గోన గన్నారెడ్డి/తృతీయగాథ
తృతీయగాథ
రుద్రదేవి
1
ఓరుగల్లుకు ముప్పదిగవ్యూతుల దూరంలో గోదావరీతీరారణ్యా లున్నవి. గోదావరితీరానివి గంభీరమైన అడవులు. కృష్ణాతీరానివి అందమైన అడవులు. హిమాలయపర్వతారణ్యాలు దివ్యమైనవి. మలయద్వీపారణ్యాలు భయంకరారణ్యాలు.
ఈ అరణ్యాలలో వెలుగెరుగని నేలలున్నాయి. నల్ల, ఎఱ్ఱ, రాతి మొదలైన ఏవిధమైన నేలా కనబడని గడ్డిజాతులు, ముళ్ళజాతులు, లక్షలకొలది తీగెల జాతులు, ఓషధులజాతులు, నేలమట్టం మొక్కలు, చిన్నజొంపాలు, నిలువెత్తు గుబురులు, నిలువున్నర ఎత్తు ముసుర్లు, ఆకాశంఎత్తుచెట్లు, అడుగుమందాలతీగలు, చేయిమంద తీగలు, సాలితంతుల తీగెలు అనేకజాతులవి. అనేకజాతులవృక్షాలు, కరక్కాయ, ఉసిరిక, జీడి, తాళిక, తంగేళ్ళు, మద్దులు, రేలలు, టేకుపాలలు, మామిళ్ళు, తాడులు, ఇప్పలు, చండ్రలు ఒకదానిలో ఒకటి చొచ్చుకుపోయేవి, అన్నిదెసలూ ఆక్రమించేవి, ఆకులముళ్ళు, కాయలముళ్ళు, పూవులముళ్ళు, కొమ్మలముళ్ళుకలవి, మంచివాసనకొట్టేవి, కారపువాసనకొట్టేవి, చేదువాసన, మత్తు వాసన, దుర్గంధము కొట్టేవి, రంగురంగుల పూవులవి, చిన్నపూవులవి, పెద్దపూవులవి, అడివిమల్లె, అడివిపారుజాతం, శేఫాలిక, అందాలఆకులు, రంగురంగుల ఆకులు, అనేకరూపాల ఆకులు, పొడుగువి, పొట్టివి, నీటిదగ్గర పెరిగేవి, రాళ్ళ రాళ్ళమధ్య పెరిగేవి. ఈలాంటి మహారణ్యంలోకి శ్రీరుద్రదేవి యువరాజులవారు, శ్రీ చాళుక్య వీరభద్రమహారాజు, పురుషవేషంతో ఉన్న చెలులు, శ్రీ శ్రీ చాళుక్య మహాదేవరాజు, శ్రీ సత్రము బొల్లమరాజుమంత్రి, శ్రీ తంత్రపాలు మల్లి నాయకుడు, రాజబంధువు శ్రీ విరియాల ముమ్మడిరాజు అనేక సైన్యాధిపులతో, వీరులతో, వేటవిద్దెపాటవం కల బోయిలతో, అడవిచెంచులతో, కోయదొరలతో వేటకు వేంచేసి ఉన్నారు.
యువరాజు శ్రీ రుద్రదేవులు వేటకు వస్తున్నారంటే, వారికి వేటకు వెళ్ళే రాజపథంలోఉండే మండలేశ్వరులకు, విషయోద్యోగులకు, దశగ్రామాధిపులకు, గ్రామాధిపులకు, రైతులకు, కులకరుణులకు రాజాజ్ఞలు వెళ్ళినవి. దారిలో సర్వ సౌకర్యాలు కలిగించవలసిందని, అందుకు కావలసినధనం చక్రవర్తుల కోశాగారమునుండి అందజేయబడింది. ఓరుగల్లు మహానగరాన్నుండి వేలకొలది ఉద్యోగులు వచ్చు దారిపొడుగునా కట్టుదిట్టాలు చేశారు. వేట నిర్విఘ్నంగా జరుగుతున్నవి. క్రూరమృగాలను వేటకాండ్లు రెచ్చగొట్టడం, రుద్రదేవి, చాళుక్యవీరభద్రుడు, మహాదేవప్రభువు, విరియాల మల్లాంబిక బాణాలు ధనస్సుల సంధించి చెవులకంట అల్లెత్రాళ్లులాగి, సువ్వున అ క్రూర మృగాల గుండెల్లోంచి దూసిపోవేయడం, పెద్దపులులు, చిరుతలు, ఎలుగులు, అడవిపందులు, సివంగులు, అడవిపిల్లులు కుప్పకూలడం జరుగుతున్నది.
ఏ కారణముచేతనో చాళుక్యవీరభద్రుడూ, రుద్రమదేవీ తమతమ గుఱ్ఱాల మీద స్వారి అవుతూ అడవిలో ఒకభాగంలో తారసిల్లారు.
వీరభద్రుడు : ప్రభూ! మీ గురి అర్జునునికి పాఠాలు నేర్పుతున్నది.
రుద్రదేవి : మీరు నిన్న సాయంకాలము పడవేసిన బెబ్బులి రెండు కళ్ళ మధ్యను జ్ఞాననేత్రం తెరువబడలేదా మహారాజా? ఆ బెబ్బులి నన్ను పగబట్టినట్లు నామీదకు ఉరకటం, మీ రా సమయంలో దగ్గిరలో ఉండటం .....
వీర : అలా అంటారేమి మహాప్రభూ ! మీరు ఏదో యాదాలాపంగా ఉన్న సమయంలో అది మీపైన ఉరికింది. అక్కడ నేను ఉన్నానుగనుక మా ప్రభువు సహాయానికి నేను వచ్చాను.
రుద్ర : మీరు మొదటిబాణం వేయగానే, నా గుఱ్ఱంపై ఉరకబోయిన ఆ పెద్దపులి మీవైపు తిరిగింది. వెంటనే మీ రెండోబాణం దాని మెదడులో నుండి దూసుకుపోయింది! మీ ఉపకృతికి నే నేమి మారు ఈయగలను?
వీర : మహాప్రభూ! మీ స్నేహంకన్న, మీ ఆదరణకన్న నాకు కావలిసినది ఏమున్నది ?
పురుషవేషంతో ఉన్న రుద్రదేవి బాలునిలా ఉన్నది. మీసాలురాని పదియారేళ్ళ కుమారునిలా ఉన్నది. ఆమెతలపై శిరస్త్రాణం ఉంది. వెనుకవున్న ఎత్తైన కేశాలను గట్టిగా ముడివేసినప్పటికీ ధమ్మిల్లము అతిపెద్దదిగా ఉండడంవల్ల అందుపై సన్నని వుక్కుగొలుసుల అల్లికవస్త్రములు వ్రేలాడుచున్నవి.
వుత్తుంగాలైన ఆమె సౌవర్ణవక్షోజాలను అదిమి స్తనవల్కలము ధరించి, అందుపై పట్టుతో రచింపబడిన పురుషకంచుకము ధరించి, ఆ కంచుకముపై ఆమె ఉక్కుకవచం ధరించినది. మెళ్ళో పురుషహారములు ధరించింది.
స్త్రీలకు, పురుషులకు ఒకేవిధములైన ఆభరణాలు ఉంటవి. తేడా పనితనంలో మాత్రం ఉంది.
రుద్రదేవి పురుషాభరణాలు ధరిస్తుంది. ఆమె అధివసించిన అజానేయము ఉత్తమ అరబీగుఱ్ఱము. ఈ జాతిగుఱ్ఱాలు భరుకచ్ఛం వస్తాయి. అక్కడనుంచి మెరకదారిని ఓరుగల్లు మహాపురము వస్తాయి. ఆంధ్రులు అశ్వవీరులు కాబట్టే వారిలో అశ్వసాహిణు లెక్కువ. అశ్వ శాస్త్రం తెలియని ఆంధ్రవీరుడు లేనేలేడు. అరబ్బులకు గుఱ్ఱాలన్న ఎంత ప్రీతో ఆంధ్రులకూ అంతప్రీతి. రుద్రదేవి అశ్వసాహిణులలో మహోత్తమ సాహిణి. ఆ నా డామెను అశ్వశిక్షలో మించిన పురుషుడు ఒక్క గోన గన్నారెడ్డిమాత్రమే!
రుద్రదేవిని ప్రేమించని గుఱ్ఱంలేదు. చక్రవర్తి అశ్వశాలలో ఆమె అడుగుల చప్పుడుగూడ ప్రతిగుఱ్ఱమునకు తెలియును.
2
"ఓహోహో! చాళుక్య వీరభద్రప్రభు వెంత యందగాడు! ఎంతటి వీరుడీయన! ఆయన ఘనముష్టివినిర్ముక్తశరము ఇనుపకుడ్యాలనైన భేదించుకుపోగలదు గాబోలు. ఆ పెద్దపులికళ్ళమధ్యనుంచి మెదడులోకి సువ్వున దూసిపోయింది. ఒక్క ఏటుతో గిఱ్ఱున తిరిగి, ఆ అటవిరాజు నేలకూలింది. ఈ ప్రభువెంత చదువుకొన్నాడు. ఎంత శాంతము! ఏ విషయములోనూ చెక్కుచెదరడు. కోపము వీరి జీవితములో ఎప్పుడైనా వచ్చునా? కాని, పనిపట్టినప్పుడు మెరుమువేగాన్ని తాంబేలువేగంలా కనిపింపజేయగల అఖండవేగం! ఉత్తమధర్మం అంతా ఈయనలోనే మూర్తమై ఉందా! ఎంతటి మహాపురుషుడు! సింహంలాంటి బలం కలవాడు, సింహాలను కుక్కులవలె తోలగల విక్రమంగలవాడు” అని రుద్రదేవి ఆలోచనలో చిక్కి తలవాల్చి వాలుగన్నులతో అపాంగవీక్షణాలు పరపుచు వీరభద్రప్రభువును గమనించింది.
అప్పు డా దేవి స్త్రీయైపోయినది. ఆమె కేదో వివశత్వం కలిగింది. తానిట్లా శిఖండివలె ఉండడమేనా? పురుషునికి స్త్రీ వేషంతో ఉండడం ఎంత అసహ్యమో స్త్రీకి పురుషవేషంతో ఉండడమూ అంత భరింపరానిదే! ఆమె జఘనఘనత్వ మేమగును? ఆమె పురుషవేషంలో చిన్న బాలుడుగా కనిపిస్తుంది. ఆమె తొడలు తమ రంభాత్వాన్ని పురుషవేషంలో మాయం చేసుకోలేవు. పర్వతసానువువలె కర్కశమై, సౌందర్యవంతమై గంభీరమైన విశాల ఫాలంతో, రక్తపుజీరలు నిండిన విశాలమైన కన్నులతో వెరగుగొల్పే పురుషులమోములోని పారుష్యము, నున్నగా చంద్రబింబంలా, నిశ్చలమైన చెరువునీటిలా, నీటిలోతేలు తామర పూవులా, తామరపూవులోని రేకలా, లేత జేగురు చిరుగులప్రోవులా, ఉదయంలో మంచుతో తడిసిన కాశ్మీరకుసుమపు చేనులా - లాలిత్యాలు మూటలు కట్టే స్త్రీ ముఖంలో పురుషవేషం వేసినా ఎల్లా వస్తుంది?
కాని ఈ మహాభూమి, శాలివాహనులు, ఇక్ష్వాకులు, చాళుక్యులు, కాకతీయులు ఏలిన ఈ పవిత్రమహాంధ్రభూమి తాము రాజ్యం చేయకపోతే విచ్ఛిన్నమై పోతుంది అంటారు శివదేవయ్య దేశికులవారు. బలమైన రాజు లేకపోతే సామంతులు పాలు విరిగినట్లు మహారాజ్యంనుంచి విడిపోతారట. ఎవరికివారే స్వతంత్రులు అవుతారు. ఏకత్వంలేని చిన్నరాజ్యాలు వేనకువేలు ఈ భరతఖండం అంతా నిండి ఉంటే, వారిలో వారికి సర్వకాలాలా యుద్ధాలు మండిపోతాయి. యుద్ధాలవల్ల ధర్మం నాశనం అవుతుంది. అటు సింహాద్రినుండి ఇటు కంచివరకు, తూర్పుతీరంనుండి కళ్యాణకటకంవరకూ తన తండ్రిగారి దివ్యచ్ఛత్రంక్రింద వికసించిఉన్న ఈ మహాంధ్రభూమి క్రిందపడిన మృణ్మయపాత్రలా కోటిశకలాలు కావలసిందేనా?
రుద్రదేవి ఆలోచన చాళుక్య వీరభద్రుడు గమనించాడు. ఈ బాలిక, ఈ వీరయోషారత్నము తండ్రితో సమంగా రెండుమూడు యుద్ధాలలో పాల్గొన్నది. ఎంతోకాలం ఈమె బాలుడనే తా ననుకున్నాడు. ఎందుచేతనో ప్రథమంనుండీ ఈ బాలుడు తన హృదయం చూఱగొన్నాడు అని తా నా దినాలలో అనుకొనేవాడు.
తన కామె స్త్రీ అని తెలిసినట్లు, నన్ను వీరంతా ఆమెపతిగా నిర్ణయించి నట్లు ఈ మహాభాగురాలికి తెలియదు! ఇదంతా రాజధర్మమా? చిన్నతనంలో ఈమె బాలుడనుకొన్నదినాలలో తనకు కలిగిన స్నేహవిరహవేదన నిజమైన ప్రేమవిరహ వేదన కాబోలు! యువకుని జ్ఞానం నిజం గ్రహించలేకపోయినా, హృదయం గ్రహించగలిగింది!
ఆమె చక్రవర్తి, తాను సాధారణ సామంతుడు. త న్నేల ఆమె ప్రేమించ వలెను? బాలికయైనా ఆమె పరిపాలనాజ్ఞానమూ, దక్షతా వర్ణనాతీతము! బాలికయై కూడా బాలునివేషంలో ఎంత అందంగా ఉన్నది. ఈమెలో సత్యభామాదేవి అందాలన్నీ కూడుకొన్నాయి. ఈమెలో లలితాదేవి మహస్సౌందర్యము మూర్తీభవించింది. ఆదిశంకరభారతీతీర్థస్వాములవారు రచించిన సౌందర్యలహరే ఈమెగా మూర్తీభవించింది. పురుషవేషంలో ఉన్న ఈ మహాదేవి తన నడకలో, తన ఠీవిలో, తన మాటలలో, తన అశ్వారోహణ నై పుణ్యంలో ఈషణ్మాత్రం ఇటు బాలికాత్వానికిగాని అటు పురుషత్వానికిగాని అపశ్రుతి కలిగించటంలేదు.
ఇద్దరూ ఈలా వేరువేరు ఆలోచనలతో గుఱ్ఱాలను నడుపుకొంటూ వస్తున్నారు.
ఈయన తన్ను బాలికఅని గ్రహించాడా అనుకున్నది ఆమె. స్త్రీ అని గ్రహిస్తే తనకు ఎప్పుడూ లేనిభయమూ, సిగ్గూ వస్తుందేమో! ఈయన అంటే తన కింత ప్రీతి ఏమి?
ఇంతలో యువరాజు అంగరక్షకులు తంత్రాపాల మల్లి నాయకుడు, విరియాల ముమ్మడిరాజు అక్కడకు అశ్వాలపై స్వారిఅవుతూ వచ్చారు. భటులు, వేట కాండ్రు, సైనికులు, బోయమన్నీలు, కోయదొరలు రుద్రదేవమహారాజున్న కడకు వచ్చారు.
