గ్రంథాలయ సర్వస్వము/సంపుటము 1/సంచిక 1/ఆండ్రూ కార్నీజీ
అమెరికాదేశ గ్రంథభాండాగారోద్యమమునకు
కల్పతరువు.
ఆండ్రూ కార్నీజీ.
కోటీశ్వరుడు.
ఆండ్రూ కార్నీజీ.
అమెరికా కోటీశ్వరుడు.
అమెరికాదేశ గ్రంథభాండాగారోద్యమమునకు కల్పతరువు.
ఇదివరలో గొంతకాలము క్రిందట నాచే వ్రాయబడిన అమెరికావత౯క చరిత్ర పీఠిక యందు మహనీయుడగు కార్నీజీయెడ నాకుగల గౌరవమును దెలిపియున్నాను. ఇప్పుడు కార్నీజీ యొక్క జీవితచరిత్రను ముఖ్యముగ భాండాగారాభ్యుదయములతో సంబంధించినంతవరకు వ్రాయుటకు బూనితిని.
అమెరికా యందు సార్వజనిక గ్రంథాలయముల యభివృద్ధికి మూలపురుషుడనదిగిన ఆండ్రూ కార్నీజీ యొక్క నామము పవిత్రవంతమై గ్రంథభాండాగారముల యభివృద్ధితో నెల్లప్పుడును పరిగణింపబడుచున్నది. కార్నీజీ యొక్క పేరు తలంచినంతమాత్రమున ఆయన యెడ మనకుగల గౌరవభావము స్ఫురింపకమానదు. కార్నీజీ యెటుల కోటీశ్వరుడయ్యెనో తన ధనము నెటుల పుస్తకభాండాగారములకై వెచ్చింపుచుండెనో తెలియుటవల్ల మనకు ఎక్కువ సంతోషమును ఉద్రేకమును కలుగుట కవకాశము గలదు.
ఇప్పటికి ఎనుబది సంవత్సరముల క్రిందట స్కాట్లాండు దేశములో డంఫర్ లైను నగరమునందు ఆండ్రూకార్నీజీ అను మన కథా నాయకుడు జననమందెను. ఆయన తండ్రి విల్లియము కార్నీజీ యను నాయన మగ్గముల నేతవల్ల జీవించుచుండెడివాడు. మన యాండ్రూకార్నీజీ బాల్యమునందు తల్లి వద్దను పినతండ్రి వద్దను విద్యాభ్యాసము జేసెను. తల్లి ఆయనకు అక్షరాభ్యాసము ను జేసెను; అతని నడవడిని మంచి మార్గమున నుంచగలిగెను. అట్టిమాత అతనికి ఏబది సంవత్సరముల వయస్సు వచ్చువరకును జీవించియుండి మన కథానాయకుని మేధాశక్తిని సానపట్టినదై వజ్రముకన్న విలువగలదిగా జేసెను. అతని పినతండ్రి రాచకీయ తంత్రజ్ఞుడై యుండుటచేత చిన్నతనములోనే యాండ్రూకార్నీజీకి ప్రజాపరిపాలనా పద్ధతులలవడి చరిత్రాభ్యాసప్రాప్తి సిద్ధిఅయ్యెను.అందుచేత అతడు పదియవయేటనే ప్రజాపక్షమున రాచకీయపద్ధతులందు మెలంగుచుండెను.
కార్నీజీకి పదునొకండవ సంవత్సరము వచ్చెను.ఆకాలమున దేశమునందు నూతనముగా ఆవిరియంత్రములు ప్రబలసాగెను; వానిముందర చేతిమగ్గముల పసతగ్గిపోవుటచే నాపోటీకి తాళజాలక విలియము కార్నీజీ తన కుటుంబముతో జీవయాత్రకై అమెరికాలో పిట్సుబర్లు పట్టణమునకు బోవలసివచ్చెను. కార్నీజీని 12 వయేట దూది ఫ్యాక్టరీలో వారమునకు 2 రూపాయిల కూలిని బుచ్చుకొని దూది నేరు పనిలో తండ్రి ప్రవేసింపజేనెను. తర్వాత అనేక కోట్ల రూపాయిలతని చేతిమీద వ్యయపడినను మొదట తాను తన తలితండ్రులకై సంపాదించిన 2 రూపాయిల విలువను తానెన్నటికి మరువజాలననియు, తర్వాత తానార్జించిన కోట్లకంటే నా రెండురూపాయిలనె ఎన్ని రెట్లో ఎక్కువగ చూచుచుండెడివాడననియు, అప్పుడు తాను పడిన కాయకష్టము బానిస వృత్తికంటె యధమముగ నుండినను తన తలిదండ్రులకు సహాయపడుటకై గానిచో దుర్భరమై యుండెడిదనియు కార్నీజీ వ్రాసియున్నాడు.
