ద్వాదశ పథం

ఆగస్తు ఎనిమిది

ఆగష్టు ఎనిమిది తారీఖున బొంబాయిలో కాంగ్రెసు మహాసభ సమితి సమావేశమై “బ్రిటిషువారు ఇండియా వదలాలనీ, లేకపోతే ప్రతి భారతీయుడూ సత్యాగ్రహం చేయాలనీ, ఆ సత్యాగ్రహం గాంధీగారు ప్రారంభిస్తారనీ, ఆ సత్యాగ్రహం ప్రారంభించే ముందు మహాత్మాజీ ప్రభుత్వం వారికి తెలియజేసి రాజీకి వ్యవధి ఇస్తారనీ” తీర్మానింపబడింది.

రాత్రికి తీర్మానం అయింది, తెల్లవారకట్ల కార్యవర్గ సభ్యులనందరినీ అరెస్టుచేసి ఎక్కడకో తీసుకుపోయారు. మహాత్మాగాంధీజీని, ఆయన అనుచరవర్గాన్ని తీసుకుపోయి ఆగాఖాన్భవనంలో ఖయిదుచేశారు. ఆగస్టు తొమ్మిది ఉదయించింది.

ఆగస్టు తొమ్మిదిలో ఏదో మహత్తరావేశం పొంగిపోయి అఖండ విద్యుచ్ఛక్తిలా దేశం అంతా ప్రాకిపోయింది.

ప్రతిగ్రామంలో, పురంలో, నగరంలో ప్రజలు ఆందోళనావశులైరి.

ప్రభుత్వంవారు డజన్లకొలదీ ఆర్డినెన్సులు అమలులో పెట్టారు. కాంగ్రెసు మహాసభ, కార్యవర్గము, రాజధానీసభలు, కార్యవర్గాలు, జిల్లాసభలు, కార్యవర్గాలు. గ్రామ జాతీయసంఘాలు నిషేధింపబడినాయి.

రాష్ట్రనాయకులు, జిల్లానాయకులు బంధింపబడినారు. ప్రజలు లక్షలు బయలుదేరి రైళ్ళావి, పెట్టెలు తగులబెట్టినారు. పట్టాలు లాగిపారవేశారు. తంతిటపాతీగలు తెంపిపారవేశారు. రైయిలు స్టేషనులు, తాలూకాఫీసులు, కలెక్టరాఫీసులు తగులబెట్టారు.

అనేక స్థలాలలో పోలీసు కాల్పులు, ప్రజల చావులు, పోలీసులనే కొన్నిచోట్ల తగులబెట్టినారు. దిట్టమయిన జాతీయ నాయికా నాయకులు మారుమూలలకు పోయి ఉద్యమం సాగిస్తున్నారు.

కొన్నిచోట్ల బ్రిటిషురాజ్యము మాయమైపోయింది; కొన్నిజిల్లాలలో ప్రజారాజ్యాలు స్థాపించారు.

బ్రిటిషుపత్రికలు మహాత్మునీ, కాంగ్రెసునీ తీస్తున్నాయి భారతీయ పత్రికలలో ప్రభుత్వం ఇష్టంలేకుండా ఈ 1942 సత్యాగ్రహవార్తలు ప్రచురించకూడదట! అమెరికన్ పత్రికలకు వార్తలు సరిగా వెళ్ళటంలేదట బ్రిటిషువారలంటే ఇష్టంవున్న పత్రికలు ఇండియా చర్యలను నిరసిస్తున్నవి.

కమ్యూనిస్టులు కాంగ్రెసువారి చర్యలను నిరసించారు. రాయిష్ణులు కాంగ్రెసును దుమ్మెత్తిపోసినారు. పత్రికాసంపాదకులందరూ కూడా ప్రభుత్వంవారు తమ స్వాతంత్ర్యం అరికట్టడం నిరసించారు. తాము యుద్ధవిషయంలో ప్రభుత్వానికి ఎంత సహాయంచేసిందీ వివరించారు. చివరకు ప్రభుత్వంవారే రెండుమెట్లు క్రిందికి దిగినారు.

జర్మనీ నుంచీ, సైగాను జపాన్ నుంచీ రేడియోలో ఇండియాలోని వార్తలన్నీ ప్రచారం కాసాగాయి. సుభాష్ బాబుగారు బర్మా, మలయాలలో భారతీయ జాతీయసేన నిర్మించారు. ఒక సేన జర్మనీలో నిర్మించారు; భారతీయ సేనలు జపానువారికి పట్టుబడినవి. అవి జాతీయసేనలో చాలా వరకూ చేరినవి.

మలయా, బర్మాలలో భారత జాతీయప్రభుత్వం నెలకొల్పినారు. సుభాష్ బాబు దానికి నేతాజీ అయినాడు. అక్కడే జాతీయబ్యాంకు నిర్మాణం చేయగా కోటిరూపాయలు వసూలయినాయి.

భారతదేశంలోనే రహస్యంగా రేడియో స్టేషనులు బయలుదేరినవట. వాటి పలుకులు కూడా ఉద్యమాన్ని హుషారు చేయడం సాగించాయి.

చాలామంది పత్రికానేతలు ప్రభుత్వంవారు విధించిన నిషేధం అన్యాయమని తమ ప్రచురణలు ఆపి వేసినారు.

రైళ్ళు సరిగా వెళ్ళటంలేదు. దేశం అల్లకల్లోలమైపోయింది.

లోకం అంతా ఇంత తల్లక్రిందులౌతుందని కోనంగి కలలో అనుకోలేదు. అన్ని జాతీయ పత్రికలతోపాటు కోనంగి తన పత్రికా కట్టివేశాడు. ప్రభుత్వంవారు పత్రికలు చేసిన గడబిడవల్ల చాలావరకు నిషేధాలు తీసివేశారు. ప్రభుత్వానికి పత్రికా సలహాసంఘం పెట్టారు. అప్పుడు తక్కిన పత్రికతోపాటు కోనంగి నవజ్యోతిని మళ్ళీ ప్రకటించ సాగించాడు.

నవజ్యోతి పత్రికాసంస్థ సామ్యజాతీయవాద సమ్మిళిత పత్రిక. పత్రిక అచ్చుపని వారికి. యంత్రపనివారికి, గుమాస్తాలకు, అచ్చుపత్రాలు సరిదిద్దువారికి అందరకూ ఒకటే జీతం, డెబ్బదిఅయిదు రూపాయలు. పనివాళ్ళ ముఖ్యునకూ, ఉపసంపాదకులకూ నూరురూపాయలు జీతం. సహాయసంపాదకునకూ ప్రకటన పెద్దకూ, ఆఫీసు మేనేజరుకూ, పత్రిక సరఫరా పెద్దకూ నూటయాభైరూపాయల చొప్పున జీతం.

పనివాళ్ళ పనితనంబట్టి జీతాల తేడాలున్నాయి. రోజుకు రెండుగాలీలన్నర వారు డెబ్బది అయిదు రూపాయలవారు. రెండుగాలీలవారు కాని మంచి పనివారికీ అంతేజీతం. అక్కడ నుంచి అరవై, ఏభైవరకూ ఉన్నాయి. కార్యాలయ బాలురకు ముప్పది రూపాయల జీతం. స్త్రీ యెడిటర్లకు నూటడెబ్బదిఐదు చొప్పున ఏర్పాటు చేసుకున్నారు.

పెట్టుబడికి, వడ్డీకి-యంత్రాలు, టైపులు అరుగుదలకు ఇంతంత మొత్తము తీసివేయగా, జీతాలు నాతాలు ఖర్చులు పోగా మిగతా మిగిలిన సొమ్ములో ప్రావిడెంటు ఫండు, బోనసులు ఏర్పాటు చేశారు. సెలవలు, జబ్బు సెలవలు, పని సెలవలు ప్రతివారికి సమంగా ఇచ్చారు. కోనంగికి రెండువందల యాభై రూపాయల జీతం.

పత్రికా నిర్వహణంలో అందరికీ సమంగా ఓట్లు ఉన్నాయి. పత్రికలో పని చేస్తుంటే ఇతరులు చూచి ఆశ్చర్యపడుతూ వుంటారు. ఎవరిపని వారు చేసుకుంటారు. పని సరీగా జరుగుతుంది.

కోనంగి దేశంలో అల్లకల్లోలం ఏంటూ హింస లేకుండా వుంటే బాగుండునంటాడు. డాక్టరు ఏదీ వుండకూడదు అంటాడు. రియాసత్ ఆలీ ఫరవాలేదులే, దేశానికి ఆమాత్రం మగతనం ఉండవద్దా అంటాడు. మధుసూదనుడు “ఇంకా చాలదు. ప్రతి కలెక్టరాఫీసూ, ప్రతి కోర్టూ అంటుకుపోవాలి. ఇదే సమయం జపానువాడు రావడానికి. ఆసాంవరకూ వచ్చి ఆగిపోయాడే నాయనమ్మ. అసలు అమెరికా మీదకు వెళ్ళకూడదు” అంటాడు.

చౌధురాణీ, సరోజినీ, అనంతలక్ష్మి ఆనందము పడుతున్నారు. హడలిపోతున్నారు.

2

ప్రూఫురీడరు సుబ్బారావు జ్యోతిష్కుడు. ఆయన ఈ యుద్దం చాలా కాలం ఉంటుందనీ, ప్రపంచం మారిపోతుందనీ, ఇదంతా యూరేనస్ పని అనిన్నీ అంటూ ఉండేవాడు.

దేని పని అయితేనేమి, హిందూదేశం అల్లకల్లోలంగా ఉంది. కోనంగి మాత్రం ఏమీ కల్లోలంకాని హృదయంతో ప్రభుత్వాన్ని కొంచెం ఘాటుగానే విమర్శిస్తూ సంపాదకీయాలు సాగించాడు.

డాక్టరు రెడ్డిగారికి చౌధురాణీపై ప్రణయం అవిలంబనీయమయిపోయింది. ఆయన మాట్లాడలేదు. తాను తనకూ స్త్రీలకూ ఇదివరకున్న సంబంధము చౌధుతో చెప్పాలా, వద్దా? అని కోనంగితో ఆలోచించాడు. కోనంగి నువ్వు రెండు కారణాలవల్ల చెప్పాలి అని అన్నాడు. ఒకటి ప్రాపంచికంగా ఆలోచిస్తే వచ్చేది. ముందు ముందు ఏలాగో ఈతని ఒకనాటి జీవితం చౌధురాణీకి తెలిస్తే ఆమె మనస్సు విరిగిపోవచ్చును అని, రెండవది ధర్మ దృష్ట్యా ఆలోచించవలసినది. చేసుకొనబోయే భార్యకూ భర్తకూ మధ్య ఏ రహస్యాలూ ఉండకూడదు. ముఖ్యంగా స్త్రీ పురుషులకు సంబంధించినది కనుక అని.

