కోనంగి/నవమ పథం
నవమ పథం
ఉత్తరాలు
ఆ సంవత్సరము బి.ఏ. జూనియర్ పరీక్షలో అనంతలక్ష్మి కృతార్థత నందింది. కోనంగి వ్రాసిన ఉత్తరాలు ఆనందంగా చదువుకొంటోంది. ఆ ఉత్తరాలన్నీ పెట్టుకొనేందుకు నాలుగువందల రూపాయలు పెట్టి బంగారం పొదిగిన వెండి పెట్టే కొంది.
కోనంగి జయిలు అధికారుల ద్వారా పంపించే ఉత్తరాలు కాకుండా, రహస్య మార్గాలకూడా ఉత్తరాలు పంపించసాగాడు. అనంతలక్ష్మి భర్తకు రోజురోజుకు ఉత్తరం వ్రాసి, వారం అయ్యేసరికి, అవన్నీ ఒక ఉత్తరంలాగే కలిపి పంపించేది. డాక్టరు రెడ్డి ఇంటికి కొన్ని ఉత్తరాలు పంపితే అవన్నీ ఎలాగో కొన్ని రహస్య మార్గాల ద్వారా జయిలులో కోనంగికి అందేవి.
ఉత్తరం రాగానే కోనంగి, కళ్ళకద్దుకొని, చింపి ఉప్పొంగిపోతూ చదువుకొనేవాడు. విడిపోయిన ఆ యిద్దరూ ఇతరులు చూస్తారన్న సిగ్గును వదలి రిజిష్టరు చేసిన ఉత్తరాలుగా వ్రాసుకొనేవారు. ఒకరికొకరు వ్రాసుకొన్న ఆ ఉత్తరాలలో ఒక్కొక్కప్పుడు వారి ప్రణయజీవిత నిగూఢ రహస్య భావాలు తాండవం చేస్తూండేవి. అడ్డగట్టు వేస్తే, వరదలు వచ్చిన నది కట్టపొర్లి లోకం అంతా ముంచెత్తుతూ, పరవళ్ళెత్తి ప్రవహించిపోయినట్లు వారి ప్రేమ దశదిశలూ నిండుతూ పొంగిపోయింది.
గాంధర్వనికేతనం,
మేలాపురం,
12-4-41.
ప్రాణకాంతా!
జయిలులో ఉన్నా మీరు ఉత్తరం వ్రాయగలుగుతున్నారు అన్న సంతోషం ఒక ప్రక్కా నీలాకాశంలో పిడుగు పడినట్టు మీకూ నాకూ ఆ పవిత్ర ముహూర్తంలోనే ఎడబాటు కలిగిందన్న భరింపరాని బాధలు ఒక ప్రక్కా నన్ను ఊపివేస్తున్నాయి.
మిమ్ము విడిచి యుగాలయినాయన్న నిస్పృహ వేధిస్తున్నది. ఏనాడో మిమ్ము తిరిగి చూడడం!
ఏం చేస్తున్నారు? అంత నిర్దయగా వెళ్ళిపోయారు. ఏం చేద్దామని?
నేను చదవలేను, పుస్తకం ముట్టలేను. ఈ ఏటి పరీక్ష ఏమవుతుందో?
ఇంట్లో కూచోలేను. ఇంటిబయటకు వెళ్ళలేను. ఎడారి ఎల్లా ఉంటుందో నేనెప్పుడూ చూడలేదు. కాని ఎడారినిగూర్చి చదివినవన్నీ నిజమే అయితే, నా మనస్సు ఏమీ ఓయాసిస్సులేని 125 డిగ్రీలు వేడిగల, పది సహారా ఎడారులు కలిసినట్లయి పోయింది.
నా హృదయప్రభూ! మీరు నా జీవితంలోకి రాకపోయివుంటే, నాజన్మ బూడిదలా రాలిపోయి వుండును. మీరు వచ్చారు. నా జన్మకోటి కాశ్మీర విశాలమయింది. అలాంటిది మీరల్లా నన్ను వదలి వెళ్ళిపోయారు. ఎంత నిర్గయో మీది?
వెనక శ్రీకృష్ణుడు రాధను వదలి మధురకు వెళ్ళినప్పుడు ఆమె పడినబాధ, నా బాధ ముందు సంతోషం వంటిది, ఆత్మానాథా!
మీ నిర్బంధానికి కారణం మన దుష్టగ్రహము చెట్టగాడే! నన్ను వాంఛించి, విఫలుడై ఆ రాక్షసుడు అలా చేశాడు. వెనక సీతాదేవిని రావణుడు ఎత్తుకపోయినాడు. ఈ పిశాచి రాముణ్ణి ఎత్తుకుపోయాడు. నేనే బయలుదేరి కడలూరుకు వస్తున్నా. కటకటాలు ముక్కలుచేసి, గోడలు పిండిగొట్టి, మిమ్మల్ని తిరిగి తీసుకువస్తాను. నాకు లక్ష్మణులు " వద్దు, హనుమంతులు వద్దు, వానరబలగం వద్దు.
నేను అందగత్తెనని మీరంటారు. అది నాకు ఏమీ నమ్మకం లేదు. మీకు శిల్పం విషయం ఏమీ తెలియదు. మీ అందం మీరెరుగని అమాయకులు ప్రాణేశ్వరా! మీ మోముతో పోల్చడానికి సృష్టిలో ఏ వస్తువూ దొరకదు నాకు. ఫాలం ఆకాశం అని ఏదో పోల్చుకుంటాను. ఆకాశంలో గంభీరత ఒకనాడు కనబడకపోవచ్చును, కాని మీ ఫాలం అనంతవిశ్వాలు దాటిన మహా భావపూరితమని చెప్పగలను. మీ కనుబొమల సౌందర్యము ఆకాశగంగకు లేదని మాత్రం చెప్పగలనండీ.
మీ కన్నులు నేను వర్ణించలేను. ఆ కన్నులు పెద్దవీకావు, చిన్నవీకావు. అవి తారకలూ కావు, సూర్యచంద్రులూ కావు. అవి కాలమూకావు, కాలాతీతాలూ కావు.
మీ ముక్కు మకరసంక్రమణ ఉదయారుణకిరణము, కోటికోటి కిరణాలు.
మీ పెదవులూ, వానిలోని నవ్వులూ, ఒక్కొక్క అవతారం ఉద్భవించినప్పుడు దేవతలు పొందే దివ్యానందం!
మీ మూర్తిని తయారుచేస్తూ మిగిలిన భావాలతో సృష్టికర్త. జయంతుణ్ణి, నలకూబరుణ్ణి తయారుచేసేవాడని అనుకుంటాను. నా వర్ణన నాకే లోటుగా ఉంది. ఆ అస్పష్టకాంతిలో చూచాను మొదట మిమ్మల్ని దానితోనే నా మతిపోయింది. నేనూ మా బాలికలతో పాటు ప్రేమ అనేది ఉండదు అనే అనుకొనేదాన్ని.
కాని ప్రేమ ఇంత అద్భుతము, వర్ణనాతీతము అని అనుకోలేదు. ఎంత విచిత్రమైనవారు మీరు! మొదటి రోజులలో మీరు కనబడినంత సేపూ గుండే పంజాబు మెయిలే! మీరు పొరపాటున నన్ను ముట్టుకుంటే ఏదో వివశత్వం కలిగేది. నా రహస్య హృదయంలో మీరు నా దేహాన్ని ఏక్షణమైనా కోరితే అది వెంటనే సమర్పించాలి అన్న గాఢతి గాఢవాంఛ ఒక ప్రక్క ఇంకో ప్రక్క మిమ్ము నేను ఎంత ప్రేమించినా, మీరు వివాహం అయిన వరకూ ఒక విధంగా పరపురుషులే అన్న భావమూ నన్ను గగ్గోలు చేశాయి.
మీరు నన్నన్నిసారులు కౌగలించుకొన్నారు. ఆ నిమిషాలలో మీరు కావాలంటే నా సర్వస్వము మీది! అయినా మీరు నన్నంత గాఢంగా అదుము కొని, నా పెదవులు మీ పెదవులు లయింపచేసుకొని, గాఢతా, లాలిత్యమూ రెండూ వ్యక్తం చేశారు నా ఆత్మేశా!
ఎన్ని జన్మముల నుండి తపస్సు చేశానో మిమ్ము నా సర్వస్వనాథునిగా వరం పొందడానికి? మీరే నాకు కోటి జన్మముల నుంచీ భర్తలై యుండాలి. లేకపోతే ఆ అస్పష్ట కాంతులతో దర్శనమిచ్చిన ప్రప్రథమ క్షణంలోనే మీరే, మీరే నానాథులని నాకు ఎందుకు తోచాలి?
మీలో లయమైపోవడానికి దేహమడ్డం అనిపిస్తుంది. ఆ దేహంలేక మీతో నా పూర్ణమౌవనానంతమత్తత అనుభవించడం ఏలాగు అని అనిపిస్తుంది.
"మీరు నా కేశసౌభాగ్యం కోటి కాదంబినీమాల అన్నారు. కోటి కోటి శ్రీకృష్ణపరమాత్మ దేహకాంతులన్నారు. నన్ను తలంటుకోమని, ఎన్నిసారులు నా కచభారము మీ మోమునంతా కప్పుకోలేదు? మీరు వట్టి కొంటెవారు. లేకపోతే అన్నిసారులు నా కురులన్నీ చిక్కులు చేసి అల్లరిచేస్తారా, చెప్పండి? నేను మీ తల ముద్దెట్టుకొంటే, మీది వట్టి కాఫింగు తల అయినా మీ బుద్దిలో ఉన్న పరిమళపు ఆలోచనలు ఆ తలలోంచి పయికి వస్తూ ఉంటాయి కాబోలు, దివ్యమయిన మీ తలను ఆఘ్రాణించి, ముద్దు పెట్టుకొంటోంటే మత్తు వచ్చినంత పని అయింది.
పూవులు పూవులన్నారు మీరు. స్త్రీలకూ పూవులకూ మీరన్నట్లు ఏదో అననుభూతమయిన సంబంధం ఉన్నది. మా తండ్రిగారి కుటుంబంలోనూ, మా తల్లిగారి కుటుంబంలోనూ కూడా కుసుమ రచనా లలితకళ ప్రపంచ శిఖరితమైనది గురుదేవా! మీరు కోరినప్పుడల్లా ఒక్కొక్క రచనరచించి నా జడను; నా జడముడిని అలంకరించు కొన్నాను. జడను వేయడమూ, జడముడులు రచించడమూ మా కుటుంబంలో ఉంది.
గులాబీలు, మల్లెలు, మల్లెలు, జాజులు, చేమంతులు, కదంబాలు, కనంకాబరాలు, గొబ్బిపూలు, కేతకీకుసుమాలు, పొగడలు, నీలిహృదయాలు, ఘంటికా పుష్పాలు, కరవీరాలు, మందారాలు, సువర్ణకరవీరాలు, మరువక దమనక, కురువేరులు, నూతనంగా వచ్చే ఆర్చిడ్లు, దాలియాలు, జీనియాలు, నీబాపూలు, కాశీరత్నాలు, మదనభాణాలు అన్నీ నేనే అల్లాలి జడలలో. ముడులలో, అర్ధజడలలో, అర్ధశిఖలో నేనే పూవులు కూర్చాలి.
జీవితేశ్వరా! మీ కోసం నేను, నా అందం మీకోసం, నా చదువు మీకోసం, నా సంగీతం మీ కోసం! ఓ రోజున మీకు జ్ఞాపకం ఉందీ? నేను ఫిడేలు వాయిస్తూ ఒక మువ్వగోపాల పదం పాడాను:
“ఏంత చక్కనివాడే
నా సామీ-వీ
డెంత చక్కనివాడే!
ఇంతి మువ్వగోపాలుడు
సంతతము నా మదికి
సంతోషము చేసెనే... ఎంత?
మొలక నవ్వుల వాడే
ముద్దు మాటల వాడే... ఎంత?”
అని పాడుతూ వుంటే కళ్ళనీళ్ళతో ఏదో దివ్యకాంతి మీ మోమున ప్రసరింప నా ఒడిలో తల పెట్టి కరగిపోయారు!
నా గురూ! రండి, నేను ఎన్నో పాటలు పాడుతానండీ.
మీ పాదపద్మాల
అనంత.