ఒక సంవత్సరము దూది ఫ్యాక్టరీలో పనిచేసిన తర్వాత ఆవిరి యంత్రముతో పనిచేయు మరియొక ఫ్యాక్టరీలో బాయిలరులో నిప్పునుజూచు పనియందు కార్నీజీ ప్రవేసించి, ప్రతిదినము ఎక్కువకష్టపడి పనిచేయుచుండెడివాడు. అంతమాత్రము కష్టము చేత నాతడు అధైర్యము చెందలేదు. ఎప్పటికైనను మంచిదినములు రాకబోవునా యను మనో ధైర్యము కలిగియుండెను. పేదరికము వలన భయమును జెందుటకు మారుగ సంపన్నుల గృహములయందు జూడజాలని నిజమైన సౌఖ్యము పేదవా రి యింటనే గలదని యాతడు తృప్తి జెందుచుండెను; తర్వాత స్వయంకృషిచే మిక్కిలి ధనవంతుడైనప్పుడు సహితము తన యభిప్రాయమును మార్చుకొనజాలనని కార్నీజీ నుడివియున్నాడు. ఈప్రకారము బాయిలరు వద్ద ఒక సంవత్సర కాలము పనిచేసి ఓహియో టెలిగ్రాఫు కచ్చేరీలో తంత్రీ వాత౯లను బట్వాడా చేయు కుర్రవాడుగా ప్రవేశించెను. అచ్చటనున్న కాలములో టెలిగ్రాఫు పనులను దెలిసికొని శీఘ్రకాలములో నెలకు ముప్పది రూపాయిల జీతము సంపాదింపగల టెలిగ్రాఫు ఉద్యోగమును రైలు స్టేషనునందు సంపాదింపగలిగెను. ఆ జీతమునకు అతడు చాల సంతృప్తినిజెంది యానందమును బొందుచుండెడివాడు, అప్పుడు తన తండ్రి యొక్క గృహమును తాకట్టు బెట్టి ఆదామ్సు యక్స్ప్రెస్సు కంపెనీలో 10 భాగములను కొనెను. వ్యాపార ప్రారంభమున కిదియే కార్నీజీ యొక్క ప్రధమ ప్రయత్నము. అనుభవశాలి యగుటచేత నావ్యాపారములో భాగములు కొనినచో లాభము రాగలదని ఊహింపగలిగెను. దూరదృష్టితో నాలోచించి తనవద్ద సొమ్ము లేనప్పటికి నప్పుచేసి వ్యాపారమున జొరబడెను. సాహసము లేనిదెట్టి స్వల్పకార్యమైనను సాధింపజాలము గదా.
రైలు కంపెనీవారు కార్నీజీ యొక్క తెలివితేటలను గనిపెట్టి వెంటనే పిట్సుబర్లు డివిజనునకు సూపరింటెండెంటు పనినిచ్చిరి. ఆకాలమున అమెరికాలో జరిగిన దేశీయ యుద్ధమునందు మిలిటరీ రైలు రోడ్డును టెలిగ్రాఫులను కాపాడుటకు కార్నీజీ నియమింపబడెను. యుద్ధమును ప్రత్యక్షముగ సందర్శించుటకవకాశము కలిగి యందలి ఘోరములాతని మనసునకు దృఢముగ నాటుటచేత నిప్పటికిని యుద్ధవాత౯ యతనికి కణ౯కఠోరముగ నుండును.
ఆ యుద్ధకాలమున కార్నీజీ వాషింగ్టనులో పనిచేసి తిరిగి పిట్సుబర్లునకు రాగా, నిద్రకనుగుణ్యమైన రైలుబండ్లను కనుగొనిన ‘వుడురపు' అను వానితోకలసి భాగస్థుడుగ జేరి బ్యాంకిలో కొంత సొమ్మును బుణము తెచ్చిఁ పెనిసీల్వేనియా' రోడ్డు మీద కూడ తమ బండ్లనే వాడుక లోనికి రప్పించగలిగెను. ఆడమ్సు కంపెనీ కంటే ఈ కంపెనీలో కార్నీజీకెక్కువ లాభము గలిగెను.
