కొప్పరపు సోదర కవుల కవిత్వము/సంగంజాగర్లమూడి శతావధానము

శతావధానములు

సంగంజాగర్లమూడి శతావధానము

పరిచయము

సుప్రసిద్ధ కింకవీంద్ర ఘటాపంచాననాది బిరుదాంకితులగు శ్రీ తిరుపతి వేంకటేశ్వర కవిద్వయము దేశ దేశాలు తిరుగుచు నానా రాజస్థానములను దర్శించుచుఁ దమపాండిత్య గరిమచే నవధానము లద్భుతముగాఁ జేయుచున్న కాలమది. “ఒక చరణం బతండు మఱి యొక్కటి నేను మఱొక్కటాతఁడున్ సకల కవీంద్ర బృందములు సన్నుతి సేయఁగ” అని చెప్పికొని యిర్వురు నవధానమున వీరవిహారము సలుపుచు సామాన్య జనులకు సైతము పరమానందముఁ గూర్చు శైలిలో పద్యములాశువుగా వచించుచు మెప్పందుచుండిరి.

వీరికి దీటుగా రాఁగలిగిన కవీంద్రులున్నారా? యని సంచరించు కాలములోఁ గొప్పరపు సోదర కవులు ప్రాముఖ్యతకు వచ్చిరి. ఆ కాలపు వైదిక నియోగి? భేదములలోఁ గొందఱు వారిని గొందఱు వీరిని నభిమానించుచున్నను మొత్తముమీఁద సారస్వత ప్రోత్సాహమునేయిచ్చి సత్కరించు చుండిరి. ఆంధ్ర దేశములో నవధానములపుడు మెండుగా జరిగెను. ఈ యవధానములు పండిత కవీంద్రుల ధారణ శక్త్యాదుల నచ్చెరువుఁ గల్గించుచు సభాసదులకు ముదము గూర్చును. ఈ శతావధానము బ్రహ్మశ్రీ కొప్పరపు వేంకటసుబ్బరాయ, వేంకట రమణ జంట కవులచే 1910వ సంవత్సరము మే నెల 18వ తేదీన, తెనాలి తాలూకా సంగంజాగర్లమూడి గ్రామములో, గ్రామ కచేరి హాలునందొనర్పఁ బడినది. తదాది యముద్రితముగానున్న దీనిని బండిత వర్యులు, దానశీలురగు శ్రీ కోగంటి దుర్గామల్లికార్జునరావు చౌదరిగారి యౌదార్యమున వెల్గునకు గొని రాఁబడినది. నేనా శతావధాన సభలో నొక పృచ్ఛకుఁడను. దీనిని మా గ్రామములోఁ బెద్దలు, మా తండ్రిగారగు శ్రీ కొత్త శివలింగయ్యగారు, రామస్వామిగారు, సంగయ్యగారు (గ్రామ మునసబు) గోపాలకృష్ణయ్యగారు, వీరభద్రయ్యగారు, కొల్లి వేంకట సుబ్బయ్యగారు మున్నగు వారు చేయించి, దాతల యొద్ద వసూలు చేసిన సొమ్మును గవులకు నొసంగి సన్మానించిరి.

ఆ కవుల యనర్గళమయిన యాశుధార యందఱిని విశేషముగా నాకర్షించెను. వారా కాలములో జగమెఱిగిన శతావధానులు. మా యన్నగారగు కొత్త సంగయ్యగారు ప్రశ్నములను సిద్ధపఱచిరి. వ్రాఁత ప్రతిలోఁ బోయిన యొకటి రెండు పదములు నేను బూరించితిని.

ఈ గ్రంథమును ముద్రింపించిన నా మిత్రులు శ్రీ కోగంటి దుర్గా మల్లికార్జునరావు గారికిఁ గృతజ్ఞతా పూర్వక నమోవాకములు - భాషా సేవయే పరమావధిగా నెంచి యిట్టి వానిని వారు ప్రచురించి ధన్యులగుచున్నారు.

