గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/ఆంధ్ర గ్రంథాలయోద్యమము
ఆంధ్ర గ్రంథాలయోద్యమము.
రెండవ ఆంధ్రగ్రంథాలయ మహాసభయందు సూరి వేంకటనరసింహముగారిచే చదువబడినది.
ఆంధ్రదేశ గ్రంధభాండాగార సంఘమువారిచే బ్రచురింపబడిన గ్రంథాలయ చరిత్ర వలన కింది సంగతులు తెలియుచున్నవి. ఆంధ్రదేశమున రమారమి 160 గ్రంధాలయములున్నవి. అందురమారమి 30 వరకు 1914 ఏప్రియలు నెల మొదలు యిప్పటివరకును కొనవియైయున్నవి. మొత్తము గ్రంధాలయములలో నైదు స్త్రీల యుపయోగము కొరకు స్త్రీలవలననే స్థాపింపబడినవియై యున్నవి. తక్కినవాటిలో చాలా సంఘములయందు పురుషులును స్త్రీలునుగూడ సామాజికులున్నారు. ఈ సంఘములన్నిటియందును సామాన్యమున కందఱకును ధర్మముగా పుస్తకములను, వార్తాపత్రికలనుపయోగించను నధికారముండియున్నది. 19 సంఘాలకు స్వంత భవనములున్నవి. 12 సంఘములచే పాఠశాలలుగూడ నిర్వహింపబడుచున్నవి. 22 సంఘముల యాజమాన్యము క్రింద పురాణపఠనము జరుగుచున్నది. కొన్ని సంఘములవారు మాజిక్కులాంతరు సహాయముతో ప్రజాసామాన్యమున కుపయోగమగున ప్రకృతిశాస్త్రములను గూర్చియు ఆరోగ్య శాస్త్రమునుగూర్చియు నీతిసంబంధమైనట్టియు ఉపన్యాసముల నిచ్చుచున్నారు. గంజాంజిల్లా భయను పట్టణమందలి గ్రంధాలయ సంఘము గ్రామమునందు దీపములు పెట్టుటకు సదూపాయముల నేర్పరచి పట్టణ పారిశుద్ధ్యము గూర్చిగూడ పాటుపడు చున్నట్లు తెలియుచున్నది. ఒక సంఘము వారిచే పారిశ్రామిక వస్తుప్రదర్శనము జరుపబడినది. పది సంఘములవారు బహుమతీ పరీక్షలను జరపి తన్మూలమున విద్యాభివృద్ధికి దోడ్పడుచున్నారు. నాలుగు సంఘములవారలు గ్రంధముల యొక్కయు కరపత్రముల యొక్కయు ప్రచురమును బూనియున్నారు. ఈయంశములన్నిటి వలన ఈ యుద్యమముయొక్క స్వరూప స్వభావములనుగూర్చి మనకేమిబోధపడుచున్నది? ఈ సంఘములు స్థాపింపవలెనని ఎవరుపదేశము చేసిరి? ఈ సంఘములను స్థాపించిన వారలెవరు? దొరతనమువారివలన బిరుదులను సంపాదించు యాశయా వీరినీయుద్యమమునకు బురి కొల్పినది?ధనవంతులమన్న నయా? లేక ద్రవ్యాభిలాషయా? ఈసంఘముల స్థాపకులను సంరక్షకులను ఈయుద్యమవిషయమై బూనుకొనుటకు ప్రేరేపించిన మహాశక్తి యెద్ది? వీరుబడయగోరుమన్ననయెద్ది? వీరు వాంఛించు ఫలమెద్ది? ఈ ప్రశ్నలన్నిటికిని మనము జవాబు నీయవలసియున్నది.