1861 సంవత్సరములో పెన్సిల్వేనియాలో కనిపెట్టబడిన కిరసనాయిలు వ్యాపారమునకై తానప్పటికి నిలవజేసిన 8000 నవరసులను వినియోగించి యానూనెదొరకు క్షేత్రము నొకదానిని కొనెను. కార్నీజీ యదృష్టమంతయు అతని నప్పటినుండి యుచ్ఛస్థితికి దెచ్చినది. ఇనుప వ్యాపారములు జేయు అనేక కంపెనీలలో భాగస్థుడై 1868 సంవత్సరములో ఆంగ్లేయ దేశములో ప్రశస్తమైన బెస్మరు ఉక్కు తయారు చేయుపద్ధతిని పరిశీలించుటకై పోయియుండి అమెరికాకు వచ్చిన పిమ్మట, ఉక్కురైళ్ళను తయారుచేయుటకు యంత్రశాలలను స్థాపించెను. రైళ్ళకు కావలసిన యినుపసామగ్రిని తానే తయారుచేయించవలెనని దీక్ష వహించి కార్నీజీ ఉక్కు యంత్రశాలలను స్థాపించియుండెను. తన పట్టుదల ప్రకారము తన పనులకు కావలసిన సామానులనన్నిటిని తన యంత్రశాలలోనే తయారుచేయగలిగి యితరులపై యాధారపడి యుండనందులకు కార్నీజీ పొందిన యానందమును మనమూహింపజాలము. 1883 సంవత్సరములో మరియొక ఉక్కు యంత్రశాల కధికారియయ్యెను. కార్నీజీ ఉక్కు యంత్రశాలల కంపెనీ పేరబరగు వ్యాపారములందు 50 లక్షల నవరసులను మూలధనముగా కార్నీజీ యుంచగలిగెను. 1892 వ సంవత్సరములో బొగ్గునుసి కంపెనీ నొకదానిని సంపాదించెను. 1900 సంవత్సరము నాటికి తన కంపెనీలలో మూలధనము కోటిన్నర నవరసులుగు జేసెను. తనకు 62 సంవత్సరముల వయసు వచ్చుసరికే కార్నీజీ వ్యాపారముల నుండి చాలించుకొని 50 కోట్ల నవరసుల స్థితితో తులతూగుచుండెను.
కార్నీజీ యీవిధముగ లాభమును సంపాదించగలుగుటకు ముఖ్యకారణము, వ్యాపారములో పనిచేయు వారికి తన లాభములో కొంతపాలు పంచియిచ్చుటయని బోధించుచున్నాడు. మరియొక రహస్యమేమనగా తెలివిగలవాడెచ్చట కన్పించినను వానిని తగువిధముగా ప్రోత్సాహపరచి లాభములో భాగమునిచ్చి తన వ్యాపారములో చేర్చుకొనుచుండెడివాడు. ఎవరైన భాగస్తుడు కాలము చేసిన యేడల నెల దినములలో వాని వారసులకు జెందవలసిన సొమ్మును పంచియిచ్చివేసి యాభాగమును మిగిలిన భాగస్థులే పంచుకొనెడివారు గాని చనిపోయినవాని కొమాళ్ళనుగాని యితర వారసులను గాని వ్యాపారమునందు జొరనిచ్చుటలేదు. ఇందువల్ల ఆగస్త్యభ్రాతలు జేరి మంచి వ్యాపారములను మంటగలుపుటకవకాశము తగ్గునుగదా ! కార్నీజీ వ్యాపారపు పనులనుండి విశ్రాంతిని బొందుట దేహదారుష్యము లేక కాదు. భాగస్థుల వత్తిడివల్లను గాదు. తానార్జించిన విశేష ధనమును తన జీవితకాలములోనే సద్వినియోగము చేయవలెనను ముఖ్యోద్దేశ్యముతో ఆయన వ్యాపారమును మాని జీవయాత్రను గడుపుచున్నాడు.
