గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/గ్రంథాలయమననేమి? అది చేయదగిన ధర్మములెవ్వి?

గ్రంథాలయమన నేమి? అది చేయదగిన ధర్మము లెవ్వి?

గ్రంథాలయమన గ్రంథములనన్నిటిని ఒకచోట జేర్చి పెట్టునట్టి గృహమనియు, అట్టి గృహమునందున్న గ్రంధములనన్నిటిని దాచి జాగ్రతగ కావలి కాయునట్టి పురుషుడే గ్రంధభాండాగారియనియు ఆంధ్రప్రపంచమునందు చాలమంది తలంచుచున్నారు. పండితులు మాత్రమే అట్టి గ్రంధాలయములకుఁబోయి వాటినుపయోగింప నర్హులని గూడ వారి యభిప్రాయము.

అట్టి యభిప్రాయములు ప్రబలియుండుటకు గారణములు లేకపోలేదు. దినదినాభివృద్ధి గాంచుచున్న యీ నాగరక కాలమున పాశ్చాత్య దేశముల యందీ గ్రంధాలయోద్యమఎన్ని ముఖములనో పనిజేయుచున్నది. ఇదిదెలసికొని యుండకపోవుట, దీనికొక అనేకకారణములని యూహించుట కవకాశములు పెక్కులు కలవు.

వివిధశాస్త్రవేత్తలచే వ్రాయబడిన గ్రంథముల నొకచోట సేకరించి యుంచుటయే గ్రంథాలయము యొక్క పనిగాదు. పాశ్చాత్య దేశములయందు పుస్తకములనము పెద్ద దుకాణములనన్నిటియందును గూడ అక్కడకువచ్చు జనులెల్లరును ఉచితముగ జదువుకొనుటకు గాను కొన్ని గ్రంధముల బీరువాలుండును. ఇంతేల, మిఠాయి దుకాణములయందును పానీయములనమ్ము, దుకాణములయందును తుదకు మంగలి దుకాణములయందునుగూడ, ఆయాదేశములందు బ్రకటింపబడు సుప్రసిద్ధ వార్తాపత్రి కలుండును. ఆయాసరకులను కొనుటకు బోవువారెల్ల కొంచెము కాలమక్కడ విశ్రమించి వానిని జదువుకొనవచ్చును.

అట్లయిన, మన దేశమున గల ధర్మగ్రంథాలయముల నిర్వాహకులు పాశ్చాత్య దేశముల యందలి దుకాణదారులకన్న ఎక్కువగ జేయుచున్న పనియేమి? ఆదేశములయందలి స్థితిగతులకును మనస్థితిగతులకును జాలవ్యత్యాసమున్నదని మీరందురేమో! ఆమాట సత్యమే. అయినను మనస్థితి గతుల కనుకూలములగు పద్ధతులనెల్ల అనుసరింపవలసియుండుట మనకు' విధ్యుక్తధర్మముగాదా?

జనులయందు జిజ్ఞాస దినదినాభివృద్ధిని గావించుటయు, పలువిషయములయందు వారిక భిరుచినిగల్పించుటయు, సామాన్యజనులయొక్క హృదయములను విశాలవంతములుగను వికాసవంతములుగను అగునట్లు జేయుటయు గ్రంధాలయము యొక్క ముఖ్యధర్మములై యున్నవి.

పాఠశాలయందు విద్యాభ్యాసము జేసినట్టి జనులయందు బహుస్వల్ప భాగము మాత్రమే ఉన్నత విద్య నభ్యసించిన వారై యున్నారు. నూర్గురు విద్యాభ్యాసము జేసిన అందు నలుగురైన ఉన్నతవిద్య నభ్యసించినవారుండుట అరుదు. ఇట్టివారందరికిని గ్రంధాలయమే ఉన్నత విద్యాలయమై యున్నది. పాశ్చాత్య దేశముల యందు వ్రాయను జదువను జేతకానివారుండరు. అక్కడ విద్య నిర్భంధము. అందు విద్యాదేవత తాండవమాడుచున్నది. అట్టిదేశ ములయందు నీ గ్రంధాలయోద్యమ మెంతవర కు అభివృద్ధి జెందియున్నదో ఊహించుటకైన మనకు శక్తి చాలదు. అచటి గొప్ప గ్రంథా లయములనుంచిన భవనములవంటి కట్టడములనైన మనలో జాలమంది జూచియుండమని నేను దృఢముగ జెప్పగలను.