ఈ యుద్యమమునకు ప్రేరకము తానుబాగై తనతోడివారలను బాగుచేయవలెనను మనుష్యస్వభావమున నాటియున్న తీవ్రమగువాంఛయేయనియు, ఈయుద్యమ ప్రచారకులు కోరుఫలము తామును తమతోడివారును జ్ఞానాభివృద్ధివలన పొందెడు యానందముకంటె వేరొండుకాదనియు వీరినీయుద్యమమునకు పురికొల్పు మహాశక్తి ప్రపంచాభివృద్ధికొరకు అప్పుడప్పు డావిర్భవించు మహదుద్యమములను పాదుకొల్పి, వానికి జవసత్వములను గ ల్పించు ఈశ్వర ప్రేరిత మహాశక్తియే యనియు, ఈ యుద్యమ ప్రచారకులందరు తామీశ్వర ప్రేరితులమనియు, ఈశ్వరాదిష్టకృత్యములను తాము నెరవేర్చుచున్నామను దృఢతర భక్తి పూరితులుగ నున్నారనియును జెప్పవచ్చును.
ఏయుద్యమము సరియైన మార్గముల నవలంబించి అందుకు నిర్ణీతమగు పనిని నిర్వర్తించవలెనన్న ఆ యుద్యమావలంబకులకు అందలి ప్రాప్యముల స్వరూప స్వభావముల యొక్కయు, ఆ యుద్యమమునకును తోడి యుద్యమములకును గల యన్యోన్య సంబంధముల యొక్కయు జ్ఞానము దృఢముగ నుండి తీరవలయును. ప్రతియుద్యమమును అవయవ సమన్వితమై వృద్ధిక్షయములకు లోనై యుండును. ఆదర్శమే దీనికి ప్రాణము. ఆదర్శము లేని యుద్యమము ప్రాణము లేని యాకారము అట్టి యుద్యమములు వృద్ధిబొందవలెనన్న తమ యందు స్వాభావికముగానున్న జవసత్వముల వల్లగాక సతతము పరాపేక్షను బొందియుండును. పై నుండి వచ్చు సహాయ మెప్పుడు తగ్గునో ఆయుద్యమమప్పుడే భగ్నమైపోవును. అట్లుగాక ఆదర్శముతో గూడిన యుద్యమము ఈశ్వర నిర్మిత సావయవయవిక జీవివలె దినదినాభివృద్ధి గాంచును. ఆదర్శము యొక్క శక్తి మహత్తరము. ఆకాశము మెరయు శిరపంక్తిగల హిమవంతున బుట్టి భూభాగమున జొచ్చి తాబోవుదేశమునంతను సస్యశ్యామలముగను ఫలభరితముగను జేయు గంగాప్రవాహము బోలె ఆదర్శము ఫలప్రాప్తి నిబొందించును. ఆద్యర్శము నేకాగ్రచిత్తతతో ధ్యానము చేయుచుండిన కార్యాచరణయందు వచ్చిన కష్టములన్నియు సుఖములుగా పరిణమించి కార్యదీక్షను ప్రజ్వలింపజేయును. కావున గ్రంథాలయోద్యమము వృద్ధిజెంది అందువలన ఆఫలమంతయు సమకూడవలెనన్న అందలి విషయయములను తదవలంబకులు బాగుగ నెరుంగవలెను.
