కొప్పరపు సోదర కవుల కవిత్వము/గుంటూరు శతావధానము

శ్రీ శారదాంబాయైనమః

గుంటూరు శతావధానము

పీఠిక

శ్రీ బాలసరస్వత్యాశుకవిచక్రవర్త్యాద్యనేక బిరుదాంచితులగు బ్రహ్మశ్రీ కొప్పరపు సోదరకవు లాంధ్రదేశమున ననేక ముఖ్యస్థానములయందు నాశుకవిత్వ శతావధానాష్టావధానములు నిరాఘాటముగసల్పి తమకీర్తి యెల్లయెడల వ్యాపింపఁ జేసిరి. మా గుంటూరుపుర వాస్తవ్యులును గొలది కాలముక్రిందట వారి యాశుకవిత్వ ప్రౌఢిమనుగాంచి మెచ్చి వారికిఁ “గుండినకవిహంస” బిరుద మిచ్చిరి. ఇటీవల వారి శతావధాన ప్రాగల్భ్యమును సైతము వీక్షింపఁ గుతూహలము కలిగి యందునకొక సభఁగూర్ప నుద్దేశించుచుండ నింతలో విశదలలో శ్రీ చెరుకూరి తిరుపతిరాయ మహాశయుండా సోదర కవులలో నగ్రజుచేతను, బాపట్లలోఁ దత్పుర వాసులనుజుని చేతను శతావధానములు చేయించి మిక్కిలి సంతసించి నూట పదారులు బహుమానములొసంగి వారినత్యంతము గారవించిరి. పిమ్మట ఆ 1911 సం.రం. అక్టోబరునెల ది 1,2 తేదీలను గుంటూరులోఁ గొందరు ప్రముఖులు సభఁగూర్చి సోదర కవులలో అగ్రజులగు బ్రహ్మశ్రీ వేంకట సుబ్బరాయకవివర్యులచే శతావధానమును జరిపించిరి. తొలిదినమున బెజవాడ డి.ము. కోర్టు ప్లీడరుగారగు బ్రహ్మశ్రీ పాటిబండ వేంకటరమణయ్య పంతులుగారును, మఱుదినమున మా పట్టణమందలి మిషన్ కాలేజి నుపాధ్యాయులగు శ్రీమాన్ వంగిపురపు కృష్ణమాచార్యులు బి.ఏ., యల్.టి. గారును సభాధ్యక్షులుగా నుండిరి. మొదటి దినము నలుబదియొక్కరగు పృచ్ఛకులకును, రెండవ దినము మఱిపదుగురిని గలిపి యేబదియొక్కరికిని నవధానము జరుపబడెను. రెండు దినముల సభలకును మా పట్టణములోఁగల ప్రముఖులనేకులు విచ్చేసిరి. అవధానిగారి కవితాధోరణియు, సమస్యాపూరణనైపుణియు, ధారణాశక్తియు నసాధారణములై యొప్పెను. అవధాన మంతమయిన పిదప సభ్యులలో కొందరు పద్యములు రచియించి కవుల నైపుణ్యమును శ్లాఘించిరి. సభాంతమున నీ శతావధాన కవులకు నూటపదారులు బహుమాన మీయఁబడెను. జయజయధ్వనులతో సభముగిసెను. ఆ యవధాన పద్యములునుఁ బ్రశంసాపద్యములును నిందుఁ బొందుపఱపఁబడినవి.

గుంటూరు,

అక్టోబరు, 1911

ఇట్లు,

బుధజనవిధేయుఁడు

కాకాని పుండరీకాక్షుడు

గుంటూరు శతావధానము

(01-10-1911)

గురుస్తుతి

   రామడుగు రామకృష్ణ సు
   ధీమణినిన్ సంస్మరింతు దేశికవర్యున్
   శ్రీమహితుఁ బోత రాట్కుల
   రామకవిన్ దలఁతు సుగురురత్నము ననఘున్

   శ్రీరమణీయులైనృపులు చేరిరి, సత్కవిరాజరాజులున్
   జేరిరి, పండితోత్తములుఁజేరిరి, సజ్జను లన్యులెందఱో
   చేరిరి, విఘ్నమిందొకటి సేరకయుండఁగజూచి నేఁటి గుం
   టూరి శతావధానసభ నొప్పుగ బ్రోవఁగదమ్మ శాంభవీ


1. అడవిలో దొంగలు తండ్రిని జంప నావృత్తాంతము మూఁగ
   యితరునకుఁ దెలియఁజేయుట - భుజంగప్రయాతము

   వనంబందునం దొంగవాండ్రుగ్రులై తం
   డ్రినింజంప దుఃఖంబు వ్రేగౌటచే న

న్యునింగాంచి యవ్వార యుల్లంబు ఝల్లం
చనం దెల్పుఁ దామూఁగహా! హస్తసంజ్ఞన్.

2. గుంటూరు కవిరాజులకు నివాసమని

విక్రమార్కునిచేత విబుధాగ్రసరుల కా
        లయమైన యట్టి యుజ్జయిని యనఁగ
భోజ భూపతిచేత బుధరత్నముల కాక
        రంబైన ధారాపురంబనంగ
వేమభూపాలుచే ధీమన్మణులకెల్ల
        వేశ్మమై తగు కొండవీడనంగ
నల కృష్ణదేవరాయల చేతఁగవులకు
        మందిరంబగు నానెగొంది యనఁగఁ

గవియు నృపవర్యుఁడైన భాస్కరునిచేత
నున్నత పదంబుగొన్న గుంటూరు పురము
నేఁడుఁగూడ సరస్వతీ నిలయమగుచు
వఱలు చున్నది కవిరాజ వరులచేత

3. సమస్య : పశ్చిమదిశ రవియు మనుజు పాపయునుండెన్‌

ఆశ్చర్యమేమి పలువురు
పశ్చిమమునఁజూడఁ దూర్పుపట్టునఁగూడన్
నిశ్చయముగ ననుకొననటు
పశ్చిమదిశ రవియు మనుజు పాపయునుండెన్

4. కలము

కరము ద్విజిహ్వల గరిమ గాంచుటఁ జేసి
         యత్యుగ్ర ఫణిరాజమనఁగవచ్చు

నెమ్మి సువర్ణంబు నిర్మించుటను జేసి
        యల శమంతక రత్న మనఁగవచ్చు
నీలోదకంబుచే నెగడు చుండుటఁజేసి
        యల యమునానది యనఁగవచ్చు
మంచి చెడ్డలనొక్క మాడ్కి నుండుటఁజేసి
        యాత్మార్థ విజ్ఞాని యనఁగవచ్చు

కాగితములను నదులపైఁ గ్రాలు చుంటఁ
గల మనఁగవచ్చుఁ గాన నీకలము మహిమ
మిట్టిదని వర్ణన మొనర్ప నెవరితరము?
రమ్య కారుణ్యగుణసాంద్ర! రామచంద్ర!!

