గుసగుస పెళ్ళి/కుఱు క్షేత్ర సంగ్రామం


కుఱు క్షేత్ర సంగ్రామం

తాళ్ళమెరక భూములు సుక్షేత్రాలు, అవి బంగారం పండేవి. వాటిల్లో పెంటా ఎరువూ ఏనాడూ పడకపోయినా, అవి ముక్కారునా విరగపండడమే గాని రెండోమాట ఎరగవు. ఆవూరికి తూర్పున రెండుమైళ్ళ దూరాన్ని ఉత్తరదక్షిణాలుగా ఓ పంటకాలువ ఉంది. దాని పడమట గట్టుని జేరి రెండు ఖండాలు, ఒక్కొక్కటి యాభైయేసి యకరాలది, కాలవనించి కొంతమేర వదిలిపెట్టగా, ఓదాని కోటి కాడిగట్టుగా ఉండేవి. అందులో దక్షిణపు వేపుది మిరియాల వారిది; ఉత్తరపుదిక్కుది శొంఠివారిది. భూఖామందులు గ్రామాంతర ఉద్యోగాలు ఆర్జించి వెళ్ళిపోయి అవి రైతులకి అమర్చారు. పన్నులు పెట్టుగుని అమరకం ఎకరపుపుట్లు ఖామందుల ఇంటిదగ్గర అప్పచెప్పేవారు. మిరియాలవారి భూమి వనమయ్యా, శొంఠివారిది. అతని జ్ఞాతి పనసయ్యా, పుచ్చుగున్నారు. గొడ్లకోసం అని మొదట సాలలు కట్టి, ఎప్పుడేనా రాత్రి బసకోసం అని పాకలు వేసి, చివరికి వాళ్ళిద్దరూ ఆవరణా ప్రహరీగోడలతో సహా రెండు భవనాలు ఖామందుల్నడిగి కాలవ సరాసరిని పొలాల్లోనే కట్టుగున్నారు. ఆ ఇళ్ళకి మధ్య నలభై యాభైగజాల నిడివిగల భూమిఉంది, ఎవరిదో కొన్నాళ్ళవరకూ తెలియకుండా బంజరు ఉండి, దుబ్బు వేసింది. అదుబ్బూ ఏ చుట్టనిప్పురవ్వో పడి కాల్తోచ్చేది. తరవాత చాలా కాలంకూడా అది నాది అన్న మొగాడులేడు, ఫలానావారిది అని తేల్చిన ఉద్యోగిలేడు, నేను బాగుచేస్తాను అన్ననాథుడు లేడు. అంతమంచి భూముల మధ్య ఆక్షేత్రం ఎల్లా తయారైందో ఎవరికీ తెలియదు, ఆభూమి అంతాపోగుచేసి ఎకరంలోపు! వనమయ్య పనసయ్యలు తమ రింత పిసుక్కుతిని, ఇంకోరికింత పడెయ్యగల స్థితిలోనే ఉంటోచ్చారు. వనమయ్యకి ముసిలితల్లీ పడుచుపెళ్ళాం మధ్య త్రాసు నిదానంగా పట్టుగునేసరికి నవనాళ్లూ కుంగిపోయేవి. పనసయ్యకి వెధవఅక్కా, సుస్తీపెళ్ళాం జరిపే పోరుహోరుజోరు జలుబు వొదలగొట్టేస్తూండేది. ఇళ్ళ మధ్య ఖాళీస్థలం ఎవరిదైతేం గనక చెరిసహంగా వాడుకోడంలో ఏవిధమైన పేచీలూ రాకుండా, మాధ్యస్తంలో ఏకరేఖగా అయిదారు రాళ్లు వీళ్ళే పాతుగున్నారు, దాంతో దక్షిణపు వేపు ఇంటికి ఉత్తరాన ఇరవై గజాల పొడుగునా, పనసయ్యఇంటికి దక్షిణాన ఇరవై గజాల చొప్పునా ఖాళీస్థలం వారివారి వాడకాలకి కేటాయింపు అయిఉంది. అది వాళ్ళు పుల్లాపుట్రా వేసుగునీ, పురీగట్రాకట్టుగునీ యథాశక్తిగా భుక్తపరుచుకుంటున్నారు. అదికూడా ఊడుపుభూమిగా మారిస్తే బాగా ఉంటుందనే ఊహలు వాళ్ళకి వంట్లోనూ ఉన్నాయి. ఇంట్లోనూ ఉన్నాయి, ఉన్నా, వాళ్ళు హానీ, హింసా తెలియనివాళ్ళు గనక, ఆ ఊహలు చాలాకాలం పొక్కలేదు.

