క్రీడాభిరామము/ఐదవ భాగము
<poem>
నగరావలోకనము
అదె భైరవస్థాన మటమీద నల్లదె చమడేశ్వరీ మహాశక్తి నగరు వీరభద్రేశ్వరాగార మంటపమదె యదె బౌద్ధదేవు విహారభూమి అదె ముద్దరా ల్ముసానమ్మ నివాసంబు నల్లదె కొమరుసామయ్య నగరు అదె పాండవుల గుడి యట దక్షిణంబున గర్తారుడుండు తుర్కల మసీదు
కొంతదవ్వులనదె మహాగోపురముల పైడికుండలు రవిదీప్తి ప్రజ్వలించి కాననయ్యెను మేరుశృంగములబోలె కేశవశ్రీ స్వయంభూ నికేతనములు
అనుచు నటజని ముందట కొక్క భైరవాలయంబు బొడగని నమస్కరించి కాచల్నాటి మంచనశర్మ యిట్లనియె
భైరవుడు
అమితోత్సాహముతోడ నీవు పటు బాహాఢక్క నొక్కొక్క మా టు మనఃకంపము నొందజేయ దొలకాడున్ వార్ధి వేలా లుఠ త్కమఠంబై, వలమాన మీనమయి, యుద్యన్నక్రమై, యుత్తర త్తిమియై, యుల్లల దంబుమగ్న ఢులియై ధీరా మహాభైరవా
అని యూర్వ్ధం బవలోకించి యిప్పుడు మధ్యాహ్న కాలం బగుచున్నయది
మధ్యాహ్నము
వ్రాలెన్ దిక్కుల భాను భా వ్యతికర ప్రక్రీడ దర్కోపల జ్వాలాజాల జటాల జాంగల తటీ వాచాల కోయష్టులై రోలంబంబులు మూతి ముట్ట వెరచెన్ గ్రొవ్వేడి బీరెండలన్ జాలం గ్రాగి కరంబు వేడియగు కాసారాబ్జ మైరేయముల్
అని యనంతరం బాకాశంబునం జెవివెట్టి శ్రుతి నభినయించి గోవిందుండు
గడియారము
ఉడువీథిన్ శిఖరావలంబియగు నంధ్రోర్వీశు మోసాలపై గడియారంబున మ్రోసె రెండెనిముదుల్ ఘంటా ఘణాత్కారముల్ సడలెన్ భానుడు పశ్చిమంబునకు వైశ్యా పూటకూటింటికిన్ గుడువం బోదమె లెక్క యిచ్చి కడు నాకొన్నార మిప్పట్టునన్
విచారించిన నదియును మనకు విశ్రామస్థానంబు
పూటకూటియిల్లు
సంధి విగ్రహ యానాది సంఘటనల బంధకీ జారులకు రాయబారి యగుచు బట్టణంబున నిత్యంబు పగలు రేయి పూటకూటింట వర్తించు పుష్పశరుడు
అనుచు కొంత దవ్వరిగినం దమకు నెదురుగా నేతెంచు నొక్క బ్రాహ్మణుం గనుగొని
వీడిదె తెల్లనాకులను వీడెము సేయుచు వీథి వచ్చుచు న్నాడు మదించి తిండి తినినాడు చుమీ యిటమీద నేడకో తేడగ బోయెడిం గరణదేశపు జాణడుగాగ బోలు నీ బాడు పణోపహార పరిపాటి యెరుంగగవచ్చు వీనిచేన్
ఇతడు వెడలివచ్చు నవ్వాడయె పూటవంటకంబు వెట్టు బాడబులవాడ గావలయు నది యెట్లంటేని
ఘ్రాణ పుటీ కుటీరముల గాపురముండ దొడంగె నిప్డు పా షాణ ఘరట్ట ఘట్టన వశంబున బుట్టిన సత్తుగంధ మ క్షీణ కఠోర సౌరభ విజృంభణ దిక్కుల జల్లజొచ్చె సా మ్రాణి పదార్థజాలములు బ్రాహ్మణకాంతలు తాల బోయగన్