5. ప్రస్తుత శతావధానమును గుఱించి

ధీరాగ్రేసరులైన పృచ్ఛకుల కెంతేఁగోరు వృత్తంబులున్
ఘోరంబుల్ సుకరంబులౌ విషయముల్ కూర్పొప్పఁగాఁజేసిమేల్
ధారన్ ధారణఁజూపిమెచ్చుఁగొన స్వాంతంబందునన్ గోర్కె చే
కూరన్ జేయుచునుంటి నేఁడుసభ నీగుంటూరిలోఁ జూడుమీ

6. చల్లగాలి, చలిగాలి భేదము

మలయ పవమాన మెంతయు
చలిఁజేయదుకాని హృదయసౌఖ్యంబిడు నీ
చలికాలపు పవమానము
చలిచేయుటెకాక హృదయసౌఖ్యం బడఁచున్

7. చాకు

అవసరంబుగల్గి నప్పుడెయ్యదియైనఁ
జెక్కుటకునువీలు చెందునెద్ది
దంతపుటొఱ గల్గి తళ్కుతళ్కను నద్ది
చొక్కమైన యట్టి యుక్కు చాకు.

8. నాటకశాలయందుఁగల యొక తెఱవర్ణన

మత్తేభంబులు లోచనంబులకు నమ్మత్తేభపున్ వాంఛలన్
హత్తంజేయఁగ సర్పసంతతులు భీమాకారముల్ దాల్చియే
చిత్తంబుం బటుసర్పభీతిననుపన్ జిత్రించి యింకెన్నియో
నృత్తాగారమునం దెసంగు తెఱపై నిర్మించినా రద్దిరే

9. విద్యవలన లాభము

పరదేశ సంచార పరులైన వారికి
        విద్య రైల్బండియై వెలయుచుండు
గృహమేధి సద్ధర్మ మహితులౌ వారికి
        విద్యయే విభవాభివృద్ధిఁ గూర్చుఁ
బలురాచ మన్ననల్ వడయు వారికి విద్య
        యే వశ్యమంత్రమై యింపొసంగుఁ
జలముతో వైరుల సాధించువారికి
        విద్య బ్రహ్మాస్త్రమై విజయ మొసఁగు

యశమునకు విద్యయే మేటి యవసధంబు
పరమునకు విద్యయే మంచి పట్టుఁగొమ్మ
పాపగిరులకు విద్యయే వజ్రధార
యట్టి విద్యాధిదేవత నభినుతింతు.

10. రక్తంబంచును నిర్మలోదకమునుం ద్రావంగ శంకించెఁదాన్‌

రక్తాంభోజ సమాన పాణియగుచున్ రంజిల్లు బింబోష్ఠి ధీ
శక్తుల్లేమిని ముగ్ధ గావునఁ బిపాసాయాసముం దీర్ప నా
సక్తిన్ దోసిట బట్టి కేలుగవఁ గెంజాయల్ విడంబింపఁగా
రక్తంబంచును నిర్మలోదకమునుం ద్రావంగ శంకించెఁదాన్

11. వృద్ధునకు బాలునకుఁ బోలిక

ఒరుల సహాయముండవలె నొప్పుగ వానికి వీని కెయ్యెడన్
గరచరణాదులున్న నధికంబగు లాభములేదు మాటనే
ర్పరి తనమింతలేదు మఱివానికి వీనికి నట్లుగావునన్
సరిగను బాలువృద్ధుని నిజంబుగఁ బోల్పఁగవచ్చు మిత్రుఁడా.

12. అవసరమైనప్పు డొరునిదేవిరించి, అవసరములేనపు డెన్నండు నతనిఁజూడనివానివలె నటించువాఁడెట్టివాఁడనుటకు

అబ్బినచో సిగ నబ్బకుండినం గాళ్లుఁ
          బట్టఁగాఁదలపోయువాఁడుగాక
యొక వేళఁదల్లి వేఱొకవేళ నాలని
          పలుకంగఁ దలపోయువాఁడుగాక
తండ్రియెవ్వఁడునాకు దైవమెవ్వఁడటంచుఁ
          బలుకంగఁ దలపోయువాఁడుగాక
పాపంబు ననృత మాభరణంబులుగ నెంచి
          పలుకంగందలపోయువాఁడు గాక

తనకుఁ దఱి యబ్బినపుడు పాదములుపట్టి
వానికబ్బిన నేయూరివాఁడవనుచు
నడుగ నేర్చునె యన్యుఁడైనట్టివాఁడు
నిర్భయంబైన తనశక్తి నిగ్గుదేర.

13. నాటకములు చూచుటవలని లాభనష్టములు

వనితల్ పూరుషులున్ మనోభవ కళావైదుష్యముల్ చూపుచోఁ
గనుటన్ దద్గత చేష్టలం దొరయు సుత్కంరన్ గడుం గీడగున్
ఘనులౌ వారి సువృత్తముల్ గనుట విజ్ఞానంబు ప్రాప్తించుఁ గా
వుననే నాటకమున్ గనుంగొనిన ముప్పున్ మెప్పుచేకూరెడున్.

14. గోలకొండ, పూలదండ, కొత్తకుండ, మాలముండ అను పదములు వచ్చునట్లు రామాయణ కథ

నీనాథుండన గోలకొండపయి నెంతేనుండు నవ్వారితో
నీ నాఁడంబుధి దాఁటివచ్చు టెఱుఁగండేమందు నా రాఘవో
ర్వీనుండిప్డెద పూలదండ పయిఁబైరేకొత్తకుండంగ గె
ల్పూనన్ రామనమాలముండ దనుటెట్లో తెల్పుమండోదరీ!

15. పుల్లివిస్తరాకు

అన్నముం బుల్సు మజ్జిగ యాదిగల్గు
నవిభుజించి యనంతరం బందుఁబాఱ
వైచువిస్తరి యెండఁగావచ్చును పులి
యా కనెడునామ మద్దాని కర్హమగుచు

16. లవంగము

కారంబుగల్గి సౌఖ్యము సంఘటించుచు
        నెద్ది ప్రసిద్ధితో నెసఁగినదియొ
పైత్యదోషంబులఁ బాపు సమర్థత
        నెద్దిప్రసిద్ధితో నెసఁగినదియొ
తాంబూలమొనరింపఁ దగువస్తువులలోన
        నెద్దిప్రసిద్దితో నెసఁగినదియొ
దుర్గంధములనెల్లఁ దొలగించు లీలల
        నెద్దిప్రసిద్ధితో నెసఁగినదియొ

అయ్యది లవంగమనునది యబ్జగంధు
లెందఱోకర్ణ భూషగా నిచ్చగింతు
రెన్నియో యౌషధంబుల కిడు సహాయ
మది ప్రతిమనుష్యుఁ డార్జింపనగును జుమ్ము

17. దశావతార కృత్యములు

మత్స్యరూపమున సోమకు నుక్కడంచెఁ దాఁ
         గూర్మాకృతిని దరికొండనెత్తె
గిటియై హిరణ్యాక్షుఁ బటుశక్తిఁ ద్రుంచె నృ
         సింహుఁడై ప్రహ్లాదుఁ జెలిమిఁ బ్రోచె
వామనుండై బలి వైభవంబు హరించె
         భృగురాముఁడై రాజవితతిఁ గూల్చె
దశరథ రాముఁడై దశకంఠుఁ దునుమాడె
         హలియై ప్రలంబ ముఖ్యుల వధించె

బుద్ధుడై నేర్పె శ్రితులకు భూతదయను
గలికియై దుస్స్వభావుల గర్వమడఁచె
నట్టి దేవాది దేవు మహాను భావు
సిద్ధముగఁగొల్తు నిష్ట సంసిద్ధి కొఱకు.