2
ఏ రోజు కారోజు ఉత్తరం భర్త కడ నుండి రావలసిందే. ఆ వేసవి కాలంలో ఆమెకు ఉత్తరాలే మల్లెపూలు, గులాబీలు, వట్టివేళ్ళ అత్తరులు, చల్లగాలులు, చల్లటి నీళ్ళు, సముద్రం వ్యాహాళులు.
కోనంగిమయ ప్రపంచం ఆమెకు. అతడుపయోగించిన ప్రతివస్తువూ పవిత్రమూ, పూజార్హమూ!
ఒక రోజున వచ్చిన పెద్ద ఉత్తరాన్ని మామూలుగా చదివే పదిసార్లు కాకుండా పది హేనుసార్లు చదువుకుంది. మామూలుగా పెట్టే ముద్దుల కన్న కొన్ని వందలు ఎక్కువ పెట్టింది. ఆ ఉత్తరం తన బాడీజేబులో గుండెకు దగ్గరగా దాచుకుంది.
ఆ ఉత్తరం నరాల ద్వారా ఇంజెక్షను ఎవ్వరై నా ఇవ్వగలరా? లేక తన హృదయం తెరచి లోపల పెట్టి తిరిగి కుట్టెయ్యగలరా?
కడలూరు జైలు,
14-4-41.
ఓ ఆనంద వికసిత విశాలనయనా!
నా అనంతా, నా లక్ష్మీ! నవనీతవచోపూరితకంఠీ, ఎన్నాళ్ళయింది నీ తీయతీయని పాట విని.
అమృతపానంలోన
అర్ధభాగముపాలు
కామధేనువుపాలు
సోమరసములు కలిపి
అందిచ్చినారు నీ
అందాల మధుధార
పారిజాతపరాగ
పరిమళమ్ములు కలిపి
అందిచ్చినారు నీ
అందాల గొంతులో
ఎన్నో గాంధర్వ ప్రదర్శనాలు చవిచూచాను దేవీ! నీ కంఠం వీడిన ఆ దివ్యగానం అనుపమానం. ఆ సంగీతస్వన ప్రారంభము నాకానాడు సృష్టి ప్రారంభమే.
అంతా చీకటి! చీకటి మధ్యలో చిన్న వెలుగుచుక్క ఆ అణువు కాంతి పెరిగి, విశ్వమంతా ఆవరించి అనంతజ్యోత్స్నలై, ఉప్పొంగే ప్రవాహాలై కరుళ్ళుకట్టి, తోడుకుపోయి, కోటి కోటి మందారాలై, కోటికోటి పారిజాత ప్రసూనాలై, సుడులుపోయి దెసలు గాఢపరిమళాలు కప్పి, కరిగిపోయి అనంతతంత్రుల విశ్వవిపంచే స్పందించిన ప్రజసుందర హస్తాంచిత దివ్యమురళీనినాదమై, నా జీవితాన లీనమైపోయింది.
నీ దివ్యగాంధర్వానికి శ్రుతిగా, దూరాన, దగ్గర, అన్ని వైపులా నృత్యాంచిత నటేశ్వర పాదమంజీర స్వర్ణకింకిణీ నిస్వానము లోకసమ్మోహనమైపోయింది.
లోకంలో దరిద్రుల నిట్టూర్పులు, బానిసల వేదనాభరితార్తనాదాలు, అవధిపొంది వందేమాతర దివ్యగీతమై లామార్పలేపవిత్ర స్వనమై, విముక్త రష్యానందమూర్ఛనై సర్వబంధిత ప్రజాదనిగళిత శృంఖలాపతన మ హెూత్తమ రాగాలాపనట్టే ప్రత్యక్షమయింది.
నీ అందం చూచాను. ఆంధ్ర సౌందర్యరత్నాలు, దాక్షిణాత్య శిల్పభూషణాల పొదిగించిన శిరోభూషణానివి నువ్వు
ఏమీ ఎరుగని బీదవాడికి కోహినూరు రత్నం దొరికినట్లు నాకు దొరికావు. ఎక్కడ దాచుకోను నిన్ను?
ఎల్లోరా కైలాసగుహ నా గదిలో ప్రత్యక్షం అయింది. అది నీదేనయ్యా అన్నారు ప్రజలు!
శారదాదేవి క్రొత్త వాద్యవిశేషాలు కావాలనుకొని, విశ్వకర్మకంపెనీలో ఆర్డరిచ్చి, ఆ వీణవైపు నేను కాంక్షాపూరిత నయనాలతో చూస్తూ ఉంటే, “నాయనా కోనంగీ! ఇది నీకు బహుమతి” అని ఇచ్చింది!
కృష్ణావతారం తర్వాత నందనవనం చేరిన పారిజాత భద్రతరువు వచ్చి నా పెరట్లో మకాం పెట్టింది.
గరుత్మంతుడు తీసుకుపోవయ్యా అంటే, ఆ సురేంద్రుడు పాముగాళ్ళను మోసం చేసి, ఎగతన్నుక పోతోంటే, ఆ ముసలాయన చేతిలోనించి జారి ఎగురుతూ ఎగురుతూ వచ్చి అమృతకలశం నా జన్మలో వాలింది. దేవతలకు ఈ రహస్యం ఏమీ తెలియదు.
అనంతలక్ష్మీ! నిన్ను పొంది నేను అంబుజాక్షుడను.
నేను జయిలు నుంచి వచ్చేసరికి ఏ పాలసముద్రమో చూడడానికిపోకు.
అనంతలక్ష్మి లక్ష్మికి కొమరిత. అవిడ ఏ పద్మాన్నో నివాసగృహం చేసుకుంటే, అక్కడకు ఏ కమలపరిమళంగానో నువ్వు చేరితే, నేనయ్యా అల్లుడనని ఆ పద్మగృహవాసానికి సిద్దం అయితే, ఏదో కప్ప వచ్చిందని నన్ను తరిమివేయరుకదా! మీ యింటి ప్రక్కనున్న కొక్కిరాయిగాళ్ళు.
సౌందర్యనిధీ! అంతమంది ప్రాచ్యులూ, అప్రాచ్యులూ, వారి వారి దేశాలలో వారి వారి భాషల్లో వర్ణించుకొన్న వారి సౌందర్యాంగనలు. ఏ విధంగా ఆలోచించినా వట్టి చింపిరి నాగమ్మలులా ఉంటారేమిటి? కాకీపిల్ల కాకికి ముద్దు అన్న సామెతలా ఆడకాకి మగకాకికి హంసలా కనబడుతుంది.
పరీక్షలో ఎలాగో నెగ్గానన్నావు. ఏమిటి మరి. గౌరవం దక్కడానికి నేను గురువునయ్యాను. కాని నీ గురువు నవడంవల్ల కొలత వేయలేని లాభం నాదే!
నేను నీ కోసం విరహతాపం పడటంలేదు అని వ్రాస్తే అబద్దం! నిజం వ్రాస్తే నువ్వు బాధపడతావు. ఏమీ వ్రాయకుండా ఊరుకుంటే, “మౌనం అర్ధాంగీకారం' అన్న ఇంగ్లీషు సామెత అమలులోనికి వస్తుంది.
నువ్వు వ్రాసిన ఉత్తరం ఎంతకూ తరగని అమృతసముద్రం నేను కుంభసంభవుణ్ణి. ఒక్క వుడిసిలి పడతామంటే, నాకు విశ్వమంత అంజలి లేదాయను.
నేను లోకంలో ఎందుకు పనికివస్తాను హృదయేశ్వరీ! రాజకీయ నాయకుణ్ణి కాలేను. వినాయకుణ్ణి కాలేను. అనుసరించే సామాన్యుణ్ణి కాలేను. స్వయంగా యే కొత్త మార్గమూ సృష్టించుకోలేను.
నువ్వు పంపిన పుస్తకాలన్నీ చదువుతున్నాను. ప్రస్తుతం వేదాంత పుస్తకా లేవీ పంపకు.
రాజకీయాల విషయంలో ఏమి చేయాలో నాకేమీ తోచడంలేదు. నేను రాజకీయవాదిని కాను. జయిలు నుంచి రాగానే ఏదయినా పరిశ్రమలో చేరుదామని ఉంది. నీ సలహా ఏమిటి?
నువ్వు ఎప్పుడు వస్తావు చూడడానికి? నన్ను చూచి బెంబేలుపడకు. ధైర్యంగా ఉండు. నువ్వు, వెన్నెల వర్షిస్తున్నట్టు మందహాసవదనవై రా! పాలసముద్రము ఉప్పొంగినట్లు ధైర్యంగా రా! రాజకీయ ఖైదీలుగా కోర్టుకు వెళ్ళినా వాళ్ళని పట్టుకు వదిలేస్తారు పోలీసువారు.
కోరకుండా అదృష్టంవల్ల వచ్చిన జయిలు, నన్ను కూడా ఒక నాయకుణ్ణి చేశారు. ప్రభుత్వంవారు. అయిదారు ఉపన్యాసాలు ఇస్తేనేగాని రాని నాయకత్వం, క్రిందటి ఏ జన్మలోనో పుణ్యంచేసి ఉండడంవల్ల దాని అంతట ఆదే వచ్చి మెళ్ళో దండలు వేసి వరించింది.
నా జీవితేశ్వరీ! ఉత్తరం పంపించేవేళ ఔతోంది. ఎంత వ్రాస్తే నీ దగ్గర ఉన్నట్లవుతుంది? నీ పెదవులు హృదయమార గ్రోలినట్లవుతుంది?
గాఢ ప్రేమోత్కంఠుడు
నీ ప్రాణపతి
కోనంగి.
ఉత్తరం చదువుతూ కన్నీళ్ళతో కరగిపోయింది, ప్రేమతో ఉప్పొంగి పోయింది. కలకల నవ్వుకుంది. ఆ ఉత్తరం కళ్ళకద్దుకొంది. చదువుకొంది. చదవకుండా చూస్తూ కూచుంది! హృదయంలో దాచుకుంది అనంతలక్ష్మి.
3
ఇంత అద్భుతమైన ఉత్తరాలు తాను వ్రాస్తూ, తన భర్త తనకు వ్రాస్తూ ఉన్న సమయంలో, ఒకరోజున చిరునామా టైపు కొట్టిన ఉత్తరం ఒకటి వచ్చింది. తన స్నేహితురాం డ్రైవ్వరైనా వ్రాసి ఉంటారనుకొని, అనంతలక్ష్మి ఉత్తరం విప్పింది. లోపల కూడా టైపుతోనే ఉన్నది! ఆ ఉత్తరం చదువుతూ ఉండగా అనంతలక్ష్మికి కోపం ప్రారంభించి అంతకన్న అంతకన్న కోపం పెరిగిపోయింది.
ఆమె చేతులు వణికాయి. కన్నులు కెంపెక్కినాయి. ఆమె క్రింది పెదవి ఆమె పళ్ళతో నొక్కిపట్టగా గాట్లుపడి రక్తం కారింది.
ఒక్కసారిగా ఆమె కళ్ళవెంట నీరు కారిపోయాయి. ఆమెకు గుండె బరువెక్కి పోయింది. చేతిలో ఆ ఉత్తరం ఉండగానే మంచంమీద వాలి పోయింది.
ఒక అరగంటకు తన్నుతానే సమాళించుకొని, లేచి మంచంమీదే కూర్చుండి, ఆ ఉత్తరం మళ్ళా చదవడం ప్రారంభించింది.
ఆ ఉత్తరం తమిళభాషలో ఉంది.
మద్రాసు - మైలపూరు,
సింగపుర భవనం,
18-4-41.
ప్రియమైన అనంతలక్ష్మీ!
కొన్ని అనివార్యమయిన కారణాలచేత మీ మీద వ్యాజ్యం వేయవలసి వచ్చింది.
నన్ను నువ్వు పూర్తిగా ఎరుగుదువు. నేను నిన్ను ఎంత ప్రేమిస్తున్నానో నీకు బాగా తెలుసును. నా ప్రేమ ఒక మహాసముద్రం, నాకున్న ఏభయి అరవై లక్షల ఆస్తి నాకు నీ ప్రేమ ముందు గడ్డిపరకతో సమానం.
ఈ ప్రేమతో నాలో తుపానులు చెలరేగి ఉన్నప్పుడు. నువ్వు నన్ను కాదనడంవల్ల నేను నా ప్రేమావేశంచేతనే అమితమైన కోపం వచ్చి అలా వ్యాజ్యాలు వేశాను.
