గణపతిముని చరిత్ర సంగ్రహం/దేశోద్ధరణ ప్రచారము
11. దేశోద్ధరణ ప్రచారము
1923 డిశంబరులో కాకినాడ యందు జరిగిన అఖిల భారత కాంగ్రెసు మహాసభలకు శ్రీ బులుసు సాంబమూర్తి నాయనను ఆహ్వానించెను. అక్కడ స్త్రీల హక్కులను గూర్చి యొక సభ ఏర్పాటయ్యెను. అందులో ఉపనయనము, హోమము, శ్రాద్దము మొదలగు వానిలో పురుషులతోపాటు స్త్రీలకు సమాన హక్కు కలదని, నాయన వేదశాస్త్ర ప్రమాణములతో నిరూపించెను. తరువాత ఆలమూరులో అస్పృశ్యతా నివారణమును గూర్చి జరిగిన సభకు నాయనను అధ్యక్షునిగా వరించిరి. క్రైస్తవులు మొదలుగా ఇతర మతములవారి విషయమున స్పర్శదోషము సడలింపబడు చున్నప్పుడు మన మతమునకు చెందిన పంచములయెడ సడలించు కొనక ఆర్భాటములు సలుపుట హాస్యాస్పదమని నాయన ఉద్ఘాటించెను. ఆచారవంతులు తమ యాచారమును తమ యింటి వెలుపల నున్నవారు మన్నించ వలెనని నిరంకుశులై ప్రవర్తించుట తగదనియు ఆయన అధ్యక్షుడుగా ఉద్బోదించెను. అక్కడ నుండి తిరువణ్ణామలైకి పోవుచు ఆయన కొన్ని గ్రామములలో ఈ భావములను బోధించెను. మల్లాది శ్రీకృష్ణచయనులు అను పండితుడు నాయన వాదమును ఖండించుచు వ్యాసములు వ్రాయగా, నాయన వానికి అన్నింటికి సమాధానములు వ్రాసి ఆయనను నిరుత్తరుని గావించెను.
రాజకీయములలో చేరుటకు ఇష్టము లేకున్నను కార్యకర్తల యొత్తిడి వలన వాసిష్ఠుడు ద్రవిడ రాష్ట్రీయ కాంగ్రెసునకు 1914 లో అధ్యక్షు డయ్యెను. ఆ సంవత్సరము డిసెంబరులో బెల్గామునందు కాంగ్రెసు మహాసభలో పాల్గొని ఆయన అస్పృశ్యతా నివారణము శాస్త్ర సమ్మతమని సంస్కృతమున ఉపన్యసించెను. మఱునాడు హిందీ జాతీయ బాష కావలెనని గాంధిచే ప్రతిపాదింపబడిన తీర్మానమును ఖండించుటకు నాయన పూనుకొనెను. క్రిందటి దినము తమకు అనుకూలముగానున్న ప్రసంగమునకు ఆనందించిన గాంధి తన ప్రతిపాదనమును కాదన్న వాసిష్ఠుని ప్రసంగింపకుండ నివారించెను. అనుమతి లభించియున్నచో ఆ సభలో వాసిష్ఠుడు మనకు సంస్కృతమే జాతీయ భాషయని ఉద్ఘాటించి యుండెడి వాడు. నాయకులు అభిప్రాయ భేదమునుకూడ సహింప లేకున్నారని గ్రహించి వాసిష్ఠుడు వెంటనే సభ్యత్వమునకు రాజీనామాను ఇచ్చి రాజకీయముల నుండి బయల్పడెను. అయినను ఆయన దేశభక్తిని వీడక రాష్ట్ర విభాగములను గూర్చి "రాష్ట్ర నిబంధనము" అను గ్రంథమును రచించెను.
సంస్కృతము ప్రపంచ భాష కావలెనని నాయన "లాలి భాషోపదేశ:" అను గ్రంథమును కూడ రచించినాడు. దాని ప్రాశస్త్యమును శ్రీ అప్పల సోమేశ్వర శర్మ ఇట్లు ఉద్ఘాటించినాడు. "అటువంటి మహానుభావుని బహుసంఖ్యాక రచనలలో 'లాలి భాషోపదేశం' ఒకటి,. సంస్కృత భాషను దేశ కాలానుగుణంగా సంస్కరించి, పునరుజ్జీవనాన్ని సౌలభ్యాన్ని ప్రచారాన్ని సంపాదించి దానికి ప్రపంచ భాషా సామ్రాజ్య పట్టాభిషేకాన్ని చేయాలని ఈ రచన తహ తహలాడుతుంది. 'లాలి భాష' అన్న పేరే బహు చిత్రంగాను, మధురంగాను వుంది...... 'లాలి పాట' లాగా 'లాలి భాష' సర్వజనావర్జకం అవుతుందని, కావాలని గ్రంథకర్త అభిసంధి అయి వుండవచ్చు...[1] ప్రపంచములో ఈనాటికి ఏ కొంచమైనను మనకు గౌరవము వున్నదన్నచో, అది అనాదియైన వేదశాస్త్ర విజ్ఞానము వల్లనేకాని మన యార్థిక సంపదవలన కాదు. రాజకీయ సామర్థ్యమువలన కాదు. ఆ వేదశాస్త్ర విజ్ఞాన భాండాగారమునకు సంస్కృత భాషయే తాళపు చెవి. దానివలన తప్ప మఱియే సాధనమువలన మనకు ఆ విజ్ఞానము నందు ప్రవేశము కాని, దేశ సమైక్యముకాని, అభ్యుదయము కాని, ప్రపంచమున గౌరవ ప్రపత్తులుకాని ఏర్పడవు.
