గుసగుస పెళ్ళి/జూదం-బ్రాకెట్
జూదం - బ్రాకెట్
(సభఎదట ఏ విషయం మాట్లాడం నయం అని ఆలోచిస్తే సభ, నయం అనే మాటలవల్ల 'జూదం' అనే మాట స్పురించింది. నాబోటి తెలిసీ తెలియని వాడికి 'జూదం' తగిన విషయంలానే కనిపించింది. దాని పుట్టుపూర్వోత్తరాలు, రకాలూ, ఫలితాలూ గురించిన ప్రసంగం ఇది 17-12-1942)
జూదం అనేది యూరప్‌లో బి.సి. 1244 లో పెలోమిడిస్ అనే వ్యక్తి మొదట కనిపెట్టినట్టు ఉంది. ఇంగ్లాండులో మొదట జూదం ఆడడం క్రీ.త. 1567 లోట! మొన్న 1845 లోగాని టెన్నిస్ మొదలైన ఆటలుకూడా ప్రభుత్వామోదం పొందనేలేదుట. కాని, అంతకంటె వేలాది సంవత్సరాలుపూర్వమే, నలరాజుకాలంనాటికే, పాచికలు ప్రచారంలో ఉన్నట్టు మనం ఎరుగుదుం. సరి, ఇక మహాభారతకథ నాటికి (విధిగా రచనాకాలంనాటికి) జూదం భారతదేశంలో వన్నెకెక్కినట్టు తెలుస్తోంది. వేషం పిరాయించి అజ్ఞాతవాసంలో ఉన్నా ధర్మరాజుని జూదం వదలనే లేదనిన్నీ, అతడు విరాటరాజునికూడా అందులోకి దింపాడనిన్నీ, అతడు కోపంవచ్చి సారెతో ఇతణ్ణి కొట్టినప్పుడు రక్తంరాగా నిరంతరాలోచన చేసి, ధర్మరాజు, ఎంత గట్టిగా విసిరినాసరే మొహం రక్తం చిమ్మని పాచికలు సృష్టించి ద్యూతప్రపంచంలో గొప్ప పరిణామం తెచ్చి బిరుదు కొట్టాడనిన్నీ, ధర్మరాజే జూదపాటల్లో సరికొత్త రకాలు కనిపెట్టాడనిన్నీ అనద్యతన భూత కాలజ్ఞులు నొక్కిరాశారు. ఏపరిమాణంలో అయితేం, కాపట్యం ప్రమాణంగా తీసుగుని చూస్తే, జూదం - కిరికం, చరం, నయం, అని త్రివిధంగా చెప్పవచ్చునన్నారు. ఇందులో మొదటిదే దుర్ద్యూతం అనీ, దురోదరం అనీ, మాయాద్యూతం అనీ అంటారు. (శకుని వంటి అక్షవిద్యాపూర్ణుడు తను కాసిన సంఖ్య పడేటట్టు పాచికలు విసరగల నేర్పు చూపెట్టి మాయ చెయ్యగలిగినప్పుడు!). వినోదమాత్రంగా ఆడే జూదాన్ని సుహృద్ద్యూత మనీ 'నయం' అనీ అనచ్చు. మిశ్రమవిశేషాన్ని, ఐశ్వర్యం చేతులు మారుతుంది గనక, 'చరం' అంటే బాధలేదు. కాని, ఆటసాధనాల్ని బట్టిచూస్తే, జూదం రెండు రకాలే - ప్రాణిద్యూతం, అప్రాణిద్యూతం! ప్రాణిద్యూతంలో! వస్తాదులు, సింహాలు, గుర్రాలు, గొర్రెలు, కోళ్ళు, పావురాలు, ఎడ్లు, మొసళ్ళు, తాంబేళ్ళు, పందికొక్కులు - ఇల్లగా ఉండవచ్చు. అప్రాణి ద్యూతంలో! పాచికలు, ఏట్లు, గవ్వలు, దశావతారీ, చదరంగం, చీట్లపేక, అక్షరాలు, అంకెలు - ఇటువంటివి కావచ్చు, ఆడేవాడు ఒడ్డేపణం ఏమిటయి ఉండవచ్చును? అంటే, రొఖ్ఖం, నగలు, ఇల్లు, పొలం, పెళ్లాం, పిల్లలు తను ఏదైనా సరే, పూర్ణంగా తనకి హక్కున్నది - అయిదో వంతు హక్కు మాత్రమే తనకి ఉన్నా యావత్తు ద్రౌపదినీ ఒడ్డి ఆడిన ధర్మరాజుమోస్తరు