ఇప్పుడైనా ఏమీ పరవాలేదు. నన్ను బాగా తలుచుకో! నేను ఏలాంటి శక్తిగలవాణో. నేను గవర్నరు జనరలుతో సమానంగా మాట్లాడగలను. నేను కలెక్టరు ఉద్యోగాలు ఇప్పించగలను. నా పాదాలమీద వ్రాలి అనేకులు ప్రభుత్వ ఉద్యోగులు బ్రతుకుతున్నారు.
నువ్వు నా దానవై ఉంటే, నిన్ను దివ్యమయిన విమానంమీద అధివసింపచేసి లోకాలు తిప్పగలను. నీకోసం మహారాజులు ఎరుగని రాజభవనాలు కట్టి ఇవ్వగలను. రోజూ నిన్ను పన్నీట స్నానం చేయిస్తూ ఉండగలను. నీ కొరకై వేలకొలది ఎకరాల తోటలు వేయించి ఇవ్వగలను. నీ అంతబంగారు విగ్రహాన్ని చేయించి నీకు బహుమతి ఇవ్వగలను.
నీ పూర్వీకులైన వారు సరియైన వాళ్ళను ప్రేమించారు. మధురవాణి రఘునాథ నాయకునకు రాణి అయింది. నీ తల్లి లక్షాధికారిని చేబట్టింది.
నీకూ నాకూ మధ్య ఎవరూ రావడానికి వీలులేదు. నీ మీద ఉండే ప్రేమవల్లనే. నీకు ఇష్ణుడు అని నీవనుకున్న మనుష్యుడు ఏవో మంచినీళ్ళు తాగుతున్నాడు. నా ప్రేమ ఆవేశంలో నన్ను నేను మరిచిపోయి ఉంటే, వాడికి కన్నూ, కాలూ, ముక్కూ చెవులూ పోయివుండును. నీకు జరిగిన పెళ్ళి వేళాకోళం పెళ్ళి. ప్రేమ ఉన్నచోట పెళ్ళి ఏమిటి? ప్రేమలేని పిచ్చివాళ్ళకు పెళ్ళి. అందుకనే నేను పెళ్ళిచేసుకున్న మా కులం అమ్మాయి మొగం ఇంతవరకూ చూడలేదు. నీ మీద నా ప్రేమ అలాంటిది.
ఇప్పుడయినా మునిగిపోలేదు. ఒక్కసారి వచ్చి నా యింట్లో, నా దివ్యమందిరంలో ఒక రాత్రి గడుపు. ఆ పిచ్చి కోనంగి మర్నాడు నీ ఇంటికి వస్తాడు. మనం కలుసుకుంటూ నిజమయిన తనివితీరని మధుర రాత్రులు కలిసి గడుపుకుంటూ ఉండవచ్చును. వాడికి నీ చిత్తం వచ్చిన ఉద్యోగం ఇప్పిస్తాను.
వాడు చెడిపోయిన వెధవ దానికి ఓ వెధవయ్యకు పుట్టినవాడు. వాడికి నీతీ నియమమూ ఎలా వుంటుందనుకున్నావు. ఆ పిశాచిగాడు సినీమాతారల ద్రాక్షసారాయి మత్తు పెదవుల్ని ఎన్ని త్రావి త్రేవులు త్రేన్చాడో! ఎంత మందికి వాడు రాత్రిళ్ళప్పుడు దాసుడయ్యాడో నాకు తెలుసును; నీకేం తెలుసును?
వాడి స్నేహితుడు డాక్టరు ఇంకా చిత్రమయినవాడు. వాడికి పెళ్ళి పెటాకులు ఎందుకు లేవనుకున్నావు? వీడూ వాడూ కలసి ఆ సినీమాతారలతో ఎంతో గాఢసంబంధం పెట్టుకొని ఉండేవారట. జయిలుకు వెళ్ళవలసి వచ్చింది. కాని, అంతవరకూ ఆ తారలను వీళ్ళిద్దరూ వదలలేదట. లేకపోతే వాళ్ళ కంత స్నేహం ఎందుకనుకున్నావు? అలాంటి ఒక చచ్చుగాడా నీకు భర్త?
కాబట్టి నా దర్జా నీ అందమూ, నా ధనమూ నీ విలాసమూ కావేరీవేగయిలుగా కలిసినట్లు అవ్వాలి. ఊఁ అను. ఒక్క కార్డు నీ దస్కత్తుతో పంపించు. నీ అందంకోలే తుమ్మెదనై నీ దగ్గర వాలుతాను.
ఇట్లు నిజంగా
నీ ప్రియమైన భర్త
చెట్టి.
ఆ సమయంలోనే కడలూరు జయిలులో ఉన్న కోనంగిరావుగారికి, ఒక ఉత్తరం వచ్చింది.
మద్రాసు,
16-4-1941.
సింగపూరు భవనం,
మైలాపూరు.
ప్రియమైన కోనంగిరావుగారూ,
మీరు చాలా మంచివారు. మిమ్మల్ని చూస్తే జాలేస్తుంది. మీ సాధుత్వమూ, మీ మంచీ అందరూ ఎంతోగా చెప్పుకుంటారు.
కాని నేను జయలక్ష్మిమీద ఎందుకు వ్యాజ్యం వేశానో చెప్పవద్దూ మరి. జయలక్ష్మి, దాని కూతురు అనంతలక్ష్మీ నా ఉంపుడుకత్తెలు. అనంతానికి నేను దాని పద్నాలుగో ఏటనే కన్నెరికం చేశాను.
జయలక్ష్మి వట్టి గడ్డురండ. నా డబ్బు యెంత తిందో! అనంతం అయ్యంగారిపిల్ల కాదు. అయ్యంగారు మాత్రం సామాన్యుడా? వాడికా డబ్బంతా ఎల్లా వచ్చింది ఈ జయలక్ష్మిని కోటీశ్వరులకు సప్లయిచేసి డబ్బు సంపాదిస్తూ ఉండేవాడు.
వాడు ఆడందేది. చివరకు వాడికి జబ్బు చేసింది. ఆ జబ్బులో వాణ్ణి తిన్నగా జయలక్ష్మి చూడకపోవడంవల్ల వాడు చచ్చి ఊరుకున్నాడు. అలాంటి సంసారం వలలో నువ్వు పడ్డావు. బోగంవాళ్ళు బోగంవాళ్ళే! యెన్ని గంగాస్నానాలు చేసినా ఊరకుక్క నందినీధేనువు అవుతుందా? అది గౌరవంకోసం నిన్ను పెళ్ళిచేసుకుంది.
డాక్టరు రెడ్డికీ అనంతానికీ జయలక్ష్మికి ఏదో ఉండేదనేవారు. నా కావిషయం అంత నమ్మకంలేదుగాని, అనంతం నా చాటున గూడా కొందరు కాలేజీ కుఱ్ఱవాళ్ళ దగ్గర తన్ను అర్పించుకొని డబ్బు కొట్లో ఉండేది. ఆ విషయం దీనితో జతపర్చిన ఉత్తరం చదివితే బోధపడుతుంది. మిమ్మల్ని చూసి జాలివేసి పట్టలేక ఈ ఉత్తరం వ్రాశాను.
మీరు సినీమాలో సంబంధం కలిగి ఉన్న సినీమా తారలు ముగ్గురూ కులాసాగా ఉన్నారు. మిమ్ము మరీ మరీ అడగమన్నారు.
4
ఆ ఉత్తరం చూడగానే కోనంగికి అంతులేని కోపం వచ్చింది. ఎంత విషం ఈ సెట్టియారుకి! “ఖలునకు నిలువెల్ల విషము గదరా సెట్టీ!” అని అనుకున్నాడు. తన్ను తాను మరిచిపోయేటట్లు చేయగలడు సెట్టి. ఇంకా కావాలంటే కొన్నాళ్ళకు కోనంగి వట్టి గుండా అని సంపూర్ణ నమ్మకం కోనంగికే కలుగచేయగలడు సెట్టి అని అతడనుకున్నాడు.
తనకు ఉత్తరం వ్రాసినట్టుగానే, అనంతానికి కూడా ఉత్తరాలు వ్రాస్తున్నాడా? ఏమి వ్రాశాడా? దాని ఫలితమేమో తెలిసేదెట్లా? ఈ పిశాచి ఉద్దేశం ఏమిటి? పెళ్ళి కాకమునుపు ఈలాంటి పనులు చేసి ఉంటే కొంచెం సెట్టికి ఉపయోగపడి ఉండునేమో! ఇంక తన ఆనందం విచ్ఛిన్నం చేయాలనేగా వీడు ప్రయత్నించేది? తన్ను కొట్టించాడు ఆ దెబ్బతో తాను చచ్చినా దిక్కెవరు?
స్త్రీకోసం పురుషపుంగవులు ఎంతైనా చేస్తారు. ధనం కోసం, తిండి కోసం దొంగతనాలు, దోపిళ్ళు. హత్యలు చేయడం అర్థం అవుతుంది. వివాహంకోసం ఎన్నో తాపత్రయాలు పడవచ్చును! కాని స్త్రీని పొందడంకోసం మాత్రం పురుగుకన్న హీనుడూ, నరమాంసభక్షకునికన్న భయంకరుడూ కావాలా? ఒక స్త్రీని ప్రేమించి ఆస్తీకోసం ఎంత బీభత్సం చేసినా కొంత అర్థం ఉంది. ఎవరో ఒక స్త్రీని కామించి, తన పశుతృప్తి తీర్చుకోడానికి ఎంత పనికయినా వెరవకుండా ఉండడము సంపూర్ణ పశుకృత్యంకన్న - ఎంత నీచస్థితోగదా అని కోనంగి ఆలోచించుకుంటూ కూర్చున్నాడు.
ఈ ఉత్తరం డాక్టరు రెడ్డికి చూపించడమా, చూపించక పోవడమా? తన అనంతం వ్రాసిన ఉత్తరం రెడ్డికి చూపించడమా, చూపించక పోవడమా? తన అనంతం వ్రాసిన ఉత్తరం రెడ్డికి చూపించనివాడు ఇప్పు డీ ఉత్తరం చూపించడంలో అర్థమేమి ఉంది? అని అత డాలోచించుకున్నాడు.
అక్కడ అనంతలక్ష్మి ఉత్తరం రెండవసారి చూచుకొని, దాన్ని ముక్కలు ముక్కలు చించివేద్దామని అనుకొంది. కాని ఈ ఉత్తరం అవసర మయితే పనికివస్తుందని దాన్ని దాచింది."
ఆ మర్నాడే రెండు ఉత్తరాలు కోనంగిరావు పేర అనంతలక్ష్మి ఇంటి చిరునామాకు వచ్చాయి. అనంతలక్ష్మి ఆ కవరులు రెండూ తన ఉత్తరంతో పాటు కోనంగికి పంపాలని సంకల్పించి విప్పి చూచింది.
మొదటి ఉత్తరం
నెం. 65
షణ్ముగంచెట్టివీధి
త్యాగరాజనగరం
మద్రాసు,
18-4-41
గాఢ ప్రియమూర్తి కోనంగీ,
నీ కౌగిలింతలు, నీ చుంబనాలు రుచిచూచి, నీ శృంగార నాయకత్వంలో ఓలలాడి ఎన్నో సంవత్సరా లయినట్లుంది.
నువ్వు పెళ్ళి చేసుకున్నావని విన్నాను ప్రాణకాంతా! ఆ నీ భార్య నాబోటిదేనటగా! ఇదివరకే ఆరితేరిన ఘటం అటగా-ఎంతమందో కాలేజీ విద్యార్థుల కౌగలింతలో కరిగి వారి దాహం, ఆకలి కడుపునిండా తీర్చినదే నటగా!
సరే, నువ్వు డబ్బుకోసం అక్కడికి చేరి ఉంటావు. ఒకవారం రెండు వారాలయిన వెనుక నువ్వు కాస్త నావంక కూడా చూడుసుమా. ఏమధ్యాహ్న మొచ్చినా సరే! నీ పెదవులు రుచి చూచిన నాకు ఇంకొకరి ముద్దులు చేదుగా ఉండవా మధుమోహనమూర్తీ!
నీతో సినిమాలో కలసి, నువ్వు నాయకుడుగా కలిసి పనిచేసిన నా అదృష్టమే అదృష్టం. మనం ఇద్దరం నిజంగా నాయికా నాయకులు అయ్యాం గనకనే అంత బాగా నటించగలిగాము.