సంగంజాగర్లమూడి,

20-10-1969

సౌమ్య విజయదశమి

ఇట్లు,

విమర్శకాగ్రేసర

కొత్త భావయ్య చౌదరి

స్వవిషయము

కొప్పరపు సోదర కవుల చరిత్రను వ్రాయవలయునను సంకల్పము చిరకాలము క్రిందటనే నాకుఁ గల్గినది. ఒకనాఁడు గుంటూరు జిల్లాలోని సంగంజాగర్లమూడి గ్రామమునకు వెళ్లి కొప్పరపుఁ గవులను గుఱించి మీకుఁ దెలిసిన విషయములను దెలుపుఁడని విమర్శకాగ్రేసర శ్రీ కొత్త భావయ్యచౌదరి గారినిఁ గోరితిని. అపుడు వారు కొప్పరపుఁ గవుల శతావధాన పద్యములు గల యొక వ్రాఁత ప్రతిని దెచ్చియిచ్చిరి. అత్యంతానందముతో దానిని స్వీకరించి యింటికిఁ దెచ్చి భద్రముగా దాచితిని.

1910వ సంవత్సరము మే నెల 18వ తారీఖున సంగంజాగర్లమూడిలో శతావధానము గావింపఁబడినది. కాని 100 పద్యములు చెప్పలేదు. చిరకాలము క్రిందట వ్రాయఁబడినదగుట వలన నేను స్వీకరించిన తెల్లకాగితముల పుస్తకము ముట్టుకొన్నచోఁ జినిగి పోవునట్లుండెను.

1969వ సంవత్సరములోఁ బ్రచురింపఁ దలఁచి పరిచయమును వ్రాయుఁ డని కోరఁగా శ్రీ భావయ్య చౌదరిగారు వెంటనే వ్రాసి పంపిరి. కాని యపుడు ప్రచురించు భాగ్యము లేకపోయినది. ఇపుడైనను (1971) బ్రచురింపఁ గలిగి సందులకు సంతసించుచున్నాఁడను.

శతావధానమును దయతో నొసంగి పరిచయమును వ్రాసిన విమర్శ కాగ్రేసర శ్రీ కొత్త భావయ్య చౌదరిగారికిని, దొలిపలుకును వ్రాసిన శ్రీ పదుళ్లపర్తి రామకృష్ణమూర్తి ఎం.ఏ. గారికిని నా యభివందనములు.

ఇట్లు,

సజ్జన విధేయుఁడు,

కోగంటి దుర్గామల్లికార్జునరాయకవి

సంగంజాగర్లమూడి శతావధానము

(18-05-1910)

1. హనుమంత స్తవము - లయగ్రాహి

శ్రీ రఘువరేణ్యు పదసారసము నెమ్మి
         భవతారక మటంచు మదిఁ గోరు గుణధామున్
సౌరగిరి ధీరు దివిజారి మదమారణ
         విచారరణ భూతల విహార బలధామున్
సూరిజనవంద్య సువిచారునిఁ
         బ్రభంజనకుమారుని జగద్వినుత శూరగుణధామున్
నేరుపులుమీఱఁగ ననారతము నెంతు
         నతి సారవచనంబుల నుదారమతి యొప్పన్

2.గజలక్ష్మి

గజములు రెండిరు గడలఁ జేరిపయోజ
         ములను బూజింపఁగా ముదముగాంచి
అలఘు సువర్ణ సహస్ర పత్రము పవి
         త్రావాసమై యుండ ననువు గాంచి
అమృతంబు శశియుఁ గల్పాగంబులును దోడఁ
        బుట్టువులై యొప్పఁ బొలుపు గాంచి
మంగళ దేవతా మహిత సమాఖ్యచే
        విబుధులు వినుతింప వేడ్కఁగాంచి

విశ్వ జనకుండనఁగ నొప్పు విష్ణుదేవు
మహిళయై యొప్పు తాలోక మాతయైన
యా మహాలక్ష్మి దేవి యత్యంత సుగుణ
మమ్ము మిమ్మును నిరతంబు మనుచుఁ గాత