కాకుండా! కాని, హింసలేని వినోదమే పరమావధిగా మానవులు మొదట ఇవి అభ్యసించినట్టు తెలుస్తుంది. ఇటువంటి వినోదాల నిమిత్తం పోగవుతూండే జనసమూహన్నే మొదట్లో 'సభ' అని పిల్చేవారు అనికూడా అనుకోవచ్చు, వీటి అన్నింటిలోనూ కేవల కాపట్యమూ, కేవల ధనాశా మాత్రమేకాక, విజయనిర్ధారణలో ఉండగల అనిశ్చితత్వం అనే అదృష్టం నక్కి ఉంటుంది. అదృష్టం అంటే సంభవనీయతలో ఆనుకూల్యం. ఒక క్రియ కోరినరీతిని భావికాలంలో జరగడానికి అదృష్టం, అది సంభవించడం ఎన్ని మోస్తర్లుగా జరగవచ్చునో అన్నోవంతు! ఒక గవ్వ విసిరినప్పుడు తిరగపడచ్చు, బోర్లపడచ్చు గనక, ఒకే విసురులో అది తిరగపడడానికి అదృష్టం సగం. పాచిక అనేది పలకల కడ్డీలా ఉండేదనిన్నీ చివళ్ళు శూన్యంగా ఉండి పలకమీద మాత్రం ఒకటి, రెండు, మూడు, నాలుగుచుక్కలో, గుంటలో ఉండేవనిన్నీ ఎవరో చెప్పగా విన్నాను. అందుకని పాచిక విసిరితే అదృష్టం నాలుగోవంతు; నాలుగు ఒకేసారి విసిరితే అదృష్టం 256 వ వంతు. పాశ్చాత్యుల పాచిక విసిరితే అదృష్టం 6వ వంతు, అందుకని, వచ్చిన స్థితిక్రమం మళ్ళీ వెన్వెంటనే ఓ పట్టాన రాకపోవడం, నూతనత్వం యందుండే మానవుల ప్రేమా మార్పుచెంది మరి రాబోయే నవ్యస్థితిక్రమం మనకి అనుగుణంగా ఉండకపోతుందా అని మానవులకి గల ఆశా, ప్రపంచంలో ప్రతీ సంభవమూ ఏదో సూత్రంమీద ఆధారపడి జరిగేటప్పుడు ఇందులో మాత్రం సూత్రం పోనుపోను ఏకాస్తో ఎందుకు దొరక్కపోతుంది, దాని ప్రకారం చేసిన మన ఊహితం ఎందుకు రైటవదు అని ఆలోచించే మానవుల జిజ్ఞాసా, నాకంటె నీచాతినీచుడే అదృష్టవంతుడై నెగ్గినప్పుడు నేను మాత్రం ఎందుకు నెగ్గి చూపించకూడదూ అని మానవుల్లో ఉండగల పైత్యమూ - ఇవి, మానవుణ్ణి ద్యూతరంగంలోకి మోసుగుని వెళ్ళే వాహనాలు. ఆటలన్నింటిలోనూ నూతన స్థితులుంటాయి గాని, పేకలో మిక్కిలిగా ఉంటాయి. చీట్ల పేకలో 52 ముక్కలు వాటి నన్నింటినీ రానిస్తూ, వాటిని కోటాన కోట్ల వరసక్రమాల్లో పెట్టచ్చు. ఒకడు ఆ యాభై రెండు ముక్కలకీ తన యిష్టంవచ్చిన క్రమం ఒకటి ముందు చెప్పి, తరవాత చీట్లపేక తీసుగుని, అవసరం అయినన్ని సార్లు వాటిని కలిపి, సరిగ్గా తను చెప్పిన క్రమంలో అవి ఉండడం చూపిస్తానని పందెం వేశాడట. ముక్కలు బాగాకలిపి చూశాడట. అతనన్న క్రమం రాలేదు. మళ్ళీ కలిపి చూశాడట, రాలేదు. ఇల్లాగ్గా తక్కినవాళ్ళు వెళ్ళిపోయినా, ఒక్కడే కూచుని, నిజాయితీ మనిషి గనక, రోజుకి పది గంటల చొప్పున ఇరవైఏళ్ళు కలిపి చూసి, మొత్తం 65874 సార్లు తంటాలు పడగా, అప్పటికి అతడి జోస్యం ఫలించి అతడు మొదటచెప్పిన క్రమంలో ఆ ముక్కలు కనపడ్డాయిట!
