గువ్వలచెన్నశతకము/పద్యాలు18-29

స్వాంతప్రవృత్తిఁ గార్యా
నంతరమున మిత్రలక్షణంబు మద్యోహో
గాంతరమున బంధుత్వముఁ
గొంతైనంతటన చూడు గువ్వలచెన్నా!

18


పురుషుండు తటస్థించిన
తరుణమునం దరుణిగునముఁ దరుణిదనంతన్‌
దొరికినఁ బురుషుని గుణమును
గురుబుద్ధీ! తెలియవలయు గువ్వలచెన్నా!

19


కలిమిఁగల నాఁడె మనుజుఁడు
విలసనమగు కీర్తిచేత వెలయఁగ వలెరా!
గలిమెంత యెల్లకాలము
కులగిరులా కదల కుండ? గువ్వలచెన్నా!

20


బుడ్డకు వెండ్రుకలున్నన్‌
గడ్డముకానట్ల కార్యకరణుల సభలన్‌
దొడ్డుగఁ జూతురె? తలపై
గుడ్డలు బుట్టంత లున్న? గువ్వలచెన్నా!

21


వనజజకులులును శూద్రులు
ననియెడి భేదంబు లేక యందఱు నొకరీ
తిని గొని యాచారాదుల
గుణముల సరి నుంద్రుముందు గువ్వలచెన్నా!

22


కలుఁద్రావి నంజుడుం దిను
ఖలుసుతుఁడు వకీలె యైన ఘనమర్యాదల్‌
తెలియవు బ్రాహ్మణుఁడైనను
కులపాంసనుఁ డనఁగఁదగును గువ్వలచెన్నా!

23


వారిది వారిది ధనమొక
కారణమున వచ్చిపడఁగఁ గన్నులుగన కె
వ్వారినిఁ దిరస్కరించును
గోరెఁడు ధర్మంబు లేక గువ్వలచెన్నా!

24


ఇలుఁగలఁడె? పరివ్రాజకుఁ
డెలమింగొనునెట్లు వేశ్య? యీనివిటునెడన్‌
గులకాంత విత్తమడుగునె?
కొలఁదిఁ గలదె ఱంకులాడి గువ్వలచెన్నా!

25


ధన మతిగఁ గల్గి యున్నను
దనయలుఁ దనయులును గల్గి తనరుచునున్నన్‌
ఘనలోభియు నిఱుపేదయు
గుణముల సరియగుదు రెన్న గువ్వలచెన్నా!

26


చండాల కులుఁ డొసగిన
తండులముల బ్రతికినట్టి ధాత్రీశకులుల్‌
నిండుతనం బెఱుఁగుదురే?
కొండికలఁ జరింత్రు గాక గువ్వలచెన్నా!

27


సిరిఁగలిగినంత బంధూ
త్కరములలో నెవరురారు ద్రవ్యాసూయా
పరతాశాపరులయి పదు
గురు చూచి హసింతు రంచు గువ్వలచెన్నా!

28


సంపద గలిగిన మనుజుని
కొంపకు బంధువులు కుప్పకుప్పలుగాఁగన్‌
సొంపుగ వత్తురు పేదకుఁ
గుంపటు లన నుంద్రువారె గువ్వలచెన్నా!

29