కృషీవలుడు/పద్యాలు 111-119
బారులుదీరి యంబరముపై చరియించెడు నీటికోళు లిం
పారగ సాంధ్యలక్ష్మి మెడయందు ధరించిన తారహార రే
ఖారమణీయతం జిలుక గాలువనీటికి నేగు కన్యకల్
వారక కొంతసేపు కనువాల్చక చూతురు విస్మయంబునన్. 111
గోపద ధూళి ధూసరిత గోపకుమారులు కాపుపిల్లలున్
మూపున కఱ్ఱలుం జలిదిబోనపు దుత్తలు, చంకలోన బె
న్మోపెడు దూడపల్పు లిడి మోహన వేణురవంబు సేయుచున్
మాపటివేళగా బసులమందలు దోల్కొనివచ్చి రిండ్లకున్. 112
స్వారిచేయు నిచ్చ భావంబు కలిగింప
బఱ్ఱె నెక్కి వచ్చు బాలు డొకడు;
వాని క్రిందద్రోయువఱకు బఱ్ఱెను బాది
సంతసించు రితరసఖులు నగుచు. 113
బడి విడిపించంగ బాలురు వీథుల
బరుగెత్తి యుప్పరపట్టెలాడ,
పంటచేలకు పనిపాటుల కేగిన
కర్షకు లిండ్లకు గదలుచుండ,
స్నానంబు లొనరించి సరసుల భూసురుల్
భక్తిభావన సంధ్య వార్చుచుండ,
సందాకవళమమ్మ సత్తెమేజయమని
యన్నార్థులగు భిక్షు లరుగుదేర
బక్షు లెల్లను గూళుల బట్టి చనగ
నచ్చతచ్చట దారక లవతరింప
మొలకచీకటి దిక్కులు మలినమయ్యె,
సంజ రాతిరి గర్భాన సమసిపోయె. 114
ఇంతకు రాడు కాంతుడని యింతి విచారముతోడ ద్వారబం
ధాంతరమందు నిల్చి కనులార్పక దారులు చూచుచుండ నీ
వంతగ నాలసింప దగవా, మగవారలయట్ల కాతర
స్వాంతలుగాక, కామిను లనాగతకష్టము లెంతు రెప్పుడున్. 115
ఆయెను రచ్చలోని వ్యవహారము, లూరక పొల్లుమాటలం
బోయెను నర్ధరాత్ర, మికబొమ్ము గృహమ్మునుజేర, బిడ్డలున్
నాయన నాయనంచు కరుణమ్ముగ నేడ్చుచునున్నవారు, ము
న్నాయితపెట్టె స్నానమునకై నులివెచ్చని నీరు భార్యయున్. 116
లయవిభాతి
చలువగల కప్పురము చిలికినటు చల్లనయి
లలితకలధౌత మృదువిలసనము పోలెన్
మొలకలిడు వెన్నెలల చెలువము దిగంతముల
కలముకొని తారకల తళుకులను గప్పం
గలువపొడి గందవొడి దొలక సుడి రేగుచును
మెలగు నెలపయ్యరలు నలసత జరింపం
దలపున రసార్ద్రమగు వలపు లిగిరింప, దిన
కలకల మడంచి నిశ గొలిపె ప్రమదంబున్. 117
స్నానమొనరించి, వెన్నెలచలువ బయల
బిడ్డలు న్నీవు నిల్లాలు బ్రీతి గుడిచి
పొడుపుకతలు, సమస్యలు, పూర్వచరిత
లంత వచియింపు వారలు సంతసింప. 118
శ్రమ, విషాదమ్ము, లాసలు, సర్వకాల
హృదయభేదక చింతలు నిదుర యనెడు
శాంతవారిధి లీనమై సమసిపోవ
విశ్రమింపుము, సైరికా, వేగువఱుకు. 119
-<•>-
గోనుగుంట్ల ముద్రణాలయము, 15,బ్రాడ్వే, మదరాస్