3. పంచముఖాంజనేయ స్తవము

కల్పాంత పవసుఁడై కరిన శత్రువనాLi
        మొదలంటఁ బె̃riకెనే భూరి బలుఁడు
పంచాస్య వక్త్రుఁడై ప్రకటారి గజముల
        వధియించె నేలోక వందితుండు
క్రోడాస్యుఁడై ద్విషత్కుటిల ముస్తాకోటి
       భక్షించె నేమహద్భాసురుండు
గంధర్వ వదనుఁడై గణ్యంబులౌ చిత్ర
       కార్యముల్ దీర్చెనే కమ్ర యశుఁడు

పద్మ లోచనుఁడై బాలపద్మబంధు
కోటి రుచుల నెసంగెనే గురు గుణాఢ్యుఁ
డట్టి శ్రీ హనుమంతు దయా నిశాంతు
శాత్రవకృతాంతు నతిదాంతు సంస్కరింతు.

4, మనోజ మనోవ్యధ

శతసంఖ్యల్ పదిగాఁగ రూప్యముల వెచ్చంబెట్టితింగాని నా
సతి యీవేళకు రాకపోయే నిఁక నే చంద్రాస్యనుంజేరి యే
గతిఁబ్రార్ధించెద మత్సమానపురుషుల్ కామ్యంబులన్ దీఱిరం
చతులంబైన మనోవ్యధం గనె నొకండాహారనిద్రాచ్యుతిన్

5. వీరభద్రుఁడు

అక్షీణాప్రతిమ ప్రభావముల వహ్న్యక్షుండుదన్ బంపఁగా
దీక్షన్ రూక్షవిషేక్షణ ప్రభలఁబృథ్వీభాగమున్ మాడ్చుచున్

దక్షున్ దన్మఘమున్ మఘప్రియుల విధ్వంసంబు గావించె నే
దక్షుండాతఁడె వీరభద్రుఁడు సుమీ ధాత్రీసురగ్రామణీ!

6. సంగమేశ్వరుఁడు

జాగర్లమూడి పురికడ
బాగుగఁ గృష్ణయును దుంగభద్రానది సం
యోగము గని నట్టి ధరన్
ఈగి వెలయనుండు సంగమేశుఁడు శివుఁడే

7.వనము

మారుతము కేకీరవములు
భూరుహముల లే చివుళ్లు పూ పొదలెసఁగన్
సారతరాత్మోద్భవ సుఖ
కారణమై వని వసంతకాలమునఁ దగెన్

8. కామధేనువు

అంభోరాశిని లక్ష్మితోడ సుధతో నబ్జారి బింబంబుతో
సంభూతంబయి యిష్టదానగరిమన్ శ్లాఘన్ విడంబించుచున్
జంభద్వేషిముఖుల్ నుతింపఁదగు నాస్వర్దేనువున్ భక్తి వి
స్రంభం బొప్పఁదలంతు మన్మతి నభీష్టార్ధంబు సిద్ధింపఁగన్

9. వెన్నెల

కనుగవగల్గు వారికి సుఖంబుగ దర్శన యోగ్యమై కవీ
డ్జనులు నుతింపఁగా దగి ప్రశస్తిని క్షీరసముద్రరాజనం
దన విలసద్ద్యుతి వ్రజముదారతఁ జంద్రికయన్ సమాఖ్యచేఁ
దనరి జగంబునన్ వెలసె ధన్యగుణాకర! చూడు మియ్యెడన్

10.వేణుగోపాలుఁడు

తరువులుఁబల్ చిగుళ్లుఁదగ ధాత్రిధరోరుశిలావ్రజంబులున్
గరగఁగ, గోపికల్ పశునికాయము బిడ్డలయందుఁ బ్రేముడిన్
బరువడిఁబాసి, గానసుధఁ బానమొనర్పఁగఁ దన్నుఁ జేర సు
స్థిరమతి వేణుగానమును జేసిన నందసుతున్ భజించెదన్

