గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/ పుస్తక భాండాగారములు

పుస్తక భాండాగారములు

వానినభివృద్ధి జేయవలసిన పద్దతులు.

మన విద్యయొక్క స్థితి.

మనదేశమునందు జనులలో ననేకులు విద్యాగంధము లేనివారు, విద్యతోనంతగా నవసరము లేదని తలంపబడు స్త్రీల మాటయటుండనిచ్చి, పురుషులలో సహితము రాజకీయోద్యోగములం బ్రవేశింప నెంచువారును, తమ జీవనోపాధికి విద్య యత్యంతయవసరమని తలచెడి కొలది మందియును, మాత్రమే తమబిడ్డలకు విద్య నేర్పించుచున్నారు. కావున దేశమునందు బహుసంఖ్యాకులు విద్యావిహీనులేగాక నిరక్షరకుక్షులునై యున్నారు.

మన దేశముయొక్క స్థితి.

దేశమునందు జ్ఞానము వ్వాప్తమై జనులు మౌఢ్యమను బోనడుపవలయునన్న చిన్న పిల్లలనిమిత్తమై పాఠశాలలును, కర్మకారులు వ్యవసాయదారులు మొదలగు వారి నిమిత్తమై రాత్రి పాఠశాలలను పెట్టవలెను. ఇదివరకే కొంత చదువ నేర్చినవారి కొఱకై యప్పుడప్పుడు యుపన్యాసములు నిప్పించుటకై ప్రయత్నములు గూడ జరుగవలసి యున్నవి. తానే దేశమునందు జన్మించినదియు, తన దేశముయొక్క నైసర్గిక స్థితి, శీతోష్ణాది మార్పులు, పాడిపంటలకును వ్యాపారమునకును గల సౌకర్యములు, జనులు, వారి యాచార వ్యవహారములు మున్నుగాగల యంశములను తెలిసికొని యానందించ లేనంతటి దౌర్భాగ్యస్థితివంటిది మానవునకు మఱియొకటి యుండబోదు. ఏదేశమైనను అట్టి బలపరాక్రమశీలురగు నాగరికాగ్రేసరులగు జాతులు గలిగినదైనను, తన పూర్వపు ఔన్నత్యమును మఱచి తన పూర్వపురుషుల సాధుచరితంబులను పఠింపక తన్మూలకముగ ధైర్యసాహసములకు గోల్పోవుట కిచ్చగింపదు. మన ప్రస్తుత విద్యా విహీనావస్థకు కారణము మన పూర్వచారిత్రమును మఱచి పోవుటయేయని వేఱుగ చెప్పనేల!

జరుగవలసిన పని.

జనులలో న నేకులు తమ గ్రామసరిహద్దులను దాటనివారును, తమ దేశ యితిహాసము నేమాత్రమును తెలియనివారును, తమచుట్టుప్రక్కలనుండు వన్యదేశములలో నెట్టి యద్భుతకార్యములు జరుగుచుండునదియు తెలిసి కొనుటకయినను వీలులేనంతటి యజ్ఞానావస్థలో నున్నవారును గలరు. అట్టిజనుల యజ్ఞానమునుబోగొట్టి వారికి ప్రపంచజ్ఞానమొసంగుటకు తగినప్రయత్నములు జరుగవలసియున్నవి. విద్యనభ్యసించుటకు గ్రంధపఠన మెటుల సులభసాధనమో అటులనే గ్రంధవ్యాపనమును, గ్రంథరచనమును జ్ఞానప్రచారమునకు అత్యంత పరమసాధనములై యున్నవి. నాగరిక దేశములలోనెల్ల యీగ్రంధవ్యాపనము పుస్తకభాండాగారమూలమూలమున అతికాశలముతో నెరవేర్పబడుచున్నది.

మనము జదువవలసిన గ్రంథములయొక్క నిర్ణయము.

ఈకాలమున గ్రంధములనేక విషయములంగూర్చి వ్రాయబడుచుండుటచేతను, మానవుని యార్థికావస్థ యెటుల సామాన్యమో అటులనే జీవితకాలమును స్వల్పమగుటంజేసి, బుద్ధిమంతుడగువాడు తాను చేతంబూనుటకు పూర్వమే యేయేగ్రంధములను దాను జదువవలసినదియు స్థిరపరుచుకొనవలసియున్నది. ఈ విషయమును నిర్ధారణచేయుటకు ప్రతివానికిని సుసాధ్యముకాదు. కావున జనులకు సులభముగా గ్రంధములనన్నిటిని అందజేసి, వారు యేయేగ్రంధములను వారివారి అభిజ్ఞతానుసారముగ పఠింపవలసియుండునో, నావిషయమై సలహానిచ్చుటకును గ్రంథభాండాగారములు అత్యంత ప్రయోజనీయములయియున్నవి.

