గరిమెళ్ళ వ్యాసాలు/మున్నుడి

మున్నుడి

   ఈ గ్రంధములో నేడవకుసుమమును మాచందాదారుల కందరికి నందజేయు చున్నాము.  మా గ్రంధమాలలోని గ్రంధములనెల్ల తలమానిక మనదగినది యీ అర్ధత్రయ సర్వస్వమేయని మా విశ్వాసము. ఈ గ్రంధము అఱవ భాషలో క్రీ.పూ. రెండవ శతాబ్దములో తిరువల్లవరునాయనారు అనుఒక సాలెకులస్థునిచే రచింపబడినది. ఈ గ్రంధమును సదరు కవీంద్రుడు సన్యాసాశ్రమము పుచ్చుకొనిన తరువాత రచించినారట. మానవజన్మమున కవశ్యసాధన నీయములగు చతుర్విధ పురుషార్ధములను గూర్చి శ్రుత్ స్మృతి శాస్త్రము అనుభవము లను నాలుగు విధములగు జ్ఞానములను గల ఆ మహనీయున కెట్టి పరిచయమును అభిప్రాయములును నున్నదియు ఈ గ్రంధము వలన పాఠకులకు విదితము కాగలదు. చతుర్దపురుషార్ధమగు మోక్షమును గూర్చి వివరముగ నతడీ గ్రంధమున చర్చించబడకపోయినను ధర్మ భాగములో రెండవ విభాగమగు సన్యాసాశ్రమమును గూర్చి ప్రవేశించుటలో ఆ సన్యాసికి గల మోక్షపరిజ్ఞానము కూడ మనకు విదితం కాగలదు. మోక్షమును గూర్చి వివరముగ చర్చించబడని కారణము ఈ గ్రంధము యెక్క ఉపోద్ఘాతములొ గాననగును.
       తక్కిన మూడు పురుషార్ధములను గూర్చియు సమగ్రమగు జ్ఞానమును సుందరమగు కవిత్వముతో నింత సూక్ష్మముగ విరచించిన గ్రంధము ప్రపంచములో నింకొకటి లేదని విద్వాంసులనేకులంగీకరించిన విషయము. దర్మమును గృహస్థ భాగము సన్యాసభాగము అను రెండుపాయలుగను అర్ధమును రాజ్యాంగభాగము సామాన్యభాగము అను రెండు పాయలుగను కామమును సంస్కృతములోని సంభోగభాగము విప్రలంబు భాగములకు గ్రమముగ నొప్పిడి చౌర్యభాగము సతీత్వ భాగములను రెండు పాయలుగను విడదీసి యరేదముగ వర్ణించినాడు. నీతి గఱపుటలో మొదటి భాగమును వివేకమును గల్పించుటకు రెందవ భాగమును భోగరుచి చూపించుటకు మూడవ భాగమును అనుపమానములైనవని చెప్పవలెను. ధర్మసిద్ధమగు జీవనమును నడుపగోరు ప్రతిమానవుడును మానవతియు (అట్లు నడుపుటకు గోరనైనగోరని యభాగ్యులను గూర్చి మన మాలోచించవలసిన పనిలేదు) మొదటి భాగమును బఠింపక తీరదు. అట్లు కోరనివారికి కూడ ఇదియొకసారి చదివిన యెడల గాని వినిన యెడల గాని ధర్మము చేయవలెననెడి వేడిని ఉత్సాహమును పుట్టించి కుత్సితములనుండి, బూటకముల నుండి, సందేహములనుండి తోలగించి అకళంకస్వాంతులను జేయును గనుక సకల గృహస్థులకును సన్యాసులకును గూడ ఇది అవశ్వపఠనీయంబని వక్కాణింపక తీరదు. అర్ధ భాగములో రాజులు, మంత్రులు, సైనికులు, సేవలు, వేగులు, స్నేహితులు, బందుగులు మొదలగు రాజ్యాంగ నిర్వహణమునకు బ్రధానులగు జనులెల్లరును గలిగియుండవలసిన లక్షణములు విడువవలసిన గుణములు ఒకరి యెడల నొకరు మెలగవలసిన రీతులు అతి వివేకవంతముగను సారస్య్లముగను వర్ణింపబడుటయే గాక, దేశము, కోట, మొదలగు సంస్ధలెట్లు అమర్ఫబడవలసినదియు గూడ సూచింపబడినది. మరియును సశేషభాగమును రెండవపాయలో రాజ్యాంగ సంబంధములేని యితరులు గూడ తమ తమ స్వంతరాజ్యములగు సంసారములను నిర్వహించు విషయములోనున్ను ద్రవ్యోపార్జవాది యితర విషయములలోనున్ను యెట్టి మెలకువ కలిగి ప్రవర్తించవలసినదియును మిగుల క్రమముగను నింపుగను వర్ణీంపంబడినది.