డాక్టరుకు మొదటి కారణం నచ్చినా, రెండవ కారణం నచ్చలేదు. ఏ రాయి అయితేనేమి పళ్ళూడగొట్టుకొనడానికి? నువ్వే జాగ్రత్తగా ఆమెకు చెప్పవయ్యా అని కోనంగిని కోరినాడు డాక్టర్.

దీనివల్ల తనకూ చౌధురాణీకి అసలే సంబంధం కలక్కపోవచ్చును అని డాక్టర్ రెడ్డి అనుకున్నాడు. స్త్రీల మనస్సులు విపరీతమయినవి. ప్రేమించి లేదంటారు. ప్రేమించకుండా ప్రేమించినట్లు నటిస్తారు. ఒకనాడు ప్రేమించి, మరునాడు నీకూ నాకూ ప్రేమ ఏమిటి అంటారు. కాని స్త్రీ ఇంతకన్న ఏమి చేస్తుంది. ఈ అసంగతపు చరిత్రవల్లనే స్త్రీ తన్ను తాను రక్షించుకుంటూ ఉంటుంది. పురుషుడు స్త్రీ అంటే పడి ప్రాణం విడిచినంతటి గడబిడ చేసుకోవడమే స్త్రీకి పెట్టనికోట.

ధర్మభావమయితేనేమి, ముందు విషయం ఆలోచించుకోవడం లేక పోవడంవల్ల నయితేనేమి, తాను చిత్రంగానే బ్రతికాడు. చేసిన పనికి తాను విచారించడంలేదు కాని ఆ పని తనకూ చౌధురాణీకి సైంధవునిలా అడ్డంపడితే ఎట్లాగు?

చౌధురాణీ చదువుకున్నబాల. సంస్కృతి కలది. ధీశాలిని. అలాంటి అమ్మాయి తన జీవితం అంతా ఆలోచించుకొని అర్థం చేసుకోలేదా! అని అనుకున్నాడు డాక్టర్. మొత్తంమీద ఏది ఏమవుతుందో అని కొంచెం భయంపట్టుకుంది డాక్టర్ కు.

ఆగష్టు ఇరవై రెండవ తారీఖున సాయంకాలము కోనంగి చౌధురాణీ, మధుసూదను, సరోజిని బీచికి వెళ్ళినప్పుడు, చౌధురా కోనంగీ ఒకచోట కూర్చొని ఉన్నారు. తక్కిన వారిని దూరంగా పొండి అని, కోనంగి ఇదివరకే డాక్టర్ గారి పెళ్ళిమాట విషయం చెప్ప కోరియుండడంచేత, వారు ఏవోమాటలు చెప్పుకుంటూ దూరంగా వెళ్ళిపోయినారు.

కోనంగి వెంటనే చౌధురాణీతో “చౌధురాణీ! డాక్టర్ రెడ్డి చాలామంచివాడు....” అని ప్రారంభించాడు.

“నేను కాదన్నానా బ్రదర్!”

“విను నా మాటలు పూర్తిగా _”

“నేను విననన్నానా?” “సరే, డాక్టర్ చిన్నతనంలో కొన్నితప్పులు చేశాడు!”

“చేయమను. నాకెందుకు?”

“పురుషుడవడంచేతనూ, డాక్టరవడంచేతనూ—”

“ఇప్పుడు ఆ రెండూ కాడా ఏమిటి?”

“అతడు ఏదో రకంగా తృప్తి తీర్చుకొనేవాడు.”

“ఏమిటయ్యా! ఏవేవో గొడవలు?”

“అతడు ప్రేమ అనే పదార్థం ఉంటుందని ఎప్పుడూ నమ్మేవాడుకాడు.”

“పాపం! ఇప్పుడు బుద్ది మారిందా ఏమిటి?”

“ఆ! అందుకు కారణం నువ్వే”

“నేనెప్పుడూ ఆయనతో ఏమీ మాట్లాడలేదే!”

“మాట్లాడకుండానే అంతపని చేశావు. మాట్లాడితే డాక్టరేమయ్యేవాడో!”

“కళ్ళు తేలేసేవాడు! యిప్పుడు మాట్లాడకుండానే సగం తేలవేస్తున్నాడు.”

“ఆయన నిన్ను ప్రేమించాడు, తన జన్మ నీ పాదాల దగ్గర ఉందంటున్నాడు.”

“ఆయన పైత్యము కొంత, నా శైత్యము కొంతలా ఉంది!”

“మధ్యను నా దౌత్యమూ!”

“ఇంతకూ నువ్వు చెప్పేది ఏమిటి?”

“డాక్టర్ రెడ్డిగారు నిన్ను వివాహమాడ-”

“కాదయ్యా! నువ్వు చెప్పేది చెప్పమన్నాను!”

“తప్పక నువ్వు వివాహం చేసుకోమనే నా అభిప్రాయం!”

ఇంతలో అనంతలక్ష్మి గబగబ వీరిద్దరికడకూ వచ్చింది.

అనంతలక్ష్మిని చూడగానే కోనంగి సంతోషంతో లేచి “అనంతం, సమయానికే వచ్చావు...” అన్నాడు.

అనంతలక్ష్మి మొగం ముడుచుకొని “మీతో పని ఉండి రాలేదు. సరోజిని వదినకోసం వచ్చాను చాలా ముఖ్యమయిన పని ఉంది. మీ కారు చూచి, అందరూ యిక్కడే ఉంటారు కదా అనుకున్నాను. మీ మాటలకు అడ్డం వచ్చానేమో క్షమించండి” అని గబగబ కోనంగి మాటలు వినిపించు కోకుండా, కోనంగి అడ్డం పెడితే పక్క నుంచి తప్పుకొని విసవిసా వెళ్ళి పోయింది.

కోనంగి తెల్లబోయాడు. ఈ మధ్య అనంతం నాల్గయిదుసారులు ఈ రకంగా సంచరించింది. కోనంగికి అర్థం కాలేదు. కాని చౌధురాణీకి వెంటనే అర్థం అయి నవ్వు వచ్చింది. కోనంగి చౌధురాణీని చూచి “ఎందుకమ్మా చౌధు! నవ్వుతున్నావు?” అని అడిగాడు.

“బ్రదర్ నీకర్థంకాలేదా అనంతం హృదయం?”

“నాకు ఏదో అనుమానం తట్టుతూ ఉన్నది.”

“ఏమిటి?”

“నువ్వు అనుకున్నది చెప్పు!”

“నువ్వు భార్యను మరచి నీ మనస్సు నా పైన లగ్నం చేశావని ఆమెకు అనుమానం కలిగిందని నా ఉద్దేశం!”

“అది నాకు ఇప్పుడే కలిగింది. అనుమానం. ఇదివరదాకో, ఆమె రెండు మూడుసారులు ఈలా సంచరిస్తే అర్థంకాలేదు నాకు.”

“మీ భార్యాభర్తలమధ్య నేను వచ్చి పడ్డానేమిటి?”

“నువ్వు వచ్చి పడడం ఏమిటి? నేను నా జన్మలో ప్రేమించిన బాలిక ఒక్కతే! ఆ ఒక్కతే నా భార్య అయింది!”

“అనంతం హృదయం నవనీతం!”

“నవనీతహృదయమే! కాని ఈ విచిత్రమార్గం తొక్కిందేమిటి? నా హృదయంలో నాకు తెలిసినంతవరకు అణుమాత్రం చలనంలేదే! అదివరకు ప్రేమలేకుండానే వివాహం చేసుకుందా మనుకున్నాను. కాని నా అదృష్టం కొద్దీ నాకు అనంతం దొరికింది చౌధూ! నా ఆనందం ఈనాటికీ వర్ణనాతీతమై ప్రవహిస్తూ ఉన్నది. ఇంతకూ దౌర్భాగ్యుణ్ణి నేను. నాకు సంతోషాదృష్టం ఎంతకాలం ఉంటుందీ?”

“అలా అనుకుంటా వేమిటి బ్రదర్?”

“అనుకున్నా, అనుకోకపోయినా అదృష్టం మారుతుందా చౌధూ?”

“అదృష్టం అంటే నీకు నమ్మకమేనా?”

“ఆ, సందేహం లేకుండా.”

“అయితే నన్ను ఆలోచించుకోనీ! నా విషయం డాక్టరుగారితో ఏమీ చర్చించకు. నా అదృష్టాన్ని నేనే పరీక్ష చేసుకోవద్దూ! నేను రాజకీయంగా భావాలు లేనిదాన్ని. డాక్టరుగారు సామ్యవాది.”

“రాజకీయాలకూ, వివాహాలకూ సంబంధం ఉందా వెర్రిదానా? అలా ఉందనుకొని రియాసతోను బాధాకూపంలోకి తోసింది మెహరున్నీసా!”

“అదేమిటి?”

“ఏమి ఉంది. ప్రేమంత వెర్రిభావం, దురదృష్టమూ ఇంకోటి లేదు. డాక్టరన్నట్లు ప్రేమించి పేలాలవడమే తప్ప ఇంకేముంది?”

“అలాంటి డాక్టరుకు ఈనాడు ప్రేమ ఏమిటి?”

3

అనంతలక్ష్మి తన విషయంలో నిష్కారణంగా అనుమానంపడి ఆమే బాధపడుతోంది, తన్నూ బాధపెడుతోంది అని కోనంగి కుంగిపోయినాడు.

కోనంగి భార్యను బ్రతిమాలదలచుకోలేదు. కోనంగి అనవసర సంభాషణ చేయదలచుకోలేదు. ఈ విషయం ఎవ్వరితోను చెప్పకు సిసీ! (చెల్లి) అని కోనంగి చౌధురాణీని కోరి వాగ్దత్తం చేయించుకొన్నాడు. చౌధురాణీ ఏమీ ఎరుగని దానివలెనే సంచరింపసాగింది.

అనంతలక్ష్మి తన గది వదలి రావడం మానివేసింది. భోజనం సరిగా చేయడంలేదు. కారు వేసుకొని పార్వతి ఇంటికి, అలమేలు ఇంటికి, మెహర్ దగ్గరకూ వెళ్ళుతూ ఉంటుంది.