అందరూ కలిసి అక్కడ దగ్గరఉన్న తమకు విడుదులు ఏర్పరుపబడిన ఒక పల్లెకు వేంచేసినారు. ఆ విడుదులలో తాటియాకుల గుడిసెలలో యువమహారాజును శ్రీ చాళుక్య వీరభద్రప్రభువు రక్షించిన సరిఘటననే చెప్పుకొనుచుండిరి.
“ఆ పెద్దపులి ఎక్కడనుంచి వచ్చింది?”
“ఆకాశంనుంచి ఉరికినట్లు వచ్చింది.”
“మనవా ళ్ళెవ్వరూ ఆ వైపు కాపు ఉండలేదు. ఆ వైపునుంచే అంత ఠీవిగా నిర్బయంగా నడిచివచ్చింది,”
“ఎదురుగుండా మహారాజులు కనపడ్డారు. గాండ్రుమని అ పెద్దపులి వారి మీద ఉరికింది. బాణాలు ఎక్కు పెట్టేవ్యవధిలేక కత్తి దూశారు వారు. ప్రక్కనే ఉన్న వీరభద్రమహారాజులు పెద్దపులిపై సువ్వున బాణంవేస్తే అ పెద్దపులి ఒక దొర్లుదొర్లి పడింది.”
“అవును ! మళ్ళీ చెంగునలేచి వీరభద్రమహారాజుపైన దుముకబోతే కళ్ళ మధ్యనుంచి దూసిపోవ నేశాడు బాణం.”
ఈవిధంగా విడుదు లన్నిటిలో మహారాజును రక్షించినందుకు చాళుక్య భూపతిని పొగడినారు. గండం తప్పినందుకు భగవంతుని ప్రార్థించారు.
ఇంతలో ఎక్కడనుంచో ప్రసాదాదిత్యనాయనివారు సంరంభంగా ఊడి పడ్డారు. ఆయన శ్రీ రుద్రదేవమహారాజులకు నమస్కరించి “ప్రభూ ! నేనూ తమతో వేటాడాలని అంచెలలో వచ్చాను” అని మనవిచేశాడు. రుద్రదేవప్రభువు తమ తండ్రిగారైన సార్వభౌమునిగురించి అడిగినారు. ఆ వెనక యువమహారాణి ముమ్మడమ్మనుగూర్చి అడిగినారు. ఇదివరకే రుద్రదేవమహారాజు తల్లి శ్రీ సామ్రాజ్ఞి సోమాంబాదేవి అస్తమించినది. సవతితల్లులైన మహారాణులనందరినీ కన్నతల్లి కన్న ఎక్కువగా ఆయన ప్రేమించేవారు. వారందరినీ గూర్చి ప్రభువు ప్రసాదాదిత్యుని అడిగినారు.
ప్రసాదాదిత్యప్రభువు రెండు దినాలు వేట ఆనందాన్నిపొంది, అక్కడ నుండి రుద్రప్రభువుతో కలిసి ఓరుగల్లు ప్రయాణమయ్యెను.
కాకతీయ మహారాజులు, వారి సామంతులు ఆంధ్రభూమిలో అనేక మహా సరోవరాలు నిర్మించారు, వ్యవసాయం వృద్ధిచేశారు.
వీరి ప్రయాణంలో అనేకమగు చెరువులు, గ్రామాలు చూస్తూ ప్రయాణం చేశారు. తమ భావిచక్రవర్తి యువరాజు శ్రీ రుద్రదేవులు వస్తున్నారని గ్రామాలకు తెలియగానే ప్రజలు ఉత్సవాలతో ఎదుర్కొనేవారు. పళ్ళు, పూవులు, కూరగాయలు, బలిసిన మేకపోతులు, పోతరించిన కోడిపుంజులు, ముత్యాలులా మిల మిలలాడే రాజనాలు తెచ్చి ప్రభువునకు ప్రజలు ప్రాభృతము సమర్పించుకొనేవారు.
భూమి ప్రజలది. ఆ భూమిని సంరక్షించినందుకు ప్రభువు ఆరవభాగం పన్ను తీసుకుంటాడు. ఆ పన్నైనా ప్రజలకోసమే ఖర్చు. ఆ దినాలలో వ్యవసాయం అనేకరీతులుగా చేసేవారు.
ఇంక ప్రభువుకు వచ్చే రాబడి సుంకాలు, అడవులు, గనులు, స్వంత భూములు మాత్రమే!
వ్యవసాయం ఏ వరపువచ్చి పంట పండకపోయినా, ఆ పంటసగం పండినా వ్యవసాయదారులు పన్ను ఈయనవసరంలేదు. (పన్నుకోసం ఈనాటివలె మక్తాలు, జాగీరులు మొదలైనవి లేవు)
ఈ విషయాలన్నీ గమనిస్తూ రుద్రదేవులు ప్రసాదాదిత్యులను, చాళుక్య ప్రభువును ప్రశ్న లడుగుతూ అనుమానాలు అంతరింపచేసుకుంటూ ప్రయాణం చేస్తున్నారు.
3
రుద్రదేవి ఓరుగల్లు చేరింది. నగరం కోటగుమ్మందాటి, వీధులవెంట ప్రజలు జయజయధ్వానాలు చేస్తూఉండగా, గుఱ్ఱం అధివసించి చుట్టూ వీరనాయకులు పరివేష్ఠించిఉండగా విజయంచేస్తున్నది.
ఇంతలో రాచనగరుల కోటగుమ్మంముందర నూరుమంది బాలబాలికలు పూవల తట్టలతో పాటలు పాడుతూ ఎదురై నారు, వారి వెనుకనే వారి గురువులు నిలిచిఉన్నారు.
“మా ప్రభువులు మారాజు మహవీరుడయ్య
అరివీరులకు ఆజి అపరరుద్రు డు
శౌర్యాన అర్జునుడు ధైర్యాన నంది
వీర్యాన భైరవుడు వితరణ దధీచి
జయజయా జయజయా జయరుద్రదేవ
జయ కాకతీవంశజలరాశిచంద్ర
అని పాడి రుద్రదేవిపై పూవులు చల్లినారు. రుద్రదేవి అశ్వము చెంగున దిగి ఆ బిడ్డలలో నిరువురను దగ్గరకు తీసుకొని హృదయాన కదిమికొని “ఈ బిడ్డల నందరినీ మా నగరుకు తీసుకురండి అయ్యవారూ” అని చెప్పి వారిని వదలి గుఱ్ఱ మెక్కినది. ఆమెతోపాటు గుఱ్ఱాలు దిగిన వీరనాయకులందరూ మరల గుఱ్ఱాల నధివసించి, రుద్రదేవివెంట చనినారు. రాచకార్యానికై పురుషుడైన యా బాల తన యువరాజు నగరగోపురద్వారంకడ చాళుక్య వీరభద్రుని, ప్రసాదాదిత్య నాయకుని వీడ్కొని అంగరక్షకులతో లోనికి వెడలిపోయెను. అంగరక్షకులు మహాసౌధప్రాంగణంకడ యువరాజు సెలవంది చెరియొక వైపూఉన్న వారివారి భవనాలకు వెళ్ళిరి.
రుద్రదేవి ప్రాంగణందాటి బాహ్యచతుశ్శాలదాటి అభ్యంతర సౌధప్రాంగణాల గుఱ్ఱం దిగి, గుఱ్ఱాన్నితట్టి, సేవకులు పట్టుకొనివచ్చిన తాటిపటిక బెల్లం గడ్డలు తినిపించి ఆ యుత్తమాశ్వంకడ సెలవుపొంది, లోనికి వెళ్ళిపోయింది.
ఆ సౌధబాహ్యమందిరాలలో కావలి ఉండునది పురుషుడు. పనిపాటలు సలిపే దాస్యజనులిచ్చు సాష్టాంగ దండప్రణామాలు అందుకొంటూ అభ్యంతర మందిరంలోకి సాగిపోయినది రుద్రదేవి.
అభ్యంతర మందిరాలలో కాపుండేవారందరూ స్త్రీలే. దాసీజనులు దారి చూపిస్తూఉండగా, వైతాళికులు బిరుదులు చదువుతుండగా ప్రభువు అలంకార మందిరంలోకి వెళ్ళినారు. అలంకార శయన మందిరాలలోకి అతి నమ్మకంగల ఇరువదిమంది దాసీలు, ఇరువదిమంది అంగరక్షకులు, ఇరువదిమంది చెలిమికత్తెలు తప్ప ఇతరులెవ్వరూ వెళ్ళడానికి అధికారంలేదు. ఆ అభ్యంతరాంతర మందిరముల లోనికి యువమహారాజు తల్లులు, మహారాణులుకూడ అనుమతిలేనిదే రావీలులేదు; యువమహారాజు భార్య శ్రీ శ్రీ ముమ్మడాంబికకును అధికారములేదు.
రుద్రదేవ ప్రభువు అభ్యంతరాంతరాలంకారమందిరములలోనికి పోయి, ఒక పీఠముపై అధివసించగానే దాసీలు పరుగున వచ్చిరి. వారిలో ముగ్గురలంకారిణు లుండిరి. ఒక ఆమె శిరస్త్రాణం, గొలుసులవస్త్రం తీసి పక్కదాసీకి అందిచ్చింది. ఒకామె కవచకంచుకము విప్పింది. మరొకతె పాదరక్షకులు ఊడ్చింది. వేరొకతె నడుముకు ధరించిన రత్నాలుపొదిగిన బంగారు మొలనూలు విప్పినది పట్టుదట్టీ తీసినది. అందున్న మణులు పొదిగిన దంతపు పిడిగల రత్నాల ఒరగల చురకత్తి తీసింది.
అప్పు డొక చెలి వచ్చి ఆమె దీర్ఘ వినీల కుంతలాల ధమ్మిల్లము విప్పి దంతపు దువ్వెనతో దువ్వ నారంభించినది. ఒకబాలిక ఆ యువరాజు పురుషాభరణాలన్నీ ఒలిచినది. స్తనవల్కలముతో ఆ దివ్యసౌందర్యగాత్రి అపరాజితాదేవివలె ఒప్పినది. ముచ్చెలు తొడుగుకొని, యా కాకతీయకుల రాకాచంద్రిక స్నానమందిరానకు నడచినది. ఆ పాదాల గమనిస్తూ మార్జనిక లిద్దరు ఆమెతో నడచు చుండిరి. ఆమెపాదాలు కమలాల మొగ్గలే, ఆమె పాదాలు పావురాలజంట, ఆమె పాదాలు పాలసముద్రంలో కెరటాల తాకుడువల్ల ఏర్పడిన అమృతంపు వెన్న ముద్దలు అని మార్జవికలైన ఆబాల లనుకున్నారు.
సుగంధతైలాలు పూసి, పరీమళపు నలుగులు నలిచి, సురభిశోష్ణోదకాల స్నానంచేయించా రా బాలలు. స్త్రీ దిగంబరియై స్నానమాచరించాలట. రుద్రదేవి చక్రవర్తి నియంత్రణవల్ల బాలుడౌట కటివస్త్రంతో స్నానం కావించినది. అయినా ఇరువదిరెండేళ్ళ ఈడుగల ఆ యోషకు బంగారురంగులో కాశ్మీర కుసుమవర్ణమూ, జపాకుసుమవర్ణమూ రంగరించి, దిరిసెనపూవు మెత్తదనము కలిపినట్లున్న దేహసౌభాగ్యము చూచి ఆ మార్జనికులు ఉప్పొంగిపోతూ ఉంటారు. జవ్వనము తొంగిచూచుబాలిక కోరికలలా, వెన్నెలలోనికి నీటిలోనుండి తొంగి చూచు కాలు ఎఱ్ఱకలువ మొగ్గలులా ఉన్న ఆయమ మేలిమి పసిడివక్షోజాల శిఖరితములైన చూచుకాలు కాళిదాస శాకుంతల నాటకంలో నాల్గవ అంకంలోని "శుశ్రూషస్వ గురూన్", "యాస్యత్యద్య శకుంతలేతి" అనే శ్లోకాలులా ఉన్నాయి.
ఆమె దేహము ద్రఢిమాయుతము, లాలిత్యయుతమున్ను. ఆమె దేహము స్పష్టాంగరేఖాసమన్వితము. మాధవీలతవలె, కల్పవృక్షశాఖవలె ఆమెచేతులు మృదులములు, పుష్టిమంతములు. శుంభ నిశుంభాదులపై చెవికంట బాణయుక్తమగు వింటి నారినిలాగు లలితాదేవీహస్తా లా చేతులు.
రుద్రదేవి అతిలోకసుందరమగు తన వనితారూప మావేళ గమనించు కొన్నది. ఇదివర కేనాడు లేనిసిగ్గు ఆమెను ఆవరించి, దేహమంతయు అరుణమైనది. ఆ సిగ్గుతో ఆమె తన కన్నులు మూసికొన్నది. ఆమెలోని పురుషభావము, ఆమె రూపంలోని దిగంబరవనితాదేహాన్ని చూచి సిగ్గుపడి కన్నులు మూసుకొన్నది.
రుద్రాంబిక స్నానము పూర్తిగావించి, వలిపవస్త్రములు ధరించి అలంకార మందిరానకు పోయి పీఠ మధివసించగానే, చెలులు పరిష్కర్త్రికలు ఆ దేవిని అత్యంతమధురంగా అలంకరించారు.
ఇరువదిరెండేండ్ల సంపూర్ణ స్త్రీ! బాల్యం ఇసుమంతా తరుగని బ్రహ్మచారిణి. పారిజాతపుష్పంలా నిత్యవికసితయౌవన. ఆస్వాదన కోరని పరిమళము. తుమ్మెదను కాంక్షించని దివ్యపుష్పము.
స్నానంచేసి అలంకరింపబడి ఆ దేవి దర్పణంలో ఎవరినో ఒక లాతి సుందరీరత్నాన్ని చూచికొన్నది. ఆ ప్రతిబింబంలోని బాల తా నెరుగనిది! ఆ ప్రతిబింబంలోని బాల అప్పుడే జవ్వనంపొందిన నవయోష! ఆ ప్రతిబింబంలోని మనోహరాంగి సముద్రసంగమానికి ఉప్పొంగి వరదలై ప్రవహించి వచ్చే నదీ సుందరి! ఆ ముకురంలోంచి తన్ను అరమూతకన్నులతో పరిశీలించు మధురాధర ఏదో మహానుభూతికై ఎదురుచూచు పరమహంసి.
ఆ దర్పణంలోఉన్న సముజ్వలమూర్తి తన్ను చూచి “ఓ బాలికా, ఇక నువ్వు బాలుడవు కాదు. నువ్వు మహారాజువుకాదు. నువ్వు మాయా పురుషత్వం వీడిన శోభాపూర్ణ నవవధువువు! నువ్వు నీ వరునికొరకై ఎదురు చూస్తున్నావు. నీ ఇంద్రజాలం మాని మహాంధ్రభూమిలో నచ్చిన పురుషుణ్ణి కోరుకో” అన్నట్లయినది.
రుద్రదేవి చిరునవ్వు నవ్వుకొన్నది. ఆమె ఆడవారిలో పొడుగైన బాలిక. కత్తియుద్ధంలో, బాణయుద్ధంలో, పరశు భల్ల యుద్ధాలలో దేశంలోని ఏ ఇద్దరు ముగ్గురు వీరులో ఆమె ఢాక కాగగలరు. యుద్ధవ్యూహ రచనంలో ఒక్క జన్నిగదేవ త్రిపురాంతకదేవు లామెకు మిన్న అవుతారేమో!