   ఇక మూడవ భాగమగు కామ భాగమునందా, ప్రియుడును ప్రియురాలును తొలుదొల్త నొకరి నొకరు భోగించుట, నానాటికీ అసౌక్యమునందు మత్తులగుట, గుట్లు బయలుపడనుండుట, లేచిపోవుట, విమర్శించుకొనుట, తిరిగి గృహంబు చేరుకొనుట వివాహబందితులగుట మొదలుగాగల  ద్రవిడ శృంగారరస సంప్రదాయ ప్రకారమగు సంభోగ శృంగార పరిణామ ప్రకరణములును, వివాహానంతరమున నాయకుడు ధర్మార్ధ కామములలో నేదేని యొక దానిని గాని లేదా యొక్కొక్కప్పుడొక్కక్క దానిని గాని సేకరించు నిమిత్తం నాయిక నెడబాసియుయుండునప్పుడు ఒకరి నొకరు విడబాసియెట్లు కాలము గడుపగలిగి రను నంశములును మిగుల శృంగారముగ వర్ణింపబడినవి. ధర్మభాగములో భార్యా భర్తలకు సంబంధించిన ధర్మజీవనమును సాంసారిక జీవనమును నడుపవలసిన విధానమును వర్ణింఛి వారి భొగమునకు సంబంధించిన శృంగార రసము నిందు చిత్రించినాడు.ఈ రెండు భాగములలోను నెచ్చటను గాని సంస్కృత గ్రంధము లనేకములొ వలె శృంగారరసమును పచ్చిచేయక బావముయొక్క సూక్ష్మసౌందర్యమును క్రొంగ్రొత్త కధలతో వర్ణింపగలుగుట అతని అసమాన ప్రజ్ఞకు నిదర్శనము.
  తిరువల్లువరునాయనారు జీవచరిత్రమును, వారి గ్రంధమును రచించి తమిళసంఘము లేల తమిళ పరిషత్తు దగ్గర పఠించుటకు పోయిన ప్రకారము, ఆకాశవాణియు తమిళ సంఘమును వారిని సన్మానించిన రీతియు, యుగయుగముల సంఘపండితులును కవీంద్రులును వారిని ప్రశంసించుచు వ్రాసిన పద్యములు మొదలగున వెల్లయును వాటంతట నవియే యొక సంపుటము కాగలవు.  ఈ "తిరుక్కుఱళు" ఆరు సంపుటములును ముద్రించిన తరువాత నేడవ సంపుటముగా దానిని ముద్రించి ఆంధ్రుల కరపద్మములకు దానిని గూడ అర్పించగలవాడను.
    "తిరుక్కుఱళు" శబ్దము యొక్క వ్యుత్పత్తిని గూర్చి కొంచెము చెప్పవలసి యున్నది. తిరుశబ్దము శ్రీ శబ్దభవము - శృఈ శబ్దము ఆంధ్రభాషలో 'సిరి ' యగునట్లే తమిళ భాషలో 'తిరు ' అగును. తిరుమణి, తిరువీధి, తిరుపతి, తిరువల్లిక్కేణి, తిరువణ్ణామలై, తిరువల్లువరు మొదలగు పేరులలో నింకను యలరారుచున్నది. శ్రె యనగా శుభ్రమైన లేక దైవసంభంధమయిన యని యర్ధము.  కుఱుళనగా యించుమించు సూత్రమని యర్ధము - విస్తారమగు అర్ధమును భావమును నొక చిన్న వాక్యము లేక పద్యములో నిముడ్చబడినచో దానికి కుఱళు అని అర్ధము- కుఱళుశబ్దమునకు వ్యుత్పత్తి యర్ధము పొట్టిదైన" యని., అయినను తిరువల్లువరునాయవారు ఈ గ్రంధమును రచించిన నాటనుండియు ఆ శబ్దము ఈ గ్రంధమునకు మాత్రమే చెందుచు వచ్చినది. గీతయనగనే భగద్గీత యగునట్లు బైబిలు (అసలు అర్ధము పుస్తకము అని) అనగనె క్రైస్తవమత గ్రంధమగు బైబిలు అగునట్లు, వేదము(అనగా చెప్పబడినదియని మొదటి యర్ధము, మాట) అనగనె మన ఆర్యవేదములగునట్లు కుఱళు అనగనె వల్లువరిగారి కుఱళేయగుచున్నది.