ఇంత ఉపాహారం తింటే డోక్కుంటుంది. చిక్కిపోతూ ఉంది అనంతం ఏదో బెంగ, కూర్చున్నచోట నిలుచోలేదు. నిల్చున్నచోట కూచోలేదు. ఒక స్నేహితురాలి ఇంటనూ చాలాసేపు ఉండలేదు. వాళ్ళు ఏమి చిరుతిండి పెట్టినా సయించదంటుంది. కోనంగి. భార్య చర్య యావత్తూ చూస్తూ ఉన్నాడు. ఆమె బాధకు తానూ బాధపడుతూ ఉన్నాడు. ఏమిటి ఈ అవస్థకు ఔషధం? ఆతడు నాల్గయిదుసారులు భార్యతో మాట్లాడాలని ప్రయత్నించాడు కాని అనంతలక్ష్మి వినిపించుకోకుండా వెళ్ళిపోయింది.

ఎక్కడన్నా ఇటువంటి స్థితి వస్తుందా? ఉత్తమ ప్రేమలో భార్యాభర్తలమధ్య ఒకరునొకరు అనుమానపడడం ఉంటుందా? ఇది ప్రేమకు పెద్ద కళంకం కాదా? అలాంటి అనుమానం వచ్చింది గనుక అనంతం ప్రేమ శుద్దత్వానికి కొంచెం తగ్గిందనుకోవాలా?

ఏమి గొప్పవాడు తను? తినతిండీ. కట్టగుడ్డా లేకుండా తాను వచ్చి తన క్రింద ఆదరణచేసే భార్య వస్తే ఆమెకు వంకలు పెట్టడానికి ఎవరయ్యా తాను?

అనంతలక్ష్మితో సహవాసం లేకపోతే డాక్టర్ రెడ్డికీ తనకూ సంబంధమే ఉండకపోవును. అప్పుడు సినీమా ఏదీ పత్రికా సంపాదకత్వంఏదీ? ఇంక ఇప్పుడు తన కర్తవ్య మేమిటి?

అలాగే మాట్లాడకుండా అనంతంకోసం తన ధోరణి మార్చుకొని ఆమె మనస్సుకు ఆనందం కలగజేయాలి.

కోనంగి అనంతలక్ష్మి వెన్నంటి ఒక్కనిమిషమూ వదలకుండా ఏవో పిచ్చిమాటలు అంటూ నవ్వించటం సాగించాడు. అనంతాన్ని నవ్వించడమే తన పవిత్రధర్మం అన్నట్టు సంచరించడం ప్రారంభించాడు.

అనంతానికి తాను తప్పు చేసినట్లు ఆనాడే అర్థమయింది. తన హృదయనాథుడు నిర్మల చరిత్రుడు. ఈ రెండేండ్లలో వేలుచూపి ఆయన ఎక్కడ తప్పు చేశారని తాను చెప్పగలదు? చిన్నతనాన్నుంచీ ఎరిగి ఉన్నవారు, చౌధురాణీ పదినిమిషాలు మాటామంతీ మాటలాడుకోవడము తప్పా? తాను ఇష్టంవచ్చిన వారితో మాట్లాడితే, అవన్నీ ఆయన తప్పుపట్టుకున్నారా?

ఎంత చదువు చదివినా స్త్రీ స్త్రీయే! భర్తను ఊదరకొట్టి తాను ఏమిచేయాలని తన ఉద్దేశం? భర్తకూ చౌధురాణీకి ఏమీ పాపసంబంధం ఉండగలదు? ఏవో లేనిపోని అనుమానాలు కల్పించుకొని తాను బాధ పడుతోంది. కాని, ఆయన నిర్మల హృదయంతోనే తిరుగుతున్నారు. ఆయన్ను చూస్తే జాలివేస్తుంది.

ఒక వారంరోజులు నెమ్మదిగా జరిగాయి. కోనంగి ప్రయత్నంవల్ల ఏమీ ఎరుగని వానివలే నటిస్తూ సంచరించడంవల్ల అనంతలక్ష్మి భర్తతో మామూలుగా మాట్లాడేస్థితికి వచ్చింది.

ఇంతట్లో ఒకరోజున పోలీసు డిప్యూటీ కమీషనరొకాయన, మన చెట్టిగారూ, ఇంకా కొందరు పెద్దలూ, ఇరవైమంది పోలీసువారూ కార్ల నుండీ, పోలీస్ వాన్ నుండీ దిగి నవజ్యోతి కార్యాలయం అంతా సోదా చూచారు. ఏ కాగితాలూ దొరకలేదు. ఊళ్ళలో జరిగే గడబిడలను గురించి వచ్చిన ఉత్తరాలూ, పత్రికా పుస్తకాలయంలోని సామ్యవాద. జాతీయవాదాది పుస్తకాలూ పట్టుకువెళ్ళారు.

చెట్టిగారి కసి తీరలేదు. ఎన్ని విధాల చిక్కులు పెట్టాలో అన్నీ పెట్టడానికి సిద్ధమే.

పత్రికా కార్యాలయంమీద దాడి జరిగిన కొద్దిరోజులకు ప్రభుత్వంవారు నవజ్యోతి పత్రికను తమకు ఆరువేలు ధరావతు కట్టాలని కోరినారు. అందుపైన కోనంగి హైకోర్టులో ప్రభుత్వంవారి ఆజ్ఞకు పునాదియైన ఆర్డినెన్స్ చట్టవిరుద్ధమనీ, ఒకవేళ ఆర్డినెన్సు చట్టవిరుద్ధం కాకపోయినా, ధరావతు కోర తగిన కారణం లేనందున ధరావతు వసూలుచేయకుండా ప్రభుత్వంపై ఆంక్ష పొందాడు.

ఈ ధరావతు విషయంలోనూ చెట్టిగారి మహాత్మ్యం ఉందని డాక్టరు రెడ్డిగారికి రహస్య వర్తమానం తెలిసింది.

డాక్టర్: ఈ మహానుభావుడికి ఎంతకాలం నీమీద ఈ కక్ష ఉంటుందంటావు?

కోనంగి: వాడికి బుద్ధి మళ్ళేవరకు.

డాక్టర్: ఎల్లాగ బుద్ది మళ్ళడం?

కోనంగి: వాడు చేసే దుర్మార్గాలు కలశం నిండిపోవాలి, అప్పుడు వాణ్ని అవే అణుస్తాయి.

డాక్టర్: మళ్ళీ వట్టి వేదాంతాలు మాట్లాడకు!

కోనంగి: వట్టి వేండాంతాలు కావయ్యా బాబూ! సంపూర్ణమయిన శాస్త్రవాదనతో మాట్లాడుతున్నాను. పెండ్యులం నీతి ఎరగవూ?

డాక్టర్: నాకు మండిపోతుంది ఒళ్ళు, వీణ్ని సున్నంలోకి ఎముకయినా మిగలకుండా తన్నించాలి.

కోనంగి: ఆ పని మాత్రం చేయకు నాయనా!

డాక్టర్: నేనే ఎప్పుడో స్వయంగా వెళ్ళి

కోనంగి: నీ సంగతీ, నా సంగతీ అల్లా ఉంచు. ఈ మధ్య ఆ అరవ పత్రికలో మన చెట్టియారును గురించి వ్రాసే వ్రాతలన్నీ చూస్తూ ఉన్నావా?

డాక్టర్: వాడెంత అసాధ్యుడోయి ఆ సంపాదకుడు! ఆ వ్రాతలలో ఉన్న గమ్మత్తు ఏమిటంటే అవి అన్నీ నిజమే! అందుచేత చెట్టిగారికి మరీ మతి పోతోందట!

కోనంగి: ఆ పత్రిక అబ్బాయికి చెట్టియారు సంగతులన్నీ ఎట్లా తెలుస్తాయ్?

డాక్టర్: అతనికి చాలామంది గూఢచారులున్నారయ్యా. ఒక్కొక్క వార్తకు ఇంతని ఇస్తాడట. అది మరీ మంచివార్త అయితే ఏభైరూపాయలు గిల్తాయన్న మాటేనట.

కోనంగి: ఎక్కడిదీ డబ్బు బాబూ?

డాక్టర్: ఆ పత్రిక అమ్మకం ముప్ఫైవేలుందోయి ఇప్పుడూ!

4

మొత్తంమీద కోనంగి హైకోర్టులో దిట్టంగా వాదింపించాడు. అయినా లాభం లేకపోయింది. నవజ్యోతి పత్రిక ఆరువేల రూపాయలు సెప్టెంబరు మొదటి వారంలో ధరావతు కట్టితీరవలసి వచ్చింది.

ధరావతు కట్టినాముకదా అని కోనంగి ఘాటుగా వ్రాయటం మానలేదు. కాని 'లా' ప్రకారం పత్రికకు ఏమీ నష్టం లేకుండానే వ్రాస్తున్నాడు.

దేశంలో కొన్నిచోట్ల ఉధృతం తగ్గింది. కొన్నిచోట్ల ఏమీ తగ్గలేదు.

కాని కోనంగి మట్టుకు స్వరాజ్యము వచ్చినట్లుగానే పని చేయడం సాగించాడు. అతని ఉత్సాహమే మధుసూదనునీ, సరోజినినీ హుషారులో ముంచింది. ఆరు అయిదు కాలములు ప్రభుత్వంవారు ఒప్పుకున్న వార్తలనే పెద్ద అక్షరాలలో వేస్తూ ఉండడం మొదలయిన గడబిడచేస్తూ ఉండేవాడు. డాక్టర్ రెడ్డికి ఈలా చేయడం ఎక్కువ ఇష్టంలేదు.

‘జాగ్రత్త కోనండీ!' అని కోనంగిని కళ్ళెం లాగుతూ ఉండేవాడు. సెప్టెంబరు రెండవవారం ప్రారంభంలో బుధవారంనాడు కోనంగి సంపాదకీయం వ్రాసుకుంటూ ఉన్నప్పుడు చౌధురాణీ కోనంగి గదిలోనికి చక్కావచ్చింది. సరోజినీ, అనంతలక్ష్మి ఏదో మాట్లాడుకుంటున్నారు. మధుసూదనుడు మొదలయినవారు రాయిటరు టెలిప్రింటరులోంచి కాగితాలు లాగి పారవేస్తూ యుద్దవార్తలు, దేశవార్తలు తర్జుమాచేయడం, చింపడం, అచ్చుకు పంపడంలో నిమగ్నులై ఉన్నారు.

చౌధురాణీ కోనంగి కడకు వచ్చి 'ఏమయ్యా బ్రదర్! ఇప్పటికి నిశ్చయానికి వచ్చాను.”