పురుషవేషము ధరించినప్పుడే ఆమెలో స్త్రీభావము మాయమౌతుంది. కవచము, ఉష్ణీషము ధరించి, ఆయుధోపేతయై ప్రియమగు అజానేయ మారోహించినప్పు డామె అతిపురుషుడు. ఏమాత్రము శంకలేని మహావీరుడగు పురుషుడు. ఆ అశ్వము ఆకాశము అంటేటట్లు ఎగిరినా, లోకాలను ఆవరించేటట్లు దుమికినా, మహావాయువుతో పందెంవేసినట్లు పరుగిడినా ఆ బాలిక చెక్కు చెదరదుకదా! ఎంతో మహానందాన్నిపొంది, ఎగురులో, పరుగులో భాగమై, ఆకాశరాజై, గ్రహాల మేటియై, వాయువే అయి సర్వవిశ్వానికి నాయకత్వం వహిస్తుంది. అప్పు డామె విశాలమైన కళ్ళు ఆదిత్యద్వయం, అప్పుడామె మందారకుట్మలనాస పాశుపతాస్త్ర జ్వాల, అప్పు డామె బింబాధరాలు విడివడిన ప్రళయాగ్ని శిఖలు, ఆరుద్రదేవుని యెదుర్కొన సాహసించగలిగినవా డొక్క రుద్రుడే!
పురుషవేష మింటికడను ధరించుచుండును. ఆమె బాలికయని ఆ అభ్యంతరాంతర మందిరాల మెలిగే అరవై మంది స్త్రీలకు, మహారాణులకు, చక్రవర్తికి, శివదేవయ్యకు మాత్రమే యెరుక. తక్కినవారికి అనుమానము మాత్రము.
ఆమె పదునెన్మిదేడుల ఈడున అర్ధసింహాసనారూఢయై యున్నప్పుడు సభలో చాళుక్య వీరభద్రుని ఆయన తండ్రిప్రక్క చూచినది.
అప్పుడు శ్రీ శ్రీ గణపతిరుద్రదేవచక్రవర్తి జన్మదిన మహోత్సవానికి శ్రీ శ్రీ నిడుదప్రోలు చాళుక్యమహారాజు ఇందుశేఖరుడు పెద్దకుమారునితో పాటు చక్రవర్తిని దర్శించడానికి వచ్చినాడు. చాళుక్యవీరభద్రున కప్పు డిరువదియొకటవయేడు.
ఆ మహాసభలో చాళుక్యవీరభద్రుడు ఆకాశాన సూర్యదేవునివలె ఒక్కడే ప్రత్యక్షం అయినాడు రుద్రదేవికి.
ఆ రుద్రదేవుడైన రుద్రదేవికి ఒక నిమేషం హృదయస్పందన మాగిపోయినది. వెనువెంటనే యుద్ధభేరీనినాదం మ్రోగుట ప్రారంభించినది. ఆమె అన్నియు మరచి కవుల గంభీరకావ్యగానములు వినక, నర్తకీబృంద మధుర నృత్యాలు గమనించక వీరభద్రునే చూచుచున్నది. వీరభద్రుడు యువరాజును చూచుట కదే మొదటిసారి. చక్రవర్తికుమారుడు రుద్రదేవుని యందము లోకాతీత విషయంగా పండితు లాడుకొనుట వీరభద్రుడు విన్నాడు. అ వర్ణనలు నిజానికి కొన్ని యోజనాల దూరంగా ఇప్పుడాతనికి కనిపించాయి. మన్మథునిలో ఎక్కువ ఆడతనం ఉంది. కుమారస్వామిలో ఎక్కువ మగతనం ఉన్నది. జయంతునికి వా రిరువురిలోని తేజస్సులేదు. నలకూబరుడు మనుష్యులకు దగ్గరివాడు. వసంతుడు ఒక్క ఋతుకాలమాత్ర సౌందర్యం కలవాడు. వీరందరిలో లేని ఏదో ఒక మహాసౌందర్యోజ్జ్వలత ఈ బాలునిలో ఉన్నదని చాళుక్యవీరభద్రు డనుకొన్నాడు.
కుమారస్వామి శుద్ధవటువు, మన్మథుడు శుద్ధప్రేమికుడు. వీరిద్దరిని తనలో లయించుకొని వీ రిరువురిని మించిన ఈ మహాభాగుడు చాళుక్య వీరభద్రుడా? ఆంధ్రామృతప్రవాహాలు కట్టించిన నన్నయమహాకవికృత భారతాన్ని కృతినందిన రాజరాజనరేంద్ర చక్రవర్తి వంశములోనివాడైన ఈ యువప్రభువు పురుషసౌందర్యానికి పాణినీయసూత్రమని ఆమె అనుకున్నది.
నాటినుండి రుద్రప్రభువు వీరభద్రప్రభువు స్నేహాన్ని వాంఛించాడు.
వా రిరువురు ఎన్నిసారులో కలుసుకొన్నారు. ఒక పర్యాయము వీరభద్రుడు “మహారాజా! కాకతీయవంశానికి చాళుక్యులు శివునికి శూలంలా కాగలరు” అన్నాడు. ఆ భావంలోని ఆనందంచేత రుద్రప్రభువు వీరభద్రుని రెండుచేతులు తన రెండుచేతుల పట్టుకొని తన మూర్థాన ఉంచుకొన్నాడు. ఆ క్షణంలో వేయి విద్యుల్లత లొక్కసారి వీరభద్రుని దేహమెల్లా ప్రసరించి అతడు ఝల్లుమనిపోయినాడు. వీరభద్రుని కేదో సిగ్గువేసినది. అతడు వెంటనే కాకతీయ మహాప్రభువు చేతులు రెండూ వదలివేసినాడు.
రుద్రప్రభువునకు లోకజ్ఞానమే నశించినది. ఆ ప్రభువునకు అమృతము సేవించిన దేవతలకు కలిగిన వివశత్వము కలిగినది. అది స్నేహప్రభావమని ప్రభువు అనుకొన్నాడు. రుద్రదేవునిలో నిద్రపోవు రుద్రదేవి ఒకసారిగా ఉలిక్కిపడి లేచింది. ఆమె మోము కెంపువారింది. కన్నులుమూసికొనిపోయినాయి. ఆమె వక్షోజాలు పొంగిపోయినాయి. ఆమె పెదవులలో అమృతా లూటలూరినవి.
ఈనాడు చాళుక్యరుద్రునితో అభేదానంద మనుభవించిన రుద్రదేవి అనిర్వచనీయమగు సంతోష మనుభవించుచున్నది. కావుననే నిట్లలంకరించుకొన్నది.
బాలికావేష మిదివర కెప్పుడును ధరించినది కాదు. ఆనాడు చాళుక్యరుద్రునితో స్నేహముకలిగిన క్షణంనుండి తాను బాలికనని ఆమెకు ఎన్నిసారులో ఆలోచన వచ్చినది. ఆ వచ్చుటకు కారణ మామె ఊహింపలేదు. ఆమెలోని స్త్రీత్వము ఆమె కీడువచ్చిన ఎంతకాలమునకోగాని గురుతు రాదాయెను. ఆమె కీడువచ్చినప్పుడు రాణివాసంలో జరుగు నెలరోజులు మహోత్సవములు జరుగలేదు. ఈడు వచ్చినదని రాణులకు, గణపతిదేవునకు, శివదేవయ్య మంత్రికి మాత్రమే తెలియును. తర్వాత చెన్నాప్రెగడ గణపామాత్యునకు తెలిసినది. అది అంతటితో సరి.
తాను బాలకు డను భావముతోనే రుద్రదేవి తనలో కలుగు స్త్రీ చిహ్నాలు గమనించకుండ బాలక్రీడలలో మునిగియుండునది. ఈడువచ్చిన ఆనాటి సంఘటనయు ఆమె కంత పట్టినదికాదు. ఏదియోవంకను మహారాణి సోమాంబ రుద్రాంబ నా మూడు దినములూ అంతఃపురాన నిలిపియుంచినది. బాలికకు జరుగు వేడుక లేవియును ఈ బాలికకు జరుపలేనందుకు సోమాంబికాదేవి లోలోన దుఃఖించినది కాని, రాజకీయావసరముకాన భర్త ఆజ్ఞయే ఆమెకు పరమాజ్ఞ అయినది.
అలా ఒకయేడు గడిచింది. రుద్రమదేవిలోని యౌవనచ్ఛాయలు ఎంత మాత్రమైన ఇతరులకు తెలియకుండ మహారాణి ఎన్నియో కట్టుదిట్టాలు చేసింది.
ఒకనాడు రుద్రదేవి ఒకశిల్పము చూచినది. ఆ శిల్పము ఒక దేవీ విగ్రహము. అ దేవీవిగ్రహమునకున్న ఉత్తుంగవక్షోజాలు, సన్ననినడుము చూచాయగా ప్రదర్శింపబడిన నగ్నత చూచి ఆమె కాశ్చర్యము వేసినది. ఆ విగ్రహమును రుద్రేశ్వరాలయమునకు బోయిన రుద్రదేవి చూచినది. రుద్రదేవి ఇదివరకెన్నడు ఆలయములు దర్శింపలేదు. నృత్యాలు చూడలేదు. ఇతరబాలికల నగ్నతల నామె యెరుంగదు.
ఆ దినము అనుమకొండ రుద్రేశ్వరాలయానికి ఆమె వెళ్ళునని ఆమెకు తెలియదు. అనుమకొండలో జరుగు ఒక ఉత్సవానికి సామంతరాజకుమారులతో కలసి ఆమె బోయినది. ఆమె వారితో రుద్రేశ్వరాలయ ప్రాంతాలకు బోవుట తటస్థించినది.
తన తాతగారి అన్న రుద్రదేవ చక్రవర్తి నిర్మించిన మహాదేవాలయం చూడాలని ఆమె కేలనో బుద్ధిపుట్టినది. ఆమె రాజకుమారులకు తనతో రండని ఆజ్ఞ ఇచ్చి గుఱ్ఱము డిగ్గి గుడిలోనికి పోయినది. ప్రక్కనున్న శివదేవయ్య మంత్రు లెవరితోనో మాట్లాడుచుండిరి.
ఈ సమయంలో రుద్రదేవి గుడిలోనికి పోయినది. రాజకుమారులమాటలలో స్త్రీ పురుష భేదము ఆమె కప్పుడు పూర్తిగా అవగాహనం అయిపోయినది. ఆమె తాను స్త్రీనను అనుమానం ధృడమైపోయింది. వెంటనే మహావేగంతో ఓరుగల్లు పురం చేరింది. తల్లి గారైన మహారాణి సోమాంబికాదేవికడ కామె వెంటనే వెళ్ళింది.
“అమ్మగారూ, నేను మీవంటి బాలికనై ఉంటే, నన్ను బాలకుణ్ణిగా ఎందుకు పెంచి, లోకాన్ని మోసంచేస్తున్నారు?” అని అడిగింది. మహారాణి తెల్లబోయి “ప్రభూ! చక్రవర్తికి వార్తపంపుతాను. వారు వచ్చినవెనుక మీ అనుమానం తీరుతుంది” అని ప్రతివచనమిచ్చి వెంటనే గణపతి రుద్రదేవులకు వార్త పంపినారు.
వార్త వెళ్ళిన అరఘటికలో మహారాజు మహారాణి అంతఃపురానికి వచ్చినారు. మహారాణి వారితో అంతయు విశదము చేసినారు.
గణపతిరుద్రదేవుఁడును తెల్ల బోయి, స్వయంభూదేవుని ఒక నిమేషం ప్రార్థించి ఒక నిశ్చయానికి వచ్చినాడు. వెంటనే మహారాణి అంతఃపురంలో చక్రవర్తిని కలుసుకొనవలసినదిగా శివదేవయ్య దేశికులకు వార్త వెళ్ళినది.
4
నలభై విఘటికలలో శివదేవయ్యమంత్రి పట్టపుమహారాణి నగరానికి విచ్చేసి తనరాక లోనికివార్త పంపగా మహారాణి అభ్యంతరసభామందిరాలలో చిన్నదానిలోనికి ముఖ్యమంత్రిని తీసుకొనిరా మహారాణి చెలికత్తెలను పంపినది. వారు దారి చూపుచుండ శివదేవయ్య లోనికి దయచేసినారు. ఆయన పాదాలకు చక్రవర్తియు, సామ్రాజ్ఞియు, రుద్రదేవియు లేచి నమస్కరించి ఉచితాసనంపై కూరుచుండ ప్రార్థించిరి. వారును వారందరిని ఆశీర్వదించి ఉపవిష్ణులైరి.
శివ : మహాప్రభూ ! ఎందుకు ఇంతతొందరగా నాకు వార్త పంపినారు? యువరాజుగారు తొందరలో నగరానికి రాగానే నేనున్ను వెంటనే మా గృహానికి చేరాను. ఇంతలో మీ వార్త వచ్చినది.
గణ : మహామాత్యా! రుద్రప్రభువు తాను బాలికయై ఉండగా ఏల పురుషునిగా తన్ను పెంచినారు అని అడుగుతున్నారు.
శివ : అలానా! రుద్రప్రభువులు చాళుక్యమహావంశచరిత్ర ఎరుగుదురా అని మనవిచేసుకుంటున్నాను.
రుద్రదేవి : ఎరుగుదును బాబయ్యగారూ !
శివ : ఆ వంశంలో ఇద్దరు ముగ్గురు కుమారులు చక్రవర్తులకు కలుగుతూ ఉండడము, ఆ అన్నదమ్ములు రాజ్యానికి వారిలో వారు పోరుతూ దేశానికి అరిష్టం తీసుకువస్తూ ఉండడము జరిగినదాయెను. ఆ జ్ఞాతియుద్ధాలవల్ల సుభిక్షమైన ఈ నాడులన్నీ కాటకాలకు లోనవుతూ ఉండేవి.
రుద్ర : మహామంత్రీ! చాళుక్య మహారాజుల చరిత్రకూ నన్ను పురుషునిగా పెంచడానికీ సంబంధం ఏమిటి?
శివ : ప్రభూ, వినండి. రాజులేని రాజ్యం తలలేని దేహంవంటిది. ఒక రాజ్యానికై ఇద్దరు రాజులు పోరువడడం రాజు లేకపోవడమేగదా! రుద్ర : మీరు నాకీ రాజనీతి చిన్నతనంలో బోధించినారు.
శివ : అలాంటప్పుడు నేనువచ్చి మళ్ళీ పాఠాలన్నీ జ్ఞాపకంచెయ్యాలా కాకతీయప్రభూ!
రుద్ర : మా నాయనగారికి మగపిల్లలు లేకపోవడంవల్ల నేను బాలిక నైనప్పటికి నన్ను బాలునిగా పెంచారు.
