దోమరాజా!

దోమలమాట చెబుతా! పక్షికిలాగ రెక్కలు రెండూ ఏనుక్కిమల్లే తొండంఒకటి భగవంతుడు కట్టబెట్టాడూ! పండితులంతా విధంచెడి ఏకమై ఏనుగుతో జోడించి సమాసించారూ! వృత్తి రహిత దీపా లొచ్చి వహ్ని శలభ న్యాయాన్ని రద్దుచేస్తున్నాయీ! మునిసిపాలిటీలు జనం యొక్క నీటి యిబ్బంది గమనించి జనానికి ఇన్నినీళ్ళు వదులుకుని, తద్వారా పగటివేళ కూడా పని కలిపించాయీ! ఇవతల వాళ్లకి - దాని మొహం ఈడ్చా - చెముడనేది ఉందో లేదో కాస్త కనుక్కోడమేనా లేకుండా అడ్డంపడి చెవులు కొరకడం సహజంగా చేతవునూ! ఇహ, దోమలు మిడిసి పడ్డాయీ అంటే, వింతేమిటి వడ్డూర్యమేమిటి నా మొహం! ఇంత కమామీషు ఉంటూన్నప్పుడు వాటిని మిడిసేనా పడకుండా చావమన్నారా ఏమిటి! వాటి ప్రయోజకత్వానికి సాయం అవి ఏమూలో పడి ఉండకూడదూ అని కొందరు కోప్పడేది. కాని అది వ్యర్థకోపం, ములాధారంగా ఉండే పదార్థాలు వ్యాపకం కాకామానవు. పోనీ అందుకు ఒప్పుగోవచ్చుగాని, రాత్రింబగళ్లు నిద్రలేకుండా (ఆహారం లేకేం రోగం, బోలెడుంది!) వీటిని అనవసర సంచార ప్రచారాలు సాగించమని ఏడ్చినవా డెవడయ్యా, అని కొందరి ప్రశ్న కాని, ఏం చెప్పగలం? ఎవరికి ఎంతముట్టాలో అంతా ముడి తేగాని ఊరుకోరుమరి, మానవజాతి తమరికి బాకీ ఉన్నతిట్లూ చంపపెట్లూ అణాపైసల్తో వసూలు చేసుగోవాలని దోమల ఏడుపు గావును! అదీకాక, చేతుల్ని రెక్కలు అనికూడా పిలుస్తూంటారని గావును మానవులే ఎగిరిపడేవాళ్లుంటూన్నప్పుడు దోమలు ఆగుతాయా, వాటిని ఎవరైన ఆపగల్తుమా! అన్నట్టు, మానవుల్ని చెవులట్టుగుని ఆడించగలం గదా అని ఈ దోమలకి ఎంతగర్వం అనుకున్నారు, అవి రేవెట్టి రొదగా చెబుతూన్నా మనం వాటిని విసిరికొడతాంగాని! ఇంకోటిట! అవతల శివుణ్ణీ ఇవతల దోమల్నీ పెట్టి తూస్తేటా, ముల్లు దోమలవేపే చూపుతుందిట! ఎందుకంటేటా శివుడు పుణ్యాత్ములకి మాత్రం, కాశీమరణం లభించినవారికి మాత్రం, కుడిచెవిలో మాత్రం, తారకోపదేశం తీరుబడిని బట్టి చేస్తేచేస్తాడట, లేకపోతే లేదుట! కాని, దోమలో! చివరికి దురాత్ములైనా సరే, అకాశీ అయినాసరే, మరణం లభించకపోయినాసరే, కుడి ఎడమా లేకుండా, చెవి అయినాసరే కాకపోయినాసరే, రాత్రి రెండోఝాం వేళ యినాసరే-అవసరాన్ని బట్టి అప్పట్లో మరీ భారీగా అఠ్ఠ తారకోపదేశం కాకపోతే లెక్కేమిటన్నాను-తారకం అంటేలాగు గీరకోపదేశం చేస్తేగాని సర్దణిగి ఊరుకోవుట!! పోని ఇదంతాకూడా సత్యమేనని