మందవేగంబుతో గ్రొత్తమల కవాళ్ళ కిర్రుచెప్పులు మొరయ నుంకించి నడుచు కరణబ్రాహ్మణ విట ముఖ్యు గదియవచ్చి పూతిమాషాన్వయుండగు భూసురుండు
పూటవంటకంబుల వృత్తాంతం బడిగిన నతండు
ఆహార విహారములకో యాహారంబునకునో విహారంబునకో బేహారము మీ కీసం దేహారంభంబు మాకు దెలియగ వలయున్
ఆహారంబున కంటేని
కప్పురభోగి వంటకము కమ్మని గోధుమ పిండివంటయున్ గుప్పెడు పంచదారయును గ్రొత్తగ గాచిన యాలనే పెస ర్పప్పును గొమ్ము నల్లనటిపండ్లును నాలుగునైదు నంజులున్ లప్పలతోడ గ్రొంబెరుగు లక్ష్మణవజ్ఝల యింట రూకకున్
విహారంబున కంటేని దద్ గృహంబున
అరుగౌను గుబ్బచన్నులు మెరుగుం గన్నులును గలుగు మెచ్చుల నవలా కురుబోడ ముండరత్నము బరివోవగ విడిచినట్టి బ్రహ్మకు జేజే
పూవుంబోడులు లేరె విప్రవిధవల్ భూమండలిన్ దాని రే ఖా వైదగ్య్ధ విలాస విభ్రమ కళా గర్వంబు లట్లుండనీ యా విశ్వస్థ యుపస్థ చాయ నవలక్షాధీశ ఫాలస్థలీ సౌవర్ణ స్థిర పట్టబంధ సుషమా సౌభాగ్యలక్ష్మిన్ గనున్
కోయిల పంచమస్వరము క్రోల్చిన భంగిని విద్దికంచి రా మాయణ మారుకాండములు నచ్యుతజాగర వేళ బాడె నా రాయవితంతురత్న మనురాగముతోడ “నమశ్శివాయ శాం తాయ సమస్తదోషహరణాయ” సమానమె దాని కెవ్వరున్
సంకృత పూతిమాషకుల సాగర శారదపూర్ణిమా కురం గాంకుడు మంచి లక్ష్మణు గృహంబున నెచ్చెలికాడు తానునుం జంకలబంటిగా మెసవి చక్కని వేడుకకత్తె జూచి తా రింకొకమారు వత్తమని యేగిరి కార్యభరంబు పెంపునన్
అట వోవంబోవ ముందట
గేదగిపూవు
పాంథసీమంతినీ ప్రాణమత్స్యములకు గాలములగు కంటకముల తోడ గరుడపచ్చల చాయ బరిహసింపగ జాలు దళమైన బాహ్యపత్రముల తోడ జీర్ణ కీకస కణశ్రేణి జిడ్డలు చేసి యవియ దోమినయట్టి యన్ను తోడ బదియారు వన్నియ బంగారు సరివచ్చు సంవర్తికా పలాశముల తోడ
శివుని చిచ్చరకంట వెచ్చిన యనంగు బూదికెనయైన కమ్మ బుప్పొళ్ళ తోడ దాని ఘనమైన కమ్మ గేదంగిపూవు భూసురున కిచ్చె దగ నొక్క పుష్పలావి
ఇచ్చినం జూచి
క్రొన్నెలరేఖ తోడ గెడగూడి సుఖింపగ భాగ్యమబ్బమిన్ ఖిన్నతనొందు గాని నవకేతకి శూలి వివేకహీనుడై తన్ను దిరస్కరించుటకు దైన్యము నొంద దదే వివేక సం పన్నిధి దానిపాలి పెరుమాళ్ళొక డెక్కడనైన లేడొకో
అందుకొని పుష్పలావికి త్యాగమిచ్చి బ్రాహ్మణులకందు నొక్కొక్క పత్రమొసగి జాణవిప్రుండు సిగదాల్చె జందమామ కొండనాలిక యగు నొక్క గొమలిరేకు
(…….)