ఆ రోజులలో నువ్వు ప్రదర్శించిన ప్రేమావేశం గ్రేటా గార్బో ఎదుట నటించిన చార్లెసు బోయెరు ప్రదర్శించగలడా?
ప్రాణనాయకా, నీవు నాకు వరమిచ్చిన ప్రణయం అంతా మీ క్రొత్తభార్యకు ఇచ్చేటప్పుడు, ఈ పాత భార్యను మరువక కొంతైనా నాకోసం ఉంచాలి సమండీ!
ఇట్లు,
"......."
ఈ ఉత్తరం ఎలా చదివిందో చదివింది అనంతలక్ష్మి. రెండో ఉత్తరం చదవలేకపోయింది.
ఆమే తల తిరిగిపోయింది. ఆమే ధైర్యం పూర్తిగా సడలిపోయింది. ఆమె గజగజ వణికిపోయింది. బిగుసుకుపోయింది. ఆమెలోని బలమంతా తూటుపడిన బిందెలో నీరు కారిపోయినట్లయి పోయింది. పదివేల టైఫాయిడ్ల జ్వరము తగలి నెమ్మదించిన నీరస మామెను కప్పింది. ఆమె ఏడ్వలేక పోయింది. ఆమె దేహంలోని రక్తం అంతా పది సంవత్సరాలై ఇంకి పోయినట్లయింది.
ఆ సమయంలో వినాయగంపిళ్ళ “అమ్మిణి! కారు సిద్ధం అయింది. మీ అన్న తొందరపడుతున్నాడు” అని లోనికి వచ్చాడు.
వచ్చీ రావడంతోటే వినాయగానికి అనంతలక్ష్మి అతి నీరసంగా వుందనీ, ఏదో మహత్తరమైన బాధకు ఆమె లోనయిందనీ తోచింది.
“అమ్మిణీ!” అని అతడా బాలిక కడకురికాడు. ఆ అరపులోని అనంతబాధ అనంతలక్ష్మికి అమృతపు మందు నరానికి ఇంజెక్షను ఇచ్చినట్లయింది. “ఏమీ లేదు మామా!” అనంత అన్నది.
“ఏమీ లేదేమిటి, నా తల్లీ! ఏమి జరిగింది? నిన్నటి నుంచి నువ్వదోలాగా ఉన్నావు. తల్లీ చెప్పు ఆయన వెళ్ళిపోయాడనా? తప్పక వస్తాడు. నిజం చెప్పు. అది కారణం అనుకోను!” అని రాతినైనా కరగించే ఆవేదనతో పలికినాడు.
ఆనంతలక్ష్మికి చల్లని మంచినీళ్ళు నోటి కందించినట్లయి, ఏమి బుద్ధిపుట్టిందో, అక్కడ ఆమె అలంకరించుకునే బల్లమీద ఉన్న ఆఉత్తరాల వైపు చేయి చాపింది."
“ఆ చిన్నడ్రాయరులో ఇంకో ఉత్తరం ఉంది. అది కూడా చదువు మామా!”
వినాయగంపిళ్ళ ఆ ఉత్తరాలు మూడూ చదివాడు.
అతనికి కుస్తీలో ఒక భయంకరమైన పేచీలో ప్రత్యర్థి చిత్తుచేసినంత అఘాతం కలిగింది. అతని ఆలోచన మాయమయింది. అతని గొంతు కేండి పోయింది. నిస్తబ్దుడై అలా నిలుచుండిపోయాడు.
అనంతలక్ష్మి వినాయగం అవస్థ చూచి మరీ నిసృహ పొందింది.
ఏమో నిజమేమో, తన గతి ఇంక అధోగతే! తాను బ్రతికి ప్రయోజనం లేదు.
ఏమో నిజమేమో! నిజమే! నిజమే అయివుండాలి! కాదు, ఇదంతా మోసం. తప్పకుండా మోసం. అనంతలక్ష్మి గజగజ వణికింది. నూట నాలుగు డిగ్రీల మలేరియా వచ్చినట్లు వణికిపోయింది.
5
వినాయగంపిళ్ళ తమ అమ్మిణిని కష్టపెట్టిన ఆ చెట్టియారును తలచుకొంటూ ఉగ్రుడై పోయాడు.
వినాయగం పేరు పొందిన వీరుడు. మల్లయుద్దంలో రామానయినా ఎదిరించ దగినంత వీరుడు. అతని కండశక్తీ నరబలమూ జగత్ర్పసిద్దము. ఉక్కుకడ్డీలు విరుగుతాయి. అతని అవయవాలు విరగవు. అతనికి కోపం రాదు. అతనికి ఆవేశం లేదు. ప్రకృతిశక్తికి పాఠాలు చెప్పే శక్తి అతనిది.
ఇప్పటికీ వినాయగంపిళ్ళ దగ్గర కుస్తీలు నేర్చుకోవడానికి అనేకులు శిష్యులు వస్తూ ఉంటారు. అతడు కోడి రామమూర్తిగారి సర్కసులో రంగూను, చీనా, జపాను, మలయా, జావా, మొదలయినవన్నీ తిరిగాడు. కోడి రామమూర్తి అతనికి గురువు. తన గురువునకు బాటసగా అతడు ఎన్ని బలప్రదర్శనాలన్నా చూపించేవాడు. ప్రసిద్ధి కెక్కిన దక్షిణాది గురువుల దగ్గర మల్లవిద్య నేర్చుకొని రామమూర్తి సర్కసులో ఉండే రోజుల్లో గామా దగ్గర అనేకమయిన నూతన మల్లయుద్ధ ప్రయోగాలు (పేచీలు) నేర్చుకొన్నాడు. గామా వేగానికి సమానమయిన వేగం అతనిది. గామారి తదితర శిష్యులు అతనితో కుస్తీ పోటీపడడం అంటే భయపడతారు.
అలాంటి వినాయగంపిళ్ళకు నేడు దావానలంవంటి కోపం ఉద్భవించింది. “అమ్మిణీ! ఈ ఉత్తరాలు నేను నమ్మను. నీ పెళ్ళి యింకా వారం రోజులు ఉందనగా నేనూ, మా వాళ్ళూ కలిసి జాగ్రత్తగా కోనంగిరావుగారిని గూర్చి విచారించాము. నా స్నేహితుణ్ణి ఒకర్ని బందరు పంపించి దర్యాప్తు చేశాము. కోనంగిరావుగారంత మంచివారు ఇంకొకరు లేరు. చెట్టికి వినాశకాలం వచ్చింది. వాడు చేసినపని ఇదంతా! ఇది ఏమనుకున్నాడో? మేము ముగ్గురము ఇక్కడ ఉన్నామన్న సంగతి మరచిపోయాడు. మాకు నీ వంటే ఉండే అభిమానం, గౌరవం, ప్రేమా సంగతి మరచిపోయాడు. మేము ఎవరమో అన్న విషయమే అతని స్మృతిపథాన్నుంచి పోయినట్లుగా ఉంది. నువ్వేమీ బెంగపెట్టుకోకు తల్లీ! మేము ముగ్గురమూ కోనంగిరావుగారిని గూర్చి విచారించడం అల్లా ఉంచు. మా హృదయాల్లో కోనంగిరావుగారంటే ఈషణ్మాత్రం అనుమానంలేదు. నీ పేరగాని, మీ ఆయన పేరగాని వచ్చిన ఉత్తరాలన్నీ మా కిచ్చివేయి. తర్వాత సంగతి మేము చూస్తాము.
“వాడు ఏ దురుద్దేశంతో వ్రాస్తున్నాడో ఆ ఉద్దేశం నెరవేరడమే అవుతుంది, నువ్వు దుఃఖిస్తే. లే; నీ మామూలు ప్రకారంగా నువ్వుండు. నీ స్నేహితురాండ్ర సహాయంతో కోనంగి విషయం. పోలీసువారికి పూర్తిగా తెలిసేటట్టు చేస్తాము. నువ్వు సంతోషంగా వుండు” అని బ్రతిమాలాడు.
గంభీరమైనవీ, చల్లనివీ, శాంతిపూరితమయినవీ అయిన అతని మాటలు అనంతలక్ష్మికి ఎంతో ఉపశమనం కలుగజేశాయి.
అనంతలక్ష్మి ధైర్యంగా లేచింది. వినాయగం కాళ్ళకు నమస్కారం చేసింది. ఇంతలో మెహరున్నీసా అనే స్నేహితురాలు తన పరదాకారులో యెక్కి అనంతలక్ష్మిని చూడడానికి వచ్చింది.
అనంతలక్ష్మి వెంటనే తన స్నానాల గదిలోనికి వెళ్ళి తన మొగము కడుక్కొని యధాప్రకారం చిరునవ్వుతో హాలులోకి వచ్చి మెహరున్నీసాను బిగియార కౌగలించుకున్నది.
మెహరున్నీసా చెన్ననగరం ముస్లింలీగు నాయకులలో నొకరయిన మొహమ్మద్ ఫైజుల్ హుస్సేన్ గారి కొమరిత. ఫైజుల్ హుస్సేన్ గారు చాలా మంచి వకీలు, ఆయనకు ఎంతమందో హిందూ స్నేహితులున్నారు. ఆయనకు హిందువులంటే కోపం లేదు. మతావేశము కలవాడు కాదు. ముస్లింలీగు చాలా గట్టిపడితే, ముస్లింలందరూ ఒకటైతే, కాంగ్రెస్ తో సమాధానంపడి సంధి షరతులు నిర్మాణం అయితే దేశానికి. అభ్యుదయం కలుగుతుందని ఆయన వాదన.
ఫైజుల్ హుస్సేన్ గారికి మేనల్లుడంటే ఎంతో ప్రేమ. కాని అతడు లీగును పూర్తిగా అర్థం చేసుకోలేదని వాదిస్తాడు.
మెహరున్నీసా రియాసత్ ఆలీని ప్రేమిస్తున్నది. రియాసత్ ఆలీ తన మేనమామ కూతుర్ని ప్రేమిస్తున్నాడు. వారిద్దరికీ వివాహం జరుగుతుందని నిశ్చయమే! కాని రాజకీయంగా భావాలు తేడాలయి కొంచెం తీవ్రత పొందాయి. ముస్లిం లెవ్వరూ కాంగ్రెసులో ఉండకూడదంటుంది ఆమె. అల్లా అందని లీగుస్థితి అధ్వాన్నమని వాదిస్తాడు.
పైజుల్ హుస్సేన్ గారిలో లేని తీవ్రత వీరిద్దరికీ వచ్చింది. మెహరున్నీసా క్వీన్ మేరీస్ కళాశాలలో అనంతలక్ష్మి తరగతే. ఇద్దరూ ఇంటరు చదివారు; ఇద్దరూ బి.ఏ. చదువుతున్నారు.
మెహరున్నీసాకుగాని, అనంతలక్ష్మికిగాని రాజకీయాలేవీ తెలియవు. అయినా ఉన్నీసాకు ముస్లింలీగు అంటే వెర్రి అభిమానం. అనంతలక్ష్మికి కాంగ్రెసంటే ఆభిమానం. అనంతలక్ష్మి స్నేహితురాండ్రలో కొందరు జస్టిసుపార్టీ వారున్నారు, కొందరు ఏ రాజకీయ భావాలూ లేని వారున్నారు.
మేహరున్నీసాకూ అనంతలక్ష్మికీ గాఢ స్నేహం. ఆమెకు ఇంకా పరదా ఉంది. తెరలు కట్టిన కారులో కాలేజీకి వెడుతుంది. బైటికి వెళ్ళదు. ఇంగ్లీషు సినీమాలకు వెళ్ళినా, బొమ్మలు మొదలుపెట్టిన తర్వాత హాలులోకి వెళ్ళేది. మధ్య విశ్రాంతిలో మేలిముసుగు వేసుకునేది. భారతీయ చిత్రాల ప్రదర్శనాలలో స్త్రీలకు ప్రత్యేకస్థలం ఉండేది. కనుక ఇబ్బంది ఉండేది కాదు ఆమెకు.