ఒప్పుగుని ఇదవుదాం అంటే మన్ని అవెక్కడ ఊరుకోనిస్తాయీ, వెఱ్ఱిమాటా! దోమలకి గాంధర్వంలో ప్రవేశం ఉండడంవల్ల మానవులకు మరీ చావొచ్చిపడింది. అయ్యా, నమ్ముతారో లేదో, ఎల్లాగైతేం మహా ఆఖండగానం తమదేఅంటూ అవి ప్రకటించుగునే ప్రత్యేకపు బడాయి ఎన్ని పుట్లనుకున్నారు, వీటి బడాయి తంపటేయ్యా! దోమలకి పుట్టుకతోటే తాండవం ఉందిగనక, దోమగానాన్ని ఏదో మామూలు పక్షిగానం కింద జమకట్టిపారెయ్యక, మాంచి యక్షగానంలాంటి నాటకవిశేషం అని, జనం ఒప్పుగుతీరక ఏంజేస్తారో చూస్తాంగా అని కొందరు దోమగాన విమర్శకులు వెనక హంగుచేసి వీట్లకి హుషారీ ఇస్తున్నారు. పోనీ, విమర్శలు ఏం జెయ్యగలవ్, ఏ ఒకదానికీ స్థిరత్వంగాని, ఏం రెండింటికీ సమత్వంగాని, ఏ మూడింటికీ సాపత్యంగాని ఉండకపోడం సహజంగదా అని, గాన ప్రియులైనా రాయల్లా మాట్టాడ కూరుకోకూడదూ, మనం బతిగిపోదుం!! వాళ్ళు ఈ విషయంలో మరీ పుణ్యం కట్టుగున్నారు. దోమగానం మిక్కిలి ఉత్కృష్టం అని వారు చచ్చు తెగేసి చెప్పి దాన్ని ఊహూ తెగపొగుడుతూండడం అల్లా ఉండగా, పైపెచ్చు ప్రతినిత్యమూ దోమనామస్మరణేనా చేస్తే పరానికేనా నయం అని తమలో తమరు ఒక రహస్య తీర్మానం చేసుగున్నారు. అందుకనే, ఈ రహస్యం తెలిసిన వాళ్లంతా పాడేటప్పుడు తానంవగైరా మిష కల్పించుగునీ, ఉత్తపుణ్యానికికూడా, “తద్దదోంద, దోందోంద దోంద, దో ఒ ఒ ఒ ఒ దొ ఓ ఒ ఓం దోం” అంటూ స్పష్టంగా దోమాంకిత నాదం వినపడనిస్తారు. ఈ సంగతి మరి దోమలు ఏ రేడియోలో పసికట్టాయో మరీ పేట్రేగిపోయి, గాయకులే తమ గానం మెచ్చింతరవాత మనుషుల లెక్కేమిటని చెప్పేసి, మానవులు కోరకపోయినాసరే, వద్దు పొమ్మన్నాసరే, మానకుండా, మానవులకి ఠోలీయేనా టిక్కట్టు ఖర్చులేని గానకళ దేశ కాలపాత్ర వివక్షతలు లేకుండా విరివిగా ప్రసాదిస్తున్నాయి.

ఇంత అసంఖ్యాకంగా సృష్టింపబడ్డ జంతువు వ్యర్థం అయిఉండదు, దీని ప్రయోజనం ఏమిటా అని కొందరు దీర్ఘాలోచనలో ఉన్నారు. వెనక పాంకరిచిన ఒక మనిషిని దోమలు మూగేసరికి అతడు నిద్దర్నించి లేచి కూచున్నట్టు కూచున్నాడట. దీనిసైజు వెనకటికంటే పెరిగిందనిన్నీ కేవలం పిచ్చిగంత పరిమాణం కొద్దికాలంలోనే పొందుతుందనిన్నీ కొందరు సూచించి ఏ ఆహారం - రక్తంకాక - దానికి సప్లైచేస్తే అది యింకా విజృంభిస్తుందో చూస్తున్నారు. బస్తీలన్నింటిలోనూ ఈ జంతువు దండిగా పుట్టి పెరగడానికి సక్రమమైన ఏర్పాట్లు