18. సిరాబుడ్డి - మహాస్రగ్ధర

అవనిన్ వేలేఖకుల్ వ్రాయఁగ దలఁచి కలంబందియున్ గాకితంబం
దివిధిన్ దేనిన్ దలంపన్ దివుటఁగనియె దానిన్ సిరాబుడ్డి యందుర్
కవులెన్నన్ గుండ్రనై సోగయయి వెడలుపై గ్రాలి లోతై రహించున్
వివిధోద్యత్కాన్తులొప్ప న్వెలయు నది జగద్విశ్రుతంబౌచు నెందున్.

19. తలవెండ్రుక - స్రగ్దర

ఆంభోజాతాక్షి వేణిన్ హరువుగనిన రోమాతి సౌభాగ్య మెంతే
సంభావింతున్ బయోముక్సముదయరుచులున్ స్పారరోలంబకాంతుల్
శుంభద్ధ్యాన్తప్రభల్ హెచ్చుగఁగొనివిధి మెచ్చొప్పఁగాఁ గూర్చియాపై
జంభద్విడ్రత్న రోచుల్ చమిరి యొనరుపన్ జక్కనౌ తీవెయో నాన్.

20. తీసివేసిన గోరు

కష్ట సుఖంబుల గణియింప కుండిన
          పూరుషు నొక్కనిఁ బోల్చవచ్చు
నయమింత లేక యనామధేయుండైన
          పూరుషు నొక్కనిఁబోల్చవచ్చు
నిత్యంబు పరుని నిందించుటే పనిగల్గు
          పూరుషు నొక్కనిఁబోల్చవచ్చు
తన తప్పెఱుంగ కన్యుని తప్పు వెదకెడి
          పూరుషు నొక్కనిఁబోల్చవచ్చు

నవసరంబైన యపుడు కవ్యగ్రగణ్యు
లిట్టి విషయంబులకును దానిక్క యనఁగ
గొప్ప పదవి వహించిన గుఱుతెఱుఁగక
తీసివేసిన గోరని తెగడఁదగునె.

21. గుంటూరు కాలేజి ప్రిన్సిపాల్ యూల్ దొరగారిని గుఱించి - తరలము

అమెరికాన్ జనియించి సర్వకళాఢ్యుఁడై యిపుడిండియాన్
సుమహితంబగునట్టి గుంటురుస్కూలులో నధికారియై
విమలబుద్ధుల నెల్ల బాలురు విద్య నేర్వఁగ నేర్పి తా
క్షమయు శాంతి యెసంగ యూల్ దొర చాలకీర్తిభరించుతన్

22. సమస్య : రోమము సౌఖ్యమిచ్చుచును బ్రోవనిచో యశమెల్లఁ బాడగున్‌

ఏమొక పక్షమూనుకొనుటేటికిఁ బౌరులమౌటఁ జేసి మా
కేమిటనైనఁ గష్ట మొకయించుక రాదది యెట్టులన్న సం
గ్రామమునం జయంబుఁగొని కౌరవ పాండవులందు వీరొ వా
రో మము సౌఖ్యమిచ్చుచును బ్రోవనిచో యశమెల్లఁ బాడగున్

23. వార్తాపత్రికల యుపయోగము - శార్దూలవృత్తము

ధూర్తుందెల్పు సధూర్తునిం దెలుపు మందుం దెల్పుఁ దెల్పుం బుధున్
హర్తం దెల్పును భర్తనుం దెలుపు న్యాయాన్యాయముల్ దెల్పు దు
ష్కీర్తుల్ దెల్పు సుకీర్తులం దెలుపు దుఃఖిం దెల్పుఁ దెల్పున్‌సుఖిన్
వార్తాపత్రిక దాని లాభములిఁకన్ వర్ణింపఁగా శక్యమే.

24. తాళవృంతము

గాలి యొకింతలేని యెడఁ గల్పన జేసి సుఖంబొసంగు ని
ర్మూలన మాచరించుసుమి ముఖ్యముగా మెయి ఘర్మ బిందువుల్
వైళమ తాళవృంతమది బాంధవమున్ ఘటియించు వేసవిన్
మేలని బ్రౌఢదంపతులు మెచ్చి నిశాసమయంబులం గొనన్.

25. కనుబొమలు

అనువుగ వీక్షణాంబక సహస్రముఁ గూర్చిన శంబర ద్విష
ద్దనువులనంగఁ గన్బొమలు తామర సాక్షికిఁ జెల్వెసంగు యౌ
వన మదమత్తులం గనిన భావసముద్భవ శక్తినిక్కివ
ర్ణన మొనరింపరాని యతిరమ్య విలాసము లావహించుచున్.

26. సమస్య : దారములేకున్న బ్రతుకఁదరమే ప్రజకున్‌

క్రూరుఁడగు కనకలోచను
మారణ మొనరించి ధరణి మనుపఁగ హరి భూ
దారమయి యొప్పె నా భూ
దారములేకున్న బ్రతుకఁదరమే ప్రజకున్

27. అభిమన్యుఁడు చచ్చినవార్తవినిన యర్జునుని గుఱించి

అక్కట వేల్పురా మనుమఁడా హరి యల్లుఁడు నా కుమారకుం
డెక్కడ యొంటి జిక్కి యని నీల్గుట దెక్కడ యిక్కథన్ వినన్

ప్రక్కలుగాదు నా మనము ప్రక్కలుగాదు శరీరమంచుఁ దా
నక్కొడుకుం దలంచి మది నర్జునుఁ డెంతటి చింతఁ జెందునో.

28. మేఘముఁజూచి నెమళ్ళు సంతోషించుట - మత్తకోకిల

ఆకసంబున ధ్వాంతమట్టుల నంబుదంబు రహింపఁగా
వీఁకఁ జిత్రరుచుల్ వెలింగెడి పించియంబుల విప్పుచున్
గేకు లెన్నియొ మూఁక గట్టుచుఁగేక లొప్ప నటించెడిన్
లోకమందున నవ్విశేషమనూన మైత్రినిఁ దెల్పఁగన్.

29. సూర్యోదయము చంద్రాస్తమయము

ఇంద్రాశన్ భువన ప్రియుండినుఁడు చక్రేశుండు చండాంశుఁడై
సాంద్ర ప్రాభవ మొప్పదోఁచుటయు నచ్చాయన్ గనన్ లేక తాఁ
జంద్రుండస్త నగంబుఁ జేరి నదియౌఁ జర్చింప మిత్రుండు ని
స్తంద్ర ప్రజ్ఞను దన్నుఁ జేరునెడ దోషస్వాంతుఁడెట్లొప్పెడిన్.

30. సమస్య : మంచాలన్ బిగియించె గూటములకమ్మా బిందియం దేఁగదే

కంచున్మించును దోఁపఁబాలకయి యాగంబియ్యెడన్ బాలకుల్
కొంచెం బాగక చేయుచుండిరిటఁబాలుం దీయఁ బ్రొద్దేఁగె వే
ఱెంచన్ రాదిపు డాల కాఁపరియుఁ దానేతెంచె యాలస్య మే
మంచాలన్ బిగియించె గూటముల కమ్మా బిందియం దేఁగదే

31. సమస్య : దిరిగిరి సత్పథంబెనసి తేజరిలెన్ విబుధాళి కిక్కయై

గరువముమీఱు వింధ్యమునకంటె సమర్థతఁ జూపఁబూనఁగా
హరునిశరాసనంబను మహత్త్వపుఁ గల్మిని రత్న కూటముల్
మెఱయ సువర్ణ సంపదల మేకొన నిర్జరులెల్ల మోదమం
దిరి గిరి సత్పథంబెనసి తేజరిలెన్ విబుధాళి కిక్కయై