రియాసత్ కు పరదా అంటే పడదు. పరదా స్త్రీ పురుషులను పశువుల చేస్తుందని అతని వాదన. పరదా తీసివేయడమంటే విచ్చలవిడిగా తిరగడమని తన అభిప్రాయం కాదనీ, హిందువులు పరదా లేకుండా ఉన్నా వీధుల వెంబడి తిరుగుతున్నారా అనీ అతడు వాదిస్తాడు.
మెహరున్నీసా పరదా లేకపోతే స్త్రీ బోను విడిచిన పెద్దపులి లాంటిదంటుంది. హిందువులు, ఆంగ్లేయులు పూర్తిగా పరదా అవలంబిస్తే ముస్లింల ఆశయాలు క్షుణ్ణంగా అర్థం చేసుకుంటారు అని వాదిస్తుంది.
6
మెహరున్నీసా, అనంతలక్ష్మీ గదిలో కూర్చుండి అనేక విషయాలు చెప్పుకున్నారు. తమ ప్రేమవిషయం మెహర్ ఒక్క అనంతలక్ష్మితోనే చెప్పుకుంటుంది. అనంతలక్ష్మి ఆమె హృదయం పూర్తిగా ఎరిగి ఉన్న బాలిక. అనంతలక్ష్మి తన ప్రేమ విషయమూ మెహర్తో తెలిపేది. వీళ్ళిఇద్దరూ తమ ప్రేమగాథలు ఒకరి కొకరు చెప్పుకునట్లు తమ ఇతర స్నేహితురాండ్రయిన బాలికలకు తెలియనీయరు. మెహర్ ఇంటికి అనంతలక్ష్మి వెళ్ళినప్పుడో, అనంతలక్ష్మి ఇంటికి మెహర్ వచ్చినప్పుడో, తక్కిన స్నేహితురాండ్రు లేనప్పుడో, వీరిద్దరూ తమ ప్రేమ విషయాలు ఎవరికయినా వినబడుతుందేమో అన్నట్టుగా గుసగుసలతో మాట్లాడుకొనే వారు.
ఆ రోజున మెహర్ తన ఆవేదన అనంతలక్ష్మికి వెళ్ళబుచ్చుకునేందుకూ, అనంతలక్ష్మి ఆవేదనను తాను భరించేందుకు వచ్చింది.
ఇద్దరూ అతిదగ్గరగా ఒకరి నొకరు కౌగలించుకొని కూర్చున్నారు.
అనంతలక్ష్మి: ఏమే మేహర్! పరీక్షలయిన తర్వాత ఇప్పుడా రావలసింది నువ్వు?
మెహరున్నీసా: మీ ఆయన ఆరెస్టు అయిన తర్వాత అన్నిసార్లు వచ్చినా, పరీక్షలయ్యాయి. నా వివాహం సంగతి మళ్ళీ తర్జనభర్జనలయ్యాయి. మా పొపీజాన్ (మేనత్తగారు) మా బాబాజాన్ (తండ్రిగారు) తో నా వివాహ విషయం తొందర పెట్టింది.
అనంత: మెహర్, నీకు కోపంవస్తే నేను చెప్పలేనుగాని, రియాసత్ ఆలీగారిని నువ్వు ప్రేమిస్తున్నావు. ఆయన నిన్ను ప్రేమిస్తున్నారు. ఆయనకు ఈ ఏటితో వైద్యచదువు పూర్తి అవుతుందిగదా!
మెహర్: అయితే మాత్రం?
అనంత: ఆయన స్వంత వైద్యం ప్రారంభించడమో, లేకపోతే కొన్ని వైద్యాలలో ప్రత్యేక పరీక్షలకు వెళ్ళడమోగదా?
మెహర్: అయితే ఏమంట? నా వివాహానికీ దీనికీ సంబంధం ఏమిటే?
అనంత: అలాంటి సమయంలో నువ్వు కూడా ఆయన దగ్గర ఉండడం మంచిదిగాదటే?
మెహర్: యేవరకే?
అనంత: మీ ఇద్దరికినూ?
మెహర్: నాకు కూడానా?
అనంత: ఆ! మెహర్: నాకు మాత్రం మంచిదిగాదు. మా యిద్దరి రాజకీయాభిప్రాయాలు, అంత తేడాగా ఉంటే, మేం యిద్దరం నిమిష నిమిషానికి కొట్టాడుకొంటోంటే మా ప్రేమ మట్టిగలిసిపోదూ?
అనంత: అంత గట్టిదా మీ ప్రేమా? రాజకీయాలు, వ్యక్తిగతాభిప్రాయాలు ప్రేమకు అడ్డంపడతాయా? ప్రేమ మతాలనూ, రాజకీయాలనూ, వ్యక్తి భావాలనూ మించి మహెూత్తమ వేగంతో ప్రసరిస్తూ ఉంటుంది.
మెహర్: ఏమి చక్కనిమాట చెప్పావు? ఓహెూహెూ! నీకేం నువ్వు చెప్తావు అడుగులకు మడుగులొత్తే భర్తను చేసుకొని!
అనంత: నేను గాంధీతత్వవాదిని, ఖద్దరు కట్టకపోవచ్చుగాక, వడకక పోవచ్చుగాక! కాని మావారు జస్టిస్ పార్టీ అయినా లేక ప్రభుత్వ పక్షపాతీయులయినా నాకు లెక్క లేకుండా ఉండును.
మెహర్: నువ్వు అసలు గాంధీవాదివనుకో. నువ్వు ఖద్దర్ తప్ప ఇతర వస్త్రాలు కట్టుకోవనుకో. నువ్వు ఎప్పుడూ వడుకుతూ ఉంటావు అనుకో! అలాంటప్పుడు మీ ఆయన నిన్ను ఖద్దరు మానివేయమనీ, వడకడం పనికిరాదనీ, గాంధీతో సంబంధం ఏ మాత్రమూ పనికిరాదనీ పట్టుబట్టాడనుకో, అప్పుడేం చేస్తావు?
అనంత: నీకు నిజమయిన ప్రేమ ఉంటే, ఇలాంటి వాటికి భయపడవు, నేనే ఐతే నా ప్రేమ విధానము ఎల్లాంటిదయినా వారినే పెళ్ళి చేసుకుంటాను.
మెహర్ తలవంచి ఆలోచనలో పడింది. అనంతలక్ష్మి కాఫీ, ఉపహారాలు తీసుకురమ్మని చెప్పడానికి వెళ్ళింది. మెహరున్నీసా అనేకవిధాల ఆలోచించుకొంది. రియాసత్ ఆలీ మంచి క్రికెట్టు ఆటగాడు. ఎన్నిసారులో మదరాసు జట్టులో ఆడి వందలకొలదీ పరుగులుచేస్తూ ఉండేవాడు. రియాసత్ హృదయం యెంతో మంచిది. అతడు తానేమన్నా, ఎంత వాదించినా, చివాట్లు పెట్టినా నవ్వుతూ ఊరకుంటాడు. అతడు వాదం చేయడంలో కూడా యెంతో నెమ్మది ఉంది. అలా అని సమర్థత లేకపోలేదు.
ఈలా ఆలోచించుకుంటూ ఉంటే, అనంతలక్ష్మి అక్కడకు చక్కా వచ్చింది.
“ఒసే మెహర్! రా ఇంట్లోకి. కాస్త ఫలహారం చేసి కాఫీ తాగుదాము?"
“యింటి దగ్గర ఉపాహారాలు చేసి వచ్చానే!”
“చేశావులే! మా యింటిదగ్గర కాస్త తినవోయ్”
మెహరున్నీసాకు తెలుగు బాగా వచ్చును. ఆమె తండ్రి ఆంధ్రదేశవాసి. ఆంధ్ర దేశానికి పూర్వము ఎప్పుడో వలస వచ్చిన అరబ్ ముస్లిం సర్దారుల వంశంవాడు. అందుచేత వారింటి వారందరికీ తెలుగు బాగా వచ్చును.
ఇద్దరూ వెళ్ళి ఉపాహారాలు సేవించి కాఫీ త్రాగినారు. మెహర్ పారశీక రాకుమార్తెల అందం అంతా పుణికిపుచ్చుకుంది. వారిద్దరూ అనంతలక్ష్మి చదువుకొనే గదికి వచ్చారు. అక్కడ మెహర్ తన ప్రేమ విషయం అంతా తెల్సింది.
“చిన్నతనాన్నుంచీ మేం ఇద్దరం యెంతో స్నేహంగా పెరిగాం. చిన్నతనంలో మా బావ నన్ను చేసుకుంటాడు అని అల్లరిచేసేవారు. నాకూ మా బావ అంటే చాలా యిష్టమే! అయినా ఇద్దరం కలిసి పెరగడంవల్ల మా బావ నాకు అతిచనువయిపోయారు.”
“ఇంతకూ నీ అభిప్రాయం ఏమిటే?” “యేముంది, మా బావ ముస్లింలీగులో చేరితేనేగాని నేను అతణ్ణి పెళ్ళిచేసుకోదలచు కోలేదు.”
“ఆయన చేరడనుకో!”
“చేరకపోతే చేసుకోను. అది నిశ్చయం.”
“ఇంకొకరిని చేసుకుంటావా?”
“అసలు పెళ్ళే చేసుకోను.”
“ముసలిదాని వైనంతవరకూ అల్లా ఉండిపోతావా?”
“ఆ!"
“పూర్వకాలంలో క్రైస్తవ మిషనరీలు క్రొత్తగా వచ్చినప్పుడు తెల్లగా, బొల్లిగా ఉన్న వాళ్ళమ్మాయిలు కూడా వచ్చేవారు. ఆ అమ్మాయిలను చూపించి, చదువుకునే యువకులను ఊరించి, వాళ్ళ క్రైస్తవమతం పుచ్చుకుంటే, ఆ తెల్లపిల్లలను చేసుకోవడానికి తమ అభ్యంతరం లేదనే వారట ఆ మిషనరీలు. ఆ పిల్లల కాసించి ఎంతమందో మతం పుచ్చుకొనే వారట.”
“నీ కథకూ నా వివాహానికీ సంబంధం ఏమిటే?”
7
“అనంతలక్ష్మి మెహరున్నీసా మాట వింటూనే తన భర్త జ్ఞాపకము వచ్చి, కళ్ళనీళ్ళతో దీనముఖంతో తలవాల్చుకుంది. మెహర్ అనంతలక్ష్మిని కౌగలించుకొని హృదయానికి గట్టిగా అదుముకొని, “అనంత్, నీకు ఈ పామరత్వమేమిటే? మన చదువంతా గంగలో కలిసిపోయిందన్న మాటే? దేశంకోసం అని ఆలోచించి వెళ్ళకపోయినా, నీ భర్త జయిలుకు వెళ్ళడం దేశంకోసమేకదూ! వీరనారివై, పదిమందిలో అతిసంతోషంతో తిరక్క ఏమిటీ వాజమ్మతనం?” అని గదిమింది.
“ఈ ఉత్తరాలు చదువు” అని అనంతలక్ష్మి చెట్టియారూ, ఆ సినీమా తారలూ వ్రాసిన ఉత్తరాలు మెహరున్నీసా చేతిలో పెట్టింది.
అందులో తెనుగు ఉత్తరాలు రెండూ చదువుకొంది మెహర్. ఆమె గులాబీపూవు మోము ఎఱ్ఱగా జేవురించింది.
“ఈ ఉత్తరాలేమిటి? ఏ రాక్షస స్త్రీలు ఈ ఉత్తరాలు వ్రాయగలిగారు?” అని బాలిక ప్రశ్నించింది.
“ఈ అరవ ఉత్తరం చదివి అర్థం చెబుతాను విను” అని అనంతలక్ష్మి తలయెత్తి కన్నీరు తుడుచుకొని, ఆ ఉత్తరాలు చదువుతూ మెహరునకు అర్థం చెప్పింది. ఇంక మెహర్ పట్టలేకపోయింది. క్రోధమూర్చిత వ్యాఘిపోలిక ఆమె రాజుతూ “ఈ రోజుల్లో చదువుకొనే బాలికలను, ఈ పురుష వెధవ పందికొడుకులు బ్రతకనీయ దలచుకోలేదు. వెనక నాకు రెండు మూడు ప్రేమ ఉత్తరాలు, తిరువలిక్కేళిలో అక్బర్సాహెబ్ వీధిలో మా బంగాళా ప్రక్కను చదువుకొనే కుట్టకుంకలు వ్రాశారు. నాకు వచ్చిన కోపం మిన్నుముట్టింది. అయినా ఊరకున్నాను! వాళ్ళు కారులో నేను వెళ్ళి కూర్చోబోయే ముందు పొంచివుండి చూసేవారు” అని అన్నది.