బెల్గాము నుండి నాయన గోకర్ణమునకు వచ్చి దైవరాతుని యింట రెండు నెలలు, బొంబాయిలో ఒక నెల శిష్యులయొద్ద నుండి తిరువణ్ణామలై చేరెను. 1925 జూలై నుండి మూడు నెలలు నాయన అతిమూత్ర వ్యాధితో బాధపడెను. ఆయన చూత గుహలో వుండి పెక్కు సూత్ర గ్రంథములను, విశ్వ మీమాంస అను 393 శ్లోకముల గ్రంథమును రచించెను. ఆ సమయమున సుబ్రమణ్య అయ్యరు అనునొక కాంగ్రెసు సభ్యుడు అన్ని జాతుల విద్యార్థులకు ఏక పంక్తి భోజనములను ఏర్పఱచుచు ద్రవిడ దేశమున శర్మ దేవీ క్షేత్రము నందు ఒక గురుకులమును నెలకొల్పెను. అందు ఆయన బ్రాహ్మణుని వంట వానినిగా నియమించెను. ఆ విషయమును బ్రాహ్మణేతరులు ఆక్షేపించిరి. ఆ వివాదము పరిష్కారము కొఱకు నాయన యొద్దకు వచ్చెను. "పంచముని వంట వానినిగా వుంచుట పరిష్కారము" అని నాయన తీర్పు చెప్పెను. అది బ్రాహ్మణేతరులకు కూడ నచ్చలేదు. ఇంతలో హఠాత్తుగా సుబ్రమణ్య అయ్యరు మరణించి ఆ గురుకులము మూల బడెను. 1925 నవంబరులో నాయన బందరులో సనాతన ధర్మ సభయందు సంస్కరణముల యావశ్యకతను గూర్చి ప్రబోధించి అటనుండి మంగళగిరికి పోయి ఆ నృసింహక్షేత్రమును ఇంద్ర క్షేత్రముగా గుర్తించెను.
1926లో వాసిష్ఠుడు తిరువణ్ణామలైకి వచ్చి "పూర్ణ" అను కల్పిత కథను నవలగా సంస్కృతమున ఆరంభించెను. ప్రతి సాయంకాలము రచించినంతవఱకు ఆ కథను నాయనకోవెల యందు వినిపించుచుండెను. 1926 ఏప్రిలులో దైవరాతుడు, వాసిష్ఠుని గ్రంథముల ప్రకాశనము కొఱకు శిరసి అను గ్రామమున ఒక ముద్రణాలయమును కొని "నందినీ" ముద్రణాలయ మను పేరుతో నాయనకు అర్పించెను. అంతకుముందే అతడు 1925లో గోకర్ణములో ఆశ్రమమును స్థాపించి దానియందు గురుస్థానమును స్వీకరింపవలసినదని నాయనను ఆహ్వానించి యుండెను. ఆ సమయమునకు అమ్మకు పాండురోగము వలన ఆరోగ్యము క్షీణించుచుండుటచే నాయన అచ్చటికి పోలేకపోయెను. 18-7-1926 నుండి విశాలాక్షమ్మ మంచము పట్టి 26 వ తేది పరమపదించెను. అప్పుడు నాయన సన్న్యసించునని అనేకులు తలంచిరి. కాని ఆయన తుది వఱకు యజ్ఞోపవీతమును వీడలేదు.
గణపతిమునియొక్క సంస్కారభావములు రమణాశ్రమ లక్ష్యమునకు విరుద్దములని, ఆయన శిష్యులకు శక్తి సంపాదనమే ధ్యేయమని, మహర్షికి నాయనకు లక్ష్యములలో భేదమున్నదని కొందఱు ప్రచారము చేయ జొచ్చిరి. అందులకు గణపతి చలింపలేదు; రమణుడు తాటస్థ్యమును వీడలేదు. అందువలన గణపతిముని శిష్యులు కొందఱు శ్రీఅరవిందాశ్రమమునకు చేరిరి.
1927 ఫిబ్రవరిలో సికిందరాబాదులో జరుగబోవుచున్న శ్రీకృష్ణదేవరాయాంధ్రభాషా నిలయముయొక్క రజతోత్సవములకు కార్యకర్తలు వాసిష్ఠుని అధ్యక్షునిగా వరించి ముందుగానే రమ్మని ఆహ్వానించిరి. అందువలన నాయన జనవరిలోనే అక్కడికి చేరెను. సికిందరాబాదులో నాయన పెక్కుచోట్ల ఉపన్యసించి మహర్షి సందేశమును ప్రసరింపజేసెను. వేలకొలది జనులకు ఆయన మంత్రదీక్షల నొసంగెను. రజతోత్సవములకు అధ్యక్షత వహించుచు వాసిష్ఠుడు, మన నాగరికత యంతయు వేదవాజ్మయముపై ఆధారపడియున్నదని, దానిని స్వాధీన మొనర్చుకొనుటకు ఆంధ్రులు సంస్కృతమును మొదట అభ్యసింపవలయునని, పెక్కు సంవత్సరములు గ్రంథములను పఠించినవానికంటె, కొన్ని మాసములు తపస్సు చేసినవాడు అధికముగా వాక్కుయొక్క శక్తిసంపదను పొందునని, మహాకవులందఱు తపస్సుచేతనే మహా గ్రంథములను రచించిరని, వివిధ ప్రాంతములలో భావికాలమున మన భావములు ప్రజలకు చక్కగా బోధపడవలయు నన్నచో గ్రంథములను గ్రాంథికభాషలోనే రచించుట అవశ్యకమని ప్రబోధించెను.
