కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం/భయం ఆలోచనల్లో పుట్టి పెరుగుతుంది
భయం ఆలోచనల్లో పుట్టి పెరుగుతుంది
ప్రతి విషయంలోనూ ఒక గంభీరమైన దృష్టి వుండటం చాలా మంచిదని నాకనిపిస్తుంది. బరువైన విషయాలు మాట్లాడాలనీ మనం కూర్చున్నప్పుడు అది మరీ ముఖ్యం. సావధానతతో వుండగలగడం, నిశితంగా చొచ్చుకొనిపోయి చూడగల గుణం, మనలో ప్రతి ఒక్కరికీ వున్న రకరకాల సమస్యలలోకి, ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యల లోనికి లోతుగా విచారణ జరపడం - తప్పకుండా వుండి తీరాలి. పరిశీలించి చూస్తే, యీ దేశంలోనే కాదు, ప్రపంచమంతటా అల్లకల్లోలం వున్నది, విపరీతమైన అస్తవ్యస్త పరిస్థితి వున్నది; ఏ మాత్రం తగ్గుముఖం పట్టని అనేక బాధలను మనిషి యింకా ఎదుర్కుంటునే వున్నాడు. పాశ్చాత్యదేశాలలో గొప్ప సిరిసంపదలు వున్నా అక్కడ అనేక సమస్యలు కూడా వున్నాయి; ఒక ఆర్థిక, సామాజిక రంగాలలోనే కాదు, యింకా అంతకంటే లోలోపలి విషయాల్లో కూడా. అక్కడి యువతీ యువకులు తిరుగుబాటు చేస్తున్నారు. సంప్రదాయాలకు, సమాజపు ఆధిపత్యానికి, ఆ పద్ధతులకు వాళ్ళు తల వొంచడం లేదు.
ఈ దేశానికి వచ్చినప్పుడు- నేను ప్రతి సంవత్సరం యిక్కడికి వస్తుంటాను-అతి వేగంగా దిగజారిపోతున్న స్థితిగతులు, పేదరికం, మనుష్యులంటే ఏమాత్రం కనికరం లేకపోవడం, రాజకీయాలలోని వంచనా శిల్పం, పూర్తిగా అంతర్థానమై పోతున్న ప్రగాఢ ఆధ్యాత్మిక విచారణ, విభిన్న వర్గాల మధ్య ఆటవిక స్థాయిలో కలహాలు, ఏదో ఒక స్వల్ప విషయానికి నిరాహారదీక్షలు పూనడం - యివన్నీ నాకు కనబడుతూ వుంటాయి. మంటల్లో యిల్లు తగలబడి పోతున్నప్పుడు, యింతటి అల్లకల్లోలం వున్నప్పుడు, యింతటి ఘోరమైన స్థితిలో వున్నప్పుడు అలా అల్పమైన విషయాల కోసం జీవితం అంతా గడిపివేయడం, వాటికోసం హంగామా చేయడం నాయకుల యొక్క- వారు మతాచార్యులు అవచ్చు, రాజకీయ నాయకులవచ్చు- ఆ నాయకుల మానసిక స్థాయిని తెలుపుతుంది.
ఈ వాస్తవాలన్నీ- కేవలం పైకి కనిపించేవే కాకుండా, వ్యవస్థకు సంబంధించిన వాటిని, ఆర్థిక పరమైనవీ, సామాజికపరమైన వాటినే కాకుండా అంతర్గతంగా వున్నవి కూడా పరిశీలించినప్పుడు, పాత సంప్రదాయాలను పట్టుకొని వేలాడటం, పదిమంది చేత ఆమోదించబడిన ఆలోచనా ధోరణులూ, అందరిచేతా వల్లించబడే అసంఖ్యాకమైన ధర్మపన్నాలూ కనబడతాయి. అవి కూడా దాటుకొని యింకా లోపలగా వుండే లోతులలోకి అంతర్ముఖంగా వెళ్ళి కనుక చూస్తే, విపరీతమైన అస్తవ్యస్తస్థితి, పరస్పరవైరుధ్యాలు కూడా మనం చూడచ్చు. మనం ఏం చేయాలో మనకే తెలిదు, ఒక పుస్తకంలోనుంచి మరో పుస్తకంలోకి, ఒక వేదాంతం నుంచి మరో తత్వానికీ, ఒక గురువు దగ్గర నుంచి మరో గురువు వద్దకు అంతం అనేది లేకుండా వెతుక్కుంటూ పోతూవుంటాం. నిజానికి మనం వెతుకుతున్నది నిర్దుష్టంగా చూడగలగడం కోసం కాదు. అసలు మనసు స్థితి ఏమిటీ అనేది అవగాహన చేసుకోవడానికి కాదు. మన నుంచి మనము తప్పించుకొని పారిపోవడానికి మార్గాలకోసం, పద్ధతుల కోసం వెతుక్కుంటూ వుంటాం. ప్రపంచ మంతటా పున్న భిన్న భిన్న మతాలు తప్పించుకొని పారిపోవడం ఎట్లా అనేదే చూపాయి. సుఖాన్నీ, తృప్తినీ యిచ్చే ఒక ఆశ్రయాన్ని కనిపెట్టే ప్రయత్నమే మనకు సంతోషాన్ని కలిగిస్తూ వుంటుంది. ఇదంతా పరికించి చూసినప్పుడు- పెరిగిపోతున్న జనాభా, మనుష్యులలో వుండే అతి ఘోరమైన నిర్దాక్షిణ్యత, యితరుల మనోభావాలను, ఎదుటి వారి జీవితాలను బొత్తిగా లెక్కచేయని నిర్లక్ష్యభావం, సామాజిక నిర్మాణం పున్న తీరుని ఏమాత్రం పట్టించుకోక పోవడమూ చూసినప్పుడు, యిటువంటి అల్లకల్లోలంలోనుండి ఒక క్రమతను తీసుకొని రావడం సాధ్యమేనా అని అనిపిస్తుంది. రాజకీయపరమైన క్రమ వ్యవస్థ కాదు- రాజకీయాలు క్రమతను ఏనాటికీ స్థాపించలేవు. ఒక ఆర్థిక విధానం కానీ, మరో రకమైన సిద్ధాంతం కానీ యీ క్రమతను సాధించలేవు. అయితే మనకీ క్రమత అనేది చాలా అవసరం. ఎందుకంటే బాహ్యంగానూ, అంతర్గతంగానూ కూడా చాలా చాలా అస్తవ్యస్త పరిస్థితి వున్నది. దీనిని గురించి మనకి అస్పష్టంగా, ఒక వూహగా కొద్దిగా తెలుసు. సమస్యలు చాలా భయంకరమైనవనీ మనం అనుకుంటాం. జనాభా విపరీతంగా పెరిగిపోతున్నది. అందుకని, “నేను యీ అల్లకల్లోలపు ఘోరావస్థలో, హింసలో, అవివేకంలో జీవిస్తున్న మనిషిని. నేను ఏం చేయగలుగుతాను?” అని మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం. నిజమైన ఆసక్తి మీలో ఏ మాత్రం వున్నా మీకు మీరే యీ ప్రశ్న తప్పక వేసుకొని వుంటారు. “నేను ఒక్కడినీ చేయగలిగింది ఏమిటి” అని నన్ను నేను కనుక గట్టిగా ప్రశ్నించుకుంటే, “ఈ సమాజ వ్యవస్థను అంతర్గతంగానే కాదు, బాహ్యంగా కూడా మార్చడానికి గానీ, లేదా సక్రమస్థితిని నెలకొల్పడానికి గానీ నేను చేయగలిగింది ఏమీ లేదు” అనే సమాధానం రావడం తధ్యం.
