గణపతిముని చరిత్ర సంగ్రహం/తపోయాత్ర

8. తపోయాత్ర

వాసిష్ఠుడు బయలుదేరుచుండగా వాసుదేవశాస్త్రిని తోడుగా తీసికొని పొమ్మని మహర్షి చెప్పెను. అట్లే ఇద్దఱు చెన్నపురియొద్ద తిరువొత్తియూరునకు చేరిరి. అచ్చట కపాలిశాస్త్రి నాయనకు శిష్యుడయ్యెను. అక్కడ తపస్సు చేయుచుండగా ఒకనాడు మహర్షి వచ్చి తన్ను స్పృశించి ఆదరించినట్లుగా వాసిష్ఠునకు గోచరించెను. కళ్యాణరామునకు రేణాకాదేవతావేశము కలిగెనని తెలిసి నాయన, వాసుదేవశాస్త్రిని అరుణాచలమునకు పంపి, వేలూరునకు పోయి కళ్యాణరామునితో పడైవీడునకు పోయెను. రేణుకాక్షేత్రమైన కుండలీపురము పడైవీడుగా ప్రసిద్ధమయ్యెను. ఇది కుండలినీ నదీతీరమందున్నది. అచ్చట నాయన కొన్నాళ్ళు ధ్యాన మొనర్చుచు కళ్యాణరామునకు స్వస్థతను కలిగించుచుండెను.

ఆ సమయమున వాసిష్ఠుడు మంత్రదీక్షలచే యువకులను వెఱ్ఱెత్తించుచున్నాడని వారిని ప్రభుత్వముపై తిరుగుబాటునకు సన్నద్ధము చేయుచున్నాడని ఉమా సహస్రములో ఆ భావములే ఉన్నవని కొందఱు అపవాదులను ప్రబలజేసిరి. ఈ వార్తలు అధికారులచెవుల కెక్కెను. వారు విచారణకు పూనుకొనిరి. పోలీసులు కావ్యకంఠుని ప్రశ్నించుటకు వచ్చిరి. ఆయన కనుసైగచేయగా శిష్యులు ఉమాసహస్రమును గైకొనిపోయి కుండలినీ నదీతీరమున ఇసుకలో ఒకచోట దాచియుంచిరి. పోలీసులు ఆయనను విచారించి అపరాధి కాడని నిశ్చయించుకొని వెడలిపోయిరి. ఆ రాత్రి నదికి వఱదవచ్చి గ్రంథము కొట్టుకొని పోయెను.

కుండలినీనది గ్రంథమును హరించెనని, అయినను విచారింప వలసిన పనిలేదని, దానిని తాను మరల రచింపగలనని నాయన రమణునకు కబురుచేసెను. ఆ క్షేత్రమును వీడుమని పోలీసులు హెచ్చరించినను ఆయన అచ్చటనే యుండి రేణుకను ధ్యానించుచుండెను. 12-5-1908 తేది విశాలాక్షమ్మ ఆడపిల్లను ప్రసవించెనని తెలిసి నాయన వేలూరునకు పోయి పుత్రికకు వజ్రేశ్వరి యని నామకరణ మొనర్చెను. వాసిష్ఠుడు మరల పడైవీడునకు పోయి 40 దినములు తపస్సు చేసెను. దీక్షాంతము నందు 200 మంది చేటికలతో కూడియున్న రేణుకా దేవిని ఆయన దర్శించెను. తన శరీరము నందు ఆమె నూతన శక్తిని ప్రసరింప జేసినట్లు, కుమారస్వామి హస్త మందున్న శక్తి అను నాయుధమును తనకు ఒసంగినట్లును ఆయనకు అనుభవము కలిగెను. తరువాత ఆయనకు ఋగ్వేదములోని యస్త్రవిద్యా మహామంత్రము గోచరించెను. అది రేణుకా పరశురాముల యనుగ్రహము వలన సంభవించెనని, వేదసూక్త హృదయములను భేదించుటకు అధికారము కూడ తనకు కలిగెనని ఆయన తలంచెను.