32. సమస్య : గవ్వకుఁ గొఱగావు మేటికవి నెదిరిచినన్‌

ఇవ్వడువునఁ గాకంబా
చివ్వకుఁగాల్ద్రవ్వి మున్నె చెడిపోయితివా
నెవ్వగ పోయెనె యిపుడుం
గవ్వకుఁ గొఱగావు మేటికవి నెదిరిచినన్

33. తేలుకొండికాయ

తాఁకినమాత్రనే దనువుఁగీఱగఁ జేయు
         దండిగా నీ తేలు కొండికాయ
యంటినమాత్రనే మంటఁగల్గఁగఁ జేయు
         దండిగా నీ తేలు కొండికాయ
మొనముండ్లచేబాధ మొలకలెత్తఁగఁ జేయు
         దండిగా నీ తేలు కొండికాయ
తనయాఖ్యకైన యర్ధముఁజూపునన్నింటఁ
         దండిగా నీ తేలు కొండికాయ

యదియు నొకకొన్ని విషయంబులందుజనుల
గౌరవంబందుచుండె జగంబునందు
పనికిరానట్టి వస్తువా పద్మభవుఁడు
సలుపలేదను మాటకు సాక్షియగుచు

34. సమస్య : సతిసతి కలియంగఁ బుత్ర సంతతిగలిగెన్‌

నుతకీర్తిమీఱ లోకం
బతిశయముగ వృద్ధిగనఁగ నాత్మభవ సుఖో
న్నతులు దులకింపఁ బతిఁబతి
సతిసతి కలియంగఁ బుత్రసంతతి గలిగెన్

35. సమస్య : కుక్కుట గృహమందుఁగాక ఘాకములుండెన్‌

ఒక్కఁడగు బోయ పక్షుల
నక్కజముగ నెన్నొ జాతులనఁదగు వానిం
గక్కురితిఁదెచ్చి యొక్కటఁ
కుక్కుట గృహమందుఁగాక ఘాకములుండెన్

36. ఒక పద్యముచదివి తదర్ధమువచ్చునట్లు చెప్పుఁడనగాఁ జెప్పినపద్యము

ఇల సరసజ్ఞవృత్తిని రసేద్దవిలాసమునొందఁబోదుతా
నలవడుకాణరీతినిఁ బదార్ధక సుప్రియతన్ వహింపదౌఁ
గలిగినదోషరూఢి నెసకంపుఁబ్రసాదముఁ గాంచఁబోదు దు
ర్విలసితమైనకాకవి కవిత్వము ప్రాజ్ఞులు మెచ్చ రెంతయున్

37. బైసికిలు - కవిరాజవిరాజితము

అతులితవేగము మీఱఁగఁబోవునహర్నిశ మెయ్యదియన్న యెడన్
క్షితిపయి బైసికిలేసుమి రబ్బరుచేఁదగు టైరు పొసంగ లస
ద్గతులెసగంగ నయోమయ సాధన గౌరవ సంపద పెంపుఁగనన్
బ్రతిమఱిదానికి లేదుగతిన్ బలవంతుఁడు దాని గ్రహించునెడన్

38. విరోధిజుట్టుపట్టుకొని లాగుకొనిపోవుచుండఁగా వాఁడనుకొను విధము-మత్తకోకిల

ఏటికీకలహంబు వీనికి నిట్లు నాకులభించె ము
మ్మాటికీతఁడు జుట్టుఁబట్టియు మానుషంబడఁగింప నే
నేటికీబ్రతుకంది యుండుటనింకనంచు దలంచుఁదా
గాటమౌ నవమాన మెవ్వఁడు గాంచియాత్మభరించెడిన్

39. లక్ష్మి - అచ్చ తెనుఁగు

మెచ్చు లెసంగ లెంకలను మేలుగ నేలఁగజాలు తల్లి ని
ప్పచ్చర మెల్ల (బాపుచును బాగుగఁజూచు వెలంది తమ్మియి

ల్లచ్చుగఁ గాఁపురంబయిన యాకఱి వేలుపుకూర్మి రాణియౌ
లచ్చిని నమ్మి నెమ్మదిని లావుగఁ గొల్వఁగ వచ్చు నేరికిన్.

40. ఒకబోయ కుక్కతో, భార్యతోవేఁటకుబోవుచు మాటాడుట గ్రామ్యము లయగ్రాహి

కుక్కనుసిఁగొల్పుచును గక్కుఱితిఁజూపుచును
         బ్రక్కఁగలయాలిఁగని జొక్కుఁగనిదస్నీ
యక్కయిదియేందే పొయిరెక్కినదెసెప్పఁ గదె
         పక్కలిటుబల్చి తెగ నిక్కెదనఁటేమే
సక్కఁ బులినీళ్ళు రుసులెక్కుతయిదెణ్ణమును
         మెక్కిపులియాఁటకును సొక్కకనుబోలెన్
సిక్కులివియేంటెయనెఁ గొక్కెర విధంబుగను
         గక్కసపురూపొ కడు వెక్కసమెసంగన్

41. సమస్య : ద్రుంచెన్ రామశిరంబు రావణుఁడు సంతోషించిరానిర్జరుల్‌

ఎంచన్ సీతకు మాయసీతఁ దగునట్లేర్పాటు గావించి తా
ద్రుంచెన్ శక్రజితుండటంచనిన దైత్యుండిష్టుఁడై యున్నఁ ద
చ్చంచద్రత్న కిరీట మూడిపడఁ గీశానీకమౌనౌననం
త్రుంచెన్ రామ, శిరంబు రావణుఁడు సంతోషించిరానిర్జరుల్

42. పూర్వపు గురుశిష్యులకు నిప్పటి గురుశిష్యులకు భేదమున్నదా

గురువులయందు శిష్యులకు గొప్పగభక్తి యెసంగు శిష్యులం
దరుస మెసంగు నాగురువులందఱ కప్పటికాలమందు న
గ్గురువులునట్టి శిష్యులొనగూడిరె నేఁడని సంశయింపకో
చరమతి యెందుఁజూచితిమి వారలనీయది నిశ్చయింపఁగన్

43. చెప్పులు - లయగ్రాహి

ఎప్పశువుతోలయిన నుప్పునను వైచి బిగి
          చొప్పడఁగ నెండనిడి కప్పుగొనఁగత్తిన్

జిప్పలుగఁగోసి ముడులొప్పెసఁగనారె
          రవముప్పతిలఁగుట్టనవి చెప్పులన నొప్పున్
సప్పముల కాటువడిఁ దప్పుకొనఁజేయు మఱి
          నిప్పుపయి గాలిడిన నొప్పిఁగొననీకన్
మెప్పునిడుఱాలమఱి ఱప్పలను దేళులను
          దిప్పలను ముండ్లనగు ముప్పు నడగించున్

44. వేదము వేంకటరాయశాస్త్రిగారు

దైవతాంధ్రాంగ్లేయ ద్రావిడభాషల
         నప్రతిమానత నందినాఁడు
ప్రతివాది భంజన ప్రౌఢ ధీశక్తిచే
         ననుపమానఖ్యాతి నందినాఁడు
రసవత్ప్రబంధ సద్రచనాగరిమచేత
         నద్భుతాసమకీర్తి నందినాఁడు
సచ్చాత్రులను గవి స్వాములఁగాఁ జేసి
         యటు నమానుషశక్తి నందినాఁడు