“ఆ ఉత్తరాలు ఏంచేశావు?” “ఉండు; ఆ కథ అంతటితో ఆఖరా? వాళ్ళు నేను మాట్లాడక ఉండడం చూసి మరీ పేట్రేగేరు. ఒక రోజున మా పనిమనిషికి లంచం యిచ్చారు కాబోలు, వెండి వస్తువుల్ని 'ఏవేవో నాకు పంపించారు రహస్యంగా. ఇక నా కోపం చూడు, ఆ పనిమనిషి పిశాచిని పళ్ళూడగొట్టాను. ఆ వెండి వస్తువుల్ని రాతితో ముక్కచక్కలు చేశాను. “వీట్నీ చూసి వాళ్ళను బుద్ధి తెచ్చుకోమని చెప్పు. ఈ పట్టు ఇంకో తెలివి తక్కువ పని చేశారంటే పళ్ళూడకొట్టిస్తాను అని చెప్పు” అన్నాను. ఆ పనిమనిషి బేజారైపోయింది. అప్పటి నుంచీ, నాకు ఉత్తరాలు లేవు. ఇంక ఇల్లాంటి గడబిడలు జరుగలేదు. మీ చెట్టగాళ్లి కాస్త దేహ గౌరవం చేయించు. మీ వినాయగం ఉన్నాడుగా!” అంది.
“అవును, మా వినాయగం, అతని స్నేహితులూ ఉన్నారు మెహర్. కాని నాకు హింస అంటే నమ్మకం లేదు.”
“ఏమి గాంధీతత్వవాది! ఎక్కడ నేర్చుకొన్నావు ఈ వేదాంతము? యెప్పుడు ప్రవేశించావు కాంగ్రెసులో?”
“అహింసే పరమసాధనం' అని నమ్మడానికి కాంగ్రెసులో చేరాలా ఏమిటే మెహర్?”
“ఏమోలే! అయితే ఏం చేద్దామని నువ్వు చెట్టియారుగారి విషయంలో?”
“ఏమీ చెయ్యను. వాడి ఉద్దేశం నాకూ మా గురువుగారికీ ఎడబాట్లు కలుగచేద్దామని! వాడు నా గుమ్మం యెదుట కత్తితో పొడుచుకు చచ్చిపోయేది, నేను నా గురువుగారిని వదలను. నా భక్తి అలాంటిది.”
“అది మంచిదే. నీ నిశ్చయానికి నా హృదయ పూర్వకంగా నిన్ను ఆభినందిస్తున్నాను. ఇక నాకు నువ్విచ్చే సలహా ఏమిటే?”
“ఒసే మెహర్! ప్రేమ అంటే నీ ఉద్దేశంలో ఒక చీర వంటి దనుకున్నావా, మనం యిష్టం వస్తే ధరించుకొనడానికీ, బుద్ధిమారితే విప్పివేయడానికినీ? మా గురువుగారన్నట్లు ప్రేమ మనదేహంలో దేహం, మనస్సులో మనసూ, ఆత్మలో ఆత్మ అయిపోతుంది. దేహ మనఃప్రాణాల విషయంలో మనకు తెలిసి ఉండీ మనకు ముప్పు తెచ్చుకుంటున్నవట్లు, ప్రేమ విషయంలోనూ మనం తెలివితక్కువగా సంచరించి ప్రాణం మీదకు తెచ్చుకుంటాము. నువ్వు ఏమైనా రియాసత్ ఆలీగారిని విడువకు. మీ మీ రాజకీయాలు కూయంలో వేయండి.”
“ఇంత అద్భుతంగా నువ్వెప్పుడూ మాట్లాడలేదే అనంతం! నేను వెడతా. నా విషయం నేనే ఆలోచించుకోవాలి!”
“ఏమి నిర్ధారణకు వచ్చావో నాకు తెలియజేయి.”
మెహరున్నీసా వెళ్ళిపోయింది. మెహర్ రావడంవల్ల అనంతలక్ష్మికి ఎక్కడలేని ధైర్యమూ, శక్తీ వచ్చాయి.
ఆ బాలిక వెంటనే లేచి, స్నానంచేసి, ఉత్తమమయిన ఖద్దరు వస్త్రాలు ధరించి, మహిళా ఖాదీ ప్రచార కార్యాలయానికి తన కారు మీద వెళ్ళింది. జయలక్ష్మి కొమరితతో బయలుదేరక ఇంటికడనే ఉండిపోయింది. భర్తను నిర్బంధించినందుకు ఇంటికడ ఎప్పుడూ దుఃఖిస్తూ కూర్చోకుండా, భర్తకు ప్రీతియని ఖద్దరు పనిలో, మహిళా సేవాసదనోద్యమంలో పాలుపుచ్చుకుంటూ అనంతలక్ష్మి పనిచేయడం ఆమెకు ఆనందం అయింది. కొమరితను సర్వవిధాలా ఆమె ప్రోత్సహించింది.
ఆ రెండు సంస్థలకూ ఆమె బాగా విరాళాలిచ్చింది. అనంతలక్ష్మి మహిళా ఖాదీ ప్రచార కార్యాలయానికి పోయి వడికేది, యితరులకు వడకటం నేర్పేది. అక్కడ నుండి రాయపేట హైరోడ్డులో ఉన్న మహిళా ఖాదీ ప్రచారాలయ వస్రవిక్రయశాలకుబోయి, అక్కడ ఖద్దరు అమ్మేది. ఆ బాలిక ఖాదీ ప్రచారక సోదరీమణులతో బాగా స్నేహం చేసుకున్నది.
వారందరితో కలిసి ఎప్పుడయినా సేవాగ్రామం వెళ్ళి అక్కడ మహాత్ముని దగ్గిర కొన్నాళ్ళపాటుండాలని అనంతలక్ష్మి నిశ్చయించుకుంది.
వేసవి కాలంలో సేవాగ్రామం భరింపరాని వేడితో మాడిపోతూ ఉంటుందని, జయలక్ష్మి వాదించినా అనంతలక్ష్మి వినలేదు. తన నిశ్చయం భర్తకు ఉత్తరం వ్రాసి, తల్లితో బయలుదేరి వార్ధా చేరింది. ఇదివరకే సేవాగ్రామాశ్రమ కార్యదర్శితో వారుత్తర ప్రత్యుత్తరాలు సలిపి, ఆ జట్టువారు ఆశ్రమంలో ఒక బస ఏర్పాటు చేసుకున్నారు.
సేవాగ్రామంలో అనంతలక్ష్మి పొందిన ఆనందము ఆకాశపథ మందినది. ప్రతి ప్రార్థనా సభకూ ఆమె హాజరు. ఆ ప్రార్థన సమయంలో మహాత్ముని సమీపంలో ఆమె అనుభవించిన శాంతీ, ఆనందమూ పరమోత్తమస్థితి నందింది.
8
జయిలులో ఉన్న కోనంగికి చెట్టియారుగారి ఉద్దేశాలు 'తెలియక పోతాయా! ఆయన ఉత్తరాలలోని అంతరార్థం అప్పుడే అవగాహన అయిందతనికి. అయితే చెట్టియారు ఈలాంటి ఉత్తరాలు అనంతలక్ష్మికీ పంపించి ఉంటాడు. ఆ బాలిక ఎంత బాధపడుతుందో? యేలాంటి విపరీతాభిప్రాయాలకు వచ్చిందో? ఎంతటి క్రూరుడండీ!
కుక్కకు పిచ్చి ఎక్కితే, ఊరకే కరుచుకుంటూ పోతుంది ప్రతి ప్రాణినీ. అందరికీ పిచ్చి ఎత్తుతుంది. ప్రాణాపాయం వస్తుంది. కుక్కకాటుకు చెప్పుదెబ్బ అన్నారు కాని, కాటువేసిన కుక్కకే చెప్పు దెబ్బలు తగిలిస్తే కరచినవారికి జబ్బు నిమ్మళిస్తుంది. ఆ చెప్పు పాతది, కుట్లు ఊడిపోయి, మేకులు పైకి వచ్చివున్న చెప్పయితే దెబ్బ తగిలించాలి. కొత్త చెప్పు అయితే దెబ్బలు తిన్నవాడికి గౌరవం. చెట్టిగారికి సరియయిన చెప్పు పెంటకుప్పలో నుంచి వెదకాలి.
కోనంగి ఆలోచించి ఉత్తరం ఒకటి అనంతలక్ష్మికి వ్రాస్తూ తనకు వచ్చిన ఉత్తరాలలో తన్ను దెప్పినవి మాత్రమే మతలబులు వ్రాసి తన ఉత్తరంలో పెట్టి పంపించాడు. ఆ మర్నాడు కోనంగికి అనంతలక్ష్మి కడనుంచి ఉత్తరం వచ్చింది.
రెండు ఉత్తరాలూ ఒకదాని తర్వాత ఒకటి మధ్యదారిలో ఒకదాని ప్రక్కనుండి ఒకటి వెళ్ళి ఉంటాయి.
ఏ ఉద్దేశంతో తాను అనంతలక్ష్మికి ఉత్తరం వ్రాసినాడో ఆ ఉద్దేశం తోనే అనంతలక్ష్మి తనకు ఉత్తరం వ్రాసింది! యిద్దరి ఉత్తరాలూ రహస్య టపాదారినే ప్రయాణాలు సాగించాయి.
ఆమె ఎంత చక్కగా వ్రాసింది! ఎంత ఉత్తమభావాలున్నాయి?
“ప్రాణకాంతా! మీకూ చెట్టిగారి ఉత్తరాలు కొన్ని అంది ఉండాలి. మిమ్మల్ని గూర్చి దూషిస్తూ, వినరాని అబద్దాలు వ్రాస్తూ నాకు వ్రాశాడు. ఇద్దరు తారలచే మీకు వ్రాసినట్లు వ్రాయించి నాకు అందేటట్టు చేశాడు. నన్ను గురించి యెన్ని అబద్దాలో మీకు వ్రాయించి ఉంటాడు, వ్రాసి ఉంటాడు. అవి మనజీవితంలో కలతలు పెట్టవు. పోనీయండి ఆ చెట్టిని. వాడి పాపాన వాడేపోతాడు. నా స్నేహితురాండ్రందరూ మిమ్ము మరీ మరీ అడిగామని ఉత్తరాలు. నేను ఆంధ్రమహిళా ఖాదీసంఘంలో చేరాను. రోజూ ఖద్దరు నూలు వడుకుతున్నాను. ఖద్దరు బట్టలే కట్టుకుంటున్నాను.
మీరు యెప్పుడు వస్తారో నాకు తెలియదు. ఆర్డినెన్సు క్రింద వెళ్ళినారు. యుద్ధం ఆఖరువరకూ ఉంటారు కాబోలు. కమ్యూనిస్టులలో కొందరు ప్రభుత్వానికి దొరక్కుండగా పారిపోయారు. కొందరు జయిలులోంచి తప్పుకుపోయారు. ఇది వేళాకోళయుద్దమా అని కొందరనుకొంటున్నారు. పోలండు పని అయింది. హాలెండు పతనం, బెల్జియం శరణు. చివరకు ఫ్రాంసు పూర్తిగా లోబడిపోయింది. క్రిందటి సంవత్సరం యివన్నీ జరిగాయి. డంకర్కు తరువాత ఇంగ్లండులో దిగుతాడేమోనని మనం భయపడ్డాము. ఇటలీ వెనుక దెబ్బకొట్టింది అని మీరు వాదించారు.