పడైవీడు నుండి వాసిష్ఠుడు వేలూరునకు వచ్చి ఆ యస్త్ర మంత్రము ఉపదేశించుచు శిష్య సంఘమును ప్రబల చేసెను. అది వేద సంఘముగా, ఇంద్ర సంఘముగా ప్రసిద్ధ మయ్యెను. దానిని విప్లవ సంఘముగా ప్రభుత్వాధికారులు భావించి, ఆయనను బంధించుటకు ప్రయత్నించిరి. వెంటనే ఆయన షరాయిని టోపీని ధరించి విద్యార్థి వేషములో 'హంపి' కి బయలుదేరెను. హోస్పేటలో ఒక దొంగ యొక్క వంచనము వలన ఆయన ఒక రాత్రి ఖైదులో నుంచబడెను. మఱునాడు పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఆయన వృత్తాంతమును అడిగి తెలిసికొని విడిపించి మంత్ర దీక్షను పొంది శిష్యుడయ్యెను. అతని సాయమున ఆయన హంపికి చేరి అక్కడ తపస్సు చేయుటకు బుద్ది పుట్టక 'మాఉళి' అను క్షేత్రము నందు తపస్సునకు ఉపక్రమించెను. అక్కడ ఒక నెల అనంతరము ఆ క్షేత్ర దేవత మూడేండ్ల బాలికగా సాక్షాత్కరించి "అస్త్ర విద్యా సిద్ధికి కాలము పక్వము కాలేదు" అని మాయ మయ్యెను. ఆమె యాదేశముగా భావించి అప్పటి నుండి ఆయన విరాణ్మహా మంత్రమును పెక్కుమందికి ఉపదేశించి వ్యాపింప జేయుట, వేద సూక్తములను పరిశోధించుట తనకు జీవిత లక్ష్యములనుగా భావింప జొచ్చెను.

మాఉళి నుండి వేలూరుమీదుగా నాయన తిరువణ్ణామలై వచ్చి రమణుని దర్శించెను. అక్కడ తన శిష్యులు మరల చూత గుహలో వుండుడని నాయనను కోరిరి. "ఉమా సహస్రమును మరల నిర్మించిన తరువాతగాని నేను ఆ గుహలో ప్రవేశింపను" అని శపథముచేసి నాయన వేలూరుకు వచ్చెను. అక్కడ రెండు నెలలు విశ్రాంతి తీసికొని శివరామ శాస్త్రిని పిలిపించుకొని వానితో దక్షిణ యాత్రకు బయలు దేరెను. కన్యాకుమారి, శుచీంద్రము, రామేశ్వరము మొదలగు క్షేత్రములను సేవించుచు జంబుకేశ్వరము చేరి శివరామ శాస్త్రిని ఇంటికి పంపి, అచ్చట అఖిలాండేశ్వరిని గూర్చి పది దినములు ఆయన ధ్యానించెను. పిదప ఆయన ఉమాస్తుతిని మరల రచింప నారంభించెను. ఎంత ఆలోచించినను 700 శ్లోకములకు పైన జరుగ లేదు. ఈ సప్తశతిని ఆయన శిష్యుని ద్వారా మహర్షి యొద్దకు పంపెను. అచ్చటనుండి ఆయన తిరువొత్తియూరు, చిదంబరము, పక్షితీర్థము, తిరుత్తణిని దర్శించెను. అక్కడనుండి ఆయన వేలూరునకు వచ్చి 1910 ఫిబ్రవరిలో కుమారునకు ఉపనయన మొనర్చెను.

1910 ఏప్రిలులో పంచాపకేశశాస్త్రి వేలూరునకువచ్చి నాయనను చెన్నపురికి ఆహ్వానించెను. కాని నాయన ముందుగా భార్యా పుత్రులతో అరుణాచలమునకు పోయి ఒక నెల వుండెను. ఆయన అరుణాచలమునకు బయలుదేరునప్పుడు యమ్. హెచ్. హంఫ్రీసు అను నాంగ్లేయుడు తనకు కలలో కన్పించిన మహానుభావునిగా నాయనను గుర్తించి శిష్యు డయ్యెను. తర్వాత నితడు మహర్షిని కూడ దర్శించెను. ఇరువురిని ఇతడు దివ్యావతార పురుషులుగా కొలుచు చుండెను.

