గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 2/సంచిక 1/పూవు (పద్యములు)
పూజా పుష్పము
గ్రంథాలయ సర్వస్వము
ద్వితీయ సంపుటము
ప్రధమ సంచిక
పూవు (పద్యములు)
1
చెలియల సిగలలోఁ ♦ జెలువారు పూవ
పడతుల జడలపైఁ ♦ బవళించు పూవ
సఖుల ముచ్చటముళ్ళ ♦ సవరించు పూవ
లలనావతంసమ్ము ♦ లను గుల్కు పూవ
పోవటే! మాతల్లి ♦ పూజకో పూవ!
2
అఱవిచ్చి సిగ్గులఁ ♦గరఁగిన పూవ
మొగ్గవై మోజులు ♦ మొలిపించు పూవ
పూచి శోభనములఁ ♦ బొదివిన పూవ
దళముల కౌగిలిం ♦ తలఁ జొక్కు పూవ
పోవటే! మాలెల్లి ♦ పూజకో పూవ!
3
చిగురాకు మరుఁగునఁ ♦ జెలువారు పూవ
కొమ్మ మాటునఁ ♦ గొనలెత్తు పూవ
ఎండకు కాగని ♦ యెలపూత పూవ
వెన్నల౯ పేరని ♦ వెలుతురు పూవ
పోవటే! మాతల్లి ♦ పూజకో పూవ!
4
కడుపులో తేనెలు ♦ కల కన్నెపూవ
తనువున గంధముల్ ♦ దయివారు పూవ
రెక్కల నంధాలు ♦ గ్రక్కెడు పూవ
మోమున లావణ్య ♦ ములురాలు పూవ
పోవటే! మాతల్లి ♦`పూజకో పూవ!
5
పసుపు కేసరములు ♦ మిసిమించు పూవ
నిగనిగ సొగసుల ♦ బిగువోని పూవ
పెండ్లిండ్లు పాలించు ♦ ప్రేమంపు పూవ
వీరుని కంఠాన ♦ విప్పారు పూవ!
పోవటే! మాతల్లి ♦ పూజకో పూవ!
6
కాపుకన్నియ కొప్పుఁ ♦ గైసేయు పూవ
ఉపవనాల నుయాల ♦ లూగెడి పూవ
తోటకంచెల వన్నె ♦ తోఁ బూచు పూవ
అడవి డొంకల నంద ♦ మయి యొప్పు పూవ
పోవటే! మాతల్లి ♦ పూజకో పూవ!
7
సెలయేటి పాటకు ♦ జెవియొగ్గు పూవ
తుమ్మెద సఖులతో ♦ త్రుళ్లేడు పూవ
పైరగాలికి విచ్చి ♦ వర్ధిల్లు పూవ
రంగుల రాసివై ♦ రాణించు పూప
పోవటే! మాతల్లి ♦ పూజకో పూవ!
8
కళలకళ్యాణినే ♦ కమ్మని పూవ
సౌందర్య సరసివే ♦ చక్కని పూవ
భావాలబరిణవే బంగారు పూన
చిన్నెల చిలుకవే ♦ సింగారిపూవ
పోవటే ! మాతల్లి ♦ పూజకో పూవ!
9
పెరిఁగినా ! తరిగినా! ♦ ప్రియమేనె పూవ
చచ్చినా! బ్రదికినా! ♦ స్వర్గమే పూవ
ఓడినా! గెలిచినా! ♦ యొప్పేనె పూవ
తొలఁగినా! కలసినా! ♦ తోడేనె పూవ
పోదాము! ఆతల్లి ♦ పూజకేపూవ!