అలాగ్గా, పేకలో ఉన్నంత విరివిగా కాకపోయినా. సంభవించడానికి వీలైన మార్గాలు అనేకంగా ఉండడం పైన సూచించిన ప్రతీ ఆటలోనూ ఉంది. అందువల్లే, ప్రతీ ఆటలోనూ ప్రతీ పోటీదారుకీ నెగ్గడానికి కావలిసిన నలకంత అదృష్టమూ తనలో నివసించడానికి జాగా లోటుండ దాయిరి, దానికి తోడు తన ప్రజ్ఞ ఉందాయిరి అనిపించిగావును, ఊహూ నెగ్గుతాననే ధైర్యంతప్ప, ఓడిపోతానేమోరా అనే అధైర్యం ఎంతమాత్రం చస్తే ఉండదు. కాబట్టి ద్యూతదీపాన్ని జనం వానపురుగులు ముసిరినట్టు ముసురుతారు. జనానికి అంతప్రియం అయింది గనకనే, దేశకాల పాత్రల్ని బట్టి జూదం రూపాంతరం పొందుతుందేగాని, జన్మాంతరంలోకూడా మానవుణ్ణి వదలదు వదిలేటట్టు కనిపించదు. డబ్బూ చదువూ లేనివాళ్ళు ఎందులోనో ఏ గవ్వల్తోనో 'పులిజూదం'తోనో ఇదవుతారూ డబ్బుండి చదువులేని వాళ్ళు ఎందులోనో సొమ్ము కాస్తూనే ఉంటారు. డబ్బుండి చదువూ ఉన్నవాళ్ళు మహానగరాల్లో గుర్రాలమీద కాయడంలాంటి పన్లు చేస్తారు, ఇతరచోట్ల డబ్బెట్టి, అవసరం అయితే తలుపులు మూసుగుని పేకాడతారు, అయితే, డబ్బుండి, చదువుండి, తీరుబడికూడా ఉండి, గ్రామాల్లో కూడా ఉండి, రిటైరైన ఉద్యోగులు లాంటివాళ్ళకి సరిపడ్డ జూదం ఏమీ లేకపోయిందే, వీళ్ళని దింపడం ఎల్లాగా అని గడసర్లు ఆలోచించి, ఆంగ్ల పత్రికలు సాధనంగా, ఆంగ్ల పాండిత్యం నెపంగా ఆంగ్లాక్షరద్యూతం నిర్మించి సాగించారు. వాటిల్లో లాభం అక్షర పథకాలు వేసినవాళ్ళకీ, ఆపథకాలు పడే పత్రికల వాళ్ళకీ, ఆ పథకాలలో వచ్చే అక్షరాలుగల మాటలుండే ఆంగ్ల నిఘంటువులు అమ్మేవాళ్ళకీ! ఇక పోటీదార్లు? ఆంగ్ల పాండిత్యం అందులో ఫలిస్తుంది అనుకునీ, అది జూదం కాదు పాండిత్య పరీక్షే అనుకునీ, ఆ అక్షరాలు తనకి తెలిసినవే గనక తనకోరిక తీర్చకపోతాయా అనుకునీ, ఆ కృషితో ఆంగ్ల సారస్వతాభివృద్ధి అవుతుందనుకునీ, కాలయాపనం అనీ, వ్యసనం అనీ, నాగరికత అనీ, నా యిష్టం అనీ సబబులు చెబుతూ; ఇది పడ్డ పేజితప్ప తక్కిన పేజీల్లో ఏముందో శీర్షిక లేనా చూడనియ్యని కసిలో ఆసంచికలు కొంటూ; ఎన్ని సంభవనీయాలకి తను డబ్బు కాశాడో అనేది పబ్లీకు అయితే తరవాత నామర్దా అని తనే పోస్టాఫీసుకి స్వయంగా వెళ్ళి రహస్యంగా కాస్తూ; ఓడిపోయినప్పుడు తన కామాట ముందే తెలుసునని అర్థంలేని కారణం చెబుతూ, ఒక వేళ కొంతభాగం నెగ్గితే ఆఫలితం ఒకటి మాత్రమే తను కాసినట్టు కోస్తూ; విజయాక్షరం తను వెయ్యకపోయి ఓడినా అదే తను. మొదట వెయ్యనిశ్చయించుగుని మానేశానని సమర్థించుగుంటూ; తన ఓటమి విజయానికి ఎంతో దగ్గిర అని ఆశపడుతూ; చింతాకు వాసిగా నుయ్యి దూకినట్లు పనిచూపెడుతూ; మరణం జీవితాంతంలో జీవితాన్ని స్పృశిస్తుంది గనక మరణించినవాడు సజీవుడికి చాలా దగ్గిరే అనుకోగలిగిన తత్త్వదృష్టితో; ఆంగ్లాక్షరద్యూతం ఆడి, ఓడి, మాడిన ఆంగ్ల విద్యాధికాంధ్రులు దేశంలో తూకంగానే కనిపిస్తారు. ఇంగ్లీషు పత్రికలకి ఈ ఎత్తుతో ధనం కురియడం వల్ల పులిని చూసి నక్కగనక, తెలుగు పత్రికల్లో కూడా ఆంధ్రాక్షరద్యూత పథకాలు పడుతోచ్చాయి, తన్నిమిత్తం నగరాల్లో సంఘాలు లేస్తోచ్చాయి. సరి, కాగితపుకాటకం ఓటి అదనంగా మీద