“ఏమి నిశ్చయం?” ఆదుర్దాగా కోనంగి అడిగాడు.

“నేను రెడ్డిగారిని ప్రేమిస్తున్నానని!”

“అయితే నా హృదయపూర్వక అభినందనలు.”

కోనంగి లేచి చౌధురాణీ చేయి ఆడిస్తుండగా అనంతలక్ష్మి “గురువుగారూ!”అంటూ అక్కడకు వచ్చింది.

చౌధురాణీ, కోనంగీ కరగ్రణం చేసి ఉండడం చూసింది. మాట్లాడకుండా వెలవెల పోయే మోముతో నిలుచుండి, మరుక్షణంలో ఒక కుర్చీలో కూలబడిపోయింది.

చౌధురాణీ, అనంతలక్ష్మి దగ్గరకు వెళితే “నువ్వు వద్దు. నాకేమీ బాగాలేదు, నువ్వు వెళ్ళి సరోజిని వదినను పిలు” అని నీరసంగా అంది.

వెంటనే చౌధురాణీ వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోవడం తరువాయి, అనంతలక్ష్మి కాళికా శక్తిలా లేచింది. భర్తను చూచి: “ఏమండీ, మీకు నామీద ప్రేమ నశిస్తే నశించింది. గాక! మీ ప్రణయవిలాసాలు ఇంత వెల్లడిగా ప్రదర్శించకపోతే. కాస్త రహస్యంగా సంచరించలేక పోయారు? నామీద మీ కెప్పుడూ ప్రేమ లేదని ఈ మధ్యనే తెలుసుకున్నాను. నా డబ్బుకోసం ఆశించారు. నన్ను చేసుకున్నారు. అయినా నా ప్రేమ మాత్రం మీకు సంపూర్ణాంకితం చేస్తిని. నన్ను మీకు దేహమూ, మనసూ, ఆత్మా అర్పించుకుంటిని. నామీద ప్రేమలేకపోయినా, దయాంతఃకరణలు కూడా లేవా మీకు... (ఆమె పకపక నవ్వి) ఏదో అంటున్నాను, నాకు తల తిరుగుతోంది... నాకు (ఆమె వెక్కి వెక్కి ఏడుస్తూ తలతిరిగి కూలిపోబోయింది) కోనంగి ఒక్క గంతువేసి అనంతాన్ని పట్టుకొని అనంతం! అనంతం! అని గుండెలదిరిపోయే కేకలు వేశాడు. ఇంతలో సరోజిని పరుగెత్తుకొని అక్కడకు వచ్చి 'ఏమిటి అన్నయ్యా!' అని అంటూ కోనంగి అనంతలక్ష్మిని చిన్నబిడ్డలా ఎత్తుకొని హృదయానికి అదుముకొని ఉండడం, అనంతలక్ష్మి నిశ్చేష్టమై ఉండి, వెనక్కు వేలవేసి ఉండడం చూచింది.

“అయ్యయ్యో! అన్నయ్యా!” అని మధుసూదనుని కేక వేసింది. కోనంగి అలా అనంతలక్ష్మిని ఎత్తుకొని మతిలేని వానిలా ముందు హాలులోనికి తీసుకువచ్చాడు. మధుసూదనుడు పరుగెత్తుకొని కోనంగి దగ్గరకు వచ్చాడు. కోనంగి మోము పిచ్చివాని మోములా అయిపోంది. అది చూచి, 'ఏమిటి కోనండీ!” అని అరిచాడు.

సరోజిని ఆ ప్రక్కనే ఉన్న కూజాలో నీళ్ళు అనంతలక్ష్మి మొగంపై చల్లింది.

అనంతలక్ష్మికి అంతకుముందే మెలకువవచ్చింది. అయినా భర్త తన్ను ఎత్తుకొని ఉండడం గమనించి ఆ నీరసత్వంలోనే ఏదో హాయి అనుభవిస్తూ కదలకుండా కళ్ళు మూసుకునే ఉంది.

చల్లని నీళ్ళు తగలడంతోనే ఆమే పూర్తిగా కళ్ళు తెరచి 'అమ్మా' అని నిట్టూర్పు విడిచింది. భర్త తన్ను విడవలేదు. అతడు ఈ లోకంలో లేడు. ఆమెను ఎత్తుకొని విగ్రహంలా నిలుచుండే ఉన్నాడు. భర్త మోము చూచి, అనంతలక్ష్మి గజగజలాడింది. “నాకు బాగా ఉంది, వదలండి గురువుగారూ!” అని సగం ఏడ్పుగా అంది. ఆ మాట విననట్టుగా కోనంగి భార్యను ఇంకా గట్టిగా హృదయానికి అదుముకున్నాడు.


మధుసూదనం డాక్టర్ రెడ్డికి వెంటనే ఫోను చేసి ఉండెను. మధుసూదనుడు ఫోను కడ నుండి వచ్చి, కోనంగిని పొదివి పట్టుకుని “ఒరే! కోనంగీ!” అని గాథ విషాదపూరిత కంఠంతో అరిచాడు.

కోనంగి ఇంతలో సగం మెలకువ వచ్చి “ఏమిటిది! ఏమిటిది! అంటూ భార్యను అక్కడే ఉన్న సోఫాపై పడుకో పెట్టాడు.

ఇంతలో డాక్టర్ రెడ్డి గబుక్కున వచ్చి, అనంతలక్ష్మిని పరీక్ష చేశాడు.

“అనంతలక్ష్మి! ఎల్లా ఉంది?” అని అడిగాడు.

“నాకు బాగానే ఉంది. వారిని చూడండి, అల్లా ఉన్నారు? వారిస్థితి చూడండి! నాకు భయం వేస్తోందండీ!” అని కళ్ళనీళ్ళు పెట్టుకుంటూ అడిగింది.

డాక్టరు కోనంగి వైపు చూచాడు. కోనంగి చూపులు వెర్రిగానే ఉన్నాయి.

వెంటనే డాక్టర్ “సరోజినీదేవి అనంతలక్ష్మిని ఇంటికి తీసుకుపో కారుమీద. నేను కోనంగిని నా కారుమీద తీసుకువస్తాను” అన్నాడు.

“కాదండీ, నేనూ వారితోనే వస్తాను!” అని అంటూ లేచి భర్త దగ్గరకు రాబోయింది. సరోజినీ చౌధురాణీ వద్దని వారించారు.

ఈ లోగా డాక్టర్ కోనంగిని నెమ్మదిగా కుర్చీలో కూర్చుండబెట్టి నుదురుపై బలంగా చన్నీళ్ళతో కొట్టినాడు. కోనంగి గబుక్కున కళ్ళుమూసుకొని తలఊపి “ఏమిటి డాక్టర్! ఏమిటీ నీళ్ళు?” అని ప్రశ్నిస్తూ లేచి నుంచున్నాడు.

5

జైళ్ళు నిండిపోయారు! జైళ్ళు నిండిపోయారు కాంగ్రెసు భోక్తలు, యుద్దభోక్తలు.

గాంధీజీని గురించీ, క్రిప్సు ప్రతిపాదనలను గూర్చీ లూయీ ఫిషర్ అమెరికా నుంచి ఘాటుగా వ్రాయడం ప్రారంభించాడు.

ద్వేషం ప్రపంచం నిండిపోయింది. విషం మంచులా ఆవరించి పోయింది. కోనంగి భార్యకు బాగా నెమ్మదిగా ఉందని తెలుసుకున్నాడు. కాని ఎందుకోసం డాక్టర్ రెడ్డి అనంతలక్ష్మిని ఆస్పత్రికి ఆరోగ్య పరీక్షార్ధమై పంపించాలన్నాడు? ఆ దినం భార్య తన్ను మాటలతో చీల్చివేసినప్పటినుంచీ కోనంగికి నిస్పృహ ఎక్కువైంది.

బిచ్చగానికి రాజ్యాధిపత్యమా! ఒక దివ్యబాలిక జీవిత చరిత్రలో భాగం పంచుకోవడానికి తనకేమి అధికారం ఉంది? స్వచ్ఛాంబుపూర్ణమై ప్రవహించే పవిత్రాపగలో దుర్వాసనాపూరిత మలిననీరాలు సంగమించడం ఎంత అధర్మ సంఘటనో!

తన మూలాన ఆ స్వచ్చజీవిక, అనంతం ఎన్నో బాధలుపడుతోంది. ఎదురుగుండా తాను కనబడుతున్నకొలదీ, ఆ బాలికకు బాధేగాని విశ్రాంతి ఉండదు. తనలో ఏదోలోటు లేకపోతే అంత నిర్మల హృదయంగల అనంతం తన్ను ఎందుకు అనుమానం పడుతుంది? అనంతం జీవితంలో తన బ్రతుకు సంగమించడానికి కారకుడు తానే! ఆమె జాతకంలో ఓ దురదృష్టముహెూర్తం. తాను వాళ్ళ వీధి ద్వారం దగ్గర నుంచోడం తటస్థించింది.

జైలుకు వెళ్ళి తాను అనంతం జీవితంలోంచి తరలిపోతే, ఆమెకు దుఃఖం ఉపశమనమై కొంతకాలానికి ఆమె సంపూర్ణ శాంతి సంపాదించు కుంటుంది. ఆ తర్వాత ఆమెకు కావాలంటే తాను ఆమె తనకు విడాకులు ఇవ్వడానికి అనుమతించుతాడుగాక! సందులలో తిరగవలసిన తనకు సందులే దిక్కు అవుతాయిగాక!

మరునాడు కోనంగి ఖద్దరుపంచే, ఖద్దరుచొక్క తొడుక్కొని, ఇద్దరు టోపీ ధరించి, గాంధీమహాత్మునిమీద, “క్విట్ ఇండియా నినాదపూరితమై వచ్చిన ఒక గీతాన్ని పాడుకుంటూ, త్యాగరాజనగరంలో ఏకసత్యాగ్రహయుతమయిన ఊరేగింపు జరిపినాడు.

“మహాత్మగాంధీ! క్విట్టిండియాను

మహావాక్కునే

మంత్రం చేశావూ

బ్రిటీషుగుండెలూ పీచుపీచుమన

భేరీనాదం చేశావూ

ఇన్నేళ్ళూ నీమాటే మాకూ

ఎంతో ముందుకు నడిపేశక్తయి

స్వరాజ్యయుగముకు సాగించిందీ

అడ్డంలేనీ వేగంతోటీ

మహాత్మ..........