1910 మే నుండి 1912 వఱకు నాయన చెన్నపురములో కాపుర ముండెను. తర్వాత ఆదిశంకరుల జన్మస్థలమగు కాలటి కేగెను. అక్కడ దంపతులు పంచదశీ మహామంత్రమును జపించుచు కొంతకాల ముండి కర్ణాటకములోని గోకర్ణ క్షేత్రమును దర్శించుటకు బయలుదేరి ఉడిపి చేరిరి. అక్కడ సమీపముననున్న బడబాండేశ్వరము అను బలరామక్షేత్రమందు నాయన కొన్నిదినములు ఒంటరిగా తపస్సు చేసెను. అక్కడి పీఠాధిపతులు ఆయన మహత్త్వమును గుర్తించి సత్కరించుటకు సభను ఏర్పాటు చేసిరి. ఆ సభలో ఆయన వారి యభ్యర్థనమున ఆశువుగా మతత్రయ సిద్ధాంతముల సారమును (అద్వైత విశిష్టాద్వైత ద్వైతములు) నూఱు శ్లోకములలో చెప్పెను. అది తత్త్వఘంటాను శాసనముగా, తత్త్వఘంటా శతకముగా ప్రసిద్ధ మయ్యెను. అది మహర్షి యొక్క ఆదరమునకు పాత్ర మయ్యెను.

1912 ఏప్రిలులో నాయన ఉడిపిని వీడి సకుటుంబముగా గోకర్ణమునకు చేరెను. అచ్చట అమ్మ నాయనలు నిగూఢముగా కృష్ణ మఠమునకు వెనుక భాగమున తపస్సు చేయజొచ్చిరి. కోవెల పూజారి ఒకడు వీరి మహత్త్వమును గుర్తించి ఊరిలో ప్రచార మొనర్చెను. అప్పుడు అనంతశాస్త్రి అనునొక యుద్దండ పండితుడు గోకర్ణములోని పండితులతో వాద మొనర్చుటకు వచ్చెను. వారు నాయనను ప్రార్థించి ఆయన వాదమునకు ప్రతివాదమును గావించుటకు ఒప్పించిరి. అనంతశాస్త్రి ఈశ్వరుని మహిమయొక్క ప్రాముఖ్యమును గూర్చి చమత్కృతితో ప్రవచనము గావించెను. వాసిష్ఠుడు ఆ వాదములోని యుక్తులను ఖండించి ఈశ్వర వైష్ణవ మతములు రెండును వేదము నందు చెప్పబడిన ఇంద్ర మతమునకు శాఖలవంటివని నిరూపించి వేదోద్ధరణము యొక్క ఆవశ్యకతను ఉద్ఘాటించెను. అనంతశాస్త్రి నిరుత్తరుడై వాసిష్ఠునకు పాదాభి వందనము గావించి శిష్యుడయ్యెను.

పిమ్మట నగరమున నాగేశ్వర వీధిలో శ్రీ వెంకటరమణ పండితుని యింట నాయనకు బస కల్పింపబడెను. అచ్చట జ్యోతిశ్శాస్త్రజ్ఞులు కొందఱు పరాశర సంహిత యందు తమకు కలిగిన సందేహములను నాయనను అడుగ జొచ్చిరి. ఆ సందేహములు తొలగుటకు శాస్త్రము సులభగ్రాహ్య మగుటకును నాయన లఘు సంహిత అను పేరుతో కొన్ని సూత్రములను రచించి యిచ్చెను. జ్యోతిష ఫలములను సరిగా చెప్పుట కిది ఎంతో ఉపకరించు చున్నదని గోకర్ణ పండితులు నేటికిని చెప్పుకొను చుందురు.