మహాభాండాగారములు.

మానవసంఘముయొక్క యభ్యున్నతికై తోడ్పడెడి జ్ఞానప్రతిపాదకములగు గ్రంథరాజములనెల్ల పుస్తక భాండాగారముల నుంచదగినవియే. ఆటిపనిని చక్కగా నిర్వహింపవలయునన్న జనులందరును యేకీభవించి దేశమునందలి ప్రథానపట్టణములలో నట్టి మహాభాండాగారములను నెలకొల్పవలసియున్నది. ఈ వ్యాసము ఆంధ్రదేశమునుగూర్చియే వ్రాయబడుచున్నదిగాన, అట్టి మహాభాండాగారము ఉత్తరసర్కారులకెల్ల మధ్యస్థానమనందగు బెజవాడయందో గుంటూరునందోనొకటియు, దత్త మండలములు నెల్లూరు చిత్తూరుజిల్లాలవారికి తదితర ద్రవిడదేశవాసులగు నాంధ్రులయుపయోగార్థమై తిరుపతియందో కాళహస్తియంతో మఱియొకటియును, స్టాపింపబడినచాలురూ, ఈమహాభాండాగారముల (Central Libraries) యందు అమూల్యగ్రంధములును, సంస్కృత, ఆంధ్ర, ఆంగ్ల భాషాగ్రంథముల నుంచుటయేగాక దొరతనమువారిచే నప్పుడప్పుడు ప్రచురింపబడు పరిపాలనా సంబంధములగు వార్షి కవృత్తాంతములును, ప్రచురములుగూడ నుంచుటకు ప్రయత్నములు జరుపవలయును.

జిల్లా భాండాగారములు.

ఈ మహాభాండాగారములుగాక ప్రతిజిల్లా పట్టణమునందును నొక పుస్తకభాండాగారము నెలకొల్పబడి, అట్టి భాండాగారప్రతినిధులతో గూడిన మఱియొక కార్యనిర్వాహకసంఘమువారి యధీనమున దేశమునందలి పుస్తక భాండాగారములన్నియు నుండవలయును. ఆసంఘమువారు యేసమయమున కాసమయమున యేయే నూతన పుస్తకములు ప్రచురింపబడుచున్నవో తెలిసికొని యీ పుస్తకములను తమ మహాభాండాగారమున నుంచుటయేగాక జిల్లా భాండాగారములవారికెల్ల పంపి వారివారి శక్తిననుసరించి కొనునట్లును, వారొక వేళ కొనలేకపోయిన వారికి యెరువుగానిచ్చుటకును యేర్పాటుచేయవలయును. ఎట్లుండినను జిల్లాసంఘమువారు సంపుట మొక్కటికి పదిరూపాయిలకంటె యెక్కువవెలనిచ్చి కొనకుండునట్లును నియమమేర్పరచి అంతకన్న నెక్కువ వెలగల గ్రంధములను మహాభాండాగారములలో నుంచుచు తమయధీనములోనున్న జిల్లాభాండాగారముల కరువుగా నిచ్చుచుండిన బాగు.

గ్రామ భాండాగారములు.

ఇదేతీరున ప్రతిజిల్లాభాండాగారాధికులు తమజిల్లాలోని ప్రతి గ్రామమందుగాని, లేక చిన్నవయినచో సమీపముననుండు నాలుగైదు గ్రామముల కొక్కభాండా గారము చొప్పున గాని, స్థాపించి ప్రతిభాండాగార నిర్వాహకసంఘము వారి ప్రతినిధిని తమ కార్యనిర్వాహక సంఘమున చేర్చుకొనవలయును. గ్రామభాండాగారములలో నింగ్లీషు గ్రంధము లుండనక్కరలేదు. ఏ గ్రామభాండాగారముగాని ర్పు 1000ల కంటే యెక్కువ విలువగల గ్రంథముల నుంచుకొన యగత్యములేదు. గ్రామభాండాగారము యొక్క సభ్యులలో నేరికైన తమ భాండాగారమున లభించని ఆంధ్ర, ఆంగ్ల గ్రంధములుండిన వాటిని జిల్లా భాండాగారమునుండి అరువుగా తెప్పించుకొనుటకు తగిన యేర్పాటు లుండవలయును. అదే తీరున జిల్లా భాండాగారముల సభ్యులును మహాభాండాగారముల నుండి తమకు లభింపని పుస్తకములను తెచ్చుకొనుచుండవచ్చును.

భాండాగారముల పరస్పర సంబంధము.