సాధారణంగా “నేను చేయగలిగింది ఏమిటి” అనే ప్రశ్నను మనం వేసుకుంటాం, దానికి “ఏమీ చేయలేను” అనే సమాధానమే ఎప్పుడూ వస్తూ వుంటుంది. ఇక ఇక్కడ ఆగిపోతాం. అయితే యీ సమస్యకు మరింత లోతయిన సమాధానం రావలసిన ఆవశ్యకత వుంది. ఈ సమస్య ఎంత ముఖ్యమైనదంటే దీనికి మనలో ప్రతి ఒక్కరూ ఒక సంపూర్ణ మానవునిగా ప్రతిస్పందించాలే తప్ప ఒక హిందువుగానో, ఒక బౌద్దుడిగానో, ఒక ముస్లింగానో, ఒక పార్శీగానో, ఒక క్రైస్తవునిగానో చెప్పే ఒక నిబద్దమైన సమాధానంతో కాదు. వారంతా మరణించారు, వెళ్ళిపోయారు, సమాప్తమయినారు. ఆ మాటలకు యిక మీదట ఏ అర్ధమూ లేదు. అజ్ఞానాన్ని, అంధ విశ్వాసాన్ని స్వలాభానికి వుపయోగించుకునే ఒక్క రాజకీయనాయకులకి తప్ప, ధర్మశాస్త్రాలు, తత్వవేత్తల బోధలు, మతాచార్యులు జారీ చేసే ఆజ్ఞలు, విధేయతతో అనుష్టించి, అనుసరించ వలసిన వారి నియమాలు- ప్రపంచ సమస్యలను గురించిన ఎరుక, చైతన్యం వున్న మనిషికి వాటిల్లో అర్ధమేమీ కనబడటం లేదు.
చూడండీ, తను యింతకాలం నమ్మినదానిలో మనిషికి విశ్వాసం పోయింది. రాజకీయాల్లో వుపన్యాసకుడి మీద ప్రేక్షకులు చెప్పులూ, రాళ్ళూ విసురుతున్నారంటే ఏమిటో మీకు అర్ధమవుతున్నదా? అంటే అర్థం వాళ్ళు ఆ నాయకత్వాన్ని త్రోసి రాజంటున్నారన్నమాట. ఇక మీదట ప్రజలు తాము ఏం చేయాలో మరొకరు చెప్పడం సాగనివ్వరు. మనిషి విపరీతమైన నిస్సహాలో పడిపోయాడు. మానవుడు గజిబిజి స్థితిలో చిక్కుకునిపోయి వున్నాడు. అపరిమితమైన దుఃఖం వుంది. ఏ సిద్ధాంతాలైనా సరే, వామపక్షపువిగాని, మరో పక్షపువి గానీ వాటికి అర్థం లేదు. సిద్ధాంతాలన్నీ మూర్ఖమైనవనే చెప్పాలి. 'ఉన్నది' ఏమిటి అనే అసలైన వాస్తవాన్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు అవి ఎంత అర్ధంలేనివో తెలుస్తుంది. కాబట్టి నాయకుల ఆధిపత్యమే కాదు, మతాచార్యుడి ఆధిపత్యం, పవిత్రగ్రంధపు ఆధిపత్యం, మతధర్మపు ఆధిపత్యం వేటినీ మనం లక్ష్య పెట్టనక్కరలేదు. సత్యం ఏది అనేది తెలుసుకోవాలంటే వీటిని మనం వుపేక్షించి తీరాలి. అంతేకాకుండా జరిగిపోయినదాని వద్దకు, వెనక్కి మనం వెళ్ళలేము.
మీకు తెలుసు, ఈ దేశంలో భారతీయ వారసత్వం అనీ, ప్రాచీన భారతజాతి అనీ తరచు వింటూవుంటాం. గత కాలం గురించీ, ఒకప్పటి భారతదేశం గురించీ వాళ్ళు తుదీమొదలూ లేకుండా మాట్లాడుతూనే వుంటారు. గతించిపోయిన సంస్కృతుల గురించి మాట్లాడే మనుష్యులకు ఆలోచించే శక్తి తక్కువ. వాళ్ళు జరిగిపోయిన వాటిని, గ్రంధాల్లో వున్న విషయాలను మళ్ళీ మళ్ళీ వల్లె వేస్తూవుంటారు. ఇది ప్రజలను జోకొట్టే మత్తుమందుగా చక్కగా పనిచేస్తుంది. కాబట్టి వాటన్నింటినీ మనం తిరస్కరించాలి. వాటన్నింటినీ శుభ్రంగా వూడ్చి అవతల పారేయచ్చు. పారవేసి తీరాలి. ఎందుకంటే మనకి వున్న సమస్యలు మనల్ని ఆ సమస్యల ఎడల అత్యంతమైన సావధానత్వం, లోతయిన ఆలోచన, విచారణ చూపించమని ఒత్తిడి చేస్తున్నాయి. అంతే తప్ప, ఎవరో ఒకరు వారు ఎంత గొప్పవారయినా సరే, వారు చెప్పినది పునశ్చరణ చేయమనీ కాదు. కాబట్టి ఒకప్పుడు జరిగిపోయిన విషయాలను, యీ ఘోరమైన దురవస్థలకు, క్రూరత్వానికి, యీ హింసకు కారణమైన వాటినన్నింటినీ త్రోసిపుచ్చి నపుడు- అప్పుడు వాస్తవాలు, నిజంగా ‘ఉన్నది' ఏమిటి అన్నవీ బాహ్యంగానూ, అంతర్గతంగానూ కూడా మన ఎదురుగా నిలబడతాయి. 'ఉండవలసినది' ఏమిటి అన్నది కాదు; 'ఉండవలసినది' అన్నదానికి అర్ధం లేదు.
మీకు తెలుసు, విప్లవాలను, ఫ్రెంచి విప్లవం, రష్యన్ విప్లవం, కమ్యునిస్టు విప్లవాలను 'ఉండవలసినది' ఏమిటి అన్న సిద్దాంతం మీద నిర్మించారు. లక్షలాది ప్రజలను హతమార్చాక, సిద్దాంతాలంటే ప్రజలకి విసుగుపుట్టిందని వాళ్ళు కని పెడుతున్నారు. కాబట్టి యికపై మీకు సిద్ధాంతవాదులు వుండరు, యికపై మీకు నాయకులు వుండరు; ఇక మీదట మీరు ఏమి చేయాలో చెప్పడానికి ఎవరూ వుండరు. ఇప్పుడు ప్రపంచాన్ని మీకు మీరుగా ఎదుర్కోవాలి, ఒంటరిగా; నిష్క్రియగా కూర్చోడానికి వీల్లేదు. కాబట్టి మన సమస్య బ్రహ్మాండంగా పెరిగిపోయిందీ, భయంకరంగా తయారయింది. మీరు ఒక మనిషిగా, ఒంటరిగా, మరొకరి నుండి మద్దతు లేకుండా, సమస్యలను గురించి సుస్పష్టంగా ఆలోచించుకోవాలి. ఏ గజిబిజి చిక్కులలో పడకుండా క్రియ ఆచరించాలి. అప్పుడే సిద్దాంతాల ఎడారిలో మీరు ఒక ఒయాసిస్ గా అవుతారు. ఒయాసిస్ అంటే ఏమిటో మీకు తెలుసా? ఇసుక, అస్తవ్యస్తత తప్ప మరేమీ లేని మహా విస్తృతమైన ఎడారిలో కొద్దిగా చెట్లూ, నీరు, ఒక చిన్న పచ్చికబయలు వున్న స్థలం యిది. మనలో ప్రతి ఒక్కరం ప్రస్తుతం అట్లాగే అయిపోవాలి. మనం వున్న చోటు ఒక ఒయాసిస్ గా మారాలి. అప్పుడే మనలో ప్రతి ఒక్కరం నిర్దుష్టతతో వుండి, అయోమయంలో పడకుండా. వ్యక్తిగతమైన అభిరుచి ననుసరించకుండా, మన స్వాభావికమైన వుద్వేగాలనో, పరిస్థితుల ప్రాబల్యాన్నో అనుసరించకుండా, స్వేచ్ఛగా వర్తించ కలుగుతాం.