   ఇది యెల్లయును పద్యములలో వ్రాయబడిన కావ్యమైయున్నది. ప్రతి పద్యమును రెండేసి చరణములు గలది - అందుకో మొదటి చరణము రెండవ దానికన్న పొడుగైనది. తమిళ సాంప్రదాయ ప్రకారము యతితోనో ప్రాసయతితోనో అది కూడుకొనియుండును. మొదటిచరణము నాలుగు గణములతోను రెండవచరణము సుమారు రెండున్నర గణములతోను కూడి యుందును. తిరువల్లువారు ఈ గ్రంధము వ్రాసిన నాటి నుండియును ఆ చందస్సునకు కుఱళుచందము అనుపేరు రూఢియైనది. తెలుగులో గూడ నేనును అట్లే గ్రంధమునెల్ల వ్రాసి ఆ చందస్సుకు గూడ కుఱళు అను శబ్దమునే ఉపయోగించుచు వచ్చితిని యీ గ్రంధమును పఠించెడి వారికి విశదము కాగలదు. అది స్త్రీలు మొదలగు వారు పాడుకొనుటకును పండితులు చదువుకొనుటకును గూడ వీలుగనుండును. అఱవ కుఱళుకు సామీప్యం గల చంద మితకన్న వేరొక్కటి లేదు.
   చందోబద్దములగు చిన్న సూత్రములలో విస్తారముగు అర్ధములను గూర్చి సూక్ష్మముగ నుపన్యసించిన కావ్యమేది యనిన తిరుక్కుఱళళు అనియే చెప్పవలెను. ఆ మూడు పురుషార్ధములను గూర్చియు సకల సమాచారమును నిందు క్రమనియమము తప్పిపోకుండ చెప్పబడియున్నది గనుకను, ఇందులో లేని సమాచారము మఱియొకదానిలో లేదని చెప్పబడుటచేతను ఇది మహోత్కృష్ట గ్రంధమని నిర్ఫచించుటకెట్టి యాటంకమును లేదు. ఇట్టి గ్రంధమును వ్రాయుటచేతనే కవిదైవముగ భావింపబడి దైవత్తిరువల్లువరు అని పిలువబడుచున్నాడు. అట్టి గ్రంధములో నెట్టిదైన లోపముగాని చెప్పబడని సమాచారముగాని యున్నదని మన మెంచితిమేని అది మన బుద్దిలోపమును భాషాంతరకారుల లోపమును వ్యాఖ్యాతల లోపమును నగునుగాని కవిలోపము కాదు. కనుక గ్రంధము యొక్క లోపము గాని యెంత మాత్రమును కాదు. కనుక గ్రంధము యొక్క నిజమైన రహస్యమును మహత్వమును మనము గ్రహింపవలెననిన మహా మహుడగునొక వ్యాఖ్యాత సహాయము మనకత్యవసమై  యున్నది.