ఈ జ్యోతిశాస్త్ర రచనమును గూర్చి శ్రీ నిష్ఠల సీతారామశాస్త్రి ఇట్లు ప్రశంసించినాడు. 'జ్యోతిషశాస్త్ర గ్రంథములలో ఒకే ఒక గ్రంథమున ఇన్ని విషయములు ఇంత సంగ్రహముగా ఎక్కడను పొందుపరచబడి యుండలేదు. ఇందలి సంజ్ఞలుకూడ శ్రీ గణపతి ముని గారిచే కల్పింపబడినవి. ఈ గ్రంథమునకు నిర్ణయ సంగ్రహ మను పేరుగల గాణపత శాస్త్రమని పేరు. ఈ శాస్త్రమునకు శేష ఫలాధ్యాయములుగా త్రిభావ ఫలచంద్రిక షోడశశ్లోకి అను చిన్న కృతులు రచింపబడినవి. 1966లో గణపతిశాస్త్రి గారి ప్రియ శిష్యులగు గుంటూరు లక్ష్మీకాంతముగారు గణపతిముని కృతులను తెలుగులో ప్రచురించుచు 'పారాశర్య కేరళీయ సముచ్చయము' అను పేరుతో దీనిని ప్రచురించిరి. జ్యోతిష పండితులగు బ్రహ్మశ్రీ మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు దీనికి తెనుగు తాత్పర్యము వ్రాసిరి.*[1]

గోకర్ణములో నాయన ఆ ప్రాంతమునందు ప్రచారములో నున్న వేదములోని యధిక భాగములను పాఠము చెప్పించుకొని యొక పక్షము దినములలో కంఠస్థ మొనర్చెను. ఆ భాగములందు భాగవతములోని కృష్ణలీలాఘట్టముల కాధారము లుండుట నాయనకు ఆశ్చర్యమును కలిగించెను.

కొన్నినాళ్ళైన తరువాత నాయన నగరములో నుండుటకు ఇష్టపడక సమీపమందున్న యుమామహేశ్వర పర్వతముపైఉన్న గణపతి దేవాలయమున భార్యతోకూడ తపస్సు చేసికొనుటకు నిశ్చయించెను. అక్కడ వారికి సహాయుడుగా ఉండుటకు గణేశశర్మ అను యువకుడు ముందునకు వచ్చెను. అతని గోత్ర ప్రవరలోని దేవరాతఋషినిబట్టి అతనిని దైవరాతునిగా నాయన పేర్కొనెను. దైవరాతుడు శిష్యుడైన తర్వాత నాయనకు అనంత శాస్త్రితో వాదము జరిగినట్లు "వాసిష్ఠ వైభవము" నందు (17 వ ప్రకరణము - పే. 185) చెప్పబడినది.

దైవరాతుడు వంట మొదలగు పనులను గావించుచు గురువునకు గురుపత్నికి శుశ్రూష చేయుచు రాత్రులందు నాయన యొద్ద కావ్యములను ఉపనిషద్విద్యలను అధ్యయన మొనర్చు చుండెను.

వినయశీలి వేదపండితవంశము వాడును అయిన దైవరాతుడు నిశ్చలభక్తితో గురువును సేవించి అచిరకాలముననే నాయనకు ప్రీతిపాత్రుడయ్యెను. నీడవలె నాయన ననుసరించి మహేంద్రగిరిలో, పడైవీడులో నాయనతోపాటు తపస్సుచేసి అనేక దివ్యాను భూతులను పొందెను.

శ్రీ రమణ భగవానుని ప్రథమ దర్శనముననే భక్తి ఉప్పొంగగా దైవరాతునినోట వెలువడిన శ్లోకములే "రమణవిభక్త్యష్టకముగా" ప్రసిద్ధి గాంచినవి. నాయన రచించిన శ్రీ రమణగీతయందు మూడవ ప్రకరణమున దైవరాతుని ప్రశ్నలు భగవాన్ ప్రత్యుత్తరములు కూర్పబడియున్నవి.