కాబట్టి యీ సమస్య చాలా పెద్దది,దాని నుంచి దూరంగా పారిపోవడం ద్వారా మీరు సమాధానం యివ్వలేరు. అది మీ గుమ్మం ఎదుటే వున్నది. కాబట్టి పరిస్థితిని మీరు గ్రహించి తీరాలి. మీ చుట్టూరా ఒకసారి చూసుకోవాలి. మీరు ఏం చేయాలి అనేదీ మీరే తెలుసుకొని తీరాలి. ఇప్పుడు మనం అంతా కలిసి చేయబోయేది అదే. మీరు ఏం చేయాలి అనేది యీ వక్త చెప్పబోవడం లేదు. ఎందుకంటే అతనికి ఏ ఆధిపత్యమూ లేదు. ఇది మీరు అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆధ్యాత్మికమైన ఆధిపత్యాలు అన్నీ ముగిసి పోయాయి. ఎందుకంటే అవి గందరగోళానికీ, అంతులేని క్షోభకూ, సంఘర్షణకు దారితీశాయి. పరమాతి పరమ మూర్ఖులు మాత్రమే వాటిని అనుసరిస్తారు. కాబట్టి, సమస్తమైన ఆధిపత్యాన్ని త్రోసి వేయగలిగితే, అప్పుడు తరచి చూడటం, అన్వేషించడం ఆరంభించగలుగుతాం. ఈ అన్వేషణ చేయాలంటే మీకు శక్తి వుండాలి, ఒక్క శరీర సంబంధమైన శక్తే కాదు, మానసిక శక్తి కూడా, మెదడు చురుకుగా పనిచేస్తుండాలి; చేసినదే మళ్ళీ మళ్ళీ చేస్తూ వుండటం వల్ల మందకొడిగా తయారై వుండకూడదు. ఘర్షణ వున్నప్పుడే శక్తి వృధా అవుతూవుంటుంది. దయచేసి కాస్త యిది గమనించండి. కేవలం ఈ వక్త చెప్పాడు కాబట్టి అంగీకరిస్తే, అప్పుడందులో అర్థమే వుండదు. మనకి కావలసినది స్వేచ్చ, ఏదో ఒక రకమైన స్వేచ్ఛకాదు, మానవుడి సంపూర్ణ విముక్తి. కాబట్టి మనకి శక్తి కావాలి. మనలో మనస్తత్వ పరమైన, ఆధ్యాత్మికమైన ఒక గొప్ప విప్లవాన్ని కలిగించడానికే కాకుండా, తరచి శోధించడానికి, పరికించడానికి, క్రియ చేయడానికి కూడా. సంబంధ బాంధవ్యాల్లో ఘర్షణ అనేది వున్నంతవరకు, భార్యా భర్తల మధ్య కానీ, ఒక కులానికీ మరోకులానికీ, ఒక దేశానికీ మరో దేశానికీ మధ్య కానీ, బాహ్యంగా కానీ, అంతర్గతంగా కానీ- ఏ రూపంలోనైనా సరే, ఎంత సూక్ష్మరూపంలోనైనా సరే, సంఘర్షణ వున్నంతకాలం శక్తి వృథా అవడం జరుగుతుంది. స్వేచ్ఛ వున్నప్పుడు శక్తి శిఖరాగ్రస్థాయిలో వుంటుంది.
ఇప్పుడు, యీ ఘర్షణ నుంచి, యీ సంఘర్షణ నుంచి విముక్తి పొందడం ఎట్లా అనేది మనమే శోధించి, అన్వేషించి తెలుసుకుందాం. మీరూ నేనూ కలిసి అన్వేషిస్తూ, శోధిస్తూ, ప్రశ్నిస్తూ యీ ప్రయాణం చేయబోతున్నాం. అనుసరిస్తూ మాత్రం కాదు. తరచి శోధించాలంటే స్వేచ్ఛ వుండితీరాలి. భయం వున్నప్పుడు స్వేచ్చ వుండదు. భయం అనే భారాన్ని, బాహ్యంగానే కాదు, అంతర్గతంగా కూడా మనం మోస్తూ వుంటాం. ఉద్యోగం పోతుందేమో, తినడానికి తగినంత ఆహారం వుండదేమో, యిప్పుడు మనం వున్న స్థితిలో నుండి కిందకు పడిపోతామేమో, మన పై అధికారి అసహ్యంగా ప్రవర్తిస్తాడేమో అనేది బాహ్యంగా వుండే భయాలు, అంతర్గతంగా కూడా ఎన్నో భయాలు వుంటాయి. జీవితంలో మనం ఏమీ సాధించలేదు అనో, విజయం సాధించగలమా అనో భయం; చనిపోవడం అంటే భయం, ఒంటరితనపు భయం; ఇతరుల ప్రేమను పొందలేనేమో అనే భయం, బొత్తిగా తోచకపోవడం అనే భయం, యింకా యిటు వంటివి. కాబట్టి యీ భయం అనేది ఒకటి వున్నది; సమస్యలన్నింటినీ తరచి శోధించి, పోటి నుండి విముక్తి పొందకుండా యీ భయమే నిరోధిస్తున్నది. ఈ భయమే మన లోపలకు లోతుగా తరచి చూసుకోకుండా మనల్ని నిరోధిస్తున్నది.
కాబట్టి మొట్టమొదటి సమస్య, నిజంగా చాలా ప్రధానమైన మన సమస్య ఏమిటంటే భయ భీతినుండి విముక్తి చెందడం. భయం ఏం చేస్తుందో మీకు తెలుసునా? అది మనసును చీకటితో నింపుతుంది. మనసును మందకొడిగా తయారుచేస్తుంది. భయంలో నుండే హింస బయలు దేరుతుంది, భయంలో నుండే మనకు బొత్తిగా ఏమీ తెలియని ఒక దానిని పూజించడం కూడా ఆరంభమవుతుంది. అందుకని మీరు సిద్దాంతాలను, కాల్పనిక రూపాలను- యీ కాల్పనిక రూపాలు చేతితో తయారైనవి కావచ్చు, మనసుతో తయారు చేసినవి కావచ్చు- యింకా రకరకాల తాత్విక భావాలనూ కొత్తగా తయారు చేసుకుంటారు. మీలో చాతుర్యం ఎక్కువైన కొద్దీ మీ కంఠ స్వరంలో, మీ హస్తవిన్యాసంలో ఆధిపత్యభావం ఎక్కువవుతూ వుంటుంది. మూర్ఖులు మిమ్మల్ని అనుసరించడం కూడా ఎక్కువవుతూ వుంటుంది. కాబట్టి చాలా ముఖ్యమైన ప్రశ్న ఏమిటంటే భయభీతి నుండి సంపూర్ణమైన విముక్తి పొందడం సాధ్యమేనా అన్నది. దయచేసి మీకు మీరే యీ ప్రశ్న వేసుకోండి, తెలుసుకోండి.
ఈ నాలుగు ప్రసంగాలలో మనం చేయబోతున్నది ఏమిటంటే, ఎడారివంటిదైన, అస్తవ్యస్తంలో వున్న, హింసతో నిండివున్న యీ ప్రపంచంలో నివసిస్తున్న మనిషిలో అతను చేపట్టవలసిన చర్యను మేలు కొల్పడం. అప్పుడే మనలో ప్రతి ఒక్కరం ఒక ఒయాసిస్సుగా మారుతాం. అది ఏమిటో కనుక్కోవాలంటే, ఆ స్పష్టతను, ఆ నిర్దుష్టతను అటుపైన తీసుకొని రావాలంటే, మనసు ఆలోచనలన్నింటినీ అధిగమించి ఆవలగా పోగలగాలంటే, ప్రప్రధమంగా భయాలన్నింటి నుండి విముక్తి పొంది తీరాలి.
మొట్ట మొదటగా భౌతికమైన భయం వున్నది. ఇది జంతు జాతికి స్వభావ సిద్ధమైన ప్రతి స్పందించే గుణం, మనలో వున్నది చాలా వరకు జంతువుల నుండి వారసత్వంగా లభించినదే కాబట్టి మన మెదడు నిర్మాణంలోని చాలా ఎక్కువ భాగం జంతువుల నుండి సంక్రమించినదే. ఇది వైజ్ఞానిక సత్యం. ఇది ఒక సిద్ధాంతం కాదు. ఇది ఒక వాస్తవం. జంతువులలో హింసాత్మకత వుంటుంది. మనుష్యులలోను వుంది. జంతువులకి అత్యాశ ఎక్కువ. వాటికి మెప్పుదల యిష్టం. ముద్దు చేయించు కోవడం మరీ యిష్టం, సుఖంగా వుండటం కోసం ఆరాటపడతాయి. మనుష్యుల్లో కూడా యిదే కనబడుతుంది. జంతువుల్లో తమ స్వంతం చేసుకోవాలనే గుణం, పోటీ తత్వం వున్నాయి. మనుష్యుల్లోనూ అంతే. జంతువులు గుంపులుగా జీవిస్తాయి. మనుష్యులు గూడా ఒక బృందంగా ఏర్పడి పనిచేయాలనుకుంటారు. జంతువుల్లో ఒక సాంఘిక వ్యవస్థవుంది. మనుష్యుల్లోనూ వున్నది. ఇంకా ఎన్నో వివరాలు తెలుసుకోవచ్చును. అయితే జంతువులనుండి సంక్రమించినవి మనలో చాలా వున్నాయని గ్రహించడానికి యివి చాలు.