  ఇట్టి మహోత్కృష్టమగు గ్రంధము మీద ననేకము వ్యాఖ్యానములు అఱవ భాషలో వెలసినవి. అవియన్నియును బంద్ను పట్టును. అయినను పరిమేలజగరు అనునొక బ్రాహ్మణపండితోత్తముడు, సంస్కృత విద్వాంసుడు కాంచీపురవాస్తవ్యుడు క్రీ.వె. పదునొకండవ శతాబ్దములో దీనికొక చక్కని వ్యాఖ్యానము వ్రాసెను. ఇతను తనకు పూర్వము వ్రాసిననలుబదిమంది వ్యాఖ్యాతలలోని తప్పుటభిప్రాయములను ఖండించి సరియైన వ్యాఖ్యానమును వ్రాసినాడు. అతని అభిప్రాయములను కాదను శక్తిగాని, యిట్టి వాఖ్యానముతో సరియగు వ్యాఖ్యానమును వ్రాయగల మహిమకాని తరువాతి వారి కెవరికిని లేకఫోవుటచేత, దీని తరువాత "తిరుక్కుఱళు" మీద క్రొత్త వ్యాఖ్యానములు పుట్టుట మానిచేసినవి. తిరువల్లువరు వారే తమ గ్రంధమును లోకులకు స్పష్టీకరించు నిమిత్తము పరిమేళజగరు యొక్క అవతారమునెత్తి ఈ వ్యాఖ్యాన మును వ్రాసి పరమపదించిరని వాడుక. అయినను వీరి వ్యాఖ్యానము పండిత వ్యాఖ్యానమై మూలముకంటెగూడ కష్టమగు భాషలో వ్రాయబడి పండిత జన సుబోధకమై మాత్రమే వెలయుచున్నది. శంకరభాష్యముల వలె ఇదియును పాఠము చెప్పించుకొననిదే వశీకరణమగున దెంత మాత్రమును కాదు.
    అయినను ఇట్టి వ్యాఖ్యాన మొకటి లేకున్నచో తిరుక్కుఱళు అగమ్యగోచరమై పూర్వాపర సందర్భశూన్యముగ నోటికి వచ్చిన వివేకములనెల్ల నెవడో యొకధీమంతుడువచ్చి కూసిపోయినట్లువలె, నుండకమానదు. అయినను వీరువచ్చి తిరుక్కుఱళు లోని అదికారమునకు నధికారమునకును సూత్రమునకు సూత్రమునకును గల సంబంధమును చూపుకొనిపోయి అది ప్రత్యేక మొక సంకల్పముతో వ్రాయబడిన మహాకావ్యమని నచ్చజేసినాడు. కుఱళులను ముత్యములలోను, కెంపులలోను, పచ్చలలోను, నంతర్గతమై వ్యాపించియున్న సూత్రమును మనకు చూపించి గ్రంధము నొక అద్భుతమగు నవలవలె ఫలించి సారస్యముగ గ్రహింపజేసిన పరిమేలజగదుగారి ప్రతిభయే ప్రతిభ. వ్యాఖ్యానము చెప్పవలసిన సంగతులు నేవినిగాని విడువక, విడచిపెట్టవలసినవి చాదస్తముగ విస్తరించి చెప్పక,సమగ్రముగను, సూక్ష్మముగను, మహిమబోధకమునై యలరారుచున్నది. నేను పఠించి నంతవరకు ఆంగ్లేయులలో నెచ్చటను నిట్టి వ్యాఖ్యాతలేడు. సమస్తభాషలలోని వ్యాఖ్యాతలకును నిది యాదర్శ ప్రాయమని రూఢిగ చెప్పవచ్చును.
   మొట్టమదట మూలమొక్కటియే నేను భాషాంతరీకరించి యుండియు, యిట్టి వ్యాఖ్యానము యొక్క సహాయము లేకున్నచో, అది అసమగ్రముగను అబోధకముగను, దుర్గ్రాహ్యముగను నుండునని యెంచి దానిని కూడ భాషాంతరీకరించినాను. ఆమూలమున కీ మూలమును, ఆవ్యఖ్యానమున కీ వ్యాఖ్యానమును భాషాంతరీకరణమలైనచో, అ మూల మెంత సరియైనదై యుండవలెనో పండితులు గ్రహించియుండకపోరు. ఇట్టి ప్రఖ్యాత కావ్యములను భాషాంతరీకరించునెడల మూలమునకు సరిగనుండుట మొదటి యావశ్యకతయు జాతీయతయు సౌందర్యమును చెడకుండుట రెండవ లక్షణముగ మాత్రమేయై యుండవలసయుననియు, పెక్కురి విశ్వాసమును నా విశ్వాసమునునై యుండుట చేత నట్లే  యొనరించినాను.  మూలము పెక్కుచొటుల క్రిష్టముగ నుండినను వ్యాఖ్యాతమును బట్టియే దానిని పూర్తిచేసుకొనవలెను. నిది తప్పని సరి. అఱవములోని వల్లువరువారి గ్రంధమునకుని నిట్లే - దీనికిని నిట్లే కాకమానదు.