నాయన ప్రబోధించిన గ్రాంథికభాషయొక్క ఆవశ్యకతను వ్యావహారికభాష వలన కలుగుచున్న యనర్థమును ఆంధ్రులు గుర్తింప కుండుట అత్యంతము శోచనీయము. గ్రాంథికశైలివల్లనే నన్నయభట్టునుండి చిన్నయసూరి వఱకు రచింపబడు చుండిన గ్రంథములు అన్ని ప్రాంతములలో అన్ని తరములవారికి చక్కగా బోధపడుచు విజ్ఞానమును అందించుచుండినవి. తిక్కన్నగారు నెల్లూరి మాండలికములో, పోతన్నగారు ఓరుగంటిలోని వ్యావహారిక బాషలో గ్రంథములు వ్రాసియుండినచో అవి ఈనాటికి మనకు నిరుపయోగములై యుండెడివి. వారు గ్రాంథికశైలిలో వ్రాయుట వలననే భారత భాగవతములు ఈనాటికి దేశమున అన్ని ప్రాంతములలో సజీవములై యున్నవి. గ్రాంథిక మన్నంతనే సమాన జటిలమైన బాష యని గ్రహింపరాదు. గ్రాంథికశైలిలో వచనమే కాదు, పద్యములను కూడ ఎంత సులభముగానైన రచింపవచ్చును. "ఇందు గల డందు లేడను సందేహము వలదు" మొదలైన పద్యములే ఇందులకు నిదర్శనము. వేమన పద్యములు ఎంత సులభములో అందఱు ఎఱిగినదే.
దినపత్రికలలో ఆంగ్లమును అత్యంతము పటిష్ఠమైన భాషలో వ్రాయుచు చదువుచు ఆనందించుచున్న నేటి బుద్దిమంతులు మాతృభాష విషయమున మాత్రము నోటికివచ్చినట్లు వ్రాయు చుండుట చాల శోచనీయము. పరభాషయందున్న శ్రద్ధ మాతృభాషయందు కూడ ఉండవలయు నని ఈ మేధావులకు ఏల తోచదో తెలియదు. శుచిగా రుచిగా వండిపెట్టుటకు బద్ధకించి బజారులోని చిఱుతిండిని చిన్నపిల్లలకు మఱపినట్టు, తమ సోమరితనమువలన ఈ రచయితలు జనులకు పామరభాషను పత్రికలలో మఱపి వారి హితమును పాటింపక వారికి గ్రాంథికశైలి యన్నచో ఏవగింపు కలుగునట్లు చేసి, మన పూర్వవిజ్ఞానమునకు దూర మొనరించి వారికి తీరని ద్రోహమును చేయుచున్నారు. పత్రికలవారు కొంత భాగమైనను సరళ గ్రాంథిక రచనలకు కేటాయించి, ప్రజలకు పూర్వవాజ్మయముతో సంబంధము తెగకుండునట్లు చేయుట ఆవశ్యకము.
25-2-1927 తేది హైదరాబాదులో ఆదిహిందూసంఘము వారు (హరిజనులు) శ్రీ మాడపాటి హనుమంతరావు గారి గృహము నుండి నాయనను పల్లకిలో ఊరేగించుచు వారి హాస్టలునకు తీసికొనిపోయి "ముని" బిరుదము నిచ్చి సత్కరించిరి. సమ్మాన పత్రమును భాగ్యరెడ్డి గారు చదువగా వామన నాయక్ గారు శాస్త్రిగారికి సమర్పించిరి.[2]
1927 జూలైలో నాయన మరల అరుణాచలమున చూత గుహకు చేరెను. శ్రీఅరవిందుడు శ్రీమాతయందు "కాళి" యొక్క అవతరణమును సాధించెనని ఆమె దివ్యశక్తులను కపాలి నాయనకు వర్ణించి చెప్పి తన చర్యను సమర్థించుకొనెను. కాని నాయన కపాలి అభిప్రాయములను అంగీకరింపలేదు.