వనమయ్య పనసయ్యలు జ్ఞాతులే అవడంచేత శుభాశుభాల్లో తప్పవిడిచి, సహాసన సహభోజనాలు లేకుండానే వ్యవహరించేవాళ్లు. కాని అవసరం వల్ల ఒకనాడు సాయంత్రం కాలువగట్టుమీద గృహమధ్యరేఖకి సూటిగా వాళ్లరూ కొంత ఎడంగానే కూర్చుని ఉండగా ఈ సంభాషణ జరిగింది.

పనసయ్య - ఈమధ్య ఉన్న చెక్క అసలు మినహా అని మనం అనుకుంటున్నాం!

వనమయ్య - నేను అనుకోటంలేదు. పన - ఇది వెన్నావారిది.

వన - నాకూ తెలుసు.

పన - వారిదగ్గర అయిదేళ్ళకి నేను కౌలు రాయించుగున్నాను.

వన - అంతకు పూర్వమే రాయించుగుని దుబ్బులు నేయించింది. నేనే.

పన - వారి మైనరు కొడుకుచేతకూడా నిశానీ పెట్టించాను.

వన - ఆస్తి అయనపెళ్ళాంపేర ఉందిట, నేను ఆవిడ దగ్గిరే పుచ్చుగున్నాను.

పన - నేను సాగు చేస్తాను; రేపటెల్లుండి అరక దున్నుతాను; మీ వేపున మొదలెడతాను?

వన - అల్లా అయితే మాకు కోపం రావలిసివుంటుంది!

పన - మేం దున్నడం మానం!

వన - మేం అటకాయిస్తాం!

పన - మేం అడొచ్చినవాళ్ళని గిరవటేస్తాం.

వన - మేం కొమ్ములు ఊడగొట్టిస్తాం.

పన - మేం పేర్లు నాశనం చేయిస్తాం

వన - మేం అంతా నాశనం చేసి చూపిస్తాం.

పన - మేం పట్టిన కుందేటికి మూడే కాళ్లు!

వన - మాకుందేటికి కాళ్ళే ఉండవు.

పన - అల్లాంటి కుందేల్ని దొర్లిస్తాం!

వన - ఇల్లాంటి ద్రోహాలు చేసేవాళ్లని మేం తిట్టి పోస్తాం.

పన - ఎప్పణ్ణించి తిట్టిపోస్తారూ?

పన - రేపు చల్దివణ్ణం తిని గట్టుమీద కూర్చుని నిర్భయంగా తిడతాం. వినడానికి జనాన్ని కూడా పిలుస్తాం భయమా?

వన - జనాన్ని పిలవడానికి ఎప్పుడు వెడతారూ? రాత్రేనా?

వన - రాత్రి చీకటిగనక, ఉభయులమూ కలిసే వెళ్ళి పిలుద్దాం! చూస్కోండి మజాకా!!

మర్నాడు ఉదయం ఏడుగంటలకి కాలవగట్టుమీద ఓ పాతికజనం పోగయారు. బాగా నాలుగైదుగజాల ఎడంలో వనమయ్య పనసయ్యలు వాళ్ళ వాటాలకి సూటిగానే కూచున్నారు, కొద్దిగా ఎదురెండగా ఉంది. పనసయ్య గొడుగు వేసుకున్నాడు మరోటి తెప్పించి వనమయ్యకి ఇచ్చాడు. వనమయ్య ఉపక్రమించగా పనసయ్య అందుకున్నాడు. వాళ్ళిద్దరూ కూడా ఒకర్ని ఒకరు చూసుకోకుండా, వచ్చినమాట రానీకుండా, గొంతిగలు పోకుండా, చెమట పట్టకుండా, చెక్కు చెదరనియ్యకుండా, అశ్లీలాలు దొర్లకుండా తిట్టుగోడం నడిపించగా ఆట్టే హుషారీ లేకపోడంవల్ల జనం ఒకమోస్తరుగా ఉందన్నారుగాని బాగా మెచ్చలేదు. భోజనం వేళకి సమరం చాలించి అభ్యర్థులు వెళ్ళిపొయ్యారు. మెతుగులు నోట్లో వేసుగుని వీలైనంత వేగిరం రావచ్చుగదా అని జనం పరిగెట్టారు.