ఒక్కొక్క కుఱళులోని బావమతి విస్తారమై, ఆ చిన్న చందస్సులో నిముడక యుడుమలు నడుచు పాఠకునికి ఊహ్యము మాత్రమేయగుచు సామాన్యులకు "ఇంకను విపులముచేసి చెప్పిన నెంతయో బాగుండును గదా!" యనిపించుచుండును. ద్రవిడదేశ గ్రంధముల్లో నిది ప్రప్రధానమైన దనియు ముందే చెప్పియుంటిమి. ధర్మజిజ్ఞాసకులెల్లరును ధర్మ భాగమును దినదినమును పారాయణము నొనర్చుచుందురు. రాజులెల్లరును నర్ధభాగమును చెప్పించుకొని దానిలో శిక్షితులగుదురు. మంత్రులు మొదలగు వారికదియే యాదర్శము. శృంగార రసాభిలాషులు కామభాగమును పఠించుచు మైమఱచిపోవుదురు ఈ కారణము చేత అనేక రాజులు తమకు తమకై ప్రత్యేకము ప్రత్యేకముగ నీ సూత్రములను పండిత కవీంద్రులచే విపులీకరము చేయిపించుకొని పఠించుకొని ఆనందించుచుండెడివారు. మన ఆంధ్ర దేశమున నవీన కవిత్వపు పోకడలలో మున్ముందు త్రోవలు తీసిన రాయప్రోలు సుబ్బారావుగరు దీనిని విని ఒక్కొక్క సూత్రమును ప్రత్యేకముగా పెద్ద పెద్ద ఉత్పలమాలలు మొదలగు పద్యములలోనికి విపులము చేసి వ్రాయవలసిన అవశ్యకతయున్నదని వక్కాణించి, గ్రంధ మచ్చుపడితమకు పంపించగానే తామట్లు విపులము చేసి వ్రాతుమని చెప్పియున్నారు. అఱభాషలో నట్లు చేసికొనినారు. ఈ గ్రంధమహత్వమును గుఱెరింగి తమ తమ భాషలోనికి తర్జుమా చేసుకొనిన ఆంగ్లెయులు, గ్రీకులు. లేటినులు, జర్మనులు ఇటాలియనులు మొదలగు పాశ్చాత్యజాతుల వారెల్లరును నట్లే పద్యములలోనికిని గద్యములలోనికిని విపులము చేసుకొనినారు. రాయప్రోలు సుబ్బారావుగారు తలచినట్లుచేసినచో, ఇది నిజముగా వ్యాఖ్యానము కాకుండానే చాలా పెద్ద గ్రంధమై, వ్యాక్యాన సహాయము లేకుండానే సుబోధకమగుచు నలరారకమానదు.

  ఒక్ విధముగా జూచినయెడల తమిళు తిరుక్కుతళుకంటె ఇది మ్న ఆంధ్రుల కెక్కువ ప్రయోజనకారియని చెప్పకతీరదు.  తమిళ తిరుక్కుఱళు పురాతన భాషారచితమై వ్యాఖ్యానము కూడ కఠినశబ్దజాలనముపేతమై పండితజనంబులకు మాత్రమే తప్ప సామాన్యులకు దుర్గ్రాహ్యమై యెప్పుచుండును. ఇది యన్నచో నట్లుగాక బహుజనములకు సుబోధకమగు సాయాన్య భాషలో రచించింపంబడినది. అట్లనుట వలన నిదికేవలం వ్యవహారిక భాషయని కాదు. ఈ గ్రంధమును గ్రహించుటకు విస్తారమగు పాండిత్యమేమియు నవసరము లేదు. సామాన్యముగా మన నవలలు నాటకములు చదువుకొను టకును పత్రికా పఠనమునకును నెంతజ్ఞాన మవసరమో యంతజ్ఞానము దీనిని గ్రహింఛుటకు గూడ జాలును. అంతకన్న గూడ పేలవము జేయుట నాకు సాధ్యమును గాదు ఏలపదములకంటెను నెక్కువ కాఠిన్యమిందులోలేదు. నేను మహాపండితుడను కాకుండుట సామాన్యజనుల కొక విధమగు నుపకారమే. ఇది చదువుకొనుతకు గూడ తగినంత భాషాజ్ఞాన మాంధ్రసామాన్య పాఠకునకు లేదన్నచో ఆంధ్ర జాతికే యది తీరని కళంకమనక తీరదు.