కార్నీజీ అభిప్రాయప్రకారము ధనమాజి౯కొంచుట కంటె దానిని వ్యయము జేయుట కష్టమని తేలుచున్నది. ధనికుడుగా జనిపోవువాడు తనను తానగౌరవపరుచుకొనువాడని కార్నీజీ అభిప్రాయమైయున్నది. సాధారణముగ మనము చేయు ధర్మముల పద్ధతులు సరియైనవిగావని కార్నీజీ యొక్క నమ్మకము. ధనము సద్వినియోగము జేయుట యనగా సరియైన వ్యయము చేయుటయెగాని యిష్టము వచ్చినటుల వెచ్చించుట కాదు. 1881 సంవత్సరములో అమెరికా దేశ పత్రికలకు వ్రాయుచు ధర్మము చేయు పద్ధతులలో విద్యాలయములు సర్వకళాశాలలు స్థాపించుట, ధర్మపుస్తక భాండాగారములు, వైద్యశాలలు, యంత్రశాలలు, విహారవనములు,పురమందిరములు, ఈతనేర్పు స్థలములు మొదలగువాని నేర్పరచుట అత్యుత్తమంబులని ఆయన జెప్పియున్నాడు.
కార్నీజీ యొక్క ధర్మములయందు గ్రంథ భాండాగారములే అగ్రస్థానమును వహించియున్నవి. ఈ గ్రంథభాండాగారోద్దేశ్యము మొదట కార్నిజీ కెట్లు కలిగెనో, యీ ధర్మమును గురించి యతని యభిప్రాయమేమిటో కొంచెము విచారించుట కత౯కావ్యము. పిట్సుబర్లులో పిల్లలు వారముసకొకసారి చదువుకొనుట కవకాశము కలిగిన 400 పుస్తకములు గల యొక చిన్న భాండాగారమునందు, తనకు గల యభిమానమును తాను పొందిన సంతోషమును 'కార్నిజీ యెన్నటికిని మరపుజెందిన వాడుగాడు. అప్పుడతని మనస్సులో, ఎప్పటికైన నాకు ధనము చేకూరె నేని ఇటువంటి ధర్మపు స్తకభాండాగారములను దేశమున వెదజలి బీదజనులకు నుపయోగకారులగునటుల చేయుదునుగదా యని నునిళ్ళూరుచుండెడివాడు. ఆయన పేదపిల్లవాడుగా నున్నప్పుడు కలిగిన యూహ యట్టిది. ఇప్పుడు వృద్ధుడై కోటీశ్వరుడైన కార్నీజీ, సంఘమునకు జేయగల ధర్మములయందెల్ల ధర్మగ్రంథ భాండాగార స్థాపనయే ఉత్కృష్టమైపరిగణింపబడవలెనని చాటుచున్నాడు.
కార్నీజీని కొందరు ధర్మ గ్రంథభాండాగారములను గూర్చి ఆయన యభిప్రాయమును దెలుపవల సినదిగా కోరినప్పుడు ఈదిగువ సంగతులను శలవిచ్చెను.
“గ్రంథాలయములు కష్టపడనిదే ఫలమునియ్యవు;స్వయంసహాయము జేసికొనువారికే అవి లాభమును గలిగించును; కాబట్టి అవి మనుజులను దరిద్రులనెన్నటికిని చేయజాలవు. ఈ కారణములచేత ధర్మగ్రంధాలయములు జనసామాన్యము నభివృద్ధికి దెచ్చు పరమోత్కృష్ట సాధనములుగ నేను పరిగణించుచున్నాను. ఆసక్తిగలవారికెల్ల గ్రంథములలో నిమిడియున్న యమూల్య రత్నములను గ్రంధభాండాగారములే యొసంగగలవు. గ్రంథపఠనకభిరుచిగల వారి బుద్ధి ఇతర నీచ రుచులయందు ప్రవేశించుట కిష్టపడదు. ఇది గాక జక్కని నవలల జదువుటచేత బీదలకు విశ్రాంతికుదిరి వారి దుర్భరజీవితములకు హాయి గలుగునని నమ్ముచున్నాను. ఇట్టివియేయగుననేక కారణముల చేత, ఇతర ధర్మములనేకములకంటె ధర్మ పుస్తక భాండాగారములు ప్రజా సౌఖ్యమునకును అభివృద్ధికిని ముఖ్యసాధనములగుటంజేసి, నేను వానిని స్థాపించుచున్నాను".