పడగా, ప్రతీ ఆంధ్ర వ్యవహారంలాగే ఆంధ్రాక్షరద్యూతాలు జండా దింపేశాయి. ఈ అక్షరాల్లో కూడా చిక్కుందని మరికొందరు ఆలోచించారు. ఏమంటే, భాష భాషకీ అవి వేరు. పైగా, ఆకాసిని అక్షరాలూ తెలియని వాళ్ళు కోటానకోట్లు, అందువల్ల, భూమిమీద కాస్త జీవం, కాస్త మతీ ఉన్న ప్రతి ద్విపాదుడూ ఆడడానికి తెలిసే ఆట వస్తువులు 'అంకెలు' అని వాళ్ళకి తోచింది అంకెలూ తెలియనివా డుండడు గనక ! అంక ద్యూతం అఖిల భూ వ్యాపారం కాగల చిహ్నాలు వాళ్ళకి కనిపించాయి. వాళ్ళ దూరదృష్టికి అనుగుణంగా ! గమ్యం విశేషదూరం అయినట్టు కనబడకుండా, ఒకటైతే పదోవంతూ, జత అయితే, వందోవంతూ అదృష్టం కలిగి, భూమానవుడికి ప్రతివాడికీ అందుబాటులో ఉంటూ, తెస్తే చాలా ఒకేసారి తెస్తూ, పోతే కొంచెం కొంచెం చొప్పున, కనబడకుండా ఉండే నష్టం కలిగిస్తూ, కష్టం ముష్టి బదులు చేబదులు విక్రయం బహుమానం వంటి ఏబాపతు ఏసొమ్మయినా, ఎంతైనా సరే, ఏ దేహి అయినా సరే కాయడానికి వీళ్ళు కల్పించి, గ్రామాలలోకి కూడా అవతరించిన జూదపాట ప్రస్తుతం 'బ్రాకెట్' ఆట! ఈ అప్రాణి ద్యూతంలో ఆట సాధనాలైన అంకె లేవీ అంటే, న్యూయార్క్ కాటన్ మార్కెట్టులో రాబోయే దినారంభ దినాంత ధరల్ని సూచించే సంఖ్యల ఒకట్ల స్థానంలో వెలవగల అంకెలు! ఆడడానికి అర్హత అక్కర్లేదు, అడ్వాన్సు అవసరం లేదు, ఆటంకం ఉండదు. ఆలస్యం అవదు, పణం కానీ చాలు - చిల్లర దొరక్కపోతే చెప్పలేం కాని! ఓపెనింగ్ (ఆరంభ ధర అంకె) కాసి రిటైతే 6 రెట్లు, క్లోజింగ్ (దినాంతధర అంకె) కాసి రిటైతే పణానికి 8 రెట్లు, (రెండూ) బ్రాకెట్ కాసి రైటైతే 60 రెట్లూ తక్కవ కాకుండా మర్నాడు చేతులోవేసే మధ్యవర్తులుంటారు. పైగా “సమయానుకూలముగా (కట్నపు) రేట్లు హెచ్చింపబడును.” ఒకసారి పట్టింపు వచ్చి బ్రాకెట్‌కి ఓ ఊళ్లో 105 రెట్లు ఇస్తామన్న వాళ్ళున్నారు. రెండువరస రోజుల బ్రాకెట్లు కాసి రైటైతే వెయ్యి రెట్లు ఇస్తారట! వారం రోజుల వరస బ్రాకెట్లు వోమాటే కాసి అవిగనక అన్నీరైటైతే, కాసింది ఎంతైనా సరే, ప్రతిఫలంగా ఇండియా ఇచ్చేస్తాడట ఇక బొంబయి ఏజెంటు! - దాంతో స్వరాజ్యం పూచీ ఒక్కడి చేతిలో పడుతుంది. ఇక, ఒక నెలరోజుల వరస బ్రాకెట్లన్నీ ఒక్క గుక్కనే కాసి, అవన్నీ కాస్తంత రైటైనాయా, నెగ్గినవాడికి భూమిచ్చేసి కొసరుగా భౌముణ్ణికుడా ఇస్తారట!! ఆ దెబ్బతో యుద్ధాలు లొంగిపోతాయి, భౌముడు దాసు డవడంవల్ల. మరేంలేదు, ఇందులో రాబోయే లాభాల లెఖ్ఖలు అల్లా లేచిపోతుంటాయి. ప్రతిదిన ఫలితాలూ మర్నాడు బొంబాయి మీదుగా వచ్చేస్తాయి. ముట్టవలసిన వాళ్ళకి సొమ్ములు సాధారణంగా ముట్టిపోతాయి. అటువంటి అంకద్యూతం ఇంట్లో ప్రాణంమీదికి వచ్చినా, ఎంత చిక్కులో తనున్నా ఆడి, సాధారణంగా నష్టపోయి చెప్పుగోడానికి వీల్లేక గంభీరంగా లోపలలోపల కుళ్లినా అనుభవించి, ఆస్తి అంతా పోగొట్టుకున్న వాడికంటె తన పని నయం గనక ఆట మానలేని బ్రాకెట్ దాసులు రాత్రిం పగళ్లు ఊరూరా బజార్లనిండా దొరుకుతారు. వాళ్ళు తమ జాగ్రత్ స్వప్నావస్థలో బ్రాకెట్లని గురించి ప్రకటిస్తూండే భావాలు వరసని గుచ్చితే, ఈ క్రింది చతుష్కం ఏర్పడుతుంది!