శివ : చక్రవర్తికి తమ్ములన్నాలేరు. ప్రతాపరుద్ర చక్రవర్తికి ఉంపుడు కత్తెకు పుట్టిన సారంగధరదేవునకుమాత్రం ఇద్దరు పుత్రులు హరిహర, మురారిదేవు లున్నారు. వాళ్ళ కీ రాజ్యం కబళించాలని ఉన్నది. ధర్మసంరక్షణార్థం ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కరాజే ఉండాలి. మన తెలుగు మహాసామ్రాజ్యము అనేక చిన్నచిన్న రాజ్యాలుగా ముక్కలై ఉంటే ధర్మసంరక్షణం జరగదు. ఈ రాజ్యం కోసల విషయమనీ, కళింగమనీ, వేంగీవిషయమనీ, నతవాటిసీమ, గృధ్రవాడ విషయము, మంజిష్ఠదేశము, కమ్మనాటి విషయమనీ, వెలనాడనీ, ఆరు వేలనాడనీ, వూగీవిషయమనీ, పొత్తపినాడనీ, సింధనాడనీ, మార్జనాడనీ, మానువ నాడనీ, కొరవదేశమనీ, కొలనిపాక విషయమనీ, చక్రకోట్యమనీ, మంత్రకూట విషయమనీ ఈ విధంగా చిన్నచిన్న రాజ్యాలతో నిండిఉన్నది. వీని నన్నిటినీ ఏకచ్ఛత్రంక్రిందికి తీసుకువచ్చి, సుఖరాజ్యం స్థాపించి, ధర్మపరిపాలనచేస్తూ, శాంతిభద్రతల నెలకొల్పి పురుషార్థాలు వెల్లివిరిసేటట్లు చేయవలసిన బాధ్యత మహా పురుషులది! చాళుక్య రాజ్యాలు రెండూ నాశనం అయ్యాయి. ఆ తర్వాత మీ పెద తాతగారైన రుద్రమహారాజు తండ్రి ప్రోలమహారాజులు కాకతీయసామ్రాజ్యం స్థాపించారు. చాళుక్యులు బలవంతులుగా ఉన్నంతకాలం, శ్రీ ప్రోలమహారాజు తండ్రి శ్రీ భేతమహాప్రభువు వారికి నమ్మకంగల మండలేశ్వరుడై సామంతుడై ఉండెను. భేతమహారాజు తండ్రి శ్రీ ప్రోలమహారాజు, వారితండ్రి భేతమహారాజు మహామండలేశ్వరులై, సామంతులై ఉండిరి.
గణపతి : తండ్రీ! నాకు పుత్రులు కలుగలేదు. ఇందరి రాణులలో ఒకరి గర్భమూ ఫలించలేదు. స్వయంభూదేవుడు ప్రసాదించిన శక్తితో, ఈ దేశికుల సహాయంతో కాకతీయ సామ్రాజ్యము వృద్ధిచేసి దేశంలో ధర్మం నెలకొల్పాను. ఆలాంటి ఈ మహారాజ్యానికి యువరాజు లేడు. తల్లీ! నువ్వు పుట్టడమే హిమవంతుని ఇంట పార్వతి జనియించిన ట్లయింది నాకు. చిన్నవారైనా నాకు పంచాక్షరి ఉపదేశించి అర్జునునికి సారథ్యం చేసిన శ్రీకృష్ణునివలె ఈ శివదేవయ్య దేశికులు నువ్వు ఉద్భవించగానే నాకు పుత్రులు పుట్టబోరనీ, నీ జాతకమునందు మహాసామ్రాజ్ఞీత్వము వ్రాసిఉన్నదనీ చెప్పి పుత్రుడుదయించు కట్టుదిట్టాలు చేయించారు.
మహారాణి : తల్లీ నిన్ను పుత్రునిగా పెంచడం ఎంత కష్టమైంది? చక్రవర్తీ, మహామంత్రీ ఆలోచించి చేసిన ఏర్పాటిది. శివ : ప్రభూ! ఈ భూమిలో ధర్మం కొనసాగడానికే ఈ విధానం అవలంబించాము. మీరు బాలికలని చెప్పగల శుభముహూర్తం వస్తుంది. ప్రపంచంలో ఆర్యభూములలో ఇదివరకు సంభవించని ఒక దివ్యఘటన ఇప్పుడు సంభవిస్తుంది గాక! మీరు అఖండ ఆంధ్ర సామ్రాజ్య సింహాసనం అధిష్ఠించాలని మిమ్ము బాలకునిగా పెంచాము తల్లీ! వీరపురుషోచితమైన విద్యలన్నీ మీకు నేర్పినారు. మీరు ఉత్తమోత్తమ చక్రవర్తులు కాగలరు. ఇదీ రహస్యం.
రుద్రదేవి తలవాల్చికొని ‘నన్ను క్షమించండి బాబయ్యగారూ, నన్ను ఆశీర్వదించండి గురుదేవా! అమ్మగారూ! మీసహజోదారహృదయంతో నన్ను మీ హృదయంలోకి తీసుకోండి. మీరు నా కర్పించిన ఈ దివ్యధర్మాన్ని నా ప్రాణాలతో కాపాడుకొంటాను’ అన్నది.
• • • • •
ఆ సంఘటన అంతా ఈ రోజున అద్దంలో తన ప్రతిబింబం చూచుకొనే రుద్రదేవికి జ్ఞప్తికి వచ్చినది. తాను స్త్రీయని లోకము తెలుసుకొనవలసిన సమయ మేతెంచినదా?
స్త్రీకి రాజ్యార్హత ధర్మశాస్త్రం ఒప్పుకోదు. ధర్మం ఒప్పనిదే లోకం ఒప్పదు. శ్రుతి మొదటిప్రమాణ మన్నారు. శ్రుతికి వ్యాఖ్యానం స్మృతి కాబట్టి శ్రుతికన్న ఎక్కువ ప్రమాణం స్మృతి అన్నారు. లోకాచారం శ్రుతినిబంధననాచరణలో పెట్టడమే కాబట్టి, లోకాచారము పరమప్రమాణ మన్నారు. ఒక ఉత్తమపురుషుడు ప్రారంభించిన పనిని తక్కిన సర్వలోకమూ నెమ్మదిగా ఆచరిస్తుంది. అదే ఆచారము. ఆంధ్రాచారమైన మేనరికం అలాంటిదేకద!
తాను చక్రవర్తి అవును. అయిన తనకు భర్తకావలెనా? ధర్మము స్త్రీని వివాహము చేసికొనితీరవలె నంటున్నది. భర్త పోయినచో సన్యాసినిగా ఉండవచ్చును గాక!
అప్పు డామెకు పందొమ్మిదవఏట తనకు జరిగిన వివాహ విషయము జ్ఞాపకమునకు వచ్చినది. ఆమె వదనమంతట చిరునవ్వులు ప్రసరించినవి. ఆమె అధరాంచలాల అమృతప్రస్రవణాలు మిలమిలలాడి ఉబికిపోయినవి.
ముమ్మడమ్మ కమ్మనాటి నాయకుడైన జాయపమహారాజు కుమార్తె. శ్రీగణపతిరుద్రదేవునకు జాయపసేనాని బావమరిది. ఆయన కుమార్తె ముమ్మక్కదేవి అందాలరాణి. ఆ బాలిక మేనత్తలైన శ్రీగణపతి చక్రవర్తి రెండవ, మూడవ మహారాణులైన నారాంబా, పేరాంబా దేవులకడనే పెరుగుచుండెను. ఆమె కుమార రుద్రప్రభువుకన్న రెండేండ్లుమాత్రమే చిన్నది. ఆ బాలిక గానసరస్వతి, నృత్యవిశారద, విద్యాభారతి, సౌందర్యలహరి. ఆమె ఇంతబాలిక యైనప్పటినుండి యువరాజైన రుద్రదేవుని ప్రేమించినది. “బావగాలూ, ఇవాల మనం ఇద్దలం ఏమి ఆలుకొందాం?”
“ఏమిటి ఆడుకొందాం మమ్మక్కదేవిగారూ?”
అప్పుడు ముమ్మక్క దేవికి మూడేళ్ళు. రుద్రప్రభువునకు అయిదేళ్ళు. పెదమహారాణిగారి నగరికి దాసీలు ఎత్తుకొని ముమ్మక్కదేవిని తీసుకొచ్చేవారు.
“బావగాలూ, నన్ను ఈ బెమ్మక్కలాచ్చసులు ఎత్తెకుపోయాలంట, మీరు గుల్లం ఎక్కి కత్తీ పుత్తుకొని, ఆ లాచ్చసున్నీ దలిమికొత్తి, తరిమేత్తాలుత. అప్పులు వత్తి నన్ను లత్తిత్తాలుత.”
“బాగుంది ముమ్మక్కగారూ ! నేను కత్తిపుచ్చుకు సిద్దంగా ఉన్నాను” అని బాలరుద్రదేవుడు (రుద్రదేవి) తన మొలలో కట్టిన చిన్న కత్తిని పుచ్చుకొని, దాసీ బెమ్మక్కను తరుముకు వెళ్తూ “రాచ్చసీ చంపివేత్తాను! నువ్వు అనగా అనగా నారాజపుత్త్రికను ఎత్తుకుపోతావా?” అంటూ ఆమెను పొడిచినట్లు నటించారు.
బెమ్మక్క ఘాండ్రుమంటూ ఆ తోటలోని గడ్డిలో విరుచుకు పడిపోయింది.
రుద్రదేవుడు ముమ్మక్కకడకు పరుగిడి ‘రాజకుమారీ! నిన్ను రాచ్చసుని చంపి రచ్చించి మాదేశము తీసుకు వెలుతున్నాను’ అని తెల్పి ఆమె చిన్నచేతులు పట్టి లేవనెత్తి తనతోవచ్చు యింకొకదాసీకి అప్పచెప్పుతూ ‘తక్కిన రాచ్చసుల్ని కూడ చంపివేత్తాను’ అన్నారు.
5
ఆటలలో, పాటలలో, చదువులో శ్రీకాలరుద్రదేవ ప్రభువును, శ్రీ ముమ్మడమ్మయు ఎప్పుడూ కలుస్తూ ఉండేవారు. ముమ్మక్క రుద్రదేవుని చూడక ఒక్క దినమైనా వెళ్ళనిచ్చేదికాదు. రుద్రదేవుడు నీభర్త అని అందరూ అంటూవుంటే ముమ్మడాంబికకు సంతోషం పొంగిపోయేది. రుద్రదేవుని కలుసుకొనడానికి వెళ్ళినప్పుడెల్ల ఆ బాలిక వన్నెవన్నెల వస్త్రాలు, ఆ వస్త్రాలకు తగిన ఆభరణాలు ధరించేది. ఏడువారాలవికావు, ఏడేడువారాల వేషాలూ వేసుకొనేది. ఒకనా డామె ఉషోబాల, ఒకదినాన ఆమె జనకుని ఇంట శైశవ క్రీడల దేలు సీతమ్మ, ఇంకొకనా డామె లేతవెన్నెల కిరణము. మరిఒక్క దినం ఆమె దివ్యంగా జ్వలించే ఉడుబాల.
ఆ ఆటలలో, ఆ ఆనందాలలో వా రిరువురూ పెద్దవారై నారు. ముమ్మక్కకు వయస్సువచ్చి అంతఃపురాంగన అయినది. వసంతోత్సవములలో, పండుగ దినాలయందు, మహారాజజన్మదినోత్సవములలో తక్క, ఇతర సమయాల నామె రుద్ర ప్రభువుకంట పడకూడదు. ఒకతూరి వసంతోత్సవసమయంలో ముమ్మడాంబిక వనదేవత వేషం ధరించి, వసంతవేషముతో రుద్రదేవ యువరాజు ఒంటిగా వసంతోద్యానవనాన సంచరించే సమయాన, పదునారేడుల ఈడుగల ఆ ముద్దులగుమ్మ వెనుకగావెళ్ళి ఆ యువరాజు కళ్ళుమూసింది. రుద్రప్రభువు ఉలికిపడి ‘ఎవరు?’ అని తొందరపాటుగా ప్రశ్నించెను.
‘బావగారూ ! నా పేరు చెప్పుకోండి?’
‘ఓహో! నా ప్రియురాలు ముమ్మడాంబికాదేవా?’
‘నెగ్గారు మీరు’ అని ముమ్మడాంబిక చేతులుతీసి ‘నేనే ఓడిపోయాను ఏమి చేయమంటారు?’ అని ప్రశ్నించింది.
‘అదిగో ! ఆ పొదరింట కూచుందామంటాను.’
వా రిరువు రా ప్రక్కనున్న పొదరింటిలో కూర్చుండిరి. ముమ్మక్క దేహం వేడెక్కిపోయినది. భరించరాని సిగ్గు, ఎవరైనా వస్తారేమోనన్న భయం!
‘ముమ్మడాంబికాదేవీ ! మొన్న మా చిన్న అమ్మగారి సౌధాలకు వస్తే, మీ రెక్కడా కనిపించలేదే?’
నేను మిమ్ము చూడకూడదని అత్తయ్యగార్లిద్దరూ ఆంక్షలు వేశారండీ, కాని మిమ్ములను చూడనేచూశాను.'
‘మీరు దినమూ ఏమి చేస్తూ ఉంటారు?’
‘నాన్నగారి సహాధ్యాయ గొంకనభట్టువారు నాకు నాట్యమూ, సంగీతమూ, సాహిత్యమూ చెప్పుతున్నారు.’
‘ఈ మధ్య మీ నాట్యము నేను చూడనేలేదు. మామయ్యగారు రచించిన నృత్తరత్నాకరము అంతా చదివాను. చదువుతోంటే నాకు ప్రతిక్షణమూ నాట్యం చేయలనే బుద్ధి!’
‘బావగారూ! మీతో ఆటలు ఆడకూడదని మా అత్తయ్యగార్లు నిషేధించి నప్పటినుండీ నాకు మతి.....మతి.....పూర్తిగా ...పోయినట్లే ఉంది. నా నాట్యం మీకు నిజంగా చూడాలని ఉందా?’
‘తప్పకుండా నాట్యం చేయలేను కాని, నాట్యం చెయ్యాలని ఎంతో ఊహ! కాని నన్ను మహారాజు నాట్యం చూడకూడదన్నారు. దేవాలయాలలోకి వెళ్ళవద్దన్నారు.'
‘బావగారూ! రేపు అత్తయ్యగార్ల నగరులకు రండి. నా దాసి బెమ్మక్క మహామందిరములో నుంచుని ఉంటుంది. అప్పు డది ఏలా తీసుకువెడితే ఆలా రండి! మీరు మాటిచ్చారు సుమండీ! మరచిపోకండి.’
ముమ్మడమ్మ రుద్రదేవుని మెడ గట్టిగా కౌగిలించుకొని నున్నని చెంప ముద్దిడుకొని, మరుక్షణంలో మాయమైనది. ముమ్మడమ్మ ఒళ్ళు ఝల్లుమంది. ఆమె కపోలాల చిరుచెమటలు పట్టినవి. ఆ పరుగు పరుగు ఆ వనంలో ఉన్న ఒక క్రీడాసరోవరంకడ ఆగింది. అక్కడ అనేకులు బాలబాలికలు ఉయ్యాల లూగుతున్నారు. ముమ్మడాంబను చూచి, రాకుమారికలు కొందరు వయ్యారాల నడకలతో ఆమెకడకు వచ్చి ఆమెను మేలమాడ చొచ్చిరి.
రుద్రదేవునికి తాను బాలికనని అంతకుముందు విజయదశమి ఉత్సవాలకే తెలిసినదికదా? ఇప్పుడు ముమ్మడమ్మ మాటలకు యువరాజుకు ఎంతో నవ్వు వచ్చింది. తన్ను బాలికలందరు ప్రేమించుట కారంభింతురు కాబోలు నని ఆ ప్రభువు మరింత నవ్వుకొన్నారు.
ఈలా ముమ్మడమ్మ రుద్రదేవుల నాటకం జరిగి జరిగి చతుర్థాంకాన వారి కిరువురకు వివాహ మైనది. జాయపసేనానికి గణపతిరుద్రదేవ చక్రవర్తియు, శివదేవయ్య మంత్రియు రుద్రమదేవి రహస్య మెరిగించి, ఆంధ్రమహారాజ్య సంరక్షణార్థము రుద్రదేవికి స్త్రీని వివాహం చేయవలసి ఉన్నదనిన్నీ, అందుకు చిన్ననాటి నుండీ కలసిమెలసి పెరిగిన ముమ్మడమ్మను రాజకుమారునికి వధువుగా తాము నిశ్చయించామనీ, చక్రవర్తి బావమరిదియు, రాజభక్తిపూరితుడును, ఉత్తమ సంస్కారియు, మహాసేనానాయకుడు నగు జాయపనేని అందు కేమీ అభ్యంతరము చెప్పడని తమ భావమనియు తెలిపిరి. జాయపసేనాని సంతోషంతో ఒప్పుకొన్నాడు.