బ్రిటిష్ ప్రభుత్వపు మాయఎత్తులకు

విరుగుడు శక్తయి విజృంభించీ

హిందూముసల్మాన్

పార్శీశిక్కుల

సంయోగానికి

సాధనమైనావూ

మహాత్మాగాంధీ....

అథోగతిలో పడి అల్లల్లాడే

హరిజనులందరి రక్షించావూ

వారికి హక్కు ప్రథమస్థానము

వారికి తిరిగి ఇప్పించావూ

మహాత్మాగాంధీ!

ఆ పాట పాడుకుంటూ కాంగ్రెసుజండా గాలిలో ఎగురుతూ ఉండగా, ఈక్విట్ ఇండియా, కాంగ్రెస్ జిందాబాద్! మహాత్మాగాంధీజీకి జై!” అని నినాదంచేసి,

“జయ! జయ గాంధీ!

జయ జయ లోకగురూ!

సత్యము ధర్మము చంపిన లోకము

నిత్య పదార్థము ఎరుగని లోకము

అమృతనినాదము నీ జయనాదము

ఆలకించుతూ ఆనందమాయే!

జయ జయ!”

అని మరల పాడినాడు.

అనేకులు ప్రజలు దూరంగా అతని అనుసరించసాగారు. ఇంతలో ఒక పోలీసులారీ వచ్చి, కోనంగి కడ అగింది. పోలీసువారాలు బండిలో నుండి దిగి కోనంగిని అరెస్టుచేసి బండిలో ఎక్కించి తీసుకుపోయారు.

కోనంగి ఎవ్వరితోనూ చెప్పలేదు. అతడు భోజనానికి రాలేదు.

ఉదయమే తిరువలిక్కేళిగోషా వైద్యాలయానికి వెళ్ళిన అనంతలక్ష్మీ, జయలక్ష్మీ, వారి పనిమనిషీ భోజనంవేళకు కారుమీద ఇంటికివచ్చారు. వారి మోములు సంతోషంతో కలకలలాడిపోతున్నాయి. అనంతలక్ష్మి మోము లజ్జారుణ కాంతివంతమై ఆనందపూర్ణమై ఉన్నది.

“నీ మొగుడితో నేనే చెప్పాను అమ్మిణీ!” అన్నది.

అనంతలక్ష్మి ఎప్పుడు భర్త ఆశుభవార్త తెలిసీ తన కడకు పరుగిడి వచ్చి తన్ను కౌగలించుకుంటాడా అని ఉవ్విళ్ళూరుతూ, తాను హాలులో కూర్చొని ఉంది.

వీరిని దింపగానే జయలక్ష్మి తన కారును మధుసూదనుని ఇంటికి పంపింది. ఆ కారు డ్రైవరు వారినందరినీ ఒక శుభ వర్తమానం వినడానికి త్వరగా రమ్మనమని వార్త తీసుకొని వెళ్ళినాడు.

వారందరూ భోజనాలు ముగించి రోజూ వారి కోసం వచ్చే కోనంగి కారుకోసం ప్రతీక్షిస్తున్నారు. కారు రావలసినకాలం అరగంట దాటిపోయింది. కోనంగిగారి కారు బదులు అనంతలక్ష్మి కారు వచ్చింది.

ఏమిటా శుభ వర్తమానమని అందరూ వెంటనే వచ్చారు. కారు మ్రోత వినగానే జయలక్ష్మి వరండాలోకి వచ్చివారి నేదుర్కొని “రండి, మీ అందరికీ పళ్ళు పంచి పెడుతున్నాను” అన్నది.

చౌధురాణి: పిన్నీ! శుభ వర్తమానం ఏమిటి?

జయలక్ష్మి: లోపలికి రా చేస్తాను.

ఇంతలో డాక్టరు కారు వేసుకొని స్వయంగా నడుపుకుంటూ చెమటలు కారిపోతూ ఉండగా, ఏదో కంగారుపడే మోముతో, ఒక నర్సును వెంటబెట్టుకొని వచ్చి దిగాడు. నరూ చపరాసీ పెట్టెలు పట్టుకు దిగినారు.

దిగీదిగడంతోటే “అనంతం యేదీ?” అని జయలక్ష్మిని ప్రశ్నించాడు.

“లోపల ఉంది, నా కబురు మీకూ అందిందీ!” అని జయలక్ష్మి అన్నది.

డాక్టర్: ఏం కబురు?

జయ: మిమ్మల్ని వెంటనే ఒక శుభ వర్తమానం వినడానికి పిలుపు పంపినానుకదా!

డాక్టర్: నాకు ఆఫీసు నుండి ఒక ఉత్తరం వస్తే ఆఫీసుకు వెళ్ళి, అక్కడ వార్త తెలిసి ఇంటికి వెళ్ళి ఒక కేసు ఉంటే మా నర్సును, పనివాణ్ణి తీసుకొని ఇక్కడ కోనంగి ఉన్నాడేమోనని కనుక్కోడానికి వచ్చా! రండయ్యా అందరం లోపలకి వెడదాం.

జయలక్ష్మి నర్సు చేయి జాడిస్తూ “రండి లోపలికి” అని పిలిచింది అందరూ లోపలికి వెళ్ళి కూర్చున్నారు.

అప్పుడు జయలక్ష్మి ముసిముసి నవ్వులు నవ్వుతూ అనంతం ముస్తాబై రావడం చూచి "అందరికీ శుభ వర్తమానం ఏమిటంటే, నాకు ఒకమనమడు పుట్టబోతున్నాడు” అని చెప్పింది.

“ఏమిటీ!” అని అందరూ “ధన్యవాదాలు” అంటూ లేచారు. చౌధురాణీ, సరోజినీ, కమలనయనా అనంతం కడకు పరుగెత్తినారు. డాక్టర్ “నేననుకున్నది నిజమే ఐందా! ఎంత సంతోషం!” అంటూ కరస్పర్శ చేయడానికి లేచి అనంతం దగ్గరకు వెళ్ళినాడు.

6

ఇంతమంది తన్ను అభినందించుచున్నా అనంతలక్ష్మి మనస్సు ఇక్కడ పూర్తిగాలేదు. భర్త ఎక్కడ? తన గురువు ఏరి? ఈ వార్త చెవిని సోకగానే అయన ఆనందమందును. ఆయన తేజస్సు తన గర్భమందున్నది. ఆయన ఆత్మ వేరు రూపమున తన్నావేశించినది? ఆయన తన కర్పించిన ప్రణయజ్యోత్స్నా విలాసములు ఎంత మధుర మయినవి. వారు తన్నెంత ప్రేమించుచున్నారు!

తాను భర్తను కోపించిన పిచ్చితనం ఎంత జుగుప్స కలిగించినది. తన్నే ఆమె కోపగించుకున్నది. ఆ లేడీ డాక్టరునకు ఇవియన్నియు తాను నివేదించినప్పు డామె “వెర్రితల్లీ! ఇదంతా నీ మనోవైకల్యమే. ఆ మనో వైకల్యమంతా నువ్వు గర్భం ధరించడంవల్లనే సంభవించినది. ప్రథమ గర్భధారణ ఇట్టి విచిత్రాల నేన్నైనా చేస్తుంది. వెళ్ళి ఈ శుభ వర్తమానం నీ భర్తకు చెప్పి ఆయన హృదయం కైవసం చేసుకో!” అని సలహాయిచ్చింది.

ఎన్ని చిలిపి చేష్టలు చేస్తూ తన జీవితేశ్వరుడు తన్ను ఆనంద సముద్రంలో ఓలలాడించేవారు! ఎక్కడ ఉన్నారు?

భర్తను తాను వెదకదలచుకోలేదు అనంతం. ఈ శుభ వర్తమానం ఇతరులవల్ల విని వారు తన కడకు పరుగిడి రావాలి. గంట అయింది. రెండు గంటలు కావచ్చింది. ఎంతకూ కోనంగి కనబడడు!

అనంతలక్ష్మి స్నేహితురాండ్రందరూ వచ్చినారు.

“ఏమయినారు? ఎక్కడికి వెళ్ళినారు?

డాక్టర్ అందరితో మాటలు చెబుతూ “అనంతలక్ష్మీదేవీ, జయలక్ష్మిగారూ, మధుసూదనరావూ, సరోజినీదేవిగారూ, కమలనయనా, అమ్మా పార్వతీ అంబుజంగారూ, మీరంతా వినండా. “శ్రీ చౌధురాణీ దేవి నన్ను... నన్ను... వివాహమాడ... అంగీకరించినారని మీకు విన్నవించడానికి ఎంతో ఆనందపడుతున్నాను” అన్నాడు.

ఈ మాటలు అంటాడని తనవైపు డాక్టరు పరపిన చూపులను చూచి అప్పుడే గ్రహించుకుంది చౌధురాణీ. కాని 'కోనంగిరావు అప్పుడే డాక్టరుకు ఎప్పుడు చెప్పినాడు? అని అనుకుంటూ చిరునవ్వుతో కూర్చుంది. ఆమె కపోలాలు కేంపులెక్కినాయి.

అందరు బాలికలు చౌధురాణీని అభినందించారు. జయలక్ష్మి పకపక నవ్వుతూ ఆనందంతో చౌధురాణీ దగ్గరకు వచ్చి గట్టిగా కౌగలించుకుంది. అనంతలక్ష్మి తెల్లబోయింది.

ఆమె అనరాని మాటలు ఆడిపోసుకొని భర్త హృదయమును నొప్పించిన మరుక్షణంలోనే “ఎంత తెలివితక్కువ దాన్ని” అని విచారించింది. భర్త తెల్లబోయి పిచ్చివానిలా అయిపోయినస్థితి చూసింది. ఆమెకు గాఢమైన పశ్చాత్తాపం కలిగి, ఎంతటి మూరురాలను అని లోన దుఃభించింది. ఎవ్వరూ తన్ను భర్త దగ్గరకు పోనీయలేదు ఆ క్షణంలో.

తాను ఎవ్వరో దుష్టురాలిలా, చెట్టిగారులా భర్తను అవమానించింది. రాత్రంతా నిద్రలేకుండా భర్త బాధపడడం చూచింది. తాను గర్భము ధరించితినేమో అన్న అనుమానం ఆమెకు అప్పుడే నెలరోజుల క్రిందటనే కలిగింది. అప్పటికి రెండుసారులు నెల తప్పినది. తనకు కలిగిన వికారము, బద్దకము మొదలయినవన్నీ ఆ అనుమానాన్ని దృఢపరిచినాయి. తన అనుమానం తల్లితో చెప్పింది. “అవునమ్మా! నిజం కావచ్చు. అయితే మన్నారుగుడి స్వామికి భోగం చేయించనా! వెంకటేశ్వరులకు భోగం చేయించి ముత్యాలహారం అర్పించుకోనా!” అన్నది. ఆమే కొమరితను హృదయాని కదుముకొని ఆ రాత్రి దిగదుడుపు తీసి వీధి మధ్య పడవేయించింది..