ఈ జంతు లక్షణాల నుండి మనల్ని విముక్తి చేసుకోవడమే కాకుండా, యింకా ఆవలగా దీనిని మించి పోయి కనిపెట్టడం- కేవలం మాటల్లో శోధించడం కాదు, నిజంగా తెలుసుకోవడం- మనకు సాధ్యమేనా? సమాజం చేసిన, తాను పుట్టి పెరిగిన సంస్కృతి చేసిన నిబద్ధీకరణాన్ని దాటుకొని మనసు ఆవలగా పోగలదా? పూర్తిగా విభిన్నమైన ఆయత ప్రమాణానికి చెందిన మరొక దానిని తెలుసుకోవాలంటే, అది దర్శించుకోవాలంటే- భయభీతి నుండి విముక్తి చెంది తీరాలి.
స్వీయరక్షణ కోసం జరిగే ప్రతిస్పందన భయపడటం కాదని నిస్సందేహంగా తెలుస్తున్నది కదా. ఆహారం, దుస్తులు, నివాసం మనకి అవసరం- మనందరికీ; ఒక్క సంపన్నులకే కాదు, ఒక్క గొప్పవారికే కాదు. ప్రతి ఒక్కరికీ అవసరమే, దీనికి రాజకీయ వేత్తలు పరిష్కారం చూపలేరు. రాజకీయవేత్తలు ప్రపంచాన్ని ఇండియా మొదలైన దేశాలుగా విభజించారు; ఒక్కొక్క దేశాన్ని ప్రత్యేకంగా ఒక స్వతంత్ర ప్రభుత్వం నడిపిస్తుంది; ఒక ప్రత్యేకమైన సైన్యం వుంటుంది; పైగా జాతీయత గురించిన విషపూరితమైన కట్టుకధలుంటాయి. అసలు రాజకీయ సమస్య ఒకే ఒక్కటి వుంది. అదేమిటంటే - మానవజాతినంతా ఐక్యం చేయడం. మీరు కనుక మీ జాతీయ భావాలను, దక్షిణాది, వుత్తరాది, తెలుగువారు, తమిళులు, గుజరాతీలు యింకా అవి యివీ అనే అల్పమైన విభేదాలను పట్టుకొని వేలాడుతుంటే మాత్రం అది జరిగే అవకాశం లేదు- జాతీయవాదం వట్టి మూర్ఖత్వం. సర్! ఇల్లు మంటల్లో కాలిపోతుంటే, ఆర్పడానికి నీళ్ళు తెస్తున్న మనిషిని గురించి మీరు చర్చించరు; యింటికి నిప్పు పెట్టిన మనిషి జుట్టు రంగు ఏమిటి అని ఆలోచించరు. నీళ్ళు మోసుకొని వస్తారు, అంతే. మతాలు మనుష్యుల్ని విభజించినట్లుగానే జాతీయ భావాలు మనిషి నుండి మనిషిని విడదీశాయి; ఈ జాతీయ తత్వం, మతసంబంధమైన విశ్వాసాలు మానవజాతిని విడదీశాయి; ఒక మనిషికి ప్రతికూలంగా మరో మనిషిని నిలబెట్టాయి. ఇదంతా ఎందుకు జరిగిందో మనం గ్రహించవచ్చు. ఎందుకంటే మన స్వంతదైన ఒక చిన్న మురికిగుంటలో నివసించడమే మనందరికీ యిష్టం కనుక.
కాబట్టి మనిషి భయాన్ని తొలగించుకోవాలి. అయితే అది చేయడం చాలా కష్టసాధ్యమైన సంగతి. మనలో చాలా మందికి మనం భయపడుతున్నామనే ఎరుక వుండదు, దేనిని గురించి భయపడుతున్నామనేది కూడా మనకు తెలియదు. దేనిని గురించి భయపడుతున్నామనేది ఒకవేళ తెలిసినా యిక ఆ తరువాత ఏం చేయాలన్నది తెలియదు. అందుకని దాని నుండి పారిపోతాం. సర్! మీకు అర్ధం అవుతున్నదో? నిజంగా మనం ఏమిటో దానినుండి తప్పించుకొని పారిపోతూవుంటాం, అదే భయం. దేని వద్దకైతే మనం పారిపోతామో అదీ మన భయాన్ని యింకా ఎక్కువ చేస్తుంది. దురదృష్టవశాత్తు వలలాగా అల్లుకు పోయిన రకరకాల పలాయన మార్గాలను మనం తయారుచేసి పెట్టుకున్నాం. కాబట్టి మనకి వున్న భయాలను గురించే కాకుండా, పారిపోవడం కోసం తయారు చేసి పెట్టుకున్న వల అల్లికల వంటి వ్యూహం గురించి కూడా మనం ఎరుక కలిగివుండాలి. సరే, భయం అనేది ఎట్లా వునికిలోకి వస్తున్నది? ఏదో ఒక దానిని గురించి మీరు భయపడుతుంటారు. చావు అంటే భయం, భార్య అంటేనో భర్త అంటేనో భయం, వుద్యోగం పోతుందేమోనని భయం. ఇంకా ఎన్నో యిటువంటి భయాలు. ఇప్పుడు మీ భయాల్లో ఏదో ఒకదాన్ని తీసుకోండి. ఆ భయాన్ని స్పృహలోకి తెచ్చుకోండి; అది ఎట్లా వునికిలోకి వస్తున్నది, దానిని గురించి మనం ఏం చేయగలం, దానిని సంపూర్ణంగా పరిష్కరించడం ఎట్లా అనేవి పరిశీలించడం మొదలు పెడదాం. మీకూ యీ వక్తకూ మధ్య అప్పుడు ఒక సత్సంబంధాన్ని స్థాపించగలుగుతాం. ఇది సామూహిక మనస్తత్వ పరిశీలన కాదు. సమూహం మొత్తం కలసి చేసే స్వీయ మానసిక విశ్లేషణా కాదు. మనందరమూ కలసి ఎదుర్కోవలసిన కొన్ని వాస్తవాల లోనికి చేసే ఒక అన్వేషణ యిది. భయం అన్నది- రేపటి రోజు అంటే భయం, వుద్యోగం పోతుందనే భయం, మరణం అంటే భయం, జబ్బు చేస్తుందనే భయం, నొప్పి అంటే భయం. ఎట్లా కలుగుతున్నది? భయం అనగానే అందులో భవిష్యత్తునీ గురించి కానీ గతాన్ని గురించి కాని ఒక ఆలోచనా ప్రక్రియ వుంటుంది. నాకు మర్నాటిని గురించి భయం, ఏమి అవబోతుందో అన్నదానిని గురించీ భయం; నాకు చావు అంటే భయం; అది యింకా చాలా దూరంలో వుంది, అయినా నాకు భయమే. సరే, భయాన్ని కలిగించేది ఏది? భయం ఎప్పుడూ మరొకదాని కారణంగా వునికిలోకి వస్తుంది. ఆ మరొక దానితో సంబంధం లేకుండా భయమే వుండదు. కాబట్టి మనకు రేపు అంటే భయం, లేదూ జరిగిపోయినది అంటేనో, జరగబోయేది అంటేనే భయం. ఈ భయాన్నీ తీసుకొచ్చింది ఏది? అది ఆలోచన కాదూ! రేపు నా వుద్యోగం పోవచ్చేమోనని నేను ఆలోచిస్తుంటాను; అందువల్ల నేను భయపడతాను. నేను చనిపోవచ్చు, చనిపోవడం సోకు యిష్టం లేదు. నా జీవితకాలమంతా నికృష్టమైన, ఘోరమైన, వికృతమైన, క్రూరమైన బ్రతుకును, ఏ భావస్పందనలూ లేకుండా మొద్దుబారి పోయిన బ్రతుకునే గడిపాను, అయినా సరే, నేను చావడానికి యిష్టపడను; భవిష్యత్తు అంటే మరణం అని నా ఆలోచన చిత్రిస్తుంది; నేనేమో దానిని చూసి భయపడతాను.
