గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/గ్రంథాలయములు

గ్రంధాలయములు.

శ్రీ అడుసుమిల్లి గోపాలకృష్ణయ్యగారు అంగలూరు బాలసరస్వతీ పుస్తక భాండాగార వార్షికోత్సవ సమయమునందిట్లు జెప్పిరి:

విద్యాశాలల వలెనే గ్రంధాలయములు ప్రాచీన కాలమునందు మన భరతఖండమునఁ జాలఁ గలవు. అవి చేసిన కార్యములు వర్ణనాతీతములు. కవియొక గ్రంథమును రచించును. భాష కెల్ల నొకే ప్రతియుండిన దానివలన లోకములో నెందఱకుప యోగముగల్గును? ఇప్పటివలె నప్పుడు ముద్రాలయములు లేవు. చక్కని కాగితములు లేవు. అచ్చు లేదు. అందుచే గ్రంధములు విశేషవ్యాప్తం గాంచెడివి కావు. అయినను మహాకవులయందుఁగల యాదరమునంజేసి పెక్కురు గ్రంధములను దాటియాకులపై వ్రాసి లేక వ్రాయించి పఠించుకొనుచుండెడివారు. ఆ గ్రంధములు వారికే యుపయోగించుచుండేవి. పోయిన మరల నట్టి గ్రంధములను సంపాదించుట దుర్ఘటమని యెఱింగి వారు పరులకా పుస్తకముల నిచ్చెడు వారు కారు. ఆయీ విషయములం గమనించి మన భరతఖండపుఁ బూర్వ రాజులు పెక్కు గ్రంధములను వ్రాయించి యొక భవనమున నుంచి చదువుకొనఁగోరు పండితుల కుచితము గా నిప్పించుచుండెడివారు. ఆపండితులు తమ పని ముగియఁగనే ఆగ్రంధములను మరల నిచ్చెడివారు. ఇట్లే మన ప్రస్తుత భాండాగారముల కంకురము భరతవర్షమున వేలకొలఁది వత్సరముల క్రిందనే యేర్పడినది,

ఇది నవీనయుగము. మానవప్రపంచము సర్వవిధముల నభివృద్ధినందుచున్నది. భావములు, శాస్త్రములు, తెలివి, నాగరికత దినదినము హెచ్చుచున్నవి. ప్రపంచ యాత్ర నీనూతన యుగ కళలం దెలియక చేయుట దుర్ఘటము. అందుకేమి చేయవలయును? గ్రంధములం బఠియించుటే. వివిధ విషయిక జ్ఞానముఁ గల్గించు కొనుటే, అందుకుఁదగిన సాధనము లేవి? గ్రంథ భాండాగారములే.

తక్కిన హిందూసామ్రాజ్యముతో పాటు మన యాంధ్ర దేశమును ఈవిషయమున వెనుకపడియే యున్నది. అయినను గొలఁదికాలము నుండీ మన యాంధ్రులు విశేష యుత్సాహముంబూని వీనిని స్థాపింప యత్నించుచున్నారని చెప్పుటకుఁ గొంత సంతసింపవలసియున్నది. దినదినమును ఆంధ్రపత్రికలలోఁ క్రొత్తభాండాగారములు జన్మించుచున్నట్లు చదువుచున్నాము. దేశమున నన్ని భాగములను ఈ యుద్యమము కదలుచున్నది. అయినను ఇంతవరకు మన దేశమున గొప్పవి అయిదారు కంటె హెచ్చుగా లేవు. బందరు, ఏలూరు, కాకినాడ వంటి పెద్దపట్టణములలోఁ గూడఁ దగిన భాండాగారములు లేకపోవుట చూడ మనమెంత దుస్థితియందున్నది తెలియఁగలదు, అయినను ఈలోపములను దొలఁగించుటకై ఆంధ్రదేశ పుస్తక భాండాగార సంఘము మొక దానిని గత సంవత్సరము స్థాపించినారని చెప్పుటకు నాకానందమగుచున్నది. కాని యిది యెట్టిపనిని జేయునో ముందు చూడవలసి యున్నది. ఈ సంఘమువారు సంవత్సరమునకొకసారి సమావేశమయి మంచి చెడ్డలను జర్చించకొనుటతోనే తృప్తినొందక కొందఱు సంచారకులను నియమించి యాంధ్రలోకమున వివిధ భాగములందున నీసదుద్యము నెడ ననురాగము జనించునట్లును భాండాగారములను స్థాపించునట్లును జేయింతురుగాక, మరియుఁ గొందరు గొప్పవారు పోఁగయి జమీందారులను బెద్దవారిని యాచించి కొంత ధనమును సంపాదించి మూలధనముగా నుంచి దానిపై వచ్చు డబ్బులోఁ గొంత భాగమును క్రొత్త భాండాగారముల కిచ్చుచుఁ బ్రోత్సాహము చేసిన మేలుగానుండును.