పడైవీడులో తపస్సమాధిలో నున్న దైవరాతుని వాక్కు నుండి నూతన మంత్రములు వెలువడ సాగినవి. నాయనకు అవి స్పష్టముగా వినిపించెను. పదునాఱు దినములలో నాలుగు వందల యిరువది యెనిమిది మంత్రములు ప్రకటములయ్యెను. నాయన వీనిని "ఛందో దర్శనమ్" అను గ్రంథమున గూర్చి దానికి "వాసిష్ఠాన్వయ భాష్యము" అను పేరుతో వ్యాఖ్యను రచించెను. సంస్కృత వాఙ్మయమునందు ఇది మణిపూస వంటిదని ప్రముఖ పండితులు శ్రీ ఆర్. ఆర్. దివాకర్‌ గారు ప్రశంసించిరి. ఇది ఆంగ్లములోనికి అనువదింపబడి భారతీయ విద్యాభవనము వారిచే ప్రకటింపబడినది.

ఈ భాష్యముయొక్క ముగింపునందు నాయన ఇట్లనెను. "విశ్వామిత్రగోత్రజుడైన దైవరాతుడు అధునాతన విశ్వామిత్రుడుగా తపస్సు చేసెను. ఒక ఋషియొక్క దృష్టితో చూచినచో యీ మంత్రములు గంభీరార్థములు కలవి. పవిత్రములు, పవిత్రీకరింప జాలినవి.

ఈ దైవరాతుడు ఒక యోగి, తపస్వి, వేదవేత్త, మంత్రద్రష్ట అని, తపస్సు, పాండిత్యము, సంస్కారము, సద్వర్తనము, వినయము అనుగుణములచే ప్రాచీనులైన ఋషులతో సమానత్వమును పొందుటకు అర్హుడనియు చెప్పుటకు నేను గర్వపడు చున్నాను". దైవరాతుడు మాత్రము తన యౌన్నత్యమునకంతకు గురు కటాక్షమే కారణమని వినయముతో చెప్పుకొనెను.

పౌరాణిక కథలను బట్టి వేదార్థములను, వేదార్థములను బట్టి పౌరాణిక కథలను విమర్శించుచుండుటయే నాయన నూతన తపో విధానముగా అవలంబించెను. రెండు పక్షములలో పాడ్యమి తిథులందు నాయన ఊరిలోని విద్యాపీఠమునకు పోయి పండితుల సందేహములను తీర్చుచు తన పరిశోధన విషయములను వారికి చెప్పుచుండెను.

నాలుగు నెలలు ఇట్లు గడిచెను. 1912 డిసెంబరులో తండ్రికి అవసానదశ వచ్చెనని తెలిసి నాయన కలువఱాయికి పోయెను. ప్రయాణములో కలిగిన యాటంకమువలన ఆయన చేరునప్పటికి కొన్ని గంటలకు ముందే నరసింహశాస్త్రి స్వర్గస్థుడయ్యెను. తండ్రియొక్క కర్మక్రతువు లైన పిదప నాయన అరుణాచలమున మహర్షిని దర్శించి గోకర్ణమునకు వచ్చెను.