ఇదంతా మీరు అర్థం చేసుకుంటున్నారా? దయచేసి మాటలను మాత్రమే అంగీకరించి వూరుకోకండి. వట్టి మాటల శబ్దాన్ని మాత్రమే ఆలకించకండి. ఇది మీ సమస్య కాబట్టి మీరు వినండి. ఇది మీ దైనందిన సమస్య, మీరు నిద్రపోతున్నా, మేలుకొని వున్నా వుండేది- ఈ భయం అనే విషయం. ఇదీ మీరే పరిష్కరించుకోవాలి. మరొకరెవరో వచ్చి పరిష్కరించి పెట్టరు. మంత్రాలు కాని, ధ్యానం కాని, దేవుడు కాని, మత గురువు కానీ, ప్రభుత్వం కాని, మానసిక విశ్లేషకుడు గాని- ఎవ్వరూ దీనిని మీ కోసం పరిష్కరించిపెట్ట బోవడం లేదు. కాబట్టి దీనిని మీరే అవగాహన చేసుకోవాలి, దీనిని అధిగమించి ఆవలగా పోవాలి. అందుకని దయచేసి వినండి. మీ జిత్తులమారి మనసుతో కాదు; “నేను వింటాను, నాకు యింతకు ముందే తెలిసిన దానితోనో, యింతకు ముందు విన్న వాటితోనో తను చెప్పేది పోల్చి చూస్తాను" అని అనకండి, అంటే అర్థం మీరు వినడం లేదన్నమాట. వినడం అంటే మీ సంపూర్ణమైన ధ్యాసను అంటే సావధానతను యివ్వాలి. సంపూర్ణమైన సావధానం యివ్వడం అంటే శ్రద్ధ చూపడం. వాత్సల్యం వున్నప్పుడే, ప్రేమ వున్నప్పుడే మీకు సావధానత్వం కూడా వుంటుంది. అంటే అర్థం యీ భయం అనే సమస్యను మీరు పరిష్కరించుకోవాలని కోరుతున్నారు అని. అది పరిష్కరించుకున్నప్పుడు ఒక మనిషిగా, చెడిపోతున్న యీ ప్రపంచంలో ఒక ఒయాసిస్సును సృష్టించే స్వేచ్ఛామానవునిగా మీరు తయారవుతారు.
కాబట్టి ఆలోచన భయానికి జన్మనిచ్చి పోషిస్తుంది. నా వుద్యోగం పోగొట్టుకోవడం గురించో, నా వుద్యోగం పోతుందేమో అన్నదాన్ని గురించో నేను ఆలోచిస్తాను. ఈ ఆలోచన భయాన్ని సృష్టిస్తుంది. కాబట్టి ఆలోచన ఎప్పుడూ కాలంతో కలిపి తన్ను తాను ప్రదర్శించుకుంటుంది. ఎందుకంటే ఆలోచన అంటేనే కాలం. నాకు మునుపు వచ్చిన వ్యాధి గురించి నేను ఆలోచిస్తాను. నాకు బాధ అంటే యిష్టం లేదు, బాధ మళ్ళీ తిరిగి వస్తుందని నేను భయపడతాను. నాకు బాధ అనే ఒక అనుభవం జరిగింది; దానిని గురించి ఆలోచించడం, అది నాకు రాకూడదని కోరుకోవడం భయాన్ని సృష్టిస్తాయి. భయానికి సుఖానికి చాలా సన్నిహిత సంబంధం వుంది. మనలో చాలా మందిని సుఖమే నడిపిస్తుంది. జంతువులకీ లాగే మనకి కూడా సుఖం చాలా ప్రధానమైనది. ఈ సుఖం అనేది ఆలోచనలోని భాగమే. మనకు సుఖం కలిగించిన ఒకదానిని గురించి ఆలోచించడంవల్ల ఆ సంతోషం లేదా ఆ సుఖం మరికాస్త ఎక్కువవుతుంది. అవును కదూ? ఇదంతా మీరు గమనించలేదూ? ఒక సంతోషకరమైన అనుభవం మీకు కలుగుతుంది. అందమైన ఒక సూర్యాస్తమయం లేదూ సెక్స్- దానిని గురించి మీరు ఆలోచిస్తారు. దానిని గురించి ఆలోచించడం వల్ల (సుఖం) ఎక్కువవుతుంది. ఒకప్పుడు మీకు కలిగిన బాధను గురించి ఆలోచించడం భయాన్నీ పుట్టించినట్లుగానే యిదీ, కాబట్టి ఆలోచనే సుఖాన్నీ, భయాన్నీ సృష్టిస్తున్నది. అవును కదూ? సుఖం కావాలని, ఆ సుఖం యింకా కొనసాగాలని ఒత్తిడి జరగడానికి ఆలోచనే కారణం; భయాన్ని పుట్టించడంలో భయభీతిని కలిగించడంలో బాధ్యత ఆలోచనదే. మనంతట మనమే యిది చూడవచ్చు. ఇది నిజంగానే ప్రయోగం జరిపి తెలుసుకున్న వాస్తవం.
ఇప్పుడు, “సుఖం గురించి కాని, బాధ గురించి కాని ఆలోచించకుండా వుండటం సాధ్యమేనా? ఆలోచన యొక్క ఆవశ్యకత లేనప్పుడు కాకుండా ఆలోచన ఆవశ్యకమైనప్పుడు మాత్రమే ఆలోచించడం సాధ్యమేనా?” అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకుంటారు, సర్! ఒక కార్యాలయంలో మీరు వుద్యోగం చేస్తున్నప్పుడు, ఒక ప్రత్యేకమైన పనిని నిర్వహిస్తున్నప్పుడు ఆలోచన అవసరం; అది లేకపోతే మీరు ఏ పనీ చేయలేరు. వుపన్యసిస్తున్నప్పుడు, వ్రాస్తున్నప్పుడు, సంభాషణ జరుపు తున్నప్పుడు, మీరు మీ కార్యాలయానికి వెళ్ళినప్పుడు ఆలోచన అవసరం. అక్కడ అది ఖచ్చితంగాను, నిష్పక్షపాతంగాను వుండాలి. అక్కడ మన అభిరుచి, మన స్వభావలక్షణం ఆలోచనను నడిపించకూడదు. అయితే యితర కార్యకలాపాలకు ఆలోచన అవసరం వున్నదా?
దయచేసి దీనిని అర్ధం చేసుకోండి. ఆలోచన మనకు చాలా ముఖ్యమైనది; మనకు వున్న ఒకే ఒక పనిముట్టు ఆదే. స్మృతి ప్రతి స్పందించడమే ఆలోచన. స్మృతి అంటే అనుభవం ద్వారా, జ్ఞానం ద్వారా, సంప్రదాయం ద్వారా పోగుచేసుకున్నది. స్మృతికి కారణమైనది కాలం; స్మృతి జంతువుల నుండి సంక్రమించినది. ఈ నేపధ్యంలో మనం ప్రతి స్పందిస్తూ వుంటాం. ఈ ప్రతిస్పందనే ఆలోచన. కొన్ని కొన్ని రంగాలలో ఆలోచన ఆవశ్యకత వుంది. అయితే ఆలోచన భవిష్యత్తుగానూ, గతంలోనూ తనని తాను మానసికమైన స్థాయిలో ప్రదర్శించుకున్నప్పుడు, అప్పుడు ఆలోచన భయాన్నీ, సుఖాన్నీ కూడా సృష్టిస్తుంది. ఈ విధానంలో మనసు మొద్దుబారిపోతుంది. కాబట్టి క్రియ లేని జడత్వం తధ్యం. సర్! ఆలోచన వల్లనే భయం కలుగుతున్నది. ఉద్యోగం పోతుందేమోనని ఆలోచించడం, నా భార్య మరొకరితో కలిసి పోరిపోతుందేమోనని ఆలోచించడం, మరణం గురించి, జరిగిపోయిన దానిని గురించి ఆలోచించడం మొదలైనవి. ఆలోచన గతాన్ని గురించిగానీ, భవిష్యత్తును గురించి గానీ ఒక మనోతత్వంగానో స్వీయ రక్షణ కోసమో ఆలోచించడం మానేయ్యగలదా?