1 కొత్తగా ఓడినవాళ్ళ బెదిరింపులు
హా! నేటి బొంబాయి టెల్లిగ్రామా! నిన్ను తెగ్గోసినా పాపం ఉందా! ఓసీ నేటి ఓపెనింగ్! నీనోరు నొక్కిరి గదే! అయ్యో నేటిక్లోజింగ్! నీకళ్ళు మూసుగుపోయాయా! పోనీ, నేటి ఓ బ్రాకెట్ దంపతులారా! మీది జన్మేనా అని అడుగుతా! విడివిడిగా గాని, జమిలిగాగానీ మీకు సిగ్గులేదే! మీకు 'అరేబియా అంకెలు' అని పేరుండడంవల్లే ఆ అరేబియాదేశం నాటికీ నేటికీ ఎడారిగా ఉండిపోయింది. మీరు ఎల్లానూ సరిగ్గా ఉండరు, పోనీండి. నేటి కాలానికి సున్న అనబడే శూన్యానికి కూడా విడిగా గణ్యత బయల్దేరుతోందే! మీపదిమందీ చేరి నాదశ మారుస్తారుటర్రా! విడిఅంకెలతో పదేపదే పోరినా, అంకె జతలతో శతవిధాల మొత్తుగున్నా, నే కోరినప్పుడు మీదర్శనమే కరువైపోతోందే! నాచోటికి సమీపంలోనే ఉండి, ముందు నాకు ఉషార్ ఇచ్చి, నా ఆస్తి తగులడుతూంటే, మీరు క్షేమంగా తప్పుగుంటారా? ఏక తాపత్రయంతో, రెండోపని మాని, ముప్పొద్దులా, నలుగుర్నీ వాకబు చేస్తూండి, పంచప్రాణాలూ, ఈపనిమీదే పెట్టుగుని, ఆరువారాలూ ఏడ్చి, అష్ట కష్టాలూ పడి, పోనీ చెమటోడ్చకుండా, చిటికెలో నవనిధులూ ఒళ్ళో పడతా యనుకుంటే, సున్నపిడతా నాకు ఎదురుగుండా రావలిసింది!! ఆశకీ, ఫలితానికీ అంత వ్యత్యాసమా! నాకు గనక కోపం వచ్చిందంటే, మీ పదింటికీ దశాహం చేసేసి, గోదావరి ఎండిపోక ముందే మిమ్మల్ని అందులో ఊరదొక్కేస్తాను. ఇహ మిమ్మల్ని ఎవరెంత సంస్కరించినా మీ మచ్చ మాయదు. దాంతో భూమి భూమంతా అసంఖ్యాకం అయిపోతుంది. ఆపళంగా బ్రాకెట్లు ఆడడానికి అంకెలు దొరక్క జనం చచ్చి ఊరుకుంటారు - వాళ్ల లెఖ్ఖ తేల్చడం వీల్లేక ఇంకా పోతారు. ఈసారి నే కాసిన అంకె ఇతరపని మాని వెళ్ళి ఎల్లానో ఆ బొంబాయి టెల్లిగ్రాంలో ఇరుక్కుని మర్నాడు ఈ ఊరొచ్చెయ్యాలి! కబడ్దార్!
