటివిషయమై చక్కగ నాలోచించి, జమీందారుల యొక్క అభివృద్ధికి నష్టకరంబులగు విషయములుండిన వాటినిగుఱించి సవినయముగను పట్టుదలతోను విన్న ప ములను జేయుచుండిరి.

ఈమహారాజాగారును శ్రీశ్రీ బొబ్బిలిమహారాజా గారును మిక్కిలి పట్టుదలతో గృషి చేసి “ఇంపార్టబిల్ యస్టేట్సు బిల్లు" అనుచట్టమును గౌక్నరుగారి చట్టనిర్మా ణసభలోదెచ్చి అంగీకారము పొందునట్లు మిక్కిలి పా. టుపడిరి. ఈబిల్లువలన అనాది సంస్థానములు అన్యా కాంతములు కాకుండునట్లు సంరక్షింపబడుచున్నవి.

చట్టముల ననుసరించి వినయవిధేయతతో న్యా యముకొఱకు ప్రభుత్వమువారితో పోరాడుట తప్పుగా దని వారిదృఢనమ్మకము. తల్లి అయినను, పనితొందరల లోబిడ్డయొక్క ఆకలిసమయము మఱచియుండినను, బిడ్డ యొక్క రోదనలను విని ఆబిడ్డకు పాలిచ్చి పోషించు చున్నది. ఒకప్పుడు చిఱకుపడినను నైజమగు తల్లి తన ధర్మమును ముఱువజాలదు గదా!

ఈనాములను గురించి వచ్చిన తల్లి గాయిదాయందు వీరు విశేషముగ పోగాడీ పూర్వకాలమున మదరాసు రాజధానియందలి జమీందారులు చేసిన భూదానములను నిలిపి శాశ్వత యశస్సును బడసియున్నారు.

ఈ మహారాజాగారి రాజభక్తి అద్వితీయము. రాజభక్తి అనునది యీ కుటుంబము వారికి వంశానుగతింబుగ వచ్చుచున్నది. ఈ కుటుంబమువారి పూర్వచరిత్ర మును జదివిచూచినయెడల ఎచ్చటను ఏనాడును, ప్రభువునకు విరుద్ధముగ కక్షగట్టి యుద్ధములు చేసినట్లు గనుపడదు.

ఇప్పుడు జరుగుచుండు ఘోర సంగ్రామము ప్రారంభమయినప్పుడు, వీరు మూడు లక్షల రూప్యములు ప్రభుత్వమువారికి సహాయముగ నిచ్చిరి. మఱియును, యుద్ధనిధికి సహాయముగా అనేక వేల రూపాయలు పంపుచునే యుండిరి. వారి వాగ్దత్తమును వారి పుత్రులగు యిప్పటి రాజాగారు నడుపుచు నేయున్నారు. ఇదియును గాక శ్రీవారు మోటారు అంబ్యాలెన్సుకు గాను రెండు మోటారులగొని యిచ్చిరి.

ఇట్టి మహోదారుడును, జనప్రియుడునగు ఈ మహాప్రభువు వాణి ౧౮౧౭ (1817) సం॥రమున జననమంది ౧౯౧౬(1916) సం॥రం జూలై నెల ౨3(23) తేది ఆదివారమున స్వర్గస్థులయిరి.

ఇప్పుడు శ్రీవారి ఏక పుత్రులగు శ్రీశ్రీ రాజాగోవింద కృష్ణ యాచేంద్రబహదర్ గారు తండ్రిగారి యొక్క అధికారమును వహించి వంశానుగతంబగు మర్యాదల ననుసరించి ప్రజల మనస్సున కానందముగలుగునట్లు రాజ్యపరిపాలన జేయుచున్నారు.

--నెమలి సుబ్బారావు.