చేస్తుంటారు. అంచేత ఓబస్తీకీ మరోబస్తీకీ చేతిబంతి, కాలిబంతి, వాలిబంతి, కర్రబంతి, తడకబంతిపోటీలు జరిగించినట్లే దోమబంతిపోటీలు పెట్టాలని కొందరు సెలవిచ్చారు. బస్తీ దోమ, మురుగుదోమ, నాటుదోమ, లంకదోమ, మడదోమ వగైరా దోమవిశేషాలపట్టీలు తయారుచేసి పంపిస్తే వాటిల్లో మిక్కిలి పొడుగుపట్టీకి గొప్ప బహుమతి ఇస్తాం అని ఒక పత్రికలో ప్రకటించడం వల్ల, ఆ పత్రిక పత్రికంతా సమూలంగా అమ్ముడైపోయింది. కోడిపందాలులాగ దోమపందాలు కూడా వెనకే ఉన్నట్టు ఒక శాసనంలో ఉన్న భాషకి తన అర్థమనిన్నీ తక్కిన అర్థాలు తీసేవాళ్ళకి ఆలోచన నిండుకుందనిన్నీ ఒకరు అనుకుంటున్నారు. కిటికీవగైరాలకి కటకటాలు వేయించడం నిద్దరికి పడ్డ కళేబరాల్ని దోమలు బయటికి మోసెయ్యకుండా ఉండడానికే అని ఒకాయన ఈ మధ్య నొక్కి వాదించి ఇంగ్లీషులో ఆగ్రహించాడు. ఎగిరే స్వభావం ఈ జంతువుకి ఉంది కనక, కొద్దికాలం దీన్ని తరిఫీయతుగాని చేస్తే, ఖర్చు లేని విమానం - 'కీ' యిస్తే పరిగెత్తే శకటం లాంటిది - తయారు కాకపోతుందా అని ఒక జపానీయుడు ఏక తలపోస్తున్నాడట! వేటలు అనేవి హిందు సాంప్రదాయంలో చాలా ఉన్నాయనిన్నీ, దోమవేటలోకూడా అరితేరి ఖండాంతరాల్లో మెప్పులుపొందిన హిందూ రాజకుమారులు ఉండేవారనిన్నీ చదువుకున్న వాళ్లు చెబుతూంటారు. వెనకే, తత్తుల్యులు ఇప్పుడూ ఉండచ్చు, దోమతెర్లు కట్టుగున్నవాళ్ళు, లోపల జేరి, ఒకటీ అరా దోమలనిమిత్తం రాష్ట్ర కలహంలో ఉంటూంటే, తెరలుకట్టుగోడానికి తడిలేనివాళ్ళు లోకక్షేమం నిమిత్తం మహాదోమ సంగ్రామంలో పనికొచ్చే బహిరంగపు దోమవేట అభ్యసిస్తూంటారు. పల్లెటూర్నించి బస్తీకి చుట్టం రావడం, అతనికి దోమ తెర సప్లైకాకపోడం జరిగితే, అతడు యథాశక్తిగా వేట నేర్చుగుతీరాలి. దోమలూ నల్లులూ కొత్త మనుషుల్ని నిమిషంలో పోలుస్తాయి. కుక్కల్లాగా అవి కూడా పసికడతాయేమో! రోజూ మనం కూర్చుంటూన్న పడక కుర్చీమీది నల్లులు మన్నికుట్టవ్, అంటే మనం స్వంతరక్తం ధారపోసి వాటిని పెంచుతున్నాం కనక మన యందు విశ్వాసం, అని కొందరన్నారు. రక్తం మన్దేగనక, రక్తస్పర్శ ఉండబట్టి పీడన మాన్తాయని కొందరన్నారు. కాని, పరాయివాడు వచ్చి, 'అమ్మయ్య' అంటూ సర్దుకోబోయేసరికి వాడికి వెంటనే అర్ఘ్యమిస్తాయి. దోమలధోరణి అల్లాంటిదే అప్పు డాపరాయివాడు 'మీరు ఈ బాధఎల్లా భరిస్తున్నారండి' అంటాడు. 'అబ్బే, నన్నేమీ చెయ్యవండి!, అంటాం మనం.