పండిత కవీంద్ర వినుతులు వడసినాఁడు
వేదశాస్త్రంబులకు నందె వేసినాఁడు
చెన్నపురిలోనఁ నేఁడు వసించినాఁడు
ప్రకట వేదము వేంకటరాయశాస్త్రి

45. సమస్య : వైశాఖము మునిఁగిపోయె వననిధి నడుమన్‌

ఆశరులును వేల్పులు నమృ
తాశ వనధి మందరాద్రి నటు దఱవఁగ లో
కేశుకృపలేమి గిరియగు
వైశాఖము మునిఁగిపోయె వననిధి నడుమన్

46. అగ్ని నీటిలోఁ బుట్టి నీటిచేఁ జల్లారినట్లుగా మఱికొన్ని సీసములో వచ్చునట్లు చెప్పుడి

జలముచేఁబుట్టియు జలముచేఁబిమ్మట
          నగ్ని చల్లారిన యట్లుగాఁగఁ
దానురాక్షసుఁడయి తగరాక్షసునిచేత
          నలరావణుఁడు చచ్చి నట్లుగాఁగ
దానుక్కుఁగమ్మియై తగునుక్కు శాణమ్ము
          నం దదితెగిపోయి నట్లుగాఁగ
దానొక్క మత్స్యమై తగమత్స్యమునఁ జేసి
          యసువుల విడనాడి నట్లుగాఁగ

నొక్కవంశంబులోఁబుట్టి యోర్వలేమి
కాపురంబుగనుండిన కౌరవేయ
పాండవేయులు హతులైరి బవరమందు
నరయ నన్యోన్యబాణ ప్రహారగతుల

47. ఏమియులేనిచోట నేమియున్నది

ఇలపై నేమియు లేనిచోట మఱితానేముండునో యంటివౌ
బళిరే యల్ల చిదంబరస్థలమె యాభావంబుఁజూపించెడిన్
గలిమిన్‌గోవెల దేవుడుండెనని వక్కాణింత్రు నిక్కంబుగాఁ
గలయన్‌జూచినఁబోవు సందియము వాక్యార్ధంబులింకేటికిన్

48. గడ్డిపోచ

తెలియక గడ్డిపోఁచ యని తేలికగాఁ బలుకంగవచ్చునే
యిలపయి నట్టి గడ్డిఁదినియేగద యావులు పాలొసంగుఁ బ
ఱ్ఱెలుమఱిగొఱ్ఱెలున్ బ్రతికి ప్రీతినొసంగెడు నిండ్లఁ గప్పనౌ‌
గలిమిని దాననైన నుపకారములిన్నియు నిట్టులుండఁగాన్.

49. భరతఖండము కామధేనువుతోఁ బోల్చుట

షడ్రసోపేత భోజనసౌఖ్యములొసంగ
         నీరెండు సమతచే నింపుఁగాంచు
నవరత్నములు సమున్నత శక్తినీనంగ
         నీరెండు సమతచే నింపుఁగాంచుఁ
జిత్రాంబరంబులు చెలువారఁగనొసంగ
         నీరెండు సమతచే నింపుఁగాంచు
గామ్యార్థములనెల్ల గరిమతోనొసఁగంగ
         నీరెండు సమతచే నింపుఁగాంచు

భరతఖండంబుసుమియిది ప్రణుతిసేయ
గామధేనువుసుమ్మది గణుతిసేయ
నిట్టియీరెంటిసామర్ధ్య మెవ్వఁడేని
వర్ణన మొనర్పకున్న శోభనముగలదె

50. కోతుల యుపయోగము

స్వామికార్యౌఘ నిర్వహణప్రవీణత
         నుజ్జ్వలస్థితి గాంచె నొక్క కోఁతి
మున్నీటి పైఁగొండ లెన్నింటినో తేల్చి
         యుజ్జ్వలస్థితిగాంచె నొక్కకోఁతి
మరణమందినవారి మఱలంగబ్రతికించి
         యుజ్జ్వల స్థితిగాంచె నొక్కకోఁతి
శ్రీరామకల్యాణ సిద్ధి దైవారంగ
         నుజ్జ్వలస్థితిగాంచె నొక్కకోఁతి

యిట్లుగా వర్ణనముసేయ నింతవఱకు
నెన్నియో కోఁతులున్నవి మన్ననమునఁ

బటుప్రబంధంబులందెన్నఁ బడినఠేవఁ
గానఁగోతులమహిమఁ బల్కంగఁదరమె

51. తన్నచిత్ర మను చంపూభారత శ్లోకమునకుఁ దెలుఁగు

అలరు వనమధ్య విహరణం బవధరించు
ధరణిపతి చంద్రహాసపతనము పుండ
రీక తతిమీలనంబు వరింపఁజేసెఁ
గాన నిందేమి చిత్రంబు గలదు చెపుమ.

(సంపూర్ణము)

露露露露嘟嘟嘟

అవధానాంతమున

పండితకవుల యభిప్రాయములు

బ్రహ్మశ్రీ శతావధాని జూపూడి హనుమచ్ఛాస్త్రిగారు

(బెల్లంకొండ రామరాయ విద్వత్కవీంద్రుల శిష్యులు)

శతలేఖిన్యవధాన తంత్రమన దుస్సాధ్యంబు సూ, పైని వ
స్తు తతుల్ గోరిరి చెప్పరాని వవి సంతోషంబుగాఁ బూర్తి చే
సితి వింకేమి కొఱంతలేదు, కవితా సింహాసనస్థాన సం
స్థితిఁ గల్యాణ పరంపరాతి గరిమల్ చేకొంటివో సత్కవీ!

దయగల వాఁడు జీవన ముదారతనిచ్చెడు వాఁడు శుద్ధచి
న్మయుఁడు గుణాఢ్యుఁడాద్యుఁడు సుమాస్త్రునితండ్రి రమావినోది య
ద్వయుఁడల రామమూర్తి కవితారమణీయుల మిమ్ముమమ్మునున్
దయదయివాఱఁబ్రోచుత విధాతయు నాయువొంసగుఁ గావుతన్

బ్రహ్మశ్రీ వులిగుండం రంగరావుపంతులుగారు బి.ఏ. గుంటూరు జిల్లా కోర్టు ప్లీడరు

పెరిమెన్ బొల్చును నీకవిత్వము మహావిద్వాంసులున్ ధీరులున్
గరిమన్ మెచ్చఁగఁజెప్పినాఁడవిఁక నీకావ్యంబు లెట్లుండునో
వెఱఁగౌ నీయవధానపుం గతులనే వేనోళ్ళ గీర్తింపఁగాఁ
బరఁగెన్ భేషన సుబ్బరాయకవి సంభావింపరాదే? నినున్

బ్రహ్మశ్రీ బాలేమర్తి వేంకటసుబ్బయ్యగారు ఉత్పలమాలిక

శ్రీరుచిమించి శారదవశీకరయై నిజజిహ్వలందు సం
చారముసల్పుచుండ నవిచారముచే నవధానసత్సభన్
ధారనుజూపి కల్పనను ధారణశక్తియుఁజూపి సభ్యహృ
త్సారసవీథికర్కులయి చాలవికాసము గూర్చిరౌర యీ
వీరులు కొప్రపుంగవులు వీరికినీడగువారినేరి నీ
ధారుణి నేనెఱుంగనిది తథ్యము సూరిజనంబులార! యీ
తీరునఁగానిచో సకలదేశములం గవిరాజులెల్లరున్
గోరికలూరఁబద్యములఁగూర్చి లిఖించుటెగాక మేటియౌ
గౌరవ మొప్ప హారములు ఘల్లను మేల్జయఘంటికాది శృం
గారపు భూషణంబు లెటుగా నిడిరో యవిచూచువారికిన్
వేఱుగఁజెప్పనేమిటికి వెన్నెలఁజూచుచుఁ జంద్రుఁడేడియన్
వారుగలారెచూడ నటువంటి మహాత్ములజాడ లేడ యీ
ధారణశక్తియేడ యవధానవిధానవిలాసమేడ యీ
భారముఁబూనినట్టి కవిభాస్కరులన్ నుతియింతువీరలన్