1927 డిసెంబరులో చెన్నపురములో జరుగుచున్న పండిత సభకు నాయనకు ఆహ్వానము వచ్చెను. అది నిమిత్తముగా నాయన చెన్నపురమునకేగెను. ఆ పండితసభవారు వాసిష్ఠుని ఆదరింపలేదు. అప్పుడక్కడికి పండిత మదనమోహన మాళవీయుడు కూడ వచ్చి యుండెను. ఆయన అధ్యక్షుడుగా హిందూ హైస్కూలులో ఒక మహాసభ ఏర్పాటు కావింపబడెను. ఆ మహాసభలో నాయన వర్ణాశ్రమ సంఘముయొక్క పండితవర్గమువారి వాదములను ఖండించి అస్పృశ్యతా నివారణము యొక్క అవశ్యకతను నిరూపించుచు సంస్కృతమున మహూపన్యాసమును కావించెను. మాలవీయ పండితుడు నాయనను ఎంతగా అభినందించినను ఆ పండితులు ఔదాసీన్యమునే వహించిరి. వారు తొలుత తనకు గావించిన యనాదరమును తలంచుకొనుచు అప్పటినుండి "పండితసభకింక వెళ్ళరాదనియు, వారిని సంస్కరించుటకు యత్నించి, పరాభవింప బడుటకంటె వారు కాలగతిచే పరాభవింపబడు వఱకు వారిని విడిచినచో వారే సంస్కారమును పొందుదురనియు నాయన నిశ్చయించుకొని తన తపస్థ్సలమునకు మఱలెను."[3]
ఈ సమయముననే ఓరుగంటి వేంకట కృష్ణయ్య నాయనకు శిష్యుడయ్యెను. మద్రాసులో పరశువాకములో యన్. దొరస్వామయ్యరు గారి యింట నాయన అతిథిగా నుండగా కొందఱు ఆయనను దర్శించుటకు వచ్చిరి. అప్పుడు చతుర్వేదుల వేంకటకృష్ణయ్య నాయనకు పాదము లొత్తుచుండెను. అప్పుడు నాయన పితృకర్మల యావశ్యకతనుగూర్చి చెప్పుచు కనీసము తద్దినమునైన తప్పక పెట్టవలయునని యుద్ఘాటించుచుండెను. చతుర్వేదుల వేంకట కృష్ణయ్య నెల్లూరు సమీపమున పల్లెపాడులో విప్రవిద్యాలయమును స్థాపించి మిగులనైష్ఠికుడై యుండిన చతుర్వేదుల రాఘవయ్య గారి కుమారుడు. తండ్రి ఎంతో ఆచారపరుడైనను వేంకట కృష్ణయ్య గాంధీగారి యాశ్రమములలో చేరి సకల కర్మలను వదలుకొనెను. అందువలన అతడు నాయనతో ఇట్లనెను. "మీరు కర్మలు చేయవలెనని చెప్పుచున్నారు. బాగానేయున్నది. నేను గాంధీగారి యాశ్రమములో అన్నిజాతులవారితో కలిసి భోజనము చేసినవాడను. నేను తద్దినము పెట్టవలెనన్నచో ఏ బ్రాహ్మణుడు వచ్చి నాచేత తద్దినము పెట్టించును? రేపే మాతల్లి తద్దినము." "నీకు పెట్టవలయునని శ్రద్ద యున్నచో నేనే పెట్టింతును" అని నాయన అనెను. అందఱును దిగ్ర్భాంతులైరి. "భోక్త లెక్కడ దొరుకుదు"రని వేంకట కృష్ణయ్య అనెను. వెంటనే నాయన ఎదుట కూర్చుండి యున్న వారిని కలయజూచి ఓరుగంటి వేంకట కృష్ణయ్యను ఒక భోక్తనుగా ఉండుమని చెప్పి, అగ్నిహోత్రుడే రెండవభోక్త అగుననెను. ఈ సందర్భమును ఓరుగంటి వేంకట కృష్ణయ్య ఇట్లు వివరించెను.
"మఱునాడు శ్రాద్ధ కార్యము నెఱవేరినది. నాయన మంత్రోచ్చారణము చేయుచుండగా కష్టసహములైన (కష్టముతో సహింప దగినవి) శక్తి తరంగములు నా యొడలిలో (శరీరములో) ప్రవహించుచుండినవి. పురోహితుడు నాయన ఆయనకు నే ననుచరు డగుట యదియే ప్రారంభము. ఈ యుదంతమున నిర్ణీతాంశము లేమి?
1) లోకములు, మరణానంతరానుభావ్యము (మరణమునకు పిమ్మట అనుభవింపదగినవి) లున్నవి. పితృలోకములు కలవని వేఱుగా చెప్ప నక్కరలేదు కదా.
2) దేహ నాశనముతో వ్యక్తి నశింపడు. సూక్ష్మోపాధులతో (ఉపాధులు - శరీరములు) ఆయా లోకముల చరించుచుండును.
3) ఆ జీవికి ప్రేతత్వదశ యందేమి పితృస్వరూప దశయందేమి తృష్ణ లుండును.
4) సంతతివారు శాస్త్రోక్తములైన కర్మల నొనరించి ఆ జీవి కుద్గతి (ఉద్గతి - పైకి పోవుట) నీయగలరు.
5) శాస్త్రోక్తముగా నాయా కార్యములను మంత్రయుక్తముగా ఒనరింపవలయును; మంత్రరహితముగా గాదు. అనగా స్వరయుక్తమంత్ర సహితముగా"[4]
పై యుద్దరణములో (Quotation) కుండలీకరణములలో నున్న యర్థములు నే నొసంగినవి.
ఓరుగంటి వేంకట కృష్ణయ్య నాయన గారి శిష్యులలో వలె శ్రీ రమణమహర్షి శిష్యులలోకూడ ప్రముఖుడే. ఈ యనుబంధమును ఆయన ఇట్లు వివరించెను.