జర్మనీవారు ఇంగ్లండులో దిగలేరు అని మీరు వాదించారు జ్ఞాపకం ఉందా ఆత్మేశ్వరా! కాని ఆ సమయంలో భారతగాథ ఒకటి నాకు చెప్పారు. జ్ఞాపకం ఉందా? ఒకనాడు ద్రోణుడు దుర్యోధనునకు పరమాద్బుతమయిన మంత్రకవచం యిచ్చాడనీ, ఆ కవచం ధరించి దుర్యోధనుడు అర్జునునిపై తనరథం తోలించాడనీ, అప్పుడు అర్జునుడు యెన్ని బాణాలో దుర్యోధనునిపై వేశాడనీ, అవన్నీ వృధా అయిపోవడం చూసి, పార్థసారధి హేళన చేశాడనీ, అందుపై అర్జునుడు మంత్రకవచ ప్రభావమని తెలుపుతూ సర్వ కవచభేదిని అను అస్త్రం ప్రయోగించాడనీ, ఆ అస్త్రాన్ని శక్తివైచి అశ్వద్ధామ దారిలోనే నరికివేశాడనీ, అప్పుడు అర్జునుడు కోపించి దుర్యోధనుని సూతునీ, గుఱ్ఱలనూ చంపి, రథం చూర్ణంచేసి, పట్టిన విల్లల్లా ముక్కలుచేసి, నిరాయుధుణ్ణిచేసి వదలినాడనీ, అలా హిట్లరు ఇంగ్లీషువారిని జయించాలంటే, ఈజిప్టు, సుడాను, ఎరిట్రియా, సౌమలీలాండు, పాలస్తీనా, ఇరాక్, ఇండియాలు పట్టుకోవాలనీ, కాని హిట్లరు వెనుక నెపోలియను చేసిన తెలివితక్కువే చేసి, రష్యామీద పడి నాశనం అవుతాడనీ అన్నారు.
మీ మాటలే అక్షరాలా నిజం అయ్యాయి. మొన్న జూన్ 23వ తేదీని జర్మనీ రష్యామీద విరుచుకుపడ్డాడు. ఇటలీ రుమేనియాలు యుద్ధం ప్రకటించాయి. ఇక ఇంగ్లీషువారి ఆనందం చూడండి. ఇంగ్లండులో దిగడం తప్పిపోయిందని అనుకుంటున్నారు. ఈ రోజు 24 ఈ నాటికే వేయిమైళ్ళ యుద్ధముఖంలో జర్మనీ రష్యాపైకి చొచ్చుకుపోతున్నాడు. పదిరోజులలో మాస్కోను పడతానంటున్నాడు హిట్లరు. ఈ విషయాలకు మీ డాక్టరుగారు ఏమంటారు?
ఇక్కడ పైన ఉన్న కమ్యూనిస్టులు జర్మనీపై మండిపోతున్నారు. కొందరు ప్రభుత్వం వారిని కలుసుకొని ఏదో రాయబారాలు సాగిస్తున్నారు.
ఇంక రాజకీయాలు అలా ఉంచండి. ఆత్మేశ్వరా! జూలై వస్తోంది. కాలేజీలో చేరనా వద్దా? మీరు దగ్గరలేక నాకు చదువుమీద ఇష్టం పోయింది. మీరు వచ్చునంతవరకు చదువు మానేసి కూర్చుంటాను. మదరాసు ఇల్లు మూసి, మన్నారుగుడి వెళ్ళమన్నారా? కడలూరులో ఒక యిల్లు అద్దెకు తీసుకొని అక్కడ కాపురం పెట్టమని మా అమ్మతో పోరుపెడుతున్నాను.
ప్రాణపతీ! మీరు కటకటాల వెనకాల ఉంటారా? సాయంకాలమే తాళాలు వేస్తారా? ఒక్కరూ ఉంటున్నారు? నేను వినాయగం ద్వారా పంపిన పరుపు మీకు జయిలు అధికారులు ఇచ్చారా? మళ్ళీ మాకు మీ దర్శనం వారం రోజులలో, వారం రోజులంటే 168 గంటలు. 168 గంటలంటే 10,080 నిమిషాలు. 10,080 నిమిషాలంటే 6,04,800 సెకండులు. ప్రతి సెకండూ ఒక యుగమయితే ఎన్ని ప్రళయాలు నా జీవితంలో వస్తాయో?
క్రిందటి సారి నన్ను ముట్టుకోడానికి యెంత చక్కని ఎత్తు వేశారండీ! ఈపట్టు నేనే మిమ్మల్ని ముట్టుకుంటాను చూస్తూ ఉండండి.
ఒక్కదాన్నే ఇంటినంటీ,
ఒక్కదాన్నే దారివెంటా,
ఒక్కదాన్నే జగమునంతకురా
ఓ ప్రాణరాయా!
ఏడపోతివి ప్రథమయామానే?
ఒంటితీగా వీణమీటీ
ఒక్కరాగమె ఆలపించీ
ఒక్కపాటే పాడుతున్నారా
ఓ ప్రాణరాయా!
గానమంటే కలలు రావేరా?
ఈ పాట వ్రాస్తున్నా ప్రాణపతీ! నేను రోజుకో పాట వ్రాస్తున్నా! అన్నీ మీ మీదే నా పాటలు. ఇవన్నీ అచ్చు వేయిద్దాము అనుకుంటున్నది అమ్మ. అలాని నాచేత యెన్నో పాటలు వ్రాయించాలని ఆలస్యంగా వస్తారా? మీరు వచ్చినా నా ఆనందంలో ఇంకా అద్భుతమైన పాటలు వ్రాయగలనండీ!
నిన్న రాత్రి వ్రాసిన పాట అది. ఇవాళ ఉదయం వ్రాసిన క్రింది పాట వినండి.
ఈడూ ప్రాణము ఆత్మా
వేడుతున్నవి నాథా,
తోడితేవటే, కా
పాడవే దివ్యాంగినీ,
తోడి రాగిణీదేవీ!
మీరు నా పాటలమీద మీ అభిప్రాయం ఇవ్వరూ?
ప్రేమతో
గాఢచుంబనాలతో
కౌగలింతలతో
అనంత.
9
“అనంతం! నేను డాక్టరుగారితో ఎప్పుడూ వాదిస్తూ అన్ని విషయాలూ గ్రహిస్తున్నాను. ఒంటిగా ఉన్నప్పుడల్లా వివిధాలోచనలలో వివిధ విషయాలు చర్చించు కుంటున్నాను. ఈ ప్రపంచంలో బీదవాడూ, బాధపడేవాడూ ఉండకూడదు. మనుష్యుడు, మనుష్యునికీ మనుష్యునికీ కల్పించిన తేడాలు అంతమయిపోవాలి. ప్రకృతో, భగవంతుడో, లేకపోతే యిద్దరో యిచ్చిన తేడాలు కూడా తగ్గించి, అనేక రీతుల నాశనంచేసి సమన్వయం చేయడానికి మనుష్యుడు ప్రయత్నం చేయాలి. అక్కడ స్త్రీ పురుషులకు మహదానందం వరమై వస్తుంది. కమ్యూనిస్టువాదనా, గాంధీవాదనా నమన్వయం చేసుకొని మనుష్యుడు తన నిత్యజీవితం దిద్దుకొన్ననాడు, లోకంలో అనేకమయిన హీనాసంతృపులు పోయి, ఉత్తమ సంతృప్తులు ఉద్భవిస్తాయి. అప్పుడే మానవజాతి పురోగమిస్తుంది.
ఏమిటీ వేదాంతమంతా అని నువ్వు అనుకోవచ్చును. నేను వేదాంతిని కాను. వట్టి కార్మికుణ్ణి. ఈ కార్మికవాదనే భగవద్గీతలో కర్మవాదన కాబోలు. నాకు తెలియదుసుమా!
ఇంక కమ్యూనిస్టు సిద్ధాంత ప్రకారం నన్ను గడబిడచేసేవి చాలా ఉన్నవి. డాక్టరుగారి వాదనలో ముఖ్యసూత్రాలు కొన్ని ఏమిటంటే: 1. మనుష్యుడే మనుష్యునికి అధికారి. ఇంక దేవుడనిగాని దెయ్యమనిగానికాదు. 2. యేది మనుష్యునికి ఉత్తమమో అదే నైతికము. 3. మనుష్యుని ఉత్తమస్థితికి ఏ మార్గము తక్కువ కర్చుతో, వేగంతో, విజయ నిశ్చయంతో, సరిగా తీసుకొని వెడుతుందో అదే సరియయిన మార్గం. అది హింసాత్మకంకానీ, అహింసాత్మకం కానీ!
ఈ మూడు సూత్రాలూ ముఖ్యంగా ప్రతి మనుష్యుడూ ఆచరణలో పెట్టవలసిన విధి అంటారు. ఈ మూడు సూత్రాలూ నేను ఒప్పుకొన్నాను. ఇవన్నీ గాంధీజీ లోకానికి ఉపదేశించిన సూత్రాలే!
ప్రపంచంలో కమ్యూనిస్టులూ, గాంధీవాదులూ, మధ్యనున్న అనేక వేల యితర వాదులూ యెవరి దారిని వారు వెడుతూ ఉంటే, ఏ మార్గం మంచిదో అదే తోస్తుంది అనే పద్ధతి ఒకటీ, మంచి మార్గం ఏదో నిర్ణయించిదాన్ని గురించి ప్రచారం చెయ్యాలనే మార్గం ఒకటీ ఉన్నాయి.
ఇవన్నీ ఆలోచిస్తూ నిన్న రాత్రి నా ఖయదులో పండుకొని ఉన్నాను. ఆ సమయంలో ఈ రోజున కళలను గూర్చిన వాదనలన్నీ ఎదుట ప్రత్యక్షం అయ్యాయి ప్రాణదేవీ!
“కళకోసం కళ” అని ఒకరు అంటారు. ఇంకోవాదన చతుర్విథ పురుషార్థ ప్రయోజనం కళ అని. మరొకరు కళ నైతికము అని. వేరొకరు కళ దేశాభ్యుదయదాయకంగా ఉండి తీరాలి అని. ఇంకా ఒకరు ఒక్కదేశాభ్యుదయమే కాదు, సకల మానవాభ్యుదయ పూర్వకంగా ఉండాలి అని. మరి వేరే వాదన ఉంది. కళ అనేందుకు కొన్ని గుణాలు ఉండాలి. ఆ గుణాలుంటే తర్వాత ఆ కళకు ప్రయోజనం ఉన్నా సరే, లేకపోయినా సరే అంటారు.
ఆలోచించిన కొలదీ నాకు ఈ వాదనలవల్ల కొంత మతిపోయింది. ఈ విషయాలన్నీ పరిశీలనగా మనస్సుకు హత్తింప చేసుకొందామని, ఆయా వాదనలకు సంబంధించిన పుస్తకాలన్నీ తెప్పించాము నేనూ డాక్టరూను చదివాము. మేము ఇద్దరం హెూరాహెరీ వాదించాము.
నా రాణీ! మా యిద్దరి వాదనలూ ఈ క్రింది సంభాణ రూపంగా ఇస్తాను. నువ్వు పూర్తిగా అర్థం చేసుకో. నేను: కళకోసం కళ అంటే, నీలో కళ సృష్టించాలి అన్న ఆవేదన కలిగి, కళ సృష్టించడం, అంతేనా డాక్టర్?
డాక్టర్: అది అవునూ, కాదూ! కళ సృష్టించాలన్న ఆవేదన కలగకుండా, కళను ఎవ్వరూ సృష్టించలేరు. అది ఒకటి. రెండోది కళాప్రజ్ఞ కలిగి, సర్వకాలమూ సిద్దహస్తుడై ఉన్న కళాకారుని, ఫలానా విషయం ఒక శిల్పం చెక్కమనీ, ఒక బొమ్మ వేయమనీ, ఒక పాట వ్రాయమనీ అంటే ఆ కళావేత్త అది సృష్టిస్తాడు.
నేను: రెండోది కళకోసం కళ కాదుగదా?
డాక్టరు: ఓయి వెర్రివాడా! కళకోసం కళ అంటే వట్టి ఆనందం కోసం కళ సృష్టించడం అన్నమాట! నువ్వు సృష్టించే కళ ఒక ప్రయోజనం ఆర్థించకుండా ఉద్భవిస్తుంది. అలా ఉద్భవించిన తర్వాత అది ఏదయినా ప్రయోజనం నిర్వర్తింపబడవచ్చు. దానికి ఓ ఉదాహరణ ఇస్తాను. ఒక కళావేత్త తనలో కలిగిన ఆనందంచేత ఒక పళ్ళగంప చిత్రాంచాడనుకో. ఆ బొమ్మ చాలా బాగుంది. ఆది వేసేటప్పుడు ఆ కళావేత్త హృదయంలో ఏ ప్రయోజనమూ లేదు. అదే కళకోసం కళ అంటారు. తర్వాత ఒక తోటల కంపెనీవారో, పళ్ళ కంపెనీవారో వారి వస్తువుల ప్రచారం కోసం ఆ బొమ్మ కొనుక్కొని ఉపయోగించా రనుకుందాం. అప్పుడది ఒక ప్రయోజనం సంపాదించుకుందన్నమాట.