ఒకసారి ఒకబస్తీ స్నేహితుడింటికి ఆరుగురు వెళ్ళారు, ఇద్దరికి దోమ తెర సప్లై అయింది. కడం నలుగురూ మర్యాద కోసం ఇవతల చిక్కడ్డారు. చుట్టుపక్కల అడివి ఎదేనా రేగిందో ఏమో ఆరోజున దోమల పటాలాలు చాలా వచ్చాయట. వస్తునే తెర ఇవతల చిక్కడ్డ నలుగుర్నీ తణిఖీ ప్రారంభించాయి. కూచోనివ్వవ్, నుంచోనివ్వవ్, వెన్ను వాల్చనివ్వవ్, కునుకోనిస్తాయీ!! వీళ్లల్లో చిన్నప్పణ్ణించీ ఉక్కు రోషగాడు ఒకడున్నాడు. అతణ్ణి కొన్నొచ్చి కేటాయింపుగా పట్టుగున్నాయి. ఎవ్వర్నేనా దోమలు ఆవహిస్తే ఓపట్టాన్ని వదలవ్ - నడిచినా, పరిగెత్తినా, వాహనం ఎక్కినా సరే వదలవ్! గంగలో దిగాలిగాని గత్యంతరం లేదు. రోకలి పుచ్చుగు దంచినట్టు పడిలేస్తూ అతని నెత్తిమీద ఓ ఇరవైయ్యో ముప్పైయ్యో సమావేశించి, మనిషిని దిగదుడుపుకింద కట్టి ప్రదక్షిణాలు ప్రారంభించాయి. అతడు పళ్లు బిగించి వాటి కేసి చూస్తూ వీలైనంత వడిగా ఇటూ అటూ పరుగు ప్రారంభించాడు. దోమతెరలో వాళ్ళు కళ్లు మూసుగునే ఉండి, “అబ్బా! ఏముటోయ్!అల్లరీ! పరాయి సౌఖ్యం బొత్తిగా కిట్టదేమిటోయ్, నీకూ!' అని కేకేశారు. దాంతో అతని రోషానికి కారం రాసినట్టుయింది. 'సరే లెండోయ్' అని, అతను కూర్చుని పుస్తకం తీసి చదవడం మొదలెట్టాడు. కీనీడని జేరి దోమలు అతని వీపు లగాయిస్తున్నాయి. కడం వాళ్ళు, 'దీపం ఊదేస్తే దోమలు తగ్గుతాయి, దీపం తీసెయ్,” అన్నారు. ఎల్లాఅయితేం అతడు చదువుకోడానికి వీల్లేకుండా దీపం దిగదీశారు. గదంతా చీకటి వెల్తురూ ఎదీకాకుండా అయి, అతనికి కేవలం సంధెత్తినట్టయింది. ఈ దోసందులో ఒకదోమ రైంయ్యిమని గానం చేస్తూ విమానంలాగ అతని చెవిమీదుగా పోయి, అతని ముక్కుమీద వాలింది. అతను ఆసమయంలో తన కాలిమీద వాలబోతున్న మరొక దోమని గమనిస్తున్నాడు. తక్షణం ముక్కు మీదిది కుట్టింది. దాన్ని సాగదీసి కొట్టబోయేసరికి, తన ముక్కు ఊడిపడేటంత దెబ్బ ఛెళ్లున తనకే తగలగా, ఆదోమ మెత్తగా లేచి కటాకటీగా చక్కాపోయింది. అది ఎగిరి ఎక్కడ కెడుతుందో అని దాన్నే చూస్తూ అతడు నడవడంలో గదంతా ముసుగు ముసుగు ఉంది కాదా! - పడుకున్నవాళ్ల కంఠాలు తొక్కాడు 'నిన్ను తగలెయ్యోయ్' అంటూ వాళ్ళు కేకలూ తిట్లతో లేచి దీపం హెచ్చుచేశారు. అది గోడమీద వాలింది. మెల్లిగా శబ్దం చెయ్యకుండా, మాట్లాడవద్దని కడంవాళ్ళకి సంజ్ఞలు చేస్తూ, అతడు వెళ్లి దాన్ని ఒక్క చెంపకాయ తీశాడు. అతి సున్నితంగా దారితీసి దోమ పారిపోయింది. అతనికి దోమతోపాటు వేళ్ళుకూడా స్వాధీనం కాకుండా పోయాయి. 