గ్రంథాలయోద్యమమునకు ప్రాప్యమే దేశమునందు జ్ఞానాభివృద్ధిని జేసి మనుజునియాత్ర పవిత్రముగను పురుషార్థప్రాప్తి పూర్వకముగను చేయుటయే ఈ యుద్యమము యోక్క ప్రాప్యము. ఈ ప్రాప్యమును దృక్పథమునందుంచుకొని ఈ యుద్యమము పేరజరగు ప్రతిపనియు ఈ ప్రాప్యమును కానుకులకముగ పరిణమింప జేయుటకు ఎట్లు సహకారి యగుచున్నది, ఎట్లు విరోధమును గలిగించుచున్నది యను యంశములను తర్కించు ఉద్యమప్రచారకులు కార్యాచరణను బూనవలయును. ఇక నీయుద్యమమునకును ఇతరయుద్యములకును గల సంబంధమును గూర్చియు, సంబంధమును దెలిసికొనవలసిన యావశ్యకతను గూర్చియు తెలుపవలసి యున్నది. జాతి యొక్క ఔన్నత్యము కొఱకనేక యుద్యమములు వెలువడి పనిజేయుచున్నవి. ఇందులో గొన్ని సంఘసంస్కరణ కొరకును, కొన్ని మతవ్యాపకము కొరకును, కొన్ని రాజకీయ సంస్కరణ కొరకును ప్రయత్నించుచున్న ఈ యుద్యమములన్నిటి యొక్క స్వభావము వ్యాప్తిని బాగుగ గుర్తెరిగి ఆ యుద్యమము యొక్క సిద్ధాంతములకు విరోధము లేకుండినట్లు గ్రంథాలయోద్యమము నెట్లు వ్యాపింప జేయవలయునో ఆ యుద్యమ ప్రచారకులు జాగ్రతతో విచారింపవలయును. సౌధమును నిర్మింప ను బూను శిల్పి సౌధాకారమును ముందు కాగితముపై లిఖించి దాని యొక్క వివిధ భాగముల కెట్టెట్టి సంబంధము లుండవలనో ఎట్లునిర్ణయించునో ప్రతి యుద్యమము అవలంబించి పనిచేయు వారలు తామభిమానముతో పనిజేయు యుద్యమమునకును పౌరయుద్యమములకును గల మన్యోన్య సంబంధాలనములను బాగుగ గుర్తెరింగి ఇతర యుద్యముల సిద్ధాంతాంశములకు వ్యతిరేకము లేకుండునట్లు తమ యుద్యమమును నడపుచుండును.
ఇక నీ యుద్యమమును ప్రచారణ జేగంటయందు గమనింపవలసిన సూత్రములను గూర్చి ముచ్చటింపవలసి యున్నది. జనసామాన్యమునకు విద్య, వ్యాపకము చేయుటయందేశ భాషలే ముఖ్యసాధకములను యంశము మనము ముఖ్యముగా గమనించవలెను.
మొదటిసూత్రము. చతురక్షరసంయోగము వలననేగాక శ్రవణ మూలకముగను, చిత్రముల మూలకముగను జ్ఞానాభివృద్ధి జేయగలమని గ్రహించుట. రెండవ సూత్రము- చిరకాలము నుండి మనదేశమున జ్ఞానము పుస్తకరూపముననేగాక లిపివ్యాపకమునకు' పూర్వము నుండిగూడ, శృతిమూలకముగ నభివృద్ధి ఆగుచుండెననుట మనకు సుప్రసిద్ధముగ దెలిసిన యంశమే. శృతిమూలకమగు జ్ఞానము పురాతన కాలమందేగాక నేటికిని ధారణాశక్తి సహాయముతో వ్యాపింపజేయుట యావశ్యకమయియున్నది, చిత్రపటముల మూలమున విద్యావ్యాపకము జేయు మార్గము మనము పాశ్చాత్య దేశములనుండి నేర్చుకొన వలసియున్నది. ఇందునుగూర్చి ఆదేశములయందు జరుగు ప్రయత్నములు. బహు మహత్తరములు. బయోగ్రాఫు, సినిమోటాగ్రాఫు, మాజిక్కు లాంతరు మొదలగు యంత్ర సహాయముచే అక్షర రజ్ఞానములేని మన నిమ్న సోదరులకు జ్ఞానాభివృధ్ధి చేయుటకు ఎన్నియో సదుపాయములున్నవి. ఇది మూడవ సూత్రము -అధికారి భేదమునుబట్టి విద్యావ్యాపక సాధనములయందు భేదమును పాటింపవలెనను యంశము.నాలుగవ సూత్రము. వయస్సును బట్టియేమి,జ్ఞానమునుబట్టియేమి, వృత్తినిబట్టియేమి, అభిరుచులనుబట్టియేమి, చుట్టునుండు స్థితిగతులను బట్టియేమి ప్రజలు వివిధములుగా నున్నారు. వీరందరికిని ఎవరికితగినట్లు వారికి జ్ఞానాభివృద్ధి కరములగు పరికరములను అవసరము బట్టి వేరు వేరుగా కల్పించుట ఆవశ్యకమని మనము ముఖ్యముగా గమనించవలసియున్నది.
