కృష్ణమూర్తి తత్వం పరిచయ సంపుటం/పారమార్థిక జీవనం
పారమార్థిక జీవనం
ప్రశ్నిస్తున్నవారు : పారమార్థిక జీవనం అంటే ఏమిటో నాకు తెలుసుకోవాలని వుంది. కొన్ని నెలల తరబడి ఆశ్రమాలలో నివసించాను. ధ్యానం చేశాను. క్రమశిక్షణా బద్దమైన జీవితం అనుసరించాను. ఎంతో చదివాను. అన్ని రకాలైన దేవాలయాలకు, చర్చీలకు, మసీదులకు వెళ్ళి చూశాను. నిరాడంబరంగా వుండే సాధుజీవనం గడపడానికి, మనుష్యులకు గాని, జంతువులకు గాని ఏమాత్రం హాని కలిగించకుండా బ్రతకడానికి ప్రయత్నించాను. పారమార్థిక జీవనం అంటే యింతేనంటారా? యోగాభ్యాసం చేశాను. 'జెన్' అధ్యయనం చేశాను. ఎన్నో మతాలకు చెందిన పద్ధతులను అనుసరించాను. ఇప్పుడూ, మొదట్లోనూ ఎప్పుడూ నేను శాకాహారినే. నాకు వృద్ధాప్యం సమీపిస్తున్నదని మీరు గమనించే వుంటారు. ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో వున్న ఎందరో సాధుపుంగవులతో పాటు కలిసి నివసించాను. కాని యిదంతా అసలైనదాని అంచులను కూడా తాకకుండా బయటే వుండిపోయిందని నాకు ఎందుచేతనో అనిపిస్తున్నది. అందుకని, మీ దృష్టిలో పారమార్థిక జీవనం అంటే ఏమిటో అది చర్చిస్తే బాగుండుననిపిస్తున్నది.
కృష్ణమూర్తి : ఒకరోజు సన్యాసి ఒకరు నన్ను కలవడానికి వచ్చారు. చాలా దిగులు పడుతున్నట్లుగా కనిపించారు. ఆయన బ్రహ్మచర్యవ్రతం చేపట్టారుట. సన్యాసం పుచ్చుకొని వూరూరా తిరుగుతూ భిక్షాటనతో కాలం గడుపుతున్నారు. అయితే, తనలో కలిగిన శరీరవాంఛల ధాటికి తట్టుకోలేక, ఒకరోజు తన మర్మావయవాలను శస్త్రచికిత్సకుని సహాయంతో తొలగించుకున్నారు. నెలల తరబడి వేధించిన ఆ నొప్పిని భరించారు. ఏదో విధంగా అదంతా నయమైపోయింది. చాలా యేళ్ళు గడిచాక తాను చేసిన పని ఏమిటో గ్రహింపుకి వచ్చింది. అందుకని నన్ను కలవడానికి వచ్చారు. ఆ చిన్నగదిలో కూర్చున్నాం; యీ విధంగా అంగవిచ్ఛేదం చేసుకున్నాననీ, మళ్ళీ మామూలుగా అవడానికి - అంటే శారీరకంగా కాదు, అంతర్గతంగా - ఏం చేయాలనీ అడిగారు. ఇదంతా ఆయన ఎందుకు చేశారంటే ధార్మిక జీవనానికి సెక్స్ సంబంధమైన కార్యకలాపాలు పనికిరావని అంటారు కాబట్టి. సెక్స్ అంటే చాలా ఐహిక విషయమూ, సుఖలోలత్వానికి సంబంధించినదీ, నిజమైన సన్యాసి వాటి దరిదాపులకు కూడా పోగూడదనీ అంటుంటారు. నన్ను చూడండి నా మనుషత్వమే పోగొట్టుకొని ఆయోమయంలో పడిపోయాను. నాలోని కామవాంఛలను నిరోధించాలని, అణచి వేయాలని సకల ప్రయత్నాలు చేశాను. చివరికది యింత దారుణంగా పరిణమించింది. ఇప్పుడిక నేనేం చేయాలి? నేను చేసింది తప్పనీ నాకు తెలుసు. నాలోని శక్తి అంతా దాదాపుగా అణగారిపోయింది. ఇక అంధకారంలోనే జీవితం ముగిసిపోయేటట్లుగా వుంది,' అని ఆయన అన్నారు. నా చేతిని పట్టుకొని కొంతసేపు కూర్చున్నారు. ఇద్దరం నిశ్శబ్దంగా వుండిపోయాం.
