కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం/మహత్వపూర్ణమైన అనుగ్రహం
మహత్వపూర్ణమైన అనుగ్రహం
ఇవాళ తెల్లవారుఝామున ఆకాశంకేసి చూస్తే ఒక్క మబ్బు తునక కూడా కనబడలేదు. బూడిదరంగులో వున్న ఆలివుచెట్లతోను, దట్టంగా వున్న సైప్రస్ చెట్లతోను నిండివున్న టస్కన్ కొండల వెనకాలనుంచి సూర్యుడు వుదయిస్తున్నాడు. నది మీద ఒక్క నీడ కూడా పడటంలేదు. ఏస్పెన్ చెట్ల ఆకులు నిశ్చలంగా వున్నాయి. ఇంకా వలసపోని పక్షులు కొన్ని కిలకిలరావాలు చేస్తున్నాయి. నది చలనరహితంగా నిలబడిపోయినట్లు కనిపిస్తున్నది. నది వెనకాలనుంచి సూర్యుడు పైకెక్కి వస్తుంటే, ప్రశాంతంగా వున్న నీటిమీద పొడవాటి నీడలు పరచుకుంటున్నాయి. అంతలో ఒక పిల్లగాలి తెర కొండలపై నుంచి వచ్చి లోయలో ప్రవేశించింది. అది ఆకుల మధ్యలో దూరి, వుదయ సూర్యుని కిరణాలు సోకిన ఆ ఆకులను వణికించి నృత్యం చేయిస్తున్నది. మట్టిరంగులో వుండి, మిల మిల లాడుతున్న నీటి పై పొడవైనవీ, పొట్టివీ, పెద్దవీ, చిన్నవీ నీడలు పడుతున్నాయి. ఒంటరిగా కనబడుతున్న ఒకే ఒక పొగగొట్టంలోనుంచి పొగ పైకి లేస్తున్నది. బూడిదరంగు పొగలు చెట్లను దాటుకొని వెళుతున్నాయి. ఈ వుదయం చాలా మనోహరంగా వుంది. సౌందర్యంతో నిండి ఎంతో సమ్మోహపరుస్తూ వుంది. ఎక్కడ చూసినా నీడలు, తట తట మని వణికిపోతూ ఎన్నో ఆకులు. గాలిలో ఏదో సుగంధం తేలి వస్తున్నది. శీతకాలపు ఎండ కాస్తున్నా, వసంతఋతువు తొంగి చూస్తున్నట్లుగా అనిపిస్తున్నది కర్ణకఠోరమైన చప్పుడు చేస్తూ చిన్నకారు ఒకటి కొండపైకి వెళ్తున్నది. వేలాది నీడలు మాత్రం నిశ్చలంగా నిలబడిపోయి వున్నాయి. చాలా చక్కని వుదయం అది.
నిన్న మధ్యాహ్నం, గోల గోలగా వున్న వీధిని అంటుకొని వున్న ఒక గదిలో హరాత్తుగా ఆరంభమైంది. పరతత్వపు శక్తీ, సౌందర్యం ఆ గదిలో నుంచి బయటకు వెలువడి, వీధిలో వస్తూ పోతూ వున్న జనం మీదుగా, తోటల మీదుగా, కొండలు దాటుకొని వ్యాపిస్తూ పోయింది. అపారంగా, అభేద్యంగా అది అక్కడ వుండిపోయింది. ఆ మధ్యాహ్నం అది అక్కడే వున్నది. మంచంమీద పడుకోబోతు వుంటే యింకా విపరీతమైన తీక్షణత్వాన్ని సంతరించుకుని, వుండిపోయింది. మహాత్వపూర్ణమైన అనుగ్రహం అది. దానికి అలవాటు పడిపోవడం జరుగదు. ఎందుకంటే ప్రతిసారీ అది భిన్నంగా వుంటుంది. ప్రతిసారీ కొత్తగా, ఒక నవ్యత్వంతో, చాలా సున్నితమైన విశిష్టతతో, ఒక కొత్త వెలుగుతో వుండి, అంతకు మునుపు ఎన్నడూ చూడని దానిలాగా వుటుంది. అది దాచుకునే వస్తువు కాదు. జ్ఞాపకం పెట్టుకొని, ఆ తరువాత ఎప్పుడో తీరిగ్గా కూర్చుని పరీక్షించే సంగతి కాదు. అది అక్కడ వుంటుంది; అయితే ఆలోచన దానిని సమీపించలేదు. ఎందుకంటే అసలు మెదడే పనిచేయడం ఆగిపోతుంది. అనుభవం పొందడానికీ, దాచుకోవడానికి అప్పుడు కాలం అక్కడ వుండదు. అది అక్కడ వున్నది; ఆలోచనలన్నీ ఆగిపోయాయి.