రుద్రదేవప్రభువు స్త్రీయని లోకానికి తెలిపేకాలం వచ్చేసరికి ముమ్మడమ్మను రుద్రదేవితోపాటే ఒక ఉత్తమ మండలేశ్వరున కిచ్చి వివాహము కావింతమని శివదేవయ్య మంత్రి జాయపసేనానికి చెప్పినాడు.
శ్రీ శ్రీ కాకత్య మహారాజవంశచంద్రుడైన యువరాజు శ్రీ రుద్రదేవ ప్రభువునకూ, శ్రీ శ్రీ జాయపమహారాజపుత్రిక ముమ్మక్క సానమ్మ దేవేరికి అఖండవైభవంగా వివాహం అయింది. సింహాద్రినుండి కంచివరకు, మోటుపల్లినుండి కళ్యాణపురివరకు గల మహామాండలికులు, మహాసామంతులు, రాజబంధువులు, రాజ ప్రతినిధులు, మహామంత్రులు, మాండలికులు, సామంతులు, మహాకవులు, గాయకులు, కృష్ణవేణీతీరస్థ కూచిపూడి నటకులు, నర్తకీమణులు వేంచేశారు.
నిడుదప్రోలు రాజ్యప్రభువులు శ్రీ ఇందుశేఖర చాళుక్యమహారాజు వేంచేసినాడు. సారసపురాననుండి శ్రీ ఇందులూరి సోమరాజమంత్రీ, ఆయన తమ్ముడు శ్రీ పెదగన్నణమంత్రీ దయచేసినారు. వేంగీ విషయాధినాథుడు కాలపనాయక మహారాజును, నిర్మలమహాపురినుంచి చౌండసేనాధిపతియు, అద్దంకినుండి సారంగపాణి దేవమహారాజు, గుడిమెట్టనుండి శ్రీ సాగిచాగరాజమహాప్రభువును, ధరణికోటనుండి మహామండలేశ్వర కోటరుద్రమహారాజును, అతని పుత్రుడు బేతమహారాజును, సప్తగోదావరీ మధ్యదేశ కోనమండలాధిపతి హైహయ శ్రీ కోనరాజ మహారాజును, పెళ్ళికొమార్తె పెదతండ్రి పృథ్వీనాయకుడు, పినతండ్రి నారపనాయకుడు, వారి తండ్రుల బిడ్డలయిన కమ్మనాటి ప్రభువులు, రుద్రదేవుని ఇరువురు మేనత్తలు, గణపతిచక్రవర్తి చెల్లెళ్ళయిన మైళమాంబ, కుందాంబదేవుల రాజ్యమైన నతనాటిసీమ కధిపతులైన మహామండలేశ్వర రుద్రదేవరాజు తన ఇద్దరి దేవేరులతోను, బుద్దపురమునుండి మల్యాల గుండయమహారాజు, వర్ధమానపురమునుండి గోన లకుమయారెడ్డిప్రభువు, ఆదవోనినుండి కోటారెడ్డిమహారాజు, కందూరునుండి కేశినాయకప్రభువు, కందవోలునుండి నందిభూపాలుడు, కల్యాణమునుండి చోడోదయ మహారాజు, కోసగినుండి మైలపదేవుడు, రేచర్లవంశమహావీరుడు రుద్రప్రభువు, పిల్లలమఱ్ఱినుండి బేతిరెడ్డిప్రభువు, నాగులపాటినుండి విరియాలవారు, పమ్మి ప్రభువులు, ముప్పవర ప్రభువులైన పంట మల్లి రెడ్డి ప్రభువులు వివాహానికి వేంచేసినారు.
6
వివాహం అఖండవైభవంగా జరిగింది. నెలరోజులు దేశమంతా ఉత్సవాలు జరిగినాయి. రాజధానీనగరమైన ఏకశిలానగరం అంతా గంధర్వ నగరమైపోయింది. ఆ నగరాలంకారములో ఆకాశపు పందిళ్ళు, ఏనాటికానాడు పచ్చటి మామిడాకు తోరణాలు, అరటి స్తంభాలు, పూవులు రంగు రంగు అద్దకాల మేల్కట్టుల తెరలతో వెలిగిపోవుచుండెను. నగరమంతయు భోజనశాలలు; ఆ శాలల్లో వివిధదేశాల వివిధరుచులకు తగిన శాల్యన్నాలు, గోధుమరొట్టెలు, వివిధశాకాలు, పచ్చళ్ళు, తొక్కులు, పులుసులు, చారులు, పిండివంటలు, చిత్రాన్నాలు, షాడబాలు వడ్డించు చుండిరి.
ప్రతిదినమూ కవి పండిత గాయక నాట్యగోష్ఠులు, రాత్రికాలాల యక్ష గానాలు, తోలుబొమ్మలాటలు జరుగుచుండెను.
గురు, మహాప్రధాన, సామంత, సేనాపతి, ద్వారపాలక, అవసరిక, ఘటికా నిర్థారక, నటక, లేఖక, పౌరాణిక, పురోహిత, జ్యౌతీషక, కార్యజ, విద్వాంసక, దేవతార్చక, మాలాకారక, పరిమళకారక, చేష్టాధికార, గజాధికార, అశ్వాధికార, భాండాగారాధికార, ధాన్యాధికార, అంగరక్షక, సూత, సూద, భేతాళమత, తాంబూలిక, తాళవృంతక, పల్యకింకావాహక, ఛాత్రిక, దామరిక, కరాచిక, శారికాకీరమాలిక, పాదుకాధార, వర్తక, గాయక, వైణిక, శాకునిక, మాగధ, వైతాళిక, స్తుతిపాఠక, పరిహాసక, క్షారక, రజక, సౌచుక, చర్మకారక, ముద్రాదికారక, పురపాలక, గజవైద్య, అశ్వవైద్య, పశువైద్య, భేరీవాదక, మురజవాదక, కుంభకారక, చిత్రకారక, వ్యావహారక, మృగయ, పక్షివాహక, పణిహారిక, ఉగ్రాణాధికార, వైశ్యజనాదిగా డెబ్బదిరెండు నియోగాలవారు, వానిపై మహామండలేశ్వరు లైన బాహత్తర నియోగాధిపతులు ఆ ఉత్సవాలలో నేల ఈనినట్లు సంచరించు చుండిరి.
మహారాజనగరిలో వివాహమహాసభామందిరమందు క్రింద పరచిన రత్నకంబళ్ళపై, పట్టుపరుపులపై ఉపధానాల నానుకొని వారి వారి అధికారాల, పదవుల ననుసరించి మహాప్రభువు లంతా కూర్చుండిరి. వేయిమంది వేద వేదాంగ పారంగతులు వేదమంత్రాలు చదువుచుండిరి. దుర్జయవంశస్థులైన ఆంధ్ర క్షత్రియ వంశాలవారు, వెలనాటిచోడులు, చాళుక్యులు, పల్లవులు, కదంబులు, గాంగులు, గజపతులు కొందరు స్వయంగా విచ్చేసిరి. కొందరు తమ రాజవంశాలవారిని ప్రతినిధులుగా పంపిరి. ఆంధ్రసామ్రాజ్యం ప్రక్క దేశాలైన శౌణ, విదర్భ, చోడ, కేరళ, కొంకణ, అపరాంత, బల్లాల రాజులు తమ రాజప్రతినిధులను బహుమానాలతో పంపిరి.
గజములు, గుఱ్ఱములు దాస దాసీజనులు, బంగారము, రత్నఆభరణాలు, మంచిగంధపు వస్తువులు, ధనరాసులు, కస్తూరి, జవ్వాజి, పునుగు, అందుగుబంక, హిమవాలుక, కాశ్మీరకుసుమము, లవంగ, యాలకి, జాజికాయ, జాపత్రి, లవంగపట్ట, మంచిగంధతరువులు, వివిధ సువాసనతైలాలు, వివిధ ఫలాలు వధూవరులకు ప్రాభృతా ర్పించారు.
ఈలా అఖండవైభవంగా వివాహం జరిగిన నాల్గవనాటిరాత్రి శోభనమందిరంలో వధూవరులు ఒంటిగా కలుసుకొన్నారు.
ముమ్మడమ్మ కోర్కెలతో కరిగిపోతూ చిన్ననాటినుండి తనతో ఆడుకొన్న తన మనోనాథుడు, తన ఆత్మవిభుడు, తన గాటంపు చెలిమికాడు, తన భర్త అయి ఎదుట తల్పంపై కుమారస్వామివలె అధివసించియుండ సిగ్గుపడుతూ, కాంక్షతో నాథుడు తనకడకు చనుదేరడం కోరుతూ ఎదురుచూస్తున్నది. రుద్రదేవప్రభువు చెక్కుచెదరక ఒక ఘటికాకాలం కదలకుండా ఎక్కడో చూపులతో అలాగే కూర్చున్నాడు.
ముమ్మడాంబికకు రోషము, దుఃఖము, ఆశా వెలుగునీడలులా ప్రసరించి పోయినవి.
అప్పుడు రుద్రదేవుడు నిదానంగా మన్మథతల్పంనుండి క్రిందికి దిగి ఒయ్యారంగా నడుస్తూ ముమ్మక్కదగ్గరకు వచ్చి,
“మహారాణీ ! నా కో వ్రతమున్నది. అది గౌరీ ప్రియమైన అసిధారావ్రతం! అందుకనే నా జుట్టు పెంచుకుంటున్నాను చూడు. ఆ అసిధారా వ్రతోద్యాపన సమయం వచ్చేవరకు నీ పుత్రలాభోత్సవానికి అంకురారోపణ జరుగరాదు” అంటూ తన కిరీటముతీసి దీర్ఘ కుంతలాలు సడలించి “ప్రాణప్రియురాలైన నా రాణీ! ఈ నా వ్రత కేశభారము చూచావుకదా! స్త్రీలకుకూడా ఇంతటి సంపద ఉండబోదు సుమా! అందుకు పరమగోప్యమైన ఒక కారణం ఉన్నది. అది నా దీక్షాసమాప్తి కాగానే నీకు సంపూర్ణంగా తెలియబరుస్తాను” అంటూ ముమ్మక్కను గట్టిగా కౌగిలించుకొని, ఆమె నొసట ముద్దుగొని, “అందుకనే నేనీ కవచం నిద్దురలోకూడా విడవకూడదు సుమా! అని కౌగిలి సడలించి, వెనుక కేగి, క్రీడాతల్పముమీద పండుకొనక, చెంతనున్న సాధారణతల్పమీద పండుకొన్నది. వెంటనే ఆమెకు నిద్ర పట్టినది.
ఈ చరిత్రఅంతా అ దర్పణంలోనే రుద్రదేవికళ్ళ కీనాడు ప్రత్యక్షమైనది.
తనలో ఈనా డీ ఆలోచనలన్నీ రావడానికి మూలకారణం చాళుక్య వీరభద్రునితో కలిసి తాను వేటకు వెళ్ళడమే!
రుద్రప్రభువు కా అభ్యంతరమందిరాల నంటి ఒక ప్రత్యేకోద్యానవనమున్నది. రుద్రప్రభువు నగరు ఏకశిలకు తూర్పున నున్నది. ఆ నగరిలో వెలుపలి తోటకూ అభ్యంతరక్రీడావనానికి మధ్య ఎత్తయిన గోడ ఉన్నది.
ఈ రెండు ఉద్యానవనాలకూ మధ్య ఒక ద్వార మున్నది. అది దుర్భేదము. ఆ ద్వారము బంధించు నుపాయము ఒక్క రుద్రప్రభువునకు, వృద్ధదాదియగు చెమ్మసానికి, చెలి అయిన వీరమాంబకు గాక ఒరు లెరుగరు.
రుద్రదేవి : సముజ్జ్వలవేషాలంకృతయై అపరాజితాదేవిలా ఒక్కరిత ఆ సాయంకాలము ఆ నర్మోద్యానవనాన విహరిస్తున్నది. అలా బాలికలా ఆ తోటలో విహరించిన దినాలే రెండు మూడో ఇంతవర కా దేవి జీవితంలో!
ఆమె నగరిలో బాహ్యవనంలోనికి ఎవ్వరూ రాకూడదు. యువరాజదంపతులు అందు విహరించుటకే ఆ ఉద్యానవనము ఆ వనానికి రుద్రప్రభువు లోని తోటనుండి మరొక్కదారి ఉన్నది.
యువరాజు నగరి నంటి యువరాణి ముమ్మడాంబికాదేవి నగరున్నది. ముమ్మడాంబికాదేవి నగరులో ప్రత్యేకోద్యాన మున్నది. దానికీ, యువరాజోద్యానానికీ ద్వార మున్నది. దేవ్యుద్యానానికి బాహ్యోద్యానానికి వేరే ఒక దారి ఉన్నది. బాహ్యోద్యానానికి యువరాజు బాహ్యనగరిలోనుండి ఒక్కటే దారి ఉన్నది.
ఆ సాయంకాలం యువరాజు రుద్రప్రభువు దర్శనార్థం, దక్షిణ కళింగ విషయాలు చర్చించడానికి చాళుక్య వీరభద్ర ప్రభువును తోడ్కొని శివదేవయ్య మంత్రులు యువరాజనగరికి వచ్చి, ప్రభువు దర్శనం రాత్రి మొదటి ఝాము, మధ్యలో గాని కలుగదని దౌవారికలు విన్నవించినంత, శ్రీ శివదేవయ్యమంత్రి శ్రీ చాళుక్య వీరభద్రుని క్షమాపణ వేడుచు వారిని యువరాజు బాహ్యోద్యానవనానికి తీసుకొని వెళ్ళి అటు నిటు త్రిప్పుచు వారితో రాచకార్యా లెన్నో మాట్లాడుచుండెను.
ఇంతలో మహామంత్రి తనకు సంధ్యావందనపువేళ అయినదని ఆ తోటలోనే ఉన్న బ్రాహ్మణునిఇంటికి పోయి ఒక్కఘడియలో వత్తుననియు చెప్పి వెడలిపోయెను. 7
రుద్రదేవి పూలచెట్టుకూ పూలచెట్టుకూ వనదేవతలా తిరిగింది. రుద్రదేవి కేళాకూళికీ ఆనందలక్ష్మిలా తిరిగింది. చంద్రుని దివ్యామృతరూప రహస్యం తెలిసికొనడానికి విశ్వం చుట్టివచ్చే రోహిణిలా, ఆ ఆంధ్ర యువరాజ్ఞి ఆ తోటంతా తిరిగింది.
సామంతులలో, రాజోద్యోగులలో కొందరు తన్ను యువతి అని అనుమానిస్తున్నారు. తన తండ్రిగారి కాకతీయవంశంవారి ఈ మహాసామ్రాజ్యభారం వహించడానికి తాను జన్మాంతమూ ఈలా పురుషునిలా ఉండవలసినదేనా? స్త్రీగా రాజ్యాలు పాలించడానికే వీలులేదా? లోకానికి మూలాధారం శక్తి అని దేశికులే అన్నారే. సర్వదేవతలూ భండాసురుణ్ణి నిర్జించడానికి మహాయాగం సలిపినప్పుడు ఉద్భవించిన కామేశ్వరీమహాదేవి సకలసృష్ట్యద్భుతంగా ఆ భండాసురుణ్ణి నిర్జించ లేదా? స్త్రీ భయంకరసింహిక కాకపోతే చుట్టూవుండే పురుషులు నక్కలై ఆమెను పీక్కుతింటారు. తన చెల్లెలు గణపాంబిక అదృష్టవంతురాలా? తా నదృష్టవంతురాలా? చెల్లెలికిగూడ తన జీవితరహస్యం తెలుపడానికి వీలులేదని శివదేవుల ఆజ్ఞ. నాయనగారి ఆజ్ఞ.