మనదేశముయెడల విద్యాధిదేవతకు దయలేదు. ఆమె యెడల మనకు భక్తిలేదు. పరస్పరము సమానమగు ప్రేమనే జూపుచున్నారము. ఇది స్వాభావికమే. మన దేశమునందు చదువుకొన్న జనులు నూటికి 2 మంది కన్ననెక్కువలేరు. నిశానీ దారులతో సమానులగు దస్కతు మాత్రము జేయగలిగిన వారందరును గూడ ఈ సంఖ్యయందే జేరియున్నారు. విద్యాధిదేవత తాండవమాడుచున్న పాశ్చాత్యదేశములయందే గ్రంథాల యోద్యమము మహోన్నతదశను వహించియుండ ఇంతమంది విద్యావిహీనులచే నలరారుచున్న మనదేశమునందది ఇంకను ఎన్ని రెట్లు మహెూన్నత దశను జెందవలసియున్నదో మీరూహింపవచ్చు. ఇతర దేశములందీ యుద్యమ మభివృద్ధి జెందుటకు అనేక విధములగు సౌకర్యములులవు. మనదేశమునందో అట్టి సౌకర్యములులేవు. అదియట్లుండ కరవులో నధికమాసమనున్నట్లు విద్యావిహీనుల సంఖ్య అధికము. విద్యావిహీనులనగా చదువను వ్రాయను జేతకానివారని నాఉద్దేశ్యము. ఈవిద్యా విహీ నులు గూడ ఈసంఖ్యయందే జేరియున్నారు. విద్యావిహీనులను విద్యావంతులను చేయుట మనకు దుస్సాధ్యముకావచ్చును. కానివారిని జ్ఞానవంతులనై న జేయుట మన విధ్యుక్త ధర్మమై యున్నది.

గ్రంధాలయము పరీక్ష పట్టాలను బొంద గోరువారికిగాదు. అదిసామాన్య జనులయొక్క సర్వకళాశాలయైయున్నది. కాబట్టి మన గ్రంధాలయములు ఎవరికుపయోగ పడునునట్లు జేయవ లెను?

మనమందరమును ఈ ప్రశ్ననుగూర్చి మిక్కిలి తీవ్రముగ నాలోచింపవలసి యున్నది, ధనాఢ్యులును, విద్యాధికులునగువారు తమకు కావలసిన గ్రంధములను ద్రవ్యము వెచ్చించి తెప్పించుకొనగలరు. లేక ఎవరి యొద్దకైన బోయి సంపాదించు కొనగలని, చదువుకొన నాసక్తి గల మనుజుడు ఎన్నివిషయములనైన శ్రమపడి వాడ వాడల దిరిగి తను గావలసిన గ్రంధములను సేకరించుకొని వారు యుపయోగమును బొందును. గ్రంధాలయములు ఇట్టి వారికి గూడ నుపయోగపడునప్పుటికిని, వీరి విషయమై మనము విశేష శ్రద్ధవహింపవలసిన యావశ్యకత లేదు. ఏలననవారు తమంతట తామే గ్రంధాలయమునకు వచ్చి దాని లాభమును బొందెదరు.

అట్లయిన ఇంకెవరికొరకై మనము శ్రద్ధను బూనవలసియున్నది? అనిమీరు ప్రశ్నింప వచ్చును. ప్రతిదేశమునందును గూడ గ్రంధాలయములయొక్క లాభములను బొందవలెనని తమంతటతామే ప్రయత్నించువారి సంఖ్య బహుస్వల్పముగ గానబడుచున్నది. ఇది స్వభావ జనితము. మన దేశమునందీ రోగము అన్నిదేశములకన్న నెక్కువ తీవ్రముగ ప్రబలియిున్నది. చదువుకొనగలిగి, గ్రంధముల చదువనపేక్షింపని మందులనంతముగ మనదేశమునందున్నారు. ఇట్టివారికి చదువుకొనునభిలాషను జనింపజేయుట మన ప్రధాన కర్తవ్యమనక తీరదు. మన గ్రంధాలయము నందున్న ప్రతిగ్రంధమునకు అధమమొక చదువరినైన మనము సంపాదింపవలెను. ప్రతిచదువరికిగాను ఒక పుస్తకమునైన మనము పెట్టవలెను. అట్లు చేయలేని యెడల గ్రంధాలయము యొక్క యుపయోగ మేమి?