"భగవాను నొకసారి నే నడిగితిని. వేదమంత్రములకు భావన ప్రధాన మందురు. గాయత్రీ మంత్రమును జపించు మంటిరి. దాని యర్థముగా ఎన్నో భావములు రావచ్చును గదా. యెట్లు వచ్చును. ఐకాగ్ర్యం హి తప: అన్నారు గదా. అతి తీక్ష్ణము నైన స్వరముతో భగవాను చీవాట్లు పెట్టిరి. భా: భావన! అర్థభావన నేను చేయమన్నానా? ఎవడు జపము చున్నాడో ఆ వానిని జూడుమన్నానా? సాక్షాత్తుగా నీ ఉపదేశము నాకెన్నడును మహర్షి చేయలేదు. వారు చేసినది, మ పాదులు నాయనకు. మీ గురువునకు చెప్పినచో నీకు చెప్పుట కాదా అని వారి చీవాట్లు." జయంతి సంచిక-పుటలు
1927 ఫిబ్రవరిలో హైదరాబాదులో నాయనకు బిరుదముతో సత్కారము జరిగిన తరువాత జూలైలోగాని రమణాశ్రమమునకు తిరిగి రాలేదు. ఈ లోపల అ సవ వలన కలిగిన ప్రతిస్పందనములను గూర్చి గుంటూరు కాంతము ఇట్లు వ్రాసెను. "ఇంతగా కొనియాడబడిన యొక్క మహోన్నతిని గుఱించి వినినప్పు డసూయాపరులై భావోద్రేకములను తిరువణ్ణామలలో బొందిరో తెలియదు. ఈ వార్తలు అప్రాంతము చేరులోపున సుధన్వ కపాలులు శ్రీ అరవిందాశ్రమమున చేరి నాయనను నిరసించిన వారికి బలము, నా సంతోషాతిశయభంగము చేకూర్చిరని మాత్రము సికింద్రాబాదు హైదరాబాదు శిష్యులకు తెలిసెను.[5] శ్రీ రమణ మహర్షి శిష్యులకు నాయన విషయమున అభిప్రాయభేదములు కలుగుటకు హేతువులు ఓరుగంటి వేంకట కృష్ణయ్య మాటలలో సూచితము లగుచున్నవి; "నాకు తెలిసిన నాయన సనాతన ధర్మావలంబికాడు. ఆధునిక సంస్కర్తకాదు. ఆయన మార్గ మాయనదే. మురారే స్తృతీయ: పంథా" (మురారి కవిది మూడవత్రోవ).
మల్లాదివారితో ఆయనకు చండాలుల దేవాలయ ప్రవేశ విషయమున జరిగిన ప్రచండయుద్ద మంద ఱెరిగినదే. ఆయన జాతి చండాలత్వ మొప్పడు. వర్ణములు జాత్యా అను సనాతనుల మత మొప్పడు అట్లే వేదములందలి పంచజన శబ్ద మావర్ణమున కాయన అన్వయింపడు. ఆచారవిషయమున గూడ"*[6]
వేంకటకృష్ణయ్య మిత్రులతో ప్రసంగించునప్పుడు, "మా గురువు గారు మహాపండితుడు. నేను అల్పజ్ఞుడను. అయినను మహర్షుల యభిప్రాయమునకు భిన్నముగా వారు చెప్పునప్పుడు నేను మహర్షుల యభిప్రాయమునే గ్రహింతును గాని నాయనగారి యభిప్రాయములను అంగీకరింపను" అని స్పష్టముగా చెప్పు చుండెడివారు.
దీనిని బట్టి నాయన యభిప్రాయములు కొన్నియెడల శిష్యులకే కాక గురువైన మహర్షికి కూడ నచ్చ లేదని వ్యక్తమగు చున్నది. 9-3-1927 తేది సంచికయందు గోల్కొండ పత్రికలో ప్రకటింపబడిన ప్రశ్నోత్తరములలో నాయన యభిప్రాయములు కొన్ని యిట్లున్నవి.
ప్రశ్న: హిందువులకు సామాన్యధర్మములెవ్వి?
ఉత్త: వేదముల నమ్ముట, వానిలో నందరికిని సమానాధికార మిచ్చుట. ఈ రెండు సమకూడిననే కాని అందరికి విశ్వాసము కలుగదు. క్రైస్తవుడు బైబిలు నెట్లో హిందువు సంహితము (సహితము) వేదము నట్లు భావించవలయును.
ప్రశ్న: కులభేదము లుండవలయునా?
ఉత్త: అందరు బ్రాహ్మణులే కావలయును. అట్లగువరకు చాతుర్వర్ణములలో అంతశ్శాఖాభేదములు పూర్తిగా పోవలయును. ఇందు హెచ్చుతగ్గులు పాటింపకూడదు. ఆచారముల యొక్క సామ్యత యుండిననే బ్రాహ్మణత్వము కలుగును.
ప్రశ్న: స్మృతులిప్పుడు వ్రాయవచ్చునా?
ఉత్త: వ్రాయవచ్చును.
ప్రశ్న: వాని నాచరణములో నుంచు టెట్లు?
ఉత్త: ఒక పరిషత్తు ఏర్పడవలయును. అదియే శాసింపవలయును.
ప్రశ్న: బ్రాహ్మణ బ్రాహ్మణేతర సమస్యను పరిష్కరించుటెట్లు?
ఉత్త: అందరికిని వేదాధికార మిచ్చుటచేతనే. ప్రశ్న: శూద్రుల విషయమై కొన్ని స్మృతులలో వేదాధికారాదులు లేనట్లు వ్రాసియున్నారు. దీని నెట్లు సమన్వయింతురు?
