గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/సర్వకళాశాల గ్రంథాలయము, బొంబాయి

సర్వకళాశాల గ్రంథాలయము, బొంబాయి

ఢిల్లీ దర్బారుసమయమున శ్రీ జార్జిచక్రవర్తి, జనసంఘము యొక్క విద్యాభివృద్ధికి యేబదిలక్షల రూప్యముల మెసంగెనుగదా. అందుండి బొంబాయి రాజధానివారు మూడు లక్షల రూపాయల రొక్కమును, సంవత్సరమునకు 45 వేల రూప్యముల ఆదాయమును సర్వకళాశాల కొసంగిరి. ఈధనము మెసగునప్పుడు సర్వకళాశాలాధ్యక్షుఁకు శ్రీబొంబాయి గవర్నరుగారు దానిని వ్యయపరచుటను గూర్చి కొన్ని సలహాలను జెప్పెను. అందులో ముఖ్యమైనదొకటి గ్రంధాలయమును గూర్చి-

“బొంబాయి రాజధానియందు మంచి స్థితిలోనున్న గ్రంధాలయము లేకపోవుటచే, 'ఉన్నతవిద్య కెంతయు నవకాశము లేకున్నది. సర్వకళాశాలకు పుస్తకాగారమున కనువగు మందిర మొకటి కలదుగాని, యవసరములగు పరికరములందు సమకూర్పఁబడలేదు. ప్రస్తుతమీ గ్రంధాలయము తగిన స్థితిలో లేదు. శిక్షనందిన యధిపతి లేనిలోపముచే సర్వకళాశాల కత్యగత్యమైన యీగ్రంధాలయము ప్రస్తుత మిందలి విద్యార్థుల కెంతమాత్రమును నుపయోగకరముగానుండుట లేదు. ఇట్టి లోపమును నివారించుట కిది మంచి తరుణము. పట్టపరీక్షాభద్రుఁడగు కుశాగ్రబుద్ధిగలవానినొకని కార్యక్రమము నెఱింగివచ్చుటకొక సంవత్సరము ఐరోపా ఖండమునకుఁ బంపవలెను. గ్రంథ సామగ్రికూడ వి శేషముగావృద్ధిఁ జేయవ లెను” అని చెప్పబడినది. సర్వకళాశాల వార్తా సలహాను మన్నించి సంవత్సరమునకు 6500 రూప్యములచొప్పున గ్రంధసామగ్రిని వృద్ధిచేయు టకును, సంవత్సరమునకు 3500 రూప్యముల వెచ్చించి గ్రంధాలయాధ్యక్ష పదవికి నొకనికి ఐరోపాలోగాని, అమెరికాలోగాని విద్య నేర్పించుటకును తీర్మానించిరి.