గొప్పలుగ నీ కథలు

శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ తెలుగు కీర్తనలు

పల్లవి: 
గొప్పలుగ నీ కథలు వారెవావా
కుప్పలుగ పోస్తాము శివదేవా

దారుకావనాన నీవు దార్న పోవుచూ
కోరికోరి లింగరూపి వైతివంటగా
ఆపైన
ఏరి కోరి మనులకేవొ యిచ్చితంటగా

అమ్మ తల్లి నిన్ను చేరి కొలుచుచుండగా
తొంగి చూడ మరునిపైన కినిసితంటగా
అవ్వవ్వా
అంతటితో ఆగబోక కాల్చితంటగా

పార్వతమ్మ పట్టు బట్టి తపసు చేయగా
బ్రహ్మచారి వౌచు వెంట బడితివంటగా
అమ్మమ్మ
పట్టువిడచి తల్లి చేయి పట్టితంటగా

వెండికొండ కాపురమ్ము పెట్టి తంటగా
ఉండికూడ తిరిప మెత్తుచుందువంటగా
నాతండ్రీ!
తిరిపవౌచు వచ్చి కోర్కె లిత్తువంటగా

ఏన్గు పొట్ట దూరి అచట నిలిచితంటగా
దాని తలను తెచ్చి సుతున కతికితంటగా
ఓయబ్బో
గజముఖుని గణనాథుని చేసి తంటగా

త్రిదశవరుల కూడబెట్టి పెద్ద యెత్తుగా
త్రిపురమ్ముల గూల్ప దండు వెడలితంటగా
అయ్యయ్యో
సతికొరకై వగచి తపసు పూనితంటగా

రామరామరామ జపము చేతువంటగా
భామతోడ గుట్టువిప్పి చెప్పితంటగా
ఆహాహా
సచ్చిదానంద రూపివౌచు వెలుగుదంటగా

గొప్పలుగ నీ కథలు వారెవావా
కుప్పలుగ పోస్తాము శివదేవా