తన ముద్దుచెల్లెలు లోకసమ్మోహమైన రూపంతో పెరిగింది. ఆటపాటలలో రాణివాసం అంతా ఆనందంతో ముంచెత్తేది. ఆమె బాలికయయ్యు తనతోపాటు వీరవిద్యలన్నీ నేర్చుకుంది. అయినా పురుషవేషంలో ఉన్న నాకన్న ఎన్నిరెట్లో ఆనందంగా ఉండేది. “అన్నగారూ” అని ఆమె తనయందు ఆ చిన్ననాటి రోజులలో చూపిన ప్రేమ, తనమెడచుట్టూ ఆ బాలిక చేతులుచుట్టి బుజ్జగించిన మాటలు, నారద గీతాలకు పాఠాలు నేర్పుతుండేవి!
ఆ గణపాంబాదేవి తనకన్న మూడేడులు చిన్న. ఆమెను పదునెనిమిదవ ఏటను ధరణికోట ప్రభువునకు ఇచ్చి వివాహంచేసిన దృశ్యాలు తనకు కలిగించిన ఆనందము వర్ణనాతీతం.
తన చెల్లెలు గణపాంబాదేవిని స్వస్తి. శ్రీ చతుస్సముద్రముద్రిత, నిఖిల వసుంధరా పరిపాలక, శ్రీమత్త్రినయనపల్లప ప్రాసాదాసాదిత, కృష్ణవేణీనదీ దక్షిణ షట్సహస్రావనీవల్లభ, భయలోభదుర్లభ, చోళచాళుక్య సామంత, మదానేకపమ్రృగేంద్ర, విభవామరేంద్ర, శ్రీమదమరేశ్వరదేవదివ్య శ్రీపదపద్మారాధక, పరబల సాధక, శ్రీధాన్యకటకపురవరాధీశ్వర, ప్రతాపలంకేశ్వర, కళిగళ మోళడక్కె, బెట్టరగవక్కె, గండరగండ, గండభేరుండ, జగమెచ్చుగండ, నన్ని మార్తాండ నామాది ప్రశస్తిసహిత, శ్రీమన్ మహామండలేశ్వర కోటకేత మహారాజ మనుమడు, శ్రీ కోట రుద్రరాజ మహామండలేశ్వరుల పుత్రరత్నమైన బేతరాజునకు వివాహము గావించినారు. ఆ వివాహ వైభవం భరతఖండంలో, సర్వ మండలంలో, దివ్యలోకాలలో కథలుగా చెప్పుకొన్నారని కవులు వర్ణించిరి. గణపాంబ బేతరాజుసౌందర్యం కవులు పాడగా విన్నది. ఆయన తన భర్త అని తండ్రి నిర్ణయించిన మరుసటి క్షణంలో ఆమె విరిసిన దిరిసెన పూవులామంజులత తాల్చినదాయెను. ఆమె విశ్వాధినేత నారాయణుని చేపట్టు వార్నిధికుమారిక కమలాలయలా ఒప్పినదాయెను.
చెల్లెలి వివాహవైభవము తలచుకొంటూ, తాను తండ్రికి దక్షిణభుజమై వెలనాటిచోడుల సామంతుల జయించి తెచ్చిన ధనరాసులు తన చెల్లెలికి స్త్రీధనంగా ఇచ్చిన దృశ్యము భావిస్తూ రుద్రదేవి పులకాంకురములు దాల్చెను.
ఆనాటి వేషమేమి? ఈనాటి వేషమేమి? తన ఈనాటి వేషంకన్న, భర్తను చేరబోయే తన చెల్లెలు గణపాంబాదేవి ఎక్కువ అందంగా ఉండెనా? కాక! ఆమె బాలికగా పెరిగెను. రాజకన్యలు నేర్వవలసిన విద్యలన్నీ బాలికవలె నేర్చుకొన్నది. ఆమె నిశ్శంకగా తమ సవతితల్లుల అన్నగారు శ్రీ జాయప మహాప్రభువు శిష్యురాలై నాట్యం నేర్చుకొన్నది. తాను బాలునిలా నేర్చుకొన్నది, హావభావవిలాసాలలో చెల్లి ముద్దులు మూటగట్టే ఉషాదేవిలా ఉంటే తా నొక ఆడంగి అబ్బాయిలా నాట్యం నేర్చుకొన్నది.
తన చెల్లి మహావిద్వాంసుడైన మహావైణికుడు శ్రీ సత్రము బొల్లమరాజార్యునికడ సంగీతమును, సర్వవిద్యలు వేదస్వరూపులైన ఈశ్వరసూరి పండితులు విద్యాగురువుగా తనతోపాటు నేర్చుకొన్నది. పాడే సమయంలో తన గొంతుక చెల్లెలి గొంతుకలా పంచమస్వర శ్రుతినే పలికేది. అందుకని తానెప్పుడు మంద్రస్థాయిలో పాడుకొనునది.
ఏమి టీ ఆలోచనలు? ఎందుకు ఈ సాయంకాలము శ్రీ బాబయ్యగారు, శివదేశికులవారు తనతో రాచకార్యాలు మాటలాడడానికి వస్తామన్నారు? లోనికి పోవాలి! అయినా వారు రాగానే వార్త వచ్చునుకదా! ముమ్మడమ్మ ఎంతవెఱ్ఱి బాగులబాలిక! తన్ను పురుషునిగా ఎంచి సీత రాముని ప్రేమించినట్లు ప్రేమించినది పార్వతి శివుని ప్రేమించినట్లు ప్రేమించినది. పాపం, ఆ బాలికకు నిజం తెలిస్తే ఎంత బాధపడుతుందో? స్త్రీల హృదయం తనకు తెలుసును. తనకు మాత్రం తనహృదయం తెలుసునా! స్త్రీహృదయం స్త్రీకే తెలియదా? ఏ సమయానికి స్త్రీహృదయం ఏవిధంగా ప్రసరిస్తుందో స్త్రీకిని తెలియదు. తాను స్త్రీహృదయమూ, పురుషహృదయమూ తెలియలేని శిఖండి లా ఉండెను కాబోలు? పురుషుల హృదయం స్త్రీలకు నిమిషంలో అవగతం అయితీరుతుంది.
చాళుక్య వీరభద్ర ప్రభువు హృదయం ఏ రీతి ప్రవర్తిస్తున్నదో తాను గ్రహింపగలుగునా? పెండ్లికాని బాలికలవంక వారెట్లుందురో యను జిజ్ఞాసచే ఆయన తలెత్తిచూడడు. తాను బాలికనని ఆయన గ్రహించెనా? అట్లు తన్ను తదేకదీక్షతో గమనిస్తారేమి? ఆ మహాభాగుడు శ్రీరామునిలా ఏకపత్నీ వ్రతుడు కాగలడా? కాకపోయిన తనకేమి? ఆయన శ్రీకృష్ణునిలా పదారువేల మంది గోపికలను చేసుకుంటే తనకేమి? విష్ణువు బహుభార్యాప్రియుడు, పరమశివునకును గంగవిషయంలో బహుభార్యాత్వదోషం సంభవించినది. కాని శ్రీరామున కేకపత్నీత్వవ్రతఫలం దక్కింది. బ్రహ్మకూడా ఏకపత్నీవ్రతుడేనట. వీరభద్ర మహాభావానికి జాయ భద్రకాళి. ఆమె రుద్రభావమే!
తనతల తిరుగుచున్నది. కొంచెంసేపు పెద్దతోటలో తిరిగి మరీ రావచ్చును. వెన్నెల ఎంతో అందంగా ఉంది.
రుద్రాంబిక అంతకన్న అంతకన్న బాలిక అయి తలుపు చేటికనే తెరిపించి బాహ్యవనంలోనికి అడుగిడి నడిచింది.
శీతాకాలం గడచి వసంతకాలం చిన్న బాలకునిలాతోటలో ఆడుకుంటున్నది. మల్లె అంటులన్నీ చిగిర్చి మొగ్గలు తొడిగినవి.
మావిచెట్లన్నీ చిగురించి ఒత్తుగా పూతలతో పిందెలతో నిండిఉన్నాయి. అరటిబోదెలలో గెలలు సహస్రఫ్రణాలతో విష్ణునిపై వంగు శేషునిలా ఉన్నవి. వకుళపత్రాలు ఆవనం అంతాపరీమళాలు నివిరజిల్లుతున్నవి. సప్తమినాటి చంద్రుడు వెన్నెలతో హృదయాల లోతులను కలతపెట్టుతున్నాడు.
ప్రక్కనే ఒంటిమిట్ట, దూరంగా చిన్నకొండలు మేఘాలులా ఆకాశంలోకి తొంగిచూస్తున్నవి. లేడి రాణిలా దిక్కుల నాఘ్రాణిస్తూ, హంసలా నడుస్తూ క్రీడా సరస్సుకడ కామె చేరినది. ఆ వెన్నెలలో నీలి కలువపూలు అప్పుడే వయస్సు వచ్చిన కన్యహృదయంలా సౌరభాన్ని వెదజల్లుతున్నవి. ఆమెవంగి నీటిలోనుండి కాడతో ఒకపూవు పెరికి నీటిని తన పయ్యెద కొంగుతో తుడిచి, నిలుచుండి ఆ పూవు నాఘ్రాణించుచు ఎదుట ఒక పురుషునిచూచి, అలాగే మ్రాన్పడిపోయింది.
ఆ పురుషుడు ఈ దివ్యమూర్తిని చూచి చేష్టలుదక్కి అట్లే నిలుచుండి పోయినాడు.
8
ఆ పురుషుడు చాళుక్య వీరభద్రుడని గ్రహించగానే రుద్రదేవి గజగజ వణకినది. ఈ పురుషుడుకాదూ తన హృదయమంతా నిండి, తన జీవితమంతా ప్రసరిస్తున్నది? ఈ పురుషుడుకాదూ తాను చేయదలుచుకోని ఈ స్త్రీ వేషధారణము తనచేత చేయించింది?
ఈ కాసే వెన్నెలమూర్తిలా ఉన్నాడీ మహాభాగుడు. తా నెప్పుడూ చేయని మూర్ఖకార్యం చేసి, ఈ ఉత్తముని కంటబడినది. అతడు తన్నేమనుకొనునో? అతడు నిజం గ్రహించునా? గ్రహిస్తే ఏమిగానున్నదో! గ్రహిస్తే గ్రహించినవాడుగాక. తన స్త్రీజన్మ ఈనాటికి సార్థకమయింది. వెన్నెల ఉండి ఆకాశాన చంద్రుడు లేకుండుట ఎట్లు సాధ్యము?
తన్నుచూచి ఆ ప్రభువు ఆ ఉత్తమనాయకుడు విగ్రహమైఅలా నిలుచుండి పోయినాడు! ఈ వెన్నెల కూడుకొన పాలరాయై, ఈ ఉత్తమ చాళుక్యుడైనది కాబోలు?
ఇంతలో రుద్రదేవికి ఏదియో సిగ్గు, ఏదియో మహాకాంక్ష, ఏదియో అతిపూజాభావము కెరటాలై నిలువునా విరుచుకొనిపడినాయి.
ఈ మహాపురుషుని పాదాలకడ మోకరించి, “ప్రభూ! నేను నీ దాసిని, నీ భార్యను, నీ ప్రేయసిని, నీ అర్ధాంగిని. నన్ను పాలించుకో. న న్నీ రాజ్యపాలనాభారంనుండి శ్రీకృష్ణుడు రుక్మిణిని ఎత్తుకుపోయినట్లు ఎత్తుకుపో. నువ్వు పురుషుడవు. నేను స్త్రీని. నీకు నేను, నాకు నీవు! గోదావరీతీరంలో ఒక చిన్న ఆశ్రమం నిర్మించుకొని, ప్రేమతో, ప్రేమశ్రుతితో, ప్రేమరాగాలతో, ప్రేమగీతాలతో ఆ గోదావరీతరంగాల ఉయ్యాల లూగుతూ, ప్రవహిస్తూ, సర్వ ప్రకృతిలో భాగమై, కోకిలలతో కొమ్మకొమ్మకూ ఎగురుతూ, జక్కవజంటతో నీరరేఖలలో సుడులౌతూ, రెండుపూవులులా, రెండు లేత రెమ్మలులా, లోకానికి దూరంగా, లోక ప్రేమనవనీతంలో కణాలవుతూ ప్రేమోపనిషన్మంత్రంలో మంత్రవ్యాఖ్యానాలవుతూ తరింపకూడదా ప్రభూ!” అని తన్నర్పించుకుందామని రుద్రదేవి అనుకొన్నది.
ఎంత ఉత్తమమైనా, స్త్రీ పురుష ప్రేమ, వ్యక్తి మాత్ర సంబంధంకలది. ప్రేమికులు లోకంలో ఇద్దరే. వారి కింక ఏమి ఉంది? లోకం ఏమవుతుంది? తల్లి దండ్రులులేని బిడ్డలు, భర్తలులేని భార్యలు, వికలాంగులై, తమ్ముపోషించుకోలేని పురుషులు, రోగపీడితులైన నరులు, జరాదుఃఖితులై అసహాయులైన మానవులు, క్రూరులచే హింసించబడే సాధువులు, క్షామదేవత పాదాల నలిగిపోయే జనులు, కోటానుకోట్ల జనులు, వారి చిన్న చిన్న గ్రామాలు, వారివృత్తులు వారి వ్యవసాయాలు, వారి ఆనందాలు, శాంత ప్రవాహాలైన వారి జీవితాలు ఇవి అన్నీ ధర్మం నెరవేర్చడానికి భయపడే ప్రభువువల్ల వంచితమై అపశ్రుతిస్వరూపమై ప్రళయంలో మగ్గిపోవునుకదా!
అలాంటి హీనరాజశాబకం తాను కాదనుకోడం ఎంత అధర్మము, ఎంత నీరస సవిర్వేదము! మహాధన్వి అయిన అర్జునుడు ఆ మహాదోషం ఆచరింపబోతే భగవానుడు శ్రీకృష్ణు డాతనిని రక్షించాడు. తన్నెవ్వ రిక్కడ రక్షించేది? తానే తనకు శ్రీకృష్ణుడౌనుగాక!
ఆమె వెనక్కు తిరిగి, ఆ వెన్నెలలో ఆ వసంతయానినీవికాసంలో, ఆ మత్తపుష్పసౌరభాలలో, అ శకుంతకలకలారావగాఢగీతికలలో అన్నికలలూ అక్కడే దిగజార్చి, కఠిన ధర్మాభిముఖయై పరుగెత్తి పోయింది.
• • •
ఎవ రా దేవి? ఏ లోకాలనుండి దిగివచ్చింది? ఎందుకు వచ్చింది?
కాకతీయ కులదేవత కాకతీదేవియా? ఆమెకు సైదోడు ఏకవీరయా?