మీకు యీ ప్రశ్న అర్ధం అవుతున్నదా? చూడండి, మనస్సు- అందులోనే మెదడు కూడా వున్నది- తానే భయాన్ని తయారు చేయగలదు, దానిని తట్టుకోనూ గలదు. భయాన్నీ తట్టు కోవడం అంటే దానిని అణచివేయడం, క్రమశిక్షణలో పెట్టడం, అదుపులో పెట్టడం, దానిని కొంత మార్చివేసి మరో పేరు పెట్టడం అనమాట. అయితే యిదంతా వుంటే ఘర్షణ వుంటుంది, వుండదూ? నేను భయపడుతున్నప్పుడు, “దీనిని అదుపులో పెట్టాలి, దీని వద్ద నుంచి పారిపోవాలి, దీనికి దూరంగా వెళ్ళిపోవాలి” అని నాలో నేనే అనుకుంటాను- దీనంతటికీ అర్ధం సంఘర్షణ వున్నదని; వున్నది కదూ? ఈ సంఘర్షణ వలన శక్తి వృధా అవుతుంది. అయితే భయం ఎట్లా పుడుతుందో నేను అవగాహన చేసుకుంటే, అప్పుడు దానితో నేను తలపడగలను. ఆలోచన భయాన్ని ఎట్లా సృష్టిస్తున్నదో నేను చూశాను. అందుకని, “ఆలోచన ఆగిపోవడం సాధ్యమేనా, లేకపోతే భయం అట్లాగే కొనసాగుతుంది కదా?” అని నన్ను నేను ప్రశ్నించుకుంటాను. ఆ తరువాత, “ఎందుకు నేను భవిష్యత్తును గురించి ఆలోచిస్తాను? రేపును గురించి ఎందుకు ఆలోచిస్తాను?” అనో, “ఎందుకు నిన్న పడిన బాధను గురించో, నిన్నటి సుఖాన్ని గురించో నేను ఆలోచిస్తాను?” అనో నన్ను నేను ప్రశ్నించుకుంటాను.
దయచేసి నెమ్మదిగా వినండి; ఆలోచన భయాన్ని సృష్టిస్తుందని మనకు తెలుసు. ఆలోచన విధుల్లో ఒకటి ఏమిటంటే నిరంతరం వ్యాపకంతో వుండటం, ఏదో ఒక దానిని గురించి ఆలోచిస్తూ వుండటం. ఒక గృహిణి ఆహారాన్ని గురించి, పిల్లలు, బట్టలుతకడం ఇవన్నీ ఆమె వ్యాపకాలు- వీటిని గురించే ఎప్పుడూ ఆలోచిస్తున్నట్లు. ఆ వ్యాపకాలు తీసివేయండి, ఆమె ఆయోమయంలో పడిపోతుంది, పూర్తిగా సుఖశాంతులు కోల్పోయి, ఒంటరి తనంతో బోధపడుతుంది. దేవుడిని పూజించే మనిషి వద్ద నుండి, దైవభక్తితో పూర్తిగా నిండిపోయిన మనిషి వద్ద నుండి దేవుడిని తీసెయ్యండి; ఆతను పూర్తిగా అయోమయంలో పడిపోతాడు. కాబట్టి ఆలోచన ఏదో ఒక దానిని గురించిన వ్యాపకంతో వుండాలి. అది తనని గురించి కానివ్వండి, రాజకీయాల గురించి కానివ్వండి; ఒక విభిన్నమైన ప్రపంచాన్ని, ఒక కొత్త సిద్ధాంతాన్ని తయారుచేయడం ఎట్లా అనేదానితోకానీ, మరొకదానితో కానీ, ఈ మనసుకి వ్యాపకం పుండాలి. మనలో చాలా మందిమి వ్యాపకం వుండాలనే కోరుకుంటాం. లేకపోతే ఆయోమయంలో పడిపోతాం; లేకపోతే ఏం చేయాలో మనకి తోచదు, ఒంటరిగా వున్నట్లు అనిపిస్తుంది, నిజంగా మనం ఏమిటో అది ఎదురుగా నిలబడి మనల్ని నిలదీస్తుంది. ఆర్థం అయిందా? అందువల్ల మీరు వ్యాపకంలో వుంటారు, ఆలోచన వ్యాపకాన్ని పెట్టుకుంటుంది. ఇది మీ వైపుకి మీరు, యదార్థంగా మీరు ఏమిటో దాని వైపుకి చూసుకోకుండా మిమ్మల్ని నిరోధిస్తుంది.
ఒక విభిన్నమైన ప్రపంచాన్నీ, ఒక విభిన్నమైన సాంఘిక క్రమాన్ని తీసుకొని రావాలని మనం ఆపేక్షిస్తున్నాం. మన అక్కర మత విశ్వాసాలను గురించి కానీ, అంధాచారాలను గురించి కానీ, మూఢ నమ్మకాలను గురించి కానీ కాదు. నిజమైన మతం అంటే ఏది అనే దాన్ని గురించి, అది తెలుసుకోవాలంటే భయం వుండకూడదు. ఆలోచనే భయానికి ఆలవాలమని, ఆలోచనకు ఏదో ఒక వ్యాపకం వుండాలని, లేని పక్షంలో తాను అయోమయంలో వున్నట్లుగా అనుకుంటుందని మనం గ్రహించాం. దేవుడు అనే వ్యాపకాన్ని, సంఘసంస్కరణ మొదలైనవి వ్యాపకాలుగా పెట్టుకోవడానికి ఒక కారణం ఏమిటంటే ఒంటరిగా వుండాలంటే మనకి భయం కనుక, మన లోపల ఖాళీగా వుంటే మనం భయపడతాం కనుక. ప్రపంచమంటే ఏమిటో మనకి తెలుసు: క్రూరత్వం, వికృతత్వం, హింస, యుద్ధాలు, వైషమ్యాలు, వర్గ, జాతి విభేదాలు మొదలైనవి గల ప్రపంచం యిది. ప్రపంచం ఏమిటో- అది యిట్లా వుండాలి అని మనం వూహించేది కాదు. యదార్ధంగా ఏమిటో తెలుసుకున్నాక, దానిలో ఒక సమూలమైన పరివర్తన తీసుకొనిరావడమే మన బాధ్యత. ఆ పరివర్తన తీసుకొని రావాలంటే మనిషి మెదడులో బ్రహ్మాండమైన మ్యుటేషన్ అంటే వుత్పరివర్తనం జరగాలి; అయితే ఏ విధమైన భయం వున్నా యిా పరివర్తన జరగదు.