2. ప్రజ్ఞ చూపెట్టి నెగ్గదలచినవాళ్ళ గొంతెమ్మ కోరికలు
మొదట్లో ఒకసారి ఇట్టేవెళ్ళి 4 - 7 కాశాను. ఠక్కున నెగ్గాను - గన్ షాట్! కాసింది అర్ధణా. 60 అర్ధణాలు లాగేశాను. నాజన్మాంతరం కాకపోతే ఆ వేళే ఓ వంద రూపాయలు కాసిఉండకూడదూ! మరి తరవాతనించి తిరోగమనమే, అయినా, నాకు భయంలేదు. అటువంటప్పుడు నేను పగలు కనిపించను. కర్మంజాలక నెగ్గితే, డప్పేస్తాను, పతనదార్లకి, ఓడినా నెగ్గినా తేడా క్రమేపీ శూన్యం అవుతుంది. నేను మిక్కిలి తరుచుగా ఓడిపోయినా, నెగ్గే అంకెల జతకూడా పొద్దుణ్ణించీ నేను అనుకునే ఉండి ఉంటాను, అదే కాయాలని స్థిరపరుచుగుని కూడా ఉండి ఉంటాను. ఉంటే, ఎవరో శనిలాగ చక్కావచ్చి (అనగా, మా అమ్మో, నాభార్యో, నా సంతానమో, నానౌఖరో, నా ఇరుగుపొరుగో - అంతా ఒకరు కాసినట్టు తెలియకుండా ఇంకోరు కాస్తారుగాదు మరీ!) నా మనస్సులోని రైటుజత నాచేత మానిపించి, ఎవడో చదువుకున్న ఓ గొప్పవాడు కాసిన జత అంటూ ఓ దిక్కుమాలిన జత పట్టుగొచ్చి, నన్ను డబాయించి నాచేత కుడా అదే కాయింపిస్తారు. మర్నాడు సమిష్టిక్షౌరం - పైపెచ్చు, మాలో మాకు మాటలుకుడా పోవడం!... అట్టెట్టెట్టే!... అదుగో 3 - 6 నన్ను వెక్కిరిస్తోంది, వెనకటి సంగతి జ్ఞప్తికి తెస్తూంది. ఒకసారి భూతద్దంతో 'పాప్' కూడా పరిశోధించి ఆర్జించిన ప్రజ్ఞతో కాశాను, అందులో ఓ కంటితో చూస్తే 3, ఓకంటితో చూస్తే దొరికాయి! నాకు 3 తోచింది! నా పుట్టిన తేదీ అంకెలన్నీ కలిపేశాను, 3 - 9 వచ్చింది! నాకు 3 - 9 మీద భక్తి కుదిరింది. బ్రాకెట్ వేసే తేదీ అంకెలన్నీ కూడేశాను, 33 వచ్చి ఊరుకుంది. సాత్విక రాజస తామసాలు 3 గనక, ఆమూడూ దానికి ఇట్టే కలిపాను, ఠంగున 3 వచ్చింది! ఇంకా, ఆవారంలో నెగ్గిన బ్రాకెట్ల జతలన్నీ కూడి, క్రమం తప్పించగుండా, 3 చేత భాగించి 3 తీసేశాను, 32 వచ్చింది దీని మొహం ఈడ్చా! సరి, దేవుడంటే ఒకటి గనక ఆ ఒక్కటీ చప్పున ఇందులోంచి తీసేసరికి, చిత్రమవుతుంది, 36. ఎవడికోసం - చచ్చినట్టు వచ్చింది. స్థిరపరిచాను. మూడింటికి బయల్దేరి, ఆలస్యంచేస్తూ ఆరుగంటలదాకా నడిచి వెళ్ళి 3 - 6 మీద 36 రూపాయలు కాశాను. పైన చెప్పబడ్డ అన్ని వేరువేరు సంగతులూ ఏకీభవించడం దానంతటదే జరిగింది గనక నాపని మూడు పువ్వులు ఆరుకాయలూ లాగ ఉంటుందన్నాడు ఒక స్నేహితుడు. ఇంకోడు 36 కి 49 రెట్లు ఎంతవుతుందో రొండు పంక్తుల్లో గుణించి, నాకు రాబోయేసొమ్ము లెఖ్ఖ కట్టిపెట్టాడు. కొందరు నన్ను తక్షణం ఐరన్ సేఫ్ కొనెయ్యమన్నారు. ఇంటి కొచ్చేటప్పుడు ఏకంగా ఆపనీ చూడచ్చన్నాను. ఆ రాత్రి ప్రసంగంలో, ఆ రాబోయే డబ్బెట్టి నేను న్యూయార్క్ వెళ్ళి హుజూర్లోనే బ్రాకెట్ ఆడతానన్నాను. మావాళ్ళు (ష.రా? నా భార్య) వద్దన్నారు. 'షటప్' అన్నాను నేను. అని, ప్రపంచంలో నాలాంటి బ్రాకెట్ వీరుల జీవితమరణ చరిత్రలు కనుక్కుని రాసి అచ్చువేయించి బ్రాకెట్ పరాజితులకి ఉచితంగా పంచి పెట్టిస్తా నన్నాను, మావాళ్ళు భుక్తి గడిస్తే చాలన్నారు. 