ఈ లాంటి అందం లోకములో ఉండదు. ఆమె స్త్రీ కాదు, సౌందర్యవతీ కాదు! ఆమె స్త్రీ త్వాతీతమైన ఒక మహాభావం, సౌందర్యమూలమైన దివ్యాతి దివ్య సౌందర్యం! ఆమె స్వప్నాలమించిన స్వప్నం! ఎవ రీ బాల? వెన్నెలలో వచ్చి వెన్నెలలో కరిగిపోయినది. “నువ్వెవరవు దేవీ! అచ్చరలను నలుపు చేయ నారాయణు డూర్వశిని పుట్టించాడు. ఆ ఊర్వశీ దివ్యతేజస్సును మిణుగురు నొనర్చు మహాతేజస్సువా?” తన కా నిమేషము చైతన్యమే తప్పినది. కన్నులు మూతలు పడలేదేమి? తన పెదవులు మాటలేని కదలిక అయినా పొందలేక పోయిన దేమి?
ఈ మూర్తి తనకు సన్నిహితము, దూరమును! ఆ బాలికనలో తాను కనిన స్వప్నాలు, తాను రచించుకొన్న అమృతగానాలు, అణువులై ఈ రూపును పొందినవే. క్షణమాత్రం కన్నులు మూసుకొన్న తన కర్ణాలకు ఆమె సౌందర్యాలు ఏవో శారద వీణాగానాలై వినిపించిన వేమి?
దేశికు లీ సౌందర్యదర్శనానికా న న్నీ వనంలో, వెన్నెలలో వదలి వెళ్ళి పోయారు?
తనతో ఆఖేటక్రీడకు వేంచేసిన ఒక గుప్తభావము, సర్వగోప్యాలువదలి తన కీ పవిత్ర ముహూర్తంలో ప్రత్యక్షమైనదా?
“దేవీ! ఆంధ్ర ప్రజాహృదయ నటద్దివ్యచరణ స్వర్ణమంజీర గానజీవితా! ఈ పవిత్రక్షణమే నాకు సర్వానుభూతిపుంజమై, ఇంకనుంచి ఒక్కణ్ణే ఈ జీవిత పథాల్లో యాత్రచేయ ఆదేశించినావా?”
ఆతడు కరగిపోయినాడు. గంభీరజీవియై, మహావీరుడై, అతిరథుడై, దుష్ట తురగ రేఖారేవంతుడై, గజసాహిణై, నరలోకసుందరుడై, శత్రుమత్తగజసింహమైన ఆ ఉత్తమచాళుక్యుడు త న్నలమివేసిన లోకోత్తరప్రేమశక్తిచే కరగి, అమృతబిందుద్వయాంకితలోచనాంచలు డయ్యాడు.
“ఏమయ్యా వీరభద్రప్రభూ! వెన్నెలలో స్వప్నాలు కంటున్నావా? మూయబడిన ఆ గుమ్మంవంక అరమూతలు కన్నులు చూచేవు ఏ మహానిధి ఆవెనుక ఉందనుకున్నావు?”
శివదేవయ్య మాటలు స్వప్నమధ్యంలో సముద్రఘోషలా వినబడి, వీరభద్రప్రభువు ఉలిక్కిపడి సిగ్గుతో వివర్ణముఖుడై, మరల ధైర్యం చిక్కబట్టి, “ఒక దేవీ ప్రత్యక్షమై మాయమైనది - గురుదేవా!” అన్నాడు.
శివదేవయ్య, ఆ ఇరువురు త్రిలింగదేశ మహావ్యక్తులూ ఒక్కముహూర్త మాత్రం తారసిల్లి విడిపోవడం చెట్లచాటునుండి గమనించినాడు. ఆయన గమనించి నాడని చాళుక్య వీరభద్రుడు గ్రహించుకొన్నాడు. వీరభద్రుడది గ్రహించాడని శివదేవయ్య దేశికులు అర్థంచేసికొన్నారు. ఒకరివైపు ఒకరు ఒకనిమేషం పారజూచి పక్కున నవ్వుకొన్నారు.
ఇరువురూ కలసి నెమ్మదిగా యువరాజు నగరిలోకి వెళ్లుచుండగా, సేవకులు, లేఖకులు, దౌవారికులు, కంచుకులు, అంగరక్షకులు వంగి నమస్కరించుచుండిరి. సభామందిరాలు గడచి ఆలోచనామందిరములోకి ఒక దౌవారికుడు దారిచూపుచుండ పోయి అందు సుఖాసనాల ఆసీనులయ్యారు.
శివ : ప్రభూ! కళింగుడు సింహాద్రికడ దండువిడిసి, రాణ్మహేంద్రవరం వరకూయుద్ధయాత్ర సాగించి కోనసీమమండల ప్రభువులు హైహయులనోడించి, గోదావరిదాటి నిడుదప్రోలుపై పడనున్నాడని మీకు తెలిసిన వేగునమ్మకమైనదేనా ?
వీర : గురుదేవా! ఆ వేగు నడిపింది మా నాయనగారి అంతరంగిక సేనాపతి, సోమనాథదేవులు. ఆ బ్రాహ్మణశ్రేష్ఠుడు చాణక్యదేవునకు గురువు కాదగిన ప్రతిభాశాలి!
శివ : కాళింగుని ఈ ఉన్మదానికి కారణం?
వీర : మన రాజ్యంలో ఉన్న కొందరు పెద్దలట!
శివ : ఎవరు వారు?
9
యువరాజు లోనికివచ్చి దేశికులకు నమస్కరించి, వీరభద్రుని నమస్కార మందుకొని పీఠముపై నాసీను డయ్యెను.
యువరాజు చూపులో, మాటలలో, నడవడిలో తొందరపాటుగాని త్రపాభావంగాని ఇసుమంతైనా గోచరించుటలేదు.
రుద్ర : కాబట్టి బాబయ్యగా రేమంటారు? వెంటనే కటకంపైకి ఎవర్ని పంపాలని?
శివ : ఇందులూరి పెదగన్నణమంత్రిని లక్ష కాల్బలంతో ఇందుశేఖరమహారాజుకు సహాయంగా పంపించవలసి ఉంటుంది.
వీర : ప్రభూ! నేను అయిదువందల ఏనుగులతో, రెండువేల ఆశ్వికులతో వారికి బాసట అవుతాను.
రుద్ర : చాళుక్యప్రభూ! మీరు ఇక్కడే ఉండండి. ఈ దేశం మీదికి శౌణయాదవులు ఏక్షణంలోనైనా విరుచుకుపడవచ్చును. అందుకనినేను ఒకవిధానం ఆలోచించాను. గాండ్లనగర ప్రభువు, రేచర్ల గణనాథుల చెంత ఏబదివేల విలుకాండ్రు ఉన్నారు. ఆయన మౌద్గల్యాతీరాన్నుంచి ససైన్యంగా బయలుదేరి గోదావరినది దాటి ఈశాన్యంగా సింహాద్రి పోయి అక్కడ కళింగప్రభువైన అనంగ భీమదేవుని తలపడగా, వేంగీవిషయాధినాథుడు కాలపనాయకులవారు ఇందులూరి పెదగన్నణామాత్యప్రభువును కలిసి గోదావరి ఉత్తరంగాపోయి ఇటువైపునుండి అనంగభీముని తాకవలసింది. ఈ రెండు మహాగ్నులమధ్య పడి కాళింగుడు నాశనమైపోవుగాక.
శివ : ప్రభువు చక్కగా ఆలోచించారు. అదే సమంజసమయిన యుద్ధ యాత్రావిధానము.
రుద్ర : బాబయ్యగారూ! తాము మన ఆలోచనకు తగిన ఆజ్ఞలు పంపించండి. ఇంక మేము సెలవు తీసికొనవచ్చునా?
మువ్వురూ వారివారి పీఠాలనుండి లేచిరి. శివదేవయ్య, చాళుక్య వీరభద్రుడు నిజమందిరముల కేగిరి.
వా రిరువురు వెళ్ళినను, యువమహారాజు తిరుగ తన ఆసనంమీద అధివసించినారు. ఇంతలో దౌవారికుడు లోని కరుదెంచి “జయము జయము మహా ప్రభూ! శ్రీ విరియాల గొంకప్రభువు వేంచేసినారు” అని విన్నవించెను.
మహారాజు వారిని ప్రవేశపెట్టుమని అనుజ్ఞ ఇచ్చెను. ఇంతలో వేగుదళ నాయకుడు గొంకప్రభువు లోనికి విచ్చేసి రుద్రదేవమహారాజుకడ మోకరించి, లేచి, ప్రభువుచూపిన ఉచితాసనంపై అధివసించి “మహాప్రభూ! గోన గన్నయ్య చండప్రచండుడు. ఆదవోని ప్రభువుకు సామంతుడు కోసగిమైలి, గన్నారెడ్డి సైన్యాలతో తుంగభద్రాప్రాంత అరణ్యాలలో ఉన్నాడని తెలిసి పదిదినాలలో హుటాహుటి ప్రయాణంచేసి ఆ మహారణ్యం చేరుకున్నాడు.
“గన్నయ్య సైన్యాలతో మూడు గవ్యూతులలో ఉన్నాడనిన్నీ, తమ రాక అతనికి ఏమీ తెలిసినట్లు లేదనిన్నీ వేగులు విన్నవించుకున్నారు. కోసగినగర ప్రభువు మైలపనాయకుడు చిరునవ్వు నవ్వుకుంటూ అశ్వదళాన్ని తూర్పుగా పొమ్మన్నాడు; పడమటగా గజయుధాన్ని సాగమన్నాడు. తాను రధాలతో కాల్బలాన్ని నడుపుకుంటూ వస్తున్నాడు. ఉత్తరంగా సగం కాల్బలం తుంగభద్రఒడ్డుననే వచ్చి గన్నయ్య సైన్యాన్ని పొదువ మన్నాడు. భేరీలు ఢం ఢం ఢం, ఢాం ఢాం ఢం ఢం ఢం అని మ్రోగగానే ఆ గుర్తుకు అన్నిసైన్యాలు సాగా లనిన్నీ గుర్తు చెప్పాడు.
“గన్నారెడ్డి సైన్యాలు ఒక అర్ధగవ్యూతిలో ఉన్నవనగా భేరీలు సంకేత ప్రకారం మ్రోగించాడు. అనేకవేల దుక్కుల కుంభవృష్టి కురిసినప్పుడు పొంగి ఉరికే ప్రళయతుంగాజలాలులా సైన్యాలు ముందుకు ఉరికాయి. ఆ మహోన్నత వృక్షాలలో, ముళ్ళడొంకల్లో సైన్యాలు పెళ్ళున ఉరికినవి. ‘ఆఁ’ అని అనే లోపలే ఇంకో కాల్బలం ఎదుటబడింది. గుర్రాలు కుడివైపునుంచి, ఏనుగులు ఎడమవైపు నుంచి దావానలం కప్పినట్లు, కొండలు విరుచుకు పడ్డట్లు వచ్చినవి. నాల్గుసైన్యాలు ఒకదాని నొకటి తాకి, ఆ వట్టితాకడంవల్ల కొన్ని కాల్బలాలు, అశ్వాలు, ఏనుగులు హతమారినవి.
“అన్నిబలాలు కళ్ళుతెరచి తాము తమ్మే చంపుకుంటున్నామని తెలుసుకొనే లోపలే ఆకాశంనుంచి భయంకరమైన బాణాలవాన మనుష్యుల్ని, అశ్వికుల్ని, అశ్వాల్ని, హస్తిపకుల్ని, గజాల్ని, కాల్బలాన్ని ముక్కలుగా చెండాడడంప్రారంభించింది. తల యెత్తితే తీవ్రబాణాలు నిలువునా కూలుస్తున్నవి. ఆ గడబిడలో, ఆ చిందరవందరలో ఎవరికీ ఏమీ తెలియటం లేదు. విరుచుకుపడే విధిలా బాణాలు ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రాణం కొంటున్నవి. గుర్రాలు, ఏనుగులు తిరుగబడ్డాయి. ఉక్కిరిబిక్కిరి, కసకస తొక్కిసలాట. బాణాలు! బాణాలు!
“కోనగిమైలి ప్రభుని రథంమీద కురిసిన బాణాలవర్షం కరిగి నీరైంది. ఏభై గాయాలతో మైలపనాయకుడు పెళ్ళుమని విరుచుకుపడి విలవిల తన్నుకుంటూ చచ్చిపోయినాడు.”
“గోన గన్నారెడ్డిని పట్టుకునేందుకు వచ్చిన సైన్యంలో మూడవవంతుకూడా వెనక్కు పారిపోలేకపోయారు. గన్నారెడ్డి అడవుల్లో ఎక్కడనుంచో పకపక నవ్వు తున్నాట్ట.”
రుద్రప్రభువు ఆశ్చర్యంపొంది “ఏమిటి! గన్నారెడ్డి ఎంతటి దారుణానికి ఒడిగట్టినాడు. అతని దౌర్జన్యం అణచగల మేటి మన రాజ్యాలలో ఎవ్వరూ లేరా?” అని గొంకప్రభువును ప్రశ్నించారు.
గొంక : మహాప్రభూ! ఒకరేమిటి? వేవురు ఉండిరాయను. వారందరూ ఆ గజదొంగపైకి దూకితీరుతారు.
రుద్ర : వారంరోజులక్రిందట కృష్ణవేణి ముఖగ్రామాలనుండి శ్రీ జాయప మహారాజులంవారితో సేనానాయకుడుగా వచ్చి సార్వభౌములవల్ల శ్రీశైలప్రాంత మార్కాపుర ప్రభువైన ఉప్పల సోమప్రభువు ప్రాణం హరించా డితడు అని వార్త వచ్చింది. ఆ విషయం మీకు తెలుసునా గొంకరాజుగారూ?
గొంక : చిత్తం మహారాజా ! ఆ విషయం మరీ దారుణమండీ. వర్ధమానపుర ప్రభువు కుమారులకు ఆదవోనివారి అమ్మాయి అన్నాంబికాదేవిని ఇవ్వడానికి నిశ్చయించడం, ఆ వివాహానికి అనేక వీరులతో లకుమయారెడ్డి తర్లి వెళ్ళడం, మహాప్రభువులు, మంత్రులు ఆశీర్వచనాలతో వధూవరులకు బహుమతులు పంపడం జరిగింది.
రుద్ర : అవును. అది అంతా మాకు తెలుసును. ఆ పీటలమీద పెళ్ళి చెడగొట్టాడీ గజదొంగే!
గొంక : అవధారు మహారాజా! ఆ పెళ్ళి అలాచెడగొట్టి, ఈగన్నయ్య పెళ్ళి కొడుకును ఎత్తుకు పారిపోయి, మరి వారంరోజులకు వర్ధమానపురం తిరిగి పంపాడట! వివాహానికి ఉప్పల సోమప్రభువు వచ్చి, మీకు గోన గన్నయ్య తల చూపిస్తానని రాజలోకం ఎదుట ప్రగల్భాలాడి, తిన్నగా తన నగరానికి వేంచేస్తున్నాడట.
రుద్ర : మంచిది. గొంక : దారిలో విఠలధరణీశుడు, సూరనరెడ్డి కొద్దిసైన్యంతో ఉప్పల సోమునికి ఎదురుపడ్డారట. పాపం ఉప్పల సోమప్రభువుతో వేయిమంది సైనికులే ఉన్నారట! ఆ గజదొంగలతో నాలుగువేలమంది రాక్షసు లున్నారట.
రుద్ర : గజదొంగలబలం ఎప్పుడూ అంతేకదా, గొంకప్రభూ!
గొంక : చిత్తం! చిత్తం సోమరాజు, “ఇదా మగతనం మా బలగం తక్కువ అని చూచి ఈలా చేయడానికి వచ్చారు వికృష్టులు” అని అరచాడట !