ఆరోజు సాయంత్రం తిట్లనిమిత్తంఛాన్సు స్త్రీల కిచ్చేశారు. వనమయ్య పెళ్ళామూ పనసయ్య వెధవఅక్కా ఒక ఉర్జీగానూ, వనమయ్య ముసలితల్లీ పనసయ్య సుస్తీపెళ్ళామూ ఒక జోడాగానూ ఏర్పడి వాగ్యుద్ధం కానిచ్చారు. అది ప్రారంభంలో వాచిక ప్రధానంగా ఉన్నా, కాలక్రమాన్ని అభినయవీక్షణ ప్రధానంగా మారింది. అప్పుడుకూడా అస్పృశ్యతకి భంగం ఏమీరాలేదు. పోగైన శ్రోతల్లో పెద్దలు ఈ స్త్రీలు తిట్టుకోడంకూడా ఎంతమాత్రం రక్తిగా లేదనిన్నీ, ఆకళ అంతగా తెలియనివాళ్ళు నేర్పర్లని నియమించుగుంటే బాగుంటుందనిన్నీ తీర్చారు. రాత్రి రెండో ఝాం వేళదాకా పనసయ్యని తిట్టగలందులకు నలుగురు జనానికి మనిషికి పావలా చొప్పున ఇవ్వడానికి వనమయ్య ఒప్పుగున్నాడు. తనికిగూడా ఓనలుగురు తిట్ల రాయుళ్ళని మాట్టాడి పెట్టమనిన్నీ, మొత్తం ఆజట్టు ఎనమండుగురు అవుతారు గనక రేటు మూడణాలకి ఒప్పించమనిన్నీ పనసయ్యకోరాడు. ఆప్రకారం వాళ్ళు రాగా, గృహమధ్యరేఖవెంట నాలుగు ఇలాయిలు పాతి, నలుగుర్ని ఒకయింటివేపూ, వాళ్ళవేపులకి జేర్లబడే టట్టున్నూ రెండో యింటివేపు ఉండేటట్టున్నూ తక్కిన నలుగురినిన్నీ కూచో పెట్టారు. వాళ్లు తమ చాతుర్యం చూపిస్తూ అర్ధరాత్రివరకూ అరుస్తూనే ఉన్నారు. వాళ్ళు తమకి సొమ్ము ఎవరిస్తున్నారో వాళ్ళనే తిట్టేసెయ్యకుండా కాయడానికి పాలేళ్ళని నియమించారు. వనమయ్య వచ్చి తనవాళ్ళని మరోటి కోరాడు. వాళ్ళు పనసయ్య పోయినట్టు ఉదయందాకా రాగాలు పెట్టాలంటే ఏంపుచ్చుగుంటారని అడిగాడు. అది ఆరుబయట వ్యాపారం గనక మనిషి ఒకటికి రూపాయికి తగ్గితే వాళ్లు కిట్టదన్నారు. ఆకాటికే వాళ్ళని అతను పురమాయించగా, తక్కిన నలుగుర్నీ వెంటనే వనమయ్య పోయినట్టు ఏడవడానికి పనసయ్య ఆరేటుకే బెత్తాయించాడు. వాళ్ళు ఉదయం వరకూ శోకన్నాలయుద్ధం దిగ్విజయంగా కానిచ్చారు. తాళ్ళమెరక వగైరాలనించి వచ్చిన శ్రోతలకి పడుకోడానికి చాపలు సప్లయిచేసి రయితులిద్దరూ సన్మానంచేశారు. ఉదయం లగాయతు కదనం తీవ్రం కావచ్చునని అంతా ఆశించారు. కాలవ దక్షిణపు వాలుగా వెడుతుంది గనక వనమయ్యకి, అతని వెధవ అక్క చెవులో ఊదింది. పనసయ్య ఉదయం లోపున పాలేళ్ళని నియమించి ప్రశస్తమైన కశ్మలం తెప్పించి, రాయి కట్టించి కాలవలో మధ్యగా, తనరేవుకి కొంచెం దక్షిణంగా వదిలిపెట్టించాడు. ఆ హడావిడిలో కొందరికి మెలుకువ వచ్చి లేచి “ఏమిటీ ఏమిటి” అని ఆ విసిరే వాళ్లని అడిగారు. “వనమయ్య పుట్టి మునిగిపోయింది” అని వాళ్లనేశారు. దాంతోటి వనమయ్య కుటుంబానికి కొంచెం కష్టం అనిపించింది. తల్లి సలహామీద వనమయ్య ఓకుక్క కళేబరాన్ని తెప్పించి తన యింటికి ఉత్తరాన్ని తగలేయించాడు. గాలి దక్షిణాన్నించి ఉత్తరానికి వీస్తూండడం వల్ల వాయుప్రమాదం తెచ్చిపెట్టి వనమయ్య పనసయ్యని విసిరి కొట్టదల్చుగున్నాడనే మాట పుట్టింది. ఆహోమధూమాలు అయిపోయేవరకూ పనసయ్య కుటుంబం తలుపువేసుగుని ఇంటోపడిఉండి తరవాతే బయటి కొచ్చారు. ఈలోపులో వనమయ్య పాలేళ్ళని పంపి రెండు తట్టల రాయి తెప్పించి తన ఉత్తరపు గోడదగ్గిరపెట్టించాడు. ఉదయం అయింది.