వేయేల! సంఘసముద్ధరణ భారమంతయు ఈ కాలమున గ్రంధాలయము మీదనే పడియున్నది. సంఘమునకు గావలసిన నీతివిద్యావిషయ వ్యాసంగమును, రసజ్ఞతా వ్యవసాయమునకు, సహానుభవాభివృద్ధిని, జ్ఞానసముపార్టనను—ఇంతేల, ఈ ఇరువదియవ శతాబ్దమున ఒక సంఘమును కలంచివైచు సకలోపకరణములను గూర్చి అనుభవసిద్ధముగ నుండు సూచీకరణము గ్రంధాలయమునందే జరుగవలన్నది. ఇట్టి సాంఘిక సేవారతి నెట్లు జరుగునో కొంచెము విచారింతము.

పిల్లలే సంఘమునకు జీవమని జెప్పవచ్చు వారియందు అనంతమైన శక్తులు గర్భితలై యున్నవి. ఈ శక్తులను ప్రథమమున పాఠశాలయందు వర్ధిల్ల జేయవలసియున్నను విద్యకుచితములగు నిర్భంధ పాఠపుస్తకములను అందించుటయందే వారి నణగద్రొక్కక, ఆశయాలు వికాసమునంది వలసిన దోహదమునంతను మనమీయవలసియున్నది. పిల్ల లయొక్క మనస్సులు అతి కోమలములు. కావున అట్టి సమయమున నే వారికి మంచిదారులయందు బెట్టుట మిక్కిలినావశ్యకము. అట్లు చేయగలిగితిమేని వారికి సంపూర్ణ ధైర్యసాహసము లలవడుననుటకు ఏమాత్రము సందేహము లేదు. ఈదినమున పిల్లలుగ నుండువారు రేపటిదినమున పెద్దలగుదురు.అందుచేత పిల్లలకు సన్మార్గమలవడునటుల జేసితి మేని మనజాతి ఔన్నత్యము నెందుట కేమియు సందియము లేదు. కాబట్టి వారికి ఉపయోగకరములగు ప్రత్యేకపుస్తకములను సేకరించి వేరుగనుంపవలెను. అవి విశేషముగా బొమ్మలు గలిగినవై యుండవలెను. గోడలయందు వస్తు పాఠబోధకములగు పటములను బెట్టి వాటిని గురించి బాలురకు బోధింపుచు అందుకు సంబంధించిన పుస్తకములను వారు చదువునటుల అభిరుచిని గల్పింపవలెను. మఱియు సుబోధకములును నీతిబోధకములును నగు కథలను జెప్పి వారి మనస్సుల నాకర్షించి గ్రంథపఠనమునకు వారిని బ్రోత్సహింపవలెను.

స్త్రీల విషయమున మనము మూకీభావమును వహించుటయం దనర్థకమము లనేకములు కలవు. పాశ్చాత్య దేశములయందు ప్రత్యేకముగ చదువుకొనుటకు వలయు సౌకర్యముల నెల్ల స్త్రీలకు గల్పించిరి. అక్కడ స్త్రీలు భాండాగారిణులుగగూడ గలరు. ప్రారంభదశ యందు మనమట్టి ప్రయత్నములకు బూనుకొనకపోయినను గృహములకు పుస్తకములను బంపి స్త్రీలు విశేషముగ జదువునటుల జేయవలెను. పురుషులకంటె స్త్రీల యందు విద్యావిహీన లెక్కువగగలరు. అందుచేత విద్యావతులగు స్త్రీల నేర్పరచి చదువుకొనజాలని స్త్రీలకు వారి గృహములకు బోయి వారు కోరిన విషయములుగల గ్రంధములనెల్ల 'చదివి వినిపించునటుల జేయవలెను.