ఉత్త: అట్టివానియందలి దర్మములు సామయాచారిక ధర్మములు. రాగద్వేషములతో గూడినట్టి స్మృతులు ప్రమాణము గానేరవు. శృతికి విరుద్ధమైన స్మృతులు ప్రమాణములు కావు. వేదాధికారము లేదని వ్రాయు సూత్రములు ద్వేష యుక్తము లయినవి. మరియు వేద విరుద్ద ములగుటచే అప్రమాణము లయినవి.
ప్రశ్న: భోజనములందు అందరును కలిసి భుజింపవచ్చునా? (Interdining)
ఉత్త: శాస్త్రాక్షేపణము ఈ విషయమున లేదు. ఆచారమే ఆటంకము కలిగించుచున్నది. దాక్షిణాత్యులలో నీ యాచారము తీక్షణముగా నున్నది.
ప్రశ్న: హిందూసంఘము యొక్క పరమావధి ఎట్లుండును?
ఉత్త: అందరును వేదముల జదివి యజ్ఞోపవీతధారణ మొనర్చుటయే దాని పరమావధి."*[7]
ఇట్టి ప్రశ్నోత్తరములలోనే భగవానుని యభిప్రాయములు ఇట్లున్నవి. ఆ రోజుల్లో కుంజుస్వామీ రామనాథయ్యరూ పలాకొత్తుకు పోయే దారికి ప్రక్కగానున్నరూములో వుండేవారట. ఉభయులూ భోజనంచేసి వసారా తిన్నెమీద కూర్చుని ఇష్టాగోష్ఠిగా మాట్లాడుకుంటూ ప్రసంగ వశంగా 'ఇదిగో కుంజుస్వామీ! రేపటి నుండి మీరున్నూ వేదాధ్యయనం చేయవచ్చును. భగవాన్ తీర్మానం చేశారీవాళ' అన్నారట రామనాథయ్యర్. వారు ఆమాట అంటూ వుండగానే భోజనానంతరం పలాకొత్తుకు వెళ్ళి తిరిగివచ్చే భగవాన్ వారిని సమీపిస్తూ 'ఆ - నేనా తీర్మానం చేసింది! అధ్యయనం చేయవచ్చును అని నే ననలేదే?' అన్నారట భగవాన్.
వాళ్ళిద్దరు ఉలిక్కిపడి లేచారట. రామనాథయ్యర్ చేతులు జోడిస్తూ 'భగవాన్! ఇంతకు ముందే హాల్లో శంకరం వ్రాసిన చరిత్రలో అన్ని జాతుల వారున్నా వేదాధ్యయనం చేయవచ్చు నన్నది సరిచూచారు గదా?' అన్నారట. 'అవును చూచాను. అభ్యాసమని దిద్దాను గదా' అన్నారట భగవాన్. 'అధ్యయనానికి అభ్యాసానికి భేదం వున్నదా?' అన్నారట అయ్యర్. 'లేకేమి వేద మంటే జ్ఞానమని యర్థం. అందువల్ల వేదాభ్యాసం చేయవచ్చు నన్నమాట. అంతేగాని వేదాధ్యయనం చేయవచ్చునని నే ననలేదే' అన్నారట భగవాన్.*[8] "కొంత కాలం క్రిందట సుందరమయ్యరుకు (భగవాన్ తండ్రి) బంధుకోటిలో చేరిన యువకు డొకడు వివాహం వద్దని తల్లిదండ్రులతో వాదించి తాత్కాలిక వైరాగ్యంతో ఇక్కడికి వచ్చాడట. వస్తే వచ్చాడు ఉన్నన్నాళ్లు వుంటాడు పోనీలే అని చూస్తే మొదట్లోనే ఒక దినం బ్రాహ్మణేతరుల పంక్తిన భోజనానికి కూర్చున్నాడట. సర్వాధికారి కది సరిపడక బ్రాహ్మణ పంక్తికి రమ్మంటే వినక 'భగవాన్ సన్నిధిలో జాతి భేదం ఎందుకు?' అన్నాడట. 'భగవాన్ అంటే అన్నీ వదలుకొన్నారు గనుక సరిపోయింది. నీ కెందుకది. మీ తల్లిదండ్రులు వింటే ఏమంటారు అని సర్వాధికారి హితంగా బోధిస్తే అతడు వినక వాదింప సాగాడట. వాదన ముదిరింది. భగవాన్ సాక్షి మాత్రంగా ఊరుకుంటే ఆ యువకుడు ఆగలేక శ్రీవారిని సమీపించి 'భగవాన్ సన్నిధికి వచ్చిన వెనుక జాతి భేదం పోవద్దా?' అన్నాడట.
"ఓహో! నీకు ఇదొక్కటేనా మిగిలింది. అన్నీపోయినవన్న మాటేనా? అన్నీ పోతే ఇదీ పోవచ్చునోయ్, పోవచ్చు నేమిటి? దానంతట అదే పోతుంది. ఏం? అన్ని భేదాలు పోయినవా నీకు' అని ప్రశ్నించారట భగవాన్. ఆ యువకు డంతటితో కుక్కిన పేనల్లే పలక్కుండా బ్రాహ్మణ పంక్తికి వచ్చి కూర్చున్నాడట.[9]
"మహర్షితో సంభాషణములు" (Talks With Maharshi) అను గ్రంథములో మరికొన్ని విశేషము లున్నవి. 13-2-1936 తేది వేదపఠనము ముగిసిన తరువాత అనంతపురము నుండి వచ్చిన యొక పెద్దాయన లేచి మహర్షి నిట్లు అడిగినాడు. 'బ్రాహ్మణేతరులు వేదమును వినరాదని చెప్పబడి యున్నది.'