బ్రహ్మశ్రీ అమరవాది రామకవిగారు

అరయవిరోధ మేల మనకంచుఁ బరస్పరమైత్రికై సహో
దరత వహించి యాత్మకవితాధిషణోన్నతు లేర్పడంగఁ గొ
ప్పరపుఁగవీంద్రయుగ్మమయి భార్గవగీష్పతు లుప్పతిల్లి రు
ర్వరనటుగానిచో మతికవార్యమహత్త్వము వీరికబ్బునే

బ్రహ్మశ్రీ సేకూరి వేంకటకృష్ణకవిగారు

వర్షాభ్ర గర్జారవంబుల మఱపించు
        పదగుంభనంబుల భద్రపఱచి

జుంటితేనియతేట జొటజొటబొబ్బిల్లు
        సొబగుగా రసముల సొంపునింపి
చిత్తంబుమోదంబుఁ జెంద సద్భావంబు
        లందందు నందంబు చెందఁజొనిపి
మలయానిలప్రభా విలసనంబునఁజొక్కు
        సరణిని సౌఖ్యంబుఁగురియఁ జేసి

యర్ధగాంభీర్య పదశుద్ధు లంతకంత
కతిశయాహ్లాదగరిమల నందఁజేయ
నాశుధారనుఁగాని యత్యంతకష్ట
మైన యవధానములంగాని యధికులెన్ను
కవితఁగాంచిరి సోదరకవులు నిజము
ఆర్యమణులార! సత్కవివర్యులార!!

అరుగు నొక్కొకమాఱు నరుధనుర్జ్యా నినా
          దముతోడ నెదిరి పంతంబులాడఁ
జెలఁగునొక్కొకపరి శ్రీకృష్ణు పిల్లన
          గ్రోవిరావంబుతో గుంజులాడఁ
బరుగిడునొకపరి పంకజాసనురాణి
          మంజీర రవముతో మాటలాడ
నేగునొక్కొకసారి హిమశైలనిస్సర
          ద్గాంగభంగాళితోఁ గలసియాడ

దేశ దేశంబులెల్లను దిరిగితిరిగి
మేటియవధాన సభలఁ దాటోటుగనక
పండితకవీంద్ర గౌరవప్రాభవముల
నందియుండెను వీరి మహాశుధార

తొలుతనుగల్గినంతటనె దొడ్డతనంబెటులబ్బుఁ బిమ్మటన్
గలిగినమాత్ర హైన్యమెటుగల్గును శక్తులఁజూపినంత యం
దలి గుణవర్గమే తెలుపు నల్గురి కెచ్చును దచ్చు ధాత్రిపై
ములగలు ముందుపుట్టిననుఁ బోల్తురె? చేవను చింత చెట్లతో

విశ్రమంబుల వెతకక యశ్రమమునఁ
బ్రాసములఁగూర్పఁ గడఁగండ్లఁబడుట లేక
తోడివారలఁ దమకింత తోడుగొనక
కవితఁజెప్పుట సోదరకవులసొమ్ము

బ్రహ్మశ్రీ కొండముది శ్రీరాములుగారు, ప్లీడరు

నటదీశానజటాటవీ లసదనూనద్యో మహావాహినీ
చటులోత్తుంగతరంగ ఘుంఘుమరవోత్సాహంబొ కాదంబినీ
పటువిస్వానమొ సుబ్బరాయకవితా వాగ్వైభవంబోకడున్
ఘటియించెన్ బరమోత్సవంబు మదికిన్ నానారసాన్వీతమై

అడుగఁగవచ్చుఁ బ్రశ్నముల నజ్ఞునకైనను వానినెల్ల వెం
బడివచియింపఁ గష్టమది పండిత వేద్యము గొడ్డురాలు న
వ్వెడుఁ బ్రసవించుదానిఁగని పిన్నవె యయ్యు మహాద్భుతంబుగా
నుడివితివయ్య మోదము మనోగతినించితివయ్య చాలఁగన్

శారదరాకా నిశాకర కరపుంజ
         మురుతాపమొనరించు విరహికెపుడు
ఉన్నదియున్నట్టు లెన్నఁగాఁదోఁపదు
         పసిరికలైన మానిసికి నెపుడు
శర్కరగూడ విసంబుగాఁ గాన్పించు
         జ్వరమునఁగడుఁగుందువాని కెపుడు

సన్మార్గ వర్తియై చనుదెంచు నినురీతి
         ఘోరంబుగాఁదోచు గూబకెపుడుఁ

గావున త్వదీయమహిత శృంగారలలిత
బహుళ నవ రసాలంకృత భరితకవిత
హృద్యమై కొందఱకుఁదోఁప దేమొకాని
సరసకవికర్ణ పేయమై వఱలుచుండు

కలిగె యశంబుమీకతనం గాశ్యపియందున నాంధ్రవాణికిన్
గలువలఱేని నొక్కరునిఁగాంచియు మిన్నును మన్నుఁగాన కే
మెలఁగెడువార్దికన్నఁ గడుమిన్నగదా దలఁపన్ గళావిలా
సుల మిమునిర్వురన్ గనిన సువ్రతమున్ గనియుంట సత్కవుల్

యశము దిక్కుల రాజిలు నటులఁ జేసి
యాయురారోగ్య భాగ్యంబు లధిక కరుణ
నొసఁగి మిముఁబ్రోచుఁగావుత నసురజీవ
వాతవాతాశనుఁడు చక్రపాణియెపుడు.

బ్రహ్మశ్రీ పుట్రేపు శేషయ్యగారు

కవితా కాంతయు ధారణారమణి సౌఖ్యంబందఁగా వేఁడి మి
మ్మె వరించెన్ జుఁడియీడుజోడనుచు నెమ్మిన్ జాలఁగాంక్షించితా
నవలన్ వచ్చె యశోలతాంగియిటు లాపోయిందఱన్ దన్పు ధీ
రవధాన్యగ్రణులైన మీకుఁ గవితారాజ్యంబు గట్టందగున్

ఆశుకవనంబె వీరలకబ్బెఁగాని
శతవధానంబుఁ జరఁగించు శక్తిసున్న
యనెడివారలఁ దగు దురూహాగ్రహంబు
మఱుఁగుపడె నేటియవధాన మంత్రమహిమ

శ్రీమాన్ తిరుమల శేషాచార్యులు, వేంకట రమణాచార్యులు గార్లు

చరికొండధర్ముఁడన్ సత్కవిచంద్రుఁడు
         నవకంపు మొక్కను నాటినాఁడు
భట్టుమూర్తియనెడి పండితమాన్యుండు
         పొలుపొందఁగా నీరుపోసినాఁడు
అటమాడభూషి వేంకటసత్క వీంద్రుండు
         పెంపొందఁగా నల్లుపెట్టినాఁడు
తిరుపతి వేంకటేశ్వరుల నశ్వరముగా
         సదమలకృపతోడ సాఁకినార