ఇది పారమార్థిక జీవనమా? పారమార్థిక జీవితం గడపడానికి సుఖాన్నీ, సౌందర్యాన్నీ త్యజించడం ఒక మార్గమా? ఆకాశంలోను, కొండలలోను, మనిషి రూపురేఖల్లోనూ వున్న సౌందర్యాన్ని కాలద్రన్నడం ద్వారా పారమార్థిక జీవనాన్ని చేరుకోగలమా? అయితే చాలామంది మహాత్ములు, సన్యాసులు దీన్నే నిజమని నమ్ముతున్నారు. ఈ నమ్మకంతో తమని తాము చిత్రహింస చేసుకుంటున్నారు. చిత్రహింసలకు లోనై, వికలమైపోయిన మనసు పారమార్థిక జీవనం అంటే ఏమిటో తెలుసుకోగలుగుతుందా? అయితే పరమసత్యాన్ని లేదా దైవాన్ని లేదా వీళ్ళు పెట్టిన మరో పేరు ఏదయినా సరే దానిని చేరుకోవాలంటే యీ చిత్రహింస, యీ వక్రత్వం తప్ప మరో మార్గం లేదని అన్నీ మతాలూ నొక్కి చెప్తున్నాయి. ఆధ్యాత్మిక లేదా పారమార్థిక జీవనం అని వాళ్ళు పేరు పెట్టిన దానికి, ప్రాపంచిక లేదా ఐహిక జీవనం అని వాళ్ళే అంటున్న దానికీ చాలా అంతరం వుందని వాళ్ళు అంటారు. అడపాదడపా కొంత ఆవేదన, కొంత భక్తి తనలో కనబడి మాయమవుతున్నా, అసలు సుఖపడటం కోసమే జీవిస్తున్న మనిషి, తన జీవితకాలమంతటినీ వినోదాలతోను, కాలక్షేపాలతోను గడిపే మనిషి నిస్సందేహాంగా ప్రాపంచిక లోకానికి చెందినవాడే. అతనిలో బుద్ధి చాతుర్యం వుండవచ్చు, పాండిత్యం వుండవచ్చు, ఎప్పుడూ గొప్ప గొప్ప ఆలోచనలు, యితరులు చెప్పినవో, తన స్వంతమైనవో చేస్తుండవచ్చు. అయినా సరే. ఒకరిని ఒక గొప్ప కళ వరిస్తుంది. ఆ కళను అతడు సమాజం కోసమో, తన సంతోషం కోసమో ప్రదర్శిస్తూ వుంటాడు. తనలోని ఆ కళాప్రతిభను సఫలీకృతం చేసుకోవడం ద్వారా గొప్ప కీర్తి కూడా ఆర్జించి వుండవచ్చు. అటువంటి వ్యక్తి కూడా నిస్సందేహంగా ప్రాపంచిక లోకానికి చెందినవాడే. అంతే కాదు. చర్చికి, దేవాలయానికి, మసీదుకి వెళ్ళడం, ప్రార్థనలు చేయడం, స్వమత దురభిమానంలో, పక్షపాతంలో పూర్తిగా మునిగిపోయి, అందులోనూ క్రూరత్వం వున్నదనే గ్రహింపు లేకపోవడం కూడా ఐహిక ప్రపంచానికి సంబంధించినవే. దేశాభిమానం, జాతీయాభిమానం, ఆదర్శవాదమూ కూడా ప్రాపంచిక విషయాలే, ఆశ్రమంలో ముక్కు మూసుకొని కూర్చుని, ఝాము ఝాముకూ లేచి ఒక గ్రంథం చేతబుచ్చుకొని పారాయణం చేస్తూ, ప్రార్థనలు చేస్తూ వుండే వ్యక్తి కూడా నిస్సందేహంగా ప్రాపంచికుడే. లోకంలో మంచి పనులు చేయాలని బయల్దేరేవారు, సమాజ సంస్కర్తలవచ్చు, మత సేవకులవచ్చు - వారికి దేశం గురించి ఆరాటపడే రాజకీయవాదులకీ ఏమీ భేదం లేదు. పారమార్థిక జీవనానికీ, ప్రాపంచిక జీవనానికి మధ్యన ఒక గీత గీసి పెట్టేయడమే ప్రాపంచికత్వంలో వున్న ప్రధాన తత్వం. ఈ సన్యాసుల, మహాత్ముల, సంస్కర్తల మనసులకీ, జీవితంలో సుఖసంతోషాలను మాత్రమే వెతుక్కునే వారి మనసులకీ మధ్యన పెద్దగా భేదమేమీ లేదు.