   కుఱళులలో మాత్ర మన్యయ కాఠిన్యమును సందుల కలయికలను అపరూప పదముల ప్రయోగములును లేవని నేను చెప్పను. కాని ద్రవిడ మూలమున కిది సరియైన తర్జుమాగా నుండి సాధ్యమైనంతవరకు ఆ వ్యాఖానమునకివి అతుకుకొని యుండవలెననిన నే నామాత్రము యిబ్బందులు పడక తీరదు. ఆంధ్రుల నామాత్రము కష్టపెట్టకతీరదు. వ్యాఖ్యాన మా కష్టముల ననెకములను పటాపంచలు చేస్ మనోహరముగ జేయక మానరు. గ్రంధము కష్టముగనున్నదని భావించువారు కూడ తమిళకుఱళు తమిళులకు కన్న ఆంధ్రకుఱళు ఆంధ్రులకు ఎక్కువ అందుబడిలో నున్నదని గ్రహించి సంతోషించక మానరని నమ్ముచున్నాను.
  ధర్మార్ధ భాగములలో నున్న అనేకము సంగతులు మన దేశేయులకెంత మాత్రమును క్రొత్తవి కావు. సంస్కృత సాహిత్యమునందు అంతర్గతములై యుంది ఆంధ్ర పండితుల వలన నాంధ్ర గ్రంధముల ద్వారానూ ఇతర విధములను మన దేశీయుల విజ్ఞానమునకు పరిమితములయినవియే యున్నవి అయినను ముఖె ముఖే సరాస్వతి యనునట్లు ఒకే ధర్మము ప్రత్యేప్రత్యేక కవీశ్వరుల లేఖలనుండియు ప్రవక్తం వాక్కులనుండియు బహిర్గత మచునప్పుడొక్కొక్క విధమగు క్రొత్తతనమును నాజూకును మనకు గొచరమగుచుండును. అట్టి సౌందర్యమీ భాగములలో నెల్ల విదితమగుచునే యున్నదని మా విశ్వాసము.
      ఇదియును కాక మన విజ్ఞానము నెల్ల సంస్కృత భాషలో మూసిపెట్టి రాజుగారికోటలోని ధనమువలె సామాన్యజనుల కందు బాటులో లేని దుస్థితిని మన పండితులు కల్పించినారని మన దేశములో ననేకులు ఫిర్యాదు చేయుచున్నారు. ధర్మార్ధములకు సంబందించిన సమస్త సంస్కృతజ్ఞానమును నేదో యొక సందర్భమున నీరెండు భాగములలోను ఫోక్తుగా విరజల్లబడియే యున్నది. మనమింక కష్టపడి దానిని సేకరించుకొనుటకు కష్టమైనచో అది మహాజ్ఞానమని మన మంగీకరించియే యుందుము. మిక్కిలి తేటతెలుగుగా జేయబడుటయే దానిలోని జ్ఞానము యొక్క ఔన్నత్యమును ఉచ్చత్వమును మనము బాగుగ నూహించుకొనేటట్లు చేయునేమో అని మాకనుమానముగ గూడా నున్నది. కామ భాగములోని విజ్ఞానము కేవలము ద్రవిడ విజ్ఞానమనియే  మనమొపుకొనవలెను. ఏలనన దానికిని ఆర్య శృంగార ప్రకరణమ్లకును గల విభేదమట్టిది. ఈ కారణము చేత విదియొక రీతి భారతవిజ్ఞానసర్వస్వమని మన మంగీకరించవలెను. ఇట్టి విజ్ఞాన సర్వస్వమగు గ్రంధరత్నమును, నాయోపినంతమట్టుకు శక్తితో నాయెను. భాషాంతరీకరించి నందుకు నాకొకరీతి ఆనందములేకపోలేదు. ఇట్లే ఆంధ్రులెల్లరికి గూడ నీ గ్రంధము వలన నిట్టి యానందమును నేనొనగూర్చ గలుగుఇదునేని ధన్యుడను.