లట్టిదగు నీశతవధానమనెడి లతిక
సరసకొప్పరపుం గవీశ్వరులచేతఁ
బుషితమై విరులందగెఁ దత్పుల్లసుమము
లఖిల వేదులుఁదాల్చెద రౌఁదలలను

మునుశతఘంటసత్కవులమూల్యవచోధను లాంధ్రమండలిన్
గనఁగనొకండొకండయినఁ గన్పడఁడందురు నేఁడుపల్లెటూ
రున మఱిపట్టణంబులను రూఢిగ మేల్గని రాంధ్రభూమితా
గనుఁగొనునోముపంట లనఁగాఁదగదే పరికింపవీరలన్

అమలలతాంత సంగ్రథితమైతగు దారముమేటి వాసనల్
గొమరలరారఁ గాంచుగతిఁ గొప్పరమన్ పురి గొప్పగాంచెనాం
ధ్రమహి తదీయకీర్తిలత తద్దయు నల్లెనటంచునేరికీ
క్రమమునెఱుంగఁ జెప్పవలెఁ గాంచియెఱుంగరె ధీరసత్తముల్

ఒనరఁగమిన్నుముట్టుగతి యోజనఁ జేసియు వ్యర్ధవాక్కులన్
జొనుపక శ్లేషఁగూర్చి మృదుసూక్తులఁ గైతరచించుపూర్వపుం

ఘనుల ప్రబంధ శైలిని సుఖంబుగ నీకవులాక్రమించి రం
చును వచియించుటల్ సహజసూక్తియె దబ్బరకాదు కాదిలన్

ప్రస్తుతంబువిడచి పల్కినపల్కుల
సైచవలయు భవ్యశతవధాన
చాతురీమహత్త్వ సంస్తవ మొనరింతు
మాలకింపుఁడీ నయాఢ్యులార!

ఉత్పలమాలిక

కందువమాటలున్ జిగి నిగారపుచేఁతలు జిగునీళ్లు పెం
పుం దనరార నాయకుని ముందనువొందు నవారవిందనే
త్రం దలపించుఁగైత తనుదానె వరించుటఁజేసి సద్యశం
బందిచెలంగి నేఁటిసభయందుఁ గవీంద్రులు భూపురందరుల్
డెందములందు మోదమువడిన్ జివురింపఁగ మెచ్చమమ్ముబోం
ట్లం దతమోదవాక్యముల నాణెముగాఁగడుఁ దేల్చి కోరిన
ట్లెందఱకెన్ని పద్యములొ యెట్టులనుండిన మేలుమేల్ రసం
బందునఁబుట్టునట్లె వెఱఁగందఁగఁదెల్పె నిఁకెట్టులెందునేన్
గందుమె విందుమే సుకవి కాండములో నిటువంటివానిసం
క్రందన రత్న రాజులును రాజమణుల్ మగఱాలుముత్తెముల్
వందలు వేలులక్షలయి వర్షముగాఁ బడినట్లు పద్యకో
టిం దగులీలఁ బైవిసరి ఠీవవధాన మొనర్చెఁ దమ్ముఁడా
నందముతోడఁ బజ్జఁదగ, నవ్వులకేనొరుసాయమంద కే
మందు మమందధీబలవిహారుఁడు ధీరుఁడు సుబ్బరాయఁడే
మిందులకొక్క మాలిక మెయిన్ రచియించితిమబ్బురంపుఁగై
తం దిలకించినట్టి గుణధాములకిద్ది హితంబెకావునన్

బ్రహ్మశ్రీ బాలకవి బడుగు నరసింహము

అరయంగ మీవంటి యవధానులీలోక
          మందు లేరంచు నే నందుమిగుల
నిట్టికవితఁజెప్పు నట్టివారీలోక
          మందు లేరంచు నే నందుమిగుల
నిన్నిబిరుదులను గొన్నవారీలోక
          మందు లేరంచు నే నందుమిగుల
నిట్టులీజయఘంటఁ గట్టువారీలోక
          మందు లేరంచు నే నందుమిగుల

మఱియు మీరలు కవితను మన్ననంబుఁ
జేయుచున్నారఁటంచును జెప్పఁగలను
మిమ్ముఁబోలెడు కవులు లోకమ్మునందుఁ
బరులెవరు లేరటంచు నేఁబల్కఁగలను

మిమ్ము నుతియింప నాకుఁ దరమ్ముగాదు
కలహభోజనుతండ్రికిఁ గాదుతరము
పాపరేనిమాట తలఁపనోప దట్టి
తమకు స్వాగత మియ్యది దయనుకొనుఁడి

మోముఁజూడంగఁజంద్రుని గోముఁబోలుఁ
గవితఁజూడంగఁబెద్దన్న కవితఁబోలు
ధైర్యమదిచూడ దశరథ తనయుఁబోలు
మాటయొకటియె యమృతంఫు తేటఁబోలు

మీదుసభ యనుమాత్రాన మిక్కుటముగ
జనులు సంభ్రమ మొందుచుఁ జక్కఁగాను
వీరలు చిరాయురున్నతి వెలయుచుందు
రనుచునున్నార లీగ్రామ మందునిజము

కొప్పరపుకవులార మీ గొప్పతనము
నింతయని వర్ణనముసేయ నెవరితరము?
కాని నాచేతనయినంత గాను నాదు
సంతసంబును వెల్లడి సల్పుకొంటి.

శ్రీమాన్ వింజమూరి రంగాచార్యులుగారు

నలువ ముఖంబుల నెప్పుడు
నలువుంగను పలుకు చెలువ నలువకొలంబన్
కలశోదధి కిందు లనన్
మెలఁగుట భావ్యంబెకాన మీకడ మెలఁగున్

శతఘంటకవనమ్ము సల్పఁజూచినయెడ
          మూర్తికవులటంచుఁ బొగడవచ్చు
అష్టావధానమ్ము నాచరింపఁగఁజూడ
          వేంకటార్యులటంచుఁ బిలువవచ్చు
ఆశుధారాకవిత్వాధిక్యమును జూడ
          నలపెద్దనకవీంద్రు లనఁగవచ్చు
ముద్దుముద్దుగఁ జెప్పు ముఖ్యస్థితిని జూడ
          దిమ్మనకవులంచుఁ దెలియవచ్చు

సంస్కృత శ్లోకమున కాంధ్రసరణిఁ దెల్ప
నల్ల శ్రీనాథకవిరాజు లనఁగవచ్చు
నహహ! యేవిషయముఁ జూడ నత్యధికులు
ననఘులగు కొప్పరపు కవులండ్రు బుధులు

అరయశతావధానముల నంచితరీతిని జేయనేర్తుమం
చఱచెడివారు కొందఱనినట్టులఁ జేయరు సత్కవిత్వ సుం
దరియును ధారణాసతియుఁదత్పరతన్ మిముఁబొందిరెందునన్
దరుణులు వృద్ధులన్‌విడి ముదంబున యౌవనులందుటబ్రమే

ధోరణికి లోపమింతయుఁ దోఁపదయ్యె
ధారణకు నంతకంటెను మేరలేదు
కాన మీయవధానమే పూనఁదగును
వాస్తవావధానమను ప్రశస్తినవని

వర్ణనాతీతమైన పావన విచిత్ర
రీతి నవధానమొనరించి ప్రీతిఁగూర్ప
నెల్ల నిష్పక్షపాతుల కెదలఁగూడె
మాటలను దెల్పరాని సమ్మదము నిజము

కూరిమి గూరిన యంతనె
గారవమునఁ బద్యములను గల్పించియు నీ
తోరంపుఁగీర్తిచంద్రున
కారయ నూల్పోఁగునీయ నగునని తోఁచెన్

తోఁచినంతనె పద్యసందోహమల్లి
పారితోషిక మొసఁగితిఁబ్రణుతిఁజేసి
దయను గైకొండు దీని వధానులార!
బుధవినుతులార! కొప్పరపుకవులార!

