గువ్వలచెన్న శతకం

శ్రీ పార్థసారథి ! నేఁ బాపాత్ముఁడ నీదుపాలఁ బడినాఁడ ననుం గాపా డుమనుచు నాంతర కోపాదు లడంచి వేడు గువ్వలచెన్నా !

అర్జునుని సారథివైన శ్రీకృష్ణా! నేను పాపాత్ముణ్ణి. నీ వద్ద చేరాను. నాలోపల ఉన్న కోపాదులను నశింపచేసి నన్ను కాపాడమని గువ్వలచెన్ననయిన నేను వేడుకుంటున్నాను.


నరజన్మ మెత్తి నందున సరసిజనాభు నెదలోన స్మరియించుచుఁ ద చ్చరణములు మఱవ కుండిన గురు ఫలమగు జన్మమునకు గువ్వలచెన్నా !

మనుష్య జన్మ ఎత్తినందుకు శ్రీ మహావిష్ణువుని హృదయంలో స్మరిస్తూ, ఆ విష్ణు పాదారవిందాలని మరవకుండా వుంటే అదే జన్మకి గొప్ప ఫలం.


ఎంతటి విద్యల నేర్చిన సంతసముగ వస్తుతతులు సంపాదింపన్ జింతించి చూడ నన్నియు గొంతుకఁ దడుపుకొను కొఱకే గువ్వలచెన్నా !

ఎన్ని విద్యలు నేర్చినా, ఎన్ని వస్తువుల్ని సమకూర్చుకున్నా, ఆలోచించి చూస్తే అవన్నీ తాగడానికే తినడానికే..

సారాసారము లెఱుగని బేరజులకు బుద్ధి జెప్పఁ బెద్దలవశమా నీరెంత పోసి పెంచినఁ గూరగునా నేలవేము? గువ్వలచెన్నా!

సత్తా, సారము వుందీ లేనిదీ తెలియని కుత్సితులకు పెద్దలైనా బుద్ధి చెప్పగలరా? బాగా నీరు పోసి పెంచినా నేలవేము కూరకు పనికిరాదు గదా!

అడుగునకు మడుఁగు లిడుచును జిడిముడిపా టింతలేక చెప్పినపనులన్ వడిఁజేసి నంత మాత్రన కొడుకగునా లంజకొడుకు? గువ్వలచెన్నా!

నోట్లో మాట నోటిలో ఉండగానే, చేతులు కట్టుకుని చెప్పిన పనులను చేయడానికి ఏ మాత్రం విసుగు లేకుండా వున్నంతమాత్రాన లంజ కొడుకు తన ధర్మపత్నికి పుట్టిన కొడుకు అవుతాడా? కాలేడు.

ఈవియ్యని పదపద్యము గోవా? చదివించుకొనఁగఁ గుంభినిమీఁదన్ ఈవిచ్చిన పదపద్యము గోవా మఱిఁజదువుకొనఁగఁ గువ్వలచెన్నా !

బహుమానం ఇవ్వకుండా పద పద్యం చదివించుకుంటే అది చాలా నిస్తారంగా ఉంటుంది. బహుమానం ఇచ్చి పద్యాన్ని భూమ్మీద చదివించుకుంటే జామపండులా తృప్తినిస్తుంది.

గువ్వలచెన్న శతకం

Wednesday, January 23, 2008 8:03 PM

కలకొలఁది ధర్మముండినఁ గలిగినసిరి కదలకుండుఁగాసారమునన్ గలజలము మడుపులేమిని గొలగొల గట్టు తెగిపోదే ? గువ్వలచెన్నా!

ధర్మం స్థిరంగా ఉన్నంతకాలం ఉన్న సిరి స్థిరంగా ఉంటుంది. చెరువులో వున్న నీరు తూము లేకపోతే గడగడా పారి గట్టు తెగిపోతుంది.

తెలిసియు ! దెలియనివానికిఁ దెలుపంగలఁడే ? మహోపదేశికుఁడైనన్ బలుకంబాఱనికాయల గొలుపంగలఁడెవఁడు పండ ? గువ్వలచెన్నా

మిడి మిడి జ్ఞానం గలవాడికి మహామహా ఆచార్యుడైనా తెలియచెప్పలేడు ? అలాగే కంబళిలోని వెంట్రుకల సమూహాన్ని లెక్కించగలవాడు లేడు.