ఇక నీయుద్యమము యొక్క వ్యాప్తిని నిరూపించవలసియున్నది. ఈ యుద్యమమునకు పరమావధి జనసామాన్యముయొక్క జ్ఞానాభివృద్ధియని ఇదివరకే చెప్పబడియున్నది. జ్ఞానాభివృద్ధికి ముఖ్య సాధనము వాఙ్మయము; కావున వాఙ్మయాభివృద్ధితో కూడిన అన్ని యంశములును ఈ యుద్యమమునకు సంబంధము కలవియేయైయున్నవి. మన యాంధ్రవాఙ్మయము ఇదివరకే యేదారులనవలంబించి వృద్ధి బొందినది? ఎట్టి గ్రంథములీ భాషయందున్నవి? ఇందు లోపము లేమిగలవు? ఆలోపములను సవరించుటెట్లు? అన్ని తరగతుల జనులకు తగిన గ్రంధములు మనభాషయం దున్ననా? లేనిచో ఆగ్రంధములు వెలువడునట్లు చేయుటకు మన మేమి ప్రయత్న ములను జేయవలయును? అను యంశము లన్నియు ఈ యుద్యమమునకు సంబంధించినవియే యైయున్నవి. ఇందుకొరకై మన భాషయందున్న గ్రంధములన్నిటి యొక్క పట్టిక నొకదానిని తయారుపరచి అందుండి గ్రంధస్థాంశములను బట్టి గ్రంధములను విభాగము జేయవలసియున్నది. ఇందును గూర్చి ఆంధ్రదేశ గ్రంధ భాండాగార సంఘపక్షమున కొంతకృషి జరిగినది. ఎక్కువ సమర్ధతతో ఎక్కువ కాలమును వెచ్చించి ఈసంబంధమగు పనిని జరపిన శ్రీ వెలిదెండ శ్రీనివాసరావుగారు ఆంధ్రలోకముయొక్క కృతజ్ఞత కెంతయు పాత్రులు. అప్పుడప్పుడు దొరతనము వారిచే ప్రచురింపబడు ముద్రితగ్రంధముల పట్టికలనుండి ముఖ్యమైన గ్రంధముల నామములను విడదీసి గ్రంధాలయముల యుపయోగము కొరకు ప్రచురించుట కర్తవ్యము. వార్తాపత్రికలయందును మాసపత్రికలయందును ప్రచురింపబడు యుపన్యాసములను గూడ వాటియందలి యంశములను బట్టి విభజించుట ముఖ్యావశ్యకము. మఱియు ఆంధ్రభాషా గ్రంధములు పట్టికను పూర్తి జేసిన పిదప దానినుండి కొద్దిసొమ్ములో స్థాపింపబడు గ్రంధాలయముల కుపయోగముగా నుండునట్లు పండితులచే పరిష్కరింపబడిన 250, 500, 1000 ముఖ్య గ్రంధముల యొక్క నామావళిని తయారుచేయింప వలసియున్నది. ఇది గ్రంధాలయోద్యమము యొక్క ప్రధమవిధి.
