<poem> మధుమావతి యిల్లు

సింహళద్వీపమున గాని సృష్టిలోన బద్మినీజాతి లేదను పలుకు కల్ల తెరవ మధుమావతీదేవి దేవకన్య పద్మినీజాతి దోర్గంటి పట్టణమున

మలయజగంధియైన మధుమావతి యూర్పుల కమ్మదావి చెం గలువల సౌరభంబునకు గాదిలిచుట్టము చక్రవాకులం గలకల నవ్వు దాని చనుకట్టు తదీయ విశాలనేత్రముల్‌ తొలకరి క్రొమ్మెరుంగు సయిదోడులు మిండలు గండుమీలకున్‌

టిట్టిభసెట్టిగారు వినుడీ యొక చొక్కపు జోగి రేయి రో వట్టిడి దీనితో గలసి భైరవతంత్రము దీర్చి మెచ్చి సౌ ధాట్టమునన్‌ లిఖించె నఖరాక్షర భంగి దెనుంగు బద్యమున్‌ బుట్టువు పేరనాగతము భోగము భాగ్యము ప్రస్ఫుటంబుగన్‌

ఈ తలిరుంబోడికి గల భూత భవద్భావికాలముల జన్మములున్‌ జాతులు ప్రస్ఫుటములుగా నాతడు లిఖియించె పద్య మల్లదె కంటే

అలకాపురంబున నంగారవర్ణుడన్‌ గంధర్వపతి కన్య కమలపాణి యా దివ్యగంధర్వి కపరావతారంబు మధుమావ తోర్గంటి మండలమున నా సుందరాంగి దాక్షారామమున బుట్టు భువనమోహిని చిన్నిపోతి యనగ నట్టి సత్‌స్త్రీజాతి యగు సానికూతురు చిరకాలమున సదాశివుని గూడి

పావనంబైన తమిలేటి పరిసరమున వేగి కురువాటికా దేశ విపినభూమి గోవులనుపేరి చెంచుల కులమునందు గడిమికత్తుల నా గలుగ గమ్మి యలదు

కడిమికత్తులమ్మి నిడువాలు కన్నులు గండుమీల నడచు మిండగీడ దాని చన్నుదోయి ధారా సురత్రాణ కటక కుంభి కుంభ కలహకారి

మదాలస

ఈ మధుమావతీదేవి చెలియలు మదాలస మామ మీసాలప్పయ ద్వివేదుల కొడుకు శ్రీధరునకు ననుపులంజెయై యుండు నా కంజాక్షిం దగిలి యా రంజకుం డచ్చోటనే యున్నవాడని విన్నార మరయుదము గాక యనుచు మోసాలం జొచ్చి కక్ష్యాంతరమ్ములు గడచి గాజుటోవరి ముందట గటకంబళంబుల మీద దమలో జిటపొటబోవుచుం గూడియుం గూడక యున్న యప్ప చెలియండ్రను మామయాత్మజునిం జూచి గోవిందుండు మందస్మితంబున

ఆహివెట్టితి జొన్నగడ్డాగ్రహార వృత్తి యేనూరు రూకల వృత్తమునకు ననుభవింపుడు నీవు మదాలసయును సరససంసార మింతయు నధ్రువంబు

మిన్నకున్నార లిది యేమి మీరు ముగురు నీగకును బోక వెట్టిన యిట్టిభంగి హెచ్చు గుందింతమాత్ర మేదేని గలదె మిగుల గోపంబు మీకు లేమియును దోచె

అనిన మధుమావతి గోవిందమంచనశర్మతో నిట్లనియె

ఏమి చెప్పుదుము మాకీవు తోబుట్టుగ వైననుం జెప్పక యడపరాదు నీదు వియ్యంకుండు నిర్భాగ్యు డీతండ యీ పోయినట్టి రే యే కమతమున మా మదాలస కేళిమందిరాంతరమున హంసతూలికపాన్పు నందు నొంటి నిద్రించి యుండంగ నీవిబంధం బూడ్చి యటు చేయవలసిన యట్టు చేసె

మధు మదారంభమున మేను మరచి యపుడు మోసపోయితి మీ నాడు ముట్ట దెలియ జెలియలికి నాకు గొడ్డేర కలక పుట్టె బ్రాహ్మణుడె వీడు విశ్వాసపాతకుండు

నడురేయి మధుమదంబున నొడలెరుగక యున్న నన్ను నోవరి లోనన్‌ దడవెను గుడిలో నుండియు గుడిరాలను దీసె వీడు గోళకుడరయన్‌

పాడిపంతంబు లెరిగిన పెద్దవు నీవు మాభాగ్యకృతంబున విచ్చేసితివి యజ్ఞాన కృతంబునకుం బ్రాయశ్చిత్తంబు విధింపుమని మరియును

హాలాపాన మదాతిరేకమున బర్యంకంబుపై నొంటి ని ద్రాలస్యంబున నుంట దక్క మరి యేయన్యాయమున్‌ జేయ నే నేలా పాపము గల్గె నీ భయమువో నేముట్టెదన్‌ శుద్ధికై వాలాయంబును మీనకేతనుని దివ్యశ్రీ పదాంభోజమున్‌

అనిన గోవిందుండు మీరు విటజన ధర్మసూక్ష్మం బెరుంగ రిది యన్యాయంబు గాదు వేశ్యాజనంబునకు వావివరుస యెక్కడిది తొల్లి సముచిసూదనునకు ననుపులంజెయై యూర్వశి యతని కొడుకు గవ్వడిం గామింపదే రావణుండు నలకూబరుని రంభోరు నంభోరుహాక్షి రంభం గోడలిని సంభోగింపక సాగనిచ్చెనే వారకాంతను దల్లి దాసి యప్ప చెలియలు కూతురు దాది యని కేళికాగేహంబునం బరిహరించుట విటధర్మంబు గాదు