మహర్షి:- నీ సంగతి నీవు చూచుకొనుము. నీ వెందులకు ఇక్కడికి వచ్చితివో ఆ విషయమున శ్రద్ద వహింపుము. ఈ విషయములతో ఏల కాలమును వ్యర్థము చేయుదువు? 'నేను వేద పఠనమును విన్నాను' అని నీవు అనుచున్నావు. అ నేను ఎవరు?... ముందు ఆ 'నేను' ను కనుగొనుము. తరువాత తక్కిన విషయములు మాటాడ వచ్చును.
కొంత సేపైన తరువాత మహర్షి మరల ఇట్లనెను. ' అనాది కాలము నుండి ప్రపంచములో అనేకులు, 'స్మృతులు ఏవో విషయములను చెప్పుచున్నవి. అవి ఈ కాలమునకు తగవు. నేను ప్రపంచమును సంస్కరించెదను. స్మృతులను తిరుగ వ్రాయుదును' అని గంతులు వేయుచునే యున్నారు. అట్టి సంస్కర్తలు వచ్చినారు పోయినారు. కాని ప్రాచీనములైన స్మృతులు నిలిచియే యున్నవి. అట్టి విషయములపై కాలమును వ్యర్థ మొనర్చుట యెందులకు? ప్రతి వ్యక్తి తన పనిని తాను చూచుకొను చున్నచో అంతయు చక్కగానే యుండును.
13 th February 1936
161. An elderly man from Anantapur, after hearing veda recital in the hall, stood up and asked: "it is said that the non-Brahmins should not hear the recital of the Vedas."
Maharshi:- Mind your business. Take care of what you came here for. Why do you waste your time in these matters. " I heard the recital you say." Who is that 'I'--Find the 'I' first and you may afterwards speak of other matters."
Continuing Sri Bhagavan said:
"The Smrithis say some thing. They are not appropriate now. I will reform the world, rewrite the Smrithis"- saying so people are cutting Capurs in the world from time immemorial. Such reformers have come and gone; but the ancient Smrithis stand. Why waste time over such matters? Let each one mind his business. All will be well.[10]
22 ఆగష్టు 1933.
507, ఒక ఆర్యసామాజికుడు బెంగుళూరు నుండి ఒక సహచరునితో వచ్చి మహర్షిని దర్శించెను. అతడు ఇట్లడిగినాడు.
ఆర్యసామాజికుడు:- నేను వర్ణ వ్యవస్థను అంగీకరింపను. మహాత్మునియొక్క (మహర్షియొక్క) అభిప్రాయము మార్గదర్శకముగా విలువ కలిగినది. నా ప్రయత్నములలో మీ యాశీస్సులను కోరుచున్నాను.
మహర్షి:- నీ స్వరూపమును విచారించి కనుగొనుమని మహాత్ముడు (మహర్షి) చెప్పుచున్నాడు. నీవు అ పనిని చేయవు. నీకు ఆయన యొక్క ఆశీస్సులైనచో కావలె. ఆ.సా.:- ఉపదేశములను పాటించుటకు ప్రయత్నించు చున్నాను. కాని వర్ణ భేదము బాధకరముగా నున్నది. అది పోవలసినదే.
మహర్షి:- అది ఎవరికి బాధను కలిగించు చున్నది?
ఆర్యసామాజికుడు:- సమాజములోని సభ్యులకు......
మహర్షి:- చెప్పుచున్నది నీవు. వర్ణభేదములులేని దేశములున్నవి. వానియందు కష్టములు లేవా? అక్కడ యుద్ధములు పరస్పర హత్యలతో సంఘర్షణములు మొదలగునవి వున్నవి. నీవు ఆ ఘోర పరిస్థితుల నేల చక్కబెట్టుట లేదు?
ఆర్యసామాజికుడు:- కష్టములు ఇక్కడకూడ వున్నవి.
మహర్షి:- భేదములు ఎల్లప్పుడు వుండును. ఇక్కడ మనుష్యులు మాత్రమే కాదు. జంతువులు, చెట్లు కూడ వున్నవి. ఈ పరిస్థితిని మనము ఏమియు చేయలేము.
ఆర్యసామాజికుడు:- జంతువులు మొదలగువాని సంగతి ప్రస్తుతము మనకు అక్కర లేదు.
మహర్షి:- ఎందుకు అక్కరలేదు? అవి మాటాడ గలిగినచో నీతో సమానత్వమును తమకు హక్కుగా ప్రకటించుచు మానవుల కంటే తీవ్రముగా నీ హక్కును ప్రతిఘటించ గలవు.
ఆర్యసామాజికుడు:- దానికి మనము ఏమియు చేయలేము. అది ఈశ్వరుని పని.
మహర్షి:- అది ఈశ్వరుని పనియైనచో తక్కినది నీ పనియా? అంతేనా?