పాఠశాలలలో విద్యనభ్యసించెడి వారలకు విద్యాభ్యాసమునకు సాధకమగు పరికరములను సంగ్రహించుటయు, పాఠశాలలను వదలిన వారికి వారిదివరకు సంపాదించిన విద్యను బలపరుచుటకు తగిన సాధనములను, గ్రంధములను చేర్చుటయు, అక్షర జ్ఞానము లేనివారికి చిత్రపటముల మూలముగను, ఉపన్యాసముల మూలముగను, పురాణపఠనము మూలముగను విద్యావ్యాపకము జేయుటయు మన రెండవ విధి. గ్రంధాలయములను స్థాపించుటతోడనేతృప్తి చెందక వానియొక్క యుపయోగముల గూర్చి జనసామాన్యమునకంతకును ప్రచారము చేయుట ఈ యుద్యమము యొక్క మూడవవిధి. ప్రతిసంఘమందున్న సామాజికులందరు ఇందులో వారు అన్యోన్య సహాయకులుగానుంటయేగాక వీలయినంతవరకు అందుబాటులోనున్న సంఘములన్నియు ఒక సమూహఃముగాగూడి అన్యోన్యాశ్రయభావము గలిగినందువలన గలిగెడు లాభములను బొందుటకు ప్రయత్నించుట మన నాలగవవిధి. జనసామాన్యమునకు మనయుద్యమమునం దభిమానము గలుగ జేసి ఈ యుద్యమమును ప్రతిపట్టణమందును ప్రతి పల్లెయందును వ్యాపింపజేయు మన మైదవ విధి. ఇంక నెన్నియో విధులు గలవు.
ఇక నీవిధులను నిర్వర్తించు మార్గములగూర్చి చర్చింపవలసియున్నది. ప్రతియుద్యమును నిర్వహించుటకు ధనమును, కార్యభారమును వహించెనువారును ఉండితీరవలయను. ఈ యుద్యమము మిక్కిలి జయప్రదముగా జరుగుచున్న పాశ్చాత్య దేశములయం దేనీ బరోడా దేశమం దేమి ఈయుద్యమమునకు దోరతనమువారి యాదరణ మెండుగాగలదు. ఆచటి ప్రభుత్వము వారలిందుకొరకై విశేషద్రవ్యమును బొక్కసమునుఁడి వ్యయపెట్టుచున్నారు. ఇంతియగాక ఆదేశములయంద విద్యాధికులును ద్రవ్యసంపన్నులు నెక్కువగానుండుట చేత అమూల్యములగు విరాళమలీయుద్యమము కొరకై వారలచే నివ్వబడుచున్నవి. మన దేశమునందట్టి సదుపాయనులులేవు. అయినను మనము ద్రవ్య లేమిడి నిరుత్సాహము కావలసిన యావశ్యకము లేదు.
మొట్టమొదట పల్లెటూండ్ల సంఘములను గూర్చి విచారింతము. ఈ సంఘములకు ముఖ్యముగా నాలుగు పనులకు ద్రవ్యముగావలసియున్నది. మొదటిది స్వంత భవననిర్మాణము, రెండవది సిబ్బందీఖర్చు. మూడవది పుస్తకములు వార్తాపత్రికలును తెప్పించుటకు వ్యయము. నాలుగవది దినచర్య కగు ఖర్చు.
మన పల్లెటూండ్లలో చాల గ్రామముల సందు దేవళములకు సంబంధించి సావళ్ళుని, రామభజన మందిరములుగాను ఉండిఉన్నవి. స్వంతభవనమును కట్టుకొను శక్తి సంఘమునకు కలుగువరకును గ్రామసంఘములీ కట్టడములను తమ కార్యస్థానములుగా మలుచుకొనవచ్చును. స్వంతభవనమును కట్టుకొవలచినవారలు దొరతనమువారికి దరఖాస్థును బంపుకొనినయెడల ఉచితముగా గ్రామములో గాని పోరంబోకలలో గాని ఖాళీస్థలములముల నిచ్చెదరు. ఇందుకు దొరతనమువారి యుద్యోగస్థులుకూడ సహాయభూతలగుదురు,
కార్యనిర్వాహకులను గూర్చి జర్చించునపుడు రెండవ యంశమగు సిబ్బందీని గూర్చి చెప్పవలయును. ఇకను దినచర్యకును, గ్రంధములు వార్తాపత్రికలు చెప్పించుకొనుటకును కావలసిన సొమ్మును సంపాదించుటను గూర్చి జెప్పవలసియున్నది. చాల పల్లెటూళ్ళ యందు ఏదోవిధముగ ఉమ్మడి సొమ్ముకొంత ఏర్పడుచున్నది. కొలగారపు పాటలమీద గడ్డి వేలంపాటమీద ఇంక నెన్ని యోవిధముల ప్రతిపల్లెటూరునందును ఎక్కువ సొమ్ము వసూలగుచున్నది. ఇందులో కొంతవరకు డెల్టా మొదలగు ఖర్చుల క్రింద పోయినను కొంత సొమ్ముయినను నిలువ యుండును.