ఇక నధమపక్షము ర్పు 100 లు విలువగల 250 పుస్తకములును గలిగిన ప్రతి గ్రామభాండాగారమును, జిల్లాభాండాగారముక్రింద నుంచుకొనవలెను. ర్పు 2500 విలువగలిగి 2000 గ్రంథములుగల భా౦డాగారములను మహాభాండాగారముక్రిందను తెచ్చుకొనవలెను. ఇట్లన్ని భాండాగారములవారును కలిసి అన్యోన్య మైత్రతతో పనిచేసిన మనదేశమున అచిర కాలముననే జ్ఞానము విలసిల్లి మనలనావరించిన యంధకారము పటాపంచలై పోవుననుటకేమాత్రమును సందియము లేదు.

భాండాగారముల నిబంధనలు.

భాండాగారములలో వచ్చి చదువువారందరును ఉచితముగనే చదువనియ్యవలయును. కాని పుస్తకములను గృహమునకు తీసికొనిపోవుటకు సభ్యులకు మాత్రమే యధికారముండవలయును. గ్రామభాండాగార సభ్యులకు నెలకు రెండణాలకన్నను, జిల్లా భాండాగారముల వారికి నాలుగణాలకన్నను మహభాండాగారమందలి సభికులకు నెలకు యెనిమిదణాలకన్నను తక్కువకాని చందాను క్రమముగా సభ్యులవల్ల వసూలు చేయబడి, అందులో సగముకంటే మించని మొత్తము వార్తాపత్రికలకై వినియోగింపబడిన, జనులను భాండాగారముల కాకర్షించుట కిదియొక సాధనమగును.

సభలు.

ప్రతిసంవత్సరమునను గ్రంధభాండాగార ప్రతినిధులందరునుగూడి గ్రంథభాండాగారములు స్థితిగతులను గూర్చి ముచ్చటించుట యత్యంతావశ్యకము. ఈ సభ కేవలము, కార్యనిర్వాహక సభా ప్రతినిధుల సభగా నుండవలయనుగాని పాఠక ప్రపంచమున కీ సభలో విశేషముపనియుఁడదు. గ్రంధ భాండాగార నిర్వాహకులు అప్పుడప్పుడు మంచి విషయములనుగూర్చి పండితులచే నుపన్యాసములనిప్పించుచు జనులలో జ్ఞానపిపాస గలిగించవలయును. పలువురుగూడి నేదైన నొక గ్రంధమును చదువుటకు పాఠక మండలులను గూడ నేర్పరుపవచ్చును. ఈ భాండాగారముల యొక్క యభివృద్ధిని సూచించు పత్రికయు నుండిన బాగే.

ఒకరు ప్రారంభించినపనినే అందఱును జేయుట.

మన దేశమున ముఖ్యముగా తెలుగు దేశమున నొకరు ప్రారంభించినపనికి ఇతరులు తోడ్పడుటకు మారు మఱియొకరును అదేపనిని నిర్వహింపబూనుకొని ధనవ్యయమును, కాలహరణమును జేయుచున్నారు. సంఘీభావమునగల శక్తిని గ్రంధ పూర్వకముగ చదివి సంతసించుటకును, యితరులలో నుండుటను చూచి సంతసించుటకును, మనలో యా శక్తి లేదని విలపించుటకు నుమాత్రమే నేర్చుకొంటిమి గాని మన లాభమును కోల్పోయి, స్వగౌరవమును పాటించక, ఇతరులతో కలసి పనిచేయుట కింకను మనము నేర్చుకొనలేదు. రెండు మూడు సంవత్సరములకు పూర్వ మొక్క వర్సాపురము తాలూకా అభివృద్ధి సంఘమువారే చేయుచున్న పని ఇపుడెందరు చేయుచున్నారో చూడుడు! విజ్ఞానచంద్రికా మండలివంటి సంఘములు మన దేశమున నెన్ని ప్రబలినవి కావు. ఒక రాజమహేంద్రవరము వలెనే ఇంకను పుస్తక భాండాగారములు స్థాపింపబడుటలేదా? కమ్మరవీధికి నూదుల నమ్మబోయిన ప్రయోజన మేమి?

మన స్థితిగతులు.

మనదేశ మతివిస్తారమైనది. మన కార్యనిర్వహణ శక్తియో అతిసంకుచితమైనది. మన దాతృత్వమో అతిస్వల్పము. మనవ్యయమన్ననో విచ్చలవిడి దేశకార్య దురంధరులా అరుదు. స్వకార్యసాధకులు మెండు! ఇట్టి స్థితిలో మన దేశము నుద్ధరించుటకు బుద్ధిమంతులగువారు ఒకచోగూడినపుడు కేవలము మాటలతో తృప్తినొందక కార్యాచరణమునకై తగిన పద్ధతుల నవలంభించవలసియుండును. పరమేశ్వరుడు మన ప్రయత్నములకుతోడ్పడి మన దేశమును తేజోవంతముగ జేయును గాక! ఓం తత్సత్ .

ఇప్పగుంట సుబ్బుకృష్ణయ్య.