అదె విద్వేషిభువన జిగీషా సంరంభ విజృంభమాణ ఝష ధ్వజ భుజప్రాక్రమ సముత్సాహ నాటక ప్రస్తావనా ప్రథమ నాందీశ్లోకంబగు వేశ్యవాటికా నికటంబు
చందనంబున గలయంపి చల్లినారు మ్రుగ్గు లిడినారు కాశ్మీరమున ముదమున వ్రాసినా రిందురజమున రంగవల్లి కంజముల తోరణంబుల గట్టినారు
ఇది యెవ్వరి యిల్లొకో శోభనంబు ముడివడుచున్నయది యనుచు నాకాశంబు వీక్షించి యచ్చటివారల నేమి యని యడిగిన
మాచల్దేవి
ద్వీపాంతంబుల నుండి వచ్చితివె భూదేవా “ప్రశాంతం మహా పాపం” సర్వ జగత్ప్రసిద్ధ సుమనో బాణాసనామ్నాయ వి ద్యోపాథ్యాయి ప్రతాపరుద్ర ధరణీశోపాత్త గోష్టీ ప్రతి ష్టాపారీణ నెరుంగవయ్యెదవె మాచల్దేవి వారాంగనన్
చిత్రశాలా ప్రవేశంబు చేయుచున్నయది పుణ్యాహవాచన కాలంబు మీరును బచ్చని పెండ్లికూటంబు జూడవచ్చునది యనిన
లెస్సగాక కిరాట యీ లేమ చరిత మాడుదురు నాటకంబుగ నవనిలోన దీని జూడంగ బోదమా యీ నెపమున నరసి చూతము మనకేమి యచట ననుచు
అనుచు ప్రవేశ నాటితకంబున జిత్రశాల జొచ్చి పూతిమాషగోత్రుం డచ్చోటం బెండ్లికూటంబున నిలువునం గైసేసి హంసతూలికాతల్పంబు మీదం గూర్చున్న హావభావ విభ్రమ విలాసనిధి మాచల్దేవి గనుంగొని
అంకుశాఖాతరేఖల నందమొందు గంధగజ కుంభముల తోడ గలహమాడు క్రొత్తనఖముల తోడి నీ కుచభరమున కతివ యభ్యుదయ పరంపరాభివృద్ధి
కల్ల జెప్పము విను నీకుగల ప్రసిద్ధి డిల్లి సురతాణికిని లేదు పల్లవోష్టి యాదిలక్ష్మికి నీకును భేదమేమి యుదధి జనియింపకుండుట యొకటి దక్క
ఓరుగంటి మాచాంబ పయోరుహాక్షి పంచబాణావతారుని మంచిజూచి కంకణాలంక్రియా ఝణత్కార మెసగ నయ్యగారికి జోహారు లనుచు మ్రొక్కె
అగురు ధూపాది వాసితాభ్యంతరంబు మగువ నీ మన్మథచ్ఛత్రమంటపంబు సర్వయోషిద(మ)హమాన్య సౌష్టవంబు కాచుగావుత మోర్గంటి కటక విటుల
అనుటయు
ఎందుండి వచ్చితి రీరు కాసల్నాట నుండి వచ్చితిమి మే ముత్పలాక్షి యెవ్వరివారు మీ రేము సంకృతి పూతి మాష మాధవుని కుమారవరుడ మీ దివ్యనామకం బేదియో గోవింద మంచనశర్మ సమాహ్వయులము మీరలిచ్చటికి రా గారణం బెయ్యది చేరి మీబోంట్ల నాశీర్వదింప
నైన విచ్చేసి కూర్చుండ నవధరింప వార్చి వచ్చెద మటువోయి వనరుహాక్షి యెచ్చటికి వార్వబోయెద రెరుగజెప్పు డక్కవాడకు మేము బ్రాహ్మణుల మగుట
(……….) చిత్రావలోనంబు చేసి టిట్టుభునకు గోవింద మంచనశర్మ యిట్లనియె
చిత్రశాల
అదె దారువనభూమి యసమనేత్రుడు వాడె సంయమీంద్రుల పుణ్యసతులు వారె యదె కన్యకారత్న మబ్జాసనుడు వాడె యదె రతిక్రీడా విహారశయ్య వాడె వైకుంఠుండు వారె గోపస్త్రీలు యమునానదీ సైకతాంత మదియె అదె యహల్యాదేవి యమరాధిపుడు వాడె యదె పర్ణశాలికాభ్యంతరంబు