ఈ ద్రవ్యమును జనసామాన్యాభివృద్ధి కొరకై వెచ్చించునట్లు గ్రామస్థులమనంబులు త్రిప్పుట కష్టసాధ్యమే యైనను ఈ యుద్యమావలంబకులు ఎక్కువ కృషి జేసి ఇందును గూర్చి ప్రయత్న ములు సఫలమగునటుల చేయవలెను. గ్రామముల యందు జరుగు శుభకార్యముల సందర్భమున చులకనగా కట్నములను వసూలు జేయవచ్చును. ఈ సొమ్మంతయు వసూలు పరచి ఉచితముగా వ్యయ పెట్టి అందుకు సరియైన లెక్కలనుంచి సంవత్సరమున కొకతూరి గ్రామస్థుల నందరిని జేర్చి ఆ లెక్కలను చదివి వినిపించిన యెడల జనసామాన్యమునకు ఈ యుద్యమ పక్షమున జరుగు పనియందు నమ్మకమును అభిమానమును కలుగక మానవు. దీనికి తోడు సామాజికులిచ్చు చందాలవలనను, విరాళములవలనను కార్యనిర్వాహకత్వమును కొనసాగింపవచ్చును. ఇంతేగాక మన దేశమునందిప్పుడు బయలు దేరుచున్న పరపతి సంఘములవల్ల వచ్చెడి లాభములో కొంతవరకు ఈయుద్యమము కొరకై వ్యయ పెట్టునట్లు చేయవచ్చును. ఇంకను కార్యనిర్వాహకులను గూర్చి చెప్పవలసియున్నది. చాల పల్లెటూళ్ళయందు ఆంగ్లవిద్యను కొంతవరకభ్యసించి పిదప విరమించి విశ్రాంతిగానున్న వారనేకులున్నారు. వీరిలో కొందరు స్థితిపరులు. మరికొందరు సామాన్యులు, వీరుగాక చాల చోట్లు ఆంధ్రమునందును గీర్వాణమునందును పరిచయము గలవార లున్నారు. వీరులందరకును ఈ యుద్యమమునం దభిమానముగలుగ జేసి పలుచోట్ల స్థాపింపబడు సంఘముల యాధిపత్యము క్రింద వీరలచే విద్యావ్యాపకము చేయించవలెను. వీరవలంబించవలసిన మార్గములను గూర్చియు, వీరభ్యసింప జేయు విషయములను గూర్చియు ప్రత్యేకముగ చర్చింపవలసియున్నది. కావున దీనిని గూర్చి సూచనమాత్రము జేసి విడువబడినది. వీరందరకును ఈయుద్యమమునందభిమానము కలుగునట్లు చేసినయెడల వీరే యాంధ్రదేశ సేవకు లగుదురు. వారు ఆయాచోట్ల స్థానికులగుటచే వారికి పలుకుబడి ఎక్కువ యుండును. కార్యసాధనమును సుకరముగా కాగలదు.