శ్రీరంజిల్లఁగ భక్తమానస మహా సింహాసనాసీనుఁడై
కారుణ్యంబున సర్వలోకములఁ దాఁ గాపాడుసర్వేశు సీ
తారామున్ గరుణాలవాలు, హరి నిత్యానందసంధాయి నే
నారాధింతుఁ జిరాయురున్నతులు మీకశ్రాంతముంగూర్పఁగన్

భక్తిఁదెలిపెడి పుష్పంబొ ఫలమొ లేక
యెద్దియైననుజేకొని యేగి మఱియు
బెద్దలను జూచితా సమర్పింపవలయు

ననెడు లోకోక్తికొలఁది పద్యప్రసూన
దామ మొసఁగెద మీరిది దాల్పుఁడయ్య!

మీకుఁదగినట్టి బహుమతుల్ మెప్పుకొలఁది
నియ్యఁజాలని బడుగును నెయ్యముననె
యియ్యెడను దీనిఁ గైకొనుండయ్యలార!
కొండయంతటి జేజేకుఁ గొండయంత
పత్రమిడునట్టి శక్తి యెవ్వనికిఁగలదు?

శతఘంటకవితకు శక్తులు దామెగా
           కితరులు గారని యెంచుటెల్ల
సుకవిశబ్దమునకై శోధించిచూచినఁ
           దమకెకద్దనిచెప్పు ధైర్య మెల్ల
గురువులుశిష్యునిఁగూర్చుండఁబెట్టి సం
           స్తవమునుజేయు ప్రసక్తి యెల్ల
కవిరాజులందఱు కాకవులగుచును
           బల్లెలఁజేరిర న్పలుకులెల్ల

వ్యర్థమైపోయి ప్రత్యర్ధు లణగిపోవఁ
జక్కఁగాఁజెప్పినట్టి మీ సరసకవిత
నెటులవర్ణింపఁగలనొ నాకెఱుఁగరాదు
పూర్ణదయఁగొనుఁ డీపద్య పుష్పమాల

ధారణదప్పకుండ నవధానము జేయఁగ వీరశక్తులం
చారయలేక మిమ్మిట ననార్యతఁబల్కినదెల్లమీదువా
గ్ధోరణిధారణాగరిమఁ దొల్లిగనుంగొనకుంట లేనిచో
నేరికిఁబల్కవచ్చుఁ దమరిచ్చట నేటిదినంబునందు వి
స్ఫారకవిత్వమాధురిని సభ్యులఁదన్పితి రేమియందు, నే

నారయకుండమున్ను జనులాడెడుమాటలఁ గొంతనమ్మి మే
ధారుచిమీఱు నట్టికవితల్గని సంతసమంది యింక ని
ర్దారణఁజేయలేక తమధారణశక్తినిఁగూడఁ జూడఁగాఁ
గోరుచునుండఁ గాళ్ళకుఁదగుల్కొనుతీవియవోలె మీరలీ
యూరనె సంతసంబడర నోరిమిఁజేయువధానమిప్డు దు
ర్వారముగాఁగఁగాంచితిని బాలసరస్వతులన్నమీ కెగా
కేరికిఁజెల్లు నీభవదహీన కవిత్వ మదింతెగాక వా
గ్ధార తలంగనీక బెడిదంబగుశబ్దము దొర్లనీక నీ
తీరునఁజెప్ప నేరికగు తీవ్రతరంబుగ గంగ యార్భటిన్
ధారుణిపైకి వచ్చెడివిధంబును దోఁప శిరంబుపై బుధా
ధారుఁడు శంభుఁడేక్రియ సుధాకిరణుం దగఁదాల్చె సద్యశో
భారము మీరలట్టులె సభ ల్దనియంగ ధరించియుంటిరీ
నేరుపుఁజూడఁ బూర్వకవినేతలనాకుఁ దలంపనయ్యెనో
భారవులార! మీకవనఫక్కియు నాకుముదంబుఁగూర్పనా
నేరిచినట్లుపల్కితిని నిక్కము మీరిఁకఁ గీర్తిఁగాంచఁగా
భారతవంశవర్ధనుఁడు పాండవమిత్రుఁడు కృష్ణుఁడేలుతన్
(ఇట్లుపద్యములఁజదివిన కవి తనపద్యములువ్రాసిన కాగితముమీద పేరువ్రాయలేదు)

బ్రహ్మశ్రీ పుట్టంరాజు వరదయ్యగారు, కాలేజీ విద్యార్థి^

శ్రీరామామణి యెల్లకాలమును మీ శృంగార గేహంబునన్
గారుణ్యంబునఁ బెంపుఁ గాంచుత, లసద్గాంభీర్యధైర్యంబులన్
బేరున్ దెచ్చుచు వన్నె పెట్టఁగ భవద్విద్యాధికత్వంబుచేఁ
జేరన్ రారిఁకధూర్తశత్రులు కవీట్సింహాంక విభ్రాజితా.

అచ్చెరువౌట మీసుకవితార్భటిఁ జూడఁగమోదమందివి
ద్వచ్చయమెల్లముక్కుపయిఁ దప్పకనుంచిన వ్రేలుఁదీయ కే

యెచ్చటిధారణాగరిమ మెట్టిమహత్త్వమటంచు భ్రాంతిమై
మెచ్చుకొనంగడంగెనిటు మేలుసెబాసని వేయిభంగులన్

అరయ నవధానమనునట్టి యంబుధి నిటు
సరకుసేయక తరియించి మెఱపుఁగంటి
వన్యదుర్లభమైన నాయాంజనేయుఁ
డల్ల వారిధిదాఁటఁడే యనఁగ బుధులు

బ్రహ్మశ్రీ గంగరాజు పున్నయ్యగారు

విబుధవర్యులు మీదగు విద్యఁజూచి
హెచ్చుగా మెప్పులిచ్చుచు మెచ్చినారు
భక్తిమై నేనొసంగెడు పద్దెము లన
సంద్రమున కర్ష్యమనియెడి చందమెకద

భారతి సత్కృపారతి స్వభావవిశేషముజూపెవహ్వ వీ
రేరహి దొంటిజన్మమున నింపలరారఁగ నామెఁగొల్చిరో
కారణమేమొయాజనని కారుణికత్వమునూనివేడ్క మై
సారెకువీరెపుత్రులని స్వాంతమునందున నిల్చెఁగావునన్
ధారణనిల్వ కేమి యమితంబగు ధోరణిపుట్ట కేమి యీ
ధారుణి దుర్జనాళి పరితాపము నొందుట కేమి వీరికిన్ మాఱుగలారెయంచుబుధమాన్యులుసంతసమొందునట్లుబల్
నేరుపుఁజూపి చక్కఁగను నేఁడు వధానముఁ బూర్తిఁ జేసి గా
థా రచనావిలాసము సుధారసతుల్య మొనర్చితౌ భళీ
నూరిజనస్తుతోరుమతిశోభిత వేంకట సుబ్బరాట్కవీ.


ррррррр