రుద్ర : ఆఁ!
గొంక : ఆ వెంట ఎక్కడినుంచి ఉరికాడో గన్నారెడ్డి నవ్వుకుంటూ కత్తి ఝుళిపిస్తూ వచ్చాడట.
రుద్రప్రభువు ముందుకువంగి “ఆ తర్వాత ఏమయిందీ?” అని అడిగినారు.
10
గొంకరాజు ప్రభువునుద్దేశించి ఉప్పల సోమప్రభుని గాథను ఇల్లా మనవిచేసినవాడాయెను.
“మహాప్రభూ! సేవకుడును. అప్పుడు గన్నారెడ్డి ఉప్పల సోమరాజును చూచి, “ఓయీ! మగవాడా! ఓయీ మహా కఠినప్రతిజ్ఞ పట్టినవాడా! నువ్వు నా తల రాజలోకం పాదాలముందర చెండులా పడవేస్తా నన్నావట. ఇదిగో నేను, ఇది నా తల. నీ సైన్యం నా సైన్యం యుద్ధానికి దిగ నవసరం లేదు. నీ సైన్యం యావత్తూ ఇదివరకే నా పక్షం తిరిగిపోయింది. ఇక నువ్వూ నేనే ద్వంద్వయుద్ధం చేద్దాము. నువ్వు ఖడ్గయుద్ధంలో ఆరితేరిన మగటిమి కలవాడనని ఛప్పన్నదేశాలూ పేరుపొందావు. నేను గజదొంగను. నువ్వు నా తల కొట్టినావా ఎవ్వరుగాని నీ జోలికిరారు. నీ దేశంలో దిగబెడ్తారు. ఎంత చెడిపోయినా నేను శ్రీ బుద్ధారెడ్డిప్రభువు కుమారుణ్ణి. అతడు నా తమ్ముడు విఠలప్రభువు. అతడు నా మాట పాలన అవునట్లు చూడగలవాడు అని చెప్పి పకపక నవ్వాడట.
“మహాప్రభువులు ఉప్పల సోముని ఖడ్గయుద్ధ నిపుణత్వం ఎరుగుదురు గదా! ఖడ్గ, కరవాల, భిండివాల, ఛురికా యుద్ధాలలో లోకప్రఖ్యాతి పొందిన ఉప్పల సోముడు గోన గన్నయ్యలా ఆరడుగులపైన పొడుగువాడు. విశాలమైన వక్షం కలవాడు దీర్ఘబాహువులవాడు, మొక్కవోని పరాక్రమం కలవాడు. భీకరమైన తేనెకన్నులు కలవాడు. కండలు పట్టిన దేహం కలవాడు, గోన గన్నారెడ్డి మాటలు పూర్తికాకుండా మెరుపువేగంతో కత్తితీయడం, పిడుగు వేగంతో గన్నయ్యమీదికి ఉరికి కత్తినెత్తి అతని శిరస్సుపై అఖండ శక్తితో వేశాడు. ఆ వ్రేటుతో గన్నయ్య ఖండితమస్తకుడై పడిపోవలసిందే. “కాని గన్నయ్య మెరుపునుమించిన వేగంతో వెనక్కు ఉరికి ఆ వ్రేటు తప్పించుకొన్నాడు. అక్కడనుండి పకపక నవ్వుతూ, ఉప్పల సోముని అపహాస్యంచేస్తూ, గోన గన్నయ్య చేసిన యుద్ధం దేవతలుచూసి ఆనందించినారట,”
రుద్ర : గన్నయ్య కత్తియుద్ధంలో అంత మొనగాడా!
గొంక : దివ్యచిత్తం మహారాజా! ఆనాడు ఉప్పల సోమప్రభువు చూపిన కత్తియుద్ధ విచిత్రాలు ఇదివర కెన్నడూ ఎవ్వరూ చూపలేదట! గన్నయ్య “ఓయి ఉప్పల సోమా! తిన్నఇంటికి వాసాలు లెక్కపెట్టవూ, వాసా లెన్ని? నువ్వా రుద్రప్రభువును సింహాసనంమీదనుంచి లాగిపారవేసే అపరరావణాసురుడవు? ఓహో కొత్తచక్రవర్తీ! జాయపమహారాజభృత్యా! ఉప్పుచేపలుతినే అఖండవీరా! ఏదిరా నీ కరవాల విక్రమము? ఆడదాని చేతికూడు తినవేమి? ఆదోనివారూ, మా పినతండ్రిగారూ మంచి హంతకుణ్ని చేరదీశారు. ఆ హంతకుడు ఉప్పుతిని ముప్పందుం అవుతాడట!” ఈలాటి మాటలంటూ ప్రళయనాట్యమే చేశాడట. అంతటి వీరుడూ, ఉప్పల సోమన్న చెమటలు కారిపోవగా యుద్ధం చేస్తూన్నాడట, గరుడప్లుతంతో పైకెగిరి, గోనవారిబాలుడు కత్తి పై కెత్తేసరికి వంగి గన్నయ్యపొట్టలో పొడవ బోగా గన్నయ్య పకపక నవ్వి పర్వతచక్రమణంచేసి కాలిజోడుతో ఆ కత్తిని పక్కకుతన్ని, వెంటనే కుడ్యబంధన విధానాన కత్తిని మూడు నిలువు కోతలులాగి క్రిందికికొట్టి కత్తితో చక్రధారికా ప్రయోగం చేసి ఉప్పల సోముని తల ఆకాశమునకు ఎగురగొట్టాడట!
రుద్ర: హర! హరా! ఏమి దారుణము! ఎంతటి వీరునికి ఎంతగతి పట్టింది. గొంకప్రభూ! గన్నయ్య గజదొంగయై, ఈలా పాడయిపోయినా డేమి?
గొంక : మహా ప్రభువులకు తెలియని రహస్యాలున్నాయా?
రుద్ర: మీ రా దొంగవిషయం జాగ్రత్తగా కనుక్కోండి. ఇది మా ఆజ్ఞ.
విర్యాల గొంకరాజు యువమహారాజుకడ సెలవుతీసికొని వెళ్ళిపోయాడు.
మహారాజు వెంటనే లేచి దౌవారికలు ఆవునేతి కాగడాలతో దారిచూప అభ్యంతర మందిరాలలోని పూజాగృహానకు పోయి, పురోహితుడు ప్రసాద మందీయ కన్నుల కద్దుకొని సేవించి, మహాననగృహాలలో భోజన మందిరానకు పోయినారు.
అక్కడ మణులు పొదిగిన దంతపుపీఠంపై మహారాజు అధివసించారు. ఎదుట బంగారపు అరటిఆకు పెద్ద అరటిఆకులో ఉంచబడినది. ఆ బంగారపు ఆకుచుట్టూ, బంగారపు గిన్నెలలో కూరలు, పులుసులూ, పచ్చళ్ళు ఉంచబడినవి. వీర శైవులు మాంసాదులు తినరు. లింగము కట్టుకున్న మనుష్యుడు మధు మాంసాదులు వర్ణించితీరవలయును. కాకతీయప్రభువులు రుద్రదేవ చక్రవర్తి కాలంనుంచి మధుమాంసాదులను మానివేసిరి.
రుద్రదేవమహారాజు భోజన మారగించి, లేవగా పరిచారకలు బంగారు చెంబులతో నీరు కొనివచ్చి చేతులుకడిగి తుడిచినారు.
ప్రభువు తాంబూలమందిరములోనికి పోయి, ఒకపల్యంకపీఠంపై అధివసించగనే మహారాణి శ్రీ ముమ్మడాంబికాదేవి రా ననుమతి వేడినారని వార్త వచ్చినది.
రుద్రదేవ ప్రభువు లేచి చిరునవ్వుతో సంతోషంతో తన నగరులో నుండి ముమ్మడాంబికాదేవి నగరునకు పోవు మందిరాలవైపు నడుస్తూ ఎదురేగినవా రయిరి.
ఇంతలో క్రొక్కారు మెరుంగుతీవలా, ఆకాశాన్నుంచి దిగివచ్చే రతీదేవిలా మహేశ్వరునికై హైమవతి హృదయంలోంచి బయలువెడలిన దివ్యకాంక్షలా, ముమ్మడాంబిక లత్తుక అలంకరించిన పాదాల బంగారు గజ్జియలు, మంజీరాలు గల గలలాడ ఒయ్యారంగా, నడుస్తూ భర్త కెదురువచ్చినది. రుద్రప్రభువు చేతులు చాచి ముమ్మడాంబికచేతులు ప్రేమతో పట్టి “మహారాణీ! నామందిరానికి దయ చేయండి. మీకు పరమరహస్యం మనవిచేస్తాను. రండి, నా పూజామందిరానకు” అని అనునయించినారు.
మహారాజును, మహారాణియు కలిసి మహారాజు పూజామందిరానకు పోయినారు.
రుద్ర: దేవీ నా జీవితానికి అవసరమైతే మీరు తగిన సహాయం చేయగలరా?
ముమ్మ: ప్రభూ! మీరు నా దైవము; మీరే నా ప్రభువులు, మీరే నా జీవితము. నా సర్వస్వము మీకై అర్పించివేయడానికి నే నెప్పుడూ సిద్ధమే.
రుద్ర: దేవీ! అదిగో పూజామందిరం. అందులో పరమశివుడూ, విశాలాక్షీ, గణపతి, కుమారస్వామి మున్నగు దేవతలు అహూతులై ఉన్నారు. వారందరి సాక్షిగా నేను మనవిచేసే విషయాలు అత్యంత నిగూఢాలు. ఒకటి: మనరాజ్యం కోసము మా నాయనగారు చేయగూడని పని ఒకటిచేశారు. అది నేను భక్తితో తల దాల్చాను.
ముమ్మ : మహారాజా! తము ఆలోచించకుండా చేసినదే ఉత్తమము. ఇక ఆలోచించి చేసినపని ఉత్తమోత్తమమేగదా!
రుద్ర : వారే నాచేత ఆ వ్రతము పట్టించారు.
ముమ్మ : మహాప్రభూ! అది మహా ప్రసాదం.
రుద్రదేవ ప్రభువు పూజామండపంకడ మోకరించి పది విఘడియలు ప్రార్థించారు. అంత వారు లేచినవారై మహారాణిని తనదగ్గర కూర్చుండ ప్రార్థించారు. “ఈ రహస్యం మీరు ధైర్యంతో భరించాలి. పురుషులకు నాకున్న కుంతల సౌభాగ్యం ఎన్నడైనా చూశారా దేవీ?”
“లేదు. ఆ సౌభాగ్యం చూచిన నాకు అత్యంతాశ్చర్యం జనించింది.”
“నా ఈడులో నూనూగుమీసాలైనా రాని పురుషు లుంటారా దేవీ?”
“చిత్తం. ఆ విషయమూ నా కెప్పుడూ ఆశ్చర్యం కలగజేస్తూనే ఉంటుంది ప్రభూ!”
“శ్రీ గణపతి రుద్రదేవ చక్రవర్తికి పురుషసంతానము లేదు.”
“ఆఁ! ఏమి తాము వచించేది! నా కేదో దడవస్తున్నది? తాము ...? తా ...?”
“శ్రీగణపతి రుద్రదేవసార్వభౌములకు ఇద్దరు కొమార్తెలు.”
“ఇద్దరా? గణపాంబాదేవిగారు ఒక్కరేకాదా?”
“నేను చక్రవర్తి పెద్దకొమార్తెను నా పేరు రుద్రదేవి.”
ఈ విషయాలు రుద్రదేవి చెప్పడం ప్రారంభించినప్పటినుంచిన్నీ గజగజ వణకుచున్న ముమ్మడాంబిక కంట జలజల బాష్పవారి ప్రవహించి పోయినది. ఆమె పట్టలేక రుద్రదేవి ఒడిలో వాలి వెక్కివెక్కి ఏడ్చినది. ఆ క్షణం ఒక దివ్యసుందరవిగ్రహుడు శాపంచేత స్త్రీగా మారిపోతున్నట్లు ఆమె భావించుకొని మరియు దుఃఖించినది. తాను తన ఆత్మేశ్వరుని గాఢంగా కౌగలించుకుంటే ఆయన పురుషత్వము నశించిపోదని రుద్రదేవిని ఆ బాలిక ఇంకా గాఢంగా హృదయాని కుదుముకున్నది.
తనతెలివిలేమిచే తన పురుషుడు పురుషత్వం కోలుపోతున్నాడని ఆమె భావించుకొని గజగజ వణికిపోయినది. తనభర్త కేదో మహదాపద సంభవించినదని ఆమె శరఘాతచెందిన కపోతరాజును చూచిన కపోతిలా మూర్ఛపోయింది.
రుద్రదేవ ప్రభువు ‘ఎవరక్కడ?’ అని కేక వేసినారు పలువురు పరిచారికలు పరువిడి వచ్చి ముమ్మడమ్మకు శీతలోపచారాలు చేయగానే, ఆమె తెలివి నందింది.
“మహారాణీ! ఉపశమించండి. మీరంత బాధపడుదురని ఎరిగి ఉండిన్నీ నేను తొందరపడి చెప్పివేసినాను.”
“మహాప్రభూ! మీరు చెప్పేవిషయాలు నా కేమీ అర్థంకాలేదు.”
“నేను మీబోటి బాలికను. మా నాయనగారు పుత్రుని వాంఛించి, వాంఛించి, స్వయంభూదేవుని పూజించి, పూజించి నన్ను గన్నారు. ఎన్నాళ్ళో పిల్లలులేని వారికి నేను కలగడమే బ్రహ్మానందమైనది. కాని పుత్రికననే విచారము వారిని వెన్నంటింది. అప్పుడే విశ్వేశ్వర శివదేశికులు, ‘భగవంతుని విలాసాలు అర్థంచేసికొని పురుషుడు ఆనందించాలి. పరమశివుని కృపవల్ల కాకతీయసామ్రాజ్య విచ్ఛిన్నానికి శుంభనిశుంభాది రాక్షసు లెవరో ఉద్భవించి ఉంటారు. వారిని సంహరించడానికి దేవియే రుద్రదేవిగా ఉద్భవించి ఉంటుంది. అందుకని ఈ బాలికను కొమరునిగా పెంచవలసింది. తర్వాత కొమరుడు పుట్టితే, అప్పు డీమె బాలికయని తెలుపవచ్చును సార్వభౌమా!’ అని ఉపదేశించినారట. చెల్లీ! అప్పటినుండి నే నట్లా పెరిగినాను. వీరవిద్య లన్నీ నేర్చాను. నువ్వు నాబిడ్డవు. నువ్వు నా చెల్లివి. నా గర్భాన్ని కొమరుడు కలక్కపోతే నీపుత్రుడే నాకు పుత్రుడౌతాడుదేవీ! నువ్వు జాయపసేనాని కొమరితవు. ధైర్యంవీడి మొరకు స్త్రీలా ఈలా దుఃఖిస్తారా? నువ్వు కోరిన మహాపురుషుడు దేవలోకంలో ఉన్నా వానిని బట్టితెచ్చి నీకు సమర్పిస్తాను. మేమంతా చేసిన ఈ అన్యాయానికి క్షమించానని నా హృదయంమీద వ్రాలు” అని రుద్రమదేవి కంట తడిచేసినది.
ముమ్మడాంబిక రుద్రదేవి మోము నిమేషమాత్రం తిలకించి, కన్నీటితో తడిసిన పెదవులపై, మేఘాలమీద నిర్మలాకాశంలో వికసించిన పూర్ణచంద్రునిలా, నవ్వు వెలుగుతూ ఉండగా రుద్రమదేవి హృదయంమీద వాలింది.