వనమయ్య చల్ది ఆరగించి, బట్టలు వేసుగుని, గొడుగు వేసుగుని, తన గోడదగ్గిర నుంచుని, సకిలించి, పనసయ్యతో శిలాయుద్ధం చెయ్యడానికి తట్టలు తనకి దగ్గరగా పెట్టమని పాలేళ్ళని కసిరి రాళ్ళకేసి చూశాడు. ఒక తట్టలోవి అంగుళంన్నర సైజువి, ఇంకో తట్టలోవి అంగుళం సైజువి అలా వ్యత్యాసంగా ఉండడం శత్రువుకి లాభకరంగా ఉంటుందేమో అని భయపడి, అతడు చిన్నతట్ట ఒక పాలేరు నెట్టి కెత్తి అవిచ్చేసి పెద్దసైజువే తెచ్చి పెట్టమన్నాడు. వాడూ పది బారలు సాగేసరికి పనసయ్యకి ఈ సంగతి తెలిసి అతడు చిన్నసైజు రాళ్ళు తనకి కావాలని వాడితో చెప్పి ఖరీదూ, కూలీ చేతులో వేసేసేసరికి వాడు ఆతట్ట పనసయ్యవేపు గుమ్మరించాడు. అంత కలిసొచ్చేటప్పుడు, ఒక తట్ట తనకి చాలనీ, రెండోది అనవసరమనీ చెప్పి వనమయ్య మనిషివాణ్ణి ఉండి పొమ్మన్నాడు. తన కేటాయింపుసైజు దొరకడానికి పనసయ్య సంతోషించి తనూ సిద్ధం అయాడు, తన పక్కని తను నుంచున్నాడు, పాలేరువాడు తనకి గొడు గట్టాడు. తను ఓరాయి తీసి “కాసుకోండి” అని నిరసనగా దక్షిణానికి విసిరాడు. అది మధ్యగీత దాటకుండా పడింది. వనమయ్య “చెయ్యండి, ఎం జెయ్యగలరో చూస్తాను!” అంటూ ఉత్తరంగా రాయి గిరవటేసరికి అదీ మధ్యగీత దాటకుండానే పడింది. అప్పుడప్పుడు తమ చెమట పాలేర్లు తుడవగా వాళ్ళు కొంతసేపటికి రాళ్ళన్నీ విసిరేశాయి. అవన్నీ మధ్య గీతకి ఎడాపెడా ఎవళ్ళవి వాళ్ళు సహంమేరలోనే గుట్టలులాగా పడ్డాయి. వాళ్ళిద్దరూ ఇంట్లోకి దాహం తాగడానికి వెళ్ళి వచ్చేలోపల పెద్ద సైజురాళ్ళన్నీ వనమయ్య పాలేరూ, చిన్న సైజువి పనసయ్య పాలేరూ తట్టల్లోకి ఎత్తేసి మళ్ళీ తమ తమ యజమాన్ల దగ్గిర హాజరు పెట్టేశారు. రెండో వేటులో వాళ్ళిద్దరూకూడా వడి హెచ్చు చేశారుగాని నేర్పు ఎక్కువ కనబరిచి హద్దుమాత్రం మీరలేదు. ఇంకా జోరుగా విసురుగోడానికి మూడోమాటు తయారవుతూండగా, జనంలో కలకలం బయల్దేరింది. తాళ్ళమెరక గ్రామపు మునసబు కరణాలు ఇద్దరూ వచ్చిపడ్డారు. వనమయ్య పనసయ్యలకి యుద్ధం జరుగుతోందని తెలిసి లోకకల్యాణం నిమిత్తం వాళ్ళిద్దర్నీ నిరాయుధుల్ని చేసి, పోలీసులకి తెలియకుండా కట్టుదిట్టంజేసి వెళ్ళడానికి వాళ్ళొచ్చారు. ఒకర్ని ఒకరు నరుక్కుంటారనే భయం చొప్పున కత్తికటార్లూ, ఒకర్ని ఒకరు తగలబెట్టుగుంటారనే భీతి చొప్పున చమురు తైలాలూ ఇచ్చెయ్యమన్నారు. వాళ్ళు తమర్ని ఒకవేళ ఇంకా దగా చేస్తారేమో అని పెద్ద సూదంటురాయి తాడుకి కట్టి రెండు కొంపల్లోనూ గిరగిరా తిప్పారు, దాంతో సూదులూ, చాకులూ, కొడవళ్ళూ లాంటివి టపీమని వచ్చి దానికి అంటుగుపోయాయి. గడ్డపారలు కూడా నాట్యం ప్రారంభించాయి. ఆరీతిగా అన్నీ లాగేసి, “స్పంజి” లు గిరవటేసి నూనెలన్నీ పీల్చేశారు. ఎవరూ కూడా అగ్గిపెట్టెలూ మతాబాలూ వంటి బాణసంచా స్వాధీనంలో ఉంచుగోకూడదనిన్నీ, ఒకడంటూ వెళ్లి వాటిని పేల్చకపోయినా స్వయంగానే పేలగల సత్తా వాటి కుందిగనక వాటిని వీలైనంత త్వరలో తగలెయ్యడం మంచిది గనక ఎవడి వాటాలో మాత్రం వాడు మతాబా కాల్చినా నేరంకిందికి రాదనిన్నీ అనేసి, మామూలు మర్యాదలు పొంది, కొంచెం నిమ్మణించారు.