కాబట్టి జీవితాన్ని ప్రాపంచికమనీ, ప్రాపంచికం కానిదనీ విభజించకుండా వుండటం ముఖ్యం. ప్రాపంచికాన్నీ, పారమార్థికమనీ మనం అనుకునేదానినీ వేరు చేసి చూడకుండా వుండటం ముఖ్యం. ఈ స్థూలప్రపంచం లేకుండా అంటే పదార్థం ప్రపంచం లేనప్పుడు మనమూ వుండం. ఆకాశపు ఆ సౌందర్యం, కొండమీద ఒంటరిగా నిలబడి వున్న ఆ చెట్టు, నడిచి వెళ్తున్న ఆ స్త్రీ, గుర్రపుస్వారీ చేస్తున్న ఆ పురుషుడు - యివన్నీ లేకుండా జీవితం వుండలేదు. మనం ఆలోచించవలసింది యీ మొత్తం జీవితం గురించి తప్ప, అందులోని ఒక ప్రత్యేక భాగం పారమార్థికమైనదనీ, తక్కినవి అందుకు వ్యతిరేకమైనవనీ అనే దృష్టితో కాదు. కాబట్టి పారమార్థిక జీవనం అంటే మొత్తం జీవితాన్ని గురించిన దృష్టి తప్ప, అది ఒక ప్రత్యేకమైన విభాగం కాదని మనం అర్థం చేసుకోవాలి.
ప్ర : మీరు చెప్తున్నది నాకు అర్థమయింది. మొత్తంగా మన సంపూర్ణ జీవితం గురించి యోచించాలి. ప్రాపంచికాన్ని పారమార్థికమనేదాని నుంచి విడదీయలేము. ఇప్పుడిక ప్రశ్న ఏమిటంటే - జీవితంలోని అన్ని విషయాలలోను పారమార్థికంగా వర్తించడం ఎట్లాగ?
కృ : పారమార్థికంగా వర్తించడం అంటే ఏమిటి? మీరంటున్నది విభజనలు లేకుండా వుండటం - అంటే ప్రాపంచికమని, పారమార్థికమనీ, ఎట్లా వుండాలి, ఎట్లా వుండకూడదు అనీ, యిష్టమూ, రోతా అనే విభజనలు లేని జీవన విధానం అనీ కదూ? ఈ విభజనే సంఘర్షణ. సంఘర్షణతో కూడుకున్న జీవితం పారమార్థిక జీవనం కాదు. సంఘర్షణను బాగా లోతుగా అవగాహన చేసుకుంటేనే పారమార్థిక జీవనం సాధ్యమవుతుంది. ఈ అవగాహనే తెలివి లేదా ప్రజ్ఞ. ఈ తెలివే సరియైన చర్యకు దారి తీస్తుంది. సాధారణంగా అందరూ ఏదో ఒక సాంకేతిక రంగంలో నేర్పునో, వ్యాపారంలో కపటాన్నో, రాజకీయపు కుతంత్రాలనో తెలివి అని అంటూ వుంటారు.
ప్ర : ఇంతకూ అసలు నా ప్రశ్న ఏమిటంటే - సంఘర్షణ లేకుండా ఎట్లా జీవించాలి. ఆవిధంగా ఒక నిజమైన పవిత్ర భావాన్ని పొందడం ఎట్లాగ అన్నది, అయితే యిది మతం అనే ఒక పంజరంలో నిబద్ధం అవడంవల్ల కలిగిన భక్తి అనే భావోద్వేగం కానే కాదు, ఆ పంజరం ఎంత ప్రాచీనమైనదైనా సరే, ఎంతో పూజనీయ మైనదైనా నరే.
కృ : ఎక్కడో ఒక పల్లెటూళ్ళో ఏ సంఘర్షణలూ లేకుండా జీవించే వ్యక్తిగాని, 'పునీతమైన' కొండలమీద ఒక గుహలో కూర్చుని కలలు కంటున్న వ్యక్తిగానీ మనం మాట్లాడుకుంటున్న యిటువంటి పారమార్థిక జీవనం గడపడంలేదని నిస్సందేహంగా చెప్పచ్చు. సంఘర్షణను అంతం చేయడం అనేది మహా సంక్లిష్టమైన విషయాల్లో ఒకటి, దానికి స్వీయ పరిశీలన కావాలి. బాహ్యమైన వాటి ఎడల, ఆంతర్గతమైన అన్నింటి ఎడల ఎరుకగా వుండటం అనే ఒక సున్నితత్వం వుండాలి. మనలో వుండే వైరుధ్యాలను గురించి అవగాహన కలిగినప్పుడే సంఘర్షణ అంతమవుతుంది. మనకు తెలిసినది అంటే గతం; ఆ గతం నుంచి విముక్తి చెందకపోతే యీ వైరుధ్యం ఎప్పటికీ అట్లాగే వుండిపోతుంది. గతం నుంచి విముక్తి అంటే ప్రస్తుతంలో జీవించడం. ప్రస్తుతం కాలానికి సంబంధించినది కాదు. గతం కాని, మనం తెలుసుకున్నది కాని స్పృశించని స్వేచ్ఛాపూరితమైన కదలిక వుంటుంది యీ ప్రస్తుతంలో.