1891 సంవత్సరమునందు 'పీటరు హెడు' గ్రంధభాండాగారణాలను తెరచు సమయమున కార్నీజీ గ్రంథభాండాగారములను గురించిన తన ప్రథమ ఊపన్యాసము నిచ్చియుండెను. సంవత్సరమునకు 25 నవరసులు ధర్మము చేయదలచినవారున్న యెడల చిన్న గ్రామమునకు దగిన గ్రంధభాండాగారము నేర్పరచుటకు వీలుగలదని యప్పట్టున కార్నీజీ నుడివియున్నాడు. ఇంకొక 5 నవరసులు వెచ్చించిన యెడల విద్యార్థులకు దగిన పుస్తకములను చేర్చుట కవకాశము గలదనెను. అందువలన 44 గ్రంధములు భాండాగారమునకు జేర్చవచ్చుననెను. ఒక బడిపిల్లలు జదివిన గ్రంథములు మరియొక బడికి బంపుటకును, సంచార కార్యదర్శుల నేర్పరచి మంచి గ్రంథములను జదువుటకు దగిన ఏర్పాట్లు చేయుటకును బూనవలెను. 'లగ్గాను' పట్టణములో నున్న భాండాగారములో ఆన్నియు సద్గ్రంధములే గలవనియు, ఆ జిల్లాలో నున్న మూడు పాఠశాలలలో నన్యోన్య సహాయమును బొందుచు పరస్పరము పుస్తకముల నెరువు దీసికొనుచున్నారనియు, స్వల్పవ్యయముతో నంత యెక్కువ లాభమును పొందుచున్న యితర మార్గములను తాను జూడ లేదనియు కార్నీజీ నుడివెను.
“తనకుండుకున్న విశేష ధనములో స్వల్పభాగమును మాత్రము వెచ్చించిన లోకమునకెంతో ఉపకారము చేయగలుగుదునను సంగతిని ధనికులైనవారు గుతే౯రిగి యుండవలసియున్నది. నేను 'ఐశ్వర్యసువాత౯ను గురించి వ్రాసిన వ్యాసములో విశేష ధనముండుట ధర్మకర్తృత్వము వహించుటకేయని వ్రాసి యుంటిని. ధనికులా సంగతి గమనింపవలెను. 5 గాని 10 గాని 25 గాని నవరసులు మాత్రము గ్రంధభాండాగారములలో వినియోగించిన అందువలన నూరురెట్లో లేక వేయిరెట్లో ఫలప్రాప్తి గలుగునను సంగతి అనుభవమువల్ల తెలియనగును. గ్రంధభాండాగారములకు ధనమిచ్చు ధనికులకంఔ యట్టి భాండాగారములవల్ల లాభమును పొందినవారు స్వయముగ దాని యభివృద్ధిని కనుగొనుట కెక్కువ అవకాశము గలదు. ఏమహానుభావుడు తన ధనమునేగాక తన శక్తినికూడ ధార్మిక విషయము లందు వినియోగించునో అతడు మాత్రము నిజమయిన దేశభక్తుడు' ధనసహాయము జేసినంత మాత్రము చేత వాని విధి సంపూణ౯ముగ నెరవేరజాలదు. ధనమిచ్చుటకంటె శ్రద్ధవహించి కొనసాగించుటలో విశేషము గలదు.”
ఈ ప్రకారము కార్నిజీ ముత్యములవంటి మాటలతో హితోపదేశము చేసియున్నాడు. అందు ప్రతిమాటకును విలువగలదు. మనకుగల లోకానుభవమువలనచే ఆయుగం సులభమైన పని యనియు స్వయముగ చేయుట కష్టమైన పని యనియు దెలియుచున్నది. కార్నీజి వట్టిమాటలవా డెన్నటికిని గాడు. క్రియాశూరుడు, నిజమైన లోకబాంధవుడు. తాను నిర్ధారణజేసిన పద్ధతి ప్రకారము తన యొక్క ధనము నెటుల ధర్మపుస్తక భాండాగారములకు వినియోగించెనో ఆ మహానీయుని యొక్క దిగువ ధర్మములపట్టికను పరిశీలింపుడు.
(1) 1902 సంవత్సరమునఁ కార్నీజి యిన్ స్టిట్యూటు' అనుదానిని వాషింగ్టను పట్టణమునందు స్థాపించి దానికి 44 లక్షల నవరనుల నిచ్చియుండెను. ఈధర్మము వల్ల మానవకోటికి మిక్కిలి యుపయోగకరమయిన శాస్త్రచర్చ జేయుటకు పరిశోధనకునవకాశము గలిగినది.