దుర్ముహూర్తం వెళ్ళినట్టేనా అని పసనయ్య వాకబు చేశాడు. తను అన్నంతపనీ చెయ్యడానికి టైం అయిందన్నాడు. ముందు వనమయ్యవేపు సగంభూమీ ఖాళీ చెయ్యాలని కబురంపించాడు. “నువ్వెం జెయ్యగలవో చూద్దాం, అదేపోయిరి అనిగాని భయపడి కాదు” అని సమాధానం పంపించి వెంటనే వనమయ్య తనపక్క ఖాళీచేశాడు, ఒక అరక కట్టి తోలుకు రమ్మని పనసయ్య ఒక పాలేర్ని అంపి ఈలోపులో ఓ చాకింటి ఇస్త్రీమడత పంచ విరిచి కట్టుగుని, ఆఫారం తొడిగి చేతులు ఎగసం దోసి, మీసాలుపోగుచేసి వడేసి, గిరజాలు దువ్వి, పైన ముచ్చటముడి రానిచ్చి, చెప్పులు తొడుక్కుని, చుట్టకాలుస్తూ కయ్యానికి సర్వసిద్ధం అయాడు, వనమయ్య లంగోటీబిగించి, పులిపిరిపంచె కట్టి, గ్లాస్గో షర్టు వేసి తాంబూలం నముల్తూ కళ్ళజోడు తుడుస్తూ, తనవేపున తిరుగుతూ ఉన్నాడు. పనసయ్య పాలేరు ఓ గొడ్డుగేదెనీ, ఓ దున్ననీ పూన్చి అరక తోలుకొచ్చాడు. అది కొంచెం పైన సమతలంగా ఉన్న చోట నిలప వలిసిందని అంటూ, పనసయ్య వాణ్ణి హెచ్చరించి, ఆ చోటు చూపించాడు. చేతులో గొడుగు ఇటూ అటూ ఊగడంవల్ల దున్నా గేదీకూడా హడిలి, బెదిరి, ఎగిరి, మేఘాలమీద లేచిపోయాయి. నాగలి అక్కడే ఉండనిచ్చి పొగరుమోతులు కాని ఎడ్లనే తోలుకురమ్మని పనసయ్య పాలేరుతో అన్నాడు. వాడూ వెళ్ళి రెండు ఎడ్లని - బక్క చచ్చి ఉసూరుమంటూ కళ్ళల్లో ప్రాణాలు పెట్టుగున్న వాటిని - తోసుగొచ్చాడు. వాట్లకీ నాగలికీ పసుపు రాయించి వాటిని కట్టి, కర్రు నేలకి ఆనించి, నాగలిపిడి పనసయ్యకి అందించి, ముల్లుకర్రకూడా అతడి చేతికిచ్చి పాలేరు తప్పుగుని పనసయ్యకి గొడుగుపట్టాడు. ఎడంచేత్తో నాగలి అదిమి “ధర్మానికేజయం, అనగా నాకే!" అని కేకేసి, పనసయ్య ఎడ్లని కర్రచ్చుగుని పక్కమ్మట తగిలించాడు. అవి కించిత్తూ చలించలేదు. తక్షణం అతడు రెండింటినీ ముల్లుపుచ్చుగుని రక్తంవచ్చేలాగ - రక్తం ఉంది గనక వచ్చింది - గుచ్చాడు, అవి రొండూకూడా పడుకున్నాయి. ఇంకా కొట్టినా గుచ్చినా అవి నిద్దరకూడా పోతాయేమో అని పనసయ్య నిదానించాడు, పనసయ్య (తన పాలేరుతో) “మరి అటకాయించ మనవోయ్, పౌరుషం ఉంటేనూ!” అని గిరజాలూ, మీసాలూ రెండు చేతులా దువ్వి చూపించాడు. వనమయ్య ఆ పాలేరు కేసే చూస్తూ, “అసలు దున్నమనవోయ్, పశుత్వం నిలబడితేనూ” అని కనుబొమలూ, క్రాపింగూ రెండుచేతులా దువ్వి చూపించాడు. పనసయ్య పాలేళ్ళలో ఒక తెలివిగలవాడు చరచరా పరిగెట్టి చిట్టుబుట్టా, తెలకపిండీ పట్టుగు చక్కావచ్చి ఎడ్లకి చూపించాడు. ఎడ్లులేచి విద్దెంచేసి నడక కూడా ప్రకటించాయి. పనసయ్య నాగలి చాలాతేల్చి పట్టుగున్నా కొంచెం గడ్డ విరిగింది. పనసయ్య పార్టీ వాళ్ళంతా కరతాళధ్వనులు చేసి ఈలలు