చెలియలి భాగ్యము రాజ్యం బుల నేలుచు జనుల ద్వేషఁమునజూచుచుఁ గ న్నులమత్తతఁగొన్నాతఁడు కొలనికిఁగావున్న వాఁడు గువ్వలచెన్నా !

ఏదో ప్రియురాలి అదృష్టవశాత్తు రాజ్యాన్ని పాలిస్తూ ప్రజల్ని ద్వేషంతో చూస్తూ కళ్ళ కావరమెక్కి వున్నవాడు చెరువుకు కాపలావున్న వంటివాడితో సమానం.


అపరిమిత వాహనాదిక మపూర్వముగ నున్న్ అయల్పుఁడధికుండగునా ? విపులాంబర వాద్యంబులఁ గుపతియగినె గంగిరెద్దు ? గువ్వలచెన్నా !

వాహనాదికాలు పరిమితంగా వున్నా అల్పుడు అధికుడు అవుతాడా? గంగిరెద్దు వేషం వేసినా వాయిద్యాలకు పతి అవుతుందా?

పందిరి మందిరమగునా ? వందిజనంబా ప్తమిత్ర వర్గంబగునా ? తుందిలుఁడు సుఖముఁగనునా ? గొంది నృపతిమార్గమగున? గువ్వలచెన్నా !

పందిరి సేదదీరే మందిరం అవుతుందా? ఆహా ఓహో అని చుట్టూ చేరి పొగుడుతూ వుండేవాళ్ళు ఆప్త బంధువులు అవుతారా? బానబొజ్జ గలవాడు హాయిగా ఉంటాడా? సందులు గొందులు రాజమార్గాలు అవుతాయా ? కావు.


మిత్రుని విపత్తునందుఁ గ ళత్రమును దరిద్రదశను భ్రాతలగుణమున్ బాత్రాది విభక్తంబున గోత్రను గనుఁగొనఁవలయు గువ్వలచెన్నా !

అసలు సిసలు మిత్రుల గుణం విపత్తులు వచ్చినప్పుడు కనిపిస్తుంది. దరిద్ర దేవత గుమ్మంలో వున్నపుడు పెళ్ళాం గుణం కనిపిస్తుంది. అన్నదమ్ముల గుణాలు పంపకాలప్పుడు బయట పడతాయి.

అంగీలు పచ్చడంబులు సంగరిఁగొనుశాలుజోడు సరిగంచులమేల్ రంగగు దుప్పటు లన్నియు గొంగళి సరిపోల వన్న ! గువ్వలచెన్నా!

అంగీలు, దుప్పట్లు, శాలువాలు, సరిగంచులు, మేలిరంగు దుప్పట్లు ఎన్నివున్నా గొంగళికి సాటిరావు.

స్వాంతప్రవృత్తిఁ గార్యా నంతరమున మిత్ర లక్షణంబు మద్యో హో గాంతరమున బంధుత్వముఁ గొంతైనంతటస చూడు గువ్వలచెన్నా !

పని పూర్తయిన తరవాత మిత్ర లక్షణమ్ సానునయంగా వుండదు. ఉద్యోగ విరమణ తర్వాత బమ్ధువుల తత్వం కొంతైనా బయటపడుతుంది.

పురుషుండు తటస్థించిన 

తరుణమునందరుణి గుణముఁ దరుణిదనంతన్ దొరికినఁ బురుషుని గుణమును గురుబుద్ధీ ! తెలియవలయు గువ్వలచెన్నా !

పురుషుడు తటస్థించినప్పుడు యువతి స్వభావం, యువతి తనంత తాను దొరికినప్పుడు పురుషుని నైజం బయటపడతాయి. బుద్ధిమంతుడైనవాడు అది తెలుసుకోవాలి.

కలిమిఁగల నాఁడే మనుజుఁడు విలసనమగు కీర్తిచేత వెలయఁగ వలెరా! గలిమెంత యెల్లకాలము కులగిరులా కదలకుండ ? గువ్వలచెన్నా !

సిరి సంపదలు వున్నప్పుడే మనిషి మంచికీర్తి చేత ప్రకాశించాలి. ఎందుకంటే సిరిసంపదలు స్థిరంగా సప్తకుల పర్వతాలలాగా అలానే వుండవు.