'అబ్బబ్బ' అని బాధపడుతూ కూడా అతడు దాన్ని వదల్లేదు. ఈలోపుగా బోలెడు దోమలు అతని నెత్తెక్కి తాండవిస్తున్నాయి - ఇంత ఘటం లేదు ఇల్లెక్కి పిండికొట్టిందని కాదూ, దోమసామెతా! అతను ఇందాకటి దోమని ఒక్కదాన్నే పట్టుగున్నాడు. అది అతనికి అందకుండా దూలందగ్గిరికి ఎగిరింది. అతను ఎగర్లేక ఊరుకుని, ఈ మాటు చెప్పులు కొనుక్కునేప్పుడు దోమవేటలో కూడా ఉపయోగపడేలాగు స్ప్రింగ్ చెప్పులు కొనుక్కోవాలను కున్నాడు. దానికేసే చూస్తూ, కిందకూర్చుని పుస్తకం విప్పి ఎదురుగుండా పెట్టుగున్నాడు. ఏమరుపాటుగా దాని గమనం కనిపెట్టే ఊహతో బుర్రవంచి చదవడం అభినయించాడు. కాని, అది ఏ వేపుకి ఎప్పుడు ఉడాయిస్తుందో అని పక్క బెదురుతోనే ఉన్నాడు. పాపం, అది కదిలి, దిగి, అతని చుట్టూ ఒక్క పెద్ద సున్నా చుట్టి, పుస్తకం మీద ఒక వేపున వాలింది. అతనికి కొంచెం విజయం దక్కేలాగ కనపడింది. 'నా అంతవాణ్ణి నువ్వు నెగ్గుతావా! అయిందిలే నీ పని!' అని అత ననుకున్నాడు. మళ్లీ, 'పిచ్చిగమీద బ్రహ్మాస్త్రం' అన్నట్టు 'దీనిమీదా నా శౌర్యం, పోనీ దీన్ని క్షమిద్దాం' అనుకున్నాడు. ఇంతలో పాడైపోయిన వేళ్లమాట జ్ఞాపకంవచ్చింది. ఇక పుస్తకం ఠప్పున మూసెయ్యడం తడువు, దోమ పైసలా అన్న మాటే అనుకున్నాడు. అయితేం పుస్తకం యొక్క రెండు అట్టలూ పుచ్చుగోడానికి వెళ్లడంలో కుడిచెయ్యి ఎడందానికంటే ఏ అరలిప్తో ముందు వెళ్లడం వల్లగావును పుస్తకం కొంచెం కదిలి, దోమ మళ్లీ దారెట్టింది. ఠపేలు మని శబ్దం అయేసరికి కునికిపాట్లు పడేవాళ్లు తెరలోవాళ్లూ ఏ బాంబు పేలిందో ఏ తుపాకీ పెట్టి ఇతను కొట్టుగున్నాడో అని కంగారు పడి ఇతణ్ణి పట్టుగోడానికి వెళ్ళారు. అతడు మాత్రం చేతులు జోడించి, నిలబడి, కళ్ళు మూసుగుని ఈ క్రింది మాటలు పఠించగా తక్కిన వాళ్ళు నిర్ఘాంతపడి విన్నారు.

"శ్రీమన్మహాదోమ! నీకుట్టడం మండ నేనోడిపోయాను, నెగ్గింది నువ్వేను ఓ దోమ రాజా యటంచుం నినున్ పెద్దచేతుం, బలే, భేషు, వా, యంచు కర్ల పేయంబులౌ నీగానముల్ వర్ణనల్‌సేతు, నిన్ గూర్చి హారతుల్ వెల్డింతు, సాయంత్ర మీనామ సంకీర్తనల్ జేసి నీదివ్య చారిత్రముల్ పాడి ఏ బాడిలో నీవు మున్ పుట్టితేనేమి నీ అస్రపత్వంబు రాత్రించరత్వంబునం జేసి నిన్ గూడ దైతేయ వర్గంబునం జేర్చి ఆబ్రహ్మ యంబ్రహ్మ మాకంటే మీజాతి పై జాతిగా జేసెకాబోలు! ఆమధ్య ఈ మధ్య రాజ్యాలు చేసే మహా చక్రవర్తుల్ని రాజాధిరాజుల్ని సింహాసనం మీంచి మానవుల్ దింపారు. పంపారు, చంపారు! కాని యేమానవుల్‌గాని నిన్ నెగ్గుటల్ విన్నడవ్, కన్పడవ్!! నీకొక్క కైవారముంజేతు, నీ కోప మింకన్ తమాయించు, నీ వెట్లు వాంఛించెదో యట్టెనారక్తంబు తోడి నీరెక్కలన్ సిక్తంబు గావించుకోగాని అంతంరక్తంబు పీల్చేసి పైపెచ్చు నా ఒంటి మీదన్ మలేరియావంటివౌ వ్యాధులం దెచ్చి పాతేసి పోబోకుమీ, నీకు చాలాను పుణ్యంబు లుండవ్, ఇదే స్వీకరించాలి నాదండమున్ ననున్ నెగ్గి నీ ప్రజ్ఞ చూచే ప్రపంచానికిన్ జాటినా వికన్ నన్ను మన్నించి రక్షించు శ్రీ దోమరాజా! నమస్తే నమస్తే నమః!

- ఆగస్టు 1938