గ్రంధములను చదువుకొన గుతూహలము గలిగినవారికి వానినందిచ్చుట పురుషులగు మనము జేయగలిగిన మొదటిపని గ్రంధములను చదువుకొనుటకు శక్తిగలిగి, వానిని పఠియింప నిచ్ఛలేనివారల కట్టియిచ్ఛను గలుగ జేయుట మనము వారికి జేయదగిన రెండవపని. ఇందుకొరకై మనము తరుచుగా ఉపన్యాస ములను హరికథలను, భజనలను పెట్టి వారినాకర్షించి, ఎవ్వరెవరికే గ్రంధములనువుగ నుండునో అట్టివారి కట్టి పుస్తకములనే అందజేయుచుండవలెను. పుస్తకముల యోగ్యతను బట్టి జనులు, వారి అధికారము ననుసరించి పుస్తకములు, అమఱి యుండవలెను. పరస్పరమెవరు తగియుండక పోయినను మనము జేయు పనియంతయు వ్యర్థము. సామాన్య జనులు పుస్తకములకు తగియుండరనుట నిజముకాదు. ఏలయన వారికి తగిన పుస్తకములనే మనము సమకూర్చవలెను. గ్రంధములు తమంతట తాము చదువుకొనజాలని జనులు మనదేశమునందు విశేషముగ గలరని ఇదివరకే జెప్పియుంటిని పైన జెప్పిన రెండురకముల జనులకంటే వీరిని జ్ఞానవంతులుగ జేయుటకే మనము విశేషముగ శ్రద్ధవహింపవలసియున్నది. దేశమునందు ఇంతమంది జనులు జ్ఞానవిహీనులై యున్న నాదేశ మెన్నటికిని బాగుపడదు. అది కలలోనివార్త యనవచ్చును. వీరికి చదువు జెప్పి విద్యావంతులుగ జేయుదమన్న అసంభవము. కావున వీగిని జ్ఞానవంతులుగ జేయుటకే మనము ప్రయత్నింపవలెను. పరిశ్రామికములు, శాస్త్రములు ఆదిగా గల విషయములను గూర్చి వారికుపన్యాసములిచ్చి వారిబుద్ధికి వికాసమును గలుగ జేయవలెను. మహా గ్రంధముల నెల్ల వారికి జదివి వినిపించి బోధింపవలెను. ఇంకను వీలగునేని మాజిక్కు లాంతరునుగాని, సినిమోటాగ్రాఫునుగాని, సంపాదించి వానిమూలమున పలు విషయములను బ్రదర్శింపుచు బోధనలను జేయవలెను. అది ఎక్కువ హృదయరంజకముగను చిత్త సంస్కారముగను నుండువారిని మనమున్న చోటికి రమ్మనమనిన రాకపొతే మనమే వారున్న స్థలమునకు బోవలెను. వేష భేషజముల నన్నిటిని వదలి వేయవలె వారియందొకనిగ భావించునటుల బోయిరేమికోరుదురో అడిగి దెలిసికొన వలెను. కోరబడు దానినుండియే వారి కొరతను బాపవలెను. కొన్ని సమయములయందు ఆ కొరతలు మన భావనలకు భిన్నములైయుండును. ప్రథమమున, వారేమి గోరెదరో తెలుసుకొనుడు. వారిలో కొందరు ఏకాకులుగనుండ గోరెదరు. అట్టివారి నటులనే నుండ నించి వారిపిల్లల ఉన్నతిని గోరవచ్చును. కావున వారికొరకై వేచియుండుము. ఈ కార్యము వేసవికాలపు శలవులలో గాని శీతకాలపు శలవు దినములలో గాని చేయదగినదిగాదు. ఇది జీవితాంతమునంతను ధారపోయవలసిన మహత్కార్యము.