(2) ఉపాధ్యాయుల బోధనాభివృద్ధికి కార్నిజీ స్థాపితము. —1905 సంవత్సరములో ఉపాధ్యాయులకు పించను వసతికిని వారి వితంతువుల మనోవతిజ్ఞకిని ఉత్తర అమెరికా ఖండములో 30లక్షల నవరసుల నిచ్చియుండెను.
(3) కార్నిజీ ధీరులనిధి. ప్రాణరక్షణ గావించినవారికి ఆప్రయత్నములో నాపదచెందిన వారికిని, నష్టపడినవారి వారసులకును, అనివార్యమైన బాధ జెందువారికిని సహాయముగ బహుమానములిచ్చుటకు ఈనిధి 1904 సంవత్సరములో 10 లక్షల నవరనులతో స్థాపింపబడినది. ఇది సంయుక్త రాష్ట్రములకు మాత్రము చేయబడిన ధర్మము.
(4) ఈ ప్రకారము ఆంగ్లేయ రాజ్యమునకు 1908 సంవత్సరములో 2 లక్షలన్నర నవరసులను, ఫ్రాంసుకు 1909 సంవత్సరములో 2 లక్షల నవరసులును, రాక్షసకృత్యములకాలవాలమగు జర్మనీకి 1910 సంవత్సరములో 24 లక్షల నవరసులును ధీరుల నిధికై యిచ్చియుండెను.
(5) కార్నిజీ సంధి నిధికి 1910 సంవత్సరములో 20 లక్షల నవరసుల నిచ్చెను.
(6) కార్నిజీ కార్పొరేషనుకు 1911 సంవత్సరములో 50 లక్షల నవరసులను ప్రకృతిశాస్త్ర విద్యకును భాండాగారాభివృద్ధికిని సంయుక్త రాష్ట్రముల వారికై యిచ్చియుండెను. ఈ విధముగ చేయబడిన కార్నిజీ యొక్క పైధర్మముల మొత్తము మన రూపాయిలలో 30 కోట్ల 52 లక్షల 50 వేల రూపాయలు కాగలదు. ఈ మొత్తమును తలంచిన యే ఆంధ్రుని గుండె ఝల్లుమనకుండును? కార్నిజీ యొక్క ఐశ్వర్వమువాత మన దేశములో నెల్లరు చదువవలెను. హిందువులలో “అపుత్రస్య గతిర్నాస్తి" యని నమ్మకము గలదు. తాను ధనమెద్విధముగా సంపాదించినను కొడుకనేవాడున్నాడా దానికి కత౯యని చూచుచుండుట హిందువుని స్వభావము. అట్టివాని కణ౯ములకు కార్నిజీ బోధ బాధకరముగా నుండవచ్చును. కాని ఆయన దార పుత్రాదులకు తగినంత మాత్రమిచ్చి శేషించినది ధర్మమునకు వినియోగించవలె ననుచున్నాడు, ఆంగ్లేయ పత్రికాధిపతులలో సుప్రసిద్ధుడైనట్టి కీతి౯శేషుడయిన స్టెడు కార్నిజీకినిచ్చిన సలహాల ను, కార్నిజీ స్వయముగా వ్రాసిన యనేక విషయములను మన యాంధ్ర యువకులు ముఖ్యముగా జదువవలెనని బరోడా పత్రికాధిపతుల యభిప్రాయమై యున్నది.
అమెరికాలోని గ్రంథ భాండాగారములకు కార్నిజీ 1918 సంవత్సరమునందు చేసిన ధర్మముల యొక్క మొత్తము 4 లక్షల అరువదివేల నవరసులు. ఇతరులిందు నిమిత్త మిచ్చినది 4 లక్షల నవరసులు ఇది గాక లక్ష 68 వేల 655 గ్రంధములును, గ్రంథభాండాగారముల నిమిత్తము 12 స్థలములును, 101 భవనములును ఇంక చిల్లర ధర్మములనేకములును చేయబడినవి. 1913 సంవత్సరాంతమునకు ఆండ్రూ కార్నిజీ యొక్క ధర్మముల మొత్తము 18 కోట్ల 24 లక్షల రూపాయిలై యుండెను.
పెద్దిభొట్ల వీరయ్య, బి.ఏ., బి.యల్.