ఆ తీక్షణమైన జీవశక్తి ఎప్పుడు, రాత్రింబగళ్ళూ వుంటుంది. అది ఘర్షణ ఎరగదు; ఒక గమ్యం వైపుగా వుండదు; మన ప్రయత్నం, యిష్టాయిష్టాల ప్రమేయం దానికి అవసరం లేదు. ఎంత తీక్షణత్వంతో వుంటుందంటే ఆలోచనలు, మనోభావాలు దానిని తమ యిచ్చలకు, నమ్మకాలకు, అనుభవాలకు, కోరికలకు అనుగుణంగా మలచుకోవడం కోసం దానిని పట్టి బంధించలేవు. అది ఎంత పుష్కలంగా వుంటుం దంటే దేనివల్లా కూడా అది తగ్గిపోవడం జరుగదు. అయితే, దానిని మనం వుపయోగించుకోవాలనీ, ఒక గమ్యంవైపు మళ్ళించాలనీ, మన అస్తిత్వం అనే మూసలో దానిని పట్టి బంధించాలనీ, ఆవిధంగా మన పద్ధతులకు, మన అనుభవాలకు, మన జ్ఞానానికి లోబడేటట్లుగా దానిని తిప్పుకోవాలనీ ప్రయత్నిస్తాం. ఆకాంక్ష, అసూయ, అత్యాశ అనే వాటివల్ల ఆ శక్తి సన్నగిల్లుతుంది. ఆ కారణంగా సంఘర్షణ, దుఃఖం కలుగుతాయి. వ్యక్తిగతమైన ఆకాంక్షల్లో కాని సామూహిక ఆకాంక్షల్లో కాని వుండే నిర్దాక్షిణ్యత దాని తీక్షణతను చెదిరిపోయేటట్లు చేస్తుంది. అందువల్ల ద్వేషం, విరోధం, సంఘర్షణ కలుగుతాయి. అసూయతో కూడుకున్న చర్యలు యీ శక్తిని వక్రంగా తయారుచేస్తాయి. దానివల్ల అసంతృప్తి, వేదన, భయం వుత్పన్నమవుతాయి. భయంతో పాటుగా అపరాధభావం, ఆందోళన బయల్దేరుతాయి. ఆ పైన పోల్చిచూడటం, అనుకరణ అనే నిరంతర క్షోభ ఆరంభమవుతుంది. వక్రమైపోయిన యీ ప్రాణ శక్తే మతాచార్యుడినీ, సైనికాధికారినీ, రాజకీయవాదినీ, దొంగనీ తయరుచేస్తుంది. శాశ్వతత్వం కోసం, భద్రత కోసం మనం కోరుకోవడం యీ పరిమితులు లేని ప్రాణశక్తిని అసంపూర్ణంగా వుంచుతుంది. అందుకే అది నిష్ఫలమైన భావాలకు, పోటీలకు, క్రూరత్వానికి, యుద్ధాలకు నిలయమవుతున్నది. మనిషికీ, మనిషికీ మధ్య నిరంతర సంఘర్షణకు కారణమవుతున్నది.
వీటన్నింటినీ సునాయాసంగా, ఏ ప్రయత్నమూ లేకుండా పక్కకు నెట్టివేయ గలిగినప్పుడు మాత్రమే తీక్షణతతో కూడిన ఆ ప్రాణశక్తి వుంటుంది. ఇటువంటి స్వేచ్ఛలోనే తప్ప అది జీవించి, వికసించలేదు. స్వేచ్ఛగా వున్నప్పుడు మాత్రమే అది సంఘర్షణను, దుఃఖాన్నీ కలిగించకుండా వుంటుంది. అప్పుడు మాత్రమే అది సమాప్తమవకుండా వృద్ధి చెందుతూ వుంటుంది. ఆది, అంతమూ లేని ప్రాణం అది. ప్రేమ, నాశము అనే రెండింటినీ కలిగి వున్న సృష్టి అది.
ప్రాణశక్తిని ఏదో ఒక దిశవైపుగా వుపయోగిస్తే జరిగేది ఒకటే - సంఘరణా, దుఃఖమూ, జీవిత సమస్తం ద్వారా వ్యక్తమవుతూ వుండే ప్రాణశక్తి కొలతలకు ఆందని మహాదానంద స్వరూపం.