జయలక్ష్మి కొమరిత స్థితి కనిపెట్టి అనుమానించింది. కొమరితకు తలంటి నిశ్చయం చేసుకుంది. కాని కొమరితతో మాత్రం నిజం చెప్పింది కాదు. శుక్రవారంనాడు పార్ధసారధి కోవెలలో భోగం చేయించింది.

చదువుకున్న బాలిక గనుక ఏమనుకుంటుందో అని తన అభిప్రాయం కూతునకు చెప్పక దాచి, కూతునుంచే మాటలు వచ్చునని కని పెట్టుతూ ఉన్నది. అందుకనే డాక్టర్ “అనంతలక్ష్మిని పరీక్ష చేయించండి!”, అని అన్నప్పుడే ఆయన ఈ రహస్యము గ్రహించినారని అర్థం చేసుకుంది..

అనంతలక్ష్మి ఆ రాత్రే భర్త దగ్గరకు పోయి క్షమాపణ వేడుకుందామనుకుంది. అతని కౌగిలిలో వాలిపోదామనుకుంది. అతని ముద్దులతో పరవశమయిపోదామని ఉవిళ్ళూరింది. కాని కోనంగి తన మాటలను అంతతీవ్రంగా విమర్శించుకుంటాడని ఆమె ఎల్లా గ్రహించుకోగలదు? ఎన్ని సారులో తాను పండుకొన్న మంచంమీద నుండి లేచి శయనమందిరానికి పయనమయింది.

కూతురు ఆమె భర్త దగ్గర కారాత్రి వెళ్ళకపోవడానికి కారణం ఆమె గర్భవతియై కొంచెం అలసత్వం పొంది ఉండడమే కారణమని జయలక్ష్మి అనుకొన్నది.

తెల్లవారగట్ల కోనంగి చప్పుడు కాని అడుగులిడుతూ అనంతలక్ష్మి దగ్గరకు రావడం జయలక్ష్మీ చూచి గాఢనిద్ర నభినయించింది. కోనంగి వంగి అనంతలక్ష్మి మూర్ధముపై మూడు ముద్దులిడి తిరిగి వెళ్ళిపోయినాడు.

ఏమిటిది? ఎంత మెత్తని హృదయం అల్లునిది. ఒక్కనిమిషమూ భార్యను వదలలేడు. ఒక్క పరుసపుమాట ఒక్కరిని అనడు. అందరు సేవకులు అతన్ని ప్రేమిస్తారు అనుకొన్నది.

ఈ రహస్యంకోసమా తన భర్త చౌధురాణీతో రహస్యాలూ గుసగుసలూనూ! ఈ విషయం తనతో చెప్పకూడదా? తానే చౌధురాణీతో మాట్లాడి ఉండునుగదా!

ఒకవేళ చౌధురాణీ భర్తను కోరి డాక్టర్ గారితో మాట్లాడమన్నదేమో? తన్ను కోరకూడదా? తానే డాక్టర్ గారితో మాట్లాడి ఉండునే! అది తన విషయంలో తప్పుకాదా? భర్త ఒక పరస్త్రీతో మాట్లాడడం తప్పని భార్య బాధపడితే, భార్య ఒక పరపురుషునితో మాట్లాడడం మంచిదని తాను ఎలా అనుకోగలదు?

తనలో ఏదో నీరసం బయలుదేరింది. అందుకనే ఉత్తమ పురుషుడయిన భర్తనే తాను అనుమానించగలిగింది. కోనంగేశ్వరరావు భర్తకాకపోతే ప్రాణంపోవడం తథ్యం అనుకున్న తాను, భర్త పరమసుందరమూర్తి అనుకున్న తాను, ఈనాడు వట్టి తెలివిహీనమై భర్తను పదిమందిలో అవమానించ సిద్ధమయింది. ఆయన మనస్సు తన మాటలకు ఎంత నొచ్చుకుందో!

అనంతలక్ష్మి వెంటనే లేచి చౌధురాణిని లోనికి తీసుకొనిపోయి, “అక్కా! నిన్ను అనుమానించి ఎంతో ద్రోహం చేశానమ్మా!” అన్నది.

“ఓసి వెర్రిఅక్కా! నువ్వు నన్ను అనుమానించలేదు. గర్భధారణము నరాల్ని తల్లక్రిందులు చేస్తుంది. సున్నితమైన నరాలస్థితిలో ఉన్న నీకు అన్నీ కంగారుగా కనబడతాయి. నీ ప్రేమ అంత ఉత్కృష్టమయినది ఈ జగత్తులోనే లేదని నేనూ, మనవదిన సరోజినీ అనుకున్నాము కూడా!”

“నువ్వు మీ బావగారితో తప్పంతా నాదేననీ, నేను వారిని నిష్కారణంగా అవమానించాననీ, నేను చేసిన తప్పిదానికి క్షమించమని వారిని పాదాలుబట్టి వేడుకొంటున్నాననీ నా తరపున చెప్పు!”

“ఏమిటక్కా ఆ మాటలు? నీ భర్తను లోకాతీతంగా ప్రేమించే నువ్వు, నీకు ఏమీ సంబంధం లేకుండా, నన్ను పంపుతావా క్షమాపణకు?”

“ఏం చేయమన్నావు?”

“నువ్వే వెళ్ళి ఆయనతో నీ హృదయం విప్పి చెప్పితే చాలు!”

“ఏదీ! పొద్దున్నుంచీ ఎక్కడా కనబడలేదు. నౌకర్లు వారు ప్రొద్దున్నే నడిచి చక్కాపోయినారని చెప్పుతున్నారు.”

“ఇంకో విషయం. డాక్టరుగారికి నా విషయమై శుభవార్త పంపించింది మీ ఆయనే!"

“ఏమిటి! వారేనా?”

“ఇంతకూ కోనంగిరావుగారు ఎక్కడికి వెళ్ళారు?”

అనంతలక్ష్మి, చౌధురాణీ ఇద్దరూ అనంతలక్ష్మి చదువుల గదిలో నుండి ఇవతలకు - వచ్చారు. అక్కడ హాలులో కూర్చున్న అందరూ ఏదో ఆలోచిస్తున్నారు. వారందరూ హాలులో తీవ్రాలోచనాధీనులై ఉన్నారు.

“ఏమిటర్రా మీరంతా అంతతీవ్రంగా ఆలోచిస్తున్నారు?” అంది చౌధురాణి.

“మధుసూదనుడు ఆగస్టు ఎనిమిది పవిత్రమయిన దినం అంటాడు. నేను కాదంటాను” అన్నాడు డాక్టర్ రెడ్డి.

“మీరు కాదంటే కాకపోతుందా అన్నయ్యా, అవునంటే అవుతుందా!” అన్నది చౌధురాణి.

అనంతలక్ష్మి: ఆగస్టు ఎనిమిది మూత్తమ దినమండీ డాక్టరుగారూ!

డాక్టర్: మీ ఆయన అభిప్రాయమే నీ దీనా అనంతలక్ష్మీ?

సరోజిని: భార్యాభర్తల భావాలు ఒకే నదిలా ప్రవహించాలి.

చౌధు: ఆ సూత్రానికి అర్థంలేదు. భార్యాభర్తలైనంత మాత్రాన అభిప్రాయభేదాలు రాకూడదా?

అనంత: చూడండీ మధు అన్నా! మీ చెల్లెలు తాను తన భర్త అభిప్రాయంతో ఏకీభవించడంలేదని ఏమి ప్రతిపాదిస్తున్నదో?

కమలనయన: పెళ్ళి కాకుండా భార్యాభర్తలెట్లా? అనంతం కాబోయే దంపతులు, అప్పుడు లా ప్రకారం. ఇప్పుడు ఆత్మరీత్యా!

చౌధు: అనంతంతో ఎవరు వాదించగలరు బాబూ!

అనంతం: నిన్నే సమర్థిస్తున్నాను కాదా అక్కా?

చౌధు: అవతలవాడి వాదన నెగ్గే ప్లీడరు వాదనలాగా!

7

డాక్టర్ ఇంక తన ధర్మం నెరవేర్చడం ప్రారంభించాలనీ, ఆ ధర్మం కూడా అతి మధురంగా, ఎవ్వరికీ నొప్పి కలగని విధంగా నెరవేర్చాలనీ, తన సంకల్పం విజయమందుటకు తాను గొప్ప నటకుడవ్వాలనీ అనుకున్నాడు.

డాక్టర్: అయితే చౌధురాణీగారూ! -

అనంత: ఓహెూ ఏమి అనుకూలత! కాని కాబోయే భార్యను 'ఏమండీ' అని గౌరవించాలి కాబోలు!

చౌధు: అండీ అనగానే గౌరవం పోలేదు. భార్యాభర్తలు సమానులయినప్పుడు భార్య మాత్రం భర్తను “ఏమండి' అని పిలవాలా? భర్త భార్యను అండీ అని పిలవక్కరలేదూ?

సరోజినీ: మంచి ప్రశ్న వేశావు చౌధూ! ఇంక ఈ మగవారి బడాయిలు చూడు; 'ఓసే, ఇదిగో, అవునే, ఓ తువాలో, ఓ తలుపూ, నిన్నేనే' అనేవే కాదా వీళ్ళ బడాయిలు.

డాక్టర్: ఇంతకూ తన్ను మాట్లాడనీయరు కాబోలు మీరంతా కలిసి.

సరోజిని: మాట్లాడండి డాక్టర్జీ! మేం అనుమతిస్తున్నాం.

డాక్టర్: నాకు ఈ క్విట్ ఇండియా రిజల్యూషన్ అంటే అసహ్యం -

సరోజిని: నాకు చాలా సంతోషం -

చౌధు: నాకు ఎంతో ఆనందం -

అనంత: అదే నిజమైనదని, ఉత్తమ ధర్మమయినది అని నా వాదన.

డాక్టర్: నాకు అసహ్యమయినా, మా వాళ్ళందరూ ఆ రిజల్యూషన్ దేశానర్థదాయకమని వాదించినా నాకు మాత్రం ఈ ఉద్యమంలో తగుశక్తినీ, ప్రాణాన్నీ ధారపోస్తున్న వారిని చూస్తే ఎంతో జాలి కలుగుతుంది.