'మరినోరు తెరిస్తే గడవదు' అన్నాను నేను. పైగా నాభార్యకి నగలు చేయించకమాననని ప్రత్యక్షంగా పైకి సత్యప్రమాణికం చేశాను. మావాళ్లు దైవభక్తి ఉంటే చాలన్నారు. అసలు బ్రాకెట్ అంటేనే ద్వైతాద్వైతసారమనీ, పరమాత్మ జీవాత్మ యోగమనీ, ప్రప్రథమంలో అసలు సాంఖ్యయోగం అంటే ఇదే అనీ హడలేసి ఉపన్యసించేసరికి మాఆవిడ నావిజ్ఞానానికి ఏమీ అనలేక కళ్ళు మూసుగుని, తలవంచి, లెంపలేసుగుంది. అయినా నేనాగలేదు. ఓపినింగ్ అంకె తెలుసుగుని దానిమీద లోగడ ఏయే క్లోజింగులు నెగ్గాయో చూసుగుని కాసేవాళ్ళు బ్రాకెట్ వీరుల్లో జమరారనీ, ఉజ్జాయింపుగా ఎనిమిది అంకెలమీద ఎనిమిది క్లోజింగులు బనాయించి ఏ కానికాని చొప్పునో ఆ 64 జతలమీదా కాసి, ఏదోఓటి దగిల్తే పెట్టుబడికి అట్టే దండగ లేదుకదా అని వ్యవహరించే పిసినిగొట్లవల్ల బ్రాకెట్ ఆటకి అప్రతిష్ఠ అనీ, నెగ్గినమర్నాడు 'రివర్స్' ఆడి విశ్రాంతి కోసం తంటాలుపడేవాళ్ళు దమ్ములేని బ్రాకెట్ భీరులనీ, శుక్రవారం మాత్రమే ఆటకి వచ్చి లోగడ నెగ్గిన అంకెల మొత్తాల చివళ్ళు కాసేవాళ్లు బ్రాకెట్ ఆటలో వారాలు చేసుగునేవాళ్ళనీ, ఒకనాటిఆది రెండవనాటి అంతానికీ, మొదటినాటి అంతం రెండవనాటి ఆదికీ కలిపి కాసేవాళ్ళు తిర్యక్కులనీ, ఆస్తీశూన్యం అయినాసరే ప్రారంభించిన అంకె ఏదైతే ఉందో అది కాస్తూండడమే మగతనం అని గ్రహించిన ఏకాంక వ్రతస్థులు కలియుగ నలరాజులనీ, బ్రాకెట్ విషమించగా విషమించగా ఆసుపత్రి దర్శనం చేసే వాళ్ళకి బ్రాకెట్ సంఘాలు పింఛను పంపుతాయనీ, నగలమ్మి బ్రాకెట్ ఆడి బోడులైన పూబోడులకి మంగళహారతి ఇప్పిస్తాననీ, నా రాబోయే డబ్బుతో ఆలిండియా బ్రాకెట్ కేంద్రభవనం నిర్మించటానికి స్థలం దరఖాస్తు చేస్తాననీ, బ్రాకెట్ పాపర్ల గురించి క్షేమనిధి పెడతాననీ కూడా ధారాళంగా తెలిగించి మా ఆవిడతో చెప్పేశాను. మర్నాడు ఫలితాలు వచ్చాయి. ఆ రెండంకెలేకాని, 6 మొదటవచ్చింది, 3 తరవాత వచ్చింది, ఆ అంకెలు క్రమం రైటోకాదో, ఒకవేళ కానిరోజులు గనక టెల్లిగ్రాం తీగెలు తిరగబడ్డాయేమో, అవతలవాడు పుర్రచేత్తో కొట్టాడేమో అని అనుమానించి, పోనీ పేపరుకూడా చూద్దాం అనుకున్నాను. సరి, అదీ అల్లానే ఉంది, వెధవ పేపరుగదే, అనుకున్నాను తీరిపోయింది! కాని ఒక్క బాధమాత్రం పట్టుగుంది. ఒకానొక దిక్కుమాలిన కుంక 3 మీద వంద కాశాట్ట! వాడు నాకంటె అధమాధముడూ, అల్పుడునూ. నేను మిక్కిలి తరుచు ఓడుతూండడం మామూలు గనక నే నీసారి కాసింది కనుక్కుని, వాడు దానికి విరుద్ధక్రమంలో కాసి నెగ్గాడని నాకు తెలిసిన దగ్గర్నించీ నాకు ఒళ్ళు మండిపోతోంది. వాడికి రావలిసిన సొమ్ము వాడికి దక్కకుండా ఉంటే వెంకటేశ్వర్లుకి ఓ శేరు (ఆవునెయ్యి మానేసి - రోజులమహిమని బట్టి) కిరసనాయలు దీపం వెలిగిస్తానని మొక్కుగున్నారు! దాఖలా కనిపించింది. 20 రెట్లు ఇస్తాను అన్న బ్రాకెట్ ఏజంటు తనూ తన రౌడీబలగమూ, తన పెట్టి, తన నిత్యబ్లాకెట్ కొట్టుతోసహా పెనుచీకటిలో అంతర్ధానం అయిపోయాడట! 'ఆరు-మూడు' వాడు మతిపోయి తిరుగుతున్నాడు! నాకు విరుద్ధంగా కాస్తే ఏమవుతుంది మరీ!