ప్రతి గ్రంధాలయమును తనగ్రామమునందు గాని లేక పట్టణమునందుగాని గల పాఠశాలతో సంబంధమును గలుగ జేసు కొనవలెను. పాఠశాల యందుపాధ్యాయులు పాఠములను బోధింపునపుడు, వివిధవిషయములని గూర్చి జెప్పునపుడు ఆయా విషయములను గూర్చిన విపుల గ్రంధములు అచటి గ్రంధాలయమునగలవని జెప్పి వానిని విద్యార్థులు జదువునటుల జేయవలెను. ఇంతియగాక ఉపాధ్యానటుల జేయవలెను. ఇంతియగాక ఉపాధ్యాయులప్పుడప్పుడు తమ విద్యార్ధులను గ్రంథాలయమునకు గొనివచ్చి, అచట గలవారికుపయోగకరములగు గ్రంథములయందు అభిమానము గలుగు నటుల ఉపన్యాసముల నొసగచుండవలెను. శాఖాసంఘముల నేర్పరచి తల్లి గ్రంథాలయము ఆ శాఖల మూలమున తన పుస్తకమునెక్కువగ ప్యాప్తి నెందునటుల జేయవలెను. ఆ శాఖాసంఘములయందు స్వల్పమూల్యముగల గ్రంధములను మాత్రముంచి, విశేష మూల్యము గల గ్రంధముల నెల్ల తల్లి భాండారమునుండి తెప్పించుకొనవచ్చును. కేంద్ర గంధాలయములను ముఖ్యప్రదేశములయందు స్థాపించి, పల్లెటూళ్ళయందుగల చిన్న గ్రంథాలయములను వాటికి శాఖాసంఘములుగ నేర్పడుటవలన ఇట్టి లాభము లెన్ని యోగలవు.

సంచార పుస్తకాలయ స్థాపనము వలన జనులకనేక యుపయోగములు గలవు. కొత్త పుస్తకముల నొక పెట్టిలో పెట్టి, వాటిని జాగ్రతపరచి గ్రామస్ధులచే చదువునటుల జేయటకు ఒక మనుజుడుతో గ్రామముల కెల్ల 'మన గ్రంధములను బంపవచ్చును. ఈ ప్రకారము బంపుటకు వివిధ గ్రంథములు గలిగిన కొన్ని పెట్టెలనుంచితిమేని, ఒక గ్రామమునందున్న ఓ పెట్టియందలి గ్రంధములను జదివిన పిమ్మట దానిని వేరొక గ్రామమునకు బంపి, ఆగ్రామమునకు వేరొక పెట్టెను బంపవచ్చును. ఈ ప్రకారము మిక్కిలి స్వల్పమగు వ్యయముతో అమితమగు ఉపకారమును మనము పల్లెలవారికి జేయగలము.

గ్రంధాలయము యొక్క పని విద్యను గరపుయేగాక వినోదపరచుటగూడనై యున్నది. గంధాలయముల నెన్నడును ద్రొక్కి చూడని మనుజుల నాకర్షింపుటకు క్రీడలు మిక్కిలి సాపర్ధ్యము గలవి. ఇంతియగాక ఒకేపనిని చాలసేపు చేయుచుండుట చేత విసుగు చెందిన మనసు గల వారికి క్రీడలు బుద్ధిమాంద్యమును హరించి సంతోషమలవరచుటకు సిద్దౌషధముల వంటివి. కావున గ్రంధాలయములయందు వినోదపరచునట్టి క్రీడలనుగూడ నేర్పాటు జేయుట మిక్కిలి యావశ్యకమై యున్నది.

ఆలోచించిన కొలదిని, గ్రంథాలయము యొక్క ఉపయోగము నభివృద్ధి జేయుటకనంతములగు మార్గములు దొరకుచునేయుండును. గ్రంథాలయమునందున్న గ్రంధములను గూర్చియు ఆది చేయుచున్న పనిని గూర్చియు తరుచుగా ప్రకటనలను బంచి పెట్టవలయును; ఇంతియగాక దానినిగూర్చి తరుచుగా ఇతరులతో జెప్పుచుండవలెను.

గ్రంథాలయములను ఇన్ని విధములచే జనులకుపయుక్తములగు నటుల జేయుటెందులకు అటుల జేయనియడల హానియేమి? అని మీరు ప్రశ్నింపవచ్చును. జనులకుపయోగకరమగు నటుల ధర్మగ్రంథాలయముల నుంపనియెడల, ఆవి పుస్తక దుకాణములని పిలువ దగి యుండును గాని ధర్మగ్రంధాలయములని పిలుచుటకావంతమైన నర్హతగలిగియుండవు. కావున ఆంధ్రదేశమున గల ప్రతి గ్రంథాలయమువారును ఆలోచింపవలసిన సంగతులు రెండు. తమ గ్రంధాలయమును పుస్తక దుకాణమని పిలువదలచుకున్నారా? లేక ధర్మగ్రంధాలయమని పిలువవలతురా? ఈ ప్రశ్నలనే ప్రతి గ్రంధాలయమువారును తీవ్రముగ నాలోచింపవలెను.