అనంత: జాలి ఎందుకండీ?

చౌధు: డాక్టరుగారూ, అవసరమైనప్పుడు మీరు కత్తి ఉపయోగిస్తారు కదా; అలాగే భారత జాతీయత అనే మహావైద్యుడు జాతీయ వీరుల రక్తపాతం అనే శస్త్రవైద్యం భారతమాత రోగ నివృత్తికై చేస్తున్నాడని అనుకోరాదూ?

డాక్టర్: మీ ఉపమ మంచిదేకాని వీళ్ళంతా అలా జైలుకు వెళ్ళడం, ప్రాణాలు పోగొట్టుకోవడం నాకేమీ నచ్చలేదు సుమండీ!

అనంత: అలా అంటే ఎల్లాగండీ! భారతదేశంకోసం ఎంతైనా ఆహుతి చేయవలసిందే!

డాక్టర్: అలా మీరంతా అంటారు. నువ్వు జైలుకు వెళ్ళడానికి సిద్ధమా?

అనంత: ఆఁ..

డాక్టర్: మీ ఆయన వెళ్ళడానికి సిద్ధమా?

అనంత: ఆం.

డాక్టర్: చౌధురాణీగారు వెళ్ళడానికి సిద్ధమా?

చౌధు: ఆఁ.

డాక్టర్: మీరండీ సరోజినిగారూ?

సరోజిని: ఆం.

డాక్టర్: సరోజినిగారూ! మీరు మీ భర్తను జైలుకు వెళ్ళడానికి అనుమతిస్తారా?

సరోజిని: అంతకన్న అదృష్టం నాకేమి కలుగుతుంది!

డాక్టర్: నేనే సరోజినిగార్నయితే మధుసూదనుగారికి నా అనుమతి ఇవ్వనే ఇవ్వను.

అనంతం: ఎందువల్ల యివ్వరు. ఒకవేళ మీరే సరోజినీ అక్క అయి, మీరు అనుమతి యివ్వకపోతే మధుసూదను బావగారితో, నువ్వు జైలుకు వెళ్ళవయ్యా అని సలహా ఇచ్చి ఉందును.

డాక్టర్: నువ్వు చెప్తావు. నీ భర్తకు అనుమతి ఇస్తావా?

అనంత: తప్పకుండా, క్రిందటిసారి వారు జయిలుకు వెడితే నేనేమన్నా గడబిడ చేశానా?

డాక్టర్: ఎవరన్నా ధర్మాలు వందల కొలది చెప్పవచ్చును; ఆచరణలోనికి ఆ ధర్మాలను తీసుకుని వచ్చేప్పటికి మన బడాయిలన్నీ బయలు పడతాయి.

అనంత: డాక్టర్గారూ, మీరు ఎన్ని అన్నా నాకు భయంలేదు కాని, మీ మగవాళ్ళు గాజులు తొడిగించుకొని ఇంటి దగ్గర కూర్చుంటున్నారు. మేమంతా ముందుకు దూకదలచుకొన్నాము.

డాక్టర్: ఏమో, నీకు అలాంటి దీక్ష ఉండవచ్చును కానీ, భర్త నిజంగా జయిలుకు వెడితే క్రిందటిసారి జరిగినంత గడబిడ జరుగుతుందేమో?

అనంత: జరగదండీ! (కొంచెం వైవర్ణం పొందుతుంది మోము.)

సరోజిని: మగవాళ్ళందరూ ముందర వెళ్ళుతారా? వెళ్ళేటట్లే మాట్లాడుతున్నారు డాక్టరుగారూ!

డాక్టర్: నాకు నమ్మకంలేదు. నేను వెళ్ళను. కానీ మీమీ సంగతి వివరణ చేస్తున్నా.

చౌధురాణీ: ఆడవాళ్ళం మేం ముందర వెడతాము.

మధుసూదనుడు పత్రికా కార్యాలయానికి ఇంతకు అరగంటకు ముందే వెళ్ళిపోయాడు.

చౌధురాణీ: ఇంతకూ మా అన్నయ్య జయిలుకు వెడతానంటున్నారా?

అనంత: మా గురువుగారూనా?

డాక్టర్: ఇద్దరూ వెడితే పత్రిక మాట?

సరోజిని: మేం ఆడవాళ్ళం లేమా, మాచేత కాదా?

డాక్టర్: మీరంతా పేపరు నడపడానికి పూర్తిగా పూనుకుంటారా?

లేకపోతే మీ కాంగ్రెసు మగవాళ్ళ పిచ్చిపనులులా మీరు కూడా పిచ్చివాళ్ళయి పోతారా?

సరోజిని: డాక్టరుగారూ, ఆడవాళ్ళు పిచ్చివారు కారు, మగవాళ్ళూ కారు, ఇంతకూ మమ్మల్ని ముందు జయిలుకు పోనీయండి.

డాక్టర్: జయిలు ఓ సినిమాలాగ మాట్లాడుతున్నారే!

చౌధురాణి: మీ కమ్యూనిస్టులు కాంగ్రెసుపైకి నల్లేరుమీదకు బండిలా తయారవుతారే! భారతదేశ స్వాతంత్ర్యము మా జన్మాశయం. అందుకై భారత మహిళలు అర్పించిన సేవ వర్ణనాతీతం. మాభర్తలను జయిళ్ళకు పంపాము. వారిప్రాణాలు ఆహుతిస్తే అది అతిపవిత్రకార్యమని ఆనందంలో ఓలలాడినాము. మాబిడ్డల్ని, మాతండ్రులను జైళ్ళకు పంపాము. మేమే ఓలలాడినాము. మేమే జైళ్ళకు వెళ్ళాము. ఇంకా ఎంతో త్యాగం చేయాలని అందుకు మేం సిద్దంగా ఉన్నాం.

డాక్టర్: అద్బుతమైన లెక్చరు. సరే మధుసూదనుగారూ, కోనంగిగారూ జైలుకు వెళ్ళవచ్చునన్నమాట.

సరోజిని: వందేమాతరం! తప్పక!

డాక్టర్: నీ ఉద్దేశం అదేనా అనంతలక్ష్మీ!

అనంత: ఆఁ!

8

డాక్టరుమాట వింటూనే అనంతలక్ష్మికి ఏదో భయం ఆవహించింది. ఏమిటి డాక్టరుగారు యిలా మాట్లాడుతున్నారు? ఏమిటి ఈయన ఉద్దేశం? నిజంగా తన ప్రియభర్తను ఆయన కారాగారానికి వెళ్ళమని సలహా ఇస్తాడా? వారు జైలుకు వెడితే తాను వారిని విడిచి బ్రతుకగలదా? ఆ వెనుక తాను యమలోకమే అనుభవించింది! మళ్ళీ అదేరకంగా వారికోసం బాధగా నిరీక్షిస్తూ ఉండడవలసిందేనా? వారి మాటలు వినక, వారి ప్రేమలో ఓలలాడక, వారి హృదయాన తలవాల్చి వారి లాలింపులు పొందక, నిమిషం ఒక యుగంగా గడుపుతూ, ఏకాకిలా ఉండగలుగునా తాను?

అనంతలక్ష్మి ఆలోచనలకు అడ్డు వచ్చి డాక్టర్ రెడ్డి అనంతలక్ష్మి వంక తిరిగి "అనంతలక్ష్మీదేవీ! నీ భర్త లోకంలోకల్లా మంచివాడు మంచిమాటలు చాటుననుకోవాలి. అతనికి ఈ సమయంలో జైలుకు వెళ్ళాలనిన్నీ, లేకపోతే తాను దేశానికి ద్రోహం చేసినవాడనవుతాననీ బుద్ధిపుట్టింది. నేను వాదించా కాని లాభం లేకపోయింది. నీ ఉద్దేశం కనుక్కోవాలని నిన్ను అడిగాను. నువ్వుకూడా ఒప్పుకోడం నీ గాఢదేశక్తిని తెలియజేస్తోంది. నిజంగా నువ్వు వీరపత్నివి. ఉత్కృష్ట నారీ ధర్మం నిర్వహించే దివ్యజీవనం గలదానివి” అని అన్నాడు.

చూస్తూ చూస్తూ వుండగా అనంతలక్ష్మికి కన్నీళ్ళు తిరిగినాయి. మూత్తమ పురుషుడు తన భర్త. తాను వట్టి మూరురాలయిపోయి, భర్తను అనుమానించి అవమానించింది. ఒక నిమిషం భర్తను వదలి మనలేని తాను ఆయన్ను ఎన్నో అవమానపాలు చేసి ఆయన్ను జైలుకు పంపివేస్తోంది. ఆయన జైలుకు వెళ్ళడానికి సంకల్పించుకొన్నది తన తెలివితక్కువ మాటలవల్లనే! నిజంగా ఆలోచించుకొంటే తన అంతరాంతరాల్లో తాను భర్తను ఎంత ప్రేమిస్తో ఉన్నా ఆయన తన విషయంలో తనకన్న తక్కువవారనీ. తనవల్లనే వీధిలోని ఒక బిచ్చగానిలా ఉన్న భర్త భాగ్యవంతుని ఆనందం సంపాదించుకొనగలిగారనీ అనుకున్నది గదా!

తనలో ప్రేమ తగ్గి ఉండాలి. తనలోని హీనత్వం పైకి ఉబికి వచ్చి ఉండాలి. అందుకనే వారు చల్లగా జైలుకు వెళ్ళాలని సంకల్పించుకొని ఉండాలి.

అనంతలక్ష్మి లేచి గబగబ గదిలోనికిపోయి పడక కుర్చీలో కూలిపోయి భరింపలేని దీనస్థితిలో పడిపోయి కళ్ళనీళ్ళు కారిపోతూ ఉండగా అరనిముసంలో మోము మూసుకొని తలవంచి శోకదేవత అయిపోయింది.

అనంతలక్ష్మి తలెత్తి చిరునవ్వు తెప్పించుకొని “డాక్టరుగారూ, ఆయన జైలుకు వెళతామన్నారా మీతో?” అని ప్రశ్నించింది. “నామీద ప్రేమ పారమా అపారమా?”

డాక్టరు: ఆఁ! ఆ! పారము, జయిలుకు వెడతానన్నాడు.

అనంత: నాతో చెప్పకుండానే!

డాక్టరు: చెప్పాలని చూచాడు. కాని నువ్వు గర్భవతివి

అనంత: మీ మాటలకు అర్థం ఏమిటి? సత్యాగ్రహం చేశారా?

డాక్టరు: చేస్తే? అనంత: చేశారో చెప్పండి!