ఆర్యసామాజికుడు:- నేను భేదములను కాదనుట లేదు. ఆధిక్యమును గూర్చి హక్కులు మాత్రము తప్పు. మహర్షి:- శరీరమునందలి యవయవములలోనే భేదములున్నవి. పాదమును తాకినచో చేయి మలినమగును. ఒక్కొక్క యవయవము తన కార్యమును నిర్వర్తించుచున్నది; నీవు భేదముల నేల కాదందువు?
ఆ.సా.:- వర్ణభేదము అక్రమమని ప్రజలు చింతించుచున్నారు.
మహర్షి:- అట్టి భేదములు తోచని దశకు నీవు వ్యక్తిగతముగా చేరుకొని సుఖముగా నుండవచ్చును. ప్రపంచమును మార్చుటకు నీ వెట్లు ఆశింపగలవు. నీవు ప్రయత్నించినను నెగ్గలేవు. కావ్యకంఠ గణపతిశాస్త్రి మంత్రములను ఉపదేశించి బ్రాహ్మణులుగా చేయుటకై హరిజనులకు అవకాశ మొసంగెను. కాని హరిజనులు దాని నందు కొనుటకు ముందునకు రాలేదు.
22 nd August 1938
507 An Arya Samajist from Bangalore with a companion visited Sri Maharshi. He asked:
D: I do not approve of the caste system. Mahathma's opinion is valuable as guidance. I want your blessings in my attempts.
M: Mahathma has told you to seek and find yourself. you will not do it but require his blessings. D: I am trying to follow the instructions. But caste distinction is painful. It must go.
M: To whom it is painful?
D: The members of the society.........
M: It is you who say it. There are countries where there are no such distinctions of caste. Are they free from trouble? There are wars, internecine struggles etc. Why do you not remedy the evils there?
D: There are troubles here also.
M: Differences are always there. There are not only human beings, but also animals, plants etc. The state of affairs cannot be helped.
D: We do not mind the animals etc, at present.
M: Why not? If they could speak they would claim equality with you and dispute your claims no less vigorously than human beings.
D: But we cannot help it. It is Gods work.
M: If that is God's work then the other part is your work, is that so? D: I do not object to differences. But the claims of superiority are wrong.
M: There are differences in the limbs of one's body. When the hand touches the foot the hand is defiled. Each limb performs it's function. Why do you object to differences?
D: The people feel the injustice of caste distinction, it must be rooted out.
M: You can individually arrive at the state where such distinctions are not perceived and be happy. How can you hope to reform the world? Even if you try you cannot succeed. Kavyakantha Ganapathi Sastri offered to initiate Harijans with Mantras and make Brahmins of them. But the Harijans did not come forward to accept the offer......*[11]
ఈ భేదముల సంగతి ఎట్లున్నను ఒక విషయము మాత్రము నిశ్చితము. ఈ అభిప్రాయ భేదములవలన నాయనకు గురువునందు భక్తి, మహర్షికి శిష్యునందు అనురాగము ఏ మాత్రము తగ్గ లేదు. అభిప్రాయ భేదముల వలన మహితాత్ములయందు పరస్పరాను రాగము భంగపడదు. నాయన నిర్యాణవార్త భగవానుని ఎంతగా కదిలించెనో చూడుడు. "నాయన పోయినాడని వార్త చేరగానే భగవాన్ 'పోయినాడా' అని గద్గద స్వరముతో కన్నీటితో 'అటువంటి వాడు మన కెక్కడ నుండి వస్తాడు' అనిరి.
ఖర్గపూరు శిష్యులు నాయనకు పాడెమీద నుండగా Photo తీసి Enlarge చేయించి తెచ్చి భగవానునకు చూపుచుండగా నేనును హాలు నందుంటిని.
వణకుచున్న కంఠముతో కన్నీటితో భగవాను వాక్కు: 'నాయన చనిపోయినారని ఎవరన్నారు. గాడసమాధిలో నున్నట్లు వున్నారుగదా' అని మొగము నితరులకు చూపక ఉత్తరపు గోడవైపు త్రిప్పిరి.[12]
"జయంతి తే సుకృతినో రససిద్దా:"
- ↑ * జయంతి సంచిక పుట 12
- ↑ * జయంతి సంచిక - ఆదిహిందువు లిచ్చిన సమ్మానము - శిరుగూరి జయరాం - పుట - 3
- ↑ * నాయన - పుట 584
- ↑ * "నాకు తెలిసిన నాయన" కృష్ణభిక్షు - కావ్యకంఠ గణపతి ముని జయంతి (సంచిక) 1979 - పుటలు - 7, 8
- ↑ * నాయన-పుటలు - 577, 578.
- ↑ * జయంతి సంచిక పుట-7
- ↑ * జయంతి సంచిక-పుటలు 73, 74, 75
- ↑ * శ్రీ రమణాశ్రమ లేఖలు-సూరి నాగమ్మ పుటలు 631, 632.
- ↑ * శ్రీ రమణాశ్రమ లేఖలు - సూరి నాగమ్మ పుటలు 634, 635.
- ↑ * Talks With Maharshi - Page 137, 138
- ↑ * 'Talks With Maharshi' Pages 489, 490, 491
- ↑ * జయంతి సంచిక - 'నాకు తెలిసిన నాయన' కృష్ణభిక్షు - పుట 10