    శ్రీమంతులగు ఆంగ్లేయాధికారి వర్గమువారు నాకి దీర్ఘ కారాగార కఠినశిక్షవిధించియు చివరి సంవత్సర భాగములో విడిఖైదీని చేసి పుస్తకములను వ్రాతపరికరములను తెప్పించు కొనననిచ్చి నాకీ సనాతన భాషను మాత్రమే కాక మఱికొన్ని భాషలను గూడ నేర్చుకొనగల మహాభాగ్యమును కల్పించినారు.  పోలస్యమయ్యరు గారును, ఏ.యన్. కృష్ణస్వామి అయ్యంగారును నాకు తమిళ భాషను నేర్పి వారి యుత్కృష్టగ్రందములను గ్రహించి భాషను గ్రహించి తెలుగులోనికి భాషాంతరీకరణము చేయగల సామర్ద్యము నొసంగినారు.  విక్రమదేవవర్మగారు ప్రభల లక్ష్మీనరసింహం గారు మారేపల్లి రామచంద్రమూర్తి గారు రావుబహదూరు తాడేపల్లి వెంకటక్రిష్ణయ్యగారు మొదలగు విద్వత్శిఖాముణులు దీనిని వివి (నాయల్ప పాందిత్యము వలనేమి భాషాంతరీకరణ సందర్బమ్ననేమి  యుండకతీరని పెక్కు నలుసులున్న ప్పటికిని) గ్రందముయొక్క మహోత్కృష్టతను గూర్చియు నేను పడియుండిన శ్రమను గూర్చి యుత్సాహ వాక్యములను పలికి అచ్చు వేయించవలసినదేయని యంగీకరించినారు.  భొగరాజు పట్టాభిసీతారామయ్య గారు  బందరు పెద్దలు కొంద్రకు నన్ను పరిచయము  పరచి పోషకులని చేర్పించి యీ భాగమునకు సరిపడు ద్రవ్యమును జతపరచినారు. నడింపల్లి నరసింహారావు గారు మొదలగు నితర్ల సహాయమున కొంతమంది చందదారులు చేరినారు. శీయుత రావూరి శ్రిశైలపతి గారును శ్రీయుత దేసోద్ధారక కాశీనాధుని నాగేశ్వర రావు పంతులుగారును శాశ్వత రాజపోషకులుగ జేరినారు. ఇట్లు నాముఖమును జూచియేమె నా గ్రంధమును ముఖమును జూచియేమి నాకును నా గ్రంధమాలకును నొకేసారిగ అహాయము చేయుచున్నారని చెప్పకతప్పదు. ఇంకను పెక్కుఱు చందాదారులుగను పొషకులుగను చేరనిచో భాషకు దేశామునకును (కాదననేల నాకుజు) నభివృద్దికరమగు ఈయుద్యమము నెరవేరజాలదని ఉదారశీలురును విద్యాభిమానులునగు దేశబక్తులెల్లరును గ్రహించియే  యుందురు. ఈ కాలములో అద్రంధరచనము ప్రచురణము, విక్రయము మొదలగునవి యెల్లయు యెంత కష్ట సాధ్యములైనవో ఆంధ్రులెల్లరును గ్రహించవలసియున్నది. నేనింకను భాషయందుగల అభిమానముచే దేవులాడుచు దానికి ద్రోహమొనర్తునేమో యను పాతకమునకు వెఱచి తదేకదీక్షతో దానియందు కొట్టుకొను చున్నాను గాని ఇంతకన్న రసలాభప్రదమ్లగు వ్యవసాయములను ఉద్యోగములను చేయనేరక కాదని విజ్ఞానులు గ్రహించవలెను. "వ్యవసాయము చేసుకొనగూడదా? ఉదారుల ఉదారత నెన్నాళ్ళిట్లు పీడించుచు  ఈ సొమరివృత్తికై గడంగెదవు. గాంధీంహాత్ముడు ఒడలు వంచి పనిచేయమన్నాడు? గాని యిట్లు పుస్తకముల పేరిట యాచించు కొనుమన్నాడా? ఈ కాలములో డబ్బు తెమ్మంటే గ్రంధము లెవ్వరికి గావలయు?" నని డెప్పిపొడవెడి మహనీయుల కిది సమాధానముగా చెప్పవలసివచ్చినందుకు క్షమింతురుగాక.