సరోజిని: చేసి ఉంటే ఆయన పాదాలకు నా నమస్కారాలు.

జయలక్ష్మి: ఏమిటా మాటలు అమ్మా! మీ ఆయన అంత తెలివితక్కువ పని చేస్తారా?

సరోజిని: అది తెలివితక్కువపనా అత్తగారూ?

డాక్టరు: అంత ఉత్తమకార్యం ఇంకొకటిలేదు.

అనంత: ఇంతకూ మీరనేది ఏమిటి?(ఆమె చాలకోపంతో లేచింది) నన్ను వదలి జైలుకు వెళ్ళమనండి. నాకు భయమా? వందసార్లు వెళ్ళమనండి. జైల్లోనే కాపురం పెట్టుకోమనండి.

జయలక్షి: అమ్మిణీ, ఊ కంగారుపడకు!

డాక్టరు:కోపపడకు అనంతలక్ష్మి! గర్భంలోని శిశువును తలచుకో!

అనంత: (నవ్వుతూ) ఏమి చేయమంటారు నన్ను?

సరోజిని: నువ్వు ఉత్తమసాధ్వివి. నీ భర్త ఉత్తమ పురుషుడు. మీ దాంపత్యం ఆదర్శ స్వరూపం. వదినా, నీ ప్రేమకు మా కృతజ్ఞత ఎంతయినా సరిపోదు. నీ భర్త నిన్ను మెచ్చుకోని నిమిషం ఉండదు. నీ పేరు సర్వకాలస్మరణ ఆయనకు.

చౌధు: అనంతలక్ష్మి అక్కా నీ ప్రేమ ఒక దివ్యకాంతిపుంజం.

డాక్టరు: అందుకని నీ భర్త అరెస్టు అయినా నువ్వు ఆనందరూపిణిగా ఉండాలి. అతడు...

9

డాక్టరు “అతడు” అని అనగానే అనంతలక్ష్మి వెలవెలబోయి, కూలిపోయి, కళ్ళు తిరిగిపోయి వెనక్కు వాలిపోయింది.

ఆ వెంటనే డాక్టరు తన చేతికి నర్సు అందించిన ఇంజక్షను తీసుకొని, అనంతలక్ష్మి భుజంపై పొడిచినాడు.

మూర్చపోయినంత పని అయిన అనంతలక్ష్మికి నరాలు బలం పొందాయి. ఆమె కన్నీరుమున్నీరై పోయినది.

ఈ పదినిమిషాలూ అందరూ మాన్పడి ఉన్నారు. అప్పుడు చౌధురాణీ ధైర్యంచేసి “డాక్టరుగారూ! ఏమయింది కోనంగిరావుగారికి?” అని ప్రశ్నించింది.

డాక్టరు సంతోషం వెలిబుచ్చుతూ “ఏమవడమేమిటి? మన కోనంగిని లోకం ఎంతో మెచ్చుకుంటూ ఉండగా వెళ్ళి సత్యాగ్రహం చేశాడు. పోలీసువారు అరెస్టుచేసి తీసుకుపోయారు. అదీ విషయం. ఎంతటి వీరుడు అతడు!” అని అన్నాడు.

జయలక్ష్మి కోపంతో “డాక్టర్! ఓహెూ ఏమి దేశభక్తి! యివతల భార్య గర్భవతికదా! ఇంట్లో భార్యను గురించి ఇంతయినా ఆలోచించకుండా, తనకోసం అని ఏర్పాటు చేసిన పత్రిక సంగతి ఆలోచించకుండా వెళ్ళుతాడా? ఔను, ప్రజలు మెచ్చుకోరు మరి! వాళ్ళదేమి పోయింది? తాము కాకపోతే ఇతరులను ప్రజలు ఎప్పుడూ మెచ్చుకొనడానికి సిద్దమే” అని పొలికేకలు పెడ్తూ జాడించింది.

అనంతలక్ష్మి చివ్వునలేచి “అమ్మా, వారినేమీ అనకు. నాదే అంతా లోటు. పదిమంది ఎదుటా చెప్పుకుంటే చేసిన పాపం కొద్దిగా అన్నాపోతుంది. వారిని అనుమానించాను. నానామాటలు ఆడి అవమానించాను. వారు ఉత్తమ పురుషులు. వారి హృదయం చిందర వందర చేశాను. ఆనాటి వారి నవ్వులో ఎంతదుఃఖమో గర్బితమై ఉండాలి. నా జీవితంలోంచి వెళ్ళి నాకు శాంతిని ఇవ్వాలని సత్యాగ్రహం చేసి ఖైదుకు వెడుతున్నారు!” అని సోఫామీద వాలి మోము వంచేసుకుంది. ఆమె కన్నుల నుండి జడివానలు కురిశాయి.

జయలక్ష్మి తెల్లబోయి ఒక్కనిమిషం కూతుర్ని చూచి “ఔనమ్మా! భార్యభర్తను వెనక వేసుకురాకపోతే ఇంకెవ్వరు వేసుకువస్తారు. ఈ రెండు మూడు రోజుల నుంచీ నువ్వు పడేబాధ అంతా చూస్తూనే ఉన్నాను. నేను పోరుపెడితే నువ్వు విన్నావూ?” అని అన్నది.

అనంత: ఏమి పోరుపెట్టావు? నేను ఏమి వినలేదు? .

జయ: ఎందుకులే!

అనంత: ఎందుకులే ఏమిటి? నీ ఉద్దేశం నాకర్థమయింది. నాకు వారు భగవంతులు. నా సర్వస్వము వారి పాదాల దగ్గర. నీ మనస్సులో ఏ సంకోచం ఉన్నా, నన్ను వారి అడుగునీడజాడల వెళ్ళిపోనీ. ఆయనతోపాటు నేను పాటుబడి ఇంత కలో గంజో త్రాగి బ్రతుకుతాము.

జయలక్ష్మి ఆశ్చర్యమంది “అమ్మిణీ! ఇవేమి మాటలు. యిదంతా నాకా? నీకోసం ఈ జంజాటమంతా పెట్టుకొన్నాను. లేకపోతే నాకు ప్రాణమయినా పోయి ఉండును. సన్యాసిని అయిపోయి ఉందును. నేను మాట్లాడినా, పని చేసినా, బ్రతికి ఉన్నా నీకోసమే” అని అన్నది. ఆమె కన్నులవెంట నీరు జలజలా ప్రవహించింది.

అనంతలక్ష్మి వెళ్ళి తల్లి ఒడిలో వాలిపోయింది. అక్కడ ఉన్న అందరి కళ్ళలో నీళ్ళు తిరిగినవి.

ఆ మరునాడు కోనంగిరావు కేసు విచారణకు వచ్చింది.

కోనంగిరావు తనకు వకీలు అక్కరలేదన్నాడు. పోలీసువారూ, యింకా కొందరు పెద్దలూ సాక్ష్యం ఇచ్చారు ప్రభుత్వం తరపున. కోనంగి అన్నీ ఒప్పుకున్నాడు. తాను చెప్పేది యేమీ లేదన్నాడు. అతనికి మేజస్టేటు ఎనిమిది నెలలు శిక్ష విధించాడు. “ఏ” తరగతి అనుగ్రహించాడు.

అతడ్లి కోర్టు అవరణలో అనంతలక్ష్మి, జయలక్ష్మీ, మధుసూదనుడు. రియాసత్ ఆలీ, సరోజినీ, చౌధురాణీ, డాక్టరు రెడ్డి కలుసుకున్నారు.

అనంతలక్ష్మి గర్భవతి అని తెలియజేశారు.

కోనంగి ఆశ్చర్యానికీ, ఆనందానికీ మేరలేదు. ఆ కోర్టు భవనంలో భార్యాభర్తలిరువురూ విడిగా కలుసుకునే ఏర్పాటు జరిగింది.

కోనంగి వెంటనే అతిప్రేమతో భార్యను కౌగలించుకొని, ఆమెకు దివ్యహృదయ స్పందన స్వరూపాలయిన ముద్దులర్పించాడు.

“నన్ను క్షమింపరూ మాష్టరుగారూ?”

“అనంతా! నా జీవితానివి, నా సర్వస్వానివి. నేను నిన్ను క్షమించడమా?”

అనంతలక్ష్మి భర్త రెండు భుజాలు పట్టి, తల పైకి ఎత్తి అతని మోము తనివ్వ తిలకిస్తూ “మీరు ఎప్పుడు వస్తారో! ధైర్యంగా ఉండండి! మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను” అని అంటూ అంటూ అతని తల వంచి పెదవులపై ముద్దుపెట్టింది.

“నీ ముద్దులో పాపాయి ముద్దును కూడా రుచి చూస్తున్నాను ఆత్మేశ్వరీ!”

“నా యీ రెండు పెదవులలో ఏది పాపాయి పెదవి?”

“పై పెదవే పాపాయి పెదవి అనంతా! జాగ్రత్త, నీ మనస్సు నిర్మలంగా ఉంచుకో. నీ ధనం నీదేశంకోసం సర్వకాలమూ మానవసేవ మసస్సులో తలచుకో! సంతోషంగా ఉండు. లోని పాపాయి ఆరోగ్యం మరువకు. డాక్టరు సహాయం పొందుతూ ఉండు.

“గురువుగారూ! నేను రావాలనే అనుకున్నాను.”

“జైలులోనే పురుడుపోయవలసి వచ్చేది.”

“అయితే ఎంతో ఆనందంగా ఉండును.”

“ఆనందమానందమో! కానీ పండులాంటి తొనల పాపాయిని ఎత్తుకొని ఉండగా తిరిగి వస్తానులే!”

“ఎవరిపోలిక?”

“నీ పోలికే!”

“మగపిల్లవానికి, ఆడవారి పోలిక ఏమి బాగుంటుంది? మీ పోలిక అద్భుతం”

“పోలిక అనగానే ఆడపిల్లవాడు పుట్టాడనా?”

“ఏమో బాబూ! నా పోలిక వస్తే అడపిల్లవాడే ఔతాడేమో!” ఆమె పకపక నవ్వింది. అతడూ నవ్వాడు.

“ఆడపిల్లకు తండ్రిపోలిక రావాలట!”

“ఐతే నాకు ఆడపిల్లే కావాలండీ!”

“అమ్మాయి వస్తే నాతో మాట్లాడవు కాబోలు!”

“మీరు మరీని!”

“నువ్వు మరీ-మరిని!” ఇద్దరూ కౌగలించుకున్నారు.

ఆ రాత్రే కోనంగిరావును వేలూరు జయిలుకు తీసుకుపోయారు.