గోకర్ణ సమీపమున "సన్నబేలా" అను గ్రామమునందు ఉప్పుందోపాధ్యాయుడు జ్యోతిష్టోమ యజ్ఞమును సంకల్పించి దానికి బృహస్పతినిగా నాయనను వరించెను. దాని యేర్పాటులకై డిశంబరు మూడవ వారములోనే నాయన సకుటుంబముగా అక్కడ ఒక యాశ్రమమున బసచేసెను. ఆ యజ్ఞము ఫాల్గున బహుళ పక్షమున ఆరంభింపబడి 1913 ఏప్రిలులో చైత్ర శుద్ధమున ముగిసెను. ప్రతిదినము నాయన యజ్ఞకర్మ మంత్రముల యర్థములను వివరించుచుండెను. యజ్ఞముయొక్క ఉపసంహారమునందు ఆయన కన్నడమున అనర్గళముగా ఉపన్యసించి అందఱకు ఆశ్చర్యమును ఆనందమును కలిగించెను. పిమ్మట ఆయన యజ్ఞమునకు జయమును గూర్చిన యింద్రాణియొక్క మంత్రమును మౌనదీక్షతో వారము దినములు జపించెను. 1913 ఆగష్టులో అప్పుశాస్త్రియభ్యర్థమున నాయన సికింద్రాబాదునకు చేరెను. అక్కడ అనేకులు ఆయనవలన మంత్ర దీక్షలను పొందిరి. వారి మూలమున పెక్కుసభలలో ఉపన్యసించుచు ఆయన మహర్షియుపదేశమును ప్రసరింపజేసెను. తండ్రియొక్క సాంవత్సరికములకు ఆయన కలువఱాయికి పోయి, అక్కడ నుండి డిసెంబరు మూడవవారములో తిరువణ్ణామలై చేరెను. అక్కడ అరుణాచలశాస్త్రి అను పండితునితో రమణుని సమక్షమున 29-12-1913 తేది నాయన వాదించి ఆయన ప్రతి పాదనములను ఖండించి ఇట్లు ఉద్ఘాటించెను. "శాస్త్రీయమైన సత్యాసత్యముల చర్చయొక్కటియే ముక్తిని ఈయజాలదు. ముక్తికి ఉపాసనము ముఖ్యసాధనము. స్వరూపనిశ్చయమే నిజమైన జ్ఞానము. ఆత్మజ్ఞానమునకు సాధనమైన యోగము కోర్కెలను కూడ సాధింపగలదు. కోరిక కొఱకు యోగ మారంభించి మధ్యలో జ్ఞానసిద్ధిని పొందినచో మొదటి కోర్కె కూడ సిద్ధించును. కాని జ్ఞానికి దానియందు అపేక్ష యుండదు.

గురునియొద్ద ఇంచుమించుగా ఒక పక్షము దినము లుండి నాయన 1914 జనవరిలో సికింద్రాబాదునకు చేరి దానికి సమీపమున 'కర్కేళి' గ్రామమున నాలుగు మాసములు తపస్సు చేసెను. తరువాత అమ్మ యభిలాషను తీర్చుటకై నాయన ఉత్తరదేశ యాత్రలకు బయలు దేరెను. భువనేశ్వరము నందు అమ్మ నాలుగు నెలలు భువనేశ్వరీ మంత్రమును జపించి హస్తమున పాక మహిమను అక్షయత్వ సిద్ధిని పొందెను. అక్కడ నుండి నాయన తల్లి యొక్క అబ్దికము కొఱకు మందసాకు వచ్చెను. అప్పుడాశ్రాద్ధ కార్యమున అమ్మ చేసిన వంట యందు అపూర్వమైన రుచియేకాక, వండిన పదార్థము ఎంతమంది కైనను అక్షయముగా సరిపోవుట ఆశ్చర్యకరముగా నుండెను. మందసాలో రాజ కుటుంబమువారి యభ్యర్థనమున అమ్మ నాయనలు ఇంచుమించుగా ఒక సంవత్సర ముండిరి.

మందసా యందు వారు మూడు సంవత్సరము లుండిరని వాసిష్ఠ వైభవము నందు చెప్పబడినది.

"వత్సరత్రయకాలోఽభవన్మందసాయా మావాసః"*[2]

జగదీశ శాస్త్రి యొక్క సోదరుడు రామనాథ బ్రహ్మచారి (యజ్ఞరామ దీక్షితుడు) తిరువణ్ణామలై నుండి మందసాకు వచ్చి 'హృదయకుహర మధ్యే' అను శ్లోకమును జగదీశశాస్త్రి ఆరంభించి వదలిపెట్టగా రమణ భగవానుడు దానినెట్లు పూరించెనో నాయనకు వివరించి చెప్పెను. ఆ శ్లోకము యొక్క అర్థ గాంభీర్యమునకు నాయన ఆశ్చర్యపడి తన యానందమును ఆ బ్రహ్మచారి ద్వారా గురువునకు నివేదించుకొనెను.