3 కృషిచేసి నెగ్గదలచినవాళ్ల నిరాశ
నా బ్రాకెట్ యథాప్రకారంగా పోతూనేఉంది. నా ఆస్తిక్రమేణా క్షీణించింది. అందువల్లే బ్రాకెట్ గతి అయింది. ఆ ఆశే పెరిగిపోయింది. ఏం జేస్తున్నానో నాకే తెలియడం మానేసింది. ఆస్తి ఛీదాగా అంతరించగా, అరువులో పడి అద్వైతంలో పడి క్లోజింగుమాత్రం 5, లేక 2 లేక శూన్యం వేసి చూశాను, ఆద్యంతాలకి 5 తేడావేసి చూశాను. ఖర్చులో ఖర్చు జ్యోతిష్కులకిచ్చి చూశాను. సలహాదార్లకి కమీషను అడ్వాన్సుగా ఇచ్చిచూశాను. గ్రహచార తిథి, వారాలు గమనించాను. అమావాస్యకి సున్న వేసి చూశాను. పూర్ణచంద్రోదయ సమయంలో 8 ఆడిచూశాను. పిల్లల చేత అంకెలు తీయించి వేస్తోచ్చాను. ఏమట చెయ్యనియ్యండి, ఎంతట తన్ను కోనీండి, నే అన్న అంకెకీ, మర్నాడు వచ్చే అంకెకీ సాయుజ్యం ఉంటుందేకాని, తాదాత్మ్యం ఉండదే! దాంతో, కనపడని అదృష్టంమీద లాభం లేక, కనపడే అంకెలమీద ఎక్కడలేని కోపం వస్తుంది. వచ్చి వాటిని మాత్రం ఎంజెయ్యనూ! అవీ ఇదివరకే శల్యాలులాగ ఉన్నాయి. ఎదో శాపంతిన్నమీదటే వాటికి వాటి ప్రస్తుతరూపం వచ్చి ఉంటుంది, నేను మళ్ళీ వీటిని శపించడం ఎందుకు? వీటికి శాపం పెట్టి ఆట మానేసిన మా పూర్వసోదరు డొకడు అంకెల్ని ఇల్లా తిట్టాడు! శూన్యం, ఇత్తడిసిబ్బి; ఒకటంకి, చాపలేని కొయ్య; రెండంకి, ఉడత మడత; మూడంకి, మంచం పక్క నాలుగంకి, గోడకుర్చీ; అయిదంకి, వదులుపిలక; ఆరంకి, హాకీకర్రముక్క ఏడంకి, ఒంటిగోడ సిమెంటు బాల్కనీ; ఎనిమిదంకి, అరగ్గానిల్చిన పొత్రం; తొమ్మిదంకి, ముంతకొప్పుసాని. వీట్లమీద కోపం రేగినప్పుడు ఈ వాక్యాలు ఓసారి స్మరిస్తూంటాను.
4. ఓడినా మానలేనివాళ్ళ సమర్థింపులు
కాని, నాకు అసహ్యం వేసిన కాస్సేపు మాత్రం వీటిని అల్లా తిట్టి పోస్తాను గాని, వీటిని వదలగలనా? నా శరీరం నాకు తరుచు అసహ్యం వేస్తూంటుంది, శరీరాన్ని వదలగల్నా? అల్లానే ఇవీనూ! వాటిని జపించగా ఎప్పటికేనా, అవే, నాశ్రమా నాకృషీ నాకాలమూ ఖర్చు కాకుండా నన్ను ఎందుకు గట్టెక్కించకూడదూ! మూటవచ్చి నాఒళ్ళో ఎందుకు పడకూడదూ! ఇచ్చినప్పుడే అనుకోండి, నాకు ఇంత ఘనంగా ఎవరివ్వగల్రు? అందుకని, అంకెలంటే అసహ్యమేకాని అంకద్యూతం అంటే తమాషా! బ్రాకెట్ నెగ్గితే, సొమ్ము అయిపోయిందాకా ఉషార్! బ్రాకెట్ ఓడితే, పోయినసొమ్ము వచ్చేదాకా కసి!! లేనివాడికి బ్రాకెట్ ఆట అవసరం - ఎప్పుడైతేం, నిండెయ్యచ్చు. ఉన్నవాడికి అవసరం ఇంకా ఉంటుంది. ఒకడు జూదంలో ఓడిపోయి పరిగెట్టి పాడుగుళ్ళో దాక్కుని తన్ని పట్టుగోడాని కొచ్చిన తోటిజూదర్లు వెతికీ పట్టుగోలేకపోయి, అతణ్ణి పట్టుగోడం మాట అల్లా ఉంచి, గుడియెదటే జూదం ఆట ప్రారంభించి 'నాది పందెం' 'అంటే నాదిపందెం' అని కొట్టుగుంటూ ఉండగా, ఆ దాక్కున్న ఒకడు తను దాక్కున్న సంగతి మరిచిపోయి, “మీయిద్దరిదీ కాదు, పందెం నాది.” అని కేకలేస్తూ పైకొచ్చేసి పట్టుబడ్డా డని శూద్రకుడు రాసింది స్వభావసిద్ధం కదా!
ద్యూతం సర్వజన వినాశకరం - అన్నాడు కవి! కాని,
“ద్యూతం ఛలయతా మస్మి” అన్నాడు శ్రీకృష్ణుడు - అన్నాడు ఆకవే! ఔర! కవిత్వం మాటల్తో 'జూదం; ఒకే కవివైన పై రెండు అభిప్రాయాలూ ఒక 'బ్రాకెట్'!! -
- జూలై, 1943