ప్ర : గతాన్నుంచి విముక్తి అంటే ఏమిటి?
కృ : గతం అంటే మనం కూడబెట్టుకున్న జ్ఞాపకాలు. ఈ జ్ఞాపకాలే వర్తమానంలో పనిచేసి భవిష్యత్తుని గురించి ఆశలను, భయాలను తయారుచేస్తున్నాయి. ఈ ఆశలూ, భయాలూ మానసికమైన భవిష్యత్తు. ఇవి లేకుండా భవిష్యత్తు అనేది లేనే లేదు. కాబట్టి వర్తమానం అంటే గతం చేయిస్తున్న పని. మనసు అంటే గతం కలిగిస్తున్న కదలికలు, మనం భవిష్యత్తు అని అంటున్నది గతం వర్తమానంలో పనిచేస్తుండటం వల్ల తయారవుతున్నది. గతం జరుపుతున్న యీ ప్రతిస్పందన అంతా అప్రయత్నంగానే జరుగుతుంటుంది. దానిని రమ్మని ఆజ్ఞాపించడమూ లేదూ, ఆహ్వానించడమూ లేదు. మనం గ్రహించకముందే అది మన మీదకు వచ్చి కూర్చుంటున్నది.
ప్ర : అటువంటప్పుడు దానిని వదిలించుకొని ఎట్లా విముక్తి చెందగలుగుతాం?
కృ : ఎంపిక చేసుకోవడం అనేది లేకుండా యి కదలికలన్నింటి గురించి ఎరుకగా వుండటమే. ఎంపిక చేసుకోవడం అనేది కూడా మళ్ళీ యీ గతం యొక్క కదలికల్లోనిదే అవుతుంది. ఎరుకగా వుండటం అంటే గతం పనిచేయడాన్ని పరిశీలించడం. అటువంటి పరిశీలన గతం యొక్క కదలిక కాదు. ఆలోచన తయారు చేస్తున్న కాల్పనిక బింబాలు లేకుండా పరిశీలించడం - అనే చర్య గతం అంతరించి పోయిన చర్య. ఆలోచన లేకుండా చెట్టును పరిశీలించడం అనే చర్యలో గతం వుండదు. గతం చేస్తున్న చర్యని పరిశీలించడం కూడా గతం అన్నది లేని చర్యే. ఏది మనం చూస్తున్నామో అన్నదాని కంటే చూడటం అనే స్థితి ప్రధానమైనది. ఎంపిక రహితమైన ఆ పరిశీలనలో గతాన్ని గురించి ఎరుకగా వుండటం అంటే ఒక విభిన్నమైన చర్య చేయడమే కాకుండా విభిన్నంగా వుండటం కూడా. ఇటువంటి ఎరుకలో స్మృతి (జ్ఞాపకం} ఏ ఆటంకాలు లేకుండా చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. పారమార్థికత అంటే ఎంపిక చేసుకోవడం ఏమాత్రం లేని ఎరుక; ఇందులో మనం తెలుసుకున్నదాని నుండి స్వేచ్ఛ లభించివుంటుంది; అదే సమయంలో ఆ తెలుసుకున్నది ఎక్కడ పనిచేయాలో అక్కడ పని చేస్తూ వుంటుంది.
ప్ర : కాని మనం తెలుసుకున్నది, మన గతం మనం ఎంత వద్దనుకున్నా పనిచేస్తూ, ఘర్షణకు కారణమవుతూనే వుంటుంది.
కృ : ఆ సంగతి మీరు గ్రహిస్తూ వుంటే అది గతం పనిచేస్తూ వున్నప్పుడు గతం ఎడల క్రియాశూన్యంగా వుండిపోయే స్థితి అన్నమాట. కాబట్టి మనం తెలుసుకున్నదాని నుంచి విముక్తి పొందడమే అసలైన పారమార్థిక జీవనం. అంటే అర్థం తెలుసుకున్న దానిని పూర్తిగా తుడిచిపెట్టేయడం అని కాదు. పూర్తిగా విభిన్నమైన మరొక పరిమాణస్థితి లోనికి ప్రవేశించి, తెలుసుకున్న దానిని పరిశీలించడం. ఎంపిక చేయకుండా చూడటం ఆనే యీ చర్య ప్రేమపూర్వకమైన చర్య. పారమార్థిక జీవనం అంటే యిటువంటి చర్య. అసలు జీవించడం అంటేనే యిటువంటి చర్య. పారమార్థికమైన మనసు అంటే యిటువంటి చర్య. కాబట్టి మతమూ, మనసూ, జీవితమూ, ప్రేమా యివన్నీ ఒకటే.
(ది అర్జెన్సీ ఆఫ్ ఛేంజ్)