చందురుడు వాడె యదె బృహస్పతి పురంధ్రి జాలరియు నదె శ్రీపరాశరుడు వాడె కుశికజుడు వాడె యదె యింద్రు కొలువు లేము చిత్తజుని శౌర్య మెరిగించె చిత్రశాల
తియ్యనివింటిజోదు రతిదేవి చనుంగవ నొత్తిగిల్లి యొ య్యొయ్యన వంక చక్కబడ నొత్తెడు జూచితె పుష్పబాణముల్ మయ్యెర వ్రాసె జిత్తరువు మాగిలి మాగిలి చిత్రకారుడా దయ్యము గాక నీవి పసదానము టిట్టిభ వీనికీదగున్
అనుచు దద్గృహంబు నిర్గమించి పూర్వానుభూతయగు గాంధర్వి గృహంబు రోయువాడు కతిపయమందిరంబులకు నవల సిందువార లతికా కుండుగంబడి యాలంబున నెరింగి యనుంగు మొగసాలం జొచ్చిన దాసదాసీజనంబు ససంభ్రమంబుగా నెదురేగి తోడ్కొనిపోవం బోయి యభ్యంతర మందిరంబున మహోత్సవ వ్యాపార పారీణయై యున్న యవ్వారముఖ్యం జేరి యాసనార్య్ఘపాద్యాది సముచిత సత్కారంబులం బొంది సుఖాసీనుండై
ముకురవీక్షావిధి
గోత్రము వార లెల్లగెడ గూడినవారు వ్రతంబొ దేవతా యాత్రయొ పండువో మన గృహంబున శోభనమేమి శోభనం బత్రిసమాన నేటి యపరాహ్ణ సమాగమ వేళ బుష్య న క్షత్రమునందు నీ యనుగు గాదిలి కూతురు చూచునద్దమున్
ఆవేళ నీవు బిడ్డకు దీవనమంత్రంబు చెప్ప దీర్ఘాయువగున్ లావణ్యంబు వివేకము ప్రావీణ్యము వైభవంబు భాగ్యము గలుగున్
ముకురవీక్షా విధానంబు మొదల లేక వెల పడంతికి గారాదు విటుని గవయ యాయజూకున కెట్లు చేయంగవచ్చు నరణిసంగ్రహ మొనరింప కధ్వరంబు
లంజెవారికి శ్రీమహాలక్ష్మి గాదె దర్పణము విప్రముఖ్య గంధర్వగణము పుణ్యచారిత్ర దృష్టాంతభూమి గాదె దర్పణమ్ము వివర్త వాదములకెల్ల
ఉన్మద మత్తకోకిల కుహూ కల పంచమరాగ రాగసం పన్మహనీయమైన మధుమాసపు బున్నమనాడు బిడ్డకున్ మన్మథ వేధదీక్ష పదినాళ్ళగు మాత్రము నేతదర్థమై సన్మతి నుండగా వలయు జక్కనివాడవ యక్కవాడలోన్
అదె నీ కుమారిత మదనరేఖా కన్య వదనరేఖా వైభవమున జంద్రు దొరగూర్చికొన్నది ధూర్తదేవత నిన్ను దండ్రి బోలినయట్టి తరళనయన సాముద్రికాగమ జ్ఞాన పారీణులు కడు భాగ్యసంపద గలది యండ్రు భాగ్యసంపదకల్మి ప్రస్ఫుటంబయ్యెగా మీరలిందుల వచ్చి మీరియుంట
జనకుడవు కర్త వొజ్జవు సజ్జనుడవు క్రొత్తలంజెల కాముండ వుత్తముడవు తొడలనిడుకొని ముద్దుకూతునకు నీవు మించుటద్దంబు చూపరా మంచిరాజ
కేల క్రొమ్మించుటద్దంబు గీలుకొల్పి మంచితొడమీద నొప్పారె మదనరేఖ ముద్దునెమ్మోము లావణ్యమున జయించి కువలయాప్తుని జెరవెట్టుకొన్న కరణి
దీవించి మంచి కూతురు శ్రీవర్ధస్వంబు చెప్పి చెవి టిట్టిభసె ట్టి వెస నిప్పింపుము సం భావన నొకవెండి బిడ్డపసపున కనియెన్
అనంతరంబ గాంధర్వి పూర్వసంబంధంబున నైన ప్రేమానుబంధంబున గేలు గేలం గీలించి యిట్లనియె
ఎందుపోయితి గోవింద ముందరట్ల యెందరతివల వలపించి తెచట నెచట దలపు పుట్టించెనే నీకు దైవమిట్లు పాయసం బారగించిన ప్రాతపట్టు <poem>