వేశారు. వనమయ్యకి ఆగ్రహం, ఆవేశం ఇనుమడించాయి. అతడు హుంకరించి, మజ్జిగ తాగి, తల్లికి మొక్కి పెళ్ళాం యిచ్చిన హారతీ, స్నేహితులు వేసిన కర్పూరదండా ఆఘ్రాణించి, ఠీవిగా నడిచి డేకుతూన్న ఎడ్ల ఎదటికి వెళ్ళి, ఈలోపుగానే మిక్కిలి చకచకా తన పాలేళ్ళు అక్కడ పరిచిన పరుపు సమీపించి “ధర్మానికే జయం , అనగా నాకే!” ముక్తసరుగా ఉపన్యసించి ఒంటరిగాడైనప్పటికీ అమితమైన ధైర్యమూ, అమానుషమైన సాహసమూ వెలిబుచ్చుతూ దానిమీద పరుండి అరక సాగకుండా అడ్డుతగిలాడు. వనమయ్య పక్షంవాళ్ళు ఎగిరి, గంతులేసి, పక్కవాళ్ళని బాది, రుమాళ్ళూ తలపాగాలూ పైకి ఎగరేసి ఎవళ్ళవి వాళ్లు సంపాదించుగునేసరికి నానాబాధా పడ్డారు. ఎడ్లేనా తొక్కెయ్యచ్చు, నాగలేనా చీరెయ్యచ్చు, పనసయ్యేనా గుచ్చెయ్యచ్చు అనే నిరాశలో పడిపోయి, వనమయ్య చూస్తూనే ప్రాణం ఉగ్గబట్టి, పైకిమాత్రం నవ్వు మొఖం పెట్టి, కర్రబారి పోయాడు. ఇంతలో దగ్గిర దగ్గిర జనం “ఎముకలులా ఉన్నాయేం? దున్నగానే బయట పడుతున్నట్టున్నాయి” అంటూ వెనక్కి తగ్గి ఇంటికి దారెట్టడం సాగించారు. వనమయ్య ఆ కాస్తచూపూ లేకుండా ధైర్యంగా కళ్ళు మూసేసుగున్నాడు. పనసయ్యకి వణుకుపుట్టింది. కాని ఏర్పాటు ప్రకారం పనసయ్య మనుష్యులు నలుగురు ఓబల్ల చెక్క తెచ్చి పక్కని ఉంచి దానిమీదికి అతిమృదువుగా వనమయ్యని పరుపుపళంగా ఎక్కించి, నడకలో తడబడినా, పడెయ్యకుండా సాయంపట్టి కాలవగట్టుమీద అతని యింటి ఎదట పెట్టారు. ఓ పాలేరు వనమయ్య మొహంమీద నీళ్ళు కొట్టాడు. వెంటనే అతడు లేచి పరుపు తడిసిపోతోందని వాణ్ణి తన్నబోయాడు గాని తూలిపోయాడు. కొడుకు పాట్లకి తల్లి కళ్లు ఒత్తుగుంది. కాని అతని పెళ్ళాం ఓ రోకలి పుచ్చుకుని నాగలివేపుకి రాబోయింది. పనసయ్యకి పై ప్రాణం పైనే ఎగిరిపోయింది. అతడు చాలా అర్జెంటుగా బయటికి వెళ్ళి వస్తానని చెప్పి నాగలి ఓ పాలేరుకి అప్పగించాడు, ఇంతలో ఎడ్లు పడకేశాయి. పనసయ్య తనయింటి గోడదగ్గిరికి జేరుకుని 'అమ్మయ్య' అనుకుని, ఎడ్లకి తెలకపిండి పెట్టి లేవగొట్టమని ఇద్దర్ని పంపించాడు. ఎన్నివీశెల తెలకపిండి పెట్టినా, అవేం యెడ్లోగాని, తలకాయకూడా నేలమీదే సాచి తిన్నాయి గాని లేవడానికి సంకల్పమేనా ఉన్నట్టు కనిపించలేదు. పనసయ్యకి మరోమార్గం తోచక, ఆ బల్ల చెక్క పట్రమ్మని దాని మీదికే ఒక్కొక్క ఎద్దుని ఎక్కించి వనమయ్యని జేరవేసినట్టే వాటినిగూడా జేరవెయ్యమని మరోనలుగుర్ని పంపించాడు. విజయసూచకంగా ఉండే నిమిత్తం నాగలి పట్టుగున్నవాణ్ణి అల్లానే పట్టుగు ఉండమని చెప్పడానికి మరోణ్ణి పంపి తను ఇంట్లోకి వెళ్లాడు. వెంటనే అతని వెధవ అక్క అతనికి దిష్టితీసేసింది. అంతా వెళ్లిపోయారు.