నేను: వారెవా! అయితే నాయనా! ఆ కళ పనికిరాదని యెందుకు వాదిస్తావు బాబూ?
డాక్టరు: ఓయి పెద్దమనిషీ! ఆ కళ పనికిరాదని అనను. ఆ కళ వద్దనే నా వాదన.
నేను: కొంపలు ముంచావు బాబూ!
డాక్టర్: ముంచలేదు, తేల్చాను. కళ మనుష్యులలోని ఉత్తమశక్తి. మనుష్యుని శక్తులన్నీ మనుష్యుని అభ్యుదయంకోసం ఉపయోగించాలి. అలాంటిది అది ఉత్తమశక్తి అయితే ఇంకా ఎక్కువ ఉపయోగించాలి.
నేను: ఇంక వాడికి తిండి అక్కరలేదూ? అభ్యుదయంకోసం ఉపయోగిస్తూ తన జీవితం దుబ్బులపాలు చేసుకోవాలా?
డాక్టర్: ఎంత పిచ్చిమాట నీది?
నేను: నీది నచ్చేమాట కాబోలు!
అనంతలక్ష్మీ! ఈలా ప్రారంభం అయ్యాయి మా వాదనలు. ఇవన్నీ ఊరకే వాదించడం కాదు సుమీ! నువ్వు కళా విశారదవు కావాలి. కవయిత్రివి కావాలి. నేను ఏదైనా పరిశ్రమ ప్రారంభిస్తాను. నేను రంగుల పరిశ్రమ ప్రారంభిస్తాను. గోడల రంగులు, కలప సామాను రంగులు, నూనె రంగులు, బొమ్మలకు రంగులు, ఫోటోగ్రఫీ రంగులు, రంగులు రంగులు తయారు చేస్తాను. మదరాసులో స్థాపిస్తాను. ఈ రంగుల పరిశ్రమతోపాటు కుంచెల పరిశ్రమను కూడా ప్రారంభిస్తాను. అందులో పనిచేసే కార్మికులకు ఎన్నో అధికారాలు, హక్కులు ఇస్తాను. ఆ సంస్థను గాంధీతత్వమూ, కార్మికతత్వమూ రెండూ రంగరించి ఉద్భవింప చేస్తాను.
ఇంక నీ పని సంగీతమూ, కవిత్వమూ. నీ ఉత్పష్ట సంగీత ప్రజ్ఞతోపాటు కవిత్వము వృద్ధిచేసుకుంటే, నీ నా దాంపత్యము ఈ కార్యములు నిర్వహింపగలిగిననాడు మన ఇద్దరి ప్రేమ సార్ధకమౌతుంది ప్రియా!
ప్రాణేశ్వరీ! ప్రేమా పరమావధి లోక సంగ్రహణము.
ఇరువురమూనూ చేయిచేయి
ఉరుకుదా మటు కార్యరంగము
వెరపులేనీ బ్రతుకుదారిని
విజయమే మనకున్.
“ఆత్మేశ్వరీ! ఈ మాట అన్నిటి వెనకా నీకై నా వాంఛ అవిచ్ఛిన్నమై, అద్భుతమై లోకాలనే స్పందింప చేస్తున్నది.
నీ గాఢ ప్రేమాభిలాషి
ప్రియ పతి
కోనంగి.
ఈ ఉత్తరం అనంతానికే అందింది.
10
ఈ ఉత్తరం వ్రాసిన మర్నాడే కోనంగి ఇంకో ఉత్తరం వ్రాశాడు.
కడలూరు జైలు
“ప్రియతమా!
ఇంతలో మనం ఏ జాతక ప్రభావంచేత విడిపోయాము? ప్రేమించిన వస్తువు నుండి బలవంతంగా విడిపోవడం హృదయాన్ని పిండివేసినట్లే ఆత్మేశ్వరీ! నేను నిన్ను విడిచి రాత్రింబవళ్ళు బాధపడుతున్నాను. ఈ ఆవేదన మహెూత్తమ స్థితికి పోవాలి. లేక మనుష్యుణ్ణి అధోగతిపాలు చేస్తుంది. నా ప్రేమను నేను పవిత్ర గంగాప్రవాహంలా ఎంచుకుంటాను. నా ప్రేమ విధానము నాలో హత్తుకుపోయి నేనూ ఆమే ఒకటైపోయాము. నేను వేరు, నా అనంతలక్ష్మి వేరు అన్న భావం ఏనాడు మనం మన ప్రథమ సంశ్లేషతలో పెదవులు చుంబించుకున్నామో ఆనాడే పోయింది. నాలో లయమై పోయావు. ఆ వీరత్వం నాకు వేయి ఏనుగుల బలం ఇచ్చింది. ఆ బలం వట్టి ప్రాపంచిక స్వార్థంకోసం ఉపయోగించడం అల్పత్వమే అవుతుంది. ఆ బలం ప్రపంచంకోసం ఉపయోగించాలి.
“ప్రేమబలము అనంతం అనంతలక్ష్మీ! ఆ బలాన్ని ఉత్తమంగా ఉపయోగించాలి అని నేనంటే దాని అర్థం బ్రహ్మచర్యం ఆవలంబించాలి మనుష్యులంతా అని కాదు. బ్రహ్మచర్యం అంటే మన ఋషుల అభిప్రాయం భగవంతుని మార్గం అని. భగవంతుని మార్గం అంటే సర్వశక్తులు మానవ లోకానికి అభ్యుదయం చేకూర్చేటట్లు చేయాలని.
“భార్యాభర్తలు బిడ్డలు కనాలి వివాహం అనే సంస్థ ఉద్భవించడానికి కారణం బ్రహ్మచర్యమే. బిడ్డలు కనడం బ్రహ్మచర్యము భర్తగాని భార్యగాని మితిమీరి రతికోరడం, నూతన పురుషశక్తి స్త్రీ శక్తి విచ్చలవిడిగా ఉపయోగించడమే. అది బ్రహ్మచర్యంకాదు. ఆ విచ్చలవిడితనంలో లోక ద్రోహం ఉంది. భార్యాభర్తలు తమ జీవితం ఆనందమయం చేసుకొని తమ ప్రేమను తమ జీవిత పరమావధి చేసుకొని, ఆ ప్రేమ ఉత్తమపథ సంచారితము చేసి ఆకాశగంగా శక్తివంతంగా చేసిన నాడు స్త్రీ పురుషులు ఎలాంటి మహత్తర కార్యమయినా సులభంగా, ఉత్తమంగా నెరవేర్చగలరు.
ప్రాణపత్నీ! నువ్వు నా దేవతవు. నా అభయ భూమికవు. నేను కలలుగన్న దేవివి. చిన్ననాడు నాతో ఆటలాడుకొన్నావు. నిన్ను నాతో చదువుకున్న బాలురలో చూచాను. నిన్ను నాకు విద్య చెప్పిన గురువులలో చూచాను. నన్ను కలిపివేసిన సంగీతంలో నిన్ను విన్నాను. నన్ను కదిలించి వేసిన కవిత్వంలో నిన్ను అనుభవించాను. గాంధీ మహాత్ముని బోధనలో నీ దేశికత్వం అనుభవించాను; మహాపురుషుల జీవితాలలో నీ నృత్యం చవిగొన్నాను. బీదల అరువులో నీ ఆవేదన విని దుఃఖించాను. రష్యాదేశ విజృంభణలో నీ ఆనందం చూచి అందులో లయమయిపోయాను దేవీ! నువ్వు ఎక్కడ ఉన్నావో అని వెదికాను.
"నాకు యవ్వనం వచ్చిన ప్రథమ దినాలలో, బాలికలు నాకు అప్సరసలై కనిపించే కాంక్షాపూరిత గడియలలో నువ్వు కనపడక తలవాల్చి ముందుకు సాగిపోయాను.
“నాకు పరీక్షలు పూర్తయి జీవితమార్గం వెదకుకొనే రోజులలో నిన్ను దూరాన చూస్తూ, నీ అడుగుల మంజుల కింకిణీరవాలు దూరాన వింటూ, ఎక్కడ? ఎక్కడ? అని వెదకినాను. ఆ మధురస్వనమే నన్ను నీ దగ్గరకు తీసుకొని వచ్చింది.
“దేవీ! పురుషుడు స్త్రీకీ, స్త్రీ పురుషునకూ ఉపాస్యదైవములు కావాలి. ఈ పూజే మనుష్యుని పశుత్వంలోంచి తప్పించి ఉత్తమ మానవుణ్ణి చేస్తుంది.
"వివాహం అంత పవిత్రమైనది కాబోలు! నిన్ను ప్రేమించి ప్రేమించి నీ స్థితి నా స్థితికన్న ఎక్కడో పైన ఉండడం తలచుకొని, తలచుకొని బాధపడి నిన్ను నా దేవిగా మాత్రం ఎంచి ఉండాలనుకొన్న నాకు నీ హస్తం పట్టి నిన్ను అగ్నిసాక్షిగా అర్ధదేహముగా ఏర్పాటు చేసుకోవడం నాకెంతో ఆనందం సమకూర్చింది. వివాహమాడి నీ చేయిబట్టి ఏడడుగులు నడిచి నిన్ను రాత్రి హృదయాన కదుముకొని ఇది నిజమా అని ఆశ్చర్యంలో మునిగి నా అదృష్టానికీ, నిన్ను చేపట్టగల నా ప్రజ్ఞకూ ఆనందపూర్ణుడనై పోయినాను.
“నాలోని ఆశయ దేవతా, నువ్వూ ఏకమైపోయారు. లోక ప్రేమ చరిత్రలో మన ప్రేమ ఒక ప్రత్యేక ప్రకరణం కాదూ లక్ష్మి!
“నువ్వు లక్ష్మీవే! నా హృదయమే కమలము. నా జీవితమే కమలము. అందులో నువ్వు కమలాలయవై ఉంటావు. నా శక్తి, నా విద్య, నా హృదయము, నా మెదడు నాలుగు ఏనుగులై, నిన్ను పూర్ణకుంభాలలో అమృతం కురిపిస్తూ పూజిస్తాయి.
“ఓ దివ్యనవమోహనాంగీ, నువ్వే నా చేయి పట్టుకొని ఈ బ్రతుకు దారులలో నడిపించుకుపో. ఓ మహామధుర పరీమళాంగీ! అద్భుత సౌందర్య రేఖా సమన్విత జగన్మోహినీ! నీ ప్రేమచే నేను పవిత్రుణ్ణి. నిన్ను ప్రేమించడంచేత శక్తిమంతుణ్యి నీతో ఈ విశాల జగత్తులో నడుస్తాను.
“మనం ఇద్దరము మానవ సేవాశయ పవిత్ర క్షేత్రానికి పోదాం!
ఇట్లు
నీ పదపద్మాలు
హృదయాన ధరించు
కోనంగి.”
ఈ ఉత్తరం చదువుతూ అనంతలక్ష్మి కన్నుల నీరు నింపుకొని సోఫాలో కూలిపోయింది.
తన ప్రభువు ఎంతటి ఉదారభావాలతో తన్ను ముంచెత్తుతున్నాడు.
అవును. వారు చెప్పినట్లు ఆయన్ను అర్ధాంధకారంలో చూచిననాడే గుండె గుభిల్లుమంది. ఏనాడో చూచిన పురుషుడై, ఎన్ని జన్మాల నుండో గురువై, తన , ఆశయమూర్తిగా కలలుకన్న పురుషోత్తముడై తోచినారు.ఆమె ఆ ఉత్తరం రెండు మూడుసార్లు చదువుకుంది. తాను భర్తపై వ్రాసుకొన్న పాట గొంతెత్తి కచ్చేరి చేస్తునట్టు పాడుకొన ప్రారంభించింది.
“ఎవరోయి నువ్వూ
ఎదర చేరావూ?
ఎవరో నీ పాట
భువనాలు ఎగురుతూ
నా బ్రతుకులో కలిసి
నన్నె పాటను చేసె?
ఎవరేయి నీ నవ్వు
ఏడు లోకాలలో
ఆనంద ఝరులుగా
ఐక్యమయినది నన్ను?
ఎవరోయి నీ చూపు
ఇనుని కిరణాలవుతు
విశ్వతేజస్సవుతు
వెలిగించే నా బ్రతుకు