    "బ్రతుకు వారలు దున్ని బ్రతుకువారలు; పెఱులు
     బ్రతుకుదురు వారి నతుకుకొని"

  యని మాతిరువల్లువరు నాయనారే యీ గ్రంధము నందు వచించి యున్నారు.  నిజముగా నీపుడమిపై బ్రతుకవలసిన యేగ్యరీతిని బ్రతుకువారు వ్యవసాయవృత్తిచే బ్రతుకువారే. తక్కినవారిలో కొందరు వారికి సహాయకరములగు నితర వృత్తులలోను కొందరు వారిని గురించి లాభము గ్రహించెడి యితర వృత్తులలోను కొట్టుకొనుచు వారు పండించిన యన్నమే తినుచు ప్రత్యక్షముగ గాకున్న పరోక్షముగనైనను వారిపై నాధారముపడి బ్రతుకుచున్నవారే.  ఈ కారణము చేతనే ఆ కవీశ్వదుడే.

    "ఆణికృషీకుడులోక మంతకు అతడే ప్రోవ
      బూనె పెరవృత్తివారలను"

   అనగా "లోకమనెడి రధమునకు అతనే శీలవంటి వాడు. అతను తన్ను దాను పోషించుకొనుటయే కాక తన వృత్తికాని పర వృత్తికి బూనుకొనిన వారినందరిని గూడ బ్రోచుటకు కంకణము కట్తుకొనినాడు." అని వచించినాడు ఆట్టి సర్వొత్తమమగు వృత్తికి పోవుటకంటే నాకు శాశ్వతానందదాయకమగు సంగతి వేఱొక్కటి లేదు. అయినను, అట్టి వృత్తిలోనికి బోవుటకు గూద సర్కారువారి కృపాకటాక్షము వలన సగము వరకు ప్రారంభించిన యీ ధర్మోధ్యమమును విసర్జించినచో, నాకు క్షమాపణముండదనే విశ్వాసముతోనే కష్టములకును, నవమాసములకును డెప్పి పోటులకును గూడ వెనుకతగ్గక అయిష్టులుగ నుండేడి శ్రీమంతులు అనంత సంపదలపై, చిన్నదైనను ఈ తప్పనిభారమును వైచుటకు సాహసించుచున్నాను

నాలుగైదు వేల రూపాయలు పోగుకానిదే యీ గ్రంధములు ముద్రణా లయముల నుండి బయటికి రావు. ఈ సహాయము నాకెంత వేగిరము చేకూఱినచో నన్నంత వేగ మీసదుద్యమమునుంచి ముక్తుని చేసి భారము తగ్గించి విశ్రాంతి ప్రసాదించిన కీర్తి యాంధ్ర లోకమునకు జెందును. అంతవఱకు నొంటరిగా ఈ యుద్యమములో దానిలో నుంచి నాకును కాక గ్రంధములకును గాక రైళ్ళు హోతాలు మొదలగు అగుపించరాని శుష్క ఖర్చుల క్రింద కొంద జారిపోవుచు, రెండేండ్లలో తీరవలసినది పదేండ్లకైనను తీరునో తెలియక, నాలుగు వేలలో తీరునది పదివేలతో గాని ముగియక, అంతయును పూర్తికాక సగములో నాగిపోయినచో కార్యంకొనసాగించలేకపోయిన కళంకమునకు ధనమును దుర్వ్యయము చేసిన అపదూఱునకును నెఱయై క్రుంగవలసిన అగత్యము నాకు కలుగును. ఏది యెట్లయినను కార్యము కొనసాగించనిదే విరమించవలెనను నుద్దేశ్యము లేదనియు, అంతవరకు పుస్తకములకు వారు భావించు రీతిని నెక్కూ ఖరీదులు పెట్టుచున్నను పోషక రాజపోషక విరాళములు కోరుచున్నను, నేను పొందుచుండు కఠిన దూషణములకు బదులుగా నప్పుడప్పుడిట్టి మృదులములగు సమధానముల నిచ్చుచున్న క్షమింపవలసిన ధర్మమాంధ్ర పూజ్యులెల్లరి పై నున్నదని మనవి చేయుచు, వారిని నితరులను గూడ ఇకముందు కూడ ఇంతకన్న నెక్కువగా చేయుచుండ వలయునని ప్రార్ధింపుచు, నేను చేసిన యపరాధమునకు క్షమింపవలయునని ఈశ్వరుని గూడ వేడుకొనుచు విరమించుచున్నాను.

--అర్ధత్రయ సర్వంవము  

(తిరుక్కురళోకావ్యానికి మున్నుడి) 1926