అదిలగాయితు ఆభూమి తప్పకుండా శ్మశానమే అయిఉండి ఉండాలనే భావంతో వనమయ్య పనసయ్యలు దాల్లో చదరపు అంగుళమూకూడా దున్నలేదు, వాడలేదు, తొక్కలేదు. కాని మునసబు కరణాలు ఆ భూమి ఆయేడు సాగు అయినట్టు పైవారికి తెలియచెయ్యడంవల్ల వెన్నావారికి ఆరురెట్లు అపరాధంపన్ను కట్టారు. ఆ దెబ్బతో వెన్నావారికి అక్కడ పొలం ఉన్నట్టు బోధపడింది. వాళ్ళూ తంటాలుపడి పైవాళ్ళనిచూసి, అవసరప్రకారం సంతోషపూర్వకంగా లంచాలుపోసి, బ్రహ్మాండంమీద అది రుద్రభూమేగాని తమదికానేకాదని లెఖ్కల్లో నమోదు చేయించేవరకూ నిద్రాహారాలు లేకుండా శ్రమపడ్డారు. ఆ భూమి అరణ్యంలాగ మళ్ళీ దుబ్బువేసింది. నాటికి నేటికి ఆక్షేత్రంలో సంగ్రామము మాత్రం మరోటి ఏదీ జరగలేదు, ఏగ్రామం వాళ్ళూ చూడరానూ లేదు. వనమయ్య పనసయ్యలు మాత్రం కొద్దికాలంలో కూడబలుక్కుని అక్కణ్ణించి కాపరాలు ఎత్తేశారు.

- జూలై, 1941