అందువల్ల, 'మనం పూర్తిగా, పరిపూర్ణంగా జీవించడానికిగాను ఆలోచనను అంతమొనరించడం సాధ్యమా' అని మనల్ని మనమే ప్రశ్నించుకుంటాం. మీ రెప్పుడైనా గమనించారా, సంపూర్ణమైన సావధానంతో మీరు వున్నప్పుడు, మీ ధ్యాసనంతా పరిపూర్ణంగా ఒకదానికి యిచ్చినప్పుడు, పరిశీలించేవాడు వుండడనీ, కాబట్టి ఆలోచించేవాడూ వుండడని; ఒక కేంద్రస్థానం వుండటం, అక్కడినుండి 'మీరు' పరిశీలిస్తూ వుండటం వుండదని? ఎప్పుడయినా చేసి చూడండి. పూర్తి సావధానత్వంతో వుండండీ- 'ఏకాగ్రత' కాదు. 'ఏకాగ్రత' తో వుండటం అనేది బొత్తిగా అర్థంలేని ఒక ఆలోచనా ప్రక్రియ, అంతకంటే మూర్ఖత్వం మరొకటి లేదు. పారశాలలో చదువుకొనే చిన్న పిల్లవాడు కూడా యిది చేయగలడు; మనం ప్రస్తావించుకుంటున్నది 'సావధానశీలత్వం' గురించీ- అంటే సావధానంగా వుండటం. ఇప్పుడు మీరు కనుక మీ మొత్తం అస్తిత్వంతో, మీ మనసుతో, మీ మెదడుతో, మీ నరాలతో, సంపూర్ణమైన మీ శక్తితో కనుక వింటున్నట్లవుతే - వినడం మాత్రమే; అంగీకరించడం కాదు, విభేదించడం కాదు, పోల్చి చూడటం కాదు, అసలైన సంపూర్ణమైన సావధానతలో వినడం- అప్పుడు వింటూవున్న, పరిశీలిస్తూ వున్న ఒకరు వున్నారా? పరిశీలకుడు అనేవాడు లేనేలేడని మీరు కని పెడతారు. సరే, ఒక చెట్టువైపు మీరు చూస్తున్నప్పుడు, సంపూర్ణమైన సావధానతతో చూడండి. ఇక్కడ ఎన్నో వృక్షాలు వున్నాయి, వాటివైపు చూడండి. సాయంకాలాల్లో కాకులు గూళ్ళు చేరుతున్న శబ్దాలను వింటున్నప్పుడు, వాటిని సంపూర్ణంగా వినండి. 'నాకు ఆ ధ్వనులు యిష్టం' అని కానీ, 'నాకు ఆ ధ్వనులు యిష్టంలేదు' అని కానీ ఆనకండి. మీ హృదయంతో, మీ మనసుతో, మీ బుద్ధితో, మీ నరాలతో వినండి, సంపూర్ణంగా, అదే విధంగా, ఆలోచన మధ్యలో కలుగ చేసుకొనడం అనేది లేకుండా చెట్టును చూడండి - అంటే అర్ధం పరిశీలకుడికి, పరిశీలిస్తున్న విషయానికీ నడుమన ఎడం లేదని, అటువంటి మొత్తమైన, సంపూర్ణమైన సావధానత వున్నప్పుడు, పరిశీలకుడు అనే వాడు వుండడు. ఈ పరిశీలకుడే భయానికి వూపిరిపోసి పోషిస్తాడు. ఎందుకంటే యీ పరీశీలకుడు ఆలోచనలకు కేంద్రస్థానం; అదే యీ 'నా', యీ 'నేను', 'స్వార్ధం', యీ 'అహం' అనేది. ఈ పరిశీలకుడే తనకి నచ్చని వాటిని కత్తిరించి వేస్తూ వుంటాడు. అయితే నేను చెప్తున్న ఆ స్థితి ఏమీ లేని స్థితి కాదు. అది తెలుసుకోవాలంటే దేనీనీ ఆమోదించకుండా చాలా లోతుగా శోధించ వలసిన అవసరం వుంటుంది.
చూడండి, మీరు మీ జీవితకాలమంతా ఆమోదిస్తూనే గడుపుకొస్తున్నారు. సంప్రదాయాన్ని ఆమోదించారు; సమాజాన్ని వున్నదాన్ని వున్నట్లుగా ఆమోదించారు. అన్నీంటికీ 'అవును' 'అవును' అనీ తలవూపే ప్రాణి మీరు, అంతే. వీటిలో ఏ ఒక్కదానినీ ఏనాడూ మీరు కాదనలేదు. కాదు అని మీరు అన్నా అది కేవలం తిరుగుబాటు మాత్రమే. తిరుగుబాటు కూడా తనదైన ఒక పద్దతిని తయారు చేసుకుంటుంది. అదే మళ్ళీ అలవాటుగా, ఆచారంగా అయిపోతుంది. అయితే, సమాజ నిర్మాణం సమస్తాన్నీ కనుక మీరు అర్ధంచేసుకున్నట్లవుతే, అది సంఘర్షణలు, పోటీలు, దేవుడి పేరో, దేశం పేరో, శాంతి పేరో చెప్పుకొని దయాదాక్షిణ్యాలు లేకుండా స్వార్ధాన్ని పెంచుకోవడం మొదలైన వాటి మీద ఆధారపడి వున్నట్లు గ్రహిస్తారు.
కాబట్టి భయాన్నుండి విముక్తి పొందాలంటే సంపూర్ణమైన సావధానత వుండాలి. ఈ సారి మీ మనసులో భయం ఆవరించుకుంటున్నప్పుడు- ఏం జరగబోతోందో అనే భయమో, మునుపు జరిగినదేదో మళ్ళీ తిరిగిరావచ్చుననే భయమో ఆవరిస్తున్నప్పుడు దానికి మీ సంపూర్ణమైన సావధానతను యివ్వండి. దానినుండి పారిపోకండి, దానిని మార్చాలని చూడకండి, దానిని అణచివేయాలని ప్రయత్నించ కండి, దానిని అదుపులో పెట్టాలనీ ప్రయత్నించకండి, పూర్తిగా, సంపూర్ణంగా, మీ మొత్తం సావధానత అంతటితోనూ దానితోటే వుండిపోండి, అప్పుడు, పరిశీలకుడు అనేవాడు లేకపోవడంవల్ల భయం కూడా లేదని మీరు గ్రహిస్తారు.
మనలో వుండే విచిత్రమైన భ్రాంతుల్లో ఒకటి ఏమిటంటే అంతఃచేతన అనేది ఒకటి లోపల ఎక్కడో లోతుగా పాతుకొని పోయివున్నదనీ, దానిలో నుండి రకరకాల భయాలు బయటకు వస్తుంటాయనీ అనుకోవడం. అర్థమైందా? చేతనా వర్తం అంతటికీ కొన్ని పరిమితులున్నాయి. ఈ పరిమితులుగల చేతనకు, నిబద్ధీకరణం చెందిన యీ సత్వానికి ఆవలగా పోవాలంటే దానిని 'చేతన' గాను 'అంతఃచేతన' గాను విభజించడం వల్ల ఏ మాత్రం లాభం లేదు. ఉన్నది చేతనావర్తం మాత్రమే; వర్తమాన క్షణంలో కనుక మీరు సంపూర్ణమైన సావధానతతో వుంటే, అప్పుడు మీరు అంతఃచేతనను, పరిమితులుగల చేతననూ కూడా తుడిచిపెట్టి వేయగలుగుతారు.
సావధాన శీలతను అలవరచుకోవడం సాధ్యం కాదు. సావధానతను సంపాదించడానికి ఒక పద్ధతిగాని, ఒక విధానంగానీ, ఒక శిక్షణగానీ లేదు. ఎందుకంటే సావధానంగా వుండటం కోసం ఒక పద్ధతిని మీరు అవలంబించారంటే, పరధ్యానాన్ని అలవరచుకుంటున్నారన్న మాట. ఇక్కడ మీరు పరధ్యానంగా వుండటం ద్వారా సావధానతను అలవరచుకోవాలని అపేక్షిస్తున్నారన్నమాట. ఒక పద్ధతినిగాని, ఒక విధానాన్నిగాని అనుసరిస్తున్నప్పుడు మీరు చేస్తున్నది ఏమిటి? ఒక నిర్ణీతమైన కార్యక్రమాన్ని మళ్ళీ మళ్ళీ చేయడం ద్వారా యాంత్రికంగా కొన్ని అలవాట్లను అలవరచుకుంటున్నారు; దీనివలన మనను మందకొడిగా తయారవుతుంది. దీనివలన, మనసుకు చురుకుదనం కలగదు, మీరు గనుక ఒక సెకను సేపు కాని, ఒక నిముషం సేపు కానీ సంపూర్ణమైన సావధానతను చూపారంటే, అప్పుడు యీ క్షణికమైన సంపూర్ణ సావధానత మీరు భయపడుతున్న దానిని తుడిచి వేసేస్తుంది. ఈ సావధానతలో పరిశీలకుడు కాని, పరిశీలిస్తున్న అంశం కానీ రెండూ వుండవు. అప్పుడు మనం దేనిని పరిశీలిస్తున్నామో అదే పరిశీలకుడు కూడా. అయితే, యిది అర్ధం చేసుకోపోలంటే, దీనిని గ్రహించాలంటే స్థలం-కాలం అనే మొత్తం సమస్యను మనం తరచి శోధించాలి.
