గొబ్బెమ్మ పాట
గొబ్బీయళోయి గొబ్బిళ్ళు
సుబ్బీ గొబ్బెమ్మ సుఖమూ లియ్యావే
తామర పువ్వంటి తమ్ముణ్ణియ్యావే
చేమంతి పూవంటి చెల్లెల్నియ్యావే
అరటి పూవంటీ అక్కానివ్వావే
పున్నాగ పూవంటీ అన్నానివ్వవే
మొగలి పూవంటి మొగుణ్ణివ్వావె
కలువా పూవంటి కూతుర్నివ్వావె
మల్లెపూవంటీ మఱిదినివ్వావె
బంతి పూవంటి బావనివ్వావె
మామిడి పూవంటి మావనివ్వావె
గొబ్బిళ్ళోయి గొబ్బిళ్ళు
గొబ్బిళ్ళోయి గొబ్బిళ్ళు
కొలని దోపరికి గొబ్బిళ్ళు
యదుకుల స్వామికి గొబ్బిళ్ళు
కొండ గొడుగుగా గోవుల కాచిన
కొండక శిశువుకు గొబ్బిళ్ళో
దుండగంపు దైత్యుల కెల్లను తల
గుండు గుండనికి గొబ్బిళ్ళు
పాపవిధుల శిశుపాలుని గొట్టిన
కోపగానికిని గొబ్బిళ్ళు
యేపున కంసుని ఇడుముల బెట్టిన
గోప బాలునికి గొబ్బిళ్ళో
దండి వైరులను తరిమిన దనుజుల
గుండె బిగువునకు గొబ్బిళ్ళో
వెండి పైడియగు వేంకటగిరి పై
కొండలరాయనుకి గొబ్బిళ్ళో