జాణతనము గల్గి సవరతనము గల్గి తెలివి గల్గి మోరతీరు గల్గి చేయలంతి తనకు జేకూడినప్పుడు వావి వలదు లంజెవారి యింట

అని పలికి సౌముఖ్యంబు సంపాదించి

వదినెయు లంజెయున్‌ విటుడు వైరము లాత్మల నుజ్జగింపు డ భ్యుదయ పరంపరా విభవ భోగము లందుడు మేము వోయి వ చ్చెదమని వారి సత్కృతులు చేకొని మంచనశర్మ వెళ్ళె ద త్సదన మపారభాగ్య ధనసంపద కెంతయు జోద్యమందుచున్‌

కొడుకులు కూతులుం గలిగి కూడును బాడియు ద్రవ్వి తండమై విడిముడి లాతుగా గలిగి వెండియు బైడియు నిండ్ల లోపలన్‌ దడబడ దారు బంధువులు దామరతంపరలై సుఖించు వా రుడుపతిమౌళి మౌళి నొక యుమ్మెత పూవిడువారు వేడుకన్‌

అనుచు మధుమావతిదేవి భవనంబు వెలువడి కట్టాయితంబైన ఘటశాసిపుంగవుండు నింగి చెరంగు మొన వ్రాలిన పతంగబింబంబు గనుగొని టిట్టిభ యదె చూడు వరుణరాజ వారాంగనా విలాసదర్పణానుకారియై యహర్పతి గ్రుంకం బోయె నింక మనకు నేవంకం దడయ బనిలేదు కుహళీచషకంబుల నారికేళంపు మధువుం గ్రోలి మత్తిల్లి వీరె మందిరోద్యానవీథులం బల్లవాధరలు పుష్పగంధికా నృత్యంబులు పరిఢవించెదరు వారు కొందరు మందిరప్రాంగణంబున వారాంగనా జనంబులు విచిత్రశ్లోకంబు లనేకరాగంబులం గూర్చి లాస్యాంగం బుత్తమంబుగా జూపెదరు మరియు నంతరాంతరంబులం బ్రచ్ఛేదన సైంధవ ద్విమాడక స్థితపార్యాది మార్గాభినయ భేదంబులు రసభావ భావనామోద మధురంబుగా శాతోదరు లభినయించెదరు ఇవ్విధంబున వినోదంబు లిన్నియుం జూడం దలంచితిమేని కామమంజరీ గృహప్రవేశంబునకుం గార్తాంతికుండు వెట్టిన ముహూర్తంబు సరిగడచు నిపుడు పుష్యనక్షత్రంబున నాల్గవపాదంబు నడచుచున్నయది కాలావర్త విషనాడికా స్పర్శనంబు లేక యమృతద్వంద్వంబు గూడి యిందుబింబాననా ధరోష్ఠపల్ల వామృతపారణ లాభంబునకుం గారణంబుగా గలిగి యున్నయది యివ్వేశవాటంబు వీథీవిటంకం బతిక్రమించి వేవేగం జనవలయు నిదె యాటది యొక సురపొన్న క్రీనీడ క్రీడాభరంబున గన్నియలంగూడి కందుకక్రీడ యొనర్చుచున్నయది దీని నలవోకవోలెనైనం జూడవలయునని చూడం జని

బంతులాట

పంచారించిన లేత చన్నుల పయిం బ్రాలంబముల్‌ గ్రాలగా గాంచీనూపుర కంకణ క్వణములన్‌ గర్జింప బాలాజనుల్‌ కించిన్యంచ దుదంచిత క్షమముగా గ్రీడించెద ర్చూడుమా చంచత్కాంచన కందుక త్రయములన్‌ సవ్యాపసవ్యంబులన్‌

నట్టువుని కోడలు

అనుచుం గతిపయపదంబు లరుగ గట్టెదుర నొక చెట్టవుని కోడలు గోడలు నక్కి చూడ బొడగని యమ్మచ్చెకంటి మున్ను దన్నెరింగినది యగుట టిట్టిభున కెరింగించి గోవిందమంచనశర్మ యిట్లనియె

వ్రాలె నరవిందలోచన పాలిండులు చూడజూడ ప్రసవాంత్యమునన్‌ ఏలా యీ మాటల పని వ్రాలుట చోద్యంబె చక్రవాకుల కొదమల్‌

అనుచుం జనునప్పుడు ముందట నొక సైరికునిం గని టిట్టుభునకుం జూపి యిట్లనియె

సైరికుడు

మాఘమాసంబు పులివలె మలయుచుండ బచ్చడం బమ్ముకొన్నాడు పణములకును ముదితచన్నులు పొగలేని ముర్మురములు చలికి నొరగోయకేలుండు సైరికుండు

దిక్కరికుంభ కూటముల దీకొను చన్నులు కాముతేరిపై టక్కెపు గండుమీల నునుడాల్కొను కన్నులు క్రొమ్మెరుంగుతో నుక్కివమాడు మేనిపస యొడ్లకు గల్గునె యోరుగంటియం దక్కలవాడలోని వెలయాండ్రకు దక్క గిరాట టిట్టిభా

అనుచు నట చని వేశవాటంబు వెడలి భైరవాలయ ద్వారంబున బాడి పంతంబునం గూడిన పౌరవిటలోకంబుం గనుంగొని యేమి ధర్మాసనంబు దీర్చెదరొకో యని యడిగిన <poem>