అయితే చూడండి, అవస్థ ఏమిటంటే- మన నిబద్ధీకరణ ఎంత పటిష్టంగా వుంటుందంటే అసలు మనం సూటిగా చూడనూ లేము, అడగలేము, ఏ ప్రశ్నలూ వేయలేము. మనకి ఏ సందేహాలూ రావు. మనం అంతా అనుయాయులం. మనందరం “అవునవును” అంటూ తలలూపే జీవులం. ప్రస్తుత విషమస్థితి మీరు మరొకరిని అనుసరించడానికి వీల్లేదని గట్టిగా హెచ్చరిస్తున్నది. గందరగోళంలో చిక్కుకున్న మీరు మరొకరిని అనుసరించకూడదు. ఎందుకంటే గందరగోళపు స్థితిలో వున్న మీరు యింకొకరినీ అనుసరిస్తున్నారంటే, అయోమయంలో పడి అనుసరిస్తున్నారు తప్ప సుస్పష్టంగా తెలుసుకొని కొదు. స్పష్టంగా తెలుసుకొని వుంటే మీరు యింకొకరిని అనుసరించడం అనేది వుండనే వుండదు. మీరు గందరగోళపు స్థితిలో వుండటం వలన మరొకరిని అనుసరిస్తూ వుంటే మరికొంత గందరగోళాన్ని సృష్టిస్తారు. కాబట్టి ముందుగా మీరు చేయవలసినది ఏమిటంటే యిక్కడ ఆగి, లోతుగా శోధించండి. సూటిగా చూడండి, వినండి.
దురదృష్టం ఏమిటంటే, యీ దేశపు సంస్కృతి అని అంటూవుంటామే అది. చాలా పురాతనమైనది. 'సంస్కృతి' అనే పదం చాలా గొప్పదే; కానీ రాజకీయవేత్తలు, బుద్ధి కొంచెం తక్కువగా వున్నవారు, అంటే కొత్తది ఏదీ ఆలోచించడం చేతగానివారు యీ మాటను పాడుచేసి పెట్టారు. తమ బుద్దిహీనతకీ ముసుగువేసి దాచడానికి సంస్కృతి అనే యీ మాటని వాళ్ళు వుపయోగించుకున్నారు. అయితే విభిన్నమైన మరొక సంస్కృతిని- సంస్కృతి అంటే అర్ధం ఎదుగుదల, వికాసం; జడమైన స్థితిలో ఆగిపోయి వుండటం కాదు- తీసుకురావాలంటే, దానిని అవగాహన చేసుకోవాలంటే ముందుగా మనతోనే ఆరంభించాలి. ఎందుకంటే మీరు యీ సంస్కృతికి- ఎన్నో సంప్రదాయాలతో, ఎన్నో అంధాచారాలతో, ఎన్నో భయాలతో కూడుకొనివున్న, మతము, సాంఘిక విభజనలు, భాషా భేదాలు వున్న యీ భారతీయ సంస్కృతికి పుట్టిన ఫలితమే కాబట్టి. ఈ సమస్తంలో మీరూ ఒక భాగం. అదీ మీరంటే. దాని నుంచి మీరు విడిగా లేరు. నేను ఏమిటి అనే స్పృహ కలిగి, మీ సంపూర్ణ సావధానతను దానికి యిచ్చిన తక్షణమే, ఆ క్షణంలోనే అదంతా మీ నుండి రాలిపడిపోతుందని గ్రహిస్తారు. అప్పుడు గతం అనే దానినుండి పూర్తిగా విముక్తులవుతారు. మీ నిబద్దీకరణం గురించిన ఎరుక కలిగివున్నప్పుడు దానంతట అదే రాలిపోతుంది. స్వయం సంకల్పం వల్ల కాదు, అభ్యాసం వల్ల కాదు; ఒక ప్రతిచర్య లాగానూ కాదు; కేవలం మీరు సావధానతతో వుండటం వలన నిబద్ధీకరణ నుండి స్వేచ్ఛ కలుగుతుంది.
అయితే మనలో చాలామంది పరాకుగానే జీవితాన్ని దాటవేస్తుంటారు. చాలా అరుదుగా మనం సావధానతతో వుంటాం. ఒక హిందువుగానో, ఒక బౌద్ధుడిగానో, కమ్యునిస్టుగానో, సోషలిస్టుగానో మరోవిధంగానో మన నిబద్దీకరణను బట్టి సాధారణంగా మనం ప్రతిస్పందిస్తూ వుంటాం. అంటే మనం పెరిగిన వాతావరణాన్ని అనుసరించి మన సమాధానాలు వస్తూ వుంటాయి. కాబట్టి ఆ విధమైన ప్రతిస్పందనలు మళ్ళీ కొంత దాస్యత్వాన్ని, యింకా కొంత నిబద్ధీకరణను కలిగిస్తాయి. మీ నిబద్ధీకరణం గురించి మీకు ఎరుక కలిగినట్లయితే ఆ స్పృహ కనుక కలిగి. కాస్త సావధానత కనుక చూపిస్తే- అప్పుడిక మీ మనసు చేతన, అంతఃచేతనగా విభజింపబడిలేదని గ్రహిస్తారు; అప్పుడు మీ మనసు తుదీమొదలూ లేకుండా వాగుతూవుండటం అనేది ఆపినట్లుగా గ్రహిస్తారు. అందువల్ల మీ మనస్సు అత్యంతమైన సున్నితత్వాన్ని పొందుతుంది. చాలా సున్నితంగా వుండే మనస్సు మాత్రమే నిశ్శబ్దంగా వుండ గలుగుతుంది- కర్కశంగా తయారయిన మనస్సు కాదు; క్రమశిక్షణతో, కట్టుబాట్లతో, సర్దుకొని పోవడం ద్వారా, లొంగిపోయి వుండటం ద్వారా చిత్రహింసలకు లోనయిన మనస్సూ కాదు. ఇటువంటి మనస్సు ధ్యానం అనే పేరు పెట్టి మంత్రాలు వల్లె వేయడం ద్వారా ఏనాటికీ నెమ్మదిని పొందలేదు. ధ్యానం అనేది చాలా భిన్నమైనది; అది పూర్తిగా మరొకటి- ఆ విషయాన్ని గురించి వీలవుతే మనం మరొకసారి మాట్లాడుకుందాం.
మేము చెప్పినట్టుగా, భయపడుతున్న మనసుకు, అది ఎంత ప్రయాసపడినా సరే, ప్రేమ అనేది ఏ మాత్రం తెలియదు; ప్రేమ లేకుండా ఒక నూతన ప్రపంచాన్ని మీరు నిర్మించలేరు. ప్రేమ లేకుండా ఒయాసిస్సూ వుండదు. మీరే, మనుష్యులమని అనుకుంటున్న మీరే నిర్మించిన యీ సామాజిక చట్రంలో మీరు చిక్కుకొని పోయారు. దీనిలో నుంచి బయట పడాలంటే- దీనిలోనుంచి పూర్తిగా బయటపడి తీరాలి. మిమ్మల్ని మీరు అవగాహన చేసుకోవాలి. యదార్థంగా మీరు ఏమిటి అన్నది మీ అంతట మీరే పరిశీలించుకోవాలి. అప్పుడు, ఆ తేటపడిన దానిలో నుండి క్రియ ఆవిర్భవిస్తుంది. అప్పుడు పునరుక్తి చేయడం కానటువంటిది, లొంగిపోయివుండటం కానిది, అనుకరించడం కానిది అయిన ఒక నవ్యమైన జీవనమార్గాన్ని మీ అంతట మీరే కని పెడతారు. అదే నిజమైన స్వేచ్ఛగల జీవితం. అందువల్లనే ఆ జీవితం ఆలోచన అంతటికీ ఆవలగా వుండే ఒకదానికి తలుపులు తెరిచి వుంచుతుంది.
ది కలెక్టెడ్ వర్క్ ఆఫ్ జె. కృష్ణమూర్తి, XVII వాల్యూమ్,
మొదటి ప్రసంగం, బొంబాయి, 1967