అమెరికా దేశమున భాండాగారములు మహత్కార్యముల నొనరించుచున్నవి. కొన్ని గ్రంధములను ముద్రించుచున్నవి. దీనికై కొన్నిటికి ముద్రణాలయములు కలవు. మఱికొన్ని రాత్రి పాఠశాలలు స్థాపించి బాలురకు బాలికలకు భాండాగారములు నెట్లుపయోగించుకొనవలసినది తెల్పుచున్నవి. పాఠశాలలందు, రచ్చచావడులందు, న్యాయస్థానములముందు, బజారులందు, జిల్లాసభలందు, మతసభలందు, రాష్ట్ర సభలయందు అన్ని చోట్లను భాండాగారముల తరఫున బయలు చేసిన కార్యనిర్వాహకులు ప్రత్యక్షమై భాండాగారోపయోగములనుద్ఘోషించుచు లోకమెల్ల భాండాగారములతో నింపుచున్నారు. బాలురను, బాలికలను ఆకర్షించు జక్కనియాటల భాండాగారావరణములలో నేర్పఱచి వారికిఁ జదువునందుఁ బ్రీతి కల్పించుచున్నారు. శాఖలను సాపించి సమీప స్తలములలో గ్రంధములు లేని వారిలో పములను దొలఁగించుచున్నవి.

శాస్త్రజ్ఞులకు, బండితులకు వివిధ విషయములలో నూతన పరిశోధన చేయువారికి నవి చేయు సాయము అమితము, గొప్పగొప్ప భాండాగారము లిట్టివారికి నిశ్శబ్దముగానుండు గదులను బ్రత్యేకముగా వందలకొలఁది పుస్తకములతోఁగూడ నిచ్చి మేలు చేయుచున్నవి. ఉచితముగాఁ గొన్ని యెడలఁ జందానైన స్వీకరింపకయే వారికి వలయు గ్రంధముల నెన్ని యైనను సేవకుని మూలముగా నిండ్లకుఁ బంపి మరలఁ దెప్పించుకొనుచున్నవి.

ఆ దేశమునందు బాఠకులను జక్కగానాదరింతురు. చనవుగానెల్లరను బీరువాల దగ్గఱ కేగి గ్రంధములం దీసికొననిత్తురు. ఇందుచేఁ గొన్ని యెడలఁ బుస్తకములు పోవచ్చును. కాని వీరి మూలమున నెల్లరకు నష్టము కల్గింపకుండుట మేలని యానష్టము సహించుచున్నారు. ఇంకను వారు చేయు లోకోపకారకార్యములు వర్ణింపశక్యముగాదు.

ఈ విషయములనన్నిటిని నెఱవేర్చుట మనదేశపు భాండాగారములకు సాధ్యమగునని నాయాశయముకాదు. మనకాసాయము, ప్రోత్సాహము, పట్టుదల, సంపద, ఐకమత్యము, విద్య, దేశారాధన, జీవనము లేవు. అయినను మీరాయుతృష్టాదర్శములను మదిలో నుంచు కొనుఁడు. వీలైనప్పుడెల్ల నాయాదర్శములలో మెక లేశమునేని మీశక్తి కొలఁది చేయుఁడు. ఉదారాశయములు కల్గియుండుట మానవులకు జాల లాభకరము. మన భాండాగారముల వారెల్లఱు నీవిషయమును గమనింతు రేని, నెర వేర్ప శక్తి కొలఁదిం బ్రయత్నింతు రేని ప్రపంచమునకు మహోపకారముకల్గును.