11. విఘ్నేశ్వరుఁడు

కార్యారంభములందు నెవ్వని సుధీ కాండంబు ధ్యానించునో
యార్యా దేవియు శంకరుండెవనిఁ బుత్రాపేక్షతోఁ జూచిరో
యార్యుల్ మెచ్చఁగ నెవ్వఁడత్యధిక విద్యాపూర్ణుఁడై యొప్పె నా
చార్యుండెవ్వఁడు సత్కవీంద్రతతికే జైయందు నవ్విఘ్నపున్

12.మోహిని

క్షీరాబ్దిని జనియించిన
సారామృత కలశమును నిశాటులు గొన న
వ్వారిఁ గికురించి మోహిని
యై, రహి హరి సురల కిచ్చే నయ్యమృతంబున్

13. మంగళగిరి క్షేత్రము

ఘనపదంబంటిన గాలిగోపురముచేఁ
         జెలువొందె నేమహా క్షేత్రవరము
సారోదకములచే మీఱిన కోనేళ్లఁ
         జెలువొందె నేమహా క్షేత్ర వరము
పానకాల్ రాయఁడన్ బ్రథగన్న నృహరిచేఁ
         జెలువొందె నేమహా క్షేత్ర వరము
భవ్యనృసింహోత్స వాడంబరంబుచేఁ
         జెలువొందె నేమహా క్షేత్ర వరము

ఎయ్యది తలంప మంగళం బినుమడించు
నది మహాక్షేత్రమను కీర్తి నమరి నట్టి
మంగళగిరి జగజ్జన మాన్య తరము
పురములన్నింటిలో నగ్రసరము సుమ్మి

14. ఆంజనేయుఁడు

ఎవఁడాక్షారపయోథి గోష్పదమనన్ హేయంబుగా దాటెనో
ఎవఁడా లంకను బేదకొంప యన వహ్నిజ్వాలలన్ గాల్చెనో
ఎవఁడా రాముని సీతతోఁ బ్రజలతో నింపొందఁగాఁ జేసెనో
పవనప్రోద్భవుఁడమ్మహామహుఁడు సౌభాగ్యంబుమాకీవుతన్

15. బావి

జీవనము పూర్తిగాఁ దగ
బావులు గ్రామంబులందుఁ బ్రజలకు దిక్కై
భావింప నొప్పు చెఱువులు
పావన జల నదులు లేని బాధలడంగన్

16. తిల పుష్పము

చక్కని కామిని కొప్పెడు
ముక్కునకును బోల్కి గనుచుఁ బువ్వులలోఁ బెం
పెక్కెఁ దిల పుష్పమే సుమి
యక్కొలఁది యెఱుంగఁ గవి హృదంభోజమెకా

17. సభా వర్ణన - తోటకము

ధారుణి దేవులు, ధన్య విచారుల్
బేరులు చూడఁ గుబేర సమానుల్

ధీరులు శూద్రులు ధీమణు లన్యుల్
సారముఁ జూపఁగ సత్సభ యొప్పెన్

18. మామిడి చెట్టు మీఁదఁ జిలుక

పచ్చలును బద్మరాగముల్ ప్రబలునట్టి
గద్దెపైనుండి పాడెడి కాంతయనఁగ
నాకులుఁ జిగుళ్లుఁ గల మావి యందు నిలిచి
చెలువు పలుకులఁ బలికెడి చిలుకఁ గనుము

19. పార్వతీ స్తవము - ఉపేంద్ర ప్రజవృత్తము

ధరిత్రిభృద్రాజసుతామతల్లిన్
సరోజపత్రేక్షణ శంభు పత్నిన్
విరోధి దైత్యాటవీ భీమవహ్నిన్
స్మరింతు దేవిన్ సతి సర్వవంద్యన్

20. శతావధానము

ఒకరడిగిన యది మటి వే
ఱొకరడుగక యున్నఁ గాని యుచితార్ధములన్
బ్రకట మతి నూర్గురికి, డ
య్యక చెప్ప శతావధాన మండ్రు సుధీంద్రుల్

21. విరహ వేదన

మలయ గిరీంద్ర మారుతము మండెడు వేసవి సోకుడైతగన్
జిలుకలు గోరువంకలును సింహములున్ శరభంబులైతగన్
బలువుగ నన్న పానములపై భ్రమ వీడి మనోజ వేదనన్
సొలయుచునుండెనొక్క బిససూనవిలోచనయేమి చెప్పుదున్