మందసా నుండి కలమూరి వేంకటశాస్త్రి (ఆధాము) అను శిష్యునితో అమ్మతో రెండు నెలలలో కాశి, గయ, ప్రయాగ, అయోధ్య మొదలగు క్షేత్రములకు నాయన యాత్ర గావించెను. అప్పుడు బృందావన మధురలో జరుగు చుండిన పండిత సభలకు పోయి నాయన, బాల్యమునకు కన్యాత్వమునకు భేదము కలదని, 'శ్లో|| అష్టవర్షా భవేత్ కన్యా' ఇత్యాది శ్లోకములు కల్పితములని, కన్యాత్వము రజో దర్శనముతో ఆరంభ మగునని, తరువాత మూడేండ్ల వఱకు వివాహము జరుపవచ్చునని అది కన్యా వివాహమే అగునని నిరూపించెను.

1916 మార్చిలో మందసాకు వచ్చి నాయన అటనుండి కలువఱాయికి చేరెను. 5-5-1916 తేది నలనామ సంవత్సర వైశాఖ శుద్ద ద్వితీయ వజ్రేశ్వరికి ఎనిమిదవ యేటనే నాయన బంధువుల పట్టుదల వలన వివాహమును గావించెను. తిరువణ్ణామలైకి బయలు దేరుచు త్రోవలో నెల్లూరు నందు రాజకీయ సభలో నాయన సంస్కృతమున అనర్గళముగా ఉపన్యసించెను. మఱునాడు అక్కడ జరిగిన సనాతన ధర్మ సభలో నాయన 'వేదశాస్త్ర సంప్రదాయములు' అను సమాసమును ద్వంద్వమునుగా గ్రహించి వేదములు, శాస్త్రములు, సంప్రదాయములు మూడును సమానముగా ప్రమాణము లైనట్లు గ్రహించుట తప్పు అని, దేశ కాలములకు అనుగుణముగా సంప్రదాయములను సంస్కరించుకొనుట వలన వైధికమైన ధర్మమునకు భంగము వాటిల్లదని ఉద్ఘాటించెను. సంప్రదాయ వాదులకు కొంతమందికి ఆ యభిప్రాయములు నచ్చలేదు.

తిరువణ్ణామలై చేరి నాయన గురు దర్శనము గావించుకొని మందసాకు తిరిగి వచ్చెను. అక్కడ మహేంద్రగిరి శిఖరమున ఒక గోకర్ణేశ్వరాలయము వున్నది. పశ్చిమతీర గోకర్ణము నందున్న దైవరాతుడు మందసాకు వచ్చి ఈ గోకర్ణమును దర్శింప కోరి శివరాత్రి దినమున మందసా రాజుయొక్క సాయమున నాయన శిష్య సమేతుడై శిఖరమున నున్న యాలయమును చేరి అందున్న లింగమును పరీక్షించెను. పశ్చిమ గోకర్ణమున లింగము గోవు చెవి యొక్క ఆకృతిలో నుండగా ఇక్కడ గోవు చెవియొక్క రంధ్రము వంటిదే లింగము నందు రంధ్రము వుండుటను గమనించి ఈ లింగమును 'దహర గోకర్ణేశ్వరుడు' అని నాయన పేర్కొనెను. దహర మనగా రంధ్రము లేక లోపలి ప్రదేశము - ఆ యాలయమునకు ప్రక్కన విష్ణు దేవుని యాలయ ముండెను. ఆ దేవుడు పరశురాముడని నాయన గ్రహించెను. ఆ రెండు ఆలయముల మధ్య కూర్చుండి నాయన 20 దినములు 'అహం' మూలాన్వేషణ రూపమును తపస్సు చేసి తన యందు పరశురాముని తేజస్సు ప్రవేశించినట్లుగా అనుభూతిని పొందెను.

వాసిష్ఠ వైభవము నందు దైవరాతుడు గురువును దర్శించుటకు వచ్చిన తరువాత పింగళ సంవత్సర జ్యేష్ఠ మాసారంభమున 1917 జూన్‌లో మందసా నుండి నాయన అరుణాచలమునకు పోవునప్పుడు నెల్లూరియందు సభలలో ఉపన్యసించుట జరిగెనని చెప్పబడియున్నది.*

  1. * జయంతి సంచిక పుట - 64
  2. * 195 - ప్రకరణము - 18