ఇక పట్టణములయందు స్థాపించు గ్రంధాలయముల కిట్టి సదుపాయము లెవ్వియు లేవు.'ఆ సంఘములు యుదార వంతుల ధనసహాయము విూదనే యాధారపడవలసియున్నవి. ఇంత వర కును ఈ యుద్యమము వ్యాపింప జేయుటకున్న సాధనములనుగూర్చియు, అవలంబించవలసిన మార్గములను గూర్చియు జర్చింపబడియున్నది. ఇంకను ఈ యుద్యమప్రచారకులు వెంటనే చేయవలసిన పనినిగూర్చియు అందువలన గలిగెడి ఫలమును గూర్చియు వివరింపబడును.
పల్లెటూళ్ళయందును, పట్టణములయందును గ్రంధాలయ సంఘములు నేర్పిరచి సాంఘికులు వారివారి శక్త్యనుసారము గ్రంధములను చేర్చవలయును. వీలైనచో ప్రతిదినమును సాంఘికులలో నెవరో యొకరు ఏదో యొక యుద్గ్రంధమునుండి జదివి అక్షరజ్ఞానము లేనివారికి అర్థముజెప్పి బోధింపవలెను. ఇందుకు మన భాగవత, భారత, రామాయణము మొదలగు యుద్గ్రంధములును, నవీనముగా బయలుదేరుచున్న ఆరోగ్యశాస్త్రము మొదలుగా వారికి అర్థముజెప్పి బోధింపవలెను. ఇందుకుగల గ్రంధములును ముఖ్య సాధకములు. పురాణపఠనము వలన గలుగు లాభములు కడుమెండు. ఇంతియగాక పట్టణములందలి విద్యాధికులు మ్యాజికులాంతరు సహాయముతో నిమ్న సోదరులకు ఉపన్యాసము తీయవలసిఉన్నది. మ్యాజికులాంతరులు మ్యూనిసిపాలివారికి అర్థముజెప్పి బోధింపవలెను. ఇందుకు వారు కొనునట్లు జేయవచ్చును. విద్యాశాఖ వద్ద కూడ అరువునకుదొరకును. వీలయినప్పు ప్రముఖులచే ఉపన్యాసము లిప్పించవలయును . విద్యాధికులును విద్యావిహీనులును,భాగ్యవంతులును పేద వాండ్లును, హిందువులుని, మహమ్మదీయులును, ఉద్యోగులును నిరుద్యోగులును, భూస్వాములును, రైతులును, ఏక సమావేశము గావలెనన్న మన సంఘము అట్టి వీలును గల్పించును. ఇంకనే ప్రతిష్ఠాపయందట్టి వీళ్ళు లేవు. అధికార భేదమును విద్యావ్యాపకమును జేయుటకు మన సంఘములే శరణ్యములు. విద్యాధికులు జనసామాన్యముతో గలసి తాము నూతనముగా గ్రహించిన సంగతులను వారికి బోధపరచి తాము దేశాభివృద్ధికొరకై చేయు పనులయందు వారికి విశ్వాసమును కల్పించుటకు ఈ సంఘములే సాధనములు. స్వార్థత్యాగము కట్టు దిట్టములకు లోబడి యుండుట జన సామాన్యము యొక్క క్షేమము కొరకు తమ యభిప్రాయమును ఇతరుల యభిప్రాయమునకు అవసరమయినంతవరకు లోబరచు కొనుట, నీతి ప్రవర్తన, జాతీయభావము, దేశాభిమానము, భాషాభిమానము మొదలగు తత్వములను జనసామాన్యమునందు వ్యాపింపజేయుటకు గ్రంధాలయములే ముఖ్యసాధకములు. కావున గ్రంధాల యోద్యమము ఆంధ్ర దేశమునందంతటను వ్యాపింపజేసి ప్రతిపట్టణమునందును పల్లెయందును గ్రంధాలయములను స్థాపించి తన్మూలమున జనసామాన్యమునకు జ్ఞానాభివృద్ధిని జేయుట ప్రతి ఆంధ్రదేశాభిమానికిని ముఖ్యకర్తవ్యము. •