22. అష్టావధానము

అష్టావధాన కార్య మ
దృష్టముచేఁ గాక యెట్లు దీర్పఁగ వచ్చున్
కష్టమొ, సుఖమో యది, యు
త్కృష్ట మనీషులె యెఱింగి కీర్తింతు రిలన్

23, సమస్య : నీ వ్రతమాచరించెదను నీటుగనన్ను ననుగ్రహింపుమా

ధీవ్రజ వర్ణనీయ రుచి దీప్త యశోవిభవాభిరామ! ము
గ్ధ వ్రజ కామినీ కుసుమ కాండ! జనార్దన! కృష్ణ! మాధవా!
సువ్రతమండ్రు ద్వాదశిని సూరులు నీ కెపుడిష్టమౌట నా
నీ వ్రత మాచరించెదను నీటుగ నన్ను ననుగ్రహింపుమా

24. త్రిమూర్తి స్తవము

వాణీ నాయకు సర్వలోక రచనా వశ్యాత్ముఁ బ్రార్ధించి ల
క్ష్మీ నాళీక దృగాప్తు రక్షణ కళా స్పీతున్ మదిన్నిల్పి దు
ర్గానాథున్ లయకర్త నెంచెదను దీర్ఘాయుర్యశోభూతు ల
త్యానందంబున నొందఁ గోరి సువచో వ్యాపార పారీణతన్

25. ఉపేంద్రుఁడు - సింహానన వృత్తము

కృపా పయోధిన్ గృతి లోక వంద్యున్
ఉపేంద్ర దేవున్ హుతభుక్ర్పభావున్
విపద్వినాశున్ విపుల ప్రకాశున్
జపంబొనర్తున్ సతతంబు భక్తిన్

26. కలియుగ మాహాత్మ్యము

దాతన్ బేద, ధనాఢ్యునిన్ గృపణు, నుద్యత్పాపి దీర్ఘాయుర
న్వీతున్, సన్మతి నిర్గతాయువును, బృధ్వీశున్ మహావంశసం

జాతున్, భృత్యు సదన్వయప్రభవుగా సల్పన్, గలిన్ బంకజో
ద్భూతుండౌ విధియవ్విధిన్ దలఁప నెంతో చింత వాటిల్లదే?

27. గంగా నది స్తుతి

గంగన్ దోష విభంగన్,
రంగన్నిజ సత్తరంగ రంగ స్థల నృ
త్తాంగీ కృత చక్రాంగ వి
హంగన్, శివ శీర్ష సంగనాత్మ భజింతున్

28. పురవర్ణన - క్రమాలంకారము

వేదవేదాంగాది విద్యా ప్రవీణులై
         సొంపుగా విలసిల్లుచుండువారు
శౌర్యధైర్యౌదార్య చాతుర్య ధుర్యులై
         సొంపుగా విలసిల్లుచుండువారు
ధనధాన్య సంపదుత్తమ భారభరణులై
         సొంపుగా విలసిల్లుచుండువారు
విప్ర గోదేవతా విశ్వాస మూర్తులై
         సొంపుగా విలసిల్లుచుండువారు

బాడబాన్వయులును క్షత్ర వర్యు లర్య
కులులు విష్ణుపదోద్భవుల్ గురుగుణాఢ్యు
లట్టి వారలచే నొప్పినట్టి దైన
చాగరలమూడి భాగ్య ప్రశస్తి గనుత

29.యోగిని

కామ మోహాది విషయ సుఖంబు వీడి
నిలయమును వీడి తల్లిదండ్రులను వీడి

గణ్యమైన తపో వృత్తిఁ గానఁ జేరి
మోక్షమును గన్న యోగినిఁ బొగడఁ దరమె?

30. ముకురము-తోటకము

ధారుణిఁ గల్గు నుదార జనంబుల్
సారె విలాసముఁ జక్కఁగఁ గాంచన్
గోరి క్రయంబిడి కొల్వగ నద్దాల్
పేరిమి గూర్తురు వేశ్మములందున్

31. వైశ్యులు

ఘనకరుణా విశేషమునఁగన్యక నిచ్చలుఁ బ్రోచుచుండఁగా
ననుపమమౌమతిన్ ధనమునార్జన చేసెడివృత్తిఁ గాంచి యె
వ్వని నెటుచూడ గౌరవమవార్యముగా లభియించునట్టులే
యనయముసేయు వైశ్యతతియార్యజనంబులునిచ్చ మెచ్చగాన్

32. ఆఱువేల నియోగులు

రాజాధి రాజ సద్రాజ గౌరవముల
         విలసిల్లు వారాఱువేలవారు
పరిపంథి బంధు రాపద్దాన సంధులై
         విలసిల్లు వారాఱువేలవారు
పతికార్య నిర్వాహ భావ గరిష్ఠులై
         విలసిల్లు వారాఱువేలవారు
సకల కలా కలాపక సత్సమాఖ్యులై
విలసిల్లు వారాఱువేలవారు

మతిమదగ్రణులనఁగ నున్నతి వహించి
వెలయుచుండెడి వారాఱువేలవారు

శంకర కృపానుసార విస్తార వంశ
విభవ యుతులగు వారాఱువేలవారు

33. మన్మథుఁడు

శూర కులాగ్ర గణ్యుఁడన శోభవహించిన మేటి యెవ్వఁడే
దారుణమౌ శిలీముఖముఁ దాల్చిన నొక్కటి రెండుగాఁగనౌ‌
నీరజ సాయకుండు నవనీరజ బాణ మొకండు దాల్చినన్
బేరిమి రెండొకండగును వీరుఁడితండతఁడో గ్రహింపుఁడీ

34. మయబ్రహ్మ

జగతిని నయోమయంబను సంజ్ఞఁ గనిన
లోహమెన్నెన్నొ రీతుల లోకులకు ను
పకృతులుగఁ జేసి సుస్థిర ప్రథను వెలసి
నట్టిఁడైన మయబ్రహ్మ యసఘుఁడు గద

35. విశ్వకర్మ

బ్రహ్మరుద్రేంద్ర దైవశ్రేష్ఠు లెవ్వాని
          హితుఁడుగా మనముల నెంచుచుంద్రు
మనుమయత్వష్ట నామకులైన వారలు
          గురుడుగా నెవ్వనిఁ గొల్చుచుంద్రు
తద్వంశ సంభవోత్తమ గుణ నిధులెల్ల
          వంశకర్తయని యెవ్వాని నెంతు
రన్య జాతీయ శిల్పాచార నిపుణులు
          ధాత యంచెవ్వానిఁ దలఁచుచుందు

రతఁడె కద శిల్ప విద్య నగ్రాసనుండు
విశ్వకర్మాభిధానుండు, విపుల యశుఁడు
గాన నవ్వానిఁ గొలువుమీ మానసమునఁ
బ్రకట సజ్జన చయ సంగ! బసవ లింగ!

36. శివుఁడు గోరిన మోహిన్యవతారము

సారాచారుఁడు శంకరుండొకట నబ్జాతాక్షు వీక్షించి దై
త్యారాతీ! మునునీవు దివ్యుల నమర్త్యశ్రీకులన్ జేయ నా
రీరత్నాకృతిగాంచినాఁడవఁట, యాస్త్రీరూపమున్ జూపుమం
చారూఢిన్‌దను వేడఁ జక్రి సతియై హర్షాత్ముఁ జేసెన్‌హరున్.

37. యౌవన స్త్రీ

సరసిజవైరివైరులను జక్కఁగ గెల్చు కుచద్వయంబుతో
సరసిజ వైరి వైరి నగఁ జాలిన మేలగు మధ్యమంబుతో
సరసిజ వైరి వైరి నెకసక్కెము లాడెడు కప్పు కొప్పుతో
సరసిజగంధివచ్చె మరుసాయకమోయన సుబ్బయాహ్వయా!

38. కాంత

చన్నులు పైడికుండలకుఁ జక్కదనంబును గూర్చుచుండఁగా
గన్నులుగండు మీలకును గల్కితనంబును నేర్పుచుండఁగాఁ
జెన్నగు వేణి కృష్ణఫణి చెల్వముతో జగడంబు లాడఁగాఁ
గ్రొన్ననఁబోడి వచ్చెనదిగో కనుగొమ్మిఁకవీథి, మిత్రుఁడా!

39. సంగమేశ్వరస్వామి రథము

హరువుగను చిత్రతర విగ్రహములతోడ
వేడ్క నింపెడు ఘంటికా వితతితోడ
వన్నె మీఱెడు పటముల చెన్నుతోడ
సంగమేశ్వరు తేరు హొరంగు మీఱు

40. యాజ్ఞవల్క్య ఋషి

మును వైశంపాయన ముని
ఘన కరుణను నేర్పి మఱలఁగా నిమ్మన, న

ర్పణఁ జేసి నిగమమును సూ
ర్యుని దయఁ గొను యాజ్ఞవల్క్యు రూఢిఁ దలంతున్

41. పాంచాల పురుషుఁడు

అధిక విద్యా రహస్యజ్ఞుఁడై చెలువొందుఁ
         బాంచాల పురుషుఁడెప్పటికిఁ జూడ
అఖిలావనీపాల నాయత కీర్తియౌ
         పాంచాల పురుషుండెప్పటికిఁ జూడ
సకల జనావన ప్రకట సుస్తేముఁడౌ
         పాంచాల పురుషుఁడెప్పటికిఁ జూడ
నాయక గణములో నాయక మణియగుఁ
         బాంచాల పురుషుఁడెప్పటికిఁ జూడ

పద్మినీ కామినీ రతోద్భవ ముద ప్ర
భరిత హృదయుఁడు పాంచాల పురుషుఁ డెపుడు
దైవ కార్యానుకూల సద్భావుఁడగుచు
ధరణిఁ జెన్నొందుఁ బాంచాల పురుషుఁడెపుడు.

42. కన్యక

మును పేరుగన్న పెను గొం
డను బుట్టియు విష్ణువర్ధన ధరాధవుఁడే
తను గోర శపించియు వై
శ్య నికాయముఁ బ్రోచు కన్యకాంబను గొలున్

43. సంగమేశ్వర స్తవము

శ్రీమద్దరాభృత్యుతామేయమాన మా
         నస హంసమా! వందనమ్ము నీకు

చంద్రరేఖా సమాసంగ రంగద్విహా
         యస నదీ జూట! జోహారునీకు
దక్షాధ్వరాగత దైవతాగవ్రాత
         కులిశోపమా! గిడిగుడులు నీకు
ప్రతి పక్ష రాక్షస ప్రాణధారాధర
         వాతూల సమరూప! జోత నీకు

హిత జనామోదదా! నమస్కృతులు నీకు
డమరుకాంచిత హస్త! దండంబు నీకు
శంబరాహిత! హర! ప్రణామంబు నీకు
సంగమేశ్వర దేవ! యంజలులు నీకు

44. పురవర్ణన

స్నాన సంధ్యాద్యనుష్ఠాన కర్మఠులైన
        బ్రాహ్మణావళులు శోభను వహింపఁ
దతగుణాభరణోచిత ప్రాభవులు నైన
        క్షత్రియకులులు హెచ్చరికఁ గాంచ
వ్యాపార లాభ సంభరిత సంతోషులై
        బేరులు మిక్కిలి పెంపు గనఁగ
నఖిల గుణంబుల కాధారులై కీర్తి
        ప్రౌఢికెక్కిన యంఘ్రిభవులు వెలుఁగ

సంగమేశ్వరు కరుణారస ప్రవర్ధ
మానమై ధారుణీ స్థలి మహితమైన
యశము చేతను జెన్నొందు ననవరతము
వేడుకల మీఱు జాగర్లమూడి పురము

45. ఆంజనేయ స్తవము

ఎవని శౌర్యము విన్న నెడదలోఁ జెయివెట్టి
         కలచి నట్టడలు రాకాసి మూఁక
ఎవ్వాని నుడివిన నెల్ల గంధర్వ కి
         న్నర సుర నాయకుల్నతులుసేతు
రెవ్వాని సడిగన్న నెల్ల భూతాదిక
         గ్రహము లెల్లపుడుఁ జీకాకుఁ జెందు
నెవని నామము విన్న నెంతయుఁ దమపాలఁ
         గలుగు వాఁడని భక్తగణము దలంచు

నట్టి దేవాది దేవు మహానుభావు
శంకర కుమారు భక్త కలంక హారు
రామకార్య విచారుఁ బ్రోద్దామసారు
నఖిల గుణవంతు, హనుమంతు నభినుతింతు

46. కామినీ గర్హ్యము

మదిమోహంబిడు చన్నులన్దలఁపఁగా మాంసంపుఁబెన్ముద్దలౌ
ముదమున్‌జూపెడి కన్నులన్దలఁప నెప్డున్ నీర్పుసుల్తావులౌఁ
గద! యక్కాంతను గూడువారలకు మోక్షంబిల్లయౌఁగీర్తిసం
పద శూన్యంబగు నంచు వేదవిదు లేపట్ల న్విచారింతురౌ

47. హనుమద్దండకము

శ్రీకౌంజరీగర్భవారాశిరాకాసుధాధామమూర్తీ! జగత్పూర్ణకీర్తీ! లసత్సత్య మార్గానువర్తీ! సురానీక సంతాపకృత్సర్వపూర్వామరౌఘాటవీ వీతిహోత్రా! దయాపాత్ర! గీర్వాణ రాజా బభూ యక్ష రాట్పన్నగ ప్రేత రాడర్చితోద్యత్ప్రభా వాంఘ్రియుగ్మా! దశస్యందనాపత్య భక్తాగ్రణీ! శ్రీ హనూమంత దేవా! నమస్తే! నమః 48. హంస - మత్తకోకిల

సారసాసను వాహమన్న ప్రశస్త కీర్తి వహించియున్
నీరుపాల్ విభజింపఁగా దగు నేర్పు గాంచియు నీరజా
గారమెప్డు నగారమౌచు వికాస మందఁగఁ జేయుచున్
మీరు హంసము నెన్నుమా మది మిత్రుఁడా! శుభపాత్రుఁడా!

49. వీరరాఘవస్వామి స్తుతి

కవిరాజుల్ నరరాజ ముఖ్యులెపుడే కల్యాణుఁ గీర్తించి దు
ష్ట వికార శ్రమకారణాఘ సమితిన్ జక్కాడి సేమంబులన్
బ్రవిలాసంబులఁ గాంచి మోక్ష నిధులై వర్ధిల్లి రా వీరరా
ఘవదేవున్ నుతభావుఁగొల్చెదను సౌఖ్యంబెప్డుఁ జేకూర్పఁగన్

50. మృదంగము

ప్రమదము మదికిడు సంగీ
తమునకు వన్నియను బెట్టఁదగి, లయగతిచే
నమితరవముఁ గొనిన మృదం
గమునెన్నఁగ వలదె? యెట్టి ఘనుఁడైన ధరన్

51. స్నేహితుఁడు (రేఫ ప్రాస)

కరమగుకష్టసంఘముల ఖండనముం బొనరించి యాత్మకున్ బరమముదంబుఁగూర్చుసుగుణవ్రజమున్ మదికెక్కఁ జేయు దు
ర్భరమగు చింతలం గెడపు ప్రాణముకన్నను బ్రాణమైతగున్
ధరణిసుహృద్వతంసుఁడు యధార్ధము కీర్తిరమాధురంధరా!

52. శ్రీరాముఁడు

ఘోర విపత్పరంపరలు గూర్చెడు పంక్తిగళోరు శక్తిచే
దారిత సత్తులై ముని వితానముతో సురలా మురారినిన్
జేరి యెఱుంగఁ జేయ నవనిన్ రఘువంశమునందుఁబుట్టియా
దారుణశత్రురావణు వధం